Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కథ, నవలా రచయిత్రి శ్రీమతి బలభద్రపాత్రుని రమణి ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘ఎందుకే నీకింత తొందరా..’ అనే నవలని వెలువరించిన శ్రీమతి బలభద్రపాత్రుని రమణి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం బలభద్రపాత్రుని రమణి గారూ.

బలభద్రపాత్రుని రమణి: నమస్కారం.

~

1.పిడపర్తి వెంకటరమణశర్మ గారి జ్ఞాపకార్థం నిర్వహించబడిన నవలలో పోటీలో ప్రథమ బహుమతి పొందిన మీ నవల ‘ఎందుకే నీకింత తొందరా..’ పుస్తక రూపంలో వెలువరించినందుకు అభినందనలు. ఇది మీ ఎన్నో నవల?

జవాబు: ధన్యవాదాలు. ఇది నా 26వ నవల. మొత్తం ముప్ఫై ఒక్క పుస్తకాలలో నవలలు 26. మిగతావి రెండు కథల సంపుటాలూ, మూడు కాలమ్ దాటని కబుర్లు – అనే హస్య కాలమ్ సంపుటాలూ.

2. మీరు కథా, నవలా రచయిత్రిగా, కాలమిస్ట్‌గా, సినీ/టివీ/వెబ్ సీరిస్ రచయిత్రిగా సుప్రసిద్ధులు. తొలిసారిగా ఏ ప్రక్రియతో రచనా రంగంలోకి అడుగుపెట్టారు? మీ సాహితీ ప్రస్థానం గురించి వివరించండి.

జవాబు: నా సాహితీ ప్రస్థానం గురించి అడిగారు. ఇది వివరించాలంటేనే 200 పేజీలు అవుతుంది. మొదటగా విపులలో ‘ముళ్ళ బాట’ అనే కథతో మొదలుపెట్టాను. తరువాత చతురలో ‘తృప్తి’ అనే నవలా, మా తాతగారు సూరంపూడి శ్రీహరి రావుగారూ, అమ్మమ్మగారు వెంకట రమణమ్మ గారు ఏడాది పసిపిల్లని (మా పెద్దమ్మ దుర్గా సావిత్రి గారిని) తీసుకుని, ఎనిమిది మంది స్టూడెంట్స్‌తో ‘ఆన్ ఫుట్ బ్యాచ్’ పేరిట పాదయాత్రలో లక్నో కాంగ్రెస్ మీట్‌కి అడవి దారుల గుండా ఆంధ్రాలో రాజమండ్రి నుండి నడిచి వెళ్ళడం, ఆ మజిలీలు ‘లీడర్’ అన్న పేరిట రాసారు. అది నా మొదటి పుస్తకం.

రచయిత్రి తల్లిదండ్రులు

తరువాత రొమాంటిక్ నవలలు రాసాను. ‘మొగుడే రెండో ప్రియుడూ’, ‘మధురమైన ఓటమి’, ‘ఆలింగనం’, ‘అనూహ్య’ లాగా – స్వాతీ, ఆంధ్రజ్యోతి వంటి పత్రికల్లో. మొదటి నవలనే సినిమాకని కె. ఎస్. రామారావు గారు కొన్నారు. తరువాత ‘అనూహ్య’కి ఈటీవీ వారు ధారావాహికగా హక్కులు కోరడంతో, స్క్రీన్‌ప్లే, సంభాషణలు కూడా రాసి టీ.వీ. రంగం లోనికి అడుగు పెట్టాను. 11 సినిమాలకి పని చేసాను. 18 దాకా టీవీ సీరియల్స్ రాసాను. ఇటీవలె జీ5 లో మిసెస్ సుబ్బలక్ష్మి – మంచు లక్ష్మితో; ప్రైమ్‌లో ‘కుమారి శ్రీమతీ’ నిత్యా మీనన్‍తో వెబ్ సీరిస్‌లుగా వచ్చాయి.

ఇంకా సినిమాలు రెండు నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ప్రస్థానం కొనసాగుతోంది.

‘మధుమాసం’ సినిమాకి ఉత్తమ కథా రచయిత్రిగా నంది అవార్డు వచ్చింది. ‘అందరి బంధువయ’ సినిమాకి ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు అవార్డు వచ్చింది.

అనేక కమిటీలలో పనిచేసాను. సినిమా అవార్డుల కమిటీకి ఒకసారి, టీవీ కార్యక్రమాల అవార్డు కమిటీలో మూడుసార్లు జ్యూరీ మెంబర్‍గా వున్నాను.

2018 లోనూ, 2021 లోనూ నేషనల్ ఫిల్మ్ అవార్డ్సు జ్యూరీలో సభ్యురాలిగా వ్యవహరించాను.

‘ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ బెంగుళూరు’కు జ్యూరీ మెంబర్‍గా వ్యవహరించాను. మలేసియాలో జరిగిన సౌత్ ఇండియన్ సినీమాటోగ్రాఫర్స్ అవార్డు కమిటీలో కూడా నేను జ్యూరీ మెంబర్‍గా వున్నాను.

ప్రస్తుతం సినిమా రైటర్స్ అసోసియేషన్ కల్చరల్ కమిటీకి చైర్‍పర్సన్‍గా వున్నాను.

అలాగే, విమెన్ ప్రొటెక్షన్ సెల్‍కి, రైటర్స్ అసోసియేషన్‍కి, గీతా ఆర్ట్స్‌కీ, సురేష్ ప్రొడక్షన్స్‌కీ కూడా చైర్‍పర్సన్‍గా వున్నాను.

సూక్ష్మంగా ఇదీ నా ప్రస్థానం.

3. మీ నవలకు శీర్షికలు ఆసక్తికరంగా ఉంటాయి. ఉదా. ‘ఔనంటే కాదంటా!’, ‘ఆ ఒక్కటి అడిగేసేయ్!’, ‘స్వర్గంలో ఖైదీలు’, ‘ప్రేమించాక ఏమైందంటే..’ వగైరాలు. ఈ నవలకి ఈ పేరు పెట్టడం వెనుక ఉన్న నేపథ్యం వివరిస్తారా?

జవాబు: నవల రాస్తున్నప్పుడు ఒక సంఘటన కానీ ఒక పాత్ర స్వభావం కానీ నవల పేరుని నాకు స్ఫురింప చేస్తాయి. ‘ఔనంటే కాదంట’ లేదా ‘ఎందుకే నీ కింద తొందరా’ లాగా ‘మధురమైన ఓటమి’, ‘స్వర్గంలో ఖైదీలు’, ‘హద్దులున్నాయి జాగ్రత్త’ లాంటివి సబ్జెక్ట్‌ని బట్టి పెట్టాలొస్తుంది. కొంచెం బోల్డ్ రైటర్‌ని కాబట్టి ‘ఆలింగనం’, ‘మొగుడే రెండో ప్రియుడు’ లాంటి శృంగార ప్రధానమైన టైటిల్ కూడా పెడ్తాను.

రచయిత్రి పుస్తకాలు

4. సాధారణంగా ఒక నవల రాయడానికి మీకెంత కాలం పడుతుంది? రోజుకి ఎన్ని పేజీలు రాయాలని ప్రణాళిక వేసుకుంటారు? ఈ నవలా రచన మీ ప్రణాళికలకు అనుగుణంగానే సాగిందా లేక ఏవైనా ఆటంకాలు ఎదురయ్యాయా? ఎదురైతే వాటిని ఎలా అధిగమించారు?

జవాబు: నవలలు గట్టిగా అనుకుంటే వారం రోజుల్లో రాసినవి కూడా ఉన్నాయి. ఒక్కో నవల కొన్ని నెలలు పట్టచ్చు. ‘ఆలింగనం’, ‘హద్దులున్నాయి జాగ్రత్త’, ‘ఏదీ నిన్నటి స్వప్నం’ – ఎక్కువ కాలం పట్టిన నవలలు. దాదాపు కొన్ని నెలలు. రోజూ పద్ధతిగా ఇన్ని పేజీలు అని రాయను. రాయాలనిపిస్తేనే మూడ్‌ని బట్టి రాస్తాను. ఎక్కువగా విహార యాత్రలకీ, స్నేహితలకు ఈమధ్య కాలం ఖర్చు చేస్తూ, రాయడం స్లో చేసాను.

కొన్నేళ్ళు, దాదాపు పాతికేళ్ళు రచన తప్ప చుట్టూ ప్రపంచాన్ని పట్టించుకోలేదు. అందుకే అన్ని నవలలూ, మూడు వందల పై చిలుకు కథలు, అన్ని డెయిలీ సీరియల్స్ రాయగలిగాను. ఇప్పుడు రిలాక్స్ అవుతున్నాను.. చూడండి మీ ప్రశ్నలకి సమాధానాలు కూడా ఆలస్యంగా ఇస్తున్నాను. నిన్నటి దాకా అమ్మతో హాలిడేకి వెళ్ళొచ్చాను.

5. ‘నా పేరు లోని మొదటి అక్షరంలా, నా లైఫ్ ఎంతో నిరర్ధకం అయిపోయినట్టు నాకు అనిపిస్తుంది’ అనుకుంటుంది ఋష్యేంద్రమణి మొదటి పేజీలో. నవల ప్రారంభంలోనే పాఠకులకు ఆసక్తి కలిగించేటటువంటి వాక్యాలతో సన్నివేశాన్ని సృజించటం చక్కని టెక్నిక్. ఈ సందర్భంగా – మీరు నవలలు వ్రాసే పద్ధతి ఎలా ఉంటుందో (ప్లాట్, సినాప్సిస్, ఛాప్టర్/సెక్షన్ డివిజన్ – తదితర అంశాలు) పాఠకులకు వివరిస్తారా?

జవాబు: ఋయ్యేంద్రమణి మనసులోకొచ్చి తన కథ చెప్పడం ప్రారంభిస్తేనే రాస్తాను. పెద్ద టెక్నిక్ ఏం లేదు! ఒక్క సెంటెన్స్ – ఆశ్చర్యార్థకం, పూర్ణ బిందువూ కూడా అనవసరంగా వాడను. అక్షరాలు నేతిబొట్లులా వాడాలి. సృజించాలి.. విసర్జించకూడదు అని మొదట్లోనే నేర్చుకున్నాను. పేరెన్నిక గన్న పత్రికా సంపాదకులు కూడా ఎన్నడూ ఒక్క సెంటెన్స్ నేను రాసినది ఎడిట్ చెయ్యడం, మార్పులూ చేర్పులు చెయ్యడం జరగలేదు.

స్వచ్ఛత.. నిజాయితీ.. ఎదుటివారిని ఆకట్టుకునే శైలి ఇవి రెండూ నా టెక్నిక్స్ అని చదివినవాళ్ళు చెప్పారు.

6. “ఆ అమ్మాయికి పాతిక లోపే వుండచ్చు. కానీ ఇప్పటికే చాలా విసిగి వేసారిపోయినట్లు, మొనాటనస్ వాయిస్‌తో, రొటీన్‍గా పని చేస్తూ, ఏదో పోగొట్టుకున్నట్లుగా వుంది” అని చెప్పి, తరువాతి వాక్యంలో ఆమె ఏం పొగొట్టుకుందో చెప్పారు. ఓ నర్స్ రోజువారి వృత్తి జీవితాన్ని కేవలం నాలుగైదు వాక్యాలలో కళ్ళకు కట్టడం ఎలా సాధ్యమైంది?

జవాబు: ఇది మంచి ప్రశ్న! నాకు డాక్టర్ ఫ్రెండ్స్ ఎక్కువ. ఆసుత్రులకి స్నేహ సంబంధాల కోసం వెళ్ళడం కూడా ఎక్కువ! కార్పొరేట్ ఆసుపత్రుల పనితీరు, అక్కడ ఒకరితో ఒకరికి జరిగే నిశ్శబ్ద రైవల్రీ గురించి కూడా త్వరలో రాయాలనుకుంటున్నాను.

నర్సులూ, ఉపాధ్యాయినులూ, డాక్టర్లు, కళాకారులు ఇలా అనేక రంగాల్లో వున్న వారి కథలు నవలలుగా రాసినప్పుడు స్టడీ చేస్తాను. వారితో మాట్లాడి, వృత్తిలోని సాదక బాధకాలు తెలుసుకుంటాను.

మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గారితో

ఆ చిన్న సంఘటనలో రుషి స్వభావం, ఆమె జీవితాన్ని ఎంత తేలిగ్గా తీసుకుంటుంది, ఎదుటి అమ్మాయి తన వృత్తిలో రోజూ అనేక రోగులని చూడ్డం వలన ఎలాంటి వైరాగ్యం పొంది ‘చిరునవ్వు’ కోల్పోయిందో చెప్పాలనుకున్నాను. మీరు గమనించినందుకు ధన్యవాదాలు.

7. మరో సందర్భంలో సీనియర్ సిస్టర్ మెర్సీ, “డాక్టర్స్ రొమేంటిక్‍గా జోవియల్‍గా వుంటారు, వాళ్ళ వృత్తి లోని సీరియస్‌నెస్ నుండి రిలీఫ్ పొందడానికి” అని రిషీని హెచ్చరిస్తుంది. నర్సుల నోట ఇలాంటి వాక్యాలు చెప్పించాలంటే, వారిని కాస్త సన్నిహితంగా పరిశీలించడం అవసరం. నిజజీవితంలో మీకు తారసపడ్డ నర్సుల వృత్తి జీవితాలను దగ్గరగా చూశారా?

జవాబు: అవును. సీనియర్ నర్స్ చెప్పినట్లు చాలామంది డాక్టర్స్, ఆర్మీ పీపుల్ కొద్దిగా జోవియల్, ప్లేఫుల్ లైఫ్ లీడ్ చెయ్యాలనుకోవడం నేను చూసాను. ఎందుకంటే జీవితం నీటి బుడగ లాంటిది.. దాన్ని వీలైనంత సరదాగా వుంచుకోవాలని వారు అనుకుంటారు. చాలామంది రచయితలూ, కళల పట్ల ఆసక్తి కలవారుగా కూడా వుంటారు. ఎగైన్ థాంక్స్ టు మై డాక్టర్ ఫ్రెండ్స్!

అల్లు అరవింద్ గారితో రచయిత్రి దంపతులు

8. “ఈ ఆధారపడడం అనేది బాధ. రెండు వైపుల వారికీ బాధే. కానీ ఇందులో ఎంత తీపి ఉందంటే ఇది ఓ వ్యసనంలా మారుతుంది. భార్యాభర్తల మధ్యన కానీ, తల్లీ పిల్లల మధ్య కానీ ఇది అందమైన వ్యసనం” అంటుందో పాత్ర ఓ సన్నివేశంలో. సాంఘిక నవలలకి కావల్సిన సారమంతా ఈ వాక్యాల్లో ఉందని మా అభిప్రాయం. మీరేమంటారు?

జవాబు: నిజం అంటాను. ఎవడైనా తత్వవేత్త.. బంధాలు విడు విడు విడు అని చెప్తే నేను వినను. ఈ బంధాలూ, ఆధారపడడాలు జీవితం. అందులోనే రక్తీ అనురక్తీ వున్నాయి అంటాను. నేనెప్పుడూ ఒకటే చెప్తాను. ఆనందంగా జీవించండి. సమస్యలు వస్తే పరిష్కారాలూ వుంటాయి. తల బద్దలు కొట్టుకుంటూ జీవించడం మానేసి బ్రతుకు ఈడవకండి. ఇంతకన్నా సామాజిక స్పృహ లేదన్నది నా వాదం.

అల్లు అర్జున్‌తో రచయిత్రి దంపతులు

9. ఈ నవలలో కొటేషన్స్ వంటి చక్కని వాక్యాలున్నాయి, ముఖ్యంగా జీవితం గురించి. మీ చిన్నప్పుడు, నవలలు చదివేటప్పుడు వాటిల్లోంచి నచ్చిన వాక్యాలను కొటేషన్స్‌లా రాసిపెట్టుకునేవారని ‘సంచిక’లో మీ కాలమ్‍లో రాసినట్టు గుర్తు. ఇలాంటి కొటేషన్స్ లాంటి వాక్యాలు మీకు అప్రయత్నంగా వస్తాయా? సాధనతో అలవడ్డాయా?

జవాబు: మీలాంటి వారితో ఫోన్‍లో మాట్లాడ్తున్నపుడు కూడా అప్రయత్నంగా నాలుగు కొటేషన్స్ వస్తాయి. వాటిని సమయానుకూలంగా వాడుతుంటాను. సాధారణంగా ఎవరివో కొటేషన్స్ వాడను. నావి నేనే కాయిన్ చేసుకుంటారు. పాతికేళ్ళు సీరియల్స్‌కి సంభాషణ రచయిత్రిగా ఉన్న సాధన ఏమో!

నాకు నచ్చిన డైలాగ్స్ ‘పద్మవ్యూహం’ సీరియల్‍లో “రామాయణం రాసింది బోయ.. భారతం రాసింది కోయ.. ఎవరి రాతలు ఎవరు రాస్తారో చెప్పలేం.”

“ఏటీ, చెప్పు కుట్టడానికి ఎనిమిది రూపాయిలు నీకు ఎక్కవ అనిపిస్తుందా? అటు సూడు, ఐదు నచ్చత్రాల ఆసుపత్రి.. అక్కడ ఈ తోలుకే కుట్లు వేసి లచ్చలు దీనుకుంటారు.. అదీ తోలే.. ఇదీ తోలే.. వెల్లెల్లవమ్మా.” అని ఓ చెప్పులు కుట్టించే అతనితో అనిపించాను.

ఇవన్నీ పెన్ పట్టుకుంటే వచ్చేస్తాయి. కూర్చుని ఆలోచించి.. ఆలోచించి రాయను. డెయిలీ సీరియల్ సెట్లో రాసేదాన్ని. ప్రతిరోజు సీన్ తర్వాత సీన్. అంత సమయం వుండేది కాదు!

కాంతి కిరణ్ ప్రభ గార్లతో రచయిత్రి

10. ఓ సందర్భంలో, రిషి ద్వారకతో మాట్లాడుతున్నప్పుడు ‘వాలిడిటీ పీరియడ్’ అన్న ప్రస్తావన వస్తుంది. అది మనుషులకీ వర్తిస్తుందా అని అనుకుంటుంది రిషీ. దీని గురించి వివరిస్తారా?

జవాబు: వాలిడిటీ పీరియడ్.. గుడ్ క్వశ్చన్. నా జీవితంలో పెద్ద పెద్ద నిర్మాతలూ, డైరక్టర్లూ, కొందరు రాజకీయాలలో వున్నవారు, అందరూ కొంత కాలం ఆ ప్రాజెక్టులో చేసేటప్పుడు.. నిత్య జీవితంలో వారి గురించి చాలా సంగతులు ఉండేవి. రోజూ మాట్లాడుకోవడం.. ప్రతి పనికీ సలహాలివ్వడం, కలిసి తిరగడం.. సహాయాలు పొందడం లాంటివి! కొన్నాళ్ళ తరువాత ఆ పరిచయాలు – నా జీవన గమనంలో వచ్చే మార్పుల వల్ల కానీ వారి జీవనంలో వచ్చే మార్పుల వలన గాని ‘హలో’ అంటే ‘హలో’ అనే పరిచయాలుగా స్థిరపడి, దూరం అవుతాయి. ఇట్స్ క్వయిట్ కామన్.. ప్రతి పరిచయానికీ, ప్రతి స్నేహానికీ వాలిడిటీ పీరియడ్ వుంటుంది. ఇండస్ట్రీలో నాకు గాడ్ ఫాదర్స్‌లా వుండే అక్కనేని నాగేశ్వరరావు గారూ, రామానాయుడు గారు ఇప్పుడు లేనట్టే!

హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో

11. నవలలో ఓ సందర్భంలో ఆర్ద్రత అంటే ఏమిటో చక్కగా వివరించారు. మనసులో మెదిలే భావాన్ని అంత ఖచ్చితంగా అక్షరాల్లోకి దించడం ఎలా కుదిరింది?

జవాబు: ఆర్ద్రత అంటే మనసు తడిగా మారడం.. అంటే ఎదుటివారి మాటలూ, స్పందన వల్ల మన కంట్లో చెమ్మ రావడం. రుషేంద్రమణి అదే హాస్యంగా చెప్పిందిగా – జాలీ, ప్రేమ, ఆనందం అన్నీ ఏక కాలంలో కలిగిన భావన! గుండెని ఎవరో పట్టి నొక్కి వదిలే ఝల్లుమనిపించే భావన!

12. రిషీ అంతరంగంలోని భావాలకు తగ్గ పాటలనెన్నో నవలలో ప్రస్తావించారు. మీకు పాటలంటే ఇష్టమని తెలుస్తుంది. మీ దగ్గర పాటల కలెక్షన్ ఉందా? సినీరంగంలో ఉండడం ఇందుకు ఉపకరించిందా?

జవాబు: మా అమ్మ సింగర్.. మా పెద్దమ్మలూ, వాళ్ళ పిల్లలూ, అక్కల పిల్లలూ అంతా చేరితే పాటలు పాడుకుంటూ టైమ్ పాస్ చేస్తాం.. సంగీతం సాహిత్యం ఇచ్చే ‘నషా’ జీవితంలో ఇంకేది ఇవ్వదని నా అభిప్రాయం. సినీరంగంలో ఎక్కువగా కళాకారులతో, రచయితలో కలిసి గడపటం కూడా అభిరుచికి కారణమే.

13. ఓ సందర్భంలో ద్వారక గురించి ‘ఎంతో సెవ్వన.. ఏమిటో లాలన. భావుకత్వం లేకపోయినా చాలా స్పందనలున్న మనిషి’ అని అనుకుంటుంది రిషీ. ఈ వాక్యంలో ‘సెవ్వన’ అంటే ఏంటి? స్పందనలున్న మనిషిలో భావుకత్వం లేకపోవడం అరుదు కదా!

జవాబు: సెవ్వన అంటే ఒక రకమైన ప్రశాంతమైన హాయి. (ద్వారకకి) అతనికి స్పందనలున్నా, ప్రాక్టికాలిటీ, భావుకత్వాన్ని మింగేసి అన్నీ ప్రాక్టికల్‌గా మాట్లాడుతాడు, మెటీరియలిస్ట్ అనిపించడం వేరు.. నిజంగా మెటీరియలిస్ట్ అవడం వేరు! ద్వారకకి ఉన్నది ప్రేమ పట్ల భయం.. భావరాహిత్యం కాదు!

14. నవలలో ఒకచోట – ‘ఎందుకో నీకింత తొందరా..’ అని ప్రతివాళ్ళూ మనసుని ప్రశ్నించే ఒక సందర్భం వస్తుంది. రాకతప్పదు – అన్నారు . నవల టైటిల్‍ని జస్టిఫై చేసే సన్నివేశంగా దీన్ని పరిగణించవచ్చా?

జవాబు: రుషి లాంటి అమ్మాయిలు అరుదుగా అంటారు. అన్నింటినీ తొందరగా చేసెయ్యాలనుకుంటారు. వారి లాంటి వారికీ, అలాంటి సందర్భాలకీ వర్తిస్తుంది ఈ టైటిల్. జస్టిఫై చేసిందనే అనుకుంటున్నాను.

యండమూరి గారు, జయప్రకాశ్ నారాయణ్ గారు, తదితర ప్రముఖులతో

15. అరేంజ్డ్ మేరేజెస్‌ని ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో పోల్చడం కరక్టేనా?

జవాబు: ఏ మేరేజ్ అయినా ఒక సేఫ్టీ, సెక్యూరిటీ అనే పెద్దవాళ్ళు భావిస్తారు. ఇప్పటి తరం భావించట్లేదు.. ఆ తేడానే ఈ నవలలో డిస్కస్ చేసాను. నవల నచ్చితే రుషి పోలిక కూడా నచ్చుతుంది. ఆమె వరకూ కరక్టే!

16. మీ నవలలు ‘రేపల్లెలో రాధ’, ‘మధుమాసం’ సినిమాలుగా వచ్చాయి. ప్రస్తుత కాలంలో తెలుగులో, నవలలని సినిమాలుగా మలచే ధోరణి బాగా తగ్గినట్టు అనిపిస్తుంది. ఎందుకని?

జవాబు: నవలలు సినిమాలుగా మలచాలంటే దర్శకుడికి భావుకత్వం అవసరం. ఈమధ్య తెలుగు కానీ ఏ భాష కానీ అక్షరాలు రానక్కర్లేదు సినిమా కథ రాసుకొడానికి. డైరెక్టర్‍కి ఒక టీమ్ వుంటుంది. రకరకాల భాషల సినిమా వీడియోలు వుంటాయి. అది చాలు! మళ్ళీ రైటర్ దగ్గర డబ్బు ఇచ్చి హక్కులు కొనడం ఎందుకు అని అనుకోవడం ఓ కారణం. నవలలు చదివే అలవాటు పోవడం ఇంకో కారణం.

17. తమకంటూ ప్రత్యేక అభిమానులున్న అతి కొద్దిమంది రచయిత/రచయిత్రులలో మీరు ఒకరు. మీ అభిమానుల గురించి చెప్పండి. ఈ నవలకి మీ అభిమానుల నుంచి, పాఠకుల నుంచి స్పందన ఎలా ఉంది?

జవాబు: ‘ఆలింగనం’ రాసినప్పుడు దాదాపు అన్ని ఏజ్‍ల ఆడపిల్లలూ నా ఫాన్స్ అయ్యారు. ‘సడి సేయకో గాలి’ రాసినప్పుడు, సెకండ్ ప్లేస్ లో వున్న స్త్రీలు చాలామంది ఏడుస్తూ “మా పరిస్థితి కళ్ళగా కట్టినట్లు రాసారు.. ఎలా?” అని ఫోన్స్ చేసారు.

నాకు బాగా గుర్తున్న స్పందన, డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారి ఫ్రెండ్ కూతురు. నా కథ ‘అలిగిన వేళ’ చదివినప్పటిది. తనకి అప్పట్లో ఆత్మహత్య చేసుకుందామా అన్న ఆలోచనలు కలిగాయనీ, కానీ అనుకోకుండా ఈ చదివి మనసు మార్చుకున్నానని చెప్పడం! చాలా ఆనందం కలిగింది. రచయితగా ప్రయోజనం సిద్ధించింది అన్న భావన.

18. రచయిత్రిగా మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలేమయినా సిద్ధమవుతున్నాయా?

జవాబు: రచయిత్రిగా ఇంకా చాలా పుస్తకాలు రాయాలి. రాస్తాను. ఏవీ అనుకుని రాయను కానీ, సిరివెన్నెల సీతారామ శాస్త్రి అన్నయ్య తనకి పద్మశ్రీ వచ్చినప్పుడు ఢిల్లీ లోని ఆంధ్రాభవన్‌లో, సన్మానం చేస్తుంటే, “చెల్లాయి బలభద్రపాత్రుని రమణి వంద నవలలు రాసిన రచయిత్రి కూడా ఇక్కడ ఢిల్లీలో వుండటం ఇవాళ నా అదృష్టం.. స్టేజ్ మీదకి పిలవండి” అన్నారు. అప్పుడు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీలో వున్నాను నేను ఢిల్లీలో. “అదేంటన్నయ్యా, నేనెక్కడ వంద నవలలు రాసాను?” అంటే, “రాయకపోతే ఇప్పుడు రాయి.. నామాట నిజం చెయ్యి తల్లీ” అన్నారు. అదే గుర్తొస్తూ వుంటుంది. అందుకైనా రాయాలి.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు బలభద్రపాత్రుని రమణి గారూ.

బలభద్రపాత్రుని రమణి: ధన్యవాదాలు. నా నవల ‘ఎందుకే నీకింత తొందరా..’ చదివి కూలంకషంగా అర్థం చేసుకుని ఇన్ని ప్రశ్నలు వేసిన మీ శ్రధ్ధకి కృతజ్ఞతలు.

***

ఎందుకే నీకింత తొందరా.. (నవల)
రచన: బలభద్రపాత్రుని రమణి
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ.
పేజీలు: 184
వెల: ₹ 150/-
ప్రతులకు:
సాహితీ బుక్స్, చుట్టుగుంట,
విజయవాడ. ఫోన్: 9849992890
నవోదయ బుక్ హౌస్,
కాచీగుడా, హైదరాబాద్. ఫోన్ 9000413413
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/Balabhadrapatruni-Ramani/dp/B0DZX8YXKF

 

 

~
‘ఎందుకే నీకింత తొందరా..?’ నవల సమీక్ష:
https://sanchika.com/enduke-neekinta-tondaraa-book-review-kss/

Exit mobile version