Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంపాదకురాలు, లేఖిని అధ్యక్షురాలు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘కథల లోగిలి’ అన్న అనే రెండు భాగాల కథాసంకలనాన్ని ప్రచురించిన లేఖిని సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూని అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం విజయలక్ష్మి గారూ.

విజయలక్ష్మి: నమస్కారమండీ.

~

ప్రశ్న1: లేఖిని సంస్థకి, మీకూ ఉన్న అనుబంధం గురించి చెప్తారా?

జ. చెప్తాను. సుమారు 24 సంవత్సరాలు అయి ఉంటుంది (నాకు సంవత్సరం సరిగా గుర్తులేదు) లేఖిని సంస్థ స్థాపించి.

దీనికన్నా ముందు, సుప్రసిద్ధులైన అలనాటి రచయిత్రులతో, కీ.శే. డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి సారధ్యంలో ‘సఖ్యసాహితి’ అనే పేరుతో ఒక సంస్థ నిర్వహించేవారు. కీ.శే. వేదుల శకుంతలగారు, కీ.శే. తురగా జానకీరాణి గారు కార్యదర్శిగా ఉండేవారు. ఎంతో మంచి కార్యక్రమాలు చేసేవారు. అప్పుడు నేను ఇంకా అన్ని విషయాల్లోనూ చిన్నదాన్ని. కార్యక్రమాల్లో ఆహ్వానపత్రికలు పంపించడం, వేదిక మీదకు శాలువాలు, ఫ్లవర్ బోకేలు అందించడం వంటి చిరు సహాయాలు చేస్తూ, అందరికీ అభిమానపాత్రురాలిగా ఉండేదాన్ని. అనివార్య కారణాల వలన ఆ సంస్థ కనుమరుగై ఆ స్థానంలో యద్దనపూడి సులోచనారాణి, డాక్టర్ వాసా ప్రభావతి గార్ల సారధ్యంలో లేఖిని మహిళా చైతన్య సాహితీ, సాంస్కృతిక సంస్థ ప్రారంభించారు. అప్పటికి కొంచెం ఎదిగాను. (రచయిత్రిగా, వయసుపరంగా). అందుకే నన్ను ప్రధాన కార్యదర్శిగా ప్రభావతిగారు ఎన్నుకున్నారు.

అప్పటి నుంచీ, పుస్తకావిష్కరణలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రచయిత్రులతో ముఖాముఖీలు, సంస్థలోని రచయిత్రులతో ముఖాముఖీలు, తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో, సాహిత్య అకాడమీ సహకారంతో సెమినార్‌లు ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళం. ప్రభావతి గారి పరపతి ద్వారా నన్నపనేని రాజకుమారి, స్వర్ణ సుధాకర్, డాక్టర్ గీతారెడ్డి ఇలాంటి రాజకీయ ప్రముఖులు కూడా సలహాదారులుగా ఉన్నారు. మల్లాది సుబ్బమ్మగారిలాంటి ప్రముఖులు కూడా లేఖిని సంస్థలో భాగస్వాములుగా ఉన్నారు.

అప్పుడే ప్రభావతిగారు వేదగిరి రాంబాబు గారి సహకారంతో లేఖిని రచయిత్రులతో ‘దీపతోరణం’ అనే వంద కథల సంకలనం తీసుకుని వచ్చారు. అందులో నా కథ ‘తోటమాలి’ ఉంది.

తరవాత కొంత కాలానికి నేను వృత్తిపరంగా, వ్యక్తిగత ఒత్తిళ్ళ కారణంగా కార్యదర్శి పదవి నుంచి వైదొలగి, సాధారణ సభ్యురాలిగా కొనసాగాను. అప్పుడు కూడా ప్రభావతి గారు ఎలాంటి సహకారం అడిగినా చేసేదాన్ని. మాకంటూ మేము స్వంతంగా ఎలాంటి కార్యక్రమ రూపకల్పన చేయలేదు. ఆవిడ చెప్పింది చేయడమే మా పని. అయినా, ఆవిడ మాతో ఎంతో వాత్సల్యంగా ఉండేవారు.

తరవాత నేను Covid కి ముందు 2019 లో US వెళ్లేముందు ప్రభావతి గారు పిలిచి నన్ను ఉపాధ్యక్షురాలిగా ఉండమని అడిగారు. అలా తిరిగి నేను సంస్థలో మరో పదవి పొందాను. దురదృష్టవశాత్తూ, 2019 డిసెంబర్‌లో ప్రభావతి గారు స్వర్గస్థులైనారు. ఆ తరవాత సంస్థ బాధ్యతలు ఎవరు నిర్వహించాలి అనే అంశం చర్చకు వచ్చినపుడు, ప్రభావతి గారు నేను సంతకం చేసిన ఒక చెక్ మీద అధ్యక్షురాలి స్టాంప్ వేసారని వారి అమ్మాయి మీనాక్షి తెలియచేసి, నాకు ఆ చెక్ చూపించారు. (ఇంకా నా దగ్గర భద్రంగా ఉంది). కానీ సీనియర్ రచయిత్రులు ఉన్నప్పుడు నేను అధ్యక్షురాలిగా ఉండడం భావ్యం కాదని పొత్తూరి విజయలక్ష్మి గారు అధ్యక్షురాలిగా, నేను కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాము.

అప్పుడు మా దగ్గర ఒక పైసా కూడా లేదు, బ్యాంకు ఎకౌంటులో ప్రభావతి గారి పేరు తీసేసి, KYC ఇస్తే కానీ ఎకౌంటు ఆపరేట్ చేయడానికి లేదు. అది చేయాలంటే కోవిడ్ నిబందనలు, ఆ తరవాత బ్యాంకులో ఎన్నో మార్పులు.. ఇలా అనేక అవాంతరాలు. ఇటీవలే ఆ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది.

బ్యాంకు పని అయిందాకా ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడ్డాము. సంస్థ కార్యకలాపాలు, భవిష్యత్ ప్రణాళికలు ఇలాంటివి మాట్లాడుకోవాలంటే కచ్చితంగా అందరం ఒక కలవడానికి ఒక వేదిక కావాలి. ఇంకా అనేక వనరులు కావాలి. ఎలా? మంథా భానుమతిగారి చొరవతో కొందరు కొత్త రచయిత్రులు సభ్యులుగా చేరారు. కానీ, మా సభ్యత్వ రుసుము చాలా తక్కువ. కానీ సంస్థ నిలబడాలి. ప్రభావతి గారు నా మీద పెట్టిన బాధ్యత, ఎంతో నమ్మకంతో పెట్టిన బాధ్యత.. నేను పెద్దగా వ్యక్తిగత బాధ్యతలు మోయడం లేదు కాబట్టి సమయమే కాదు, నా స్వంత డబ్బు కూడా నేను లేఖినికి ఖర్చు పెట్టాను. ఒక కార్యక్రమం చేయాలంటే అతిథులు కావాలి, ఆహ్వానపత్రికలు కావాలి, బానర్ కావలి, టీ, స్నాక్స్, flowers, shawls ఇలా ఎన్నో కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? నాలుగు చోట్లకి తిరగాలంటే conveyance కావాలి. నా స్వంత కారు, డ్రైవర్‌ని కలిగి ఉన్నాను కాబట్టి, నా స్వంత పెట్రోల్ ఖర్చుతో అతిథులను ఆహ్వానించడానికి వెళ్ళేదాన్ని. Of course ఇప్పుడు కూడా వెళ్తున్నాను. ఈ విషయం నేనెప్పుడూ ఎవరితో ప్రస్తావించలేదు. ఫలానా చోటికి ఎలా వెళ్ళాలి? దానికయే చార్జీలు ఎవరు ఇస్తారు? అని ఎప్పుడూ అడగలేదు. కారణం ఒక సంస్థ నిర్వహించాలంటే కొన్ని విషయాల్లో liberal గా ఉండాలి. అందులోనూ మొదటి నుంచీ ఉన్నాను కాబట్టి అనుకుంటా నాకు సంస్థ పట్ల అభిమానం, అంకిత భావం ఉంది. ఇది అతిశయోక్తి కాదు. నిజం. అందుకే ఇప్పటికీ కొన్ని ఖర్చులు నేను స్వంతంగా పెట్టేస్తాను. నేను చేసిన కార్యక్రమం పదిమంది మెచ్చేలా ఉండాలి. అందుకోసం కొంత త్యాగం చేయాలి కదా!

రెండేళ్ళు ఇలా కొనసాగాక, పొత్తూరి గారు ఆరోగ్యపరంగా బాధ్యత మోయలేను అనడంతో నేను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాను.

ప్రశ్న 2: లేఖిని కార్యక్రమాల రూపకల్పన మీరే చేస్తారా?

జ: ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నాకు సాంస్కృతిక కార్యక్రమాలు చేయడంలో చాలా అనుభవం ఉంది. మా ఆఫీస్‌లో పది సంవత్సరాలు మహిళా సంక్షేమ సంస్థకి నేనే అధ్యక్షురాలిని. నేను కార్యక్రమం ఎలా చేయాలి, ఎవరిని అతిథులుగా పిలవాలి? అలాగే ఉద్యోగినులకు వివిధ రకాల పోటీలు నిర్వహించడం, వారికి బహుమతులు కొనడం ఈ విషయంలో నన్ను ఎవరూ వ్యతిరేకించేవారు కాదు, నాకు అన్ని విధాలుగా సహకరించే కార్యదర్శి నాకు తోడుగా చాలా ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు చేసేవాళ్ళం. అలాగే నేను నాటక రచయిత్రిని కాబట్టి దాదాపు స్వంతగా నేను ఐదు నాటక ప్రదర్శనలు నిర్వహించాను. అప్పుడు కూడా నేనే రూపకల్పన చేసుకుంటే, బ్యానర్ యువకళావాహిని అధ్యక్షుడు కీ.శే. వై.కే. నాగేశ్వరరావు ఇచ్చేవారు. 2013లో నా ‘సరసిజ’ బానర్ వచ్చిందాకా నా నాటకాలు అన్నీ యువకళావాహిని ద్వారానే ప్రదర్శించడం జరిగింది. నేను ‘సరసిజ’ స్థాపించిన మొదటి కార్యక్రమంలో కూడా ప్రభావతి గారిని సన్మానించుకున్నాను. నా తోటి రచయిత్రులు కూడా ఎంతో సహకరించారు. ఆ కార్యక్రమం కూడా కన్నుల పండుగగా జరిగింది.

అవన్నీ కూడా నా రూపకల్పనే. అలా అలవాటు అయింది. అదే అలవాటుతో ప్రారంభంలో నేనే రూపకల్పన చేసి పొత్తురిగారికి, భానుమతి గారికి చెప్పేదాన్ని. అన్ని విషయాల్లో స్వతంత్ర నిర్ణయాలు అలవాటు అయి అలా చేసాను కానీ, తరవాత, తరవాత, ఆ అలవాటు మానుకుని, మిగతా సభ్యులతో చర్చించి కార్యక్రమాలు చేస్తున్నాను.

ప్రశ్న 3: కథాసంకలనం తీసుకురావాలన్న కోరిక ఎలా కలిగింది?

జ: నేను ఈ సంస్థ బాధ్యత ఎంతకాలం మోస్తానో నాకు తెలియదు.. నేను ఈ ఐదేళ్ళలో చేసిన ప్రతి కార్యక్రమం నాకు మంచిపేరు తెచ్చింది. మా సభ్యులు కూడా ఇంతకు ముందు కన్నా నేను బాధ్యతలు చేపట్టిన తరవాత చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సభలు నిండుగా ఉంటున్నాయి. ఇంతేకాక ఏదన్నా గుర్తుండిపోయే పని చేయాలని చాలాకాలంగా అనుకుంటున్నాను. ఒకరోజు మా లేఖిని గ్రూప్‌లో ఎవరిదో సంకలనం వచ్చిందని చర్చించుకుంటూ ఉన్నప్పుడు మనం కూడా ఒక సంకలనం తీసుకుని వద్దామా అని చాలా కాకతాళీయంగా అన్నాను. నేను అన్నానే కానీ ఆలోచించే లోపలే మా కార్యదర్శి సరస్వతి కరవది ఉత్సాహంగా సంకలనం తీసుకురావాలన్న ప్రతిపాదన నియమ నిబంధనలు, రూపొందించి, కథలను ఆహ్వానిస్తూ ప్రకటన తయారు చేసి నాకు పంపించింది. నేను ఆలోచిస్తూనే గ్రూప్‌లో పెట్టేయమన్నాను. మరి మా సంకల్పబలమేమో చాలా మంది రచయిత్రులు స్పందించి తమ కథలు పంపడానికి ఉత్సాహం కనపరిచారు. అందరం సహకార పద్ధతిలో ముద్రణ చేయాలని కూడా అనుకున్నాము. మా ప్రతిపాదన నచ్చి, ఇద్దరు రచయిత్రులు వారి వంతుగా మేము చెప్పిన అమౌంట్ కన్నా మరి కొంత ఇచ్చి ప్రోత్సహించారు. అలా మా సంకల్పానికి దైవ సహాయం లభించింది అని నేను భావిస్తాను.

ప్రశ్న 4: ఈ కథల సంకలనం వేయడంలో మీకేమన్నా ఇబ్బందులు ఎదురైనాయా?

జ: అసలు లేదండి. చాలా కూల్‌గా అన్ని పనులు అయినాయి. మా కార్యవర్గ సభ్యులు కూడా ఎంతో సహకరించారు. కాకపోతే పుస్తక ప్రచురణ అనేది పెద్ద యజ్ఞం అని మీకూ తెలుసు కదా! అందులోనూ 74 మంది రచయిత్రుల కథలతో ఎంత కష్టం! సరస్వతి లేఖిని పబ్లికేషన్స్ అని ఒక mail create చేసి, ఆ mail కి కథలు పంపమని గ్రూప్‌లో పెట్టింది. అలా వచ్చిన కథలు అన్నీ google drive లో పెట్టి నాకు షేర్ చేసింది. మేము పెట్టిన నిబంధనలు ఏమిటి అంటే, కథలు వేరే సంకలనం, లేదా సంపుటిలో రాకూడదు, already పబ్లిష్ అయి ఉండాలి. వీలయితే బహుమతి పొందిన కథలు పంపాలి. ఒకొక్కరు రెండేసి పంపితే రెంటిలో మంచి కథ తీసుకుంటాం అని చెప్పాము. రెండు కథలు చదివి వాటిలో మంచి కథ సెలెక్ట్ చేయడానికి సుజల గంటి గారు సాయం చేసారు. అలా ఆమె సెలెక్ట్ చేసిన కథ తీసుకున్నాము. సీనియర్ రచయిత్రులకు మాత్రం నిబంధనలు సడలించాము. అయితే సీనియర్ రచయిత్రుల్లో వయసురీత్యా, అనారోగ్య రీత్యా, టెక్నాలజీ తెలియని వారు నాకు ఫోన్ చేసి మా కథలు కూడా ఇస్తాము వచ్చి తీసుకుంటావా అని అడిగారు. అలా ముక్తేవి భారతిగారు, పొలాప్రగడ రాజ్యలక్ష్మి గారు, జ్ఞానప్రసూనగారు ఉన్నారు. వారి ముగ్గురి ఇళ్ళకు వెళ్లి, కథలు తీసుకుని, (డబ్బులు కూడా ఇచ్చారు) తీసుకుని వచ్చాను. అలా అందరూ కూడా ఎంతో సహకారం అందించారు. కాబట్టి ఈ విజయంలో అందరికీ భాగస్వామ్యం ఉంది. అంతేకాదు, పుస్తకం ప్రింట్ కి వెళ్ళిపోయాక, ఆనోటా, ఈనోటా తెలుసుకున్న సాహితీ మిత్రులు కూడా నాకు ఫోన్ చేసి, ఇలా లేఖిని నుంచి సంకలనం వేస్తున్నారుట నేనూ ఇస్తాను కథ అన్నారు. కానీ అప్పటికే బాగా ఆలస్యం అయింది. తప్పకుండా మళ్ళి ఇంకోసారి వేయడం జరిగితే వేస్తాను అని చెప్పాను.

ప్రశ్న 5: సంకలనం రెండు భాగాలుగా వేయడానికి కారణం ఏమిటి? ఏది ముందు వేయాలి అనే విషయం ఎలా నిర్ణయించుకున్నారు?

జ: సంకలనం రెండు భాగాలుగా వేయడానికి కారణం మేము అసలు స్పందిస్తారా! లేదా! అనుకునే సమయంలో 74 మంది రచయిత్రులు స్పందించారు. 74 కథలు వచ్చాయి. కొన్ని కథలు బాగా పెద్దవి. ఒకటే వేస్తే మన చేయి మోయలేనంత భారం అవుతుంది. అందుకే 34, 34 గా విడదీసి రెండు భాగాలుగా వేసాము. అక్కడికీ 300 పేజీలు దాటింది ఒక్కోటి. ముందు సీనియర్స్‌వి ముందు వేద్దాం అనుకున్నాము. కానీ అందులో కొంచెం ఇబ్బంది ఎదురైంది. అందుకే అక్షరక్రమంలో అ నుంచి తీసుకున్నాం.

ప్రశ్న 6: ఈ సంకలనం తీసుకురావడంలో మరపురాని అనుభవం ఏమన్నా ఉందా?

జ. మరపురాని అనుభవం అంటే ఒకటే. ప్రతి ఒక్కరూ, కేవలం రచయిత్రులే కాదు, మాకు పీఠిక రాసినవారు, శుభాకాంక్షలు పంపినవారు, బ్యాక్ కవర్ పేజి రాసిన వారు అందరూ ప్రముఖులు కావడం, మేము కోరిన వెంటనే కాదు, లేదు అనకుండా వారి శుభాకాంక్షలు అందించడం ఇదే మరపురాని అనుభవం. రమణాచారి గారు, పార్వతీశం గారు, యండమూరి గారు సామాన్యులు కాదు కదా! అలాంటివారి ఆశీస్సులు ఆయాచితంగా లభించాయి. ఇంతకన్నా మరపురాని మధురానుభూతి ఏముంటుంది?

ప్రశ్న 7: సంకలనాల వర్షం మొదలైన ఈ పరంపరలో సంకలనాల మీద మీ అభిప్రాయం ఏమిటి?

జవాబు: సంకలనాల వర్షం అనే మాట కన్నా, సంకలనాల హవా అందామా, జోరు అందామా! మీకూ తెలుసు. సాహిత్యం వ్యాపారం అయింది. రచయితలు అయినవారు సంకలనాలు వేసుకోడం సహజం, కానీ రచయితలూ కాని వాళ్ళు, తమకు సంబంధం లేని అంశం అయినా, కొందరు రచయితలను, అంటే వారు మాత్రమే ప్రముఖులుగా భావించిన వారి నుంచి కథలు సేకరించి, NRI Funds పొంది, స్వామికార్యం కొంత, స్వకార్యం కొంత అన్న చందంగా సాహిత్యాన్ని పోషిస్తున్నవారిలా తమని తాము భావిస్తూ, సంపాదించుకోడం ఎక్కువైంది. ఇటీవల కాలంలో పత్రికలు లేక, Facebook లో రాసుకుంటున్నవారు తమ కథ సంకలనంలో చోటు చేసుకోడమే మహాభాగ్యంగా భావించడంతో వారి బలహీనతని మరి కొందరు కాష్ చేసుకుంటున్నారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అని, world record అని, ఇంకేవో రికార్డ్స్ అని సర్టిఫికెట్స్ కూడా అమ్ముతున్నారు. కొందరైతే, రాసింది తక్కువ అయినా, ఈ సర్టిఫికెట్స్ చూసుకుని, మేము రాసింది చాలా గొప్ప రచన అని ఫీల్ అవడం కూడా ఎక్కువైంది. అలాంటి వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. నాకు కూడా ఇలాంటి సర్టిఫికెట్స్ వచ్చాయి. రెండు. అది చూసి నేను ఒక సుప్రసిద్ధ రచయితతో అన్నాను మీలాంటి వారు సంతకం చేస్తే ఆ సంతకానికి ఒక విలువ ఉంటుంది, నేనేం రాసానో తెలియని వాళ్ళు, కథంటే తెలియని వాళ్ళు సంతకం చేసి నాకో సర్టిఫికేట్ ఇస్తే మురిసిపోవాలా నేను అని. ఇదంతా ఈ ఆధునిక కాల మాయాజాలంలో జరుగుతున్న విపరీతాల్లో ఒకటి. ఏం చేయగలం?

ప్రశ్న 8: మీ సంకలనం ప్రత్యేకత ఏమిటి?

జ: మా ప్రత్యేకత మాదే. ఇందులో రచయిత్రులు ఎవరూ కూడా ఒక వాదానికి పరిమితం కాదు, సాహిత్యం విశ్వజనీనం. కథాంశం విశ్వవ్యాప్తంగా ఉండాలి. కుటుంబం, సంప్రదాయాలు, సంస్కృతి ప్రతి దేశానికి, ఉంటాయి. అన్ని దేశాల, రాష్ట్రాల, ప్రాంతాల ఆచారవ్యవహారాలను పరిశీలించి, మన రచనల్లో వాటిని ప్రతిబింబింప చేస్తేనే కదా ఏ మూల ఏం జరుగుతోంది అనే విషయం అందరికీ తెలుస్తుంది. పుస్తకాలు విషయ భాండాగారాలు.. పుస్తకాలు విజ్ఞాన గనులు. అందుకే ప్రతి వాక్యం రసాత్మకం కాదు, సమాజహితం అయి ఉండాలి. అదే మా రచయిత్రుల్లో ఉంది. అదే మా ప్రత్యేకత. నేటి కథ రేపు చరిత్ర. చరిత్ర ద్వారానే మనకి సంస్కృతీ, సంప్రదాయాలు తెలిసాయి. అలాగే రేపటి తరానికి కూడా నేటి సంస్కృతీ, సంప్రదాయాలు తెలియాలి కదా! పాదాలు నేల మీద ఆనించి నడవడం సహజం. తల కిందికి పాదాలు పైకి పెట్టి నడవడం అసహజం. భారతీయ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మన కుటుంబ వ్యవస్థ పతనం వైపు ప్రయాణిస్తోంది. అది తిరిగి నిలబడాలి అంటే, అందుకు రచయితలే పూనుకోవాలి. రచయితలే రేపటి తరానికి కరదీపికలు కావాలి. ఇదే మా నినాదం.

ప్రశ్న 9: ఈ సంకలనాల్లో మీకు నచ్చిన కథలు కొన్ని చెప్తారా?

జ: నాకు నచ్చిన కథలంటే ఏం చెప్పాలి? అన్నీ బాగున్నాయి. కొన్ని చాలా బాగున్నాయి. కొన్ని మరికొంత ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి.

ప్రశ్న 10: ఇంత పేరున్న రచయిత్రిగా ఇందులో కథలు ఎడిట్ చేసేటప్పుడు మీకేమనిపించింది?

జ: ఎడిట్ చేస్తున్నప్పుడు, కొన్ని వాక్య నిర్మాణాలు సరిగా లేవనిపించింది. Punctuation marks, పేరా divide చేసుకోడం spelling mistakes.. ఇలాంటివి కనిపించాయి. కొన్ని నిడివి ఎక్కువ అవడంతో ఎడిట్ చేసాను. కొన్ని వస్తుపరంగా బాగున్నా, కొంత దూకుడు కనిపించింది. ఏ విషయంలో దూకుడు ఉన్నా రచన విషయంలో నిదానం ప్రధానం అనే సూత్రం వర్తిస్తుంది అని నమ్ముతాను.

ప్రశ్న 11: యువ రచయితలు కొన్ని అసాంఘిక సమూహాల్లో చేరి అవాకులు, చెవాకులు రాయడం పట్ల మీ అభిప్రాయం?

జ: కొందరి విపరీత మానసిక ధోరణి వలన యువత ప్రభావితం అయి, వాళ్ళు కూడా నడవకూడని మార్గంలో నడుస్తున్నారు. వాళ్ళని చక్కగా గైడ్ చేసి నడిపించే మార్గదర్శకులు రావాలి.

ప్రశ్న 12: వర్ధమాన రచయితలు/రచయిత్రులు వారి ధోరణి కొంత అసహనానికి గురిచేస్తున్నదని కొందరు సీనియర్స్ వాపోతున్నారు. మీ అభిప్రాయం?

జ: ఒకప్పుడు సీనియర్స్‌ని మనమంతా ఎంతో గౌరవించేవాళ్ళం. ఇప్పటికీ గౌరవిస్తున్నాము. అది మన సంప్రదాయంలో భాగం. కానీ, ఇప్పుడు మీరన్నట్టు చాలా మందిలో ఆ వినయ విధేయత అనేది కొరవడింది. మా అంతటి వాళ్ళు లేరు, మీకన్నా ఏ విషయంలో మేము తీసిపోయాం అన్నట్టు తయారు అయినారు. రవ్వంత ప్రతిభని కొండంతగా భావిస్తూ అహంకారం బాగా పెంచుకుంటున్నారు. దానికి కారణం సోషల్ మీడియా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా విస్తృతమైన ప్రచారం పొందుతూ తమని తాము సెలెబ్రిటీలుగా భావించే వాళ్ళను చూస్తుంటే, పూర్ణ శుంఠలు సభాపూజ్యులైరి అనే పాదం గుర్తొస్తుంది.

అంతేకాదు, ఒకప్పుడు మనం ఎవరు ఏ చిన్న సహాయం చేసినా ఎంతో కృతజ్ఞతగా ఉండేవాళ్ళం. ఇప్పుడు చేసిన సహాయం మర్చిపోయి, మా టాలెంట్‌ని ఎదుటి వాళ్ళు వాడుకుంటున్నారు అనుకుంటున్నారు కానీ, టాలెంట్ గుర్తించి ప్రోత్సాహం ఇస్తున్నారు అనుకోడానికి కూడా వారికీ అహం అడ్డొస్తుంది. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అని మహాకవులు చెప్పింది, అహంకారం పతనానికి పునాది అని చెప్పడం. ఇది గుర్తుంచుకుంటే ఎవరికైనా మంచిది.

మనకి ఒక సామెత ఉంది తాడెక్కే వాడుంటే, తలదన్నే వాడుంటాడు అని. ఈ రోజుల్లో చిన్న పిల్లల్లో కూడా అసాధారణమైన ప్రతిభా, పాటవాలు చూస్తున్నాం. మనమంతా డెబ్భైలకి చేరువ అవుతూ చిన్న, చిన్న వాటికే గొప్పవిగా భావించే ధోరణి మారాలి. అన్నీ ఉన్న విస్తరి అణగి, మణగి ఉంటుంది అంటారు పెద్దలు. అది నిజం. అలాగే ఉండాలి కూడా.

ప్రశ్న 13: మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి?

జ: భవిష్యత్తు ప్రణాళిక లేమిటి? అంటే సంస్థ పరంగానా! వ్యక్తిగతంగానా! సంస్థ పరంగా అయితే, ఒక్కటి మాత్రం చెప్తాను. ఒకప్పుడు జంటనగరాలకి పరిమితం అయిన లేఖిని ఇప్పుడు అంతర్జాతీయంగా సభ్యులను కలిగి ఉంది. ఇవాళ లేఖిని అనే సంస్థ గురించి ఎందఱో మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పటివరకు నిస్వార్థంగా, నిజాయితీగా సంస్థ కోసం పని చేసాను. కృషి చేసాను. ఇటీవల దోహా వెళ్ళినప్పుడు కూడా ఇద్దరు అమ్మాయిలు వర్ధమాన రచయిత్రులు లేఖిని సంస్థలో సభ్యత్వం కోసం ఆసక్తి చూపించారు. US వెళ్ళినపుడు కూడా కొందరిని సభ్యులుగా చేర్చాను. లండన్‌లో కూడా ఒక మిత్రురాలు ఈ మధ్యే ఈ విషయం ప్రస్తావించారు. అలా అని అందరికీ నేను చేసేది నచ్చాలని లేదు కదా! మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను చెప్పలేను.

ఇక వ్యక్తిగతంగా అయితే, నా సంస్థ సరసిజ థియేటర్ ఫర్ విమెన్ ద్వారా మరిన్ని నాటకాలు ప్రదర్శించాలి, విమెన్ రైటర్స్ కోసం మరోసారి నాటక రచన మీద workshop చేయాలి.. కొంచెం సమయం నా సంస్థకి కూడా కేటాయించి దాని మంచి చెడ్డలు చూసుకోవాలి. అలాగే ఇటీవల నేను రచనా పరంగా వెనకపడ్డాను అనిపిస్తోంది. ‘నాన్నలేని కొడుకు’ తరవాత మరో నవల రాలేదు. రెండు నవలలు సగంలో ఉన్నాయి. అవి పూర్తీ చేయాలి. మరో రెండు నవలలకు కావలసిన వస్తువు నా దగ్గర ఉంది. అవి కూడా ప్రారంభించాలి.

మ్యాచ్ ఫిక్సింగ్ నాటకప్రదర్శనలో ఒక సన్నివేశం

జమునారాయలు తో రాధాకృష్ణ అర్ధనారీ తత్వ ప్రదర్శన

ప్రశ్న 14: అవార్డుల మీద మీ అభిప్రాయం ఏమిటి?

జ: వాటి గురించి ఎప్పుడూ నేను ఆలోచించలేదండి. చాలా మంది ఒక బుక్ రాగానే అవార్డు ఆశిస్తున్నారు, అందుకోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు నాకు అలాంటి ప్రయత్నాలు చేయడం కూడా తెలియదు. నాకు ఇప్పటివరకు వచ్చినవన్నీ కూడా చాలా యాదృచ్ఛికంగా వచ్చినవే. నేనేమి ప్రయత్నం చేయలేదు. అలా యాదృచ్ఛికంగా ఏ అవార్డు వచ్చినా స్వీకరిస్తాను. వద్దు అని చెప్పను. అలా చెప్పడం అవార్డుని అవమానించడం అని నా భావన. అలా అని వాటికోసం రాయను. మీరు నమ్మినా నమ్మకపోయినా, నేను కంప్యూటర్ దగ్గర కూర్చున్నప్పుడు మాత్రమే నేను రచయిత్రిని అనుకుంటాను. ఒకసారి shutdown చేసి, హాల్లోకి వచ్చానంటే ఆ విషయం మర్చిపోతాను. ఎవరికీ ప్రత్యేకంగా నేను రచయిత్రిని అని పరిచయం చేసుకోను. మా ఆఫీస్‌లో కూడా చాలా కాలం నేను కథలు రాస్తాను అని ఎవరికీ తెలియదు. ఒకసారి ఆంధ్రభూమిలో నా పరిచయం వేసి, ఫోటో వేస్తే ఎవరో చూసి, మరొకరికి చెప్పడం, వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్పడం అలా అందరికీ తెలిసింది. కీర్తి కోసం నేనేమి చేయలేదు, చేయను కూడా. దేవుడు 24 గంటలు ఇచ్చాడు, చదువు, ఉద్యోగం, బాధ్యతలు వీటితో చాలా భాగం జీవితం గడిచిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి 24 గంటలు.. చిన్నప్పటి నుంచి పక్కింటి వాళ్ళతో, ఫ్రెండ్స్‌తో కాలక్షేపం కబుర్లు చెప్పడం అనేది లేదు. ఏదో ఒకటి చేస్తూ, సమయం వృథా కాకుండా చూసుకునేదాన్ని. నేను టివి కూడా చూడను ఎప్పుడో తప్ప. చదవడం, రాయడం, సంస్థల బాధ్యతలు చేపట్టాక ఆ వ్యవహారాలు ఇవి తప్ప ఏమి చేయను. రెండు చేతులు ముడుచుకుని కూర్చుంటే నాకేమి తోచదు. అందుకే ఏదో ఒకటి చేస్తాను. ఆ చేసిన వాటి ద్వారా నాకో మానసిక తృప్తి, సమయాన్ని quality గా గడిపాను అనే ఆనందం పొందుతాను. అంతే.

ప్రశ్న 15: ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా?

జ: ప్రశ్నలకి జవాబులు తప్ప ఏం చెప్పను! లేఖిని సంస్థ అభివృద్ధి చేయడంలో నాకు పూర్తి స్వేచ్ఛని ఇచ్చిన మా గౌరవ సలహాదారులు డాక్టర్ మంథా భానుమతిగారికి, పొత్తూరి విజయలక్ష్మి గారికి, నాకు అన్ని విధాలా సహకరిస్తూ, నా మీద ఎంతో అభిమానం చూపించే కార్యవర్గ సభ్యులు ప్రధాన కార్యదర్శి సరస్వతి కరవదికి, నండూరి సుందరీ నాగమణి కి, కామేశ్వరి చెంగల్వల కి, ఉపాధ్యక్షురాలు అల్లూరి గౌరీ లక్ష్మిగారికి, సంయుక్త కార్యదర్శులు నళిని ఎర్రా గారికి, ఉమాదేవి కల్వకోటకి, షామీర్ జానకి ఇంకా మా సభ్యులు అందరికీ పేరు, పేరునా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. నా మీద వారంతా ఉంచిన నమ్మకానికి కృతఙ్ఞతలు. వాసా ప్రభావతిగారి అమ్మాయి మీనాక్షిగారికి ప్రత్యేక ధన్యవాదాలు.

~

సంచిక టీమ్: మీ విలువైన సమయాన్ని కేటాయించి సంచికకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు విజయలక్ష్మి గారూ.

అత్తలూరి విజయలక్ష్మి: మీకు కూడా ధన్యవాదాలు.

***

కథల లోగిలి (1 & 2)
(రచయిత్రుల కథలు)
ప్రచురణ: లేఖిని సంస్థ
పేజీలు: మొదటి భాగం – 311, రెండవ భాగం – 314
వెల: మొదటి భాగం – ₹ 250, రెండవ భాగం – ₹ 250
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్.
ఫోన్: 90004 13413
అత్తలూరి విజయలక్ష్మి: 9676881080
సరస్వతి కరవది: 9849530000
ఆన్‌లైన్‌లో:
https://www.telugubooks.in/te/products/kathala-logili-rachayitrula-kathalu-1-2

~

‘కథల లోగిలి’ (రెండు భాగాల కథల సంకలనం) సమీక్ష:
https://sanchika.com/kathala-logili-book-review-kss/

Exit mobile version