[‘చిత్రకావేరి’ అనే కథాసంపుటి వెలువరించిన శ్రీమతి అరుణ పప్పు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం అరుణ పప్పు గారూ.
అరుణ పప్పు: నమస్కారం.
~
ప్రశ్న 1. మీరు తాజాగా వెలువరించిన మీ 10 కథల సంపుటికి శీర్షికగా చివరి కథ ‘చిత్రకావేరి’ పేరునే ఎంచుకోవడంలో ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?
ప్రశ్న 2. ఇది మీ 2వ కథాసంపుటి. మీ సాహితీ ప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా? మొదటగా ఏ ప్రకియతో సాహిత్య వ్యాసంగం మొదలుపెట్టారు? ఎప్పుడు?
జ: 2009లో నేను తొలి కథ రాశాను. అప్పటికి ఈనాడులో ఏడేళ్లు పనిచేసి వచ్చి ఆంధ్రజ్యోతిలో పనిచేస్తుండేదాన్ని. ఆదివారం ఆంధ్రజ్యోతి ఎడిటర్ వేమన వసంతలక్ష్మిగారు ‘కథలు బాగా చెబుతావు, రాసి కూడా ఇవ్వొచ్చుగా..’ అని చమత్కారంగా అనేవారు. గొరుసు జగదీశ్వరరెడ్డిగారు తాను రాయకుండా ఇతరులను రాయమనడంలో ముందుంటారు. వారిద్దరి చలవతో నేను తొలి కథ రాశాను.
ప్రశ్న 3. తొలి కథాసంపుటి ‘చందనపు బొమ్మ’ 2013లో ప్రచురించారు. రెండో కథాసంపుటి తీసుకురావడానికి దాదాపు 12 సంవత్సరాలు వ్యవధి తీసుకున్నారు. ఎందుకని? రచయిత్రిగా కథాప్రక్రియ నుంచి, ఇతర ప్రక్రియల వైపు మళ్ళడమే కారణమా?
జ: ఎవరైనా రాయమని బలవంతపెడితే – ఎప్పట్నుంచో అనుకున్నదేదో కథగా వస్తుంది. నా అంతట నేను కథలు రాద్దామని అసలు కూర్చోను. అందువల్ల 16 ఏళ్లలో రాసినవి 20 కథలే. జర్నలిస్టుగా అనేక కథనాలు రాస్తుండటం, ఇప్పుడేమో ఆత్మకథలు రాస్తుండటం – ఇంకా సమయం దొరికినప్పుడు చదువుకోవడం. అంతే.
ప్రశ్న 4. ‘చిత్రకావేరి’ పుస్తకం డిజిటల్ వెర్షన్‌ని మాత్రమే ప్రచురించడంలో మీ ఉద్దేశం ఏమిటి? అది కూడా ఉచితంగానే ఎందుకు అందుబాటులో ఉంచారు?
జ: పుస్తకం పాఠకులకు చేరాలన్నదే ముఖ్య ఉద్దేశం. ఉచితంగా వాట్సాప్‌లో పంపిస్తే నచ్చినవాళ్లు చదువుకుంటారు కదా. అనేక వాదవివాదాలున్నాయి, ఉచితంగా పంచరాదు, ఉచితంగా ఇచ్చేదానికి విలువలేదు.. ఇటువంటివి. నేను ఎయిర్‌పోర్టులూ చిన్న ఊళ్ళూ – రెండూ తరచుగా తిరుగుతుంటాను. ఎయిర్‌పోర్టులూ, ఆర్టీసీ బస్సాండులూ, రైల్వే స్టేషన్లూ – ఎక్కడా తెలుగు పుస్తక దుకాణాలుండవు. జిల్లా కేంద్రాల్లో, మంచి బజార్లో సైతం పుస్తకాల దుకాణాలే ఉండవు. పుస్తకాలు విరివిగా కనిపించాలి, అప్పుడే కొందరైనా కొంటారు. ఆన్ లైనులో కొనుగోలు సౌకర్యం ఇప్పుడు వచ్చింది, అది గృహిణుల దాకా చేరాలిగా. ఈ పుస్తకాన్ని పుస్తక ప్రదర్శనల నాటికి అచ్చులో తీసుకొస్తామని ఒక ఆలోచన ఉంది. దేనికి దానికే పాఠకులుంటారు. ఇప్పుడు మీ సంచికలో కూడా అది ఉచితంగా ప్రచురించే వీలుంటే, నాకు సంతోషమే. మరికొంతమందికి చేరుతుంది కదా.
ప్రశ్న 5. ‘చిత్రకావేరి’ పుస్తకంలో ముందుమాట గానీ, మీ మాట గాని లేవు. నేరుగా కథలలోకి వెళ్ళిపోయారు. ఎంత డిజిటల్ వెర్షన్ అయినా, మొదట్లో చిన్న పరిచయం ఇచ్చి ఉంటే బాగుండేది కదా? ఇవ్వకపోవడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?
జ: కఠినమైన కావ్యాలో, పరిశోధక పత్రాలో – అటువంటివాటికి పరిచయవాక్యాలుండాలి, వాటిని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అని దిశానిర్దేశం చేసేందుకు. ముంజేతి కంకణానికి అద్దమెందుకన్నట్టు కథలకు ముందూవెనుకా మాటలెందుకు? చదివేవారి స్థాయి, వయసు, వాతావరణాన్ని బట్టి అవి అనేక రకాలుగా అర్థమవుతాయి.
ప్రశ్న 6. ‘అనంతరం’ కథలో పాపని పోగొట్టుకున్న తండ్రి వేదనని బాగా చెప్పారు. తన తండ్రి, రోడ్డు పాప చెయ్యి వదిలేయబట్టే పాపకి ప్రమాదం జరిగిందని ఆ కొడుకు బలంగా నమ్ముతాడు. కథలో పాప తాతయ్య, బామ్మా క్రుంగిపోతుంటారు, నలుగురిలో కలవలేకపోతుంటారు. అయితే, పాప తాతయ్య వెర్షన్ నుంచి చెప్పాల్సి వస్తే, ఈ కథని ఎలా రాస్తారు?
జ: హహహ, నాతో మరో కథ రాయించాలనే ఉద్దేశమేదో ఉన్నట్టుంది. విలువైన జీవితం చెయ్యిజారిపోయినందుకు, పోగొట్టుకున్నందుకు బాధతో పాటు, కొడుకు నుంచి నింద, తిరస్కారం, తమకు తాము విధించుకున్న ఒంటరితనం – ఇన్నిటిని అనుభవిస్తున్న ఆయనలో వేరే భావనలేమైనా ఉంటాయా? ఆ క్షణం అట్లా జరగకుండా ఉంటే బాగుండునన్న ఊహ తప్ప. ఆ దు:ఖం వాళ్లందరిదీ ఉమ్మడి కదా.
ప్రశ్న 7. ‘యాంటిక్ ఫినిష్’ కథలోని డా. ఆదినారాయణ కల్పితా పాత్రా లేక మీకు నిజజీవితంలో తారపడిన వ్యక్తా? ఎందుకంటే, ఎంతో సన్నిహితంగా గమనిస్తే తప్ప, ఆ మనిషిలోని వేదనని కథలో చెప్పినంత గొప్పగా కాప్చర్ చేయలేరు.
జ: కథల్లోని ప్రతి పాత్రా బయట నలుగురైదురిగురి భావోద్వేగాల సమ్మేళనం. ఆ కథ వచ్చినప్పుడు అనేకమంది తమ గురించే అనుకున్నారు. ఇప్పటికీ చదివి అలాగే అనుకుంటామని చెబుతారు.
ప్రశ్న 8. శ్రీ సూర్యనారాయణా మేలుకో అనే సుప్రభాత గీతాన్ని అద్భుతంగా ఉపయోగించుకుంటూ అల్లిన ‘చంద్రభాగ’ కథ చదువుతుంటే, పాఠకులకు కోణార్క్ ఆలయం చుట్టూనో, బీచ్ లోనూ తిరుగుతూన్నట్టు తోస్తుంది. ఈ కథ నేపథ్యం గురించి చెప్తారా?
జ: అది మాత్రం చాలావరకూ నిజంగా జరిగినదే, కాకపోతే హంపిలో. రెండ్రోజులపాటు ఆ గైడ్ మాతో ఉండి తన కథ చెప్పారు, నేను దాన్ని కోణార్కలోని చంద్రభాగ నదికున్న కథతో (అదీ అక్కడవారు చెప్పుకునేదే) కలిపి చెప్పాను. ఆ సుప్రభాత గీతం రోజంతా సూర్యుడి దశలను అత్యంత అద్భుతంగా వర్ణిస్తుంది. అన్వయించుకుంటే మానవ జీవితాలూ అంతేకదా.
ప్రశ్న 9. “తమని తాము మళ్ళీ నిర్మించుకునే ప్రయత్నంలోని జీవనకాంక్ష, క్రియేటివిటీ నాకు అత్యద్భుతమైన ఏదో సత్యాన్ని తెలియచెపుతున్నట్టు వుంటాయి” అనే సుశీలా నాయర్‌ది గొప్ప పరిశీలన. ‘పునర్నిర్మాణం’ కథలో – అప్పన్న కనబరిచిన బ్రతుకుదైర్యాన్ని రామినాయుడు అర్థం చేసుకున్నట్టా, లేనట్టా? వివరించండి.
జ: రామినాయుడికి జీవిత అవగాహన చక్కగా ఉంది. శతాబ్దాలుగా మానవాళి అటువంటి జీవనకాంక్ష, సృజనాత్మకతలతోనే ముందడుగేస్తూ వస్తోంది. ఎన్ని యుద్ధాలూ ఎన్ని సవాళ్లూ ఎన్ని గండాలూ – అన్నిటినీ దాటుకుని వస్తున్నామంటే, ఆ ధైర్యంతోనే కదా!
ప్రశ్న 10. ‘వాచ్‌మన్ అంటే ఓ స్టూలు వేసుక్కూర్చుని వచ్చిపోయేవాళ్ళని కనిపెట్టుకుని అపార్టుమెంటుకు కాపాలాకాయడమే’ అనుకున్న సూరీడు, తాను ఊరుమ్మడి పాలేరుగా బతకాల్సి వస్తుందని బాధపడతాడు. అతని బాధని, నిద్రలేమిని తాగుబోతుతనంగా భావించిన అపార్టుమెంటువాసులకి అతని బాధ అర్థం కాదా? కానట్టు నటిస్తేనే తన జీవితాలు సజావుగా సాగుతాయన్నా స్వార్థపు గ్రహింపా?
జ: పైనున్న సమాధానానికి ఇది వ్యతిరేకంగా ధ్వనించవచ్చుగానీ, చాలా సమస్యలను, సవాళ్లను, ప్రశ్నలను, అవగాహనను తెలియనట్టు, పట్టించుకోనట్టు చాప కిందకు తోసేస్తే తప్ప, మధ్య తరగతి బతకలేదు. వారిదీ బతుకు పోరాటమే, మరో స్థాయిలో. ఉదాహరణకు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైన పనిమనిషిని ప్రతిరోజూ మొగుడు తాగొచ్చి కొడతాడు అనుకోండి. ఆమె తరచూ డుమ్మాలు కొడుతుంటుంది. ఆమెను అతన్నుంచి విడదీసి ఉంచి, వారి పిల్లల్ని పెంచే సాహసం మధ్యతరగతి మగాడికో, ఇల్లాలికో ఉంటుందా? వారి జీవన అవసరాలను గడుపుకోవడానికి ఇద్దరికిద్దరూ పరిగెత్తే చోట, పనమ్మాయి తరచూ రాకపోతే పర్లేదులే అని సర్దుకోగలిగే స్థితి ఉంటుందా? ఇప్పుడున్న జీవితాల్లో, ఔదార్యం, వైశాల్యం, ప్రేమ, అభిమానం వంటివి చూపించడానికి కొంత తాహతుండాలి. అది మధ్యతరగతికుందా? లేకపోవడం స్వార్థమేనా.
ప్రశ్న11. ‘పూరకం’ కథలో మనవరాలిలో తలెత్తిన వెలితిని పోగొట్టే ప్రయత్నం చేసిన అమ్మమ్మ అనుభవం గొప్పది. అసలైన స్వేచ్ఛ, నిజమైన స్పేస్ అంటే ఏమిటో చెప్పిన ఈ కథ నేపథ్యం గురించి వివరిస్తారా?
జ: చుట్టూ ఉన్న జంటల్లో అతి కొద్దిమంది అలా మనసున మనసైలాగా కనిపిస్తుంటారు. ఎక్కువమందివి లెక్కల బతుకులే. తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తే బాగుంటుంది కదా అనుకుని రాసిన కథ అది.
ప్రశ్న12. ‘నాకు చెప్పరె వలపు నలుపో తెలుపో’ కథలో ‘అసంపూర్ణత్వంలో ఇంత సౌందర్యమా?’ అనుకుంటుంది నాయిక. ఈ విగ్రహాలలోని అసంపూర్ణత్వాన్ని జీవితానికి అన్వయించుకుని, సంతోషంగా బ్రతకడం సాధ్యమేనంటారా?
జ. పూర్ణమైన మానవులు, సృష్టీ ఉందంటారా? ఏదీ సంపూర్ణమూ, శాశ్వతమూ, నిత్యసుందరమూ కావన్న ఎరుక గలిగిన జాతి కదా మనది? ప్రేమానురాగాలుంటే, ఏ తేడాలూ గ్రహింపుకు రావన్న సంగతి మనకు తెలుసుగా. మళ్లీ ఇదికూడా పైకథకు, ఆలోచనకూ రెండో పార్శ్వం.
ప్రశ్న13. “ఎన్ని ఆటంకాలు ఎదురైనా నదులు వెనకిక వెళ్ళలేవు, ఎండిపోవు. మహా అయితే పాయలుగా చీలిపోతాయేమో. అవి ప్రవహించినంత మేరా పచ్చదనమే. సమస్త జీవరాశికీ ప్రకృతికీ మేలు చేసుకుంటూ పోవడమ్మ వాటికి తెలుసు.” అంటూ నదుల గురించి గొప్ప గమనింపు వ్యక్తపరిచారు ‘చిత్రకావేరి’ కథలో. తరువాతి వాక్యంలో “పేరులోనే కాదు, ప్రవర్తనలోనూ కావేరి నది లాంటిదే అనుకున్నాడు” అని అన్నారు. కానీ కావేరి జీవరాశికీ ప్రకృతికీ మేలు చేసే పనులేవీ చేసినట్టు కథలో స్పష్టమవలేదు. వివరించగలరా?
జ: ఇదే ఇప్పటి చిక్కు అనుకుంటాను. అన్నీ చెప్పాలి, చెప్పనివేవీ తెలియవు, అర్థం చేసుకోలేరా? కావేరి ఒక యాక్టివిస్టు, జంతుప్రేమికురాలు, స్వచ్ఛందసేవకురాలు అయ్యుంటే అప్పుడు కథకు, ఆ వాక్యానికి ఆమె నప్పేదా? కథ చిన్న కిటికీ కదా, కావేరి ఎవరికేరకంగా సాయపడుతోందో మొత్తం జీవితచరిత్ర ఎలా చెప్పగలం? ఆమె ఎవరికీ ఏమీ సేవ చెయ్యదనే అనుకుందాం, తన ఆత్మశక్తిని కూడగట్టుకుని, తన జీవితాన్ని నిర్మించుకోవడానికి చేసే ప్రయత్నం చిన్నదవదు కదా? భర్త తనను పట్టించుకోవడం లేదనే చింతతో చదువు, ఉద్యోగం, సాహిత్యం, సౌందర్యం ఉన్న అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడితే బాగుంటుందా.
ప్రశ్న14. సాధారణంగా రచయితలకు తాము రచించేవన్నీ నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీ మనసుకు బాగా దగ్గరయింది? ఎందువలన?
జ: నాకు ప్రత్యేక ఇష్టాయిష్టాలేం లేవు. ఉండవు. ఒక పాత్రను ఉదాత్తంగా చూపించాలనుకుని రాయను. అందరు మనుషులు అవసరం, అవకాశం, స్థాయి మేరకు ప్రవర్తిస్తారన్న గ్రహింపు ఉన్నప్పుడు, (జీవిత దశల్లోని అవసరాలు, ఆర్థిక అవకాశాలు, అంతర్గత మానసిక స్థాయి) జీవితంలోనూ, కథల్లోనూ ఎవరినీ జజ్ చెయ్యం. మొట్టమొదటి కథ ‘యాంటిక్ ఫినిష్’లో డాక్టర్ ఆదినారాయణ సంగతే తీసుకోండి, అతనికి మెడిసిన్ చదివే తెలివి ఉండొచ్చు, చదవడానికే డబ్బు లేదు, హాస్పిటల్ పెట్టి నడిపే ఆర్థిక స్థాయి లేదు, సంఘంలో పరిచయాల్లేవు. కేవలం తెలివొక్కటీ ఉంటే ఇప్పుడున్న జీవితం అతనికెలా అందేది? అవి భార్య సుధ వల్లనే సమకూరాయి కదా. అప్పుడు ఆమెకు అతని మనసులో వేరే ఎవరో ఉన్నారన్న ఆలోచన భరింపశక్యం కాకపోవడంలో ఆశ్చర్యమేముంది? ఆమె అందం, ఆస్తి, అంతస్తు లేనిదై, డాక్టర్ ఆదినారాయణే డబ్బున్నవాడనుకోండి. అప్పుడు ఆమె దాన్ని సహించేదేమో! కథలో ఆమె చెడ్డది, అతను మంచివాడన్న ధ్వని కనపడొచ్చు, కాని రాస్తున్న మనిషిగా నేను ఎవరివైపూ లేను. వాళ్లిద్దరినీ చూస్తున్నాను తప్ప. దాదాపు అన్ని కథల్లోనూ అంతే. రాసేశాక వాటిని మోస్తూ తిరగను. చదివినవారికి నచ్చిన, నచ్చని కథలు, పాత్రలుంటాయేమో. నేను రాసిన దేన్నయినా తర్వాతెప్పుడో చదువుతున్నప్పుడు వేరేవారు రాసినవి చదివినట్టే అనిపిస్తుంది..
ప్రశ్న15. ఈ సంపుటిలోని ఏదైనా కథ రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?
జ: ‘నాకు చెప్పరె వలపు నలుపోతెలుపో’ రాయడానికి చాలా కష్టమనిపించింది. నేను అనుకున్నది చక్కగా చెప్పలేకపోయాననిపిస్తుంది. ఆ దేవదాసిని నేను పూరీలో కలిసి ఇంటర్వ్యూ చేసినావిడే. కాని నేను చెప్పదలచుకున్న పాయింట్ ఏదో అది సరిగ్గా చెప్పలేకపోయానేమో అనిపిస్తుంది. కొందరేమో దేవదాసి వ్యవస్థను సమర్థిస్తున్నారా అని, మరికొందరు పాతకాలపు ఆలోచన అనీ విమర్శించారు. రంగురూపుల పట్ల మనలో పాతుకుపోయిన అభిప్రాయాలను వేరే విధంగా వ్యక్తం చెయ్యదలచుకున్నాను, అయిందోలేదో మరి.
ప్రశ్న16. ‘చిత్రకావేరి’ పుస్తకం కవర్ పేజీ చాలా బావుంది. ప్రత్యేకంగా ఆర్టిస్ట్ చేత గీయించారా? లేక AI ద్వారా డిజైన్ చేసినదా?
జ: ఎన్నెలపిట్ట పబ్లికేషన్స్ వారు, శేషు కొర్లపాటి శ్రద్ధ వల్ల అది అందంగా వచ్చింది. దానికి వారికి నా ధన్యవాదాలు. ఆయన స్వయంగా చేశారా, ఏఐ వాడారా అన్నది నాకు తెలియదు. పుస్తకాలు అందంగా ఉండాలన్నది నా అభిమతం.
ప్రశ్న17. సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి?
జ: చాలా ఏళ్లుగా ఒక నవల రాస్తున్నాను. ఎప్పుడు పూర్తవుతుందో, అచ్చవుతుందో తెలియదు. దక్షిణాది భాషల నుంచి కొన్ని మంచి కథలు అనువాదం చెయ్యాలనుంది. (కమిషన్డ్) బయోగ్రఫీలను సాహిత్యంలో ఒక శాఖగా పరిగణించడానికి మనవాళ్లకు చాలా సమయం పట్టేట్టుంది. వైన్ లాగా చాలా కాలం మాగితేనో, లేదంటే నేనో, ఆ సబ్జెక్టులో పోతేనో ఆ పుస్తకాల గురించి మాట్లాడుకుంటారనుకుంటాను. అవి మాత్రం ఇంకొన్ని రాస్తాననుకుంటాను.
హైదరాబాదులో ఒక యాభైమంది కథారచయితలకు, మరో యాభైమంది పాత్రికేయులకు తప్ప, నేనున్న కుటుంబంలో, సమాజంలో చాలామందికి నేను కథలు రాశానని కూడా తెలియదు. ‘నేను’ అని మొదలుపెట్టడమే నాకు చచ్చేంత సిగ్గుగా, మొహమాటంగా ఉంటుంది. వృత్తిపరంగా నేను ఇంటర్వ్యూలు చెయ్యడమే తప్ప, నన్నొకరు ఇంటర్వ్యూ చెయ్యడం ఇదే తొలిసారి, ఇదే ఆఖరేమో. సంచిక నిర్వాహకులకు, సంపాదక బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు అరుణ గారూ.
అరుణ పప్పు: ధన్యవాదాలు.
***
రచన: అరుణ పప్పు
పేజీలు: 96
వెల: అమూల్యం
ప్రతులకు:
ఈ కథాసంపుటిని రచయిత్రి బ్లాగు లోంచి ఉచితంగా డౌన్‍లోడ్ చేసుకోవచ్చు.
లింక్:
https://arunapappu.wordpress.com/wp-content/uploads/2025/04/chitra-kaveri-online-1.pdf
~
‘చిత్ర కావేరి’ కథాసంపుటి సమీక్ష:
https://sanchika.com/chitra-kaveri-book-review-kss/