Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రచయిత, జర్నలిస్ట్ శ్రీ తుర్లపాటి నాగభూషణ రావు ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘జీవనరాగాలు-2’ అనే ఆత్మకథని వెలువరించిన శ్రీ తుర్లపాటి నాగభూషణ రావు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం తుర్లపాటి నాగభూషణ రావు గారూ.

తుర్లపాటి నాగభూషణ రావు: నమస్కారం.

~

ప్రశ్న 1.జీవనరాగాలు పేరిట మీ స్వీయ చరిత్రలో రెండవ భాగాన్ని పుస్తక రూపంలో వెలువరించినందుకు అభినందనలు. ఈ భాగంలోని విశేషాలేమిటి?

జ: చాలానే విశేషాలున్నాయండి. ముందుగా ఒకటి రెండు ప్రస్తావిస్తాను. ఈ రెండవ భాగం రచనలో నా స్వీయ అనుభవాలతో పాటుగా నాకు తారసపడిన లేదా నన్ను అమితంగా ప్రభావితం చేసిన వ్యక్తుల గురించి వారి ప్రత్యేకతల గురించి క్లుప్తంగానైనా చెప్పే ప్రయత్నం చేశాను. దీంతో ఈ పుస్తకం చదువుతున్న పాఠకునికి రచయిత కనపడటం తగ్గిపోతుంది. వారి ఆలోచనలు కూడా విభిన్న వ్యక్తుల మీదకు మళ్లుతుంటుంది. సమాజంలోని అనేక కోణాలకు ఈ తరహా రచన దర్పణం పడుతుంది. మొదటి భాగంలో కంటే ఈ ప్రత్యేకత రెండవ భాగంలో స్పష్టంగా కనబడుతుంది. మరో విశేషం ఏమంటే, పాఠకునికి తాను రచయిత స్వీయ అనుభవాలు చదువుతున్నానన్న భావన క్రమంగా తొలిగిపోయి సమాజంలోని పరిస్థుతులకు దర్పణంలా అనిపిస్తుంది. రచయిత పాఠకుల్లో ఒకనిగా కలిసిపోయినట్లు ఉంటుందీ రచన. ఇది నేను చెబుతున్న మాటలు కావు. ఇప్పటికే ఈ పుస్తకం చదివిన వారు అంటున్న మాటలు. మొదటి భాగం రచనలో కంటే ఈ భావన మరింత ద్విగిణీకృతమైందన్నదన్నది వారు చెబుతున్న మాట.

ఈ పుస్తకం అందుకోగానే పాఠకుడు మరో విశేషాన్ని ఇట్టే గుర్తించగలుగుతాడు. అదేమంటే, మొదటి భాగం చదివి స్పందించిన సుమారు ఓ 30 మంది రివ్యూస్, ప్రశంసించిన మరో పాతిక మంది పేర్లు కనబడతాయి. దీంతో రచయిత చేసిన ఒంటరి ప్రయాణం కాదు ఈ రచన, అందర్నీ కలుపుకుంటూ సాగుతున్న యాత్ర అన్న అభిప్రాయం పాఠకునికి కచ్చితంగా కలుగుతుంది. దీంతో పుస్తకం కొని చదవాలన్న ఆసక్తి కూడా పెరుగుతుంది. మొత్తంగా పుస్తక పఠనాసక్తి పెంచాలన్న నా ఆశయం కొంత మేరకు సిద్ధిస్తుంది. సోషల్ మీడియా ద్వారా నేను పెట్టే పోస్ట్ లకు ప్రభావితమై పుస్తకాలు తెప్పించుకున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం నాకు ఆనందంగా ఉంది.

ప్రశ్న 2. మీ జీవనరాగాలు-1ముద్రించి ఆరేడు నెలలు దాటినట్లుంది. ఈ విరామంలో, రెండో భాగం ముద్రణకి సంబంధించి – బుక్ మేకింగ్‌లో డిజైన్‌లో గాని, ఇమేజెస్ ఉపయోగించడంలో గాని ఏవైనా మార్పులు, మెరుగుదలలు పరిశీలించారా? ‘జీవనరాగాలు-2లో ఇది ప్రత్యేకం/విశిష్టం అని చెప్పదగ్గది ఏదైనా ఉందా?

జ: జీవనరాగాలు మొదటి భాగం రచనను పుస్తకంగా తీసుకువస్తున్న సమయానికే ‘సంచిక’ వెబ్ డైనమిక్ వీక్లీలో 28 భాగాల రచన పూర్తయింది. మొదటి భాగంలో 20 భాగాల వరకు తీసుకున్నాను. ఎనిమిది భాగాల రచన మిగిలి ఉండటంతోనే ధైర్యం చేసి రెండవ భాగం కూడా ఉంటుందన్న సంకేతంగా మొదటి భాగం పుస్తకం కవర్ పేజీ మీద ‘జీవనరాగాలు-1’ అని ముద్రించే సాహసం చేశాను. మొత్తం 40 భాగాల రచన కాగానే వీక్లీలో ధారావాహికగా వస్తున్న సాఫల్య యాత్రకు ముగింపు పలికాను. మిగతా ఏర్పాట్లు ముఖ్యంగా ప్రచురణకు అయ్యే ఖర్చును బేరీజు వేసుకున్న పిమ్మటనే ముద్రణ పని మొదలుపెట్టాను. అలా, మీరన్నట్లు ఆరేడు నెలలు ఆగాకనే రెండవ భాగం తీసుకురాగలిగాను. ఈలోగా మొదటి భాగాన్ని పాఠకులకు అందజేయడంలోనూ, రెండవ భాగం పట్ల ఆసక్తి పెంచడం లోనూ సఫలీకృతుడనయ్యాను. పత్రికల్లో వచ్చిన రివ్యూలతో పాటుగా పర్సనల్‌గా వినూత్న రీతిలో పుస్తకం విలువను, రచనలోని ప్రత్యేకతలను తెలియజేస్తూ తరచుగా ఫేస్‌బుక్, వాట్సప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టాను. ఫలితం సంతృప్తిని ఇచ్చిందనే చెప్పాలి.

ఇక, కవర్ పేజీలో ముఖ్యంగా బొమ్మలో పెద్దగా మార్పులు చేయలేదు. కవర్ పేజీని తయారు చేసిన ప్రముఖ చిత్రకారులు భమిడిపల్లి నరసింహారావు (బ్నిం) గారు కలర్ కాంబినేషన్‌లు మార్చి రెండవ భాగం కవర్‌ని సిద్ధం చేశారు. అప్పుడు ఆయనో మాట అన్నారు – “మొదటి భాగం కవర్‌లో టైటిల్ ఎలివేట్ అయింది, ఈ రెండవ భాగం కవర్‌లో మీరు ఎలివేట్ అయ్యారు” అని.

ఇమేజస్ వాడటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. క్వాలిటీకి ప్రాధాన్యం ఇస్తూనే మరో ప్రక్క కేవలం నా జీవనయాత్రకు సంబంధించిన ఫొటోలే కాకుండా ఇంతకు ముందు చెప్పినట్లు నన్ను ప్రభావితం చేసిన వారి ఫోటోలకు కూడా తగు స్థానం కల్పించే ప్రయత్నం చేశాను. ఉదాహరణకు ‘దనా ధన్’ అన్న చాప్టర్‌లో సీవీఎన్ ధన్ గారి ఫోటో వాడాను, అలాగే ‘గోవిందా..గోవిందా’ అన్న చాప్టర్‌లో తిరుపతిలోని ‘భీమాస్ హోటల్’ ఫౌండర్ కె.ఆర్. వెంకటాచలం గారి ఫోటో, అదే చాప్టర్‌లో ఐఏఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్ గారి ఫోటో,  అలాగే వారు వ్రాసిన ‘సర్వ సంభవామ్ – నహం కర్తా, హరిఃకర్తా’ పుస్తకం కవర్ పేజీ ఇమేజ్‌ని వాడాము. ఇంకో చోట నండూరి సుబ్బారావు గారి ఎంకి పాటల పుస్తకం కవర్ పేజీ.. ఇలా మరికొన్ని వాడాము. ఇవన్నీ సందర్భోచితంగా ఉండటంతో కేవలం రచయిత సొంత డబ్బా అనిపించకుండా అందర్నీ కలుపుకుపోతూ నాలుగైదు దశాబ్దాల సమాజ కథనంలా రచన సాగిపోతుంది.

ఇమేజ్‌ల ఎంపిక విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయం కూడా తీసుకున్నాను. మరీ ముఖ్యంగా చివర్లో ‘ఎలుక ఎగిరింది’ అన్న చాప్టర్‌లో వాడిన ఇమేజెస్ అన్నీ నా ఆలోచనలకు తగ్గట్టుగా మెటా ఏఐ తయారు చేసి ఇచ్చినవే. అందుకు మెటా ఏఐకి కృతజ్ఞతలు. ఈ చాప్టర్ రచనే ఓ విశిష్టతను సంతరించుకుంది. విదేశీ యాత్ర విశేషాలు చెప్పడం రచయితగా నా ఉద్దేశం. కానీ ‘నేను అది చూశాను, ఇది చూశాను..’ అంటూ వ్రాస్తూ, చూసిన వాటి ఫోటోలను పెడితే రొటీన్ రచనే అవుతుంది. అందుకే కొత్త పంథా ఎంచుకున్నాను. ఎలాగో నా రచనలో ఎలుక అంటే రచయితే అన్న ముద్రను మొదటి నుంచి తీసుకువచ్చాను. మొదటి చాప్టర్ పేరే ‘ఎలుక పుట్టింది’. అలా మా బామ్మ అన్న మాటలతో మొదలుపెట్టాను. మొదటి భాగం చివర్లో ‘ఎలుక మళ్ళీ పుట్టింది’ అని శీర్షిక పెట్టి ఓపెన్ హార్ట్ సర్జరీతో పునర్జన్మ ఎత్తానంటూ ఆ విశేషాలు చెప్పి మొదటి పుస్తకాన్ని ముగించాను. ఇక రెండవ భాగం మొదట్లోనే ‘సింహం నవ్వింది’ అన్న శీర్షికన రచన కొనసాగిస్తూ, ఒక ఎలుక పిల్ల సింహం బోనులోకి ప్రవేశించడం (ఇక్కడ ఎలుక రచయిత అయితే, సింహం ఈనాడు సంస్థ యజమాని రామోజీరావు గారు) ఉద్యోగం తెచ్చుకోవడం వంటి విశేషాలు వ్రాశాను. కాబట్టి అప్పటికే బాగా ఎస్టాబ్లిష్ అయిన ఎలుకను తీసుకుంటూ – ‘ఎలుక ఎగిరింది’ – అన్న శీర్షికతో రచయితగా నేను నా విదేశీ యాత్ర విశేషాలు చెప్పాను. ఈ చాప్టర్‌లో ఎక్కడా నా విదేశీయాత్ర విశేషాలను నేరుగా ప్రస్తావించ లేదు. నాటకీయత జోడిస్తూ ఇందాక చెప్పినట్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నా ఊహాశక్తికి తగ్గట్టుగా బొమ్మలు సేకరించి వాడానన్న మాట. దీంతో ఈ చాప్టర్ రచనకి కచ్చితంగా పిన్నపెద్దా కనెక్ట్ అవుతారన్న నమ్మకం నాకుంది. అలాగే ‘షిర్డీ పాదయాత్ర మహిమ’ గురించి వ్రాస్తూ అందుకు తగ్గ ఇమేజ్ ఎంపిక విషయంలోనూ శ్రద్ధ తీసుకున్నాను. ఈ రెండు చాప్టర్స్ చదువుతున్న పాఠకుడు తాను పుస్తకం చదువుతున్న వ్యక్తిగా కాకుండా తన రూపాన్నే అందులో చూసుకుంటూ లీనమైపోతాడు. జీవనరాగాలు రెండులో ఇవి విశిష్టమైన చాప్టర్స్.

ప్రశ్న 3. ట్రైనీ జర్నలిస్టుగా ఉండగా, పతంజలి గారితో ఎదురైన మరో చక్కటి అనుభవం, ఈ పుస్తకంలో చెప్పనిది ఏదైనా ఉందా? ఉంటే పాఠకులతో పంచుకుంటారా?

జ: పతంజలి గారి కలానికి ఎంత పదునో, ఆయన మనసు నవనీతం. ఎవ్వరినీ నొప్పించని మనస్తత్వం వారిది. నా కెరీర్ లో రెండు సందర్భాల్లోనే నేను వారిని కలుసుకోగలిగాను. మొదటిది ఈనాడు సంస్థలో వారు నాబోటి ట్రైనీలకు శిక్షణ ఇచ్చినప్పుడు. రెండవది – ఆంధ్రప్రభ యాజమాన్యం మారినప్పుడు పతంజలి గారు చేరడంతో వారితో కలిసి పనిచేయగలగడం. చిన్న ఉద్యోగులు తప్పు చేసినప్పటికీ చాలా సున్నితంగా చెప్పేవారు. పతంజలి గారే కాదు నా కెరీర్‌ని మలచిన మరి కొంత మందిని కూడా ఈ రెండవ భాగంలో గుర్తుచేసుకున్నాను. వారిలోని విశిష్ట గుణాలను తెలియజెప్పే ప్రయత్నం చేశాను.

ప్రశ్న 4. ఎమ్‌సెట్ కోచింగ్ కోసం గుంటూరులో రవి కాలేజ్‌లో చేరాకా, సివిఎన్ ధన్ గురించి చెబుతూ “ఆయన ఎడ్యుకేషన్ ఫిలాసఫీని బాగా అర్థం చేసుకున్న మనిషి” అని అన్నారు? ఎలా? మరింత వివరిస్తారా?

జ: సివిఎన్. ధన్ గారి ఆలోచన అంతా తన వద్ద కోచింగ్ తీసుకున్న విద్యార్థి రేపు డాక్టరో లేదా ఇంజనీర్ కావచ్చు, లేదా కాకపోవచ్చు, కానీ ఆ విద్యార్థి సమగ్రమైన రీతిలో వ్యక్తిత్వ వికాసం అలవరుచుకోవాలి. క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవడంలో ఈ కోచింగ్ ఉపయోగపడాలన్నదే. విద్య అంటే కేవలం ఉద్యోగం కోసం కాదు, సరైన వ్యక్తిగా సమాజంలో నిలబెట్టడం కోసమే విద్యను అభ్యసించాలి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా ఇదే మాట చెప్పేవారనీ. మనిషిగా నిన్ను నిలబెట్టలేని విద్య వ్యర్థమని మహాత్మాగాంధీ అంటుండేవారని నేను చదువుకున్నాను. ఇదే మాటలు ధన్ గారు కూడా చెబుతుండేవారని వారి సోదరుడు సి.ఎస్. రామచంద్రమూర్తి గారు తాను వ్రాసిన ‘ధన్యాత్ముడు – సివిఎన్ ధన్’ అన్న పుస్తకంలో పేర్కొన్నారు. విద్య అన్నది ఒక మనిషికి ఆనందకరమైన జీవితాన్ని అందించే సాధనం. అతనిలో సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, తత్వ చింతన అన్నీ సమపాళ్లలో కలిగేలా చేసేదే నిజమైన విద్య అని ధన్ గారు భావించేవారని నేను ఆంధ్రప్రభలో పనిచేస్తున్నప్పుడు సీనియర్ పాత్రికేయులు కందర్ప రామచంద్రరావు గారు చెబుతుండే వారు. నందిగామ దగ్గర్లోని ఓ పల్లె (రాఘవాపురం) నుంచి ఎదిగిన ధన్ గారు రూరల్ విద్యార్థులు సమగ్రమైన విద్యను అభ్యసించాలని తపించేవారు. వారిలో కొందరినైనా డాక్టర్లుగా ఇంజనీర్లుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో గుంటూరులో ఎంటెన్స్ కోచింగ్ సెంటర్‌ని ఓపెన్ చేశారు.

ప్రశ్న 5. టెనెంట్‍ని కరిచిన ఓనర్ ఉదంతం కాస్త హాస్యంగా అనిపించినా – ఓనర్ ఆనాటి పరిస్థితి ఏమితో తెలుసుకోవాలనిపిస్తుంది. ఆదాయం కోసం అద్దెల మీదే ఆధారపడిన వ్యక్తా? ఆనాటి ఆయన ప్రవర్తనని ఇప్పుడు విశ్లేషిస్తే మీకు – ఆయనలో అభద్రతా భావం ఏమైనా కనిపిస్తుందా?

జ: వ్యక్తి సమాజంలో ఒక భాగం. నేనే అధికుడిని, నా మాటే శాసనం అనుకునేవారి గురించి ప్రస్తావించాలనుకున్నప్పుడు టెనెంట్‌ని కరచిన ఓనర్ సంఘటన గుర్తుకు వచ్చింది. పైకి హాస్యంగా కనిపించినా ఇది నిజానికి సీరియస్ మేటర్. పైగా సమాజం హర్షించేది కాదు. టెనెంట్‌ని కరవడం అన్న సంఘటనలో అనేక కోణాలు ఉన్నాయి. మీరన్నట్లు అభద్రతా భావం, క్షణికావేశం, గర్వం.. ఇలాంటి ఎన్నో కోణాలు ఉండవచ్చు. అయితే నేను ప్రస్తావించిన ఓనర్ గారు సంఘంలో ఓ గౌరవమైన వృత్తిలో ఉన్నారు. పైగా ఆస్తిపరులు. కాకపోతే ఇగోలు, అనుమానాలు, క్రమశిక్షణ పేరిట కక్షకట్టడాలు వంటి లక్షణాలు ఉండబట్టే ఆ రోజున అలాంటి సంఘటన జరిగి ఉండవచ్చు.

ప్రశ్న 6. ఠీవీగాఅధ్యాయం చదివాకా, మీ జనరేషన్, మా జనరేషన్ పిల్లల్లో ఉన్న naivete ఇప్పటి తరంలో మిస్సయినట్లు అనిపిస్తుంది. ఈ ‘Loss of Innocence’ కి కారణమేమిటంటారు? పిల్లలలో అంత ఎక్స్‌పోజర్ ఎలా సాధ్యమైందని మీరనుకుంటున్నారు?

జ: ఈ తరం వారిలో కూడా తెలివితేటలు బాగానే ఉన్నాయి. ఏది మంచీ, మరేది చెడు అన్న విచక్షణ దగ్గర కొంత మేరకు తేడాలు కనిపిస్తున్న మాట నిజమే. మా చిన్నప్పుడు తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఇంకా దగ్గరి బంధువులును ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించడం తక్కువే. అయితే జ్ఞానం విషయంలో మాత్రం ఇప్పటి వారికున్నంత మా తరం వారికి లేదన్నదీ వాస్తవమే. ఉన్న కొద్దిపాటి జ్ఞానంతో ఆనందంగా ఉండటం, ఇతరులను ఆనందంగా ఉంచగలగడంలో మా కాలపు పిల్లలం మెరుగ్గానే ఉండేవాళ్లం. అవన్నీ అమాయకపు రోజులు. ఇప్పుడు అది లేదు. పిల్లల్లో తెలుసుకోవాలన్న తపన ఉంటే చాలు, ఎన్నో సౌకర్యాలు, చిటికెలో తెలుసుకోగలిగే వ్యవస్థలు మరెన్నో ఉన్నాయి. అందుకే ఐదేళ్ల పిల్లవాడు కూడా ఇప్పుడు అమాయకంగా కనబడడు. వాడి ముందు మనమే అంటే నా బోటి వృద్ధులమే అమాయకంగా కనబడతాము. ఇదంతా కాలం తెచ్చిన మార్పు. ఈ మార్పును అర్థం చేసుకుని సాగిపోవాలి. అంతే.

ప్రశ్న 7. రికార్డుల మోతఅనే అధ్యాయంలో “ఓ సారి మా మామగారు (మన్నవ గిరిధర రావు గారు) ఇంటికి వచ్చినప్పుడు మా వాడు ఇంగ్లీష్ అక్షరాల గురించి చెబుతూ, ‘తాతా, ఇది ఐ అంటూ ములక్కాడ ముక్కనీ, ఇదేమో ఓఅంటూ టమోటాని చూపించాడు. వీడి తెలివితేటలకు తాతగారు మురిసిపోయారు. ఆ తర్వాత చాలాకాలానికి నేను నా మనవళ్ల తెలివితేటలు చూస్తూ ఇప్పటికే అనేక సార్లు మురిసిపోయాను” అని రాశారు. ఇక్కడ మీ మామగారి తరానికీ, మీ తరానికి – మనవల విషయంలో మారని ఆ ఇదిఏది? వివరిస్తారా? పై ప్రశ్నతో పోల్చుకుంటే, పిల్లలలో వచ్చిన మార్పు – పెద్దలలో రాలేదు. ఎందుకని? దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి?

జ: ఇందాక నేను చెప్పినట్లు, కాలం తెచ్చిన మార్పుని అర్థం చేసుకోవాలి. ఒక వేళ ఆ మార్పు సమాజానికి మంచిది అని విశ్వసించినప్పుడు కచ్చితంగా పెద్దలు మారాలి. పిల్లల్ని ప్రోత్సహించాలి. మేము మారం అని భీష్మించుకుని కూర్చొంటే వెనకబడిపోతాము. ఇక తెలివితేటలు అప్పుడూ ఉన్నాయి, ఇప్పటి తరం వాళ్లకీ ఉన్నాయి. అయితే అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలను వినియోగించుకునే విషయంలోనే నేటి పెద్దలు పిల్లలకు గైడ్ చేయాలి. పెద్దల గైడెన్స్ లేకపోతే పిల్లల్లో మానసిక పరివర్తన ఎంత దుర్భరంగా తయారవుతున్నదో వార్తల్లో చూస్తూనే ఉన్నాం కదా.

ప్రశ్న 8. ఘంటసాల భగవద్గీత మిమ్మల్ని ఆకట్టుకున్న విధానం గురించి చెబుతూ, నాటకీయత జోడించి శ్లోకాలు పాడి మెప్పించారని అన్నారు. ఏ శ్లోకం లేదా ఏ అధ్యాయం వద్ద మీకు నాటకీయత బాగా తెలిసింది? వివరించండి.

జ: ఘంటసాల మాష్టారి పాటలంటే నాకెంతో అభిమానం. మరీ ముఖ్యంగా భగవద్గీత. ఘంటసాల గారి భగవద్గీత వింటుంటూ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి రూపాలు కళ్లెదుట కనిపిస్తాయి. శ్లోకాలు వాటి కోసం ఎంపిక చేసుకున్న రాగాల సంగతి అటుంచితే శ్లోక భావాన్ని వచన రూపంలో చెప్పేటప్పుడు ఘంటసాల మాష్టారి గొంతులో నాటకీయత స్పష్టంగా కనబడుతుంది. శ్రీకృష్ణుడికి అర్జునుడికి మధ్య స్వరబేధం చూపించడం, హెచ్చు తగ్గులు స్పష్టంగా వినబడేలా చూడటం నాకెందుకో నచ్చింది. ఘంటసాల మాష్టారి భగవద్గీత – ఒక రూపకంలా సాగుతుంది. భగవానుడు ప్రదర్శించిన విశ్వరూపాన్ని చూసిన అనంతరం అర్జునుడు పలికిన పలుకులు చాలా గంభీరంగానూ ఒక క్లైమాక్స్ సీన్ చూస్తున్నట్లు ఉంటుంది. సినిమాల్లో ఇటు ఏఎన్నార్‌కీ, అటు ఎన్టీఆర్‌కి స్వరంలో తేడాలు చూపిస్తూ పద్యాలు , పాటలు పాడటంలో అలవాటుపడిన వారు కావడంతో సునాయాసంగా స్వరతేడా చూపించగలిగి ఉంటారేమో. అంతకు ముందు కొంత మంది గాయనీగాయకులు భగవద్గీత ఆలపించినా ఘంటసాల గారిది సక్సెస్ అవడంలో ఈ డ్రమటైజేషన్ కూడా ఉపయోగపడి ఉంటుందన్నది నా అభిప్రాయం.

ప్రశ్న 9. విద్యార్థి గానో, యువకుడిగా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నప్పుడో – అంతర్లీనంగా ఉన్న భక్తిభావన – నడివయసులోకి వచ్చేటప్పటికి ఎందుకు, ఎలా బహిర్గతమయింది? షిర్డీ సాయిబాబాపై గురి ఎలా కుదిరింది, ఆరాధ్య దైవం ఎందుకయ్యారు? (పుస్తకం ఇంకా చదవని వారిని దృష్టిలో ఉంచుకుని) వివరంగా చెప్పండి?

జ: ఈ ఇంటర్వ్యూ చదువుతున్న వారికి మందుగా ఒక చిన్న మనవి. దయజేసి పుస్తకాన్ని కొని చదవండి. రెండు భాగాలు తెప్పించుకుని చదవండి. సంచిక టీమ్ వారి అనుమతితో నా ఫోన్ నెంబర్ ఇక్కడ ఇస్తున్నాను. 9885292208. ఈ నెంబర్‌కి వాట్సప్ కాల్ చేసి కాపీలను బుక్ చేసుకోండి. జీవితం విలువ తెలిసేది కష్టాలు ఎదురైనప్పుడే అని ఎక్కడో చదివాను. ఇది నిజం అనిపిస్తున్నది. నా జీవితంలో ఎన్నో అనుకోని సంఘటనలు ఎదురైనప్పటికీ కష్టాలు కమ్ముకున్నప్పటికీ నాలోని ఆధ్యాత్మిక చింతన నన్ను వొడ్డున పడేసిందని బలంగా నమ్ముతున్నాను. ఇందుకు భగవద్గీత చదివి అర్థం చేసుకునే మార్గం ఒకటైతే, షిర్డీ సాయిబాబా వారి దర్శనం కోసం చేసిన పాదయాత్ర మరొకటి. మొదటిది ఘంటసాల వారి భగవద్గీత తరచుగా వినడం వల్లనూ, ఇంట్లోని పెద్దల నోట భగవద్గీత శ్లోకాలు వినడం వల్లనూ ఎంచుకున్న మార్గం. కాగా, షిర్డీ బాబావారి పట్ల గురి కుదరడం, వారి దర్శనం కోసం తపించడమన్నది నా శ్రీమతి వల్ల కలిగిన ప్రేరణ.

ప్రశ్న 10. ఆంధ్రప్రభ ఆఫీసు గురించి చెబుతూ, “అది కేవలం ఒక ఆఫీసు కాదు. నడవడికను తీర్చిదిద్దిన పాఠశాల” అని వ్యాఖ్యానించారు. ఆ సంస్థ మీ మీద అంత బలమైన ముద్ర వేయడానికి కారణమైన కొన్ని ఉదంతాలను పేర్కొంటారా?

జ: ఆంధ్రప్రభ దినపత్రిక గురించి చెప్పుకొనేటప్పుడు పాత యాజమాన్యం లోని ఆంధ్రప్రభ, కొత్త యాజమాన్యంలోని ఆంధ్రప్రభ అని రెండు కోణాల్లో చూడాలి. కార్యాలయాల పనితీరు పరంగా నాకు ఎక్కువ అనుబంధం పాత యాజమాన్యంలోని ఆంధ్రప్రభతోనే. అది కూడా విజయవాడ పూర్ణానందం పేటలోని కార్యాలయంతోనే. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రభ రెండూ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ పేపర్సే కావడంతో ఒకే ఆవరణలో ఉండేవి. ఉద్యోగుల సంఖ్య 400 దాకా ఉండేది. కార్మిక సంఘాల యాక్టివిటీస్ కూడా చురుగ్గా ఉండేవి. ఎవరు ఏ యూనియన్ క్రింద ఉన్నప్పటికీ అందరి మధ్య సాంస్కృతిక బంధం పటిష్టంగా ఉండేది. కల్చరల్ యూనియన్‌కి నేను కూడా కొంతకాలం కార్యదర్శిగా ఉన్నాను. ఉద్యోగులకు, వారి పిల్లలకు అనేక ఆటల పోటీలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించేవాళ్లం. ఇదో యజ్ఞంలా సాగేది. నాటకాలు, ఏకపాత్రలు, నృత్య ప్రదర్శనలతో ప్రతి ఉగాది నూతన ఉత్సాహం నింపేది. ఆ ఉత్సాహం మా మధ్య స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసేది. అటు కెరీర్ లోనూ, ఇటు మానవసంబంధాలు మెరుగుపరుచుకోవడం లోనూ ఆంధ్రప్రభ ఓ వ్యక్తిత్వ వికాస సూత్రాలు నేర్పే పాఠశాలలా ఉండేది. ఆంధ్రప్రభ విడిచిపెట్టిన తర్వాత మాలో చాలా మంది వేరే సంస్థల్లో పనిచేసినా ఆంధ్రప్రభ నేర్పిన పాఠాలతోనే చక్కటి ఎదుగుదల సాధించగలిగాము. అందుకే ఆంధ్రప్రభను మరచిపోలేము. మా పిల్లలు కూడా మరిచిపోలేరు. ఎందుకంటే ఆంధ్రప్రభ ఆవరణలో ఏటా సాగిన ఉగాది వేడుకల్లో పిల్లలు ఎన్నో బహుమతులు అందుకున్నారు. వారంతా ఇప్పుడు డాక్టర్లు, ఇంజనీర్లు..ఇంకా వివిధ గౌరవప్రదమైన హోదాల్లో పనిచేస్తున్నారు. ఆనాటి ఉద్యోగులమైన మేము వృద్ధాప్యంలోకి అడుగుపెట్టి ఉండవచ్చు. కానీ ఆంధ్రప్రభ ఇచ్చిన ఎనర్జటిక్ టానిక్ ఇప్పటికీ మాలో ఉత్సాహం నింపుతూనే ఉంటుంది. అందుకే మేమంతా ఆంధ్రప్రభకి ఋణపడి ఉంటాము.

ప్రశ్న11. చీకటిలో వెలుగుఅధ్యాయంలో ప్రస్తావించిన ఎ అడ్వెంచరస్ టూర్ ఇన్ ద డార్క్గురించి మరింత వివరిస్తారా? ఓ అద్భుతమైన రూపకం రచనకి దోహదం చేసిన అప్పటి అ క్షణాలు, ఆ జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటారా?

జ: చీకటిలో నడక, పరిసరాల పట్ల అవగాహన, అంధుల జీవితాలను సరైన కోణంలో అర్థం చేసుకోవడం – ఈ కాన్సెప్ట్‌తో రూపకల్పన చేసిన షో – ‘చీకట్లో సాహస యాత్ర’. అంధుల జీవితాలను అర్థం చేసుకోవాలంటే మనం కాసేపు చీకటిలోకంలో ప్రయాణించాలన్న అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. హైదరాబాద్ లోని ఇనార్బిట్ మాల్ కాంప్లెక్స్‌లో ఇలాంటి ఎడ్వంచెరస్ షో ఏర్పాటు చేశారని తెలుసుకుని తరంగా టీమ్ తో అక్కడికి వెళ్ళివచ్చాక – ‘చీకట్లో వెలుగు’ అన్న పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని సరిగా దీపావళి రోజున ప్రసారం చేశాను. ఈ షోకి ఇందాక ప్రస్తావించిన ఎడ్వెంచరస్ షోలో పాల్గొన్న అంధులను స్డూడియోకి పిలిపించాము. ఇదో ప్రయోగాత్మక కార్యక్రమం. మంచి ప్రశంసలు అందుకుంది.

ప్రశ్న12. మనలోని టాలెంట్ సబ్జెక్ట్ మీద కాదు, అది ఎంత ఇంటరెస్టింగ్‌గా చెప్పామనే దానిలోనే” అని అన్నారో అధ్యయంలో. బహుశా ప్రతి రచయితకీ వర్తించే వాక్యాలివి. మీ మొత్తం కెరీర్‍లో ఈ టెక్నిక్ ఎలా ఉపకరించిందో, పుస్తకంలో లేని ఉదాహరణల ద్వారా వివరిస్తారా?

జ. ఈ లక్షణం కేవలం రచనలోనే కాదు, మన కెరీర్ ని అందంగా తీర్చిదిద్దుకోవడంలో కూడా సహకరిస్తుంది. అందరికీ తెలిసిన విషయాలే అయినా మనం ఎలా ప్రెజెంట్ చేస్తామన్న అంశం మీదనే మన సక్సెస్ ఆధారపడుతుంది. ఉదాహరణకు ప్రపంచ క్రికెట్ చరిత్రను సీరియల్ గా  వ్రాస్తున్నప్పుడు క్రికెట్ అందరికీ తెలిసిన ఆటే, అయినా వారం వారం చదివించేలా ఆసక్తికరంగా వ్రాయాడం ముఖ్యమని ఆనాడే (80వ దశకంలో) తెలుసుకున్నాను. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఈ జీవనరాగాలు పుస్తకం వ్రాస్తున్నప్పుడు కూడా అదే సూత్రం పాటించాను. మీకు తెలుసు, నేనేమీ కొత్త విషయాలు చెప్పలేదు. మనలో చాలా మందికి తెలిసినవి, అనుభవైకమైనవే ఈ పుస్తకంలో ప్రస్తావించాను. అయితే, ఆసక్తిగా చెప్పడం వల్ల, నాటకీయత జోడించడం వల్ల పాఠకుడు దృష్టి మరల్చకుండా చదివేలా చేయడంలో సఫలీకృతుడను అయ్యాననే అనుకుంటున్నాను. ఏ రచన అయినా పాఠకుడు స్పందించాలి. అలా కాని పక్షంలో అడవిలోని ఫల వృక్షమే అవుతుంది.

ప్రశ్న13. మీ ఆత్మకథ రెండు భాగాలుగా వెలువడి పాఠకులకు అందుబాటులోకి వచ్చిన సందర్భంలో, మొత్తం జీవితాన్ని పునశ్చరణ చేసుకుంటే బంధాలను నిలుపుకుని, బాధ్యతలను మోసి, ఆలంబనగా నిలిచి, దాదాపుగా విశ్రాంత జీవనంలోకి అడుగుపెట్టారు కదా, మీ జీవితం సఫలమైన అనుభూతి కలిగిందా? లేక ఇంకా సాధించాల్సింది ఏదైనా ఉందని అనుకుంటున్నారా?

జ: విశ్రాంత జీవనంలోకి అడుగుపెట్టిన నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. కష్టసుఖాలు ఒకదాని వెంట మరొకటి వస్తుంటాయి. కష్టానికి భయపడకుండా ఎదురీదితే సుఖం మన చెంతకు వస్తుంది. నా జీవిత సాఫల్య సూత్రం ఇదే. అన్నింటా విజయం ఎవ్వరికీ దక్కదు. కానీ ప్రతి పనిలో విజయం సాధించాలన్న తపన ఆగకూడదు. విశ్రాంతి జీవనంలో ఇంకా సాధించాల్సినవి చాలానే మిగిలి ఉన్నాయి. చివరి శ్వాస వరకు సమాజానికి మంచి చేకూర్చే పనులు చేస్తూనే ఉంటాను. అందుకే ఈ మధ్య ‘తుర్లపాటి సాంస్కృతిక – విజ్ఞాన కేంద్రం’ ఏర్పాటు చేశాను. ఈ సంస్థ తరఫున వివిధ రంగాల్లోని ప్రతిభామూర్తులకు పురస్కారాలు అందజేద్దామని అనుకుంటున్నాము. అంతే కాదు, నాలాగానే విశ్రాంత జీవనం గడుపుతున్న వారి ఆలోచనలను డిజిటలైజ్ చేసే పని మొదలుపెట్టాను.

ప్రశ్న14. రచయితగా సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటో వెల్లడిస్తారా?

జ: కొన్ని ఆలోచనలు ఉన్నాయి. జీవనరాగాలు మొదటి భాగం ప్రతులు చూసిన వారిలో కొంత మంది దీన్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేయాలని సలహా ఇచ్చారు. అందుకే ఇప్పుడు ఆ ప్రయత్నంలో ఉన్నాను. ముందుగా మొదటి భాగాన్ని ఇంగ్లీష్ అనువాదం తీసుకువచ్చే పని ప్రారంభించాము. ఇప్పటికే తొమ్మిది భాగాల రచనను ఇంగ్లీష్ లోకి అనువదించగలిగాను. నేను రఫ్ తయారు చేస్తున్నాను. ఆంగ్ల భాషలో అధ్యాపకురాలిగా ఉన్న కస్తల సత్య సుధ గారు తుది మెరుగులు దిద్దుతానని హామీ ఇచ్చారు. బహుశ 2026 జనవరి నాటికి ఆంగ్ల అనువాద పుస్తకం మొదటి భాగం పాఠకుల చేతికి అందవచ్చు. ఇక, ఆధ్యాత్మిక చింతనతో కూడిన పుస్తకం ఒకటి తీసుకురావాలనుకుంటున్నాను. ‘దర్శనం – ఆధ్యాత్మిక స్వీయ అనుభవాల మాలిక’ పేరిట ఈ పుస్తకం ప్రచురిస్తాను. ‘తుర్లపాటి సాంస్కృతిక – విజ్ఞానకేంద్రం’ ప్రచురణకర్తగా ఉంటుంది. నేను వ్రాసిన వ్యాసాలతో పాటుగా ఓ ఇరవై మంది రచయితల నుంచి ఆధ్యాత్మిక వ్యాసాలు సేకరించి సంకలనంగా తీసుకురావాలన్నది నా ఆలోచన.

అలాగే, తెలుగు సినిమా పాటలతో వ్యక్తిత్వ వికాస సూత్రాలను మిళితం చేస్తూ రచన చేయాలనుకుంటున్నాను. ఇంకా మరి కొన్ని ఆలోచనలు.. తెలుగు సినిమాకు పట్టాభిషేకం, మొక్కలు చెప్పే జీవిత సత్యాలు వంటి అంశాలపై రచనలు చేయాలనుకుంటున్నాను. నా ఆలోచనల్లో ఎన్ని కార్యరూపం దాలుస్తాయన్నది బెజవాడ కనకదుర్గ అమ్మవారి కరుణాకటాక్షాల మీదనే ఆధారపడి ఉందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు తుర్లపాటి నాగభూషణ రావు గారూ.

తుర్లపాటి నాగభూషణ రావు: ‘సంచిక’ వెబ్ వీక్లీలో నా ఇంటర్వ్యూ రావడం నాకూ ఆనందంగా ఉంది. అందుకు మీకు కృతజ్ఞతలు.

***

జీవనరాగాలు-2 (స్వీయచరిత్ర)
రచన: తుర్లపాటి నాగభూషణ రావు
పేజీలు: 284
వెల: ₹ 355/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్,
కాచీగుడా,
హైదరాబాద్
రచయిత: 9885292208

 

 

 

~

జీవనరాగాలు-2 సమీక్ష:
https://sanchika.com/jeevana-raagaalu-2-book-review-kss/

Exit mobile version