[‘వ్యాస రత్నాకరము’ అనే మూడు భాగాల పుస్తకం వెలువరించిన శ్రీ తురగా కృష్ణ కుమార్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం తురగా కృష్ణ కుమార్ గారూ.
తురగా కృష్ణ కుమార్: నమస్కారం. మీ సాహిత్యాభిమానానికి ధన్యవాదాలండి.
~
ప్రశ్న 1. ‘వ్యాస రత్నాకరము’ అన్న వ్యాసాల సంకలనాలు ప్రచురించాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఆ ఆలోచనను ఎలా ఆచరణలో పెట్టారు?
వ్యాసాలు ఎలా సేకరించాలనే సందేహం వచ్చినప్పుడు ఆత్మీయులైన కొంతమంది సాహితీవేత్తల్ని సంప్రదించడం జరిగింది. వారి సూచనలు, సలహాలతో నాకు పరిచయస్థులు, ఆత్మీయులైన సాహితీమిత్రులు శ్రీ నారుమంచి అనంతకృష్ణశర్మగారు, శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడుగార్లను సంప్రదించాము. వారు కొంతమంది సంస్కృతాంధ్రల్లో నిష్ణాతులైన పండితుల్ని పరిచయం చేశారు. ఆయా పండితులతో మాట్లాడి వారికి నా నియమం తెలిపి వ్యాసాలు వ్రాసిమ్మన్నాము. అలా ఆచరణలో పెట్టగలిగాము.
ప్రశ్న 2: ఇందులో ఎలాంటి అంశాలపై ఎలాంటి వ్యాసాలుండాలని మీరు ఆశించారు? మీరు ఆశించిన రీతిలో వ్యాసాలు రాయగలవారిని ఎలా ఎంచుకున్నారు?
జ: వ్యాసాలు ప్రాథమికంగా సంస్కృతాంధ్రసాహిత్యం గురించినవై ఉండాలి. అదే సూచన చేయడం జరిగింది వ్యాసకర్తలకు.
నాకు పరిచయస్థులైన పండితుల్ని సంప్రదించి సంస్కృతాంధ్ర సాహిత్యంపై వారిచేత వారికిష్టమైన అంశం గురించిన వ్యాసం వ్రాయమని కోరాము. దానికి వారు సమ్మతించడంతో మాకు వ్యాసాలు సంకలనానికి మార్గం సుగమమైంది.
ప్రశ్న 3: ఒక సున్నితమైన ప్రశ్న.. ఒక వ్యాసం నాణ్యతను నిర్ణయించటానికి మీరు ఎలాంటి ప్రామాణికాలు ఏర్పాటు చేసుకున్నారు? మీ నిర్ణయాలను ఈ సంకలనాల్లో వ్యాసాలు రాసిన పండితులు ఎలా ఆమోదించారు?
జ: వీటిల్లో ప్రచురితమైన ప్రతి వ్యాసం ప్రామాణికమైన పండితులచేత సమీక్ష చేయించిన తర్వాత ముద్రణకి స్వీకరించడం జరిగింది. మాది కేవలం ఒకటే నిర్ణయం.. సంస్కృతాంధ్ర సాహిత్యంపై వ్యాసాలు కాబట్టి ప్రత్యేకంగా ఏ విధమైన ఆమోదాలు అవసరం లేకపోయింది.
ప్రశ్న 4: వ్యాసాల అంశాలు మీరు సూచించారా? లేక వ్యాసకర్తలే ఎన్నుకున్నారా? వారు ఎన్నుకున్న అంశాలతో మీరు విభేదించిన సందర్భాలున్నాయా? వుంటే మీ దృక్కోణాన్ని వారికి ఎలా వివరించారు?
జ: వ్యాసాలు పూర్తిగా వ్యాసకర్తల నిర్ణయమే! వాటితో మాకు ఎటువంటి విభేదాలూ లేవు.
ప్రశ్న 5: మీరు వ్యాస పుస్తకాలను ప్రథమ సంపుటం, ద్వితీయ సంపుటం ఇలా అన్నారు. సాధారణంగా ఒక రచయిత రచనల పుస్తకాన్ని సంపుటం అనీ, బహురచయితల రచనలను ఒకచోట చేర్చే పుస్తకాన్ని సంకలనం అనీ అంటారు. మీరీ పుస్తకాలను సంపుటం అనటంలో వేరే ఏదైనా పరమార్ధం వుందా? ఎందుకంటే, మీ పేరు సంకలనకర్త అని వుంది.
జ: సంపుటం లేదా సంకలనం ఎలా పేర్కొన్నా రచయితలకు అభ్యంతరం లేనంతవరకూ పరవాలేదనిపించి సంపుటం అని పేరు పెట్టాము. అంతేగాని ప్రత్యేకంగా పేరు గురించి దృష్టిపెట్టలేదు.
ప్రశ్న 6: పై ప్రశ్నకు కొనసాగింపుగా.. సంపుటి అంటే, క్రమం ప్రకారం వెలువడే పత్రిక అన్న అర్థం కూడా వస్తుంది. మీరు ఏ అర్థంలో వాడేరు?
జ: ప్రచురణ సంస్థ స్థాపించినప్పుడు ముందుగా ఒక ముద్రిత సాహిత్య పత్రిక ప్రారంభించాలనుకున్నాము. అది అత్యంత వ్యయప్రయాసలతో కూడిన పని అనిపించింది. కనీసం అంతర్జాల పత్రికగా రూపొందిద్దామనుకున్నాము. అదికూడా అత్యంత ప్రయాసతో కూడిన పని అని మీలాంటివారిని చూశాక అనిపించింది. అందుకే ఇలాంటి సంపుటాలు సంకలనాలు ముద్రిస్తే ఆ ముచ్చట తీరుతుందనిపించి అలా పెట్టాము.
ప్రశ్న 7: వ్యాసాల సూచీలో ఏ వ్యాసం ఎవరు రాశారో తెలుస్తుంది. కానీ, వ్యాసం ప్రచురించేప్పుడు వ్యాస రచయితల పేర్లు ఇవ్వలేదు? ఎందుకని??
జ: వ్యాసం ప్రచురితమైన ప్రతీ పేజీలోనూ క్రింద వ్యాసకర్త పేరు ముద్రించాము.
ప్రశ్న8: ఇప్పటికి మూడు ‘వ్యాస రత్నాకరము’ పుస్తకాలు ప్రచురించారు. ఇంకా ఇలాంటి వ్యాస రత్నాకరాలు ప్రచురించే ఉద్దేశం వుందా? ఇలా ఎన్ని ప్రచురించాలనుకుంటున్నారు? ఏయే అంశాల ఆధారంగా వ్యాసాలు రాయించాలనుకుంటున్నారు?
జ: ప్రాథమికంగా సంస్కృతాంధ్ర సాహిత్యం గురించిన వ్యాసాలు ఇంకా సంకలనం చేయాలని ఉంది. చేస్తాము. చేస్తూ ఉంటాము.
ప్రశ్న 9: సమకాలీన సమాజంలో ప్రాచీన కావ్యాల ప్రాసంగిత ఎంతవరకూ వున్నది? ప్రాచీన సాహిత్యానికి దూరమవటంవల్ల యువతరం మీ దృష్టిలో ఏయే విషయాల్లో నష్టపోతున్నది?
జ: ప్రాచీన సాహిత్యానికి సమకాలీన సమాజంలో ఆదరణ ఇంకా ఉన్నది. కాకపోతే అది సాహిత్యాన్ని అధ్యయనం చేసే విద్యార్థులు, అధ్యాపకులు ఆదరిస్తున్నారు. ఆదరిస్తూనే ఉంటారు.
ప్రాచీన సాహిత్యాన్ని యువతరం చదవకపోవడంవలన వారు చేస్తున్న లేకపోతే చేయబోయే రచనల్లో రసపోషణ అనేది కోల్పోతున్నారు.
ప్రశ్న10: ఈ పుస్తకాల ప్రచురణలో మీ టార్గెట్ పాఠకులు ఎవరు? వారిని మీరు చేరేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
జ: మేము ప్రధానంగా సంస్కృతాంధ్ర సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలే ముద్రించాలని అనుకున్నాము కాబట్టి మాకు కేవలం అధ్యాపకులు, సాహిత్యాధ్యయనం చేసే విద్యార్థులే మా పాఠకులు ప్రస్తుతానికి. కాబట్టి వారిని చేరడంకోసం అంటూ ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందిచుకోలేదు. ఈ వ్యాససంపుటాలు కూడా అలాగే సంస్కృత సాహిత్యం అధ్యయనం చేసే విద్యార్థులు, అధ్యాపకులకు సంతృప్తికరంగా చేరాయి.
ప్రశ్న11. మొదటి సంపుటంలో వ్యాసాల నిడివి చిన్నగా వుంది. కానీ, మిగతా రెండు సంపుటాల్లో వ్యాసాల నిడివి అధికంగా వుంది. ఇది అనుకుని చేసిందా? లేక, రచయితల వ్యాసాలను అనుసరించి జరిగిందా?
జ: నిడివి కేవలం రచయితల రచనలకు అనుసరించే జరిగింది.
ప్రశ్న12. మీరు మొత్తం వ్యాసాలు రాయించి మూడు భాగాలుగా విభజించారా? లేక, ఈ భాగంలో ఈ వ్యాసాలుండాలని నిర్ణయించుకుని అలా రాయించారా?
జ: వ్యాసాలు వ్రాయించిన తరువాత పేజీలు చూసుకుని, అప్పుడు విభాగం చేయడం జరిగింది.
ప్రశ్న13. రెండవ సంపుటంలో కవి కాళిదాసు గురించిన వ్యాసం ప్రధానంగా కాళిదాసు శ్లోకాల వివరణ కన్నా అర్థం చెప్పటంపైనే దృష్టి సారించింది. కానీ, ఇప్పటికి అనేక అనువాదాలున్నాయి కాళిదాసు కావ్యాలకు. ఏరకంగా ఈ వ్యాసం ఇతర రచనలకు భిన్నం?
జ: ఇది భిన్నంగా ఉంది లేదా ఇది ప్రత్యేకమైనది అనే దృష్టికోణంతో చూడకుండా వివిధ రకాలైన వ్యాసాలు వ్రాయించాలి కాళిదాసు గురించి అనే ఆలోచనతో వ్రాసినదే ఆ వ్యాసం.
ప్రశ్న14. మొదటి పుస్తకంలోనూ కాళిదాసు గురించిన వ్యాసాలు వున్నాయి. రెండవ పుస్తకం మొత్తం కాళిదాసు గురించే.. మిగతా అందరి గురించీ ఒకటో రెండో వ్యాసాలున్నాయి. చివరికి వాల్మీకి గురించి కూడా ఒకటే వ్యాసం వుంది. కాళిదాసుకింత ప్రాధాన్యం ఇవ్వటం వెనుక ఏదైనా ప్రత్యేక కారణం వుందా?
జ: ప్రత్యేకమైన కారణం అంటే ఒకటే! కాళిదాసు కవికులతిలకుడు.. కాబట్టి అలా వ్రాయించడం జరిగింది. ఇంకా కొన్ని వ్యాసాలు కేవలం కాళిదాసు గురించే వ్రాయిద్దామనుకున్నాం. కానీ మిగిలిన కవుల సాహిత్యానికి గురించిన వ్యాసాలు వ్రాయించడం ఆలస్యమవుతుందని అక్కడితో అలా ఆపవలసి వచ్చింది.
ప్రశ్న15. మీ ‘తురగా ప్రచురణాలయం’ గురించి చెప్తారా? లక్ష్యాలూ, ఉద్దేశాలూ వివరిస్తారా? అలాగే ఇంతవరకూ మీరు ప్రచురించిన పుస్తకాల వివరాలూ చెప్తారా?
జ: మా తాతగారు కీ. శే. తురగా కృష్ణమూర్తిగారు చేసిన సాహిత్యసేవ జ్ఞాపకార్థం ఈ సంస్థ ఏర్పాటు చేశాము.
సంస్కృతాంధ్ర సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలు, అంటే పద్యకావ్యాలు, వ్యాఖ్యానాలు, అనువాదాలు వగైరా ముద్రించడమే ప్రాథమిక లక్ష్యం.
సంస్థ ఏర్పాటు చేయకముందు సహస్రావధాని డా. కడిమిళ్ళ వరప్రసాద్‌గారు రచించిన గోభాగవతము పద్యకావ్యం, సంస్థ ఏర్పాటు చేశాక గణపతి – గఱికపూజ అనే కథ, శ్రీ కడిమిళ్ళ రమేష్ రచించిన పట్నాల బ్రతుకు అనే పద్యకావ్యం, శ్రీ అక్కిపెద్ది రామసూర్యనారాయణగారు రచించిన ఆత్మబోధ అనే పద్యకావ్యం, సహస్రావధాని డా. కడిమిళ్ళ వరప్రసాద్‌గారు రచించిన తప్పుకాదు!? పద్యకావ్యం, శ్రీ జీడిగుంట విజయసారథిగారు రచించిన ప్రాచీనాంధ్రసాహిత్యంలో శ్రీ విఘ్నేశ్వరస్తుతిపద్యాలు అనే వ్యాససంపుటం, వ్యాసరత్నాకరము మూడు సంపుటాల వ్యాసాలు, శ్రీ బేతవోలు రామబ్రహ్మంగారి సంపాదకత్వంలో శ్రీమద్రామాయణ కల్పవృక్షము – ఉదాత్తకల్పనలు శీర్షికన ఆరు వ్యాసాలు సంపుటం, డా. మాడుగుల అనిల్‌కుమార్‌గారు రచించిన కొన్ని వ్యాసాలు ఒక సంపుటంగా ముద్రించాము ఇప్పటివరకు.
ప్రశ్న16. మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?
జ: సంస్కృతాంధ్ర సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలు, అంటే పద్యకావ్యాలు, వ్యాఖ్యానాలు, అనువాదాలు, నాటకానువాదాలు వగైరా ముద్రించాలి.
ప్రశ్న17. మీ ప్రచురణలను కేవలం ప్రాచీన సాహిత్యానికే పరిమితం చేస్తారా? ఇతర అంశాలకు విస్తరిస్తారా?
జ: ప్రధానంగా ప్రాచీన సాహిత్యంపై ఎక్కువ పుస్తకాలు ముద్రించిన తరువాత ఆధునిక సాహిత్యంపై దృష్టి సారిస్తాము.
వచన కవిత్వంపై ఆసక్తిలేదు.
కథలు/నవలలు స్వతంత్ర రచనలు, అనువాదాలు వంటివాటిపై కూడా ఆలోచన ఉన్నది, కానీ భవిష్యత్తులో.. అది కూడా ఇదే ప్రచురణ సంస్థ నుంచి చేయాలా లేక వేరే ప్రచురణ సంస్థ ఏర్పాటుచేసి ఆ పేరు మీద చేయాలా అనేది నిర్ణయం చేయాల్సి ఉంది.
~
సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు తురగా కృష్ణ కుమార్ గారు.
తురగా కృష్ణ కుమార్: సంచిక టీమ్‌కి నా ధన్యవాదాలు.
***
వ్యాస రత్నాకరము (సాహిత్య వ్యాస సంకలనం)
మూడు సంపుటాలు.
సంకలనకర్తః తురగా కృష్ణ కుమార్
మొదటి సంపుటం పేజీలు: -120, వెల: ₹ 150/-
రెండవ సంపుటం పేజీలు:101, వెల: ₹ 140/-
మూడవ సంపుటం పేజీలు: 92, వెల: ₹ 130/-
ప్రతులకు:
టీ వీ ఎస్ ఎస్ కృష్ణ కుమార్
ఎస్ బీ సీ ప్రిస్టైన్ ప్లేస్ అపార్ట్మెంట్
శ్రీ బాలాజీ లే ఔట్, గాజులరామారమ్
షాపుర్ నగర్, హైదెరాబాద్-500055.
Ph: 9908572598.
vssturaga@gmail.com
~
‘వ్యాస రత్నాకరము’ పుస్తక సమీక్ష
https://sanchika.com/vyasa-ratnakaram-three-volumes-review/