Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కథ, నవల, నాటక రచయిత శ్రీ శ్రీధర ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘చందమామ మసకేసిపోయే’ అనే కథాసంపుటి వెలువరించిన శ్రీ శ్రీధర గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం శ్రీధర గారూ.

శ్రీధర: నమస్కారం.

~

ప్రశ్న 1. చందమామ మసకేసిపోయె కథా సంపుటి ప్రచురించి నందుకు అభినందనలు. ఈ కథా సంపుటి లోపలి పేజీలో ఈ కధలున్నూ వాటంతట అవే రాలిపడిన పారిజాతాలుఅన్నారు. అంటే ఈ కథల ఇతివృత్తాలు అప్రయత్నంగా అలవోకగా పుట్టుకొచ్చాయా? వివరించండి.

జ: నా జీవితంలో రచయితగా నాకు రెండు దశలున్నాయండి. 1973 వరకూ – ఏడాదికోసారి పెట్టే దీపావళి కథల పోటీకి ఒకటి రెండు కథలు వ్రాసి పంపితే, ఏడాది దాకా ఇంకో కథ వ్రాయవలసిన అవసరం లేని పరిస్థితి ఉండేది. అది నాకు నేనుగా నడచిన కాలం. తరువాత కాలంలో పత్రికల వారు అడిగి నా చేత రాయించుకున్నారు. ఇది పత్రికలే నన్ను నడిపించిన కాలం. వారం తిరిగేటప్పటికి కొత్త కథ పదిలక్షలమంది పాఠకుల చేతికి చేరే పత్రికలో రాయవలసిన పరిస్థితి. అయినా సునాయాసంగానే రాశాను. అలా రాలిపడిన కథలలో నుంచి కొన్నిటిని ఈ సంపుటిలో అచ్చొత్తింప చేశాను. ఇందులోని వన్నీ పారిజాత సుమదళాలే. 25 ఆగస్టు 25వ తేదిన జరిగిన సభలో డా. రమణగారు ఇందులోని ‘మాట వరసకెపుడైనా అన్నానా’ – అనే కథను మొత్తం చూడకుండా అందులోని సంభాషణలతో చెప్పారు. అన్ని కథలూ ఆయన చదివారు. “పాతిక కథలనూ చెప్పగలనుగానీ, సమయం చాలదు” అని అన్నారు. ఇంత చెప్పాక కూడా నేనేమంటానంటే, కాకి పిల్లలు కాకికి ముద్దే కదా. నావన్నీ పారిజాతాలేనని నా ఊహ. లేదంటే పోనీ ఓ అపోహ అనుకోండి. ఇబ్బంది లేదు..

ప్రశ్న 2. మీ రచనా ప్రస్థానం ఏ ప్రక్రియతో మొదలైంది? ఎలా కొనసాగింది?

జ: నా రచనా ప్రస్థానం – వాతావరణ శాఖ వారి ప్రకటన లాంటిది. అప్పుడెప్పుడో చిన్నతనంలోన కథలు అనే వాయుగుండంతో మొదలై, తరువాత దిశ మార్చుకొని వచన కవిత్వం వైపు మళ్లి, మళ్లీ దిశ మార్చుకుని నాటికలు రాయటం వైపు పయనించి, మళ్ళీ దిశ మార్చుకుని తుఫాన్‌గా మారి నవలా ప్రక్రియ వైపు వెళ్లి విష్ణుప్రియ వ్యాసాలు వైపు సాగి, కొన..సాగి, చివరకు మళ్లీ కథా రచన దగ్గర తీరం దాటింది — వారం వారం ఓ కథ రాసేంత వేగంగా. 1970 దశకం మొదట్లో ఉదృతంగా వచన కవిత్వం రాశాను, ఒంటికి ‘ఉష్ణం’ చేసేంతగా. సెక్రటేరియట్ సాంసృతిక సంస్థ అంతర్-విభాగాల నాటికల పోటీల కోసం ప్రతి ఏటా ‘లా డిపార్ట్‌మెంట్’ పోటీ చేసేందుకు నాటికలూ రాశాను – ఇదీ 70, 80 దశకాల్లో.

ప్రశ్న 3. మీ మొదటి కథ ఎప్పుడు రాశారు? ఎప్పుడు ప్రచురితమైనది?

జ: మొదటి కధ నూనూగు మీసాల నూత్నయవ్వనంలో నుండగా తెనాలి మున్సిపల్ హైస్కూల్ వార్షిక పత్రిక బాలవాణిలో ఫిఫ్త్ ఫారంలో ఉండగా ‘నవ్వుకు నాలుగు అర్థాలు’ అనే కథ అచ్చయింది. ఆ తర్వాత జింబో నగర ప్రవేశం చేశాక 1964లో కృష్ణా పత్రికలో ‘తెలియని నిజం’ అనే కథ ప్రచురితమైంది. అప్పట్లో తెనాలి నుంచి ఏదో పని మీద హైదరాబాదు వచ్చిన మా పక్కింటి ప్లీడరు గారి అమ్మాయి శకుంతల నాంపల్లిలో ఉంటున్న మా ఇంటికి వెతుక్కుంటూ వచ్చింది. అచ్చయిన మొదటి కథ చూపించాను. నవ్వుతూ అన్నది “నువ్వు గొప్ప రైటర్ కావాలి” అని.. కభీ, కభీ..

ప్రశ్న 4. కథకుడిగా మీ ప్రయాణం గురించి చెప్పండి.

జ: కథలూ, కాకరకాయలూ – ఇవన్నీ మా ఇంటా వంటాలేని విషయాలు. మునిమాణిక్యం నరసింహారావుగారి రెండో అమ్మాయి విజయలక్ష్మి మా ఇంట్లో అద్దెకు ఉండేది. అందుచేత ఆయన సతీ సమేతంగా వచ్చేవాడు. రాత్రి పడుకునే ముందు చుట్టలు చుట్టుకునేవాడు. పైగా అనేవాడు, “ఆదిశేషువు, నేనూ, మేమిద్దరం పడుకునేముందు చుట్టలు చుట్టుకుంటాం” అని. అయితే ఈయనకు పొగాకు కాడలు తెచ్చి ఇచ్చేవాడిని. అంచేత కొంచెం చనువు. “నాకు కథలు రాయటం నేర్పరా?” అని అడిగితే ఆయన భార్య “కథలదేముంది? కోరింత దగ్గులాగా ఆపుకున్నా ఆగలేనట్లుగా వస్తయి. ముందు చుట్టలు తాగడం నేర్చుకో” అనేది.

ఆయనంత గొప్ప రైటర్ అయిపోవాలని ఉండేది. అంచేత తెల్ల కాగితాలతో ‘కేసరి’ అని ఒక వ్రాత మాసపత్రిక రాసి, ఏడాది పాటు ఇంటి దగ్గర ఉన్న రీడింగ్ రూంలో పెట్టేవాడిని. ఇది ప్రారంభ దశ.

హైదరాబాదుకు మకాం మారిన తరువాత 1970 దశకం ప్రారంభంలో నారాయణ గూడాలో దీపక్ మహల్ దగ్గరున్న కాకా హోటల్లో అప్పుడే కలాలు విదిలిస్తున్న ప్రవర్థమాన రచయితలు పది, పదిహేను మంది రోజూ కలుస్తుండేవాళ్లం. ఇందువల్ల రాయాలనే కోరిక బలపడేది.

అప్పట్లో శ్రీకృష్ణదేవరాయ గ్రంథాలయాల వేదికగా తరచూ కవి సమ్మేళనాలు జరిగేవి. జి.వి. సుబ్రహ్మణ్యంగారు అధ్యక్షులుగా నేను ఉపాధ్యక్షడీగా ‘నవోదయం’ అనే సంస్థ పెట్టి – ఇదే పని – కవిత్వం రాయటమే. సంక్రాంతి, ఉగాది, దీపావళి ‘అది ఇది’ అని లేదు.

నాకు పెళ్లి అయిన కొత్తలో అర్ఘరాత్రి దాకా కూర్చుని కవిత్వం రాసి, ఇది గొప్పగా వెలిగిపోతుందని కలలు కంటూ పడుకునే వాడిని. తెల్లారి లేస్తే, హాశ్చర్యం? నిజంగానే వెలిగిపోయేవి. పొద్దుటే మా ఆవిడ ఈ కాగితాలను బాయిలర్‌లో వేసి వెలిగించేది.

మరో పక్క నాటకాల పిచ్చి. సెక్రటేరియట్ కల్చరల్ అసోసియేషన్ అప్పట్లో పెద్ద సంస్థ. లక్షల్లో యఫ్.డి.లు ఉండేవి. కలెక్టర్లకు ఫోన్ చేసి జిల్లాలకు వెళ్లి అలెగ్జాండర్, అల్లూరి సీతారామ రాజు, మంచుకొండలు (పాక్ యుద్ధ సమయంలో) వంటి నాటకాలు వేసేవాళ్లం.

మరోపక్క ఇందిరా గాంధీ’ ట్వంటీ పాయింట్ ఫార్ములా’ మీద కవి సమ్మేళనం పెడితే మా యువ కౌస్ (కవులు) “అందరికీ రెండే సూత్రాలు, ఇందిరకు ఇరవై సూత్రాలు” అంటూ రెచ్చిపోయేవాళ్లు. ‘దేశం ముందడుగు వేస్తే’ అన్నదాని మీద సమ్మేళనం పెడితే, “దేశం చుట్టూ సముద్రం ఉంది, ముందడుగు వేస్తే ముందుగా మునిగేది మనమే” అంటూ ఎలుగెత్తి దేశ భక్తిని చాటి చెప్పిన రోజులవి.

1973లో ‘రాగవిపంచి’ నవలకు ఆంధ్రప్రభ వారపత్రిక మొదటి బహుమతి ఇచ్చింది. అప్పటి వరకూ వారపత్రికల వారు స్త్రీల నవలలకే బహుమతులిచ్చేవారు. అందుచేత అక్కసుకొద్దీ మేము వాటిని ‘వారకాంత’ పత్రికలని తిట్టుకునేవాళ్లం. అయితే ఆ సంవత్సరం ముగ్గురూ ‘మగ రచయిత’లకే బహుమతులు ఇచ్చాక ఇంక మనసు మార్చుకున్నాం, వాళ్లు వరస మార్చుకున్నారు గదాని.

1976 లో ఈనాడు ప్రారంభం అయింది. వాళ్లకు చెయ్యి తిరిగిన రచయితలు కావాలి. అందుచేత ‘భూభ్రమణం’ రాయించారు. తరువాత ఆదివారం ఈనాడు పుస్తకంలో ‘విష్ణుప్రియ వ్యాసాలు’ రాయించారు. స్త్రీల కోసం వసుంధర పేజీ ప్రారంభించాక నా చేత ‘మల్లిక’ పేరుతో ఫుల్ పేజీ కథలు రాయించారు. వాటికి విశేష పాఠక ఆదరణ లభించింది. ‘మల్లిక’ కథ కోసం గురువారం నుంచే ఈనాడు పత్రిక కోసం పాఠకులు ఎదురుచూసే స్థాయి కథలు రాశాను. అది నాకు లభించిన అరుదైన అదృష్టం.

విజయ బాపినీడు గారు విజయ పత్రిక అనుబంధ నవల రాసి పంపమని లెటర్ రాశారు. యువ పత్రికవారూ నవలలు రాయమని అడిగారు. ఆంధ్రభూమి వారపత్రిక పెడుతూ ఒక నవల రాసి ఇవ్వమని సికరాజు కోరారు. ‘అరుణోదయం’ అనే నవల రాయించి బహుమతి ఇచ్చారు. పల్లకి పత్రిక వాళ్లు అడిగి ‘వస్తాను నేస్తం’ నవల రాయించారు. ఆంధ్రప్రభ వీక్లీ వాళ్లు వారి ఆఫీసుకి పిలిపించి అర్జంటుగా రాయమని అడిగారు. ‘మంటల్లో మల్లెపూలు’ నవల ముప్ఫయి రెండు వారాలు రాశాను. సితార వాళ్లూ ‘ఎలిజబెత్’ నవల లాంటిది రాయించారు. అలాగా ఒక రచయితగా మంచి నవలలే రాశాను.

కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ నేపథ్యంగా చేసుకుని రాసిన నవల ‘కలలకు రెక్కలొచ్చాయి’కి స్వాతివార పత్రిక – పదహారు వారాల నవలల పోటీలో 25 వేల రూపాయల మొదటి బహుమతి ఇచ్చింది.

మొట్ట మొదట్లో ఆంధ్రప్రభలో నా కథ అచ్చయిందని చూపిస్తే మా వాళ్లు వేసిన మొదటి ప్రశ్న “ఎంతిస్తార్రా?’’ అని. “ఎంతిస్తారా” అన్న శ్రీధర వారి వంశాన పుట్టి, అట్టి, ఒట్టి, గట్టి కథలెన్నో బహుశతాధికములుగా వ్రాసినాను. వ్రాస్తూనే ఉన్నాను.

ఇది నా ప్రయాణం క్లుప్తంగా..

ప్రశ్న 5. తొలి కథ ప్రచురించినప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు అయిదు దశాబ్దాలకు మించిన కాల వ్యవధిలో కథా సాహిత్యంలో వచ్చిన ప్రధానమైన మార్పు ఏమిటి? మీ దృష్టిలో అవి సానుకూలమైన మార్పా? ప్రతికూలమైన మార్పా?

జ: అప్పట్లో ఆంధ్రప్రభ, ఆంధ్ర పత్రిక, ఆంధ్రజ్యోతి, స్వాతి – ఇలా నాలుగయిదు పత్రికలు ఉండేవి. వీటికి తరచూ కథలు రాస్తుండే రచయితలు వందమంది కూడా ఉండే వాళ్లు కాదు. కానీ లక్షల మంది ప్రేక్షకులు ఉండేవాళ్లు. అందుచేత కొంచెం పేరు తెచ్చుకున్న రచయితలకు సెలబ్రటీలకు ఉన్నంత క్రేజ్ ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక స్వాతి తప్ప అన్ని పత్రికలనూ మూసేశారు. రాసే రచయితల సంఖ్య అపారంగా పెరిగింది. ఎటొచ్చి పాఠకుల విషయమే నిరుత్సాహంగా ఉంది – స్వంతంగా తమ పుస్తకాలను ప్రచురించుకుని, సభలే పెట్టి, కాపీలు ఉచితంగా చేతికి ఇచ్చినా చదివే ఓపికా, తీరికా ఉండటం లేదు. కారణాలూ చాలానే ఉన్నాయి. ఎవరు రాసింది వాళ్లు చదువు కోవటానికే తీరిక ఉండటం లేదు, చదివించే గొప్ప కధలు ఉన్నా, అవి అందరి దృష్టికి రాలేకపోతున్నాయి. పుస్తక ప్రదర్శనశాలలో పుస్తకాలు కొంటున్నారు. కానీ చదివే తీరిక లేదని వారే అంటున్నారు. నేను శ్రమపడి పుస్తకం అచ్చువేయించి, సొంత ఖర్చుతో కొరియర్‌లో పంపిస్తే, కనీసం అందింది – అన్న జవాబు కూడా గగనకుసుమమై పోయింది. బహుశా వారు నిజంగానే బిజీగానే ఉండి ఉండొచ్చు.

అయితే ఇప్పుడు అంతా ఈ-మాగజైన్ల తరుణం. ఇది ఎక్కువ మందికి చేరుతుంది. శుభపరిణామమే.

ప్రశ్న 6. సాధారణంగా రచయిత జీవితం లోంచి రచనలు వస్తాయంటారు. ఈ కధలకూ, మీ జీవితానికీ, వ్యక్తిత్వానికీ సంబంధం ఏమైనా ఉందా? 50 ఏళ్ల కాలంలో మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకున్నారా?

జ: కథలు ఎలా రాస్తారు – అని అడిగారు. ఇది చిన్న ప్రశ్నే గానీ సమాధానం చాలా పెద్దవి. కథా వస్తువు ఏదైనా కావచ్చు ఇంగ్లీషులో ‘ఎనీథింగ్ అండర్ ది సన్’ అన్నారు. తెలుగులో ‘రవికానని చోట కవిగాంచును’ అన్నారు. తెలుగు పండితుడు బూదరాజు గారు దానిని విరిచి ‘రవిక ఆనని చోట కవి గాంచును’ అన్నారు. ఒక రచయిత పనిమనిషితో “రంగీ, నీ మీద కథ రాయనా?” అని అడిగితే, “మా ఆయనకు కనపడకుండా, నామీద రాయండి” అన్నదిట. ఒక రచయిత తనను తాను ‘లెఫ్టిస్ట్’నని చెప్పుకున్నాడు. అందరూ ఆయన్ని వదిలేశారట. అందుకని ఆయన లెఫ్టిస్ట్ అయ్యాడు. ఒకాయన భార్య పేరుతో రాశాడట. అందుకని ఆయన ఫెమినిస్ట్ అయ్యాడు. నిజానికి కథలు రాయటం సోరియాసిస్ లాంటి చర్మవ్యాధి లాంటిదిట. ఒకసారి అంటుకుంటే, దురద పెడుతునే ఉంటుంది.

ఇలాంటి చమత్కారాలను పక్కన బెడితే-

అన్ని కథలూ జీవితానికి సంబంధించినవే అయినా, ఒక జీవితానికి మరో జీవితానికి సంబంధం లేదు. పల్లెటూరిలోని రైతు జీవితం, ఐ.టి. కంపెనీ ఉద్యోగి జీవితం, రాజకీయ నాయకుని జీవితం, తత్వవేత్త జీవితం, దొంగ వాని జీవితం – జీవితాలు ఎన్నో రకాలు. మళ్లీ ఒకే వ్యక్తి జీవితంలోని ప్రతి అనుభవం, ప్రతి అనుభూతి, దేనికదే ప్రత్యేకం. అందుచేత కథలన్నీ దేనికవే ప్రత్యేకమైనవి. ప్రతి వార్తా కధావస్తువే. అయితే అందులో మనసును చలింపచేసే అంశం, మానవతా దృక్పథం, ఎంతోకొంత మంచితనం వైపు మొగ్గు చూపటం ఉండాలి. ముఖ్యంగా చదివించే లక్షణం ఉండాలి. అంటే ఇంచుక రసజ్ఞత ఉండాలి. రసజ్ఞత అంటే ఏం లేదు. ఆ సందర్భాన్ని బట్టి, దానికి అనుగుణమైన రసాన్ని ఒలికింప చేయాలి. ఇలాంటి లక్షణాలు ఉంటేనే అది కథ అవుతుంది.

కాలంతో పాటు ఆలోచనలూ, అభిప్రాయాలు మారుతుంటాయి. వీటితో పాటే కధలూ, కాలానుగుణంగా కొత్త ఉడుపులు ధరిస్తుంది. కధ లోని మానవతా దృక్పధం.. కొత్తదనం లేనప్పుడు కొత్తగా రాయాల్సిన అవసరం ఏముంది?

ఇప్పటి సమాజాన్ని ప్రతిబింబించే కథలు రాయాలంటే – ప్రియుడితో కల్సి, భర్తను చంపిన భార్య; భార్యను. భర్త; లేడీ కిలాడీ; రాజకీయ నాయకుని రాసలీలలు; ఐ.ఏ.యస్, ఐ.పి.యస్‌లకు రిమాండ్; మంత్రిగారి కబ్జాలు, వగైరా కథలు రాయాల్సి వస్తుంది.

కనుక మన సాహిత్యం కన్యాశుల్కం దగ్గర దగ్గర మొదలై కిలాడీ లేడీ దాకా వచ్చింది.

ఒకప్పుడు ఒక వర్గం వారు – అంటే కాస్త చదువుకుని, కాస్త సాహిత్యం పట్ల ఇష్టం ఉన్నవారు – ఎక్కువగా మధ్యతరగతి వారే కథలు, నవలలు రాసేవారు. తరువాత మహిళా రచయిత్రులు విస్తృతంగా రాశారు. ఇప్పుడు అది ఇది అని లేదు. అన్ని తరగతులవారు, అన్నివర్గాల వారు ఎలుగెత్తి తమ గొంతు వినిపిస్తున్నారు. ఇది అభిలషనీయమైన మార్పు. కథ ఇప్పుడు ప్రాంతాల వారీగా, వర్గాల వారీగా పాయలు పాయలుగా చీలిపోయింది. అలా కథా సంపుటాలు వెలువడుతున్నాయి. ఇదీ మంచిదే. కథ పరిధి విస్తృతం అయింది..

ప్రశ్న 7. ఈ సంపుటిలోని కథలు 1993-2023/24 మధ్య కాలం లోనివి. కథలను ప్రస్తుతం అమర్చిన క్రమంలో ఇవ్వటానికి, క్రోనలాజీకల్ ఆర్డర్ వద్దనుకోవటానికి ఏదైనా కారణం ఉండా? లేక యాదృచ్ఛికమా?

జ: పత్రికల కథల పోటీలలో బహుమతులు వచ్చినవి ముందుకు తెచ్చి, బహు మతులు మెచ్చిన కధలను ఆ తరువాతకు తీసుకువచ్చాను. అంతే.

ప్రశ్న 8. ఫేస్‌బుక్కథలో భాగంగా సిరియా అంతర్యుద్ధం గురించి, ఐరాస శాంతిదళం గురించి ప్రస్తావించారు. మరో కథలో నైజీరియా గ్యాంగ్ ఆన్‌లైన్ మోసాల గురించి చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇతివృత్తాల ఎంపిక, సన్నివేశాలలో సమకాలీన సంఘటనలను ఉపయోగించడం, తాజా సాంకేతికను ఒడిసి పట్టుకోవటంలో మిమ్మల్ని మీరు ఎలా అప్‌డేట్ చేసుకున్నారు?

జ: తెల్లవారి లేస్తే ఎన్నో విషయాలను చూస్తుంటాం, వింటూ ఉంటాం. ఏదో ఒకటో రెండో మనసుకు నచ్చుతాయి. కథ రాయాలనిపించి, మెడదులో మథనం మొదలవుతుంది.. ఇప్పుడో, అప్పుడో ఎప్పుడో అప్పుడు అది కాగితం మీద ఒళ్లు విరుచుకుంటుంది. నేను ఢిల్లీ మూడు సార్లు వెళ్లాను. ప్రతిసారి ఒక కొత్త కథ రాశాను. బృందావనం మీద ఒక చిన్న కథ రాయాలని ఎప్పటి నుంచీ మనసులో ఓ మూల కోరిక కదలాడుతోంది. రాస్తాను. కానీ బాగా రాయాలి. అందుకే ఆలస్యమవుతోంది.

ప్రశ్న 9. తడవ తడవకూ తడుపుతున్నా వాడుముఖం పట్టిన నిన్నటి పూల మాలలాఅనేది అద్భుతమైన పోలిక. మాట వరసకెపుడైనా అన్నానాకథలో ఎవరినైనా అంత సులువుగా మోసం చేయవచ్చా? ఈ కథ నేపథ్యం వివరించండి.

జ: మోసం చేయాలీ అనుకుంటే చేయటం తేలికే. తెల్లారి లేస్తే కోర్టుల్లో ఎన్నెన్ని దొంగ సాక్ష్యాలు, దొంగ వాదప్రతివాదాలు, నకిలీ డాక్యుమెంట్స్ మనం చూడటం లేదూ. ఒక గొప్ప లాయరు భార్య బ్రతికి ఉండగా, మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. కోర్టులో కేను నడిచింది. ఆ లాయర్ గారి వాదన – ఏమిటంటే, హిందూ సాంప్రదాయం ప్రకారం అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోవాలి.. అందుకని అగ్ని చుట్టూ కొంగు ముడివేసుకుని వధూవరులు ప్రదక్షిణాలు చేయాలి. అప్పుడే నిజంగా వివాహం జరిగినట్లు. మా విషయంలో అలా ప్రదక్షిణాలు చేయలేదు గనుక, ఈ వివాహం న్యాయరీత్యా జరిగినట్లు కాదు అని ఆయన వాదించాడు. కోర్టు ఆ వాదనను అంగీకరించింది. ఇక ఒక కేసులో భర్త, భార్యకు తెలియకుండానే, మరొక స్త్రీని కోర్టుకు చూపించి విడాకులు తీసుకున్నాడు. నిజంగా రావిశాస్త్రి చెప్పినట్లు కోర్టులు – అదొక అడవి. మన ఊహకు అందని ఎన్నో వింతలు జరిగి పోతుంటాయి. కేస్ లా పుస్తకాలు తిరగేస్తే గొప్ప ట్విస్టులు గల నవలలు రాయవచ్చు. నిజం.

ప్రశ్న 10. చెట్టు నీడకథ ఘటనని జీర్ణించుకోవటం కష్టం. ఈ కథకి ప్రేరణ ఏమిటి? ఈ కథ కల్పితమా లేక శేషగిరి లాంటి వ్యక్తులు మీకు తారసపడితే అల్లిన కథా?

జ: ఉన్నాడు, మా వెనుక వీధిలోనే ఉన్నాడు. సాయంత్రం పూట కలుస్తుంటాడు. వాళ్ల అమ్మ చనిపోవటం కూడా కటిక నిజం, వాడి ఆలోచనలు, తెల్సు గనుక, ఆ ముగింపు నేను ఇచ్చాను.

ప్రశ్న11. దృష్టి దోషం లేనివాడు టెలిస్కోపులో కూడా కనిపించని విషయాలను కన్నీటి చుక్కల్లో చూడగలుగుతాడు” చాలా గొప్ప వాక్యం. ఎన్నికలొచ్చి..కథ నేపథ్యం వివరిస్తారా?

జ: నవ్య వారపత్రిక కోసం రాశాను. ఎన్నికల సమయంలో ప్రత్యర్థిని ఓడించటం కోసం, అతని వివాహేతర సంబంధాలను వెలుగులోనికి తీసుకొస్తుంటారు. విజయవాడ యం. షి. రాజగోపాల్ విషయంలో ఇలాంటిది ఏదో ప్రచారంలోకి వచ్చినట్లు గుర్తు.

ప్రశ్న12. ఈ కథా సంపుటికి ముందుమాట రాయించలేదేం? మీరు కూడా మీ మాట వ్రాయలేదు.. ఎందుకని? ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?

జ. ‘ఇచ్చట జూదమాడంగరాదు’ నవలకు ముందుమాట రాయమని ఈనాడు విపుల చమర ఎడిటర్ కె.బి. లక్ష్మిని అడిగాను. కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. చివరకు నేనే రాసి నీ పేరు పెడతానని కూడా చనువు కొద్దీ అన్నాను. పాపం రాసి ఇచ్చింది. ఇక ఈ కథల సంపుటి కూడా ముందుమాట కోసం  ఏడాది పాటు ఆలస్యం అయింది. ఎవరి చేతో రాయించాలనుకోవటం – రాకపోవటం – ఒక రకమైన విసుగు. కథలున్నయి కదా. చాలు లెమ్మని అచ్చువేయాల్సి వచ్చింది.

ప్రశ్న13. సాధారణంగా రచయితలకు తాము రచించే కథలన్నీ నచ్చుతాయి. ఈ సంపుటిలోని ఏ కథ మీ మనసుకు బాగా దగ్గరయింది. ఎందువలన?

జ: నేను ‘పల్లకి’ లో కథలు రాసే రోజుల్లో నాకు ‘ప్రేమ కథా సామ్రాట్ ‘ అని బిరుదునిచ్చింది నా ‘దిల్ కా తుక్‌డా! నేను విష్ణుప్రియ, మల్లిక కథలు రాసే రోజుల్లో రోజుకో ప్రేమ ఈనాడు అడ్రసుకు వచ్చేది. కానీ ఎడిటర్ వర్మ గారు నాదాకా రానిచ్చేవాడు. ఒక మల్లిక కథ ఫస్ట్ పర్సన్‌లో రాసి, “ఒంటరిగా ఈ క్వార్టర్‍లో నేనూ, నా పెంపుడు కుక్కా మిగిలిపోయేం” అని ముగించాను. ‘ఈ మల్లికను పెళ్లి చేసుకుంటాను అడ్రసు ఇవ్వమ’ని ఒకాయన వర్మగారి దగ్గరకు వచ్చాడు. ఆ రోజు నేను ఈనాడుకు వెళ్లేటప్పటికి టూకీలు రాసే సత్తెనపల్లి రామమోహన్రావుగారు “శ్రీధర గారూ, మీకో మంచి సంబంధం వచ్చింది. ఒప్పేసుకోండి” అని ఆట పట్టించాడు. ఇలాంటి అనుభవాలెన్నో ఉన్నయి. అసలు ప్రేమకథలు ఇప్పపడని వాళ్లు ఎవరుంటారు, బాగా రాయాలే గాని. అన్ని కథలూ ఇష్టమే, అయినా ‘చవితినాటి చంద్రుడు’ లోని ప్రజెంటేషన్ బాగా వచ్చింది.

ప్రశ్న14. ఈ సంపుటిలోని ఏదైనా కథ రాయడం కష్టం అనిపించిందా? ఎందువలన?

జ: ఒక కథ రాయాలని అనుకున్నప్పుడు, ముందుగా మనసులో పూర్తిగా పాత్రలు, సన్నివేశాలు, వర్ణనలు, సంభాషణలతో సహా ఒక స్వరూపం వచ్చే దాకా రాయను. అంతా మదిలో మెదిలేటప్పుడు, ఇంక కాగితం మీద పెట్టటమే. పెద్ద కష్టమేమీ అనిపించదు.

ప్రశ్న15. ఈ కధల సంపుటి పుస్తకరూపంలో తీసుకు రావడంలో ఏవైనా ప్రత్యేక అనుభవాలున్నాయా? ఉంటే వాటిని మాతో పంచుకుంటారా?

జ: పంచుకోవటానికి ఇవేమన్నా మైసూర్‌పాక్ ముక్కలా? తణుకులో ఒక అమ్మాయికి సాయం చేసినట్లు ఉంటుంది, ఆ అమ్మాయికి ఇవ్వమని ఎవరో రికమండ్ చేస్తే, కధలు ఆ అమ్మాయికి పంపాను. తీరా ఆ అమ్మాయి డిటిపి చేసి మెయిల్ పంపించింది. అప్పుడు నేను ఆరునెలలు అమెరికాలో ఉన్నాను. ఆ తరువాత నా శ్రీమతి ఆనారోగ్యంతో కొంతకాలం పట్టించుకోలేదు. ఈలోగా నా బుద్ధి మాంద్యం వలన అన్నీ డిలీట్ చేశాను. కొన్నాళ్లు మర్చిపోయాను. మళ్లీ ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే మళ్లీ పంపించింది. ప్రింటవుట్ తీసుకుని ముందుమాట రాయమని ఇస్తే, ఏడాదిపాటు సారీ, సారీలతో గడిచిపోయింది. నీళ్ళు వదులుకుని మళ్లీ తెప్పించి, ఫ్రూఫ్‌లు దిద్ది ఇస్తే, అవి కరెక్ట్ చేయటానికి పద్మాకర్ చుట్టూ మూడు నెలలు తిరిగి కవర్ డిజైన్ చేయించుకున్నాను. పురిటి నొప్పులు ఇంకా చాలా ఉన్నాయి. ఈ నొప్పులు పంచుకోలేనివి సార్. ఎవరికి వాళ్లు అనుభవించాలి. పుస్తకాన్ని పుత్రికతో పోల్చేది అందుకే.

ప్రశ్న16. రచయితగా మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?

జ: “అయినదేదో అయినది. వచ్చిన కీర్తి ప్రతిష్ఠలను గోతాములకు ఎత్తి, గోదాములు నిండినది చాలులే. ఇంక ఇంటి నిండా చెత్త చేర్చకండి” అంటున్న మా ఆవిడ మాట వినటమే బెటర్ అనిపిస్తోంది.

ఎవడిక్కావాలి ఈ కథలు?

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు శ్రీధర గారూ.

శ్రీధర: ధన్యవాదాలు.

***

చందమామ మసకేసిపోయే (కథలు)
రచన: శ్రీధర
ప్రచురణ: వేద ప్రచురణలు
పేజీలు: 208, వెల: ₹ 300/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
వేద ప్రచురణలు
13-8-53, గౌతమ్‍నగర్ కాలనీ,
పి అండ్ టి కాలనీ రోడ్, దిల్‍షుఖ్‌నగర్,
హైదరాబాద్ 500060
రచయిత: 9959556876

 

~

‘చందమామ మసకేసిపోయే’ కథాసంపుటి సమీక్ష:
https://sanchika.com/chadamama-masakesipoye-book-review-kss/

Exit mobile version