[‘గుల్దస్త’ అనే అనువాద కథాసంకలనం వెలువరించిన శ్రీ మెహక్ హైదరాబాదీ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం మెహక్ హైదరాబాదీ గారూ.
మెహక్ హైదరాబాదీ: నమస్కారం.
~
ప్రశ్న 1. ‘గుల్దస్త’ అనే అనువాద కథాసంకలనం వెలువరించినందుకు అభినందనలు. మీరు అనువాదం తిన్నగా ఉర్దూ నుంచి తెలుగులోకి చేశారా? లేక, ఇతర ఏదైనా భాషనుంచి అనువదించారా? ఉర్దూ నుంచి తిన్నగా అనువదించినట్టయితే, మీరు ఉర్దూ ఎలా, ఎప్పుడు, ఎందుకు నేర్చుకున్నారు?
- గుప్పిట జారే ఇసుక (జీలానీ బానూ కథలు)
- అంతా నిజమే చెప్తా.. (జీలానీ బానూ కథలు)
- తెరిచిన పుస్తకం(జీలానీ బానూ బాల్య స్మృతులు)
- సాదత్ హసన్ మంటూ కథలు
- మంటూ క్లాసిక్స్
- హైదరాబాద్ ప్రజా సమరం (చెరుకు మాధవ రెడ్డి)
- హైదరాబాద్ (మఖ్దూము మొహియుద్దీన్)
- అస్థిపంజరం (అమృతా ప్రీతం)
- గుల్దస్త (హైదరాబాద్ ఉర్దూ కథలు)
- అన్నా భావు సాథే కథలు
- 1948 READINGS
1993లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉర్దూ ట్రాన్స్‌లేటర్ పోస్టు కోసం ఈ భాష నేర్చుకున్నాను. భాష అయితే వచ్చింది కానీ, కొలువు రాలేదు.
ప్రశ్న 2: ఉర్దూ భాష ప్రత్యేకత ఏమిటి?
జ: కవిత్వానికీ, విశిష్టమైన అభివ్యక్తికీ అనువైన భాష ఉర్దూ. కానీ ఆనేక కారణాల వల్ల భవిష్యత్తులో కనుమరుగు కానున్న భాషల్లో ఇదొకటి అయ్యే ప్రమాదం ఉంది.
ప్రశ్న 3: హిందువుల జీవితాలపై ఉర్దూ రచయితలు రాసిన కథలు అనువదించాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఆలోచనను ఆచరణలో ఎలా పెట్టారు?
జ: దీనికి ఒక నేపథ్యం ఉంది. వందేళ్ళ హైదరాబాద్ ఉర్దూ కథా సాహిత్యాన్ని తెలుగు వారికి పరిచయం చేయాలన్న లక్ష్యంతో ఒక భారీ ప్రాజెక్టు నేను అయిదేళ్ళ క్రితం చేపట్టాను. 60 నుంచి 70 మంది ప్రసిద్ధ రచయితల కనీసం ఒక్కొక్క కథను అనువదించి తెలుగులోకి 100 కథలను 3 సంపుటాలుగా నేనే తీసుకురావాలని ప్లాన్ చేశాను. అయితే, మొదటి సంపుటిలోనే హిందువుల జీవితాలకు సంబంధించిన 15 కథా వస్తువులు ఉండడంతో వాటికి మరిన్ని జోడించి ఒక సంకలనంగా తెచ్చాను. హిందువుల, ముస్లింల మధ్య ఘర్షణ వాతావరణం, అనుమానాలు, అపోహలు ఉన్న సమయంలో ఇది ఎంతో అవసరమని నా అభిప్రాయం.
ప్రశ్న 4: ఎవరెవరి కథలను అనువదించాలో ఎంచుకునేందుకు ఎలాంటి ప్రమాణాలు పాటించారు?
జ: కథావస్తువు, శిల్పం, కథనం ఇవన్నీ ముఖ్యమే. అయితే, 22 కథలను ఎంపిక చేయడానికి వెయ్యిదాక కథలు చదవాల్సి వచ్చింది. గుల్దస్త సంకలనంలో 85 సంవత్సరాల క్రితం పాత కథ కూడా ఉంది.
ప్రశ్న 5: ఈ కథలు చదువుతుంటే, ఉర్దూ రచయితలు హిందువుల జీవన విధానాన్ని ఎలా అర్థం చేసుకున్నారనిపించింది?
జ: ముస్లిం రచయితలకు హిందువుల జీవన శైలి, వారి సంప్రదాయాలు, భక్తి విశ్వాసాలపై లోతైన అవగాహన ఉంది. హిందువుల జీవితాల చుట్టూ అల్లుకున్న సమస్యలను వారు చక్కగా, సృజనాత్మకంగా చెప్పారు.
ప్రశ్న 6: మీరు ఎంచుకున్న రచయితలు అంతా ముస్లింలే. ముప్పై ఏళ్ళ క్రితం దాకా హిందువులు అనేకులకు ఉర్దూ వచ్చేది. వారూ ఉర్దూ సాహిత్యాన్ని సృజించేవారు. మీరు అలాంటి వారి రచనలను పరిశీలించలేదా?
జ: చాలా ప్రయత్నించాను. దొరకలేదు. కొంతమంది కాయస్థ, హిందు రచయితల కథలు కూడా తెలుగులోకి తీసుకు రావాలన్న ఆలోచన ఉంది. కానీ ఎంతవరకు సఫలం అవుతుందో చూడాలి.
ప్రశ్న 7: ‘చిరంజీవి’ కథ గురించి చెప్పండి.
జ: కథకూ, దాని టైటిల్‌కూ సంబంధం లేదు. ఇది రాసిన రచయిత మహమూద్ హామిద్ గాలిబ్ షేర్ లోని ఒక పాదాన్ని శీర్షికగా వాడాడు. నేను అది కాకుండా కథా వస్తువులోని అంశం హెడ్డింగ్ పెట్టాను. ఉర్దూ షాయర్లు రచయితలకు గాలిబ్, ఇక్బాల్ అంటే విపరీతమైన క్రేజ్. వారి ప్రస్తావన లేకుండా పుస్తకాలే ఉండవు.
ప్రశ్న 8: ‘మై డియర్ శకుంతల’ కథను అనువదిస్తుంటే ఎలా అనిపించింది?
జ: ఆతిక్ షా రాసిన ఈ కథ 1953లో రాష్ట్ర స్థాయి కథల పోటీలో ప్రథమ బహుమతి గెలిచింది. తాను వలచినది రంభ అంటారు కదా. ఆమె తిరుగుబోతు అయినా ఆమెనే కలవరిస్తాడు హీరో. ప్రేమ అంటే అదే అని చెప్తాడు రచయిత.
ప్రశ్న9: ‘తీన్ ములక్ ఏక్ కహానీ’ ని ‘భారత కమలం’గా అనువదించారు. ఈ కథకు ఆ పేరు పెట్టడం గురించి చెప్పండి.
జ: మాదిగల దుస్థితిపై రాసిన కథ ‘భారత కమలం’. ‘తీన్ ములక్ ఏక్ కహానీ’ అనే సంకలనంలో ఇదొక కథ మాత్రమే. ఈ కథ రాయడానికే చాలా కష్టపడ్డాను. ఇందులో పురాణాల ప్రస్తావన ఉంటుంది.
ప్రశ్న 10: ఈ కథల్లో ఎక్కడా సమాజంలో రెండు మతాల మధ్య ఘర్షణ, ఉద్విగ్నత, ఆవేశాలు కనపడవు. ఉర్దూ రచయితలు అలాంటి అంశాలను స్పృశించలేదా? ఈ ఎంపిక వెనుక ఆలోచన ఏమిటి?
జ: విభజన నాటి నుంచి హిందూ ముస్లింల ఘర్షణలు, మత కలహాలు ఉన్నప్పటికీ అస్తిత్వ సాహిత్య ఉద్యమాలు గత యాభై ఏళ్ళు గానే సాగుతున్నాయి. ఈ కథలలో ఎక్కడా హిందూ, ముస్లిం వర్గాల మధ్య ఘర్షణ ఉండదు. ఇది కొంతమంది విమర్శకులను నిరాశపరిచింది కూడా. కానీ లేనిది మనం సృష్టించలేము కదా?
ప్రశ్న11: పుస్తక ప్రచురణలో అనుభవాలు ఏమిటి? ఎవరి సహకారం లభించింది?
జ: ఇది నా బుర్రలో పుట్టిన ఆలోచన. హైదరాబాద్ కథా రచయితలకు దేశవ్యాప్తంగా రావాల్సిన పేరు రాలేదు. హైదరాబాద్ షాయర్లు, రచయితలకు తగిన గుర్తింపు లేదు. అందుకే సాహితీ సంస్థలు, ప్రచురణ సంస్థలతో నిమిత్తం లేకుండా ఈ పనికి నేనే పూనుకున్నాను. ఇక రచయితల సహకారం శూన్యం అని చెప్పాలి. వారికి ఎలాంటి ఆసక్తీ లేదు.
ప్రశ్న12. భవిష్యత్తు ప్రణాళికలు చెప్పండి?
జ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ ఉర్దూ విభాగాధిపతి ప్రొఫెసర్ బేగ్ ఎహ్ సాస్ కథా సంకలనం ‘DAKHMA’ తెలుగు అనువాదం త్వరలో ప్రచురణ కానున్నది. మరుగునపడిన హైదరాబాద్ ఉర్దూ సాహిత్యాన్ని తెలుగువారికి అందించే ప్రయత్నం చేస్తాను.
~
సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు మెహక్ హైదరాబాదీ గారు.
మెహక్ హైదరాబాదీ: సంచిక టీమ్‌కి నా ధన్యవాదాలు.
***
అనువాదం: మెహక్ హైదరాబాదీ
ప్రచురణ: మెహక్ ప్రచురణలు
పేజీలు: 202
వెల: ₹ 200/-
ప్రతులకు:
అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు
ప్రచురణకర్త:
ఫ్లాట్ నంబర్ 105, బ్లాక్ నెం. 5A
సిబిఆర్ ఎస్టేట్స్, మియాపూర్
హైదరాబాద్ 500049.
శ్రీ మెహక్ హైదరాబాదీ గురించి:
విశ్రాంత జర్నలిస్ట్. పత్రికారంగంలో 37 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది.
భారత ప్రభుత్వ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖలో ఉర్దూ భాష ప్రచారం కోసం ఏర్పాటయిన జాతీయ మండలి (ఎన్‌సిపియుఎల్) సభ్యులు. ఇది ఒక తెలుగు వ్యక్తికి లభించిన అరుదైన గౌరవం.
మెహక్ హైదరాబాదీ ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం అనే గ్రామానికి చెందినవారు. 1991 నుండి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.
~
‘గుల్దస్త’ అనే కథాసంకలనం సమీక్ష
https://sanchika.com/guldasta-book-review-st/