Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కథకుడు, నవలా రచయిత శ్రీ మంజరి ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘అన్వేషణ’, ‘పథకం’ అనే నవలలు వెలువరించిన శ్రీ మంజరి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం మంజరి గారూ.

మంజరి: నమస్కారం.

~

ప్రశ్న 1. గంధం నాగేశ్వర రావు అనే మీ అసలు పేరు కన్నా మంజరిఅన్న మీ కలం పేరే బాగా ప్రసిద్ధి. ఆ కలం పేరును ఎప్పుడు, ఎందుకు స్వీకరించారో వివరంగా చెప్తారా?

జ: కలం పేరు పెట్టుకోవడానికి ముఖ్య కారణం కాంట్రాక్ట్ రూల్స్ అధిగమించాలని. మా నాన్నమ్మ పేరు రసమంజరి. నా చెల్లెలు పేరు రాగమంజరి. మా అమ్మాయి పేరు దుర్గామంజరి. మంజరి అని పిలిస్తే వారంతా జ్ఞాపకం వస్తారు. ఇప్పుడు నా పెద్ద మనవరాలు నైన మంజరి. చిన్న మనవరాలు నిహిత మంజరి.

ప్రశ్న 2. మీరు వందల కథలు వ్రాశారు, ఎన్నో పుస్తక పరిచయ వ్యాసాలు వ్రాశారు. సాంఘిక/థ్రిల్లర్/క్రైం  నవలలు రాశారు. తొలిసారిగా ఏ ప్రక్రియతో రచనా రంగంలోకి అడుగుపెట్టారు? మీ సాహితీ ప్రస్థానం గురించి వివరించండి.

జ: తెలుగు సాహిత్యం పెట్టిన భిక్ష వల్ల నేను రచయితని అయ్యాను. పుస్తకం కొనడానికి డబ్బులేని రోజుల్లో లెండింగ్ లైబ్రరీలు, ప్రభుత్వ లైబ్రరీలు నాకెంతో మేలు చేసాయి. నేను చదివిన సాహిత్యం, కథ చెప్పే తీరు మీద పుస్తకం భవిష్యత్తు ఆధారపడి ఉందని గ్రహించాను. టాల్‌స్టాయ్, కాఫ్కా, కుప్రిన్, ఓ. హెన్రీ, శరత్.. ఇలా దొరికిన పుస్తకమల్లా చదివాను. కృష్ణ మోహన్, టెంపోరావ్, కొమ్మూరి సాంబశివరావు, భయంకర్, గిరిజశ్రీ భగవాన్, విశ్వప్రసాద్, సాయిశ్రీ వంటి రచయితల పుస్తకాలు రోజుకి రెండు చదివేవాడిని. అందువల్ల స్కూలు చదువు మూలన పడింది. పత్తేదార్, డిటెక్టివ్, చందమామలు కోసం స్కూలు ఎగ్గొట్టి లైబ్రరీకి వెళ్ళేవాడిని. హఠాత్తుగా 1972లో నా సాహిత్య ప్రస్థానానికి ఫుల్‌స్టాప్ పడి 1984 వరకూ కొనసాగింది. ఈ కాలంలో మల్లాది, యండమూరి, తెలుగు సాహిత్యంలో ఉప్పైనలా విరుచుకుపడ్డారు. 1986లో జీవితం రిస్క్‌లో పడటం వల్ల జీవితాన్ని చాలించాలనుకున్నాను.  అదృష్టవశాత్తూ రచన మీదకి దృష్టి మళ్ళి ‘మృత్యు కెరటం” వెలువడింది. నేను మానసికంగా నిలదొక్కుకోవడానికి ఈ రచన దోహదపడింది.

ప్రశ్న 3. ఇటీవల అన్వేషణఅనే నవల వెలువరించారు. ఇది మీ ఎన్నో నవల? వీటిలో ఎన్ని డైరక్ట్ నవలలు? ఎన్ని సీరియల్ నవలలో చెప్పండి.

జ: మొత్తం ఇరపై నవలలు రాసాను. ‘మృత్యు కెరటం’, ‘మిస్టర్ జీరో’, ‘నిన్ను ప్రేమించాను’, ‘దేవుడా రక్షించు’ డైరెక్టు నవలలు. మిగితావి స్వాతి వార, మాస పత్రికల్లోను, ఆంధ్రభూమి వార, మాస, దినపత్రికల్లోను సీరియల్స్‌గా వచ్చాయి. చతులలో ‘పథకం’, ‘కనిపించని సూర్యుడు’ వెలువడ్డాయి. ‘అన్వేషణ’ నవల 2009లో రాసాను. ఇది ఆంధ్రభూమి సండే సప్లిమెంట్‌లో సీరియల్‌గా వచ్చింది.

ప్రశ్న 4. సాధారణంగా ఒక నవల రాయడానికి మీకెంత కాలం పడుతుంది? రోజుకి ఎన్ని పేజీలు రాయాలని ప్రణాళిక వేసుకుంటారు? ఈ నవలా రచన మీ ప్రణాళికలకు అనుగుణంగానే సాగిందా లేక ఏవైనా ఆటంకాలు ఎదురయ్యాయా? ఎదురైతే వాటిని ఎలా అధిగమించారు?

జ: సాధారణంగా మంచి కథ  తట్టినప్పుడు నవల ప్రారంభిస్తాను. నా మొదటి నవల 45 రోజులు, రెండో దానికి 90 రోజులు పడితే ఆ తరువాత నవలకి సంవత్సరం సమయం పడుతోంది. రాస్తున్న సమయంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. వాటిని అధిగమించి తిరిగి కథలోకి రావడం అనుకున్నంత తేలిక కాదు.  ఇంటి బయట చెప్పులు వదిలినట్టు ఉద్యోగంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని పదిలించుకోవాలి. వ్యక్తిగత జీవితం, ఉద్యోగ జీవితం, సాహితీ జీవితం ఈ మూడింటిని విడగొట్టి పరకాయ ప్రవేశం చెయ్యాలి.

ప్రశ్న 5. అన్వేషణనవల మూడు నక్షత్రాలుపేరుతో ఒక ప్రసిద్ధ వారపత్రికలో ధారావాహికంగా ప్రచురితమైంది. పుస్తక రూపంలోకి తెస్తున్నప్పుడు నవల పేరు ఎందుకు మార్చవలసి వచ్చింది?

జ: ‘మూడు నక్షత్రాలు’ పేరుతో ఆంధ్రభూమికి పోటీకి పంపితే, ఎడిటర్ గారు ‘అన్వేషణ’ పేరు ఖాయం చేసారు. అందువల్ల అంతకు ముందు అన్వేషణ పేరుతో ఓ నవల రాసిన సంగతి దాచవలసి వచ్చింది.

ప్రశ్న 6. సాధారణంగా ఒకే జానర్‌లో (క్రైమ్/థ్రిల్లర్స్) రాసేటప్పుడు – క్రైమ్, మోటివ్, ఇన్వెస్టిగేషన్, కన్విక్షన్ – ఇవే ఇతివృత్తాలుగా ఉంటాయి కదా. ఒక్కో నవలకి ఇవే థీమ్స్ వాడుకుంటూనే, పాఠకులలో రిపిటీషన్అనే భావన కలగకుండా ఏ యే జాగ్రత్తలు తీసుకుంటారు? Core అదే ఉంచి, Exterior ను కొత్తగా ఎలా ప్రెజెంట్ చేస్తారు?

జ: నిత్యం ఈ సమాజంలో ఎన్నో రకాల నేరాలు జరుగుతున్నాయి. ఒకదానికొకటి పోలికలు ఉండవు. వాటిలో ఏదో ఒక ముఖ్యమైన అంశాన్ని  తీసుకుని, నవలకి ఉపయోగించుకోవాలి. కథ డిమాండ్ మేరకు సన్నివేశాలు రాసినప్పుడు, కథని నడిపించడానికి సన్నివేశం సృష్టించినప్పడు నవల బాగా వస్తుంది. మార్క్ ట్వేన్ గారు “శవం మీద కథ రాయకూడదు” అంటారు ఒక చోట. అయితే పాతికేళ్ళ క్రితం ‘కల్నల్స్ డాటర్’ అనే సినిమా చూసాను. ఈ సినిమా చూడటానికి కారణం జాన్ ట్రివోల్టా నటించడం. ఈ సినిమా మిలటరీ క్యాంపులో ప్రాణం లేని స్త్రీ నగ్న శరీరంతో మొదలవుతుంది. ఆమె కల్నల్ గారి కూతురు. అదే క్యాంపులో లెఫ్టినెంట్ ఆమె. ఆ కేసు పరిశోధనకి హీరో వస్తాడు. అతని దర్యాప్తులో చనిపోయినామె క్యారెక్టర్‌కి సంబంధించిన ఒక్కొక్క అంశం బయటపడి కథ క్లైమాక్స్‌కి చేరుతుంది. ఈ టెక్నిక్ నా మనసులో బలంగా ముద్రించుకుపోయింది. అదే టెక్నిక్‌లో ‘ఐ లల్ మై ఇండియా’ రాసాను. ఆ తరువాత వికాస్ స్వరూప్ గారు ‘సిక్స్ సస్పెక్ట్స్’ రాసారు. దీనిని ‘ఆరుగురు అనుమానితులు’ పేరుతో శాంత సుందరి గారు తెలుగులో అనువాదం చేసారు.

ప్రశ్న 7. అపరాధ పరిశోధనల నవలలు వ్రాయాలనుకున్నప్పుడు – మన చుట్టూ సమాజంలో జరిగే నేరాలను, వాటి పరిశోధనను, చివరగా నేర నిరూపణను – పరిశీలిస్తుంటారా? పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పనిచేయడం ఇందుకు ఉపకరించిందా? నిజ జీవితంలో పోలీసుల పరిశోధనకీ, కాల్పనిక నవలలో పరిశోధనలకి వ్యత్యాసం ఉంటుందా?

జ: కాల్పనిక రచనలో అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యగలరు రచయితలు. నవలలో నేరస్థుడ్ని పట్టుకుంటే పాఠకుడు తృప్తి పడతాడు. నిజ జీవితంలో అలా సాధ్యం కాదు. అతను దొంగని మనకి తెలిసినా కోర్టులో నిరూపించాలి. వాస్తవానికి దగ్గరగా రాస్తూనే కళారూపాన్ని జాగ్రత్తగా కథలో ఇమడ్చాలి. లేదంటే అది డాక్యుమెంటరీ అవుతుంది.

ప్రశ్న 8. క్రైమ్ నవలు అనేకం వ్రాసే క్రమంలో నేరం జరిగిన తీరు, లేదా, ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్, నేరస్థులని గుర్తించి పట్టుకునే పద్ధతులను పునరావృతం చేస్తూనే, ప్రతి నవలను విభిన్నంగా ఎలా వ్రాయగలుగుతారు?

జ: ఒక సంఘటనకి నాలుగైదు కోణాలు ఉంటాయి. దానిని మనం ఎలా ప్రజంట్ చేసామనే దాని మీద రచన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ‘హిట్ లిస్ట్’ నవల రాస్తున్నప్పుడు ఒక సన్నివేశం కోసం మూడు నెలలు ఆలోచించాను. సన్నివేశం కల్పితమే అయినా పాఠకులు నిజమని నమ్మాలి.

ప్రశ్న 9. డబ్బు వల్ల వచ్చిన మదం భవిష్యత్తుని దర్శించనివ్వదు. అంతా అయిపోయాకా వివేకం మేలుకొంటుంది” అంటూ అన్వేషణనవలలో వ్రాసిన వాక్యం ఎన్నో అనుభవాల సారం. అలాగే, “ఎందుకో తెలీదు కానీ సుబ్బారెడ్డి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిలా కనిపించాడు ద్వివేది కళ్ళకి. ఆ పని అంగీకరించి తప్పు చేసానేమోననే సందేహం ఒకటి మనసులో ప్రవేశించింది” అని పథకంనవలలోని వాక్యాలు – చదువరులలో కుతూహలాన్ని పెంచుతాయి. ఇలా పాఠకులకు ఆసక్తి కలిగించేటటువంటి వాక్యాలతో సన్నివేశాన్ని సృజించటం చక్కని టెక్నిక్. ఈ సందర్భంగా – మీరు నవలలు వ్రాసే పద్ధతి ఎలా ఉంటుందో (ప్లాట్, సినాప్సిస్, ఛాప్టర్/సెక్షన్ డివిజన్ – తదితర అంశాలు) పాఠకులకు వివరిస్తారా?

జ: నాకు తెలిసినంత వరకూ కథని సింగిల్ లైను ఆర్డరులో రాసుకుంటే రచన తేలికవుతుంది. ‘ఐ లవ్ మై ఇండియా’ నవలకి ఈ టెక్నిక్ ఉపయోగించాను. పాఠకుడి ఊహకి చిక్కకుండా కథ నడవాలి. నవల రాస్తున్నప్పుడు వచ్చే ఆలోచనల్ని సద్వినియోగం చేసుకోవాలి. మన దగ్గరున్న రంగు రాళ్ళని హారంలో అందంగా పొదిగినప్పుడు వచ్చే సౌందర్యం జీవితానుభవాన్ని జొప్పించినప్పుడు రచనకి కూడా వస్తుంది. మరొక మాట ఏమిటంటే, మనం రాసిన వాక్యాన్ని మనమే నిర్దాక్షిణ్యంగా కొట్టివేయగలగాలి. మనకి ఎంత తెలివి ఉన్నా పాఠకుడిని కన్విన్స్ చెయ్యాలి తప్ప కన్‌ఫ్యూజ్ చెయ్యకూడదు. నేను రాసిన పాత్రల్లో అత్యంత కఠినమైన పాత్ర ‘ఒక తూటా చాలు’ లోని గంగోత్రి పాత్ర.

ప్రశ్న 10. కొన్ని పాత్రలని పలు నవలలో ఉపయోగించుకోడం పట్ల మీ అభిప్రాయం ఏమిటి? ఉదాహరణకి మీ నవలల్లో పోలీస్ అధికారి భరద్వాజ్ (ఐ లవ్ మై ఇండియా, హిట్‍లిస్ట్). ఇలా పాత్రలని రిపీట్ చేసేటప్పుడు – ఒక నవలలో ఆ పాత్ర స్వరూప స్వభావాలని మారుస్తారా? ఒకవేళ మార్చాల్సి వస్తే ఆ పాత్ర ప్రదర్శించిన తెలివితేటలని, వ్యక్తిత్వాన్ని మరో నవలలో ఏ విధంగా కొత్తగా చెప్తారు?

జ: ఒక పాత్ర నీతి, నిజాయితీకి ప్రతినిధి అయినప్పుడు కంటిన్యూ చెయ్యడంలో తప్పు లేదని నా అభిప్రాయం. పాత్రలో పాఠకులకు నచ్చే లక్షణాలు ఉన్నప్పుడు వాటిని మార్చకూడదు. ఆ పాత్ర ఎడమ చేత్తో పిస్తోలు పేల్చే అలవాటు ఉన్నదైతే, అది అలాగే రాయాలి. పాఠకుడు చాలా తెలివైనవాడని రచయిత గుర్తుంచుకోవాలి.

ప్రశ్న11. మనుషుల మధ్య పెనవేసుకున్న ఆత్మీయతను వెల్లడించే విషయాలు చాలా చిన్నవి. వాటిలోని తీవ్రత కళ్ళతో కాకుండా మనసుతో పరికించాలి” అని పథకంనవలలో మీరు రాసిన వాక్యాలు చాలా లోతైనవి. కొంత వయసొచ్చిన తల్లిదండ్రులను పిల్లలు అర్థం చేసుకోవడంలో ఇలాంటి అవగాహన చాలా అవసరం. ఈ విషయంలో మీరు ఇంకా ఏం చెబుతారు?

జ: నిజమే.. సాధారణ జీవితంలో తల్లిదండ్రుల పట్ల కొంత నిర్లక్ష్య వైఖరి ఉంది. దానిని తప్పించడానికి రచయితలు కృషి చెయ్యాలి.

ప్రశ్న12. పథకంనవలలో ద్వివేదికి బరంపురం ప్రాంతానికి చెందిన కోందు ఆటవిక జాతుల గురించి చాలా వివరాలు చెప్తాడు సుబ్బారెడ్డి. ఇందుకు ఒరిస్సా చరిత్ర, ఆటవికుల ఆచార్య వ్యవహారాలపై ఎంతో అవగహాన అవసరం. మీకెలా ఈ అవగహాన కలిగింది? ఈ సమాచారాన్ని ఎలా సేకరించారు? సేకరించిన సమాచారంలో నవలలో ఎంత మేర ఉపయోగించారు?

జ. ‘పథకం’ నవలకి గిరిజనుల నేపథ్యం తీసుకోవాలని అనుకున్నపుడు కొందుల మీద చిన్న వ్యాసం చదివాను. ఆ కాస్త సమాచారం నవలకి చాలదు కాబట్టి కోందుల జీవితాల మీద గోపీనాథ్ మహంతి ఒరియాలో రాసిన ‘అమృత సంతానం’ చదివాను. ఏడు వందల యాభై పేజీల ఆ పుస్తకం మొదటి వాక్యం నుండి చివరి వాక్యం వరకూ ఓ కవితలా సాగిపోయే కోందుల సమగ్ర జీవితం అది. దాని నుండి సమాచారం సేకరించాను, ‘పధకం’ నవలలో పదిశాతం మాత్రమే ఉపయోగించుకున్నాను. మిగతా సమాచారంతో చతురలో వచ్చిన ‘కనిపించని సూర్యుడు’ రాసాను.

ప్రశ్న13. అన్వేషణనవలలో భరణి అనే రచయిత చెప్పిన “తను రాసింది అచ్చు కావాలని, అది అందరూ చదివి మెచ్చుకోవాలని, కాలానికి ఎదురీది తన రచన నిలవాలని రచయిత కోరుకుంటాడు. ఓ రచన చెయ్యడం ఎంత కష్టమో అది ప్రచురణ కావడం అంతకంటే ఎక్కువ కష్టం. ప్రస్తుతం రచయితకి రెండే మార్గాలున్నాయి. ఒకటి పత్రికల ద్వారా వెలుగు చూడడం, రెండోది స్వంత ఖర్చుతో పుస్తకం అచ్చు వేసి తృప్తి పడడం..” అన్న మాటలు తెలుగు రచయితలందరికీ వర్తిస్తాయి. కథలో భరణి పాత్ర రచయిత కాబట్టి, ఈ వాక్యాలు యాదృచ్ఛికంగా రాశారా? లేదా స్వీయ అనుభవాన్ని ఆ పాత్ర సంభాషణ ద్వారా కావాలనే చెప్పించారా?

జ: అవును.. భరణి పాత్ర వెనుక దాక్కుని నా అనుభవాలు చెప్పాను.

యద్దనపూడి సులోచనరాణి గారి నవలకి కూపన్ పెట్టారు పాఠకులకు బహుమతుల కోసం మాదిరెడ్డిగారు, సి. ఆనందరామం, మంజరి గారు కూపన్లు తీసిన సందర్భంలోనిది. అప్పటికి మంజరి గారు రచయిత కాదు.

ప్రశ్న14. అన్వేషణనవలలో ప్రధాన పాత్ర మహాలక్ష్మా లేక కావేరియా అన్న సందేహం పాఠకులకు కలుగుతుందనడంలో అతిశయోక్తి లేదు. మీ ముందుమాటలో “ఈ నవల రాస్తున్నప్పుడు నాకు తెలియకుండానే కొన్ని పాత్రలను అభిమానించాను” అని అన్నారు. మీకు ఏ పాత్ర బాగా నచ్చింది?

జ: కావేరి, మహాలక్ష్మి పాత్రలతో పాటు మేరీ పాత్రని కూడా మర్చిపోకూడదు. నా మూడు నక్షత్రాలు ఇవే.

ప్రశ్న15. రచయితగా మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలేమయినా సిద్ధమవుతున్నాయా?

జ: కొత్త నవల ముగింపు దశలో ఉంది.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు మంజరి గారూ.

మంజరి: ధన్యవాదాలు.

***

అన్వేషణ (సస్పెన్స్ మిస్టరీ నవల)
రచన: మంజరి
ప్రచురణ: క్లాసిక్ బుక్స్
పేజీలు: 184
వెల: ₹ 150/-
ప్రతులకు:
క్లాసిక్ బుక్స్
#32-13/2-3A, అట్లూరి పరమాత్మ వీధి
మొగల్రాజపురం,
విజయవాడ 520 010.
సెల్: 85220 02536
ఆన్‍లైన్‍లో:

https://www.amazon.in/ANVESHANA-SUSPENCE-MISTARY/dp/B0FHQWYNDR/

పథకం (క్రైమ్ థ్రిల్లర్ నవల)
రచన: మంజరి
ప్రచురణ: క్లాసిక్ బుక్స్
పేజీలు: 216
వెల: ₹ 200/-
ప్రతులకు:
క్లాసిక్ బుక్స్
#32-13/2-3A, అట్లూరి పరమాత్మ వీధి
మొగల్రాజపురం,
విజయవాడ 520 010.
సెల్: 85220 02536
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/Pathakam-Manjari/dp/B0DKVFDG58/

~
‘అన్వేషణ’, ‘పథకం’ నవలల సమీక్ష:
https://sanchika.com/anveshana-pathakam-book-reviews-kss/

Exit mobile version