[‘తెలంగాణ తొలితరం కథకులు – కథన రీతులు’ అనే వ్యాస సంపుటి వెలువరించిన శ్రీ కె. పి. అశోక్ కుమార్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం కె. పి. అశోక్ కుమార్ గారూ.
కె. పి. అశోక్ కుమార్: నమస్కారం.
~
ప్రశ్న 1. ‘తెలంగాణ తొలితరం కథకులు – కథన రీతులు’ అన్న వ్యాస సంపుటి వెలువరించినందుకు అభినందనలు. ఈ వ్యాసాల రచన వెనుక ఉన్న ఆలోచనని వివరిస్తారా?
జ: మలితరం తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న దశలో విస్మృతికి గురైన తెలంగాణ చరిత్ర – సాహిత్యం – సంస్కృతిని వెలికితీసే పని మొదలైంది. తెలంగాణ వాసులు ఆత్మన్యూనతను వదిలి తమ ఘనమైన వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలనే తపనతో కనుమరుగైన కళలను, సాహిత్యాన్ని పునరుద్ధరించుకునే పనిలో నిమగ్నులైనారు. ఈ క్రమంలో కొత్తగా వెలువడిన కాళోజీ కథలపై 2001లో, గూడూరి సీతారాం కథలపై 2005లో వ్యాసాలు రాయడం జరిగింది. ఉద్యమ సమయంలో కొంతమంది ఉత్సాహవంతులు గురజాడ అప్పారావు కంటే ముందుగా తెలంగాణ వ్యక్తియే తొలి తెలుగు కథ రాశారని నిరూపించడం కోసం మాడపాటి హనుమంతరావు గారిని ముందుకు తెచ్చారు. కానీ ఆయన నిలబడలేదు. దాంతో లేని బీరకాయ పీచు సంబంధం కలుపుకొని బండారు అచ్చమాంబను తొలి తెలంగాణ రచయిత్రిగా భుజాలకి ఎత్తుకున్నారు. మేధావులు సైతం దీనికి అభ్యంతర పెట్టలేదు. ఇదేమని ప్రశ్నిస్తే ఉద్యమ అవసరాల దృష్ట్యా ఏవేవో అనుకుంటాం, అవన్నీ పట్టించుకోవద్దు. ఉద్యమం సఫలమైన తర్వాత జరిగే పునర్ మూల్యాంకనంలో మంచి – చెడు తెలుసుకోగలుగుతారని అన్నారు. దాంతో ఎవరు తొలి తెలంగాణ కథకుడని అన్వేషిస్తూ తొలితరం తెలంగాణ కథకులను వరుసగా పాఠకులకు పరిచయం చేయాలని సంకల్పించాను.
ప్రశ్న 2: సాధారణంగా విశ్వవిద్యాలయాలు, అకాడమీలు చేయాల్సిన పని ఇది. మీరు ఒంటరిగా ఈ కార్యాన్ని సాధించారు. ఏ సందర్భంలోనైనా ఈ పని నావల్ల కాదు అన్న నిరాశ కలిగిందా? అలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా ముందుకు సాగారు?
జ: రాజకీయాలతో, నిధుల లేమితో కొట్టుమిట్టాడే అకాడమీలు, విశ్వవిద్యాలయాలు పనికివచ్చే ఏ పనిని చేపట్టడానికి సిద్ధంగా లేవు. నా వంతు పని నేను చేయాలని ముందుకు సాగాను. సమాచార విస్పోటనం అనే మాట వినడానికి బాగానే ఉంటుంది. కానీ సమాచారం ఎక్కడ ఉంది? ఎవరిని సంప్రదించాలో తెలియదు. పీరియాడికల్ ఆర్కైవ్స్ కూడా మూతబడింది. సమాచారం ఉన్నవాళ్లు దాన్ని మనతో పంచుకోవడానికి ఇష్టపడరు. వీలైతే దాన్ని కప్పి పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి నిరాశమయ వాతావరణంలో దొరకని సమాచారాన్ని పెండింగ్‌లో పెట్టి, ఇంకోదానికోసం ప్రయత్నిస్తూ ముందుకు సాగాను.
ప్రశ్న 3: విశ్వవిద్యాలయాలు, అకాడమీలు చేయాల్సిన పనులకు మీలాంటివారు పూనుకుంటే దాని వెనుక ఏదో వ్యక్తిగత ప్రయోజనం ఉండి ఉంటుందని దురుద్దేశాలను ఆపాదించేవారు అధికంగా ఉన్న కాలమిది. మీకు అలాంటి అనువభవమేదయినా ఎదురయిందా?
జ: సాహిత్య లోకంలో నా గురించి తెలిసిన వారెవరూ నాకు దురుద్దేశాలను అంటగట్టలేరు. పైగా ఈ వ్యాసాలను పాలపిట్ట పత్రికలో రాస్తూ ఉండటం వల్ల అందరూ చూసే అవకాశం కలగడం కూడా నాకు ప్లస్ పాయింట్ అయింది.
ప్రశ్న 4: కథలకులను ఎంపిక చేసుకునేటప్పుడు ‘జన్మతః’ తెలంగాణ వారినే తెలంగాణ కథకులుగా పరిగణించానని అన్నారు. కానీ జీవితాంతం తెలంగాణకే అంకితమై, తెలంగాణ సాంస్కృతిక వికాసానికి దోహదపడిన ఒకరిద్దరు ప్రాంతేతరులని కూడా జాబితాలో చేర్చానన్నారు. ఇందుకు మీరు ఏయే ప్రామాణికాలను ఎంచుకున్నారు? ఈ జాబితా పట్ల విమర్శలెదురయ్యాయా? వాటినెలా అధిగమించారు?
జ: వలస వచ్చిన వారు, ఇక్కడ స్థిరపడినవారు కూడా మేము తెలంగాణ వాళ్లమే అని క్లెయిమ్ చేసుకుంటుంటే, అసలు ఎవరు తెలంగాణ వాళ్ళో తేల్చడానికి, జన్మతః తెలంగాణ వారిని తెలంగాణ కథకులుగా గుర్తించాను. ఒకరిద్దరు మాత్రమే తెలంగాణకు వలస వచ్చి ఇక్కడి సమాజంలో కలిసిపోయి, ఇక్కడి వారి అభ్యున్నతి కోసం జీవితాన్ని ధారబోసిన మహానుభావులను తెలంగాణ వారిగానే గుర్తించాను. ఉదాహరణకు మాడపాటి హనుమంతరావు. ఈ ఎంపిక విషయంలో నాపై ఎలాంటి విమర్శలు రాలేదని గమనించండి.
ప్రశ్న 5: వ్యాస రచనకి 30 మంది కథకులని ఎంచుకున్నారు. వీరిని తెలంగాణ తొలితరం కథకులకు ప్రతినిధులుగా పరిగణించవచ్చా? కథలు వ్రాసి ప్రస్తుతం లభ్యం కాకుండా, విస్మృతిలో పడిన కథకులు మరికొందరు ఉండి ఉంటారు కదా. వారిని గుర్తించే మార్గం ఏదైనా ఉందా?
జ: నా పదేళ్ల కృషిలో ఈ 30 మంది కథకులను గుర్తించాను. నా దృష్టిలోనికి రాని వాళ్లు కూడా ఉండవచ్చు. వారి గురించిన సమాచారం, వారి కథలు దొరికినప్పుడే వారికి తీసుకొని నా మలి ముద్రణలో చేర్చగలను.
ప్రశ్న 6: తెలంగాణ తొలితరం కథకుల సృజనాత్మక నైపుణ్యాలకి అద్దం పట్టిన ఈ వ్యాసాల రచనకు ప్రణాళిక ఎలా వేసుకున్నారు? ఎలాంటి సాధకబాధకాలను ఎదుర్కొన్నారు?
జ: ముందు ఆయా రచయితలను, వారి గురించిన సమాచారాన్ని, వారి కథలను సేకరించాను. వాటి ఆధారంగా ఆయా రచయిత జీవిత విశేషాలు, వారి విశిష్టతను – వారి కథల విశ్లేషణను, గొప్పదనాన్ని వివరించాలనుకున్నాను.
ప్రశ్న 7: “తెలంగాణ తొలితరం కథకులు, మలితరం కథకుల కాల విభజన కూడా కొంత క్లిష్టంగా తయారయింది” అని అన్నారు ‘నా మాట’లో. మరింతగా వివరిస్తారా? అభ్యంతరాలని దాటి, అందరికీ ఆమోదమయ్యే రీతిలో కాల విభజనని ఎలా సాధించారు?
జ: నేను మొదట తొలితరం తెలంగాణ కథకులను 1912 – 1960 వరకు, మలితరం తెలంగాణ కథకులను 1960 – 70 వరకు అని విభజించుకున్నాను. కానీ తెలంగాణ మాండలిక కథా సాహిత్యం మీద పరిశోధన చేసిన మిత్రుడు ఏ.కే. ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో తొలితరంను ఆపేయమని సలహా ఇచ్చారు. కొంతమంది విమర్శకులు అదే పాటిస్తున్నారు. కానీ తొలి తరం వాళ్లే 1960 వరకు కొనసాగారు, కాబట్టి 1960 అని నేను అనుకున్నాను. కానీ అప్పటికే ఒక హద్దు నిర్ణయమై ఉండటం వల్ల 1956 నే ప్రామాణికంగా తీసుకున్నాను.
ప్రశ్న 8: ఈ వ్యాస సంపుటి లోని ఒక్కో కథకుని జీవిత విశేషాలూ, రచనా ప్రస్థానం గురించి చదువుతుంటే, మీరు చేసిన అధ్యయనం అవగతమవుతుంది. ఒక్కో కథకునిపై వ్యాసం సిద్ధం చేయడానికి అవసరమైన సమాచారం ఎలా సేకరించారు? ఎవరెవరు తోడ్పాటు అందించారు? ఏ కథకుడి జీవిత విశేషాలు, కథలు సేకరించడం మీకు బాగా కష్టమయింది?
జ: నేను ఎప్పటికప్పుడు పత్రికలు, పుస్తకాలు చదువుతూ ఉండటం వల్ల ఆయా కథకుల గురించిన సమాచారాన్ని సిద్ధం చేసుకోగలిగాను. ఈ విషయమై సంగిశెట్టి శ్రీనివాస్ ‘దస్త్రం’, తాటికొండ నరసింహారావు గారి ‘ఖమ్మం కథాసుధ’ ఎంతగానో ఉపకరించాయి. నాకు దొరకని పుస్తకాలు, కథల గురించి చెబితే ఎంతో శ్రద్ధ తీసుకొని కథానిలయం వాళ్ళు నాకు పంపించారు. వారికి నా కృతజ్ఞతలు. తాటికొండల నరసింహారావు గారు పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు కథల సంపుటాన్ని, ఎన్. వేణుగోపాల్ గారు పెండ్యాల రాఘవరావు, పెండ్యాల చిన్న రాఘవరావు గారి పుస్తకాలను అందజేశారు. యామిజాల ఆనంద్ ఆదిరాజు వీరభద్రరావు కథలను, సామల సదాశివ కథలను చెన్నకేశవరెడ్డి, బెల్లంకొండ సంపత్ కుమార్ వడ్డేపల్లి సోదరుల కథలను అందజేశారు. వారికి నా కృతజ్ఞతలు.
ప్రశ్న9: వెల్దుర్తి మాణిక్యాల రావు గారు, ధరణికోట శ్రీనివాసులు గారి వ్యక్తిగత సమాచారం, కథలు ఎలా సేకరించారు? ఎవరైనా కథకుడు మీ దృష్టికి వచ్చి, సంబంధిత వివరాలు దొరకక, వ్యాసం రాయలేని పరిస్థితి ఎదురైందా?
జ: వెల్దుర్తి మాణిక్యరావు, ధరణికోట శ్రీనివాసులు కథలు గాని, వారి గురించిన సమాచారం గానీ దొరకక చాలా కాలం ఆగాల్సి వచ్చింది. అనుకోకుండా గోలకొండ పత్రికలో వచ్చిన కథలను రెండు భాగాలుగా నవచేతన వారు ప్రచురించారు. వెల్దుర్తి వారు ఎక్కువగా గోలకొండ పత్రికలో రాశారు, కాబట్టి అందులో ఉన్న పది కథలను సేకరించి వ్యాసం రాయగలిగాను. ధరణికోట శ్రీనివాసులు వేసిన రెండు కథా సంపుటాలు దొరకలేదు. అవి ఉన్న వ్యక్తి మనకు ఇవ్వడానికి ముందుకు రాలేదు. దానితో పత్రికల్లో, ప్రత్యేక సంపుటాలలో వచ్చిన కథలతో వారి మీద వ్యాసాలు రాయగలిగాను.
ప్రశ్న 10: ఈ 30 మంది కథకుల ప్రభావం ఆనాటి సమాజంపైన, పాఠకులపైన ఎలా ఉండేదని మీరు భావిస్తున్నారు?
జ: కథల ప్రభావం ఇప్పుడు సమాజం మీద ఎలా ఉందో, అప్పుడు కూడా అలాగే ఉండేది. ఈ కథలు ముఖ్యంగా ఉద్యమకారులను, సానుభూతిపరులతో పాటు మామూలు పాఠకులను కూడా ఆలోచింపజేశాయని చెప్పవచ్చు.
ప్రశ్న11: ఈ పుస్తకం రూపొందించేందుకు (వ్యాసాలు రాయాలన్న ఆలోచన నుంచి – వ్యాస సంపుటి విడుదలయ్యేంత వరకు) ఎంత కాలం పట్టింది? అంతకాలం మీరు ఈ ప్రాజెక్టుపై ఆసక్తి సడలకుండా ఎలా కాపాడుకున్నారు? ఈ కాలంలోనే మీరు చేపట్టి పూర్తిచేసిన ఇతర సాహిత్య సంబంధిత కార్యక్రమాలేవైనా ఉన్నాయా?
జ: దాదాపుగా 10 సంవత్సరాలు పట్టింది. అంటే నాకు తెలియని పాత తరం వారిని వెతకడం, వారి కథలను వెతికి పట్టుకోవడంతోనే గడిచిపోయింది. ఈ గ్యాప్‌లో నా ఇతర వ్యాపకాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగాయి. వ్యాసరచన, సమీక్షలు చేయడం, సమావేశాలు – సెమినార్లలో పాల్గొనడం, పుస్తకాలు వేసుకోవడం ఇలా.. దేని దారి దానిదే.
ప్రశ్న12. ఈ వ్యాస సంపుటిలోని 30 మంది కథకుల కథా వస్తువుల ఎంపికలోని, శైలి, శిల్పాల లోని ఏదైనా సారూప్యత గోచరించిందా? వీరి వివిధ కాలాల నడుమ ఒకే ఇతివృత్తంతో వచ్చిన కథలేమైనా మీ దృష్టికి వచ్చాయా?
జ: ఎవరి ప్రత్యేకత వారిదే. నిజాం వ్యతిరేక పోరాటం వస్తువుగా తీసుకొని కథలు రాసినా ఎవరి దృక్పథం వారిదే. ఇక సారూప్యత గురించి పాఠకులే చెప్పాలి.
ప్రశ్న13. ఇటీవలి కాలంలో తెలుగులో సాహితీవిమర్శ ప్రాధాన్యం తగ్గినట్లనిపిస్తోంది. విమర్శని ఓ ప్రక్రియగా సాధన చేసేవారు, లోతైన అధ్యయనం చేసేవారి సంఖ్య ప్రస్తతం బాగా తగ్గినట్టు అనిపిస్తోంది. భవిష్యత్తులో చక్కని సాహితీవిమర్శకుడిగా రాణించగలరన్న యువవిమర్శకులెవరైనా మీ దృష్టికి వచ్చారా?
జ: నేను అందరి విమర్శలు చదువుతాను. అందులో యువకులు ఎవరో, ముసలివాళ్లు ఎవరో తెలియదు.
ప్రశ్న14. విమర్శని రచనపై దాడిగా, విమర్శకుడిది సంకుచిత మనస్తత్వంగా భావిస్తున్నారు కొందరు. ఓ సాహితీవిమర్శకునిగా, అధ్యయనపరుడిగా ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి?
జ: విమర్శను సహృదయతతో తీసుకునే మనస్తత్వం మన తెలుగువారికి లేదు. విమర్శ అంటే పొగడ్తనే. ఏ మాత్రం లోపాలు సూచించినా భరించలేరు. అది వ్యక్తిగత ద్వేషంగా రూపుదిద్దుకొని దాడులకు సిద్ధమవుతారు.
ప్రశ్న15. తెలుగు సాహిత్య విమర్శలో, పరిశోధనలో, అధ్యయనంలో, తెలంగాణా సాహిత్యం పట్ల వివక్ష వున్నదంటారా? వివక్ష స్వరూపమేమిటి?
జ: ఒకప్పుడు అన్ని రంగాలలో తెలంగాణ పట్ల వివక్ష ఉండేది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మన పట్ల వివక్ష చూపడానికి ఎదుటివారు కూడా ఒకటి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుంది.
ప్రశ్న16. ‘తెలంగాణ మలితరం కథకులు – కథన రీతులు’ పేరుతో ‘సంచిక’ లో కొన్ని వ్యాసాలు రాశారు. అవి పుస్తకంగా ఎప్పుడు వెలువడవచ్చు?
జ: త్వరలోనే ‘తెలంగాణ మలితరం కథకులు- కథనరీతులు’ వస్తుంది.
ప్రశ్న17. పరిశోధకుడిగా, సాహితీ విశ్లేషకుడిగా మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?
జ: ఎప్పుడూ చదువుతూ, రాస్తూ ఉండటమే.
~
సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు కె. పి. అశోక్ కుమార్ గారు.
కె. పి. అశోక్ కుమార్: సంచిక టీమ్‌కి నా ధన్యవాదాలు.
***
రచన: కె. పి. అశోక్ కుమార్
ప్రచురణ: నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్
పేజీలు: 280
వెల: ₹ 280.00
ప్రతులకు:
నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్,
ఎం.హెచ్. భవన్, ప్లాట్ నెం. 21/1,
అజామాబాద్, ఆర్.టి.సి. కల్యాణమండపం దగ్గర,
హైదరాబాద్ 500020. 040-27673787
~
నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఇతర శాఖలు
~
‘తెలంగాణ తొలితరం కథకులు – కథన రీతులు’ సమీక్ష:
https://sanchika.com/telangana-tolitaram-kathakulu-kathana-reetulu-book-review-kss/