[‘కుమార్తెకు ప్రేమతో – నాన్న’ అనే పుస్తకం వెలువరించిన శ్రీ జాలాది రత్నసుధీర్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం జాలాది రత్నసుధీర్ గారూ.
జాలాది రత్నసుధీర్: నమస్కారం.
~
ప్రశ్న 1. ఇటీవల ‘కుమార్తెకు ప్రేమతో – నాన్న’ అనే పుస్తకం వెలువరించినందుకు అభినందనలు. ఇటీవలి కాలంలో ఆదరణ తగ్గిన ‘ఉత్తరాలు వ్రాసుకోడం’ అనే ప్రక్రియపై పుస్తకం ప్రచురించాలన్న ఆలోచన ఎలా వచ్చింది? పాఠకుల కోసం వివరంగా చెప్తారా?
జ: ఉత్తరాలు రాయడం, ఉత్తరాలు చదవడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఉత్తరాలలో నా బాల్యముంది, నా యవ్వనముంది, నా జ్ఞాపకాలు ఉన్నాయి. అందులోనే నా హృదయం చిక్కుకొంది. నాకు ‘జయహో జాలాది’ అనే యుట్యూబ్ ఛానెల్ ఉంది. అందులో నాలుగు సంవత్సరాల క్రితమే ‘లెటర్స్ రాయండి, బెటర్ అవ్వండి’ అనే వీడియో చేశాను. ఉత్తరాల పట్ల నా నిబద్ధత అది.
ఆ మధ్య ఒక స్నేహితుని కుమార్తె వివాహానికి నేను హాజరు కాలేకపోయాను. ఆయనకు ఉత్తరం రాసి అభినందనలు, నూతన దంపతులకు దీవెనలు తెలియచేసాను. ఉత్తరం అందుకొన్న వెంటనే మిత్రుడు ఫోన్ చేసాడు. ఉత్తరం చదివి అతను ఎంతో సంతోషించాడు. ఉత్తరాలలో ఒక మానవీయ స్పర్శ ఉంటుంది. ప్రేమ వ్యక్తీకరణ ప్రదర్శితమవుతుంది.
అతి సాధారణమైన క్షేమ సమాచారం మాత్రమే కాకుండా, సీరియస్ విషయాలు కూడా ఉత్తరాల ద్వారా తెలియచేయడం ఉపయోగకరం. ఎందుకంటే, ఉత్తరాలలో వాద ప్రతివాదలకు ఆస్కారం ఉండదు. ఒక విషయం డిబేట్‌గా మరే అవకాశం గానీ, కోపానికి లేదా ఉద్రేకానికి లోనయ్యే ఛాన్స్ గానీ ఉండదు. ఉత్తరం అందుకొన్న వ్యక్తి చదివి, ప్రశాంతంగా ఆలోచించే వెసులుబాటు ఉంటుంది.
లేఖ సాహిత్యానికి నేను వ్రాసిన ప్రేమలేఖ ఈ నా ‘కుమార్తెకు ప్రేమతో – నాన్న’.
ప్రశ్న 2: వృత్తి రీత్యా మీరు రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఉన్నతాధికారిగా పనిచేశారు. మీకు తెలుగు సాహిత్యం మీద అభిరుచి ఎలా కలిగింది? మీ సాహితీ ప్రస్థానం గురించి వివరిస్తారా?
కానీ, మధ్య తరగతి కుటుంబ నేపథ్యం వలన, భవిష్యత్తు పట్ల ఒక అభద్రతా భావంతో చదువులపై ఫోకస్ ఎక్కువగా ఉండేది. తరువాత పోటీ పరీక్షలకు సిద్ధమవటం, ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు.. హాబీలపై ఎక్కువ మనసు, సమయం కేంద్రికరించలేకపోయాను. ఈ కారణంగానే సాహిత్యం కూడా ఎక్కువగా చదవలేదు.
అప్పటివరకు వ్రాసిన కవితలతో, 1995లో ‘ప్రక్షాళన’ కవితా సంకలనం ప్రచురించాను. డా. సినారె గారు ముందుమాట వ్రాసారు, పుస్తకాన్ని ఆవిష్కరించారు. అక్కినేని నాగేశ్వర రావు గారు, వాకాటి పాండురంగ రావు గారు వ్యక్తపరచిన అభిప్రాయాలు కూడా అందులో ఉన్నాయి. 1996లో ‘నగర జీవితం’ పై స్ఫూర్తి ఆర్ట్ థియేటర్ వారు నిర్వహించిన కవితల పోటీలో ప్రథమ బహుమతి, డా. సినారె గారి చేతుల మీదుగా అందుకున్నాను.
తరువాత ఉద్యోగ బాధ్యతలు పెరిగాయి. చాలా గాప్ తరువాత 2007లో ‘స్పర్శ’ కవితా సంకలనం ప్రచురించాను. అప్పుడు ఖమ్మంలో ఉద్యోగం చేస్తున్నాను. ఖమ్మం స్తంభాద్రి సంబరాలలో ప్రముఖ హాస్య నటులు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఈ కవితా సంకలనాన్ని ఆవిష్కరించారు.
2008లో భువనేశ్వర్‌లో జరిగిన సార్క్ దేశాల కవుల సమావేశంలో పాల్గొనడం, ‘స్పర్శ’ కవితా సంకలనం నుండి ‘ఇల్లు’ కవిత ఆంగ్లనువాదం ఎనిమిది దేశాల కవుల సమక్షంలో చదివి వినిపించడం ఒక తీపి జ్ఞాపకం.
2008లో సోమేపల్లి కథల పోటీలలో నా కథకు బహుమతి వచ్చింది. మొదటి కథకే బహుమతి రావడం వలన కథలపై ప్రేమ పెరిగింది. 2016లో పన్నెండు కథలతో ‘మనసు కథలు’ ప్రచురించాను. 2017లో కేంద్ర ప్రభుత్వం నుండి డైరెక్టర్, ఫైనాన్స్‌గా రిటైర్ అయ్యాను.
2020 సంవత్సరంలో ‘అమ్మ చెక్కిన శిల్పం’ వ్రాసాను. కొందరు మహనీయులు, సెలబ్రిటీల జీవితాలపై తల్లి ప్రభావాన్ని ఇందులో వివరించే ప్రయత్నం చేశాను. అప్పటి ఉప రాష్ట్రపతి, గౌ. శ్రీ. వెంకయ్య నాయుడు గారు ముందుమాట వ్రాసారు. ఈ పుస్తకానికి మంచి పాఠకాదరణ లభించింది. అప్పటి తెలంగాణ గవర్నర్ గౌ. శ్రీమతి. తమిళసై సౌందర్ రాజన్ గారు రాజ్‌భవన్‌లో దీనిని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ఆంగ్లంలోనికి అనువదించి ‘ది మదర్’ పేరుతో ప్రచురించాను. హర్యానా గవర్నర్ గౌ. శ్రీ. బండారు దత్తత్రేయ గారు దీనిని ఆవిష్కరించారు.
డా. లక్ష్మణాచార్యులు గారు ఈ పుస్తకాన్ని హిందీ భాషలోకి అనువదించారు. 2024 లో రవీంద్రబారతిలో పుస్తకావిష్కరణ జరిగింది.
2023లో నా రెండవ కథా సంకలనం ‘మనసు పలికిన’ ప్రచురించాను. దీనిని ‘హార్ట్ బీట్స్’ పేరుతో ఇంగ్లీష్ లోకి అనువదించి ప్రచురించాను.
ఇదే సమయంలో నా వ్యక్తిత్వవికాస పుస్తకం ‘గెలవాలంటే’ ప్రచురించాను. మంచి పాఠకాదరణ పొందింది. దీని ఆంగ్లనువాదం ‘ది సెవెన్ సీక్రెట్స్ టు సక్సెస్’ ప్రచారించాను. మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ. వెంకయ్య నాయుడు గారు దీనిని ఆవిష్కరించారు.
‘సరదాల సంసారం’, ‘నీలి మేఘాలు’ సినిమాలకు పాటలు వ్రాసాను. ఈ టీవీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్‌కు కొంత కాలం రచయితగా ఉన్నాను.
ప్రశ్న 3: మీరు కవితలు, కథలు వ్రాసారు. ప్రేరణాత్మక సాహిత్యం లోను కృషి చేసారు. ఈ ప్రక్రియల్లో ఏదంటే మీకు ఎక్కువ మక్కువ? ఎందుకు?
జ: నాకు ప్రేరణాత్మక సాహిత్యం అంటేనే ఎక్కువ మక్కువ. సుమారు ఏబై సంవత్సరాల క్రితం సి. నరసింహ రావు గారు ‘రేపు’ అనే వ్యక్తిత్వవికాస పత్రిక నడిపేవారు. అది ఇష్టంగా చదివేవాడిని. అయన పుస్తకాలు, వ్యాసాలు బాగుంటాయి. అలాగే యండమూరి గారి ‘విజయానికి ఐదు మెట్లు’. నా జీవితానుభావాలను కూడా ఈ ప్రేరణాత్మక సాహిత్యం ద్వారా నవతరానికి అందించాలని నా తాపత్రయం.
నేను వ్రాసిన ‘మనసు పలికిన’ కథా సంకలనాన్ని పరిచయం చేస్తూ ఒక పత్రిక వ్యక్తిత్వవికాస కథలుగా అభివర్ణించింది. అంటే నా కథా సాహిత్యంలో కూడా ప్రేరణాత్మక సాహిత్యం ఇమిడిపోయింది.
ఎంతో భవిష్యత్తు ముందున్న యువతరానికి ఈ ప్రేరణాత్మక సాహిత్యం ప్రయోజనకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. వారికి ఈ సాహిత్యం అందాలి, వారు చదవాలి.
జ: అపురూపమైన ఈ తండ్రీ కుమార్తెల బంధాన్ని అక్షరీకరించాలని చాలా కాలంగా అనుకొంటున్నాను. కుమార్తె ఎదుగుతున్న వయసులో ఆమె ప్రవర్తన ఎలా ఉండాలి, మెట్టింట్లో ఎలా మెలగాలి.. మొదలైన విషయాలు తల్లి నేర్పుతుంది. కానీ, ప్రస్తుతం స్త్రీకి జీవితమంటే ఇవి మాత్రమే కాదు కదా. ఆమెకు కెరీర్ కావాలి, అవసరమైన విద్యార్హతలు సాదించాలి, పోటీని ఎదుర్కోవాలి, పోరాటాలు చేయాలి, పురుషాధిపత్యాన్ని అధిగమించాలి. ఈ విషయాలు తండ్రి చెబితేనే బాగుంటుందని నేను భావిస్తున్నాను. కానీ ఎలా? నీతి బోధలు చేస్తే స్వీకరించడానికి యువత సిద్ధంగా లేరు. విషయ సమాచారాన్ని వివరించడానికి వ్యాసాలు బాగుంటాయి. కానీ, ప్రేమ వ్యక్తీకరణకు ఇవి అనుకూలం కాదు. అందుకే ఈ లేఖలు.
ఉత్తరాలలో ఇద్దరు వ్యక్తులు ఎదురు ఎదురుగ కూర్చొని మాట్లాడుకుంటున్న అనుభూతి కలుగుతుంది. తండ్రి, కుమార్తె పక్కన కూర్చొని భుజం మీద చేయి వేసి లాలిస్తూ చెబుతున్న భావన ఈ ఉత్తరాల ద్వారా కలుగుతుందని నేను విశ్వసిస్తున్నాను.
ప్రశ్న 5: ‘ఆ ఉత్తరాల సమాహారమే ఈ నవల’ అని అన్నారు. కానీ ఈ పుస్తకం ‘నవల’ నిర్వచనంలో ఒదగదు కదా?
జ: తండ్రి, కుమార్తె – రెండు పాత్రలు, కొన్ని ఉత్తరాలతో పుస్తకం ప్రచురిస్తే పాఠకులకు ఆసక్తికరంగా ఉండదని భావించాను. అందువలననే ఒక మధ్య తరగతి కుటుంబాన్ని సృష్టించి, వారి సమస్యలతో చిన్న కథ అల్లే ప్రయత్నం చేశాను. జీవితాలను ఆవిష్కరించి చూపేది ‘నవల’ కాబట్టి, ప్రారంభంలో దీనిని ‘నవల’గా భావించాను. కానీ, మీరన్నట్లు ఈ పుస్తకం ‘నవల’ నిర్వచనంలో ఒదగదు. ద్వితీయ ముద్రణలో ‘నవల’ పదాన్ని తొలగించాలనుకొంటున్నాను.
ప్రశ్న 6: “ఆర్ద్రత, ఆత్మీయత, అనురాగభరితమైన వాక్యనిర్మాణం జాలాది రత్నసుధీర్ వచనరచనలోని ప్రత్యేక ఆకర్షణ” అని తమ ముందుమాటలో గుడిపాటి గారు వ్యాఖ్యానించారు. ఇటువంటి ప్రేరణాత్మక సాహిత్యంలో పాటించాల్సిన శైలి, శిల్పం.. కథారచనలో పాటించాల్సిన శైలి, శిల్పం కంటే ఏ రకంగా భిన్నమైనవి?
జ: ప్రేరణాత్మక సాహిత్యంలో మనం చెప్పే విషయం సూటిగా, సరళంగా, స్పష్టంగా ఉండాలి. ఉదాహరణలు, వాస్తవ సంఘటనలు ప్రస్తావించాలి. అన్నిటికీ మించి పుస్తకం చదువుతున్న వ్యక్తి భుజం మీద చేయి వేసి, అతని చెవిలో, అతనికి మాత్రమే చెబుతున్న అనుభూతి కలగాలి.
ప్రశ్న 7: ‘ఈ పుస్తకం తండ్రీ కుమార్తెల అనుబంధ ప్రబంధం’ అని వెనుక అట్ట మీద వ్యాఖ్యానించారు. తండ్రీకూతుళ్ళు ప్రధానంగా అనిపించినప్పటికీ, ఈ పుస్తకంలో కుటుంబంలోని ఇతర సభ్యులని కూడా సందర్భోచితంగా ప్రస్తావించి, ఫ్యామిలీలో కంప్లీట్‌నెస్ తేగలిగారు. ఉత్తరాలలో ఇతర కుటుంబ సభ్యులను చేర్చేలా సన్నివేశాలు కల్పించాలన్న ఆలోచన ఎలా కలిగింది?
జ: ఒక తండ్రి, కుమార్తెకు ఏమి చెప్పాలి? ఏమేమి తెలియచేయాలి? – ఇవి చాలా కాలంగా నా మనసును వేధిస్తున్న ప్రశ్నలు. ఎలా చెప్పాలి అనేది మరింత పెద్ద సమస్య. ఈ పుస్తకం చదువుతుంటే ప్రతి తండ్రి, కుమార్తెను గుర్తు చేసుకోవాలి. కుమార్తెను ఎలా పెంచాలో నేర్చుకోవాలి. పుస్తకాన్ని చదువుతున్న స్త్రీ, తన తండ్రిని తలచుకోవాలి. తండ్రి తనతో మాట్లాడుతున్న భావన కలగాలి. కానీ, చెప్పాలనుకున్న విషయం ఒక వ్యాసం, లేదా ఉపన్యాసం, లేదా నైతిక నియమావళి వాలే ఉండకూడదు. మరి ఎలా?
అంతర్మథనం జరిగింది. అంతిమంగా, త్రివేణి సంగమంలా మూడు ప్రవాహాల సమ్మిళితంగా ఈ పుస్తకం రూపొందింది. తండ్రి, కుమార్తెకు చేసే జ్ఞానబోధ ఒక ప్రవాహం. తండ్రి కుమార్తెల అనుబంధాన్ని ఆవిష్కరించే వాస్తవ గాథలు రెండవ ప్రవాహం, ఒక మధ్య తరగతి కుటుంబం, అది ఎదుర్కొనే సమస్యలు మూడవ ప్రవాహం.
ప్రశ్న 8: పురుషోత్తమరావు తన చిన్న కూతురు ‘సాహసి’కి వ్రాసిన ఉత్తరాలలో మీరు వివిధ సమకాలీన అంశాలను/వార్తలను జొప్పించారు. ఆయా ఘటనలను ఇతివృత్తానికి అనువుగా మలచుకున్నారు. ఈ పుస్తకం కోసం మీరు చేసిన అధ్యయనం/పరిశోధనల గురించి వివరిస్తారా?
జ: ప్రేరణాత్మక సాహిత్యంగా నేను ఇంతకు మునుపు వ్రాసిన ‘అమ్మ చెక్కిన శిల్పం’, ‘గెలవాలంటే’, ప్రస్తుత ‘కుమార్తెకు ప్రేమతో – నాన్న’ పుస్తకాలలో వాస్తవ సంఘటనలు కథలుగా మిళితమై ఉంటాయి. ఇవి ప్రేరణాత్మక సాహిత్యానికి వన్నె తెస్తాయని భావిస్తాను.
నేను ప్రతి రోజు మూడు వార్తాపత్రికలు చదువుతాను. ఆసక్తికర సంఘటనలు కట్ చేసి ఫైల్ చేస్తాను. నేను పుస్తకం వ్రాసేటపుడు అవసరమైన కట్టింగ్స్ రిఫర్ చేస్తాను, గూగుల్‌లో దానికి సంబంధించి మరింత సమాచారం సేకరిస్తాను.
2020లో నేను వ్రాసిన ‘అమ్మ చెక్కిన శిల్పం’ పుస్తకానికి, అప్పటికి ఇరవై సంవత్సరాల ముందు కట్ చేసి పెట్టిన ప్రెస్ క్లిప్పింగ్స్‌ను కూడా ఉపయోగించుకున్నాను.
‘కుమార్తెకు ప్రేమతో’ పుస్తకానికి ప్రెస్ క్లిప్పింగ్స్‌తో పాటు, సాంకేతిక అంశాల కోసం చాట్ జిపిటి వంటి ఆన్లైన్ వేదికల నుండి సమాచారాన్ని సేకరించాను. పేరెంటింగ్ మీద ఒకటి రెండు విదేశీ పబ్లికేషన్స్ చదివాను.
ప్రశ్న9: పుస్తకం లోని ప్రతీ లేఖకి ముందు పేజీలో తండ్రీ కూతుళ్ళ గురించి చక్కని ఇంగ్లీష్ కొటేషన్స్ అందించారు. ఈ ఐడియా ఎలా తట్టింది?
జ: కొటేషన్స్, సామెతలు, జాతీయాలు.. ఇవన్నీ మన ముందు తరాల వాళ్ళు మనకు అందించిన జ్ఞాన గుళికలు. అందువలననే నా ప్రతి ప్రేరణాత్మక రచనలో కొటేషన్స్ విరివిగా ఉపయోగించుకుంటాను.
ప్రశ్న 10: సాధారణంగా రచయితలకి తాము రాసే అన్ని రచనలు నచ్చుతాయి. అయితే ఈ పుస్తకంలోని ఏ లేఖ మీ దృష్టిలో అత్యంత ప్రభావవంతమైనది? ఎందుకు?
జ: ఈ పుస్తకం లోని ప్రతి పదం నా హృదయ స్పందనల ప్రతిధ్వని. మీరు ఈ ప్రశ్న అడిగిన వెంటనే అన్నీ లేఖలు ఒకసారి రెవైండ్ చేసుకున్నాను. ఎనిమిదవ లేఖ అత్యంత ప్రభావవంతమైందని భావిస్తున్నాను. ఎందుకంటే ఈ పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశం ఆ లేఖలోనే కేంద్రీకృతమైనది. ఏ విధంగా? తమ తమ జీవితాలను ఉన్నంతంగా నిర్మించుకోవాలనుకొనే యువతులకు, కుమార్తెలను ఉత్తమ వ్యక్తులుగా తీర్చి దిద్దాలనుకునే తండ్రులకు అవసరమైన సమాచారం ఈ లేఖలోనే ఉంది.
ప్రశ్న11: ‘కుమార్తెకు ప్రేమతో – నాన్న’ పుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఉంటే వాటిని పంచుకుంటారా? ఈ పుస్తకాన్ని పాఠకులకు ఎలా చేరువ చేశారు?
జ: ఈ పుస్తకం వ్రాయాలని ఎన్నో సంవత్సరాల నుండి అనుకొంటున్నాను. కానీ, ఇది ఒక ‘డ్రై’ సబ్జెక్టు. దీని మీద విషయ సమాచార అందుబాటులో ఉండదు. అస్పష్ట ఆలోచనలకు అక్షర రూపం కల్పించడం, వాటిని ఒక వరుసలో పేర్చడం, ఆసక్తికరంగా మలచడం, ప్రతిదీ ఒక సవాలే. అందుకే ఈ పుస్తకం నాకు చాలా తృప్తినిచ్చింది. ఈ సబ్జెక్టు మీద ఒక వ్యాసం సులువుగా రాయవచ్చు. ఒక పుస్తకం రాయడం కష్టం.
ఈ పుస్తకాన్ని జూన్ 2024లో ‘ఫాదర్స్ డే’ నాడు ఆవిష్కరించాలనుకున్నాను. వీలుపడలేదు. సెప్టెంబర్‌లో ఇంటర్నేషనల్ డాటర్స్ డే నాడు (22.09.2024) రాజభవన్లో ఆవిష్కరించాలనుకున్నాను. తెలంగాణ గవర్నర్ గౌ. శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారు దయతో అంగీకరించారు. వారిని రాజభవన్లో కలిసి నేను వ్రాసిన ఇంగ్లీష్ బుక్స్‌తో పాటు ఈ పుస్తకం కూడా బహుకరించాను. కానీ, కొన్ని సాంకేతిక కారణాల వలన ఈ ప్రోగ్రామ్ జరుగలేదు. అంతిమంగా పుస్తకావిష్కరణ సభ జరుగకుండానే ఈ పుస్తకం విడుదల చేశాను.
ఈ పుస్తకం అన్ని బుక్ షాప్స్‌లో, ఆన్లైన్లో అందుబాటులో ఉంది. హైదరాబాద్, విజయవాడ బుక్ ఫెయిర్స్ లో నా స్టాల్ (జాలాది రత్న సుధీర్ రచనలు) లో, పాలపిట్ట బుక్ స్టాల్లో ఈ పుస్తకం పాఠకులు కొనుగోలు చేశారు.
ప్రశ్న12. కవిగా, కథకుడిగా, మోటివేషనల్ రైటర్‌గా మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలు ఏవైనా సిద్ధమవుతున్నాయా?
జ: కవిత్వం చిన్నప్పటి నుండి ఇష్టం. వచనం వ్రాయడం ప్రారంభించాక, గత పదిహేను సంవత్సరాలుగా కవిత్వంతో డిస్కనెక్ట్ అయ్యాను. మరలా కవిత్వం రాయాలని ఉంది. రెండు నవలలకు ముడి సరకు సిద్ధంగా ఉంది. కొన్ని కథలు అస్పష్టంగా మనసులో నిర్మితమై ఉన్నాయి. పేరెంటింగ్, ఆదర్శ దాంపత్యం మీద వ్రాయాలని ఉంది. ఈ సాహితీ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది.
~
సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు జాలాది రత్నసుధీర్ గారు.
జాలాది రత్నసుధీర్: సంచిక టీమ్‌కి నా ధన్యవాదాలు.
***
రచన: జాలాది రత్నసుధీర్
పేజీలు: 130
వెల: ₹ 150
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
జాలాది రత్నసుధీర్
ఫోన్: 9849418009
ఆన్లైన్లో
https://www.amazon.in/dp/B0DT64NTNV
~
‘కుమార్తెకు ప్రేమతో – నాన్న’ పుస్తక సమీక్ష
https://sanchika.com/kumarteku-premato-nanna-book-review-kss/