[‘అందమైన జీవితం’ అనే కథా సంపుటిని వెలువరించిన శ్రీ సి.ఎన్. చంద్రశేఖర్ ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం సి.ఎన్. చంద్రశేఖర్ గారూ.
సి.ఎన్. చంద్రశేఖర్: నమస్తే.
~
ప్రశ్న 1. మీ 13వ పుస్తకంగా ‘అందమైన జీవితం’ అనే కథాసంపుటి ప్రచురించినందుకు అభినందనలు. 17 కథలున్న ఈ పుస్తకానికి 5 కథ పేరునే ఎంచుకోవడంలో ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?
జ: ధన్యవాదాలండీ! ‘అందమైన జీవితం’.. ఆ టైటిల్ చదువుతూంటేనే ఓ ఆహ్లాదకరమైన ఫీలింగ్ కలుగుతుంది. కథాంశం-నేడు మన సమాజంలో ఉన్న అతిముఖ్యమైన సమస్యల్లో ఒకటి. భార్యాభర్తల మధ్య అవగాహనా రాహిత్యం, తొందరపాటు నిర్ణయాలు, అందువల్ల సంసారాలు విచ్ఛిన్నమైపోవడం. ‘ఇద్దరూ సహనంతో ఉంటే అన్ని సమస్యలకూ పరిష్కారాలు దొరుకుతాయి. కొంతకాలానికి అసలు అవి అసలు సమస్యలే కావన్న భావన కూడా కలుగుతుంది. అందమైన జీవితం తమ సొంతమవుతుంది’ అన్న విషయాన్ని ఈ కథలో చెప్పాను. ఇందులోని పాత్రలన్నీ కూడా విలక్షణమైనవి. మానస మొదట్లో కాస్త తొందరపడినా ఓ ఆత్మీయుని మాటలకు విలువనిచ్చి, సహనంతో తన కాపురాన్ని కాపాడుకునే పాత్ర. ఈ కథ సమస్యతో మొదలై సంతృప్తితో ముగుస్తుంది. ఇన్ని మంచి లక్షణాలున్న కథ కనుక ఈ కథ శీర్షికనే పుస్తకం శీర్షికగా పెట్టాను.
ప్రశ్న 2. ఇది మీ 10వ కథాసంపుటి. కవిగా, కథకుడిగా, నవలా రచయితగా మీ సాహితీ ప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా? మొదటగా ఏ ప్రకియతో సాహిత్య వ్యాసంగం మొదలుపెట్టారు? ఎప్పుడు? మీ కథా రచన గురించి వివరిస్తారా?
జ: నేను హైస్కూల్లో చదువుతున్నప్పట్నుంచే తెలుగు పత్రికలు చదివేవాడిని. కాలేజీకి వచ్చాక నవలలు (తెలుగు మరియు ఆంగ్లం) చదివేవాడిని. బి.ఎస్.సి. పూర్తయ్యాక ఉద్యోగం తెచ్చుకోవడానికి పోటీ పరీక్షల కోసం చదువుకుంటున్నప్పుడు దొరికిన విరామ సమయంలో ఆరు నవలలు రాశాను. నా చేతివ్రాతతో అవి ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేరాక ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు.. వీటితో బిజీ అయిపోయాను. 1991లో మయూరి పత్రికలో కార్డు కథలు ప్రచురిస్తూంటే నేను ‘బంద్’ అనే ఓ కార్డు కథ రాసి పంపితే దాన్ని ప్రచురించారు. పత్రికలో అచ్చైన నా మొదటి కథ అది. అప్పట్నుంచీ అప్పుడప్పుడూ కార్డు కథలు, సింగిల్ పేజీ కథలు, కవితలు రాసి పత్రికలకు పంపేవాడిని. 2001 వ సంవత్సరం నుంచీ విరివిగా వ్రాయడం మొదలుపెట్టాను.
ఇప్పటివరకూ 200 పైగా కథలు, 3 నవలలు, ఓ యాభై దాకా కవితలు వ్రాశాను. 13 పుస్తకాలు ప్రచురించాను.
ప్రశ్న 3. మీకు కవిత/కథ/నవల – వీటిలో ఏది వ్రాయడం సులువని అనుకుంటారు? ఎందువల్ల?
జ: నవల వ్రాస్తున్నప్పుడు రచయిత తాను చెప్పదలచుకున్న కథను ఎంతవరకైనా పొడిగించుతూ వెళ్ళొచ్చు. ఎన్నో విషయాలు చెప్పొచ్చు, వివరణ ఇవ్వొచ్చు. కథారచయితకి ఆ వెలుసుబాటు ఉండదు. చిన్న కాన్వాసులో రచయిత తాను ఎన్నుకున్న కథాంశాన్ని ఆసక్తికరంగా చెప్పాలి, పాఠకులను ఆలోచింపజేయాలి, వారిని ఆశ్చర్యపరుస్తూ ఓ కొసమెరుపుండాలి. కవిత కూడా కథలాగే క్లుప్తంగా ఉండాలి, మనసుకు హత్తుకునేలా ఉండాలి. అయితే నవలకు ఎక్కువ సమయం కేటాయించాలి. కంటిన్యుటీ ఉండేలా చూసుకోవాలి. పాఠకుడిచే పుస్తకం మొత్తం చదివించే టెంపో ఉండాలి. అందువల్ల ఏ ప్రక్రియా సులువు కాదు, రాయాలన్న తపన ఉన్నవాళ్ళకు కష్టం కూడా కాదు.
ప్రశ్న 4. కథలకై మీరు సమాజంలోని సమస్యలని, మనుషులని అత్యంత దగ్గరగా పరిశీలించినట్లు అర్థమవుతోంది. ఏదైనా అంశాన్ని కథగా మలచాలనుకున్నప్పుడు మీ పద్ధతి ఎలా ఉంటుంది?
జ: నేను ప్రతిరోజూ అనేకమందిని కలుస్తూంటాను. వారు బంధువులు కావొచ్చు, స్నేహితులు కావొచ్చు లేదా వీరి ద్వారా పరిచయమైన క్రొత్తవారు కావొచ్చు. మా మాటల్లో కొంతమంది వ్యక్తుల గురించి ప్రస్తావన, వారు ఎదుర్కొన్న సమస్యలు మొదలైనవాటి గురించి చర్చ జరుగుతుంది. ఆ విషయాలు, సమస్యలు క్రొత్తగా అనిపిస్తే అవి నా మనసులో ఉండిపోతాయి. తర్వాత వాటినే కథావస్తువులుగా తీసుకుని కథ రాయడం జరుగుతుంది. మా కుటుంబంలో పెద్దకొడుకుగా బాధ్యతలు తీసుకోవడం అలవాటయినందువల్ల జీవితంలో నాకు ఎదురైన అనుభవాలను కూడా కథావస్తువులుగా తీసుకోవడం జరిగింది.
ప్రశ్న 5. మీ కథల శీర్షికలు, సంభాషణలు చాలా సరళంగా ఉంటాయి. కథలు చదివాకా ఓ రకమైన హాయి భావన కలుగుతుంది. సంభాషణలు సరళంగా ఉన్నా వాటిలోని భావాలు సున్నితమైనవైనా, లోతుగా ఉంటాయి. సరళంగా అనిపిస్తూనే, సంభాషణలోని, సన్నివేశాలలోని గాఢతని పాఠకులు అనుభూతి చెందేలా వ్యక్తీకరించడం మీకెలా అబ్బింది? నిరంతర సాధన వల్లా? లేక మీకున్న విశేష ప్రజ్ఞా?
జ: ‘నిరంతర సాధన వల్ల అబ్బిన ప్రజ్ఞ’ అని నేను భావిస్తాను. అనుభవం ఉన్న ఏ రచయిత అయినా ఒకసారి కథలో లీనమయినప్పుడు సన్నివేశాలు, సంభాషణలు కథకు తగ్గట్లు సృష్టించడం అతనికి అలవాటుగా మారుతుందని నేను భావిస్తాను.
ప్రశ్న 6. ‘అందమైన జీవితం’ కథ వివాహ వ్యవస్థపై నమ్మకాన్ని నిలిపింది. ఈ కథ నేపథ్యం వివరిస్తారా? రాజేష్ లేదా మానస వంటి పాత్రలు కల్పితమా? లేక నిజ జీవితంలో మీకు తారసపడిన వ్యక్తులా?
జ: ఈ రోజుల్లో మనం చూస్తున్నాం.. పెళ్ళైన కొద్దిరోజులకే భార్యాభర్తలు విడిపోతున్నారు. కోర్టుల్లో విడాకుల కేసులు పెరిగిపోతున్నాయి. వివాహవ్యవస్థ, కుటుంబ వ్యవస్థ నిర్వీర్యమైపోతూంది. ఎవరికీ వేచిచూచే సమయం, ఎదుటి మనిషిని అర్థం చేసుకునే సహనం ఉండటం లేదు. ఎదుటి వ్యక్తిలోని లోపాలను బూతద్దంలో చూస్తున్నారుగాని తమలోని లోపాల గురించి తెలుసుకోవడం లేదు. ఈ కథ చదివిన పాఠకులు అటువంటి తప్పులు చేయకుండా, ఓపికతో ఉండి, తమ వివాహబంధాన్ని నిలుపుకుంటారనే ఉద్దేశ్యంతో రాజేష్ మరియు మానస పాత్రలు సృష్టించి ఈ కథ వ్రాశాను.
ప్రశ్న 7. ‘ఓ వర్షం కురిసిన రాత్రి’ కథని నైతికతని, క్రైమ్‌ని మిళితం చేసి ఓ థ్రిల్లర్‌లా రాశారు. ముఖ్యంగా దెయ్యాల గురించి పరిశోధన చేసే యువతిగా శ్రీలత చెప్పే వివరాలు ఆసక్తిగా సాగాయి. ఈ కథని ఇలా ప్రెజెంట్ చేయచ్చన్న ఆలోచన ఎలా వచ్చిందో చెప్తారా?
జ: నా కథలన్నీ సమాజంలోని వివిధ సమస్యలు కథాంశాలుగా తీసుకుని వ్రాసినవి. ఈ కథల్లో ఓ మంచి సందేశం ఉంటుంది. మానవత్వపు విలువలు ఉంటాయి. మంచితనం ఉంటుంది. అయితే ఇటువంటి కథలతో పాటు ఓ ఇరవైదాకా క్రైమ్, సస్పెన్స్ కథలు కూడా వ్రాశాను. వాటిని చదివి థ్రిల్ ఫీలయ్యామంటూ, ఓహెన్రీ కథల్లా ఊహించని ముగింపులు ఉన్నాయంటూ పాఠకులు ఉత్తరాలు వ్రాశారు, మెసేజులు పెట్టారు. అలా క్రైమ్, సస్పెన్స్, ఫైనల్ ట్విస్ట్ మిళితం చేసి రాసిన కథ ఇది. అయితే క్రైమ్ కథల్లో కూడా నేను చెడును ప్రోత్సహించలేదు. చెడుకి శిక్ష తప్పదని, మంచికే అంతిమ విజయం దక్కుతుందని వ్రాశాను. ఈ కథకీ పాఠకులనుంచి ఎప్పటిలాగే మంచి స్పందన వచ్చింది.
ఈ కథలో శ్రీలత చెప్పిన వివరాలు కేవలం తను దయ్యాల గురించి రీసెర్చ్ చేస్తున్నానని భవానీశంకర్ని నమ్మించడానికి చెప్పినవి.
ప్రశ్న 8. ‘కల కాదు సుమా’ కథలో సిద్ధార్థ పాత్ర మంచితనం అక్షరని ఆకట్టుకుంటుంది. మొదట పెళ్ళి సంబంధంలో అతన్ని వద్దనుకున్న అక్షర, కథ చివరికి వచ్చేసరికి అతన్ని భర్తగా అంగీకరిస్తుంది. సిద్ధార్థ్ పాత్ర లోని పాజిటివిటీని ప్రస్తుత సమాజంలోని వ్యక్తులలో ఆశించటం కష్టం. ఈ పాత్ర కల్పితమా? మీకు తారసపడిన నిజజీవిత వ్యక్తా? వివరించండి.
జ: ఈ కథలో సిద్దార్థ్‌కి ఎదురైన సమస్య మా స్నేహితుల బంధువుల అబ్బాయి విషయంలో నిజంగానే జరిగింది. మరో వారం రోజుల్లో పెళ్ళి ఉందనగా ఈ కథలో అక్షర పెట్టిన కండిషన్ ఆ అమ్మాయి పెట్టడంతో పెళ్ళి ఆగిపోయింది. ఆ విషయంలో ఇరువైపువాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. నా స్నేహితులు ఆ విషయం నాకు చెప్పగానే దీన్ని కథాంశంగా తీసుకుని కథ రాయాలనిపించింది. నా కథలు చాలావరకు ఆశావాదంతో ముగుస్తాయి కాబట్టి ఈ కథని సుఖాంతం చేశాను. ఉదాత్తమైన సిద్దార్థ్ పాత్ర కల్పితమే అయినా ఆ లక్షణాలున్న వ్యక్తులు కొంతమందిని నేను చూశాను. అటువంటి ఆదర్శవంతమైన పాత్రలు కొందరికైనా స్ఫూర్తినిస్తుందని ఆ పాత్రని సృష్టించాను.
ప్రశ్న 9. సాధారణంగా ఓ కథ రాసేటప్పుడు మీరెన్ని వెర్షన్స్ రాస్తారు? ఈ పుస్తకంలో ఏ కథకి ఎక్కువ వెర్షన్స్ రాయాల్సి వచ్చింది?
జ: చాలా కథలకు ఒక వెర్షనే రాస్తాను నేను. కాకపోతే కథ చెప్పిన పద్దతి నచ్చక మార్పులు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా ఈ సంపుటిలో ‘ఓ వర్షం కురిసిన రాత్రి’ కథకు మాత్రం ముగింపు ఓ వెర్షన్ రాసి అది నచ్చక మరొకటి రాశాను. అలా మూడు వెర్షన్లు రాశాక చివరి వెర్షన్ నచ్చి అదే ఈ పుస్తకంలో తీసుకున్నాను.
ప్రశ్న 10: సాధారణంగా రచయితలకు తాము రచించేవన్నీ నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీ మనసుకు బాగా దగ్గరయింది? ఎందువలన?
జ: ఈ సంపుటిలోని కథలన్నీ నా కథలన్నిటిలోనుండీ చాలా శ్రద్ధగా ఏర్చి కూర్చినవే. ప్రతి కథా దేనికదే ప్రత్యేకమని నా అభిప్రాయమూ, పాఠకుల అభిప్రాయమూ కూడా.. ఐతే ఒక కోణంలో నాకు ‘కల కాదు సుమా!’ కథ, అందులోని సిద్దార్థ్ పాత్ర బాగా నచ్చింది. సిద్దార్థ్ తన తల్లితండ్రులనుంచి నేర్చుకున్న సంస్కారంతో పాటు వారి మంచితనాన్ని తానూ పాటించడం, తను ఎదిగాక మరికొంతమందికి సహాయం అందించడం, అక్షర కండిషన్స్ పెట్టినప్పుడు ఆమె అంటే ఎంతో ఇష్టం ఉన్నా తన సిద్దాంతాలతో రాజీపడకపోవడం, పెళ్ళి క్యాన్సిల్ అయినా ఆమెపట్ల ద్వేషం పెంచుకోకపోవడం, ఆమెని ఓ స్నేహితురాలిగా గౌరవించి, అవసర సమయాల్లో ఆమెకి సహాయం చేయడం, ఆమె స్థానంలో మరొకరిని భార్యగా ఊహించుకోలేకపోవడం, సహనంతో ఆమె నిర్ణయంలో మార్పు కోసం ఎదురుచూడటం సిద్దార్థ్ పాత్రని ఎంతో ఎత్తులో నిలిపింది. మన జీవితాన్ని మనకు ఇష్టమైనరీతిలో నిర్మించుకోవడం తప్పు కాదు. అయితే మన తొందరపాటు నిర్ణయాలవల్ల మనతో ముడిపడిన వ్యక్తులకు వ్యథను, ఇబ్బందులను కలిగించకూడదని ఈ కథలో చెప్పాను.
ప్రశ్న 11: ఈ సంపుటిలోని ఏదైనా కథ రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?
జ: ఇందులోని ఏ కథా రాయడం కష్టమనిపించలేదు. కథావస్తువు తెలుసు, కథ ఎలా వ్రాయాలో తెలుసు, కాకపోతే ఏ ముగింపు ఇవ్వాలన్నదే సమస్య! మనసులో పలు ముగింపులు అనుకుని ఏది బాగుంటుందని అనిపిస్తే దాన్నే తీసుకుని కథని ముగిస్తాను. ‘ఏ కథ కూడా ఇలా కాకుండా ఇంకోలా వ్రాసి ఉంటే బాగుంటుంది’ అని నేను అనుకోలేదు. నేను వ్రాసిన ప్రతి కథా నాకు తృప్తినిచ్చిందే!
ప్రశ్న 12: సాహిత్యం వల్ల సమాజంలో మార్పు వస్తుందని మీరు భావిస్తారా?
జ: తప్పకుండా వస్తుంది. నా కథలు చదివి తమ ప్రవర్తనని మార్చుకున్నామని కొంతమంది ఉత్తరాల ద్వారా, మెసేజ్‌ల ద్వారా నాకు తెలిపారు. ఓ మంచి కథ ఒకరికి స్ఫూర్తినిచ్చినా అతనివల్ల స్ఫూర్తి పొందేవారు మరో పదిమంది ఉంటారు.
జ: ప్రముఖ సినీగాయని శ్రీమతి ఎస్.జానకిగారు నాకు పిన్ని వరస అవుతారు. ఆవిడ ‘నేను పుస్తకాలు చదవను, వార్తాపత్రికలు కూడా చదవను. కానీ చంద్రశేఖర్ కథలు మాత్రం అక్షరం వదలకుండా చదువుతాను. అంత బాగుంటాయి అతని కథలు’ అని నా పుస్తకావిష్కరణ సభలో ఆవిడ చెప్పినప్పుడు చాలా ఆనందం కలిగింది. ఓసారి నా ‘నీరాజనం’ కథాసంపుటి ఆవిడకి కొరియర్లో పంపాను. తర్వాత కొద్దిరోజులకు ఓ పెళ్ళిలో కలసినప్పుడు “నా పుస్తకం చదివారా?” అని అడిగితే కొన్ని కథలు చదివానన్నారు. “కథలు బాగాలేవా?” అని నేనడిగితే “పుస్తకం అయిపోతుందని భయంరా!” అన్నారు.
నా కథలు తనకిష్టమని ఓ పసిపాప చెప్పినట్లు ఆవిడ చెప్పడం నాకు ఆశ్చర్యాన్ని, అత్యంత ఆనందాన్ని కలిగించింది. ఆవిడ మాటలు ఇప్పటివరకూ నాకు లభించిన ప్రశంసల్లో గొప్ప ప్రశంసగా భావిస్తాను. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని ఆవిడని చూసే నేను నేర్చుకున్నాను.
ప్రశ్న 14: సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలు ఏవైనా సిద్ధమవుతున్నాయా?
జ: నా 14వ పుస్తకం ‘అంజలిదే గొనుమా’ కథాసంపుటి ప్రచురణలో ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆవిష్కరణ ఉంటుంది. ఊపిరి ఉన్నంతవరకూ కథలు రాస్తూ ఉండాలని నా కోరిక.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు సి.ఎన్. చంద్రశేఖర్ గారూ.
సి.ఎన్. చంద్రశేఖర్: ధన్యవాదాలు. మీకూ, సంచిక పత్రిక సంపాదకవర్గానికి, సంచిక పాఠకులకు నా శుభాభివందనములు.
***
రచన: సి. ఎన్. చంద్రశేఖర్
ప్రచురణ: జయంతి పబ్లికేషన్స్, హైదరాబాద్.
పేజీలు: 120
వెల: ₹ 200/-
ప్రతులకు:
సి. రాధిక
4-1042/4,
గాయత్రి నగర్, గ్రీమ్స్పేట,
చిత్తూరు 517002
ఫోన్: 9492378422
~
జయంతి పబ్లికేషన్స్,
19-90, పి అండ్ టి కాలనీ,
దిల్సుఖ్నగర్,
హైదరాబాద్ 500060
ఫోన్: 9247302882
~
‘అందమైన జీవితం’ కథాసంపుటిని సమీక్ష:
https://sanchika.com/andamaina-jeevitam-cncs-book-review-kss/