[‘మౌనం ఎరుపు’ అనే కథాసంపుటి వెలువరించిన శ్రీ బోరి మురళీధర్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం బోరి మురళీధర్ గారూ.
బోరి మురళీధర్: నమస్కారమండీ.
~
ప్రశ్న 1: మీరు రచించిన 14 కథల సంపుటికి శీర్షికగా చివరి కథ ‘మౌనం ఎరుపు’ పేరునే ఎంచుకోవడంలో ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?
జ: ప్రత్యేక కారణం అంటూ ఏం లేకపోయినా 1989లో ఈ కథ రాసినప్పుడు, ఇదే పేరుతో కథాసంకలనం వేయాలని వుండేది. వ్యాకరణ రీత్యా ‘మౌనం ఎరుపు’ దుష్టసమాసమయినప్పటికీ కవితాత్మకంగా బాగుందనిపించింది. అయితే తర్వాతి కాలంలో ‘నెమలినార’ కథ వచ్చిన తర్వాత నాకు ఆ కథ పేరుతోనే గుర్తింపు రావడంతో ‘నెమలినార’ పేరుతోనే మొదటి కథ సంకలనం (2016) వేశాను. ‘మౌనం ఎరుపు’ పేరుతో పుస్తకం వేయాలన్న కోరిక అలాగే వుండిపోగా ఇప్పుడు ఈ సంకలనంలో ఆ కథను చేర్చి, కోరిక తీర్చుకున్నాను.
ప్రశ్న 2: ఇది మీ 2వ కథాసంపుటి. కవి, కథకుడిగా, నవలా రచయితగా మీ సాహితీ ప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా? మొదటగా ఏ ప్రకియతో సాహిత్య వ్యాసంగం మొదలుపెట్టారు? ఎప్పుడు? మీ కథా రచన గురించి వివరిస్తారా?
జ: 1975 లో డిగ్రీ ఫైనలియర్ బి.యస్సీ చదువుతున్నప్పుడు మొదటి ప్రపంచ తెలుగు మహాసభలకు కాలేజీ ప్రతినిధిగా పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ సభలలో సాహిత్యకారులను, సాహిత్యాన్ని – అతి సన్నిహితంగా చూడటంతో – చదవడం అనే అలవాటు ముదిరి రాయాలన్న కోరిక బలపడింది. మా జిల్లా లైబ్రరీకి వచ్చే అన్ని పత్రికలను ఔపోసన పట్టేసున్నప్పుడే, మంచి కవిత్వం, మంచి కథ, మంచి నవలలతో పరిచయం ఏర్పడింది. మరొక పక్క ఈనాడు చలసాని కబుర్లు – ధర్మారావు గారు రాసే కవితాత్మక సంపాదకీయాలు చదవడం; విపుల, చతురలకు క్రమం తప్పని పాఠకుడిని కావడం వలన రాయాలన్న తపన మరింత బలపడింది. ఈనాడు దినపత్రిక అప్పుడెప్పుడో (1977 అనుంటాను) మొదలుపెట్టిన ‘కొత్త పాళీ’ శీర్షికలో నా మొదటి కవిత ‘అన్వేషణ’ను అచ్చులో చూసుకున్న తర్వాత – ఆ ‘రుచి’ తెలిసి కవిత్వం రాశాను. అందులోని ఒక నాలుగు కవితలు, ఆనాటి మేటి సాహిత్య మాసపత్రిక ‘భారతి’లో ప్రచురించబడ్డాయి. ఆ రోజుల్లో భారతిలో కవిత్వం అచ్చయిందంటే ‘కవి’నని గర్వంగా చెప్పుకోవచ్చు (1980-82). కవి ముదిరి రచయితగా మార్పు చెందే క్రమంలో 1983 లో విపుల కథల పోటీకి ‘అడవిపువ్వు’ కథను రాసి మొదటి కథకు ప్రోత్సాహక బహుమతి పొందడంతో కథ రాస్తే, కలిగే స్వప్రయోజనాలు బాగా తెలిసి వచ్చాయి. అందులో నలుగురిలో గుర్తింపు, ప్రముఖ పత్రికలో ఫొటోతో సహా పరిచయం. ఇవే కొన్నాళ్ళు నాతో కథలు రాయించాయి. అయితే ఇదే ఊపులో రాసిన రెండవ కథకే ‘ఉదయం’ వారపత్రిక నిర్వహించిన దీపావళి కథల పోటీలో ‘మొదటి బహుమతి’ రావడంతో – ఏనుగునెక్కినంత సంబరం! ప్రతీ కథా రచయిత కలగనే కథల పోటీలో మొదటి బహుమతి రావడమనే కల నా రెండవ కథ తోనే సాకారమయింది. ఆ కథ (1989) రాసి ఇప్పటికి 36 సంవత్సరాలైనా ఇప్పుడు చదివిన పాఠకులు కూడా నాతో ఆ కథ గురించి మాట్లాడుతుంటారు. అన్నట్లు ‘భూదేవి’ కథకు మొదటి బహుమతి వచ్చినపుడు పోటీకి వచ్చిన మొత్తం కథల సంఖ్య 1340! అప్పటినుండి రాయాలనిపించినప్పుడు రాసి, పోటీలకు పంపించేవాడిని. వరుసగా రాసిన కథలన్నింటికీ అంటే ఒక ఏడెనిమిది కథలకు వరుసగా బహుమతులు వచ్చాయి. నేను రాస్తే, బహుమతి ఖాయం అనే అభిప్రాయం బలపడింది. కానీ ఆ ప్రమాణాలతో రాయాలంటే సంవత్సరానికి ఒక కథ కూడా రాయలేపోయాను. మధ్యలో 1995లో ఆంధ్రప్రభ వారపత్రిక దీపావళి నవలల పోటీ ప్రకటించింది. మా బాపు (నాన్నగారు) జీవితచరిత్రను నవలగా రాయాలన్న ప్రయత్నాల్లో ఉన్న నాకు నవలల పోటీ మరింత ఊతమిచ్చింది. వెంటనే మొదలు పెట్టి కేవలం (15) రోజుల్లో తపస్సులాగా ‘నిరుడు కురిసిన కల’ నవల రాసి చివరి తేదీ నాడే అందేలా పోస్టు చేశాను – నవలంతా ఆదిలాబాద్ లోని బోథ్, సొనాలా మాండలికంలో ఉంటుంది. వాఖ్యానం మాత్రం శిష్టవ్యవహారికంలోనే ఉంటుంది. ఆశ్చర్యకరంగా నమ్మలేని విధంగా (1995లో పదివేల రూపాయల) మొదటి బహుమతి వచ్చింది. ఆంధ్రప్రభలో (14) వారాలు ధారావాహికంగా వచ్చింది. ఆ నవలను 2002 లో కొన్ని కథలతో కలిపి పుస్తకంగా వేశాను. ఇదే నేను రాసిన మొదటి నవల – చివరి నవల కూడాను.
తర్వాత రాయాలనిపించనప్పుడు కాకుండా రాయకుండా ఉండలేనప్పుడు మాత్రమే రాస్తూ, ఇప్పటిదాకా 38 సంవత్సరాలలో 28 కథలు మాత్రమే రాశాను. వాటిలో 18 కథలకు వివిధ పోటీలలో వివిధ బహుమతులు వచ్చాయి.
ప్రశ్న 3: మీకు కవిత/కథ/నవల – వీటిలో ఏది వ్రాయడం సులువని అనుకుంటారు? ఎందువల్ల?
జ: కవిత/కథ/నవల మూడింట్లో ఏదీ సులువు కాదు రాయడం. ఒకవేళ సులువుగా రాసేస్తే, అది సులువుగానే తేలిపోతుంది తప్ప నిలబడదు – నేను నా ఒక్కొక్క కథ రాయడానికి కొన్నినెలలు, సంవత్సరాల పాటు సమయం తీసుకున్న సందర్భాలున్నాయి. తిరగరాసిన కొద్దీ రచన యొక్క నాణ్యత పెరగడం నేను గమనించాను. ఇప్పటికీ నాణ్యత పెరిగి ముందుగా నాకు నచ్చేవరకు తిరగరాస్తూనే వుంటాను. ఎందరో కవులు, రచయితలు – వందల కొద్దీ రచనలను అవలీలగా రాసేస్తుంటారు. అన్ని రచనలు కూడా అవలీలగా తేలిపోవడం మనకు తెలుసు. నా కథలకు కాలదోషం పట్టకుండా, ఇప్పటికీ ప్రాసంగికత కోల్పోకుండా ఉన్నాయంటారు విమర్శకులు. 20-25 ఏళ్ళ కింద కథను చదివినవారు ఇప్పటికీ కథలోని విషయాన్ని మర్చిపోకుండా.. ‘ఫలానా కథ రాసింది మీరే కదా’ అని అడుగుతుంటారు. ఏ రచనన్నా కష్టపడి, ఇష్టపడి రాసినపుడే రాణిస్తుంది.
ప్రశ్న 4: మీరు దాదాపు 38 ఏళ్ళ నుంచి రాస్తున్నారు. కానీ ఇప్పటి వరకు 28 కథలు మాత్రమే రాశారు. ఎందుకని? రెండవ కథాసంపుటి వెలువరించడానికి దాదాపు ఏడేళ్ళు ఎందుకు పట్టింది?
ఈ ఏడేళ్ళలో రెండవ కథా సంపుటికి సరిపడా కథలు లేకపోవడమే ఆలస్యానికి కారణం! అప్పటికీ – పుస్తకం కొంత చేతినిండా ఉండాలని నాలుగు పాత కథలను కూడా ‘మౌనం ఎరుపు’లో చేర్చాను. అయితే ఈ నాలుగు కథలు అప్పట్లో బహుళ పాఠకాదరణ పొందినవే!
ప్రశ్న 5: “కథలు ఎలా రాయాలో తెలిసినదానికన్నా, కథలు ఎలా రాయకూడదో తెలిసిన తర్వాత కథలు రాయడం చాలా కష్టంగా వుంది” అన్నారు మీ ముందుమాటలో. ఎందుకని ఈ అభిప్రాయానికి వచ్చారో వివరిస్తారా?
జ: గొప్ప కథారచయితల కొన్ని మంచి కథలు చదివిన తర్వాత శైలీ, శిల్పం, ఎత్తుగడ, ముగింపు గురించిన అవగాహన కలిగి వాటిని అనుసరించాను. కానీ ఇటీవల సంభావ్యత పూర్తిగా కొరవడి, రచయిత తన సౌలభ్యం కోసం – తను అనుకున్న ముగింపు తేవడం కోసం – ఏ మాత్రం జరిగే అవకాశం లేని అభూత కల్పనలతో వస్తున్న కథలను చదువుతుంటే- ఒక పరిపక్వ పాఠకుడిగా – ఒక రచయితగా వాటిని తిరస్కరిస్తున్నాను . కాబట్టి ఇలా మాత్రం నేను రాయకుదని నిర్ణయించుకున్నాను. అయినా, సంభావ్యత లేని కథలు జీవితాలని లేదా సమాజాన్ని ఎలా వ్యాఖ్యానిస్తాయి?
ప్రశ్న 6: కుటుంబ సభ్యుల ఆసరా దొరకని ఓ ఒంటరి తల్లి జరిపిన జీవన పోరాటాన్ని ‘అమ్మ కదా! భరిస్తుంది’ కథ గొప్పగా చెప్పింది. కథలో ఒక్కో సంఘటన జరిగాకా, చివర్లో ‘అమ్మ కదా! భరిస్తుంది!’ అని రాయడం చక్కని ప్రయోగం! ఈ కథ నేపథ్యం గురించి వివరిస్తారా?
జ: పరీక్షల ఫలితాలు వచ్చినపుడు, పత్రికల, టీవీ ఛానళ్ల హడావిడి, మేమే ముందు కనిపెట్టామన్న లెవల్లో – వారు పెట్టే పతాక శీర్షికలు, ప్రాసతో కూడిన హెడ్డింగులు చూసీ చూసీ, ఛానెళ్ళ వారి భాషాపటిమకు విసిగిపోయి, ఆ ధోరణుల పైన ఒక సైటిరికల్ కథ రాద్దామని ఉండేది. పత్రికల వాళ్ళ పడికట్టు పదాల మాయాజాలం, సంవత్సరాలు మారినా భాష మార్చుకోకుండా, ఫలాన వార్తకు ఫలాన హెడ్డింగు అని ఖాయమైపోయిన సందర్భాలు గురుకు వచ్చి – వాటిని కొంత చూపిస్తూ, కథ రాశాను. విశేషమేమిటంటే ఆ పడికట్టు పదాలు పత్రికలు, టీవీ న్యూస్ ఛానెళ్ళు ఇంకా మార్చుకోకపోవడం – రాజకీయ వార్తలైతే మరీ ఘోరం! మండిపడ్డారు! నిప్పులు చెరిగారు! తూర్పారబట్టారు. దుయ్యబట్టారు. తుంగలో తొక్కారు! తిలోదకాలిచ్చారు! ఏమిటీ భాష? అసలు వాడేవాళ్ళకైనా ఆ పదాల సమయం సందర్భం తెలుసునా? మరీ విచిత్రమేమిటంటే ‘వానలు దంచికొడున్నాయి!’ అంటారు. దంచికొట్టడమేమిటి? పోనీ అనుకుంటే – ఎండలూ దంచికొడుతున్నాయట! ఒక్క చలి మాత్రమే ‘మంచు దుప్పటి’ కప్పుతుంది! తరతరాలైనా ఈ భాష మారదా? వీటికి ప్రత్యామ్నాయ పదాలే లేవా? ఉన్నాయి కానీ. ప్రయత్నించరు! తమకంటూ భాషా విభాగం ఏర్పాటు చేసుకున్న ప్రముఖ దిన పత్రికలు, చానెళ్ళు కూడా భాషా శాస్త్రం ఏ మాత్రం చదువుకోని – ‘కాపీ – పేస్ట్ మేధావుల’ తో పని నడిపించుకుంటున్నాయి. మళ్ళా మాట్లాడితే- తెలుగు భాషకు ఎంతో సేవ జేస్తున్నట్లు ప్రచారం! ఇటీవల వచ్చిన ‘శుభం’ సినిమా చూసిన తర్వాత టీవి ఛానెళ్ళ స్క్రిప్ట్ రచయితలు – కుండెడు నీళ్ళలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలిందే. ‘ఛుల్లూ భర్ పానీ మే డూబ్’ అంటారు.’ ఇలాంటి ధోరణులను నిరసించడానికే ఈ కథ రాశాను కానీ – ఈ కథను గమనించిందెవరు? రాసింది నాలాంటి వెనుబడిన జిల్లా రచయిత కదా. ఏ పీఠానికి చెందనివాణ్ణి. అందుకని గమనింపు రాలేదు.
ప్రశ్న 7: ‘వారసుడు’ కథలోని నెరేటర్ పాత్రని (ఉద్దేశం మంచిదే అయినా, తెలిసి తప్పు చేసే వ్యక్తి) మీరు సమర్థిస్తారా? ప్రభుత్వ గ్రంథాలయాల దుస్థితిని చాటే ఈ కథలో – సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విశ్వనాథ సత్యనారాయణ పరిచయమయ్యాకా, అతని సాయంతో నెరేటర్ తన తప్పుని దిద్దుకుంటాడు. ప్రభుత్వ గ్రంథాలయాల పరిస్థితి మెరుగుపడాలంటే ఓ రచయితగా మీరేం చర్యలు సూచిస్తారు? చదువరుల బాధ్యతకి సంబంధించి ఓ పాఠకుడిగా సహ-పాఠకులకి ఏ సూచనలు చేస్తారు?
జ: తెలిసీ తప్పు చేస్తున్న వ్యక్తి అన్నారు. నిజమే కొన్ని గ్రంథాలు చెదలు పట్టకుండా ఉండటానికి అతను తెలిసీ తప్పు చేస్తున్నాడు. పోనీ ఆ గ్రంథాలకు పూర్వవైభవాన్ని కల్పించడానికి మన ‘తెలిసినవారు’ ఏమన్నా ప్రయత్నించారా? మన మృచ్ఛకటికం – విదేశాల్లో ఎంతో గొప్పగా ప్రదర్శింపబడితే మన దగ్గర ఒథెల్లో, క్లియోపాత్ర, మన్నూ మశానం ప్రదర్శింపబడినాయి. ఎటొచ్చి ఆ కథ లోనే చెప్పవలసివచ్చిన అంశమేమిటంటే – మా తరం వాళ్ళు ఎంతో కష్టపడి సేకరించిన ‘అపురూప గ్రంథాల’కు వారసులను ఎలా తయారుచెయ్యాలి అని! అలా చేయాలంటే వారికి ముందు మన ఘనమైన సాహిత్యం మీద ఆసక్తి ఏర్పరచాలి. ఈ కథ నాకెందరో మిత్రులను సంపాదించి పెట్టింది. రెండు వేల పుస్తకాలను భద్రపరచిన విశాఖపట్నంకు చెందిన అక్కయ్య సబీనా సుల్తానా (75) గారు పరిచయమయ్యారు. ఆవిడ పుస్తకాలకు రాబోవు తరంలో వారసులెవరూ లేరని బాధపడింది. వారసత్వంగా నచ్చిన మన గ్రంథాలకు వారసులను వెదకటమే నా కథ మొదటి లక్ష్యం! విశాలాంధ్ర పుస్తక ప్రదర్శనలో పరిచయమైన ఒకావిడ విపరీతంగా పుస్తకాలు కొంటుంటే అడిగాను – ఇవన్నీ దేనికండీ అని. “నేను అమెరికాలో వుంటాను. వచ్చినప్పుడల్లా రెండు సూటుకేసుల పుస్తకాలు తీసుకుపోతాను. మా అమ్మానాన్నలు వచ్చినపుడు వాళ్ళకు కాలక్షేపం! మా ఇంట్లోనున్న ఈ పుస్తకాల లైబ్రరీ మాకే కాకుండా మా పిల్లలకూ ప్రేరణ” అన్నది. ఆ వాక్యాల నుండి పుట్టిందే ఈ కథ! ఇప్పటికీ ఈ కథ మొదటిసారి చదివినవారు నాకు ఫోన్ చేసి తమ అభిప్రాయాలు పంచుకుంటారు.
ప్రశ్న 8: “అవును! చరిత్ర పునరావృతమై ఇది మరొక భూమి కథగా నిలుస్తుంది” అంటూ ముగించిన ‘మరో భూమి కథ’ – చట్టాలు చేసేటప్పుడు ఉండాల్సిన సమగ్ర దృష్టిని, అమలు చేసేటప్పుడు చూపాల్సిన విచక్షణని చక్కగా ప్రస్తావిస్తుంది. ఈ కథ నేపథ్యం గురించి చెప్తారా?
జ: ఈ కథ అచ్చమైన మా వూరు నేపథ్యంలో నుండి అనేకమంది రైతులు కన్నీటి గాథల నుండి పుట్టిన కథ. ఇలాంటి కథను శ్రీకాకుళం రచయిత రాసినా, రాయలసీమ రచయిత రాసినా – కథనూ రచయితనూ నెత్తిన పెట్టుకునే వాళ్ళు! తెలంగాణ వాణ్ని కదా, పక్కవాడి టాలెంటుకు ఓర్వలేని ప్రాంతంలో పుట్టినాను గదా! అందుకే ఈ కథ గురించి ఎవరూ మాట్లాడలేదు!
నా దృష్టిలో ఇదొక గొప్ప కథ! ప్రభుత్వమే సృష్టించిన చట్టాలూ, తను ప్రజలను ఎలా కష్టాలు, కన్నీళ్ళ పాలు చేస్తాయో తెలిపే కథ – 1/70 చట్టం గిరిజనుల పాలిటి వరమే. కాదనను. కానీ వందల సంవత్సరాలుగా గిరిజనులతో సహజీవనం చేసున్న గిరిజనేతరులను ఉన్నట్టుండి – ‘ఈ భూమి నీది కాదు! నువ్వు అక్రమ ఆక్రమిత వలసదారుడివి! అందుకని నీ ఆస్తులన్నీ లాగేసుకుంటున్నాము’ అంటే ఎలా ఉంటుంది? ఎప్పుడో 60-70 ఏళ్ళ క్రిందట ఇంద్ర కమిటీ అనే ఒక కమిటీ వచ్చి IB (ఇన్‌స్పెక్షన్ బంగ్లాల్లో) సౌకర్యవంతమైన బస వేసి, చుట్టూ ఉన్న వారిని తమ దగ్గరికే పిలింపించుకొని – నిర్ణయించిన ఏజన్సీ ప్రాంతలవి! క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే ఇక అనేక విడ్డూరాలు కనిపిస్తాయి. జాతీయ రహదారి 44 పై ఉన్న నేరేడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్‌లు ఏజన్సీ ప్రాంతాలు. 90% గిరిజనులు నివసించే కొన్ని గూడేలు ఏజన్సీ ప్రాంతాలు కావు. 10% గిరిజనులు నివసించేవి ఏజన్సీ ప్రాంతాలు.
సరే! అప్పుడు పొరపాటు జరిగింది! ఇప్పుడు పొరపాటు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండి, రీ-షెడ్యూల్ చేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం ధైర్యం చేయడం లేదు. అలాంటి సమయంలో మరో తిరుగుబాటు జరగదని చెప్పలేం!
ప్రశ్న 9: “జీవితం కొన్ని సందర్భాలలో మళ్ళీ మన చేతిలోకి వచ్చి ఒక అవకాశాన్ని ఇస్తుంది. అప్పుడు ధైర్యంగా తీసుకునే ఒక నిర్ణయమే భావి జీవితాన్ని నిర్దేశిస్తుంది” అనేవి గొప్ప వాక్యాలు. ‘ఒక విధ్వంసకర ప్రయాణం’ కథలో – స్వాతి లాంటి వ్యక్తిని దగ్గరగా చూస్తే తప్ప, నర్తకి గురించి, నాట్యం గురించి ఇంతలా సహజంగా చిత్రీకరించలేరు. స్వాతి పాత్ర మీకు తారసపడిన నిజజీవిత వ్యక్తా? లేక కల్పిత పాత్రా? వివరించండి.
జ: ‘ఒక విధ్వంసకర ప్రయాణం’ కథ – కన్నవీ, విన్నవీ ఊహించినవీ కలిపి రాసిన కథ. స్వాతి లాంటి వారు నాకెవరూ పరిచయం లేదు! కాకపోతే శోభానాయుడు నా అభిమాన నర్తకి! ఒకే ఒక్కసారి ఆమె ప్రదర్శనను రవీంద్రభారతిలో చూశాను. ఆ కథ పూర్తిగా ఒక నర్తకి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి రాశానని విమర్శకులు అన్నారు. కాకపోతే ఆ కథ వచ్చిన వారంలో నాకొక ఫోన్ కాల్ వచ్చింది – ‘మీరు రాసింది మా అమ్మాయి కథనే’ అని! కథలో జరిగినట్లుగానే వాళ్ళమ్మాయి మంచి నర్తకి, విడాకులు తీసుకుంది భర్తతో. నాకు కర్ణాటక, హిందుస్తానీ సంగీతాలంటే ఇష్టమే కాబట్టి రాగాల గురించి రాయగలిగాను. నర్తకి అభినయించే భాగం సమాచారం మనకు నిజంగానే ఆసక్తి ఉంటే, అంతర్జాలంలో ఎక్కడైనా దొరుకుతుంది. ఈ కథని నిజంగానే శాస్త్రీయ సంగీతం, నాట్యం తెలిసిన ఏ ఆంధ్రా రచయితనో రాశాడనుకొని, పొరబడ్డారు చాలామంది. ఆదిలాబాదుకు చెందిన రచయిత ఇంత శాస్త్రీయంగా , బాగా రాయడం గురించి రెండు తెలుగు రాష్ట్రాల పాఠకులు చాలా ఆశ్చర్యానికి లోనయ్యారు.
ప్రశ్న 10: “వ్యవసాయ వైకుంఠపాళిలో ఎండు నిచ్చెనలను అతి కష్టం మీద ఎక్కిన గంగాధర్‌ను పాము మింగడంతో మళ్ళీ క్రిందకి జారిపోయాడు” అంటూ ‘ఆకుపచ్చని ఆశ’ కథలో అన్నారు. తాను చేపట్టిన పోరాటంలో గంగాధర్ గెలుస్తాడా? సాటి రైతులు అతని వెంట నడుస్తారా? వ్యవస్థ తలొగ్గుతుందా? కథని ఆశావహ దృక్పథంతో ముగించారు, కానీ ఇవన్నీ సాధ్యమవ్వాలంటే ఇంకా ఏమేం అవసరమని భావిస్తున్నారు?
జ: నేను 35 సంవత్సరాలు ప్రభుత్వ వ్యవసాయ శాఖలో విస్తరణాధికారి (Extension officer) గా పని చేశాను. అందులోని లోటుపాట్లు క్షుణ్ణంగా తెలుసు. ఒక స్ప్రింక్లర్ పొందాలంటే ఎంత తతంగముంటుందో వివరించాను. పథకాల అమలులో రాజకీయ జోక్యం ఉండకూడదు. అధికారులు కూడా చిత్తశుద్ధితో అన్నదాత కోసం నిజాయితీగా పనిచేయాలి. అధికారులు ఏ.సి. గదుల్లో కూర్చుని పథకాలను రూపొందించకుండా. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను గమనించి తదనుగుణంగా పథకాలు పొందించాలి. అసలు విభిన్న భౌగోళిక, భూభౌతిక ప్రాంతాలు ఉన్న మన రాష్ట్రంలో ఏ ప్రాంతానికి ఏది అవసరమో అదే పధకం ప్రకటించాలి. ఏది ఏమైనా వ్యవసాయానికి అత్యంత ప్రాధ్యానతనిచ్చి రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇటీవల ప్రభుత్వాలు నేరుగా రైతు ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తున్నాయి. ఇందులో నాకు తెలిసి 40% మాత్రమే సద్వినియోగం అవుతున్నాయి. మిగతా నిధులన్ని భూకామందుల విలాసాలకే పనికివస్తున్నాయి. ఇది గమనించిన ఇప్పటి ప్రభుత్వం సమూల మార్పులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నది.
ప్రశ్న 11: ‘జీవన పరిమళం’ కథలో రచయిత ఆనంద్ స్వరూప్ మీరేనా? “కానీ కొందరు మేధావులనబడే విమర్శకులు అపారమైన జ్ఞానభారంతో వంగిపోయి..” అన్న వాక్యం ప్రస్తుత సాహితీలోకపు పోకడలను ఎండగట్టింది. ఈ కథ వెనుక కథ గురించి చెప్తారా? అంటే మీలోని రచయిత – పాఠకుడి మధ్య జరిగిన సంవాదంలా అనిపిస్తోంది, అందుకని.
జ: ‘జీవన పరిమళం’ కథలో రచయితగా నా అనుభవాలను ఆనంద్ స్వరూప్ పాత్ర ద్వారా వెల్లడించాను. ఏది మంచి కథ – ఏది గొప్పది- ఏది మరీ మహా గొప్ప కథనో నిర్ణయించుకోలేక పాఠకులు అయోమయానికి గురవుతున్న ప్రసుత నేపథ్యంలో ఎవరికి వారు తమ నిర్ణయాలను ప్రకటించేస్తున్నారు. సాహితీ పీఠాలు ఎక్కువైన తెలుగురాష్ట్రాల్లో కథల పోటీలు ఇబ్బడిముబ్బడిగా ప్రకటించేస్తున్నారు. దాంతో కథకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పోటీ పడుతున్నారే తప్ప – కథకి ఉండవలసిన ప్రాథమిక లక్షణాలను కూడా పట్టించుకోవడం లేదు! ఇటీవల మీరు గమనించారా? హాస్యకథల వూసే లేదు. ఒకప్పుడు హాస్యకథలకు తెలుగు సాహిత్యం చిరునామాగా వుండేది. ఇప్పుడు హాస్యకథలు పోటీలకు పనికిరావు! ప్రతి ఏటా వెలువడే ఉత్తమ కధా సంకలనాలకు అస్సలు పనికిరావు. అందుకని ఎవరూ వాటి జోలికి పోవడం లేదు! తెలుగు రచయితలు హాస్యానికి దూరమయ్యారా? అంతర్జాల పత్రికలలో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంది. మళ్ళీ ఎవరో ప్రత్యేకంగా హాస్య కథల పోటీ ప్రకటిస్తేనే – హాస్యం పొంగుకు వస్తుందేమో?
ఇక కొందరు మేధావులు నిజంగానే జ్ఞానభారంతో వంగిపోయిన తర్వాత ఎంత మంచి కథ చదివినా, పెద్దగా స్పందించరు. ఒక్క కథ అనే కాదు! కవిత – నవల – ప్రక్రియ ఏదైనా సరే! దేనిని విమర్శిస్తే, లేదా పొగిడితే తమకు పేరొస్తుందో వాటిని మాత్రమే వారు వ్యాఖ్యానిస్తారు. ఇటీవల కథల్లో మార్మిక వాస్తవికత- మాంత్రిక వాస్తవికతలను బయటి దేశాల నుండి అరువు తెచ్చుకొని మన పరిస్థితులకు అన్వయిస్తున్నారు. కథలు రాస్తున్నారు. రచనాశైలిలో పరిణతి మంచిదే కానీ – ఇది అతి పరిణతి. ఒక పరిణతికి చెందిన పాఠకుడిని మాత్రం సంతృప్తి పరచలేదు. ఇలాంటి కథల్లో అందరికీ అర్థం కానిదేదో – తమకు అర్థమయినట్లు కొందరు విమర్శకాగ్రేసరులు వీటిని తమ జ్ఞానసంపదతో పైకెత్తి పెడుతున్నారు. సరే! చివరికి పాఠకులే నిర్ణయిస్తారు. ఏ కథ ఏ కోవకు చెందాలనేని! రచయితలు అధ్యయనం చేసి ఏదైనా కొత్త కోణాన్ని తమ రచనల్లో ఆవిష్కరించాలనేదే నా ఉద్దేశం! ఇటీవల కొన్ని కథలు కొత్త కోణాలను ఆవిష్కరించాలనే ఉబలాటంతో డ్యాక్యుమెంటరీలుగా మారిపోతున్నాయి. కథకు ఎంత అవసరమో అంతే విషయాన్ని తీసుకోవాలిగాని – కథ చిన్నగా అయిపోయి, పరిశోధించిన విషయమే పెద్దగా అయినప్పుడు అది డాక్యుమెంటరీగా మారిపోతుంది. ఇటీవలి గొప్ప కథలు చదివిన పాఠకులకు నేను చెప్పేది అర్థమయ్యే వుంటుంది. కథకులు కథ రాయడానికి కష్టపడాలి. ఒక ఆంగ్ల రచయిత చెప్పినట్లు రచయిత తన అక్షరాలను ఎంత హింసిస్తే, అంత, తర్వాత అవి పాఠకులను హింసించకుండా వుంటాయి. ప్రతి వాక్యాన్ని కొలిచినట్లు – ప్రతి పేరాను సారాంశత (Abstract) గా రాస్తే, కథకు ఆయువు పెరుగుతుంది.
ప్రశ్న 12: శ్రామికులకొక న్యాయం, అధికారులకొక న్యాయంగా ఉన్న పని నిబంధనలు – శ్రామిక గిరిజనులలో కొత్త ఆలోచనకు దారితీసాయని చెప్పిన కథ ‘మౌనం ఎరుపు’. ఈ కథలోని అధికారి పాత్ర కల్పితమా? లేక నిజ జీవితంలో మీకు తారసపడిన వ్యక్తా? ఈ కథ గురించి మరికాస్త వివరాలు చెప్తారా?
జ: ఈ కథ పూర్తిగా నా స్వీయ అనుభవం. అందులో అధికారిని నేనే. ఇంతకుముందు చెప్పినట్లు 35 సంవత్సరాలు వ్యవసాయ విస్తరణాధికారిగా ఎన్నో గిరిజన గ్రామాలకు పనిచేశాను. ఈ పరిస్ధితులను ప్రత్యక్షంగా చూసి అనుభవించినవాడిని. ఆదిలాబాద్ జిల్లా మారుమూల గిరిజన ప్రాంతాలలో ఎన్ని ఉద్యమాలు పురుడు పోసుకున్నాయో అందరికీ తెలుసు! అవి ఎలా పుడతాయన్నదానికి, ఏ పరిస్థితులు మూలకారణంగా వుంటాయనేది నేను ఈ కథలో చూచాయగా చిత్రించాను. వారి మౌనం ఎరుపులో నుండే అనేక ఉద్యమాలు పుట్టాయి, పుడుతున్నాయి. పుడతాయి కూడా. ప్రభుత్వాలు ప్రజలకు అందించే కనీస జీవన సౌకర్యాలు, వారి దాకా చేరినపుడే కొంత ఉపశమనం. 1989లో రాసిన ఈ కథ ప్రాసంగికత ఇంకా ఇప్పటికీ నిలిచివుండటం కొంత బాధాకరమే!
ప్రశ్న 13: ఈ సంపుటిలోని ఏదైనా కథ రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?
జ: నిజంగానే! ‘ఒక విధ్వంసకర ప్రయాణం’ రాయడానికి కొంత కష్టపడ్డాను. ఒక ప్రఖ్యాత నర్తకీమణిని ఇంటర్వ్యూ చేయడం – రెండో పక్కన నేనే కూర్చొని జవాబులు చెప్పడం కష్టమనిపించింది. రెండు ఇంటర్వూల తర్వాత కథ ముగింపు రచయిత వ్యాఖ్యానంతో ముగిసింది. దానిని ఇంకా కొంత స్పష్టంగా, మరికొంత అర్థవంతంగా రాసి వుండవచ్చుననిపించింది. కానీ కథ చాలామందికి చేరువైంది. అలాంటి వారిని దగ్గరనుండి చూసిన కొందరు నాకు ఫోన్లు చేసి చెప్పారు. కాబట్టి ముగింపు గురించిన కొంత అసంతృప్తి – సంతృప్తిగా మారిపోయింది.
ప్రశ్న 14: ‘మౌనం ఎరుపు’ పుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఈ సంపుటిని పాఠకుల వద్దకు ఎలా చేర్చాలనుకుంటున్నారు? పుస్తకం గురించి అందరికీ తెలిసేందుకు ఏం చేద్దామని అనుకుంటున్నారు?
జ: నేను 2016 లో ‘నెమలినార’ కథాసంకలనం ప్రచురించిన తర్వాత అడపాదడపా కధలు రాయడం, 2023 వరకు 5 కథలకు బహుమతులు రావడం, మరికొన్ని కథలు ప్రచురింపబడటం జరిగింది. సంకలనం వేద్దామంటే 10 కథలే వున్నాయి. పోనీ కొత్తని మరో అయిదారు రాసి జతచేద్దామంటే, సంవత్సరానికి ఒక కథ కూడా రాయలేని నేను 5-6 కథలు రాయడం అయ్యేపని కాదు. 10 కథల చిత్తు కాగితాలు, పత్రికలూ ఎన్నాళ్ళని భద్రపరుస్తాం. పుస్తకరూపంలో అయితే వెతుక్కునే అవసరం వుండదని, పాత కథలు 4 కలిపి ‘మౌనం ఎరుపు’ సంపుటి వేశాను.
పుస్తకం గురించి సాహితీలోకానికి తెలిపేందుకు నా దగ్గర పెద్దగా సాధనాలు లేవు. ఒక్క FBలో మాత్రం పెడతాను. రెండు మా మిత్రుల వాట్సాప్ గ్రూపులలో మిత్రులు పోస్ట్ చేయడమే తప్ప ఇతరత్రా మార్గాలేమీ పెద్దగా లేవు. నవోదయలో ఒక 10 కాపీలు పెట్టడం – ‘చదువుతారు’ అన్న నమ్మకం నాకు కలిగితే వారికొక పుస్తకాన్ని బహూకరించడం! కొన్ని పత్రికలకు సమీక్ష కోసం కూడా పంపిస్తాను. అంతే!
ప్రశ్న 15: సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి?
జ: ప్రణాళికలు పెద్దగా ఏమీ లేవండి. రాయాలనిపించినపుడు, రాయకుండా ఉండలేనప్పుడు మాత్రమే కథ రాసుకోవడం – అంతే! అయితే విపరీతంగా చదువుతాను. మంచి పుస్తకాలను సంపాదించి చదవడమే. నా కథలు మన పొరుగు రాష్ట్రాల భాషలలోనికి అనువాదమయ్యే ప్రయత్నాలను ముమ్మరం చేయడం ఇపుడు నా ముందున్న పెద్ద ప్రణాళిక!
ఏది ఏమైనా సాహిత్యం నాకు రెండవ ప్రాధాన్యతనే! మొదటి ప్రాధాన్యత నా జీవితమే! అనేక కోణాలలో, అందుబాటులో ఉన్న మార్గాల్లో జీవితంలోని వైవిధ్యాలను తనివితీరా ఆస్వాదించడమే! మా చుట్టూ ఉన్న అడవి అందాలను, ప్రకృతిని, కాలచక్రాల మార్పులను గమనించి ఆనందించడమే నా మొదటి ప్రాధాన్యత!
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు బోరి మురళీధర్ గారూ.
బోరి మురళీధర్: ఒక అర్థవంతమైన చర్చకు అవకాశమిచ్చినందుకు మీకు ధన్యవాదాలు!
***
రచన: బోరి మురళీధర్
పేజీలు: 148
వెల: ₹ 200/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్,
కాచీగుడా,
హైదరాబాద్.
ఫోన్: 9000413413
బోరి మురళీధర్:
8074360923
~
‘మౌనం ఎరుపు’ కథాసంపుటి సమీక్ష:
https://sanchika.com/mounam-erupu-book-review-kss/