Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంపాదకులు శ్రీ బెహరా సత్యనారాయణ మూర్తి ప్రత్యేక ఇంటర్వ్యూ

[ప్రముఖ రచయిత శ్రీ బెహరా వెంకట సుబ్బారావు వర్ధంతి సందర్భంగా, వారి కుమారుడు; ‘మధ్య తరగతి మందహాసం’ అనే పుస్తకం సంపాదకులు శ్రీ బెహరా సత్యనారాయణ మూర్తి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం బెహరా సత్యనారాయణ మూర్తి గారూ.

బెహరా సత్యనారాయణ మూర్తి: నమస్కారం.

~

ప్రశ్న 1: మీకు మీ నాన్నగారు పేరున్న రచయిత అన్న గ్రహింపు ఎలా కలిగింది? దానికి మీ స్పందన ఏమిటి?

జ: 1984లో రాష్ట్రస్థాయిలో ఆంధ్రప్రభ నిర్వహించిన మాదిరెడ్డి సులోచన స్మారక కథల పోటీలో ‘విలువలు’ కథకు మా నాన్నగారు ద్వితీయ బహుమతి పొందారు. హైదరాబాద్, రవీంద్రభారతిలో ప్రముఖులు అక్కినేని, రోశయ్య గార్ల సమక్షంలో బహుమతి స్వీకరించారు. అది మా కుటుంబానికి గర్వకారణంగా నిలిచింది. ఆ రోజు ఆయనను ప్రముఖ రచయితగా చూసిన ఆనందం మాటల్లో చెప్పలేనిది.

బెహరా వెంకట సుబ్బారావు దంపతులు

ప్రశ్న 2: మీ నాన్నగారు ఉద్యోగంలో బిజీగా వుండేవారు. ఏ సమయంలో రాసేవారు? ఆయన రచనకు ప్రథమ పాఠకులెవరు?

జ: మీరు అన్నది నిజమే. పోస్ట్ మాస్టర్‌గా పనిచేసిన నాన్నగారికి పగలు తీరిక ఉండేది కాదు. అందరూ నిద్రపోయే సమయాన రాయడం మొదలు పెట్టేవారు. అది తెల్లవారుజామున రెండు మూడు గంటల వరకు కొనసాగేది. మా కుటుంబ సభ్యులే ఆయన రచనలకు ప్రథమ పాఠకులు. మేము నిర్మొహమాటంగా మా అభిప్రాయం చెప్పేవారం. నాన్నగారు రచించిన రచనలు ఒక నాలుగైదు తప్ప మిగిలినవి పత్రికలలో ప్రచురితమయ్యాయి అని గర్వంగా చెప్పగలను.

ప్రశ్న 3: మీ ఇంట్లో సాహిత్య పరంగా ఎలాంటి వాతావరణం ఉండేది? మీమీద దాని ప్రభావం ఎలా వుంది?

జ: నాన్నగారికి మా అమ్మగారు బెహరా గౌరీకాంతం గారి సహకారం బాగా ఉండేది. కథలు పత్రికలకు పంపే ముందు మేమందరం కథను చదివి మా అభిప్రాయాలు చెప్పే వాళ్ళం.. ప్రతి కథలో ఆయన చెప్పిన విలువలు తను పాటించి చూపడం, మేము మా నిజ జీవితంలో మేము పాటించేందుకు దోహదపడిందని చెప్పాలి.

బెహరా వెంకట సుబ్బారావు గారితో కుమారుడు సత్యనారాయణ మూర్తి

ప్రశ్న 4: ఇన్నాళ్ళ తరువాత మీకు మీ నాన్నగారి లభ్య రచనలన్నీ ఒక పుస్తకంలా ప్రచురించాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

జ: పుస్తక రూపం తేవాలని అనుకొన్న నాన్నగారి కల సాఫల్యం చేయాలని 2005లో ఒక చిన్న పుస్తకం కాళీపట్నం రామారావు గారి చేతుల మీదుగా కథా నిలయంలో విడుదల చేయడం జరిగినది. నిజం చెప్పాలంటే అది నాకు పూర్తి సంతృప్తి ఇవ్వలేదు. సూట్‌కేసులో నాన్నగారి కథల ప్రతులు చూసినప్పుడల్లా వాటిని ఎలాగైనా వెలుగులోకి తీసుకురావాలని నాకు అనిపించేది.

కానీ ఆఫీసు పని ఒత్తిడి వలన అయ్యేది కాదు. ఆ సమయంలో మిత్రుడు బాపూజీ ‘సంచిక’ అంతర్జాల పత్రికలో నాన్నగారి గురించి రాసిన ఒక వ్యాసం నాలో ప్రేరణ కలిగించింది.

కథానిలయంలో కాళీపట్నం రామారావు గారి చేతుల మీదుగా నాన్నగారి మొదటి పుస్తకం విడుదల సందర్భంగా

ప్రశ్న 5: ఈ ఆలోచనను ఆచరణలో ఎలా పెట్టారు?

జ: మా ఆఫీసులో రిటైర్ అయిన NIC, AP హెడ్, ప్రముఖ సాహిత్యవేత్త అయిన డా. వి. వి. వెంకట రమణ గారి ప్రోత్సాహంతో, మిత్రుడు బాలకృష్ణ సహకారంతో డిసెంబరు 2024లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

కథానిలయంలో కాళీపట్నం రామారావు గారి చేతుల మీదుగా నాన్నగారి మొదటి పుస్తకం విడుదల సందర్భంగా

ప్రశ్న 6: ఈ పుస్తక ప్రచురణానుభవాలేమిటి?

జ: పుస్తకం తీసుకు రావడం అనేది నాకు కొత్త విషయం. ఇదివరకు నాన్నగారి పుస్తకం ఒకటి విడుదల చేసినా, అది చాలా చిన్నది. ఇది ఒక బృహత్తర ప్రయత్నం. బడ్జెట్ అధికమవుతున్న ఇది నాన్నగారు నాకు కల్పించిన అరుదైన అవకాశంగా భావించి క్వాలిటీలో రాజీ పడకుండా ముందుకు వెళ్ళాం. EMESCO విజయకుమార్ గారు పుస్తక నాణ్యతను మెచ్చుకోవడం ఎంతో ఆనందం కలిగించింది. హైదరాబాదులో రమణగారు, విజయనగరంలో బాలకృష్ణ, మధ్య విజయవాడలో నేను ఇలా ముగ్గురం మూడు చోట్ల నుంచి మూడు నెలలు పాటు కష్టపడితే వచ్చిన ఫలితం ఇది. ఈ పుస్తక విడుదల కొరకు ఉదయాన్నే మూడు గంటలకు నిద్ర లేచిన రోజులు మా ముగ్గురికి ఉన్నాయి. చివరిలో కాళీపట్నం రామారావు గారి అబ్బాయి సుబ్బారావు గారు ఒక కథ పంపించారు. 1957లో ఆంధ్రపత్రికలో (దిన)కథానిక రూపంలో ప్రచురితమైనది దాని పేరు ‘అద్దం మీద ఆవగింజ’. ఆ కథ అక్షరాలు నిజంగా ఆవగింజలు లాగే ఉన్నాయి. అందుకని దాని టైపింగ్ ఎవరికి ఇవ్వకుండా స్వయంగా నేనే డిటిపి చేశాను. దాదాపు 8 గంటలు పట్టింది. ఇది ఒక మరిచిపోలేని అనుభవం. చివరికి వచ్చేసరికి ఎన్నో మల్టిపుల్ పనులు రావడం జరిగింది. ఇంట్లో వివాహం జరిగినట్లుగా, అనుకోకుండా చాలా చాలా ఏర్పాట్లు చేయవలసి వచ్చింది. ఎంతో కష్టపడ్డా చివరికి దక్కిన అనూహ్య స్పందన లభించడంతో అంతా మర్చిపోయాను.

మాజీ ఉపరాష్ట్రపతి డా. ఎమ్ వెంకయ్య నాయుడు గారికి పుస్తకం అందజేస్తూ

ప్రశ్న 7: ఇందులోని కథలు చదువుతూంటే మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? ఈ కథలన్నీ ఆయన జీవితంలోంచి వచ్చినవే కాబట్టి, ఇందులోని సంఘటనలూ, మనుషులూ మీకు కొద్దో గొప్పో పరిచయస్థులే అయివుంటారు. సంఘటనలూ తెలిసివుంటాయి.

జ: అవునండీ. నాన్నగారు పెళ్లికి వెళ్తే ఒక కథ. రైలు ప్రయాణం చేస్తే ఒక కథ. బస్సు ప్రయాణం చేస్తే ఒక కథ. ఏదైనా కార్యాలయానికి వెళ్లినా అక్కడ జరిగిన సంఘటనలతో ఒక కథ. మేము చెప్పే మాటలతో ఒక్క కథ. ఇలా సమాజంలో జరిగిన సంఘటనలే ఆయన కథలకు నేపథ్యం.

ప్రశ్న 8: ఇందులో మీకు పరిచయమైన సంఘటనలూ, మనుషుల గురించిన కథలు చదువుతూంటే, నిజ జీవితాంలోని సంఘటనలను ఆయన కథలుగా మలచిన తీరు బోధపడి వుంటుంది. అది వివరిస్తారా?

జ: చాలా కథలకు జరిగిన సంఘటనలే నేపథ్యం. ‘పాపం పట్నాయక్’ కథ మా స్నేహితుడి కథ. ‘అమాయకుడు’ మేము కొత్తవలస నుంచి వైజాగ్ చేసే బస్సు ప్రయాణం. ‘పొరపాటు ఎక్కడుంది’ మా దగ్గర బంధువులు ఇంట్లో జరిగిన పెళ్లి కథ. ‘దొడ్డ మనసు’, ‘పెద్దకొడుకు’, ‘న్యాయం’, ‘యుగధర్మం’ మా బంధువర్గాలలో జరిగిన కథలు. ‘వీడ్కోలు’, ‘ఆంధ్రుని ఆంతర్యం’, ‘మొక్కుబడి’, ‘Less Luggage More Comfort’, ‘విలువలు’ ఆయనకు స్వానుభవాలే. ‘చెయ్యి ఊచమ్మ చేయి ఊచు’, ‘పాపం పాపారావు’, ‘పాపం పట్నాయక్’ ఇలా ప్రతి కథ కూడా జరిగిన సంఘటనలే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కథలు వస్తాయి.

ప్రముఖ నటులు, రచయిత తనికెళ్ళ భరణి గారికి పుస్తకం అందిస్తూ

ప్రశ్న9: ఈ సంపుటిలోని కథల్లో మీకు బాగా నచ్చిన కథ ఏది?

జ: అన్నిటికంటే ఇది చాలా కష్టమైన ప్రశ్న. ప్రచురించబడిన 73 కథల్లో దాదాపు 55 కథలు నాకు బాగా నచ్చినవే. సామాజిక స్పృహతో రాసిన ‘నదీనం సాగరో గతి’ ఆ రోజుల్లో ఒక విప్లవం అనే చెప్పాలి. కోటీసు, భగవంతుడు, కాలం కాటేసిన మనసులు ఇలా పేదల జీవితాల గురించి ఆయన రాసిన కథలు ఎన్నో ఉన్నాయి. మద్యపానానికి గురి అయిన భర్తకు చెప్పిన గుణపాఠం ఒక కథ అయితే, అత్తవారింటికి వెళ్ళబోయే అల్లుడు పడ్డ పాట్లు ‘చెయ్యి ఊచమ్మ చెయ్యి ఊచు’ కథలో, సెలవు కోసం ఉద్యోగస్థులు పడే పాట్లు, బాస్‌కు పట్టే కాకాలు కాకరకాయలు ఇలాంటివి. ‘దొడ్డ మనసు’, ‘న్యాయం’ కథలలో స్త్రీ మనస్తత్వం, ‘వన్ మినిట్’ కథలో సమయపాలన విలువ చెప్పారు. ‘కర్తవ్యం’ కథలో ఉపాధ్యాయుడికి సాయం చేద్దామనుకున్న శిష్యుడికి గురువు చేసిన కర్తవ్య బోధన, భార్యాభర్తల మధ్య గిల్లికజ్జాలు ‘అద్దం మీద ఆవగింజ కథ’లో, సమాజంలో వివిధ వర్గాలు చేస్తున్న దోపిడీ ‘దోపిడీ’ కథలో కనిపిస్తోంది. ఈయన పలు కథల్లో అవినీతి, వరకట్నం, మద్యపానంకి వ్యతిరేకంగా కలమెత్తారు. ‘విలువలు’ కథలో టాక్సీ డ్రైవర్, ‘ప్రాణం ఖరీదు’ కథలో రిక్షా డ్రైవరు, ‘దొడ్డ మనసు’లో పనిమనిషి, ‘నిజాయతీ’లో బిచ్చగాడు అనేక క్రింది తరగతి పాత్రల మనో బలాన్ని చూపారు.

ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారికి పుస్తకం అందిస్తూ

ప్రశ్న 10: ఏ కథ చదువుతూంటే, ఆ అనుభవం తాజా అయి మీ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి?

జ: ‘నిజాయితీ’ కోసం కోటీసు ప్రాణాలు ఇవ్వడం, ‘మొక్కుబడి’ కథలో పెద్ద కొడుకుగా బాధ్యత స్వీకరించడం కోసం విద్యను త్యాగం చేసిన విధానంలో నాన్నగారి స్వీయచరిత్ర గుర్తుకు వచ్చి చాలా బాధనిపించింది.

ప్రశ్న11: ఈ కథలు చదువుతూంటే, ఒక పాఠకుడిగా మీ నాన్నగారి రచనలను ఎలా విశ్లేషిస్తారు?

జ: కీర్తి శేషులు బెహరా వెంకట సుబ్బారావు గారు తన నాలుగు దశాబ్దాల సాహితీ సేవలో (1957-98) దాదాపు రెండు వందలు కథలు, రెండు సీరియల్స్ వ్రాశారు. వివిధ దిన, వార, మాస పత్రికల్లో ప్రచురితమై లభ్యమైన డెబ్బై మూడు కథలు, రెండు సీరియల్స్ ఈ సంకలనంలో మనం చదవవచ్చు. వీటిలో దాదాపు 30 కథలు వివిధ పోటీలలో బహుమతి గెలుచుకొన్నవే. డెబ్బై, ఎనభై దశకాల్లో బెహరా వెంకట సుబ్బారావు పేరు ప్రతీ పాఠకుని నోట్లో నలిగేది. ఆంధ్ర సచిత్ర వారపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతిల్లో ఈయన కథలు ఎక్కువగా కనిపించేవి.

మండలి బుద్ధప్రసాద్ గారికి పుస్తకం అందిస్తూ

వీరి కథలలో సమకాలీన పరిస్థితులు, నైతిక విలువలు, ప్రభుత్వ కార్యాలయాలలో జరిగే పనితీరు కళ్ళకు కట్టినట్లు వర్ణించేవిగా హాస్య ధోరణిలో వుంటాయి. మధ్యతరగతి జీవితాలలో వుండే ఆప్యాయతలు, సంఘర్షణలే ఆయన కథలకు ముడిసరుకు. వారి కథలలో చక్కని సామాజిక స్పృహ కనిపిస్తుంది. అభ్యదయ భావాలలతో, సులభమైన శైలి, ఉత్తరాంధ్ర నుడికారంతో సుబ్బారావు గారి కథలు పాఠకులను ఇట్టే ఆకట్టుకుంటాయి. చదివిన తర్వాత ఆలోచింపజేస్తాయి.

‘వన్ మినిట్’, ‘విలువలు’, ‘కోటీసు’ వంటి రచనలు మానవ స్వభావాన్ని తడిమి చూసే ప్రయత్నంగా సాగుతాయి. సమయ పాలన యొక్క ఆవశ్యకతను తెలియజేసే కథ ‘వన్ మినిట్’. జీవితం ఒక ప్రవాహం అయితే, ఆ ప్రవాహంలో విలువలే దిశను నిర్దేశించేవి అని ‘విలువలు’ ద్వారా స్పష్టంచేశారు. ‘నదీనాం సాగరో గతి’ కథ ఆ రోజులలో సామాజిక విప్లవం అనే చెప్పాలి. ‘నస్త్రీ స్వాతంత్ర్య మర్హతి’ వంటి కథల్లో స్త్రీల స్థానం గురించి ఆయన వ్యక్తీకరించిన దృక్పథం సమాజానికి అవసరమైన శక్తివంతమైన సందేశంగా నిలిచింది. ‘లివ్ అండ్ లెట్ లివ్’ – ఈ ఒక్క మాటే ఆయన రచనా తాత్త్వికతను సమగ్రంగా వివరిస్తుంది. మనం బ్రతకాలి, ఇతరులను బ్రతికించాలి అనే సూత్రం ద్వారా సమాజంలో రిజర్వేషన్స్ తాలూక ఆవశ్యకతను తెలియజేశారు.

ప్రతి కథలోనూ సమాజంలోని ఏదో ఒక లోటుపాటుని ఎత్తి చూపడమో, నీతి, ధర్మం తప్పకూడదు అనే సందేశాన్నో నిబిడీకృతం చేయడం, చక్కని కొసమెరుపుతో కథను ముగించడం రచయిత అలవాటు. ఒక్కమాటలో చెప్పాలంటే, 20వ శతాబ్దంలో తెలుగు పల్లె, పట్టణం, ప్రజలు, దేశకాల పరిస్థితులు, ఆనాటి కుటుంబ సంబంధ బాంధవ్యాలు వీటి గురించి తెలుసుకోవాలంటే, బెహరాగారి కథలు చదివితే చాలు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రివర్యులు డా. సత్య కుమార్ గారికి పుస్తకం అందిస్తూ

ప్రశ్న12. రచయితగా మీ నాన్నగారి శైలి గురించి, కథన సంవిధానం గురించి, వస్తువును ఎన్నుకునే పద్ధతి గురించి మీ అభిప్రాయం ఏమిటి?

జ: నాన్నగారికి ఒక ప్రత్యేకమైన శైలి ఉందని నేను అనుకోను జి. వల్లీశ్వర్ గారు చెప్పినట్టు మధ్య తరగతి మనుషుల మనసును పట్టుకున్నారు. అదే తన కధా వస్తువుగా చేసుకున్నారు. నాన్నగారు రచయితగా చెప్పిన విలువలను తండ్రిగా పాటించారు. కార్యాలయంలో, కుటుంబంలో తన బాధ్యతను నిర్వర్తిస్తూ సాహిత్య సేవను కొనసాగించారు. చివరి వరకు కష్టపడుతూ అందరిని సుఖపెట్టిన మహానుభావుడు.

ప్రశ్న13. పుస్తక ప్రచురణ తరువాత మీ అనుభవాలేమిటి?

జ: ఇవి మాత్రం అనూహ్యమైనవి. ఒకదాని తర్వాత ఒకటి సంఘటనలు జరుగుతున్నాయి. దీని మీద ఒక పెద్ద వ్యాసం రాయవచ్చు. పుస్తక ప్రచురణ సమయంలో, తర్వాత కూడా ప్రముఖ వ్యక్తులు అందరూ నన్ను ప్రోత్సహించిన విధానం నమ్మశక్యం కాదు. ఈ కార్యక్రమం సందర్భంగా ద్విభాష్యం రాజేశ్వరరావు గారు, జె పి శర్మగారు, కొచ్చర్లకోట జగదీష్ గారు, అట్టాడ అప్పలనాయుడు గారు, కొవ్వలి లక్ష్మీనారాయణ గారు, పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, వల్లీశ్వర్ గారు ఇలా అందరూ ప్రముఖులతో చర్చించడం జరిగింది. వారు నాకు ఇచ్చిన ప్రోత్సాహము చెప్పనలవి కాదు. ప్రచురణ తరువాత MS సూర్యనారాయణ గారు, సనత్‌ల సహకారంతో గౌరవనీయ తనికెళ్ల భరణి, గరికపాటి, మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీ ప్రకాద్, డా. సత్య కుమార్, వెంకయ్య నాయుడు వంటి ప్రముఖులను కలిసి పుస్తకం ఇవ్వడం జరిగింది.

గరికపాటి నరసింహారావు గారికి పుస్తకం అందిస్తూ

ప్రశ్న14. రచయితగా, తండ్రిగా ఆయనను ఎలా విశ్లేషిస్తారు?

జ: రచయితగా తండ్రిగా వేరు కాదు. రచయితగా చెప్పిన విషయాలను తండ్రిగా పాటించారు నైతిక విలువలకు కట్టుబడ్డారు. కార్యాలయంలో, కుటుంబంలో తన వంతు బాధ్యత నిర్వహిస్తూనే సాహిత్య సేవ చేశారు. చివరి వరకు కష్టపడుతూనే అందర్నీ సుఖపెట్టారు. ఒక మహానుభావుడు అని చెప్పాలి.

ప్రశ్న15. పుస్తకానికి ‘మధ్య తరగతి మందహాసం’ అన్న పేరు పెట్టటంలో మీ ఉద్దేశ్యం ఏమిటి?

జ: కథలన్నీ చదివిన తరువాత స్పాంటేనియస్‌గా ఒక నిమిషంలో పెట్టిన పేరు. మధ్య తరగతి జీవన శైలిని ప్రతిబింబించే కథలు కాబట్టి ‘మధ్య తరగతి మందహాసం’ అని పేరు పెట్టడం జరిగింది.

ప్రశ్న16. మీ నాన్నగారి రచనలు పెద్ద ఎత్తున పాఠకుల దగ్గరకు తీసుకువెళ్ళటం కోసం భష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలకు ప్రణాళికలు వేస్తున్నారు?

జ: ముందుగా పుస్తక విజయాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాము. ఈ రోజుల్లో పుస్తకం ఇంతగా సక్సెస్ అవడం చాలా అరుదైన విషయమని చాలామంది ప్రముఖులు చెప్పారు. దీనికి రచయిత మిత్రుడు బాలకృష్ణ చౌదరికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ప్రింటింగ్ రంగంలో యోధులైన EMESCO విజయ్ కుమార్ గారు పుస్తకం చూసిన వెంటనే అద్భుతం అని చెప్పారు. ఇక దీన్ని ప్రాచుర్యం లోకి తీసుకురావడానికి త్వరలో ఒక పుస్తక పరిచయ కార్యక్రమం విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం.

ఆ వెంటనే విజయవాడలో హైదరాబాదులో కూడా కార్యక్రమాలు పెడదామనుకుంటున్నాం. రాష్ట్రంలోని, దేశంలోని ప్రముఖ గ్రంథాలయాలకి సంస్థలకి పుస్తకాన్ని పంపించడం జరిగింది. పెద్దల సలహాతో మరిన్ని కార్యక్రమాలను   చేయదలుచుకున్నాం. ఆంధ్రా యూనివర్సిటీకి ఏదైనా యూనివర్సిటీకి రీసెర్చ్ బుక్‌గా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే ఎవరైనా స్పాన్సర్లు దొరికితే ప్రముఖ నగరాల్లో ఈ పుస్తకంపై ఒక సెమినార్ కార్యక్రమం నిర్వహించే ఆలోచన కూడా ఉంది.

ప్రముఖ రచయిత బ్నిం గారికి పుస్తకం అందిస్తూ

ప్రశ్న17. పుస్తకంలో కథలను మీరు క్రానాలజికల్ క్రమంలో పెట్టివుంటే రచన శైలి పరిణామక్రమాన్ని గమనించేవీలు కలిగేది.. రచనలను అమర్చటంలో మీ ప్రణాళిక ఏమిటి?

జ: నిజానికి అలా పెడితే బాగుంటుందని నేనూ అనుకొన్నాను. కానీ తెలుగు అక్షరమాల ఇంగ్లీష్ alphabet లో పెడితే నచ్చిన కథని ఎంచుకుని చదవడం సులభం అవుతుందని అలా పెట్టడం జరిగింది.

ప్రశ్న18. చివరలో ‘నిశ్శబ్ద సంగీతం’ నవలను పొందుపరచారు. ఇదొక్కటేనా వారు రచించిన నవల? ఈ నవల గురించి చెప్పండి. ఇందులో మీకు నచ్చినదేమిటి?

జ: సీరియల్స్ రాయడం కంటే కథలు రాయడం కష్టమని నాన్నగారు అంటుండేవారు. మరి ఎందుకో వారు సీరియల్స్ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. రాసినది ఒకటే, అది కూడా అప్పటి ఆంధ్ర పత్రిక సంపాదకుడు వీరాజీ గారి కోరిక మీద రాసి పంపించారు. ‘నిశ్శబ్ద సంగీతం’లో నైతిక విలువలు మానవ సంబంధాలు, మానవ నైజం లాంటి విషయాలు చక్కగా వివరించి చెప్పాడు. ‘దారి తప్పకు’ అనే బాలల సీరియల్‌ను బాలజ్యోతిలో ప్రచురించారు. బహుమతి గెలిచిన ఆ సీరియల్ బాగా ప్రాచుర్యం పొందింది.

వాడ్రేవు చినవీరభద్రుడు, వోలేటి పార్వతీశం గార్లు, ఇతర ప్రముఖులుకు పుస్తకం అందిస్తూ

ప్రశ్న19. ఇంకా మీ నాన్నగారి రచనలేవైనా ప్రచురణ కానివి వున్నాయా? అసంపూర్ణ రచనలున్నాయా? వాటి గురించి మీ ప్రణాళికలేమిటి?

జ: నాన్నగారు దాదాపు 200 కథల రాశారు. లభ్యం కాని వాటిలో 30 కథల వివరాలు ఉన్నాయి. వాటిని ఎలాగైనా సంపాదించి మరొక పుస్తకం కింద తీసుకు వచ్చే ఆలోచన ఉంది.

ప్రశ్న20. ఇవన్నీ దాదాపుగా రెందు దశాబ్దాల క్రితం రచించినవి.ఇప్పటికీ ఈ రచనలకు ప్రాసంగిత వుందా? వుంటే ఈ తరం ఈ రచనలనుంచి ఏమి గ్రహించవచ్చు?

జ: ఈ కథలలో నైతిక విలువలు పాలన, అవినీతి, వరకట్నం, మద్యపానంలకు వ్యతిరేకంగా, నిజాయితీ, మానవ సంబంధాలు మొదలగు విషయాల మీద చర్చించడం వలన ఈనాటి తరం నేర్చుకుని పాటించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి.

ప్రశ్న21. ఈ పుస్తకంలోని ప్రత్యేకతలు ఏమిటి?

జ: కొన్ని ప్రత్యేకతలున్నాయి.

  1. మొత్తం 73 కథలు రెండు సీరియల్స్ అన్ని ప్రముఖ వార, మాస పత్రికల్లో ప్రచురించబడినవే మరియు అనేక బహుమతులు గెలుచుకున్నవి.
  2. పుస్తకంలో ఉన్న ప్రతి కథ, సీరియల్ పై రెండు వాక్యాలలో విశ్లేషణ ముందు పేజీలలో ఇవ్వబడింది. దీనివల్ల పాఠకుడు తనకు నచ్చిన కథ ఎంచుకుని చదువుకునే సౌలభ్యం కలుగుతుంది.
  3. ఒరిజినల్‌గా పత్రికలో ప్రచురించబడినప్పుడు ఆర్టిస్ట్ వేసిన ఫోటోను స్కాన్ చేసి ప్రతి కథ ముందు పేజీలో ఉంచడం జరిగినది.

ప్రశ్న22. ఈ సందర్భంగా మీరు ఎవరికైనా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పదలుచుకున్నారా?

జ: సంచిక అంతర్జాల పత్రికలో వ్యాసం ప్రచురించి నాలో ఈ కోరిక పుట్టించిన KSS బాపూజీకి,

ఎప్పుడు పుస్తకం ప్రచురించిన తమ సహకారం ఉంటుందని వెన్ను తట్టి నడిపించిన కలిగొట్ల సన్యాసి రాజు, చాగంటి సత్యవాణిలకు

నీకెందుకు నేనున్నాను అని ధైర్యం చెప్పి పుస్తకం ఎడిటింగ్, ప్రూఫ్ రీడింగ్ లో సాయ పడిన మా సీనియర్ ఆఫీసర్ సాహిత్యవేత్త డాక్టర్ వి వి వెంకట రమణ గారికి

అడగకుండానే ముందుకు వచ్చి సహాయం చేసిన స్వాతి శర్మ దంపతులకు

పుస్తక ప్రచురణకు మనసుపెట్టి పనిచేసి సభా నిర్వహణలో ముందుండి చేసిన మిత్రుడు బాలకృష్ణ చౌదరికి

సరైన వేదిక కల్పించి కార్యక్రమానికి వన్నె తెచ్చిన మిత్రుడు డివి రమణ గారికి.

ఇంటి పనులకు నాలుగు నెలలు సెలవు ఇచ్చి మొదటి నుంచి చివరిదాకా వెనుక ఉండి సపోర్ట్ చేసిన నా శ్రీమతి పద్మావతికి ధన్యవాదాలు. పిల్లలు పుష్య స్ఫూర్తి సాయి లకు ఆశీస్సులు.

ఇలా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా ధన్యవాదాలు.

~

సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, ‘సంచిక’ కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు బెహరా సత్యనారాయణ మూర్తి గారు.

బెహరా సత్యనారాయణ మూర్తి: ‘సంచిక’ టీమ్‌కి నా ధన్యవాదాలు.

***

మధ్య తరగతి మందహాసం
(బెహరా వెంకట సుబ్బారావు సర్వలభ్య రచనలు)
సంపాదకులు: బెహరా పేరిందేవి, బెహరా సత్యనారాయణమూర్తి, డా. వి. వి. వెంకట రమణ
ప్రచురణ: అభ్యుదయ రచయితల సంఘం, విజయనగరం జిల్లా
పేజీలు: 480
వెల: ₹ 500
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
~
బెహరా పేరిందేవి
ఫ్లాట్ నెం. 1B, శ్రీనివాసా ఎన్‍క్లేవ్,
ప్రహ్లాదపురం,
విశాఖపట్టణం 530027
ఫోన్: 9848318204, 8309574116
~
బెహరా లక్ష్మీ దివ్య స్ఫూర్తి
ఫోన్: 7396627924
~
ఆన్‍లైన్‌లో:
https://www.amazon.in/Madhya-Taragati-Mandahasam-Behara-Venkata/dp/B0FHQQ84LD

~
‘మధ్య తరగతి మందహాసం’ పుస్తకం సమీక్ష:
https://sanchika.com/madhya-taragati-mandahasam-book-review-prof-chs/

Exit mobile version