[‘కొమ్ము దళిత కథ 2023’ సంకలనం సంపాదకుల ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: ‘కొమ్ము దళిత కథ 2023’ సంకలనం సంపాదకులకు నమస్కారం.
సంపాదకులు: నమస్కారం సార్.
~
ప్రశ్న1: జంబూ సాహితీ తరఫున మీ సంపాదకత్వంలో ‘కొమ్ము’ దళిత కథా సంకలనం వెలువరించినందుకు అభినందనలు. దళిత కథా వార్షిక సీరిస్ 2020లో మొదలైంది. అప్పటి నుంచి మీ ముగ్గురే సంపాదకులుగా ఉంటున్నారా? లేక ప్రతీ సంవత్సరం కొత్త సంపాదకులు బాధ్యత తీసుకుంటున్నారా?
జవాబు: మేం ముగ్గురమే కొనసాగుతున్నాము. 2020 లో వెలువడిన తొలి దళిత కథ ‘తొండంబొక్కెన’, దేశంలో వెలువడిన తొలి దళిత కథ వార్షికగా ప్రసిద్ధికెక్కింది. 2. చిందూ నేల-2021, 3. సాక – 2022, 4. కొమ్ము – 2023. ఆయా సంవత్సరంలో వెలువడిన కథల నుండి ఎంపిక చేసిన ఉత్తమ కథలను సంకలనంగా తెస్తున్నాం. ప్రారంభం నుంచి ఇప్పటివరకు నేను (డా. సిద్దెంకి యాదగిరి), గుడిపల్లి నిరంజన్, తప్పెట ఓదయ్య కలిసి సంపాదకులుగా వ్యవహరిస్తున్నాము. భవిష్యత్తులోనూ కొనసాగిస్తాం.
ప్రశ్న 2: జంబూ సాహితీ దళిత కథా వార్షికల ప్రచురణకే పరిమితమా లేక దళిత రచయితల కొత్త పుస్తకాలు ప్రచురిస్తుందా? జంబూ సాహితీ నేపథ్యం గురించి వివరించండి.
జవాబు: ప్రారంభం నుంచి ఇప్పటివరకు దళిత కథ వార్షికలకి తొలి ప్రాధాన్యమిస్తున్నాము. మీరన్న కోరిక ఆలోచనలో ఉంది. అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. మున్ముందు విస్మృతికి గురైన దళిత సాహిత్యంను జంబూ సాహితీ ప్రచురించడానికి ముందుంటుంది.
2019 మార్చిలో కరోనా పాండమిక్ సిచువేషన్ ప్రపంచాన్ని బంధించింది. ఆ సమయంలో కవులు, కళాకారులు, రచయితలు తమదైన శైలిలో సామాజిక మాధ్యమాలను ఆశ్రయించారు. ఫేస్‌బుక్ యూట్యూబ్, జూమ్ మొదలైన అంతర్జాల వేదికల ద్వారా పుస్తకావిష్కరణలు, సమీక్షలు, పరిచయాలు, విశ్లేషణలు ఇంటర్వ్యూలు మొదలైన సాహితి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో దళితులకు వేదికంటూ లేని సమయంలో దళిత కథా సాహిత్యం, సంస్కృతి, జీవితాల మీద చర్చించడం జంబూ సాహితీ వేదికగా కార్యక్రమాలు ప్రారంభించాం. ఆనాటి జూమ్ వేదికలకు మా ముగ్గురితో పాటు జూపాక సుభద్ర, గోగు శ్యామల, డా. తైదల అంజయ్య, పొన్నాల బాలయ్య, సంపంగి శంకర్, గంధం విజయలక్ష్మి మొదలగు వారము కలిసి నిర్వహించాము. ఆ కార్యక్రమాలకు ఆయా రంగాలలో విషయ నిపుణుల ద్వారా జూమ్, గూగుల్ మీట్ వేదికగా ప్రసంగ కార్యక్రమాలు నిర్వహించాం, అలా నిర్వహించడానికి మేము ఎంచుకున్న పేరు జంబు సాహితీ. ఈ పేరును ఎంచుకోవడానికి గల కారణం భారతదేశాన్ని జంబూద్వీపమని పిలుస్తారు. చారిత్రకారుల అభిప్రాయం ప్రకారం దళితులే ఈ దేశ మూలవాసులు. ఈ దేశ చారిత్రక పునాదులు దళితులే. పురాణ సాహిత్య క్రమాన్ని అనుసరించి ఈ దేశాన్ని మహాబలశాలి, అరి వీర భయంకరుడు, ధైర్యవంతుడు, కరుణ రస హృదయుడు, జాంబవంతుడు అనే మహా చక్రవర్తి పరిపాలించాడు. అతని మూలంగానే ఈ దేశానికి జంబూద్వీపమని పురాణాల్లో పిలువబడుతుంది. వారి సంతతి మాదిగలు మరియు దళితులు. మనం ఎక్కడికి వెళ్లినా మన మూలాలను మర్చిపోవద్దని పెట్టుకున్న పేరే జంబూ సాహితి. జంబూ సాహితీ అంతర్జాల వేదికగా 36 ప్రసంగాలు నిర్వహించింది. జంబూ సాహితీ ప్రధాన భూమిక పోషిస్తూ ప్రముఖుల 32 ప్రసంగాలు యూట్యూబ్‌లో నిక్షిప్తం చేసాం.
ప్రశ్న 3: ‘కొమ్ము దళిత కథ 2023’ సంకలనం ప్రచురణ ప్రక్రియ ఎప్పుడు మొదలు పెట్టారు? పూర్తయి పుస్తక రూపంలోకి రావడానికి ఎంత కాలం పట్టింది?
జవాబు: 2023 జనవరి మొదటి తేదీ నుంచి కొమ్ము (తర్వాత పేరు పెట్టాము) డిసెంబర్ 31 వరకు నిరంతరం కొనసాగుతుంటది. దళిత కథ అంటే దళితులు మాత్రం రాసిన కథలు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ లలో ఎక్కడ ప్రచురితమయ్యాయి మొదటిగా వెతుకుతాము. మేము (సంపాదకులుగా) చదువుతాము. ప్రాథమిక దశలోనూ కొన్ని కథలు ఎంపిక చేసి అందులోంచి మరికొన్నిటిని వడపోసి ఫిబ్రవరి నెలాఖరువరకు డ్రాఫ్ట్ కాఫీని సిద్ధం చేసుకుంటాము. మార్చి/ఏప్రిల్‌లో ప్రముఖులకు ఈ కథలను పంపించి వారి సూచనలు సలహాలు పాటిస్తాం. తుది నిర్ణయం మాత్రం సంపాదకులుగా మేమే తీసుకుంటాం. పుస్తకం పూర్తయ్యే సరికి అక్టోబర్ మాసం వచ్చింది.
ప్రశ్న 4: ‘కొమ్ము దళిత కథ 2023’ సంకలనం ప్రచురణలోని సాదకబాధకాలను వివరిస్తారా? ఏవైనా ఆటంకాలు ఎదురైతే వాటిని ఎలా అధిగమించారు?
జవాబు: రచయిత తన పుస్తకాన్ని తేవడానికి అనేక వ్యయప్రయాసల కోర్చేది మీకు తెలియంది కాదు. వ్యక్తిగతంగా ఉన్న స్వేచ్ఛ స్వాతంత్రం వ్యవస్తీకృత పనులలో ఉండదనే విషయాన్ని గమనించాలి. ఏ విషయమైనా మేము ముగ్గురం ప్రతిపాదించుకొని చర్చించుకొని, విశ్లేషించుకొని స్పష్టంగా ఒక అంచనాకు వచ్చి ముందుకు వెళుతూ ఉంటాం. కథల్ని వెతకడం, చదవడం, ఎంపిక చేయడం, డీటీపీ చేయడం, పేజీ సెట్టింగ్, కవర్ డిజైనింగ్, బుక్ సెట్టింగ్, బుక్ ప్రింటింగ్, ఆవిష్కరణ సభ నిర్వహణ మొదలైన అన్ని ఖర్చులు కలుపుకుంటే ప్రతి సంవత్సరం దాదాపు నలభై వేల రూపాయల ఖర్చు దాటుతుంది. మేము చిరు ఉద్యోగులం. ఉపాధ్యాయులం. మాకు ఉన్న వెసులుబాటును అనుసరించి మూడు సంకలనాలు సొంతంగా మేమే తెచ్చాము. నాలుగవ కథా వార్షికకు తెలంగాణ ఉద్యమకారులు, దళిత మేథావి, ఉద్యోగ నాయకులు డాక్టర్ తిప్పర్తి యాదయ్య కమిషనర్ గారు తాను సహకారం అందిస్తానని, నా వంతు సహకారం ఉండనీ అని వారు అన్నారు. పదిహేను వేల రూపాయల సహకారం అందించారు. వారి తల్లిగారు ఎంతో మంది ఉద్యమకారులకు ఆశ్రయమిచ్చింది. అందువల్ల తిప్పర్తి గాలమ్మకు అంకితం ఇవ్వడం సహేతుకమని భావించి ఆమెకి అంకితం ఇచ్చాము. కొలకలూరి ఇనాక్, ఆచార్య దార్ల వేంకటేశ్వర రావు, సతీష్ చందర్, ఆచార్య గుండె డప్పు కనకయ్య, ఆచార్య సూర్యా ధనంజయ్, ఆచార్య కాశీమ్, ఆచార్య కోయి కోటేశ్వర రావు, జీలుకరా శ్రీనివాసు, గడ్డం మోహన్ రావు, ప్రోత్సాహమూ ఉంది. కనీసం ఫేస్‌బుక్ వాల్ పైన అభినందనలు చెప్పనివారూ వున్నారు. ఎవరో మెచ్చుకోవాలనీ చేయడంలేదు. మా వంతు బాధ్యతగా తలపెట్టిన కార్యంగా భావిస్తున్నాము. ఫలించిన వృక్షమునకే రాతి దెబ్బలన్నట్లు పానుగంటి లక్ష్మీ నరసింహారావు సాక్షి వ్యాసాల్లో చెప్పినట్లు పిడివాదాలను కూడా ఎదుర్కొన్నాము.
ప్రశ్న 5: సంపాదకులు ముగ్గురు, ఎవరెవరు ఏయే బాధ్యతలు చూసుకున్నారు? సలహాలు, సూచనలు కాకుండా ఒకరి పనుల్లో ఒకరి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏదైనా వచ్చిందా? వస్తే ఎందుకని వచ్చింది?
జవాబు: ప్రధానంగా కథలు చదవడం అందరి బాధ్యత. ఎవరి అభిప్రాయాలు వాళ్లు రాసుకుంటాం. చర్చించుకుంటాము. ప్రజాస్వామ్య పద్ధతిలో భావాలను విశ్లేషించుకుంటాం. ఒకరి పనులలో ఒకరం జోక్యం చేసుకోం. సేకరణ నుంచి మొదలుకొని పుస్తకం ముద్రించబడి ఆవిష్కరణ కార్యక్రమం వరకు బాధ్యతలను పంచుకుతాము. ఎవరమైన ఏ పనినైనా చేయడానికి సంసిద్ధమవుతాము. ఫోన్‌ల నుంచి మొదలుకొని అధ్యక్షతను, వందన సమర్పణను, ఫోను చేయడంలోనూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం. కార్యక్రమం పూర్తయ్యాక మళ్లీ పునసమీక్షించుకుంటాం. పుస్తక బాధ్యతల విషయానికి వస్తే డిటిపి వర్క్ నేను (సిద్దెంకి) చేస్తాను. నేను, గుడిపల్లి, తప్పెట చదివి, దోషాలు, వాక్య క్రమాలు గుర్తించి సవరిస్తాము. కొత్త రచయితలైతే చర్చిస్తాము. పుస్తకం అందంగా రావడం కోసం, కవర్ డిజైనింగ్ మొదలైన పనులను సాంకేతిక నిపుణులకు అప్పగిస్తాం. దళిత కథ 2023 కథ వార్షిక ‘కొమ్ము’ డ్రాఫ్ట్ కాఫీ చదివి తమ అభిప్రాయాలు తెలియజేసిన వారిలో మన్నె ఏలియా, డా. తైదల అంజయ్య ముందు వరుసలో ఉంటారు.
ప్రశ్న 6: ఈ సంకలనం కోసం కథల ఎంపికలో ఏ ప్రమాణాలు పాటించాలని నిర్ణయించుకున్నారు? ఇతర సంస్థలు ప్రచురించే వార్షిక కథా సంకలనాలకన్నా ఏ రకంగా ఇది భిన్నమైనది?
జవాబు: దళిత కథకు అధిక ప్రాధాన్యత ఇస్తాము. అట్లాగని దళితులు రాసిన ప్రతీ కథ దళిత కథ కాదు. ఒకవేళ దళితేతర కథ మంచి కథ అయితే కూడా స్వీకరిస్తున్నాము. దళిత బహుజనవాదానికి చోటు కల్పిస్తాము.
ప్రశ్న 7: జంబూ సాహితీ గత సంకలనాలతో పోలిస్తే, ‘కొమ్ము దళిత కథ – 2023’ లో వైవిధ్యం ఏమిటి? ఈ సంకలనం ప్రత్యేకత/విశిష్టత ఏదైనా ఉందా?
జవాబు: ఉంది. సామాజిక, రాజకీయ, ఆధునిక వివక్షను చిత్రించాయి. పదిహేను కథలు పదిహేను కోణాలలో ఆవిష్కరించాయి. ఏ కథా వార్షికకు ఆ వార్షిక దేనికదే ప్రత్యేకత కలిగి ఉంటుంది. దళిత కథలకు దళిత జీవితమే ఇంధనం. దళిత బతుకులే శైలీ, వస్తు, శిల్పాలు. దళిత బతుకును ఏ త్రాసు(తక్కెడ) కొలుస్తుంది? దళిత కథలలో ఏడుపులు పెడబొబ్బలే కాదు ధిక్కారాలు, ఎత్తిన పోరుబావుటాలు, రాజ్యాంగం ఇచ్చిన రాజకీయ స్పూర్తి, అంబేడ్కర్, జగ్‌జీవన్‌రామ్‌ల మార్గదర్శకత్వం, జాషువా పద్యాలు, మొత్తంగా చెప్పాలంటే మొండి బాధలే అక్షర రూపంలో నడిపిస్తూనే ఉంటున్నాయి. వేముల ఎల్లయ్య కక్క నవలలా, నాగప్పగారి సుందర్రాజు మాదిగోడు కథలులా రూల్స్‌ని బ్రేక్ చేస్తున్నాయి. దళిత కథ సమస్య తీవ్రతపై అవగాహన కల్పిస్తుంది. ఆలోచింపచేస్తుంది. పరిష్కార మార్గాలు చూపుతుంది. ఒక సంవత్సరంలో వచ్చిన కథలు మరో సంవత్సరంలో వచ్చిన కథలకు భిన్నంగా ఉంటాయి.
ప్రశ్న 8: స్థూలంగా దళిత కథలు అన్నప్పుడు అవమానాలు, హేళనలు, ఆర్థిక లేమి, అవకాశాలు లేకపోవడం వంటి అస్తిత్వ నేపథ్యపు ఇతివృత్తాలే ప్రధానంగా స్ఫురిస్తాయి. మరి ఈ సంకలనంలోని కథలలో వస్తు వైవిధ్యం ఉండేలా ఏ జాగ్రత్తలు తీసుకున్నారు?
జవాబు: కాలే కడుపుకు మండే గంజి ఆకలి తీరుస్తది అనుకుంటే ఆలోచనలు కూడా అలానే ఉంటాయి. స్వాతంత్రం వచ్చి ఎనభై ఏళ్ళు సమీపిస్తున్న దళితులకు ఆత్మగౌరవం దక్కడం లేదంటే నమ్మరు కానీ సంఘటనలు పరిశీలించండి సమస్యలు అర్థమౌతాయి. నొప్పి కలిగినోడు విలపిస్తాడు కానీ వినోదాన్ని ఆలపించడు. దళిత కథలు రాస్తున్న వాళ్లు చాలా తక్కువగా ఉన్నారు. రెండు రాష్ట్రాలలో కలిపి సీరియస్‌గా రాసేవాళ్లు కేవలం 30 మంది లోపు కథకులే ఉన్నారు. వస్తు వైవిధ్యం గురించి హిజ్రాలలో మానవత్వం తెలిపే సోలోమన్ వవిజయ్ కుమార్ కథ ‘శీలమంతురి రైల్వే గేటు దగ్గర కొజ్జ’ , ఆడపిల్లలు ముల్లులా బతకాలనే సతీష్ చందర్ కథ ‘ముల్లు’, అంతరానితనం ఆకాశమంత దుక్కమంటూనే ప్రత్యామ్నాయం చూపే జూపాక సుభద్ర ‘అంటూ ముట్టు’, అసలు పిసినారులను ముసుకుల్ని పటాపంచలు చేసే పసునూరి రవీందర్ ‘బుచ్చయ్య బతుకు మర్మం’, వలస బతుకుల దీనత్వం చిత్రించిన ఇండ్ల చంద్ర శేఖర్ ‘బెల్దారి’, మౌనంగా ఉంటూ మాట్లాడే మర్రి చెట్టు మన్నే ఏలియా ‘సాక్షి’, ఆత్మీయతలు పంచే ఆవిడ చావు మానవ చిరునామా ‘కాండ్రేగుల రావలచ్చుం కొట్టు’, ‘మాదిగ రాజయ్య’, ‘రచ్చకట్ట’, ‘చెడు నిజం’, ‘నిలువెత్తు దుఖం’, మొదలైన కథలు వినూత్నంగా ఉన్నాయి.
ప్రశ్న 9. ‘కొమ్ము దళిత కథ 2023’ సంకలనంలో లబ్ధప్రతిష్ఠులైన కథకుల కథలతో పాటు కొత్త/వర్ధమాన కథకుల కథలకు స్థానం దక్కిందా?
జవాబు: ఐదు దశాబ్దాలుగా కథలు రాస్తున్న ఆచార్య కొలకలూరి కథ దళిత కథ 2020లో ప్రచురించబడ్డది. అదే సంవత్సరం చరణ్ పరిమి బొంబాయి పొట్టేలు కథ ప్రచురించాము. ఆ కథ సంపుటి 2024 కేంద్ర సాహితీ పురస్కార పోటీలో చివరి దాకా నిలిచింది. రామ్ పేరుమాండ్ల కథ ప్రచురితమైంది., కేపీ లక్ష్మీనరసింహ ‘దోసిలి పట్టు’, మేడి చైతన్య, కిరణ్ చర్ల, సిస్టర్ అనసూయ ‘కుంగిన పొద్దు’ డిజి హైమావతి ‘బొందల గడ్డకు దూరంగా’ కౌలూరి ప్రసాదరావు ‘రెండు గ్లాసులు’ కెంగార మోహన్, అనిల్ డ్యాని, గంధం విజలక్ష్మి, గడ్డం మోహన్ రావు, తవ్వ వెంకటయ్య, మండల స్వామి, దుర్గాని రాజు, మెర్సీ మార్గరేట్, మేడి చైతన్య, పెద్దన్న, మొదలైన వారి కథలు సేకరించి ఎంపిక చేసి జంబూ సాహితీ ప్రచురించింది.
ప్రశ్న 10: ‘కొమ్ము దళిత కథ 2023’ సంకలనం కోసం ఎంపికైన కథలు కాకుండా, ఏదైనా కథ బాగుండి కూడా, మీ ప్రమాణాలలో ఒదగకపోవడం వల్ల సంకలనంలో చేర్చకపోవడం జరిగిందా?
జవాబు: జరిగింది. అనుకున్న ప్రమాణాలు నిర్ణయించిన కొలతల ప్రకారం కథ లేకుంటే నిస్సంకోచంగా పక్కన పెట్టాము. ఇక ముందు దళిత జీవిత చిత్రన చేసిన కథకే ప్రాధాన్యత ఇవ్వనున్నాము.
ప్రశ్న 11: భవిష్యత్తులో సంకలనం వెలువరించేందుకు, పత్రికలలో ప్రచురితమైనవి కాకుండా, ప్రత్యేకంగా ఒక థీమ్ ఇచ్చి కథలు వ్రాయించి ప్రచురించే అవకాశం ఉందా? ఆ విషయంలో మీ బృందం ఆలోచనలేమిటి?
జవాబు: ఆలోచనలు ఉన్నాయి. దళిత కథను గొప్ప కథగా తీర్చిదిద్దాలనే సంకల్పం జంబూ సాహితీకి ఉంది. దళిత కథా శిక్షణ కార్యశాల నిర్వహిస్తాము. త్వరలోనే ఐదవ వార్షిక అనంతరం తప్పకుండా వీటిపై దృష్టి సారిస్తాము. కథా విమర్శ వ్యాసాలను తెస్తాము.
ప్రశ్న 12: కొన్ని వార్షిక కథాసంకలనాలలో కొందరు కథకుల కథలు ప్రతి ఏడాదీ చోటు దక్కించుకుంటాయనీ, వేరే వారికి అవకాశం దక్కదన్న అభిప్రాయం పాఠకులలో ఉంది. మీరు ప్రచురించే సంకలనాలలో ఇలా జరగకుండా ఉండేందుకు ఏయే జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
జవాబు: మీరన్నది నూటికి నూరు రూపాయలు నిజం. రాసిన ప్రతీ కథకు ఎక్కడా చోటు దొరకదు. దళితేతరులు దళితకథ ఒక్కటో రెండో కథలను రిజర్వేషన్ కింద అచ్చు వేస్తారు. మేము అందరికీ చోటు ఇస్తామని హామీ ఇవ్వటం లేదు. మంచి కథకు తప్పనిసరి చోటు మాత్రం తప్పకుండా ఉంటుంది. అలా దళిత కథకు చోటు దక్కకపోడం లేదనీ, వాళ్లెవరో చోటు కల్పించేదేముంది. ‘మా దళిత కథ – మా ఆత్మ గౌరవ, ధిక్కార పతాక’గా తీర్చి దిద్దుతున్నాము. దళిత కథ వార్షిక తెస్తున్నాం.
మరొక ముఖ్య విషయం ఏమిటంటే యువ కథకులు తప్పనిసరిగా చోటు దక్కే విధంగా నైపుణ్యవంతంగా కథలు తీర్చిదిద్దాలి. ఇంతకంటే ఏమి చేయలేను అనే వరకు చదవాలి. వస్తు విసృతితో పాటు వస్తున్నవ్యత ఉండాలి. రాస్తున్న వస్తువు మీద సంపూర్ణమైన అవగాహన తెచ్చుకొని రాయాలి. శైలి, శిల్పం, కథనం, సమర్థవంతంగా నిర్వహించాలి. స్పార్క్ లాంటి ముగింపుతో ఆలోచనత్మక సందేశం కలిగిన కథలై ఉండాలి. జీన్ పాల్ సాంగ్త్రే అన్నట్టు ఈ కాలానికి చెల్లని కథ (సాహిత్యం) ఏ కాలానికి చెల్లదు. ఆ విధంగా నడుస్తున్న కాలాన్ని పొడుస్తున్న పొద్దును సాంఘిక సమకాలీన పరిస్థితులకు దర్పణం పట్టాలి. రాయడానికి ముందు అవగాహనతో రాయాలి. నూతనంగా ఉండాలి. కథకి సార్వజనీనత కల్పించినప్పుడు ఎవరైనా ఎంపిక చేసుకుంటారు.
ప్రశ్న 13: ‘కొమ్ము దళిత కథ 2023’ సంకలనంలో మీకు వ్యక్తిగతంగా ఏ కథ బాగా నచ్చింది? ఎందువలన? సంపాదకుడిగా కాకుండా, ఓ పాఠకుడిగా మీ అభిప్రాయం చెప్పండి.
జవాబు: అన్నీ మంచి కథలే. సతీష్ చందర్ కథ ‘ముల్లు’ కథ లో స్త్రీలు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలియజేసే కథ. జూపాక సుభద్ర కథ ‘అంటూ – ముట్టు’ ఒక పాఠకుడిగా నాకు బాగా నచ్చాయి.
జవాబు: కొమ్ము దళిత కథను పుస్తకాన్ని నవోదయ బుక్ హౌస్‌లో, తెలుగుబుక్స్.కామ్ అంతర్జాలంలోనూ అందుబాటులో ఉంచాం. మంచి స్పందన వస్తుంది. దళిత కథను చాలామంది అభిమానిస్తున్నారు. ఆహ్వానిస్తున్నారు. అధ్యయనం చేస్తున్నారు. ఈ దళిత కథను ఉద్యమంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. కోరిన వారికి వ్యక్తిగతంగా కావాలని ఫోన్ చేసినవారికి పంపిస్తున్నాం.
ప్రశ్న 15: తదుపరి సంకలనం కోసం పనులు మొదలయ్యాయా? కొత్త అవకాశాలు లభించి బతుకులు బాగుపడ్డాయనో, గతంలో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితులు మారి చీకట్లు తొలగుతున్నాయనో చెప్పే కథల్ని పాఠకులు ఆశించవచ్చా?
జవాబు: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కథలు మారుతాయి. దళిత కథలు మారాలంటే దళిత జీవితాలు మారాలి. సమాజంలో మార్పు రావాలి. మనిషిని మనిషిగా గౌరవించే రోజు రావాలి. కుల వివక్ష పోవాలి. కుల నిర్మూలన జరగాలి. అంబేద్కర్ కలలు నిజమవ్వాలి. కథలు మారిన, మారని పరిస్థితులు తప్పకుండా ప్రతిబింబిస్తాయి. మాకు మేం నిత్య నూతనమవుతాము.. నవనవలాడే దళిత కథ సాహిత్య ఆకాశంలో రెపరెపలాదడిస్తాము.
~
సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సంపాదకులు ముగ్గురికీ ధన్యవాదాలు.
సంపాదకులు: ధన్యవాదాలు.
***
సంపాదకులు: డా. సిద్దెంకి యాదగిరి, గుడిపల్లి నిరంజన్, తప్పెట ఓదయ్య
ప్రచురణ: జంబూ సాహితీ
పేజీలు: 168
వెల: ₹ 180/-
ప్రతులకు:
నవోదయా బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్.
ఆన్‍లైన్‍లో:
https://www.telugubooks.in/products/kommu-dalitha-katha-2023
ఫోన్: 9000168953
~
‘కొమ్ము దళిత కథ 2023’ సంకలనం సమీక్ష
https://sanchika.com/kommu-dalita-katha-2023-book-review-kss/