Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కవి, కథ, నవలా రచయిత డా. వేంపల్లి గంగాధర్ ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘గంగమ్మ పూలు’ అనే కథాసంపుటిని వెలువరించిన డా. వేంపల్లి గంగాధర్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం డా. వేంపల్లి గంగాధర్ గారూ.

డా. వేంపల్లి గంగాధర్: నమస్కారం.

~

ప్రశ్న 1. మీరు రచించిన 15 కథల సంపుటికి శీర్షికగా చివరి కథ గంగమ్మ పూలుపేరునే ఎంచుకోవడంలో ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?

జ: ‘గంగమ్మ పూలు’ కథ రాయలసీమ కరువు నేపథ్యంలో నీళ్ల చుట్టూ సాలెగూడు వల లాగా అల్లుకొని పెనవేసుకున్న విభిన్న వలయాలను ఆవిష్కరిస్తుంది. ఈ భూమి మీద ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో తరహాలో నీళ్ల కోసం స్థానిక సంఘర్షణ ఉంటుంది. ఈ కథలో రాయలసీమ స్థానికతలో నీళ్లు – కన్నీళ్లు మధ్యన ఉండే అనుసంధాన సంవేదన కనిపిస్తుంది. నీళ్ల ఆవశ్యకత, కొన్ని నమ్మకాలు, కొన్ని పాత్రల ద్వారా నీళ్ల కరువు, పేదరికం వంటి కష్టాల మధ్య కూడా ఒక ఆశ ఎలా బతుకుతుందో ఈ కథ చెబుతుంది. ఎండిన ఏరు నిండుగా పారేటప్పుడు కృతజ్ఞతగా నిండు మనసుతో నదికి సమర్పించే పూలు గంగమ్మ పూలు.

ఈ కథ స్థానిక సమస్యలను సార్వత్రిక మానవీయ భావాలతో ముడిపెడుతుంది. ‘పూలు’ అనే పదం జీవన సౌందర్యాన్ని సూచిస్తుంది, ఇది కరువు సీమలోని ప్రజల జీవన గీతాన్ని ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ శీర్షిక సంపుటికి పెట్టాలని నిర్ణయించుకున్నాను.

ప్రశ్న 2: మీ కథలకు రచనా ప్రేరణ ఎక్కడి నుండి వస్తుంది?

జ: నా రచనలకు ప్రధాన ప్రేరణ రాయలసీమ ప్రాంతంలోని గ్రామీణ జీవితం, అక్కడి ప్రజల సంఘర్షణలు, సామాజిక వాస్తవాలు. రైతుల కష్టాలు, కరువు, కక్షలు, స్థానిక సమస్యలు వంటి అంశాలు నా కథలలో ప్రతిఫలిస్తాయి. నా చుట్టూ ఉన్న ప్రజల జీవితాలు, వారి ఆనందాలు, విషాదాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఆ అంశాలే నా కథా ఇతివృత్తాలు అవుతాయి.

ప్రశ్న 3: మీ దృష్టిలో కథ అంటే ఏమిటి?

జ: సాహిత్య పరంగా కథ అనేది మానవ జీవన అనుభవాలను, భావోద్వేగాలను, సామాజిక వాస్తవాలను సంక్షిప్తంగా, శిల్పాత్మకంగా చిత్రించే సాహిత్య ప్రక్రియ రూపం అని అనుకుంటాను. ఇది వస్తువు, పాత్రలు, నేపథ్యం, సంభాషణ, శైలి ద్వారా పాఠకుడిని ఆలోచింపజేస్తుంది. ఆకాశం పైనుంచి నిప్పులు ఎగజిమ్ము కుంటూ భూమిపై ఉన్న ఒక వటవృక్షం పైన పిడుగు పడ్డట్టు ఒక్కసారిగా హృదయాన్ని దహించి వేసేది ఎప్పటికీ గుర్తుండిపోయే దృశ్యం. కథ కూడా అలాగే పుట్టాలి. దహించాలి. ఆలోచింప చేయాలి.

ప్రశ్న 4: ఇది మీ 6వ కథాసంపుటి. కవిగా, కథకుడిగా, నవలా రచయితగా, పరిశోధకుడిగా, సంపాదకుడిగా మీ సాహితీ ప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా? మొదటగా ఏ ప్రక్రియతో సాహిత్య వ్యాసంగం మొదలుపెట్టారు? ఎప్పుడు? మీ కథా రచన గురించి వివరిస్తారా?

జ: పత్రికలకు మొదట ఉత్తరాలు రాసే వాడిని. 1993 ప్రాంతంలో తెలుగు విద్యార్థి, సిరివెన్నెల, తెలివితేటలు, పల్లకి, ఆంధ్రప్రభ, స్వాతి మాసపత్రికలకు చిన్న చిన్న వ్యాసాలు రాశాను. ఆ తర్వాత ఉదయం దినపత్రికలో కె.రామచంద్రమూర్తి గారి ప్రోత్సాహంతో సంపాదకీయ పేజీకి వ్యాసాలు రాశాను. వ్యాసాలు విస్తృతంగా రాసే పరంపరలో ఒకసారి గ్రామీణ ప్రాంతంలో పసుపు వస్త్రాలు ధరించి గుర్రం పైన పల్లెల్లోకి వచ్చి విన్యాసాలు చేసే వేమయ్య స్వామి గురించి ఒక వ్యాసం రాసి ఆదివారం ఆంధ్రజ్యోతికి పంపాను. ఆదివారం అనుబంధానికి ఇన్చార్జిగా ఉన్న ఆర్ఎం ఉమామహేశ్వరరావు గారు దానిని వ్యాసంగా కాకుండా కథగా రాసి పంపాలని సూచించారు. ఆ విధంగా ‘యామయ్య స్వామి గుర్రం’ అనే పేరుతో నా మొదటి కథ 1997 జులై ఆరో తేదీ నాటికి ఆదివారం ఆంధ్రజ్యోతి సంచికలో ప్రచురితమైంది. పలువురి ప్రశంసలు అందుకుంది. ఆ విధంగా నేను కథా రంగంలోకి అడుగు పెట్టాను. ఇప్పటివరకు దాదాపు 125 కు పైగానే కథలు రాశాను. నా మొదటి కథ సంపుటి – మొలకల పున్నమి. దీనికి 2011 కేంద్ర సాహిత్య అకాడమీ మొదటి యువ పురస్కారాన్ని అందుకున్నాను.

మొలకల పున్నమి తర్వాత గ్రీష్మ భూమి, దేవర శిల, పాపాగ్ని కథలు, రావణ వాహనం కథలు, గంగమ్మ పూలు కథలు వెలువడ్డాయి. నేల దిగిన వాన, యురేనియం పల్లె – నా నవలలు.

ప్రశ్న 5: మీకు కవిత/కథ/నవల – వీటిలో ఏది వ్రాయడం సులువని అనుకుంటారు? ఎందువల్ల?

జ: ఏదైనా ఒక రచన ఏ సాహిత్య ప్రక్రియలో రాస్తే పాఠకుడి హృదయానికి దగ్గరగా వెళ్లగలుగుతుందో అది అప్పుడే సార్థకం అవుతుంది. ఏ సాహిత్య ప్రక్రియలో రాయాలని అనుకుంటామో అది ఎంపిక చేసుకునే ఇతివృత్తం నిర్ణయిస్తుంది. పెద్ద కాన్వాస్ ఉన్న సబ్జెక్టును ఇతివృత్తంగా ఎంపిక చేసుకుంటే అది నవలగా మారుతుంది. చిన్న అంశాన్ని తీసుకొని రాస్తే కథగా మారుతుంది. అత్యంత శక్తివంతమైన సాహిత్య రూపం కవిత్వం. అది ఏ సాహిత్య ప్రక్రియ అయినా సరే బలంగా రాయాలనిపిస్తే తప్ప నేనైతే రాయను.

ప్రశ్న 6: కథకి సంబంధించి – వస్తువు, శిల్పం, శైలి లో మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారు?

జ: వస్తువుకు ప్రాముఖ్యతనిస్తాను, ఎందుకంటే కథ యొక్క సాహిత్య ఆత్మ అందులో ఉంటుందని నమ్ముతాను. రాయలసీమ ప్రాంతంలోని సంఘర్షణ నా కథలకు ప్రాణం. శిల్పం, శైలి వస్తువును బలపరిచే సాధనాలు, సరళమైన, వాస్తవిక శైలి పాఠకుడిని కథలోని భావోద్వేగంతో ముడి పడేటట్లు చేస్తుంది. నాకు నచ్చే కథా వస్తువు కొరకు నిరంతరం అన్వేషిస్తూనే ఉంటాను. నా చేత రాయించే టట్లు శక్తి నిండి ఉండే ‘వస్తువు’ అత్యంత అరుదుగా దొరుకుతుంది. అందుకే నా కథలు తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక హోదా పొందాయి అని అనుకుంటాను.

ప్రశ్న 7: “ఈ కథల్లో రాయలసీమ గ్రామలూ, సంతలూ, రోడ్లూ, రైల్వేస్టేషన్లూ, పొలాలూ, అడవులూ కనిపిస్తాయి గానీ, ఈ కథలు అక్కడికే పరిమితం కాలేదు..” అని వాడ్రేవు చినవీరభద్రుడు గారు వ్యాఖ్యానించారు. స్థానికమైన వస్తువుతో సార్వజనీనమైన కథను అందించడం ఎలా సాధ్యమైందని అనుకుంటున్నారు?

జ: మనిషి లోపలి చీకట్లను తొలగించి కాసింత వెలుగును చూపించడం కథకుడి లక్ష్యం. కథ ఎక్కడో పుట్టదు, ఎక్కడో ముగియదు, ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి పరంపరంగా అనుసంధానమై సాగిపోతూ ఉంటుంది. మనం దాన్ని విభజించుకొని కథలుగా మార్చుకుంటూ మలుచుకుంటూ ఉంటాము. నేను కథలు రాసే ప్రారంభ దశలో కరువు కథలు, కక్షల కథలు బలంగా చిత్రీకరిస్తూ రాశాను. అవి నాకు పేరు తీసుకొచ్చాయి. కానీ తరువాత ఇతివృత్తాల వస్తువు ఎంపికలో నాకంటూ ఒక ప్రత్యేకత ఏర్పరుచుకున్నాను. ఇంతవరకు నమోదు కాని అంశాల్ని, జీవితాలను కథ వస్తువులుగా నమోదు చేయడం ప్రారంభించాను. ఇది నాకు సంతృప్తిని ఇచ్చింది.

ప్రశ్న 8: ఎలాంటి భిన్నమైన ఇతివృత్తాలు స్వీకరించి కథలు రాశారు?

జ: నా మొదటి కథ ‘యామయ్యసామి గుర్రం’లో కరువు నేపథ్యంలో పల్లెల్లో తిరిగే వేమయ్యల గురించి చెప్పినట్లే, ఎద్దుల కాళ్ళకు నాడాలు కొట్టుకుంటూ తిరిగే వారి జీవితాలపై ‘నేల దిగని ఊడ’ కథ రాశాను. పల్లెల్లో పురుడు పోసే మంత్రసానులపై ‘మంత్రసాని’ కథ రాశాను. చేతిలో అంజనం వేసే విద్య ప్రదర్శించే వారిపై ‘అంజనసిద్ధుడు’ కథ, కొలిమి పనులు చేసుకునే వారిపై ‘కొలిమ్మాను’ కథ, ఎర్రచందనం కొయ్యలతో బొమ్మలు తయారు చేసుకునే వారి జీవనంపై ‘కొయ్య బొమ్మలు’ కథ రాశారు. అలాగే యూరేనియం ప్రాజెక్టును వ్యతిరేకించే గ్రామీణుల జీవితాన్ని ‘నెత్తుటిమాన్యం’ కథలో, సీమ గిరిజన తండాల నుంచి వ్యభిచార ఊబిలోకి తరలిపోతున్న మహిళల ఆక్రందనపై ‘మైనంబొమ్మ’ కథ, కత్తులకు సాన పట్టుకుంటూ తిరిగే వారి జీవితాలను ‘తూర్పు మండపం’ కథలో చెప్పాను. మేక పేగును ఎండబెట్టి వాద్య పరికరంగా మార్చి జీవించే కళాకారుడి నేపథ్యంలో ‘వాడొక్కడు’ కథ రాశాను. ఇలా నాకున్న పరిధి మేరకు జీవితాలను రికార్డు చేస్తున్నాను. నేను రాసిన మొత్తం కథల్లో విభిన్న ఇతివృత్తాలతో కూడిన కథలే అత్యధికం. అట్లా రాయడమే నాకు ఇష్టం.

ప్రశ్న9: కాళరాత్రి అంటే ఎలా ఉంటుందో గుర్రమ్మకు తెల్లదెయ్యం పూలుకథలో తెలిసొస్తుంది. దళారులని నమ్మి, పొలంలో నిషేధిత పంటని వేసి, తీరా పంట చేతికొచ్చే సమయానికి – ఆ పంటనే అగ్నికి ఆహుతి చేసి వచ్చి, తమకి పట్టిన నరకం మబ్బు తొలగిపోయిందని సంతోషపడుతుంది. భర్త మునిరత్నంలో లేని తెగింపు గుర్రమ్మ కనబరుస్తుంది. ఈ కథ నేపథ్యం గురించి వివరిస్తారా?

జ: నిషేధిత పంటగా ఉన్న గసగసాల సాగు పైన వచ్చిన ఒక విభిన్నమైన కథ ఇది.

‘తెల్లదెయ్యం పూలు’ కథ గసగసాల పంట వేసి మోసపోయిన రైతు కుటుంబం జీవన ఘర్షణను ఆవిష్కరిస్తుంది. ఈ కథకు మౌలిక నేపథ్యం – గ్రామీణ రైతుల ఆర్థిక నిస్సహాయత, దళారుల మాయాజాలం, ప్రభుత్వ వ్యవస్థల నిర్లక్ష్యం. గుర్రమ్మ, ఒక సాధారణ మహిళగా కనిపించినా, కథలో ఆమె తీసుకునే నిర్ణయం అసాధారణం.

దళారులు చెప్పిన మాటలపై నమ్మకం ఉంచి, నిషేధించబడిన గసగసాల పంటను సాగు చేస్తే ఎంతటి క్షోభ పడాల్సి వస్తుందో, ఆ సమయంలో ఆమె మానసిక వేదన.. కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు – ఆశల పతనం కూడా.

అయితే ఈ క్రమంలో ఆమెకు ఒక స్పష్టత వస్తుంది – మన జీవితం ఇతరుల చేతుల్లో ఉండకూడదు. భర్త మునిరత్నంలో కనబడని తెగింపు ఆమెలో కనిపిస్తుంది. ఆమె నిశ్శబ్దంగా ఒక అంతర్గత కాళరాత్రిని. గుర్రమ్మ ఒక రైతు భార్యగా కాకుండా, రైతు సమాజం ప్రతినిధిగా కూడా కనిపిస్తుంది.

ప్రశ్న 10: ‘మృగత్వం’ కథలో మనుషుల కంటే, అడవిలోని జంతువులే మేలు అని కోనప్పకి అతని తండ్రి చెప్తాడు. కోనప్ప ఓ ప్రశ్న వేస్తే, జవాబు తాను మనిషికి తప్ప దేనికీ భయపడనని తండ్రి చెప్తాడు. కథ ముగింపు చదివాకా, ముందుమాటలో వాడ్రేవు చినవీరభద్రుడు గారు చెప్పిన మాటలు – “ప్రతీ కథనీ దుఃఖంలో ముంచి చెప్తాడు కానీ, ఏ కథని విషాదాంతం చేయడు” సరైనవని అనిపిస్తుంది. ఈ కథ నేపథ్యం గురించి వివరిస్తారా?

జ: ‘మృగత్వం’ కథ సంచార జాతుల వారి నేపథ్యంలో నుంచి పుట్టిన కథ. ఆవేదనతో మాట్లాడే కథ. అడవిని నమ్ముకుని జీవించే కోనప్ప కు అడవి నుంచి బయటికి వచ్చిన తర్వాత మిగిలిన మానవ సమాజంలో ఉండే వికృతమైన స్వభావాలు అర్థం కావు. అందుకే ఇలాంటి మనుషుల కంటే అడవిలోని క్రూర మృగాలే నయం అని అనుకుంటాడు.

కథలో కోనప్ప తండ్రి చెప్తే, ‘నువ్వు అడవిలో దీన్ని చూస్తే భయపడతావు? అని అన్నప్పుడు ‘మనిషిని చూస్తే మాత్రమే,’ అని – ఇంతకంటే సరైన సమాధానం ఏముంటుంది. ఎందుకంటే, జంతువులు ఆకలితో వస్తాయి కానీ మనిషి స్వార్థంతో వస్తాడు. కోనప్ప తండ్రి మాటల్లో మృగత్వం అనే పదం అసలు జంతువుల్ని కాదు, మానవ స్వభావాన్ని ఉద్దేశించింది.

మానవీయ కథ చదివిన తర్వాత కూడా దాని శబ్దం మనలో ఇంకా ఎక్కడో ప్రతిధ్వనిస్తూ మారుమోగుతూనే ఉంటుంది. వాడ్రేవు చినవీరభద్రుడు గారి మాటలు – ‘ప్రతీ కథనీ దుఃఖంలో ముంచి చెప్తాడు కానీ, ఏ కథనీ విషాదాంతం చేయడు’ వారి ప్రశంశకు ధన్యవాదాలు. కథలు విషాదాంతం కాకుండా ఒక చక్కటి ముగింపుతో నడపడం తప్పకుండా ఒక ఉత్తమశ్రేణి కథకుడి లక్షణం కూడా.

ప్రశ్న11: “మెరిసేవన్నీ వజ్రాలు కావు, బతికిందే జీవితం కాదు” అనేది నిజంగా గొప్ప వాక్యం. రంగురాళ్ళు ఏరుకుని, ఏజంట్లకు అమ్ముకునేవారి వ్యథని కళ్ళకు కట్టింది ‘గరుడ పచ్చ’ కథ. రంగురాయి కంటే తనకి తన భర్త ముఖ్యమని లక్ష్మమ్మ భావించడంలో అతిశయోక్తి లేదు! ఈ పాత్ర రూపకల్పన గురించి చెప్తారా?

జ: రాయలసీమ ప్రాంతం, అనంతపురం జిల్లా జొన్నగిరి, వజ్రగిరి.. ప్రాంతాల్లో నాలుగు చినుకులు పడగానే కొండ గుట్టల్లో రంగురాళ్లను వెతకడానికి వెళ్లే గ్రామీణులను దగ్గరి నుంచి చూసినప్పుడు ఈ కథ రాయాలనిపించింది. ‘గరుడ పచ్చ’ కథలో లక్ష్మమ్మ పాత్ర రూపకల్పన అత్యంత సహజంగా, జీవితాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుంది. లక్ష్మమ్మ ఒక సామాన్య గ్రామీణ స్త్రీ, రంగురాళ్ళు ఏరుకుని జీవనం సాగించే కష్టజీవి. ఆమె జీవితం ఆర్థిక సంక్షోభం, కుటుంబ బాధ్యతలు, సామాజిక అసమానతలతో నిండి ఉంటుంది. లక్ష్మమ్మ జీవితంలో రంగురాయి (గరుడ పచ్చ) కనిపించే ఆశాకిరణంగా ఉంటుంది, కానీ ఆమె ఆ రాయి కంటే తన భర్తతో గడిపిన జీవితాన్ని, సంబంధాన్ని ఎక్కువగా విలువైనదిగా భావిస్తుంది. రంగురాయి ఆమెకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇవ్వగలిగినా, ఆమె తన భర్త పట్ల ఉన్న ప్రేమను, అతనితో గడిపిన జీవితాన్ని దానికంటే గొప్పగా భావిస్తుంది. ఉదాహరణకు, ఆమె రంగురాయిని చూసినప్పుడు ఆమెలో కలిగే ఆశ, ఆ తర్వాత ఆ ఆశను తన భర్త కోసం వదులుకోవడం – ఈ సన్నివేశాలు ఆమె పాత్రలోని సంఘర్షణను, పరిణతిని చూపిస్తాయి. లక్ష్మమ్మ ఒక వ్యక్తిగత పాత్ర కాదు, ఆమె గ్రామీణ స్త్రీల జీవితాలను, వారి పోరాటాలను, వారి ఆశలను ప్రతిబింబించే సామూహిక చిహ్నం.

ప్రశ్న12. ‘మయూరఖేదం’ కథకి శీర్షిక చక్కగా నప్పింది. “నాగమణిని దూరం నుంచి చూస్తే దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి పలకరిస్తే బతకడం అంటే ఏమిటో తెలుసుకోవాలనిపిస్తుంది” అన్న రెండు వాక్యాలు చదివాకా, ఆ పాత్ర మీద కొద్ది క్షణాల పాటు ఏర్పడిన సానుకూల అభిప్రాయం, ఆ తర్వాతి వాక్యంతో మారిపోతుంది. నాగమణి లాంటి వ్యక్తిని దగ్గరగా చూస్తే తప్ప ఈ పాత్ర స్వరూప స్వభావాలని ఇంతలా సహజంగా చిత్రీకరింలేరు. నాగమణి పాత్ర మీకు తారసపడిన నిజజీవిత వ్యక్తా? వివరించండి.

జ: రాయలసీమ ప్రాంతంలోని గిరిజన తండాల నుంచి పూణే బొంబాయి లాంటి రెడ్ లైట్ ఏరియాలకు వెళ్లి వ్యభిచార కూపంలో చిక్కుకుంటున్న వారి జీవన వేదన ‘పూణే ప్రయాణం’ అనే నా రచన చెబుతుంది. దాని తర్వాత నేను రాసిన ‘మైనం బొమ్మలు’ కథ ప్రత్యేకమైనది. అదే కోవలో కొన్ని కొత్త అంశాలు జత చేస్తూ రాసిన కథ – మయూర ఖేదం. నాగమణి లాంటి పాత్రలు నేను ప్రత్యక్షంగా చాలా చూశాను. “నాగమణిని దూరం నుంచి చూస్తే దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి పలకరిస్తే బతకడం అంటే ఏమిటో తెలుసుకోవాలనిపిస్తుంది”. ఇది అక్షర సత్యం. ‘మయూరఖేదం’ శీర్షిక విషాద ఛాయను, ఆమె జీవితంలోని అంతర్గత దుఃఖాన్ని సూచిస్తుంది – మయూరం (నెమలి) బాహ్యంగా అందంగా ఉన్నప్పటికీ, దాని జీవితంలో ఒక ఖేదం (విషాదం) ఉంది. నాగమణి ఒక వ్యక్తి కాదు, చైతన్య శక్తి. సమాజంలోని అనేక మంది స్త్రీల జీవన సత్యాలను ప్రతిబింబించే ఒక సృష్టి.

ప్రశ్న13. రాగి తీగల కోసం ట్రాన్స్‌ఫార్మర్లు పగలగొట్టడం అనేది చాలా ప్రాంతాల వారికి తెలియని అంశం. ఈ ఇతివృత్తంతో అల్లిన కథకి కాలముఖంఅని పేరెందుకు పెట్టారో వివరిస్తారా?

జ: పంటను దొంగతనం చేస్తే ఏదో ఆహారం కోసం, కుటుంబం కోసం చేశారని అనుకోవచ్చు. కానీ రైతులు పొలాల్లో బిగించుకున్న ట్రాన్స్‌ఫార్మర్లు పగలగొట్టి అందులోని రాగి తీగలు దొంగతనం చేయడం అనే ఆసక్తికర అంశం ఇందులోని కథా ఇతివృత్తం. కాలముఖం అంటే అంటే ఇక్కడ – చీకటి ముఖం. నీతి విలువలు క్షీణించిన రూపం. రాగి తీగల కోసం ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం చేయడం వంటి చర్యలు సమాజంలోని నైతిక అధఃపాతాన్ని సూచిస్తాయి. ఈ చీకటి బింబం ‘కాలముఖం’గా శీర్షికలో ప్రతిఫలిస్తుంది. చీకటి ముఖం నేటి కాలంలోని నీతి పతనం కు సంకేతాత్మకం. ఈ కథలోని సంఘటనలు – ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం, దాని వల్ల కలిగే సామాజిక నష్టం – సమాజం యొక్క చీకటి ముఖాన్ని బహిర్గతం చేస్తాయి, ఈ ముఖమే ‘కాలముఖం’గా చిత్రీకరించబడింది.

ప్రశ్న14. ‘బైరాగుల బండి’ అనేక జీవిత సత్యాలను సరళంగా చెప్పిన కథ! ఈ కథ నేపథ్యం గురించి చెప్తారా?

జ: బొగ్గుతో నడిచే రైళ్లలో చేసే ప్రయాణం అనే అంశం అనుకుంటే చాలా సరదాగా ఉంటుంది. విచిత్రంగా కూడా ఉంటుంది. ఆ నేపథ్యం నుంచి పుట్టిన కథ – ‘బైరాగుల బండి’.

‘బైరాగుల బండి’ కథలో రైలు ప్రయాణం కేవలం ఒక భౌతిక ప్రయాణం మాత్రమే కాదు, అది మానవ జీవితంలోని వివిధ దశలను, భావోద్వేగాలను, సామాజిక సంబంధాలను సూచించే ఒక రూపకం. కథలోని ‘బైరాగి’ అనే పదం సాధారణంగా సన్యాసులను లేదా లౌకిక బంధాల నుండి విముక్తి కోరుకునే వ్యక్తులను సూచిస్తుంది, కానీ ఈ కథలో మనిషి జీవన శైలి కూడా కనిపిస్తుంది. రైలు ‘బైరాగుల బండి’గా సంకేతాత్మకం. రైలు కంపార్ట్‌మెంట్‌లో జరిగే సంఘటనలు-ఒకరితో ఒకరు సంభాషణలు, సరదాగా జరిగే వాదనలు, లేదా హాస్య సంఘటనలు-సమాజంలోని విభిన్న వ్యక్తుల మధ్య సంబంధాలను, వారి జీవన విధానాలను చిత్రిస్తాయి. ఈ సంఘటనలు కథకు ఒక సజీవ నేపథ్యాన్ని అందిస్తాయి. రైలులో జరిగే చిన్న చిన్న సరదా సంఘటనలు-ఒకరు మరొకరిని ఆటపట్టించడం, కథలు చెప్పడం, లేదా సామాజిక సమస్యలపై చర్చించడం-ఆనాటి సమాజంలోని సామాన్య ప్రజల జీవన శైలిని, వారి ఆలోచనా విధానాలను వెల్లడిస్తాయి.

బొగ్గుతో నడిచే రైళ్లు నెమ్మదిగా ప్రయాణించేవి. ఒక్కో స్టేషన్‌లో గంటల కొద్దీ ఆగడం వంటి అనుభవాలు ప్రయాణికులకు సర్వసాధారణం. ఈ రైళ్లు కేవలం రవాణా సాధనాలు మాత్రమే కాదు, అవి విభిన్న సామాజిక, ఆర్థిక నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తులను ఒకచోట చేర్చే సామాజిక కేంద్రాలుగా కూడా పనిచేసేవి. ఈ వైవిధ్యం కథలోని సంఘటనలకు సహజత్వాన్ని తెచ్చి పెట్టింది.

ప్రశ్న15. సాధారణంగా రచయితలకు తాము రచించేవన్నీ నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీ మనసుకు బాగా దగ్గరయింది? ఎందువలన?

జ: గంగమ్మ పూలు కథ విశిష్టమైనది. నీళ్ల కోసం భూమిలోకి ఇనుప పైపులు దించి బోరింగు వేసేటప్పుడు చూస్తే అక్కడేదో చిన్నపాటి యుద్ధం జరుగుతున్నట్లు ఉంటుంది. ఎర్రటి దుమ్ము పైకి ఎగురుతుంటే రెండు కళ్ళు భూమి లోపలికి దిగుతున్న పైపులను చూస్తే నీళ్లు పడతాయో లేదో అనే సందిగ్ధాన్ని మోస్తూ అందరూ అటువైపే తదేకంగా చూస్తూ ఉన్న దృశ్యం ఎప్పుడు గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇది సాధారణమే కావచ్చు కానీ ఎంత లోతుకు పోయిన నీళ్లు పడని రాయలసీమ లాంటి ప్రాంతంలో నీళ్ల కోసం మరో యుద్ధమే జరుగుతుంది. అదంతా గంగమ్మ దయ. ఆ ఉద్విగ్న వాతావరణం అంతా గంగమ్మ పూలు కథలో చెప్పడానికి ఒక ప్రయత్నం చేశాను. గంగమ్మ అనే పేరు సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. గంగమ్మ తల్లి అనే గ్రామ దేవతతో ముడిపడి ఉంటుంది, నీటి మూలాలు, సంతానం, కుటుంబ శ్రేయస్సుతో సంబంధం కలిగి ఉంటుంది. సాధారణంగా గ్రామీణ సమాజంలో దైవారాధన, సాంప్రదాయిక ఆచారాలు, మరియు ఆధ్యాత్మిక నమ్మకాలతో ముడిపడి ఉంటాయి.

రాయలసీమలో నీటి సంక్షోభం కేవలం ఒక భౌగోళిక సమస్య మాత్రమే కాదు, అది సామాజిక, ఆర్థిక అసమానతలతో ముడిపడి ఉంటుంది. కథలో బోరింగ్ వేయడం అనేది ఒక ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ, మరియు దీనిని సాధారణంగా ఆర్థిక స్తోమత ఉన్న వ్యక్తులు లేదా గ్రామంలోని కొందరు ప్రముఖులు చేపడతారు. ఈ ప్రక్రియలో నీళ్లు పడకపోతే, ఆర్థిక నష్టం జరుగుతుంది, ఇది గ్రామీణ కుటుంబాల జీవనాన్ని మరింత కష్టతరం చేస్తుంది.

రాయలసీమ ప్రాంతంలోని నీటి సంక్షోభం, బోరింగ్ వేసే సందర్భంలో జరిగే సామాజిక, భావోద్వేగ సంఘర్షణలను, మరియు గ్రామీణ జీవన వాస్తవాలను అత్యంత సహజంగా, లోతుగా చిత్రించే ఒక విభిన్న కథ – గంగమ్మ పూలు.

ప్రశ్న 16. ఈ సంపుటిలోని ఏదైనా కథ రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?

జ: కథా వస్తువు ఎంపిక కష్టతరం అనిపిస్తుంది. మన హృదయానికి సన్నిహితంగా రాగలిగిన ఇతివృత్తం ఉంటే తప్ప రాయడం సాధ్యం కాదు. గతంలో రాసిన కథలన్నీ మరొక్కసారి తిరగ రాస్తే మరింత శక్తివంతం అవుతాయని అనిపిస్తూ ఉంటుంది. ఇదే విషయాన్ని ఒకసారి కథకులు కేతు విశ్వనాథ రెడ్డి గారితో అన్నప్పుడు “ఆ వయసుకు అలా రాశాను” అని అనుకుంటే సరిపోతోంది – అని సలహా ఇచ్చారు.

ప్రశ్న 17. ‘గంగమ్మ పూలుపుస్తకాన్ని యూనికోడ్‍లోనే ముద్రించినట్టు అనిపిస్తోంది. అను ఫాంట్స్/పేజ్ మేకర్ కాకుండా కొత్త సాంకేతికతని ఉపయోగిస్తూ, యూనికోడ్ లోనే ప్రచురించడంలో మీ ఆలోచనని వివరిస్తారా?

జ: ఇందులోని కొన్ని కథలు ముందుగా యూనికోడ్ లోనే బ్లాగులో రాశాను. కొన్ని కథలు Facebook లో యూనికోడ్ లోని రాశాను. ఆ విధంగా మళ్లీ టైప్ చేయకుండా లేదా ఫాంట్ మార్చకుండా ప్రయత్నం చేశాను. డిజిటల్ రూపంలో ఉంచడానికి ఉపయోగపడుతుంది. యూనికోడ్ ద్వారా రచనలను ఇ-బుక్‌లు, ఆన్‌లైన్ లైబ్రరీలు, మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పంచుకోవడం వల్ల, యువ పాఠకులు ఇంకా విదేశాల్లో నివసించే తెలుగువారు ఈ సాహిత్యాన్ని సులభంగా ఆస్వాదించగలరు. ఇది తెలుగు సాహిత్యానికి కొత్త పాఠక వర్గాన్ని ఆకర్షించడానికి ప్రయోజనం కావచ్చు అనిపించింది.

ప్రశ్న 18. ‘గంగమ్మ పూలుపుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఉంటే వాటిని పంచుకుంటారా? ఈ సంపుటికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?

జ: తెలుగు పాఠకులకు ముందుగా కృతజ్ఞతలు. అనూహ్యంగా గంగమ్మ పూలు కథల పుస్తకాన్ని ఆదరించడం మరిచిపోలేను. Facebook ద్వారానే చాలా పుస్తకాలు అమ్ముడయ్యాయి. త్వరలోనే సెకండ్ ఎడిషన్ వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రశ్న 19. సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలు ఏవైనా సిద్ధమవుతున్నాయా?

జ: కాలం దారి వెంట కథకుడి ప్రయాణం.. లాగా ఆగిపోకుండా సాగిపోవడం ప్రధానం అని భావిస్తాను. వీలు వెంబడి మరొక కథా సంపుటి వస్తుంది. అలాగే మరొక నవల కూడా రాయవలసి ఉంది. చూడాలి!

~

సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు డా. వేంపల్లి గంగాధర్ గారు.

డా. వేంపల్లి గంగాధర్: ఇంటర్వ్యూ చేసిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

~

డాక్టర్ వేంపల్లి గంగాధర్ సంక్షిప్త పరిచయం:

రాష్ట్రపతి భవన్‌లో విశిష్ట ఆతిథ్యం అందుకున్న తొలి భారతీయ సాహిత్యవేత్తగా గుర్తింపు పొందారు. 2014 సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 26 వరకు వీరు రాష్ట్రపతి భవన్‌లో విడిది చేశారు.

రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన పలు అంశాలపై పుస్తకాలు రాశారు. వీరి కథా సంపుటి’ మొలకల పున్నమి’ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ మొదటి యువ పురస్కారం- 2011 లభించింది. ప్రసిద్ధ సాహిత్యవేత్త సునీల్ గంగోపాధ్యాయ చేతుల మీదుగా తామ్ర పత్రం అందుకున్నారు.

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి నుంచి ‘రాయలసీమ కథా సాహిత్యం’ పై పిహెచ్.డి చేసి పట్టా పొందారు. అదే విశ్వవిద్యాలయం నుంచి ‘రాయలసీమ కక్షల కథల’పై ఎంఫిల్ పరిశోధన చేశారు.

కేంద్ర సాహిత్య అకాడమీ వారి రైటర్ ట్రావెల్ గ్రాంట్ ద్వారా శాంతినికేతన్‌లో పర్యటించారు.

మొలకల పున్నమి, గ్రీష్మ భూమి, దేవరశిల, రావణ వాహనం, పాపాఘ్ని కథలు, గంగమ్మ పూలు కథలు వెలువరించారు. కడప వైభవం, సి.పి. బ్రౌన్‌కు మనమేం చేశాం?, అనంతపురం చరిత్ర పుస్తకాలకు సంపాదకత్వం చేశారు. నేల దిగిన వాన, యురేనియం పల్లె నవలలు రాశారు.

రాయలసీమ గిరిజన తండాల నుంచి పడుపు వృత్తిలోకి తరలి పోతున్న మహిళల జీవన ఆక్రందనను ‘పూణే ప్రయాణం’ రచన చేశారు.

తొలి తెలుగు శాసనం – కలమళ్ళ శాసనంపై పరిశోధన చేసి ‘తొలి తెలుగు శాసనం’ రచన వెలువరించారు. రాయలసీమ ఫ్యాక్షనిజం పై ‘హిరణ్య రాజ్యం’, శాంతినికేతన్ పర్యటన అనుభవాలతో ‘నేను చూసిన శాంతినికేతన్’, చరిత్ర వ్యాసాలతో ‘మట్టి పొరల మధ్య మహాచరిత్ర’, సాహిత్య వ్యాసాలతో ‘దీప మాను’ పత్రికా వ్యాసాలతో ‘ఎర్రచందనం దారిలో తమిళ కూలీలు’, కథనం, రచనలు చేశారు.

కేంద్ర సాహిత్య అకాడమీ మొదటిసారిగా ‘లక్షద్వీప్’ లో ఏర్పాటు చేసిన సాహిత్య కార్యక్రమానికి తెలుగు సాహిత్యకారుడిగా హాజరయ్యారు.

వీరి నవల ‘నేల దిగిన వాన’ శ్రీ యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప ఎం.ఏ. విద్యార్థులకు పాఠ్యాంశంగా ఎంపికయింది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ నూతనంగా వెలువరించిన ఒకటి నుంచి ఏడు తరగతుల తెలుగు పాఠ్యపుస్తకాలకు మరియు పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.

వీరి కథలు పలు భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి.

***

గంగమ్మ పూలు (కథలు)
రచన: డా. వేంపల్లి గంగాధర్
పేజీలు: 131
వెల: ₹ 150.00
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా,
హైదరాబాద్. ఫోన్: 9000413413
డా. వేంపల్లి గంగాధర్
9440074893
ఆన్‌లైన్‍లో:
https://www.telugubooks.in/te/products/gangamma-poolu?

 

 

~
‘గంగమ్మ పూలు’ కథాసంపుటి సమీక్ష
https://sanchika.com/gangamma-poolu-book-review-kss/

Exit mobile version