Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కవి, కథకుడు, నవలా రచయిత డా. శాంతి నారాయణ ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘గీతలు చెడిపి..’ అనే కథాసంపుటిని వెలువరించిన డా. శాంతి నారాయణ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం డా. శాంతి నారాయణ గారూ.

డా. శాంతి నారాయణ: నమస్కారం.

~

ప్రశ్న 1. మీరు రాసి, ప్రచురించిన 10 కథల సంపుటికి శీర్షికగా ఏడవ కథ గీతలు చెడిపి..పేరునే ఎంచుకోవడంలో ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? ముందుమాటలో ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారు ఆ కథ గురించి క్లుప్తంగా చెప్పారు. సంచిక పాఠకుల కోసం మరింత వివరంగా చెప్తారా?

జ: ఇక్కడ ‘గీతలు’ అంటే ఆంక్షలు అని పిండితార్థం. ఈ సమాజం మనుషుల మధ్య, జాతుల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, దేశాల మధ్య ఎన్నో ఆంక్షలు – హద్దులు – గీతలు ఏర్పరిచింది. ఈ ఆంక్షలు గీతల కారణంగా సంకుచితత్వాలూ విభేదాలూ వైరుధ్యాలూ వైషమ్యాలూ ఆధిపత్య భావజాలాలూ పెరిగిపోతున్నాయి. మనిషిలో ఇతర మనుషుల-జాతుల-మతాల-ప్రాంతాల- దేశాల పట్ల ప్రేమచింతన, మానవీయ భావన, విశ్వమానవతత్వం, సౌభ్రాతృత్వం అంతరించి పోతున్నాయి. స్వార్థ చింతనతో కొందరు, భౌతికంగానూ మానసికంగానూ సమాజంలో అసహజంగా ఏర్పరచిన గీతలు మనుషులనూ సమాజాలనూ వేదనకు గురి చేస్తున్నాయి. ఆ వేదన, సమాజ వికాసానికీ, అభివృద్ధికీ పురోగమనానికి అడ్డు పడుతూ వుంది. కాబట్టి మానవ వికాసానికీ సమాజాభివృద్ధికి విఘాతం కలిగించే అన్ని రకాలు గీతలనూ శాశ్వతంగా తుంచి వేయాలన్నదే ఈ కథాసంపుటి ‘టైటిల్’ లోని అంతరార్థం. సంపుటిలోని పది కథలూ, పది రకాల గీతలను చెదిపి వేయడాన్ని ఉద్దేశించి రాసినవే!

ప్రశ్న 2: ఇది మీ ఏడవ కథాసంపుటి. ఇది కాక, ఆరు కథా సంపుటాలు, నాలుగు కవితా సంపుటులు, మూడు నవలలు, నాలుగు నవలికలు ప్రచురించారు. కవిగా, కథకుడిగా, నవలా రచయితగా 1970 నుంచి మొదలైన మీ సాహితీ ప్రస్థానం గురించి వివరిస్తారా?

జ: నా సాహిత్య జీవిత ప్రస్థానం 1970 నుంచీ ప్రారంభమైన మాట వాస్తవం, అయితే కేవలం కల్పనా సాహిత్యం (కథ, నవల, నవలిక) తోనే ప్రారంభం కాలేదు. మొదట, అంటే, 1967 లోనే, తిరుపతి ఓరియంటల్ కళాశాలలో విద్వాన్ కోర్సు రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు, విద్యార్థి దశనుంచే పద్యరచన – అష్టావధాన ప్రక్రియలతో నా సాహిత్య జీవితం ప్రారంభమయిందని అనుకోవాలి. 1967 లో నా అంధకార జీవితానికి వెలుగునిచ్చిన గురువర్యులు కీ.శే. జి. చిత్తరంజన్ దాస్ గారి ప్రోత్సాహంతో, నేను చదివిన ఉన్నత పాఠశాలలో, ఆయన అధ్యక్షతన, విద్యనేర్పిన గురువుల సమక్షంలో నలుగురు తెలుగు పండితులు పృచ్ఛకత్వం కింద అష్టావధానం చేసిన నాటి నుంచే నా సాహిత్య జీవితం ప్రారంభమయిందని చెప్పవచ్చు.

పద్యరచన, అష్టావధానాలు చేస్తూనే మరొక వైపు కథానిక, నవలా రచనకు నడుము బిగించాను. 1968లో నేను విద్యాన్ మూడో సంవత్సరం చదువుతూ అదే ఓరియంటల్ కళాశాలలో చదువుతున్న మా అనంతపురం జిల్లా వాసి, విద్వాన్ కోర్సులో చేరడానికి ముందే, పియుసి విద్యార్థి దశలోనే రెండు నవలలు ప్రచురించిన సింగమనేని నారాయణ చౌదరి ప్రభావంతో నవలా రచనకు పూనుకొని వొక ప్రేమ నవల రాశాను. ఆ నవలా రచనకు అప్పటి సినిమాలు కూడా కొంత ప్రభావం చూపాయని చెప్పడం సముచితంగా వుంటుంది. నవలను రాసిన తర్వాత దానిని సింగమనేని నారాయణ చౌదరికి చూపించాను. అప్పట్లో మా కళాశాలలో ఆధునిక సాహిత్యానికి అతడొక లెజెండ్. సాంప్రదాయ సాహిత్యానికీ అష్టావధాన ప్రక్రియకూ నరాల రామారెడ్డి విద్యార్థులందరికీ మార్గదర్శకుడు. వీళ్లిద్దరి ప్రభావంతోనే నాకు సాంప్రదాయ సాహిత్య, ఆధునిక సాహిత్యాలపైన సమాంతరంగా అధ్యయనాసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తితో పద్యరచనకూ కల్పనా సాహిత్యసృజనకూ పూనుకున్నాను. పద్యరచన, అష్టావధాన పద్యాల వరకే పరిమితమయింది. కొన్ని పద్యాలు, కోస్తా ప్రాంతం నుండి వెలువడే వొక మాసపత్రికలో (పేరు గుర్తుకు లేదు) ప్రచురితమయ్యాయి. అప్పట్లో వారం వారం ఆకాశవాణీ కడపకేంద్రం నిర్వహించే ‘సమస్యాపూరణ’ కార్యక్రమంలో ప్రసారమయ్యాయి. అష్టావధానం చేసిన వార్తలు ఆనాటి దినపత్రికలైన ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రికలలో ప్రచురింపబడడం, సమస్యాపూరణ రూపంలో పద్యాలు రేడియోలో ప్రసారం కావడం చాలా థ్రిల్లింగ్ గానూ గర్వంగానూ ఉండేది. ఆ ప్రోత్సాహమే నన్ను 1978 వరకు అష్టావధాన మార్గంలో నడిపించింది. మొత్తం 12 అవధానాలు చేశాను. దీనికంతటికీ తిరుపతి ఓరియంటల్ కళాశాలలోని సాంప్రదాయ సాహిత్య వాతావరణమే ముఖ్య కారణం.

ఒక ప్రేమ నవల (పేరు గుర్తుకు లేదు) రాసి సింగమనేని నారాయణ చౌదరికి చూపించానని అన్నాను కదా, అతడు. కొన్నాళ్లయిన తర్వాత నవల రాత ప్రతిని నా చేతికిస్తూ, “ఈ నవలను వొక పది సంవత్సరాల తర్వాత నువ్వే చదివి, అప్పుడు బాగుందని నీకు అనిపిస్తే అచ్చు వేసుకో” అని అనడంతో నాకు మనసు చివుక్కుమనింది. అతడు అలా చెప్పడంతో, దానిని ప్రచురించండని ఏ ప్రచురణ సంస్థకూ పంపలేదు, పంపితే నింపితే అతని ద్వారానే పంపాలి. ఆల్రెడీ రెండు నవలలు ప్రచురించుకున్న ఆ మిత్రుడే, ఇది ప్రచురణార్హమయిన నవల కాదని పరోక్షంగా సూచించిన తర్వాత ఎవరికయినా ఎలా పంపగలను?

నా పద్యరచనను ఎవరూ తప్పుబట్టలేదు. అందుకే సంకోచం లేకుండా అష్టావధానాలు చేయడానికి వెనుకంజ వేయలేదు. అవధాన ప్రక్రియలో దూసుకు పోతున్న మిత్రుడు ఆశావాది ప్రకాశరావు నా పద్యాలను చూసి, వెన్ను దట్టి తన మార్గంలో నడిపించుకు పోయాడు. నేను విద్వాన్ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడు అతడు అనంతపురం జిల్లా కణేకల్ హైస్కూల్లో జూనియర్ తెలుగు పండిట్‌గా పని చేస్తూ, వాళ్ల స్కూల్లో అష్టావధానం చేయడానికి నన్ను ఆహ్వానించాడు, అది పెద్ద అవధాన సభ, వొకరిద్దరు పృచ్ఛకులు జటిలమైన సమస్యలు ప్రశ్నలు అడిగి, విద్యార్థినయిన నన్ను కొంత ఇబ్బంది పెట్టినా ఆశావాది ప్రకాశరావు తోడ్పాటుతో విజయంతంగా అవధానం చేశాను.

ఆశావాది ప్రకాశరావు, వెంకట శివగౌడ, వీరభద్రాచారి, విజయ రామరాజు (వీళ్లందరూ విద్వాన్‍లో నా సహాధ్యాయులయిన అష్టావధాన సాధకులు) విద్యార్థన దశలో నా పద్యాలను, అవధానాలను ప్రశంసలతో ప్రోత్సహించారు. 1970 లో తెలుగు పండితునిగా ఉద్యోగంలో చేరిన తర్వాత పండితుల ప్రోత్సాహంతోనే అవధానాలు చేశాను గానీ ఆ అవధానాల్లో తయారయిన పద్యాలను గ్రంథస్తం చేయలేకపోయాను. వివిధ సామాజికాంశాల పైన పద్యాలు గానీ, వొకటి రెండో పద్య కావ్యాలు గానీ రాయలేక పోయాను. కాలగమనంలో వచ్చిన పరిణామక్రమాలను సామాజిక చలనరీతులనూ గమనిస్తూ వచ్చిన నేను, మిత్రులు ప్రోత్సహించిన సాంప్రదాయ సాహిత్యమార్గంలో నడవలేక మిత్రులు ఒకరిద్దరు నిరుత్సాహపరిచిన ఆధునిక కల్పనా సాహిత్యమార్గమే నాకు సరైన దారిగా భావించసాగాను. అందుకు కారణం నా చుట్టూ వున్న సమాజమే.

సాహిత్యంతో పాటు సమాజాన్ని నిశితంగా పరిశీలించే క్రమంలో, అసమ సమాజంలో ఎన్నోరకాలుగా వివక్షకు గురవుతున్న వర్గాలూ, ప్రాంతాలూ, దళిత బహుజనుల జీవితాలూ, తాడితులూ, పీడితులూ, తాము నష్టపోతూ నలిగిపోతూ సమాజానికి అన్నం పెట్టే రైతన్నలూ, అధోజగత్సహోదరులూ వీళ్లే నా సాహిత్య రచనకు కేంద్ర బిందువులు కావాలని, వీళ్ల జీవితాలూ జీవిత సమస్యలే నా రచనలకు వస్తువులు కావాలని నిశ్చయించుకున్న కారణంగా, సమాజానికి నిరుపయోగమయిన అవధాన విద్యను పరిత్యజించాను. 1970 లోనే పద్యరచనా కథా రచనా ప్రారంభించినా, 1978 వరకూ అవధానాలు చేసినా, నా మనసులో స్థిరపడి, నన్ను ఇంతవరకూ అచంచలంగా నడిపించినవీ నడిపిస్తున్నవీ శాస్త్రీయమయిన ఆలోచనా ధోరణులే; ఆధునిక భావజాలంతో సాహిత్యలోకాన్ని సుసంపన్నంగా ఆరోగ్యవంతంగా చేస్తున్న ఆధునిక సాహిత్య ప్రక్రియలే! ఆ మార్గంలో నిశ్చలంగా, నిర్భీతిగా నడుస్తూ, యథాశక్తి కథలూ కథానికలూ నవలికలూ కాలం కతలూ నవలలూ కవితలూ రాస్తున్నాను.

ప్రశ్న 3: ముందుమాటలో మీ కథలలోని శైలి గురించి చెబుతూ, “సన్నివేశాలని బట్టి, సంఘటనలని బట్టి శాంతి నారాయణ గారి శైలిలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. కథా కథనం ఎక్కడ మెల్లిగా సాగాలో, ఎక్కడ వేగాన్ని అందుకోవాలో, ఎక్కడ ఉత్కంఠతని కలిగించాలో అనే విషయమై వారికి స్పష్టత ఉంది” అన్నారు. మీ కథలలోని శిల్పరీతుల గురించి వ్యాఖ్యానిస్తూ “ఏ సన్నివేశాన్ని ఎక్కడ చిత్రించాలో, ఏ సన్నివేశంలో ఏ సంఘటనలని కూర్చాలో అన్నది శాంతి నారాయణ గారికి వెన్నతో పెట్టిన విద్య” అని అన్నారు ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారు. ఈ పుస్తకంలోని పది కథలు విడివిడిగా కనిపించినా, వస్తు వైవిధ్యం ఉన్నట్టుగా అనిపించదు అని వ్యాఖ్యానించారు. మీ అభిప్రాయంలో కథకి వస్తువు, శిల్పం, శైలి లో ఏది ప్రధానం? వివరించండి.

జ: నా దృష్టిలో కథకు ప్రధానమైనది కథావస్తువు. కేవలం కథలే కాదు, కవితకూ నవలకూ ముఖ్యమయినది వస్తువే! వస్తువు లేకుండా అందమైన మాటలూ అలంకారాలే కథ/నవల/కవిత కాలేదు. సమాజానికి ఏ సందేశం ఇవ్వాలనుకున్నా విషయం ముఖ్యం. రచయిత ఏమి చెబుతున్నాడో ముఖ్యం కానీ ఎలా చెబుతున్నాడన్నది తర్వాతి విషయం. పాఠకులను ఆలోచింపజేసి చైతన్యపరిచేది కథా వస్తువే, విషయమే కాని అందమయిన భాష, అలంకారాలు, శిల్పం కాదు, చెప్పే విషయం అందంగా ఆలంకారికంగా మనోహరంగా చెప్పితే పాఠకుడు కథ పట్ల ఆకర్షితవుతాడు. అంత మాత్రాన ఆకర్షణ కథ/కవిత కాదు గదా! భాష గానీ అలంకారాలు గానీ కథావస్తువును అంటిపెట్టుకున్నప్పుడే అవి రాణిస్తాయి గానీ వాటంతటవే రాణించవు.

దీన్ని మరికొంత వివరంగా చెప్పాలంటే, సాహిత్యమనేది హితముతో కూడుకొన్నది. హితం ఎవ్వరికి? సమాజానికి, వక్రమార్గంలో నడుస్తున్న మూఢ విశ్వాసాలతో వెళ్లుతున్న దుర్మారమైన అప్రజాస్వామికమైన అమానవీయమైన పద్ధతులతో పయనిస్తున్న సమాజాన్ని, సక్రమ పద్ధతులలో సన్మార్గమైన ప్రజాస్వామికమైన మానవీయమయిన జీవన విధానాలలో నడిపించడానికే సాహిత్యం. అటువంటి సాహిత్యం ప్రధానంగా వస్త్వాశ్రయమయినదే! ఆ వస్తువు, సమాజాన్ని వక్రమార్గంలో నడిపినప్పుడు, ప్రగతిశీలకం కాకుండా తిరోగమన శీలకమయినప్పుడు, అందులో గొప్ప శిల్పమూ భాషా సౌందర్యమూ వున్నప్పటికీ ఆమోదయోగ్యం కాదు గదా!

ప్రశ్న 4: మీ మొదటి కథా సంపుటి రక్తపు ముద్ద పిలిచింది’ 1972లో ప్రచురితమైంది. తాజా కథా సంపుటి గీతలు చెడిపి..’ 2023 లో వచ్చింది. ఈ 51 ఏళ్ళ కాలంలో కథా వస్తువు, శైలి, కథా నిర్మాణం విషయాలలో రచయితగా మీలో ఏ మార్పులు వచ్చాయని మీరు భావిస్తున్నారు?

జ: 1972 లో నా ‘రక్తపు ముద్ద పిలిచింది’ కథాసంపుటి వచ్చేనాటికి నా వయస్సు 26 సంవత్సరాలు. ఆ కథలన్నీ 1972లో పుస్తకరూపంలో వచ్చినా అవి 1969-71 సంవత్సరాలతో రాసినవే! అప్పుడు యవ్వనంతో పరుగులు తీసే వయసు నాది. ఆ వయసులో మనసు ఆరాటపడేది స్త్రీ కేంద్రకమయిన ప్రేమ కోసమే! ఎంత పేదరికంతో నలిగిపోయినా అందరికి వలే వయోసహజమయిన స్త్రీ ప్రేమ కోసం నేనూ ఆరాటపడిన విషయం, ఇప్పుడయినా ఎప్పుడయినా దాచుకోవలసిన అవసరం లేదు. అయితే నా ప్రేమ ఫలించలేదు. ప్రేమ కోసం, ప్రేమే జీవితమని నలిగిపోలేదు. అతివేలమయిన వ్యామోహంతో, ప్రేమించిన స్త్రీ చుట్టూ పిచ్చివానిగా తిరగనూ లేదు. దేవదాసుగా మారనూ లేదు. ప్రేమించిన స్త్రీ కోసం వొకవేళ నేను పిచ్చిగా తిరిగినా దేవదాసుగా మారినా, నా భౌతిక రూపమూ పిరికితనమూ నా పేదరికమూ ప్రేమకు నన్ను అర్హుణ్ణి చేసుండేవి కావు. ఏమయితేనేం, నేను ప్రేమించిన స్త్రీ పేమను పొందలేక పోయాను. ఆ నిరాశతో నన్ను నేను భగ్న ప్రేమికునిగా భావించుకొని రాసిన కథలే, 1972 లో ‘రక్తపు ముద్ద పిలిచింది’ కథల సంపుటంగా, 1976లో ‘రస్తా’ కథాసంపుటిగా వెలువడ్డాయి. ఇటీవల రాసిన కథలన్నిటినీ కలిపి ‘గీతలు చెరిపి..’ పేరుతో నా ఏడవ కథా సంపుటిని 2023 డిసెంబర్‌లో వెలువరించాను. 1969-2023 మధ్య కాలంలో అంటే 55 సంవత్సరాలు కాలంలో నా కథావస్తు రూపాలలోనే గణనీయమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఆధునిక కథా సాహిత్యంలో నన్నొక కథారచయితగా నిలబెట్టిన కథ ‘దళారి’. అది, 10-5-1989 తేదీన వెలువడిన ఆంధ్ర ప్రభ వార పత్రిలో ప్రచురింపబడింది. ఆ కథను చదివిన ఆధునిక తెలుగు కథా పితామహుడు కాళీపట్నం రామారావుగారు దాన్ని రాయలసీమ మాండలికంలో వచ్చిన మంచి కథగా గుర్తించి, మధురాంతకం రాజారామ్ గారికి ఉత్తరం రాసి నా గురించి వాకబు చేసి, ఆయన స్వహస్త దస్తూరితో నన్నూ ఆ కథనూ ప్రశంసిస్తూ ఉత్తరం రాయడం వొక మరపురాని సందర్భం. ఆ ఉత్తరం నాలోని రచయితను మేల్కొల్పడమే గాక ఉన్నత కథకులను మెప్పించే రీతిలో నేనూ కథలను రాయగలనన్న భరోసాను నాకు అందించింది. ఆ కారణంగా ఆధునిక కథంటే ఏమిటో, అది ఎవరి పక్షాన నిలబడాలో నాకు సరికొత్త ఎరుకను కలిగించింది. అంతవరకూ రాయలసీమ మాండలిక కథలను తిరస్కరించిన ప్రసిద్ధ వార పత్రికలన్నీ అటువంటి కథలకే ద్వారాలు తెరిచి పరోక్షంగా కథకులకు కథావస్తువులను సూచించాయి. అందుకే, ‘దళారి’ కథతోనే నా కథారచన ప్రారంభమయిందని చెప్పుకోడానికి నేను ఇష్టపడతాను.

నా కథల వస్తువు విషయంలో వచ్చిన పరిణామాలను గురించి చెప్పాలనుకున్నప్పుడు, ఎక్కువ కథలు గ్రామీణ రైతాంగ జీవిత నేపథ్యం నుంచి వచ్చినవే. ఈ కథలన్నీ రాయలసీమ అస్తిత్వ స్పృహతో రాసినవే! దేశంలోనే అత్యంత దయనీయమైన, వెనుకబాటుతనంతో కునారిల్లుతున్న రాయలసీమలో – ముఖ్యంగా మా అనంతపురం జిల్లాలో కరువు కాటకాలతో అతలాకుతలమవుతున్న చిన్నకారు, సన్నకారు రైతుల జీవితాల్లోని అనేక పార్శ్వాలు నాకు కథావస్తువులయ్యాయి. రాయలసీమ రచయితలకు కరువులూ రైతుల కష్టాలూ కన్నీళ్లు తప్ప ఇంకేవీ కథా వస్తువులు కనిపించవా అని ‘తానా’ పెద్దలు – కరువులు కలిగించే వివిధ రకాల వేదనలు తెలియని సంపన్నులు ఇక్కడి రచయితల్ని ఎగతాళి చేసిన సందర్భాలున్నాయి. ఇక్కడ మా ప్రాంత ప్రజలకు సమృద్ధిగా తాగునీరూ, కనీసం వొక పంట కయినా సాగునీరు అందేంత వరకూ, ఇక్కడి వ్యవసాయ కూలీలు, వలసలు పోనంత వరకూ; దశాబ్దాల తరబడి బీళ్లుగా మారిన మా పొలాల్లో పచ్చని పైర్లు కళకళలాడేంత వరకూ, ఎవరెంత ఎగతాళి చేసినా మా ప్రాంత కరువు కాటకాల వివిధ విధ్వంస రూపాలను, రైతుల రైతుకూలీల విభిన్న వేదన రీతులను గురించి రాస్తూనే వుంటాం. కాలం మారుతున్న కొద్దీ ఇక్కడి గ్రామీణ జీవితాల్లో మారుతున్న జీవన విషాదాలే నా కథావస్తు పరిణామాలు.

కథావస్తువే శిల్పాన్ని శైలినీ ఎంచుకుంటుంది. శిల్పం పేరుతో, టెక్నిక్ పేరుతో కథ ద్వారా చెప్పదలచుకున్న అంశాన్ని సంక్లిష్టం చెయ్యడం, పాఠకునికి confusion కలిగించడం, కథంతా చదివిన తర్వాత కథలో రచయిత ఏమి చెప్పారో పాఠకునికి బోధపడకపోవడం నాకు నచ్చని అంశాలు. కథ చదివిన తర్వాత పాఠకుని హృదయం ఆర్ద్రమై పోవాలి. చైతన్యవంతం కావాలి. మెదడులో కొత్త ఆలోచనలు మెదలాలి. కథాంశం పట్ల ప్రేమావేశాలు కలిగాలి. కథ, పాఠకున్ని అలా కదిలించడమే, పక్కకు తిరగనీయకుండా తన వెంట నడిపించుకోవడమే శిల్పం. శైలి అనేది, వొక్కొక్క రచయితది వొక్కో శైలి. కాలాన్ని బట్టి కథా వస్తు రూపాలు మారుతాయి, కథా వస్తురూపాలను బట్టి కథాశిల్పంలో శైలిలో మార్పులు చోటు చేసుకుంటాయి.

40-50 సంవత్సరాల కిందటి గ్రామ జీవితం వేరు, ఇప్పటి గ్రామ జీవితం వేరు. అప్పటి వ్యవసాయ పద్ధతులు, సేద్యం వెతలు ఇప్పుడు లేవు. ఈ రోజు గ్రామీణ జీవిత నేపథ్యంగా వొక కథ రాయాల్సొచ్చినప్పుడు అక్కడొచ్చిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొనే కథా వస్తువును రూపొందించుకోవాలి, తదనుగుణంగా కథానిర్మాణం జరగాలి. ఆ నిర్మాణంలో శిల్ప చాతుర్యం వొదిగిపోవాలి. కథాశిల్పమంటే అదేమీ బ్రహ్మ పదార్థం కాదు. ఒక దయనీయ సంఘటననో, మానవీయ దృశ్యాన్నో, అమానవీయ సన్నివేశాన్నో, సమస్యాత్మక విషయాన్నో, అస్తిత్వపరమయిన వివక్షనో కథగా రాయాలనుకున్నప్పుడు, దాన్ని ఏ యెత్తుగడతో ప్రారంభించాలో ఎటువంటి ముగింపునివ్వాలో నిర్ణయించుకొని, ఆ యథార్థ జీవిత శకలం చుట్టూ వాస్తవికతకు దగ్గరగా మరికొన్ని సంఘటనలో సన్నివేశాలో కల్పన చేసుకోవాలి. ఆధునిక కథ, మన చుట్టూ వున్న జీవితంలో నుంచే పుట్టుకొని రావాలి గానీ రచయిత మెదడులోనుంచి పుట్టకూడదు. జీవితంలో జరిగిన వొక వాస్తవిక సంఘటనని అంశాన్ని యథాతథంగా రాస్తే అది వార్త అవుతుంది. ఆ వార్తను కథగా మలిచి, దానికి సాహిత్య గౌరవం కల్పించాలనుకున్నప్పుడు ఆ వార్తను కథగా మార్చే పటిష్ఠమయిన, జీవన వాస్తవికతతో కూడిన కల్పనే శిల్పం.

ప్రశ్న 5: “సమాజ గమనాన్ని అవగాహన చేసుకోవటంలో రచయితగా శాంతి నారాయణ గారికి అపారమైన అనుభవం ఉంది” అన్నారు ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారు. మీ తొలి కథ నాటికి, ఇటీవలి కథ ‘కాషాయ వైద్యం’ వరకు ఓ సాహితీవేత్తగా సమాజంలోని ఏ మార్పులను మీరు గుర్తించారు? ఆ మార్పులను మీ కథలలో ఎలా ప్రతిబింబించారు? పాఠకుల అభిరుచి, పఠనాసక్తులకు తగ్గట్టుగా మీ రచనాశైలిని కాని, ఎంచుకునే వస్తువుని కానీ మార్చుకోవాల్సి వచ్చిందా?

జ: ఆచార్య మేడిపల్లి రవి కుమారగారన్నట్లు, నా తొలి కథ ‘రక్తపు ముద్ద పిలిచింది’ రాసే నాటికీ, ‘గీతలు చెరిపి..’ కథ రాసే నాటికీ సమాజంలో అన్ని రంగాలలోనూ అనూహ్యమయిన మార్పులొచ్చాయి. మనిషి ఆలోచనల్లోనూ అభిరుచుల్లోనూ వేషభాషల్లోనూ కళా సాంస్కృతిక రంగాల్లోనూ చాలా మార్పు లొచ్చాయి. చివరికి మనిషి లక్షణమయిన మనిషితనంలోనూ మానవీయత లోనూ నైతిక విలువలలోనూ రాకూడని మార్పులొచ్చాయి.

సమాజం పరిణామశీలి. ఇక్కడ సమాజమంటే మానవ సమాజమే! భౌగోళిక పరిణామం, కంటికి కనిపించనంతటి సహజమయిన, భూగోళ సంబంధమయిన మార్పు. అది ఎవరూ ఆపలేనిది, మానవాతీతమయినది. అయితే మానవ నిర్మితమయిన సమాజంలోని పరిణామాలన్నిటికి మానవుని మేధస్సే కేంద్రబిందువు. పాతరాతి యుగం నుంచి నేటివరకూ జరిగిన సమస్త భౌతిక వస్తు పరిణామాలకే కాదు, బుద్ధి జనితంకాలయిన మతమూ మత సంబంధిత విషయాలూ వేషభాషా సాంస్కృతిక విషయాలూ ఆహారపానీయాలూ ఆలోచనలూ నీతి నియమాలూ ఆచార వ్యవహారాలూ ఇలాంటి సమస్త విషయ పరిణామాలన్నిటికీ మనిషే మూల కారకుడు.

నేను మొదటి కధ రాసే నాటి భౌతిక బౌద్ధిక విషయాలూ ఈనాటి భౌతిక బౌద్ధికాంశాలూ రెండూ మానవ నిర్మితాలే! అయినా 1950 ల నాటి వస్తు, విషయాలు 1960 లలో మనిషికి నచ్చనివిగా మారిపోతున్నాయి. 1960ల నాటి వస్తు, విషయాలు 1970 లలో, 1970 లనాటిది 1980 లలో; 2010ల నాటివి 2020లలో అదే మనిషికి అయిష్టమయిన అంశాలవుతున్నాయి. మనిషి కాలానుగుణంగా తన మేధస్సుతో సృష్టించుకుంటున్న సమస్త వస్తు, విషయాలన్నిటి పట్లా తానే తన అభిరుచులను మార్చుకుంటూ కొత్తదాని పట్ల ఆసక్తిని పెంచుకుంటున్నాడు. అనివార్యమవుతున్న ఈ పరిణామంతో రచయిత కూడా తన కథలకు సంబంధించిన వస్తు స్వీకరణలో భాషాభివ్యక్తిలో కాలానుగుణమైన మార్పులను గమనించాల్సి వుంది..

నేను వ్యవసాయ సమస్యల పైన మొదలు కథలు రాసేనాటి మార్కెట్ విధానాలు, వ్యవసాయ పద్ధతులు, రైతుల సమస్యలు ఇప్పుడు మారిపోయాయి. ఆ రోజుల్లో రైతులు, వచ్చే సంవత్సరానికి కావలసినన్ని విత్తనాలు తామే పండించిన వాటిలో నుంచీ తీసి పెట్టుకునేవాళ్లు. ఇప్పుడు ప్రతి పంట విత్తనానికీ ప్రభుత్వం పైనా ప్రయివేటు సంస్థల పైనా ఆధారపడుతూ కొత్త సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు ఆయిల్ ఇంజన్లతో వొక రకమయిన కష్టాలు పడిన రైతులు ఇప్పుడు కరెంటు మోటార్లతో మరో రకమయిన కష్టాల పాలవుతున్నారు. ఆధునిక బిందుసేద్యంతో ఇంకో రకమయిన ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి హామీ కారణంగా వ్యవసాయ కూలీల సమస్య, ఆ సమస్య నుంచి బయట పడడానికి యంత్రాలు అవసరమవుతున్నాయి. కొత్త ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ మార్పులను గమనించకుండా రచయిత ఈ రోజు రైతు సమస్యల పైన గతంలో మాదిరే కథ రాస్తే ఔట్‌డేటెడ్ అవుతుంది. రిలవెన్సీ వుండదు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ నేను వ్యవసాయ సంబంధమయిన కథలను రాస్తున్నాను.

ఒక వ్యవసాయ రంగంలోనే కాదు అన్ని రంగాలలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

దళిత బహుజనుల సమస్యలు గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు తమ వివక్ష రూపాలను మార్చుకుంటున్నాయి. పల్లెల్లో దళితులు ఆ కొట్టులకు వెళ్లినప్పుడు రెండు గ్లాసుల సిస్టం వుండేది. ప్లాస్టిక్ గ్లాసులు రావడంతో ఆ పద్ధతి కనుమరుగయింది. 1990 వరకూ గ్రామాలలో వినాయక చవితినాడు వీధుల్లో విగ్రహాలు పెట్టిన దాఖలాలు చాలా తక్కువ. ఇప్పుడు పల్లెల్లో పట్టణాల్లో వీధుల్లో సందుల్లో గొందుల్లో ఎక్కడపడితే అక్కడ పందిర్లూ షామియానాలూ వేసి, మతాల వారిగా కులాల వారిగా వినాయకుల్ని కూర్చోబెట్టి, జనజీవితానికి అంతరాయం కలిగిస్తూ కుల మతాల మధ్య కొత్త సంఘర్షణలకు తెర లేపుతున్నారు. కులాంతర వివాహాల్లో కుల వివక్ష వికృత రూపంలో పరువు హత్యగా పరిణమిస్తూ వుంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో వొక నాడు కనిపించిన భక్తి భావం ఈ రోజు వికృతమయిన విశ్వరూపమెత్తుతూ వుంది. గతంలో విదేశీ కంపెనీలు వ్యాపారం కోసం వచ్చి స్థిరపడి మన మీద పెత్తనం చెలాయిస్తే స్వాతంత్య్ర సమరం పేరుతో వాటిని పారద్రోలాం. ఇప్పుడు మనమే విదేశీ సంపన్నులను పెట్టుబడులతో ఆహ్వానిస్తున్నాం. పురుషులయినా స్త్రీలయినా మాన సంరక్షణ కోసం మన సంస్కృతిని అనుసరించి వస్త్రాలంకరణ వుంటే, ఇప్పుడు అర్ధ నగ్న, ముక్కాలు నగ్న ప్రదర్శనను ప్యాషన్ పేరుతో ఇష్టపడుతున్నాం. ఈ పరిణామాలన్నిటినీ రచయిత విస్మరించడానికి వీల్లేదు. ఎన్ని పరిణామాలొచ్చినా అంతిమంగా, జంతువులో జంతుతనం మారనట్లే, మనిషిలో మనిషితనం, మానవీయత మారకూడదు! రచయిత, కథా వస్తువులో శిల్పంలో కాలానుగుణమయిన మార్పులను ఆహ్వానించినా అంతిమంగా మనిషితనాన్ని మానవీయతను భగ్నపరిచేదిగా వుండకూడదు. నా కథలన్నీ ఈ అంతస్సూత్రంతోనే రాశానని సవినయంగా తెలియజేస్తున్నాను.

ప్రశ్న 6: మీరు స్వతహాగా కవి కావడం వల్ల, కొన్ని కథలలో వచనం కవితాత్మకంగా ఉంది. ముఖ్యంగా ఆత్మనిర్భర భారతంకథలో సన్నివేశానికి అనుగుణంగా వ్రాసిన కవితాత్మక వాక్యాలు ఇందుకు చక్కని ఉదాహరణ. ఈ కథ నేపథ్యం గురించి చెప్పండి. ఆ సన్నివేశంలోని గాఢతని కవితాత్మక వాక్యాలలోనే ఎందుకు చెప్పాల్సి వచ్చిందో వివరిస్తారా?

జ: ‘ఆత్మనిర్భర భారతం’ కథలో, వొక దారుణమయిన, దయనీయమయిన సంఘటనాత్మక సన్నివేశంలో- చాలా వాక్యాలు కవితాత్మకంగా రాసిన మాట వాస్తవం. ఆ సన్నివేశ చిత్రణలో రచయితగా నేను పాదచారులతో కలిసి నడిచిన స్థితిలోకి జారి, నాతో కుతకుతమని ఉడికే బాధను, ఆగ్రహాన్ని ఆవేశపూరితంగా, కన్నీళ్లు కార్చుకుంటూ అక్షర రూపంలో పెడుతున్నప్పుడు ఆ కవితా వాక్యాలు తన్నుకోని వచ్చాయి. వెంటనే నన్ను నేను నిగ్రహించుకోకుండా రాసుంటే, ఆ వాక్యధార, రెండు మూడు పేజీల వరకూ సాగేదేమో! నేను రాస్తున్నది కథ కదా అని స్ఫురించగానే ఆ కవితా వాక్యాలను నిలిపి వేశాను.

ఈ కథా నేపథ్యం – కరోనా విజృంభిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా లాక్‌డౌన్ విధించింది. ఎక్కడి వాహనాలను అక్కడే నిలుపుదల చేసింది. ఎవరి వూళ్లకు వాళ్లు చేరుకోవాలని వారం రోజులయినా గడువు ఇవ్వకుండా ఉచిత సలహా ఇచ్చింది. బెంగుళూరులో కొన్ని లక్షల మంది, సొంత నివాసాలు లేని వివిధ రకాల కార్మికులున్నారు. వాళ్ల వల్ల కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం వుందని అధికారులు, వివిధ దశలలో నిర్మాణంలో వున్న ముపై నలభై అంతస్తుల భవన సముదాయాల అధినేతలు, నగర పౌరులు ఆ భవన నిర్మాణ కార్మికులను నగరం నుండి అమానవీయంగా తరిమివేశారు. ఉత్తర భారతదేశంలోని మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల నుండి బతుకు దెరువు కోసం లక్షల మంది కార్మికులు బెంగుళూర్‌లో తాత్కాలిక వసతి కల్పించుకొని జీవిస్తున్నారు. వాళ్లల్లో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికులు వేలాది మంది ఉన్నారు. ఒక్క శ్రీకాకుళం జిల్లా నుంచీ వచ్చిన వాళ్లే సుమారు యాభైవేల మందికి పైగానే ఉన్నట్టు అంచనా. ఎక్కువ వ్యవధి ఇవ్వకుండా వాళ్లను నగరం నుంచి వెళ్లిపొమ్మనడంతో, రైళ్లూ బస్సులూ అందుబాటులో లేక, ఊపిరుంటే ఉప్పమ్ముకొని బతకవచ్చునని, ప్రాణాలతో సొంతూళ్లకు చేరుకోవాలని ఆదరాబాదరాగా పిల్లాజెల్లల్ని భుజాన వేసుకొని బెంగుళూరు నుంచి గుంపులు గుంపులుగా కాలినడకన బయలుదేరారు.

ఎక్కడ బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు, ఎక్కడ బెంగుళూరు? తమ సొంతూళ్లకు చేరుకోవాలంటే రెండు మూడు వేల కిలోమీటర్లు నడవాలి! అయినా వాళ్ళు దూరాన్ని గురించి లెక్కలు వేసి ఆలోచించే స్థితిలో లేరు. బయలుదేరాలి, అంతే! బయలుదేరారు! ఉత్తర భారతానికి పోవాలంటే తప్పని సరిగా అటు చిత్తూరు ఇటు అనంతపురం మీదుగా పోవాల్సిందే! అంత విపత్కర వాతావరణంలోనూ ఆ పాదచారులకు మాస్కులూ అన్నపానీయాలూ అందించడానికి రోడ్ల పక్కన షామియానాలు వేసుకొని ఎన్నో మానవత్వపు పరిమళ సంఘాలు ముందుకొచ్చాయి. ఉడుతకు ఉడుతాభక్తి చందాన నేను ఆ షామియానాల కిందికి వెళ్లి, గుంపులు గుంపులుగా రోడ్డు మీద పసిపిల్లల్ని నడిపించుకుంటూ కొందరూ, భుజాల మీద ఎత్తుకొని కొందరూ మూటాముల్లెలతో నడుచుకుంటూ వొస్తున్న దృశ్యాలను చూసి భరించలేకపోయాను. గుండె తరుక్కు పోయింది.

నిండు వేసవి కాలం! తార్రోడ్లు నిప్పులు చిమ్మే కాలం. ఆ నల్లని రాకాసి నిప్పుల కోడ్డు మీద నడిచి నడిచి పాపం, చాలా మంది పాదాలు బొబ్బలు పోయాయి. భాష గాని భాష/ప్రాంతం గాని ప్రాంతం! ఎప్పుడు వీళ్లు బీహార్ పశ్చిమబెంగాల్ ప్రాంతాలకు చేరుకోవాలి? కొంతమంది బాలింతలు, కొంతమంది గర్భవతులు కొంత మంది వ్యాధిగ్రస్థులు! వీళ్లు వాళ్ల సొంతవూళ్లకు చేరుకోగలరా? దారి మధ్యలో ఎదైనా జరగొచ్చు కదా! అప్పుడు వీళ్లకు దిక్కెవ్వరు?

ఆలోచన చేయలేక పోయాను. చెప్పలేనంత ఆవేదనతో గుండెబరువైపోయింది. ఏమీ చేయలేని అసహాయ స్థితి. గుండెబరువును తగ్గించుకోడానికి రచయితగా నేను చేయగలిగింది, బాధను, ఆ పాదచారుల హృదయఘోషను అక్షరీకరించడమే!

నా కుమారుడు బెంగుళూరులో భవన నిర్మాణరంగంలో ఉన్నాడు. ఆ కారణంగా భవన నిర్మాణ కార్మికుల తాత్కాలిక వసతులు- రేకుల షెడ్లను చాలా సార్లు చూశాను. బెంగుళూర్‌లో మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్‌ను నిర్మింపజేసే గోద్రేజ్, సలార్‌పురియా, ప్రిస్టేజ్ వంటి కంపెనీలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క చోట 10-15 ఎకరాలతో 30-40 అంతస్తుల భవన సముదాయాలను కట్టే చోట – కార్మికుల కోసం 100-150 రేకుల షెడ్లను వేసి, ఏజెంట్ల ద్వారా ఇతర రాష్ట్రాల నుండి కార్మికులను సమకూర్చుకొని, వారికి ఆ షెడ్లల్లో వసతి కల్పిస్తారు. ఆ విధంగా వచ్చిన కార్మికులు, ఆ భవన నిర్మాణాలు అయిపోయేంత వరకు దాదాపు మూడు నాల్గు సంవత్సరాలు అక్కడే వుండి, మధ్య మధ్యలో తమ సొంతూళ్లకు పోయివచ్చే విషయాలన్నీ నాకు స్పష్టంగా తెలుసు. నేను కథలో పేర్కొన్న కార్మికులందరూ తెలుగు వాళ్లే! శ్రీకాకుళం జిల్లావాసులు! కరోనా కారణంగా అనాలోచితంగా అర్థరహితంగా లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత, భవన సముదాయాల యజమానులు, తమ భవన నిర్మాణ కార్మికులను పాశవికంగా తమ కాంపౌండు లోని షెడ్లల్లో నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేసిన తర్వాత నేను కథలో కథకునిగా వాళ్ల చెంతకు చేరుకొని వాళ్ల వెంట నడుస్తూ, వాళ్ల pain అనుభవిస్తూ, ఈ కథ రాశాను. ఆ pain లోనుంచే వెలువడిన కథనం కవితాత్మకమయింది.

ప్రశ్న 7: ‘అసలు రూపాలు’ కరోనా నేపథ్యంగా అల్లిన గొప్ప కథ. ఈ కథలోని డాక్టర్ సుబ్బయ్య పాత్ర కల్పిత పాత్ర? లేక మీ పరిచయస్థులోని వైద్య కుటుంబంలో సంభవించిన ఘటనలతో అల్లిన కథా? వివరించండి.

జ: కరోనా సమయంలో రాసిన మరొక కథ ‘అసలు రూపాలు’. ఆ సమయంలో సమాంతరంగా మానవత్వ పరిమళాలూ అమానవీయ దుర్గంధాలూ రెండూ వెల్లివిరిసాయి. కుటుంబాలతో అనుబంధాలూ, సుదూర ప్రాంతాలకు వెళ్లి బాగా సంపాదించాలనే అభిప్రాయం పట్ల వైముఖ్యతలూ పెరిగాయి. అన్నిటి కంటే ముఖ్యంగా కరోనా తాకిడికి గురైన రోగుల పట్ల తోట మనుషులు వ్యవహరించిన తీరుతెన్నులు, అమానవీయ చర్యలు మానవ జాతినే అసహ్యించుకునేలా చేశాయి.

నా కథలో డా॥ సుబ్బయ్య పాత్ర, పేరులో మాత్రం కల్పితమే కానీ నెల్లూరులో వాస్తవంగా అమానవీయంగా దారుణంగా తిరస్కరణకు గురై అనాథగా మరణించిన వొక డాక్టరు ప్రతిరూపంగా చిత్రించబడింది. వొక డాక్టరుకు ప్రతిరూపంగానే కాదు, ఆ సమయంలో సేవాదృక్పథంతో ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలందించి, ఆదే కరోనా మహమ్మరికి బలై చివరికి అంత్యక్రియలకు కూడా నోచుకోని ఎంతోమంది త్యాగమూర్తులకు ప్రతిబింబమే డా॥ సుబ్బయ్య పాత్ర.

ప్రశ్న 8: ‘గత్తెంతరం ల్యాక’ కథని మాండలికంలో నడిపారు. రైతుల వ్యథని చాటారు. వ్యవసాయం బాగుపడాలంటే ఏం చేయాలో ఓ రైతు చేతే చెప్పించారు. ఈ కథని మాండలికంలో చెప్పడమే కథకి బలమైందని, లేదంటే ఈ ఇతివృత్తంపై వచ్చిన అనేక కథలలో ఒకటిగా మిలిగిపోయేదని పాఠకులకు అనిపిస్తుంది. ఈ కథని మాండలికంలో నడపాలని ముందే అనుకుని రాశారా లేక కథనాన్ని, పాత్రల స్వరూప స్వభావాలని బట్టి మాండలికం ఎంచుకున్నారా?

జ: ‘గత్తెంతరం ల్యాక ‘ కథ, మాండలిక కథ. ఆ కథను మాండలికంలో రాయాలన్న అభిప్రాయంతోనే కథకు ఆ విధమైన టైటిల్ పెట్టాను. ఆ కథను, దండిగానే భూములుండి, స్వయంగా వ్యవసాయం చేసే అచ్చమైన రైతు చేత చెప్పించాను, పల్లెల్లో వ్యవసాయాన్నే ప్రాణప్రదమైన వృత్తిగా చేసుకొని జీవించే రైతు, తమ ప్రాంత సహజమయిన భాషనే మాట్లాడుతాడు. ఆ భాషలోనే, తన సుఖదుఃఖాలనూ కష్టాలనూ కన్నీళ్లనూ ఆనందాలనూ అనుభూతులనూ సరసాలనూ సల్లాపాలను వెళ్ళబోసుకుంటాడు. అటువంటి రైతు జీవితాన్ని అతని భాషలో చిత్రించినప్పుడే ఆ జీవితం ఉన్నతీకరించబడి, సహజత్వాన్ని నిష్కల్మషతనూ నిజాయితీని ఆవిష్కరించ గలుగుతుంది.

ప్రశ్న9: ‘నకిలీ మందులు’ కథలో నవలని అంకితం పొందిన వ్యక్తి మేధావి అయితే కావచ్చు, కానీ మనిషి కాలేకపోయాడు. తమలో ఒకడనుకుని ఆత్మీయతను పంచుకోవాలని నవలని అంకితమిస్తే, అధికార దర్పం చూపిన ఆ వ్యక్తి క్షమార్హుడు కాదు. ఈ కథకి ఆ పేరు ప్రతీకాత్మకమని అనిపిస్తోంది. ఈ కథ నేపథ్యమేమిటో పాఠకులకి వివరిస్తారా?

జ: ‘నకిలీ మందులు’ కథ ప్రస్తావనకు వస్తేనే నా రక్తం ఉడుకుతుంది. ఇది, నా ‘ఒక రచన’ను అంకితమిచ్చిన సందర్భంలో జరిగిన బాధామయ యథార్థ సంఘటనకు బింబ ప్రతిబింబ రూపం. ఇందులోని కథాంశం, దూరపుకొండలు నునుపుగా వుంటాయని, తెల్లనివన్నీ పాలని భ్రమించిన నా అవివేకానికి జరిగిన అవమానమే కానీ వేరు కాదు. ఆ నకిలీ బహుజన మేధావికి అంకితమిచ్చిన రచనా వుంది, రచయితనూ వున్నాను, అంకితం తీసుకున్న మనిషీ ఉన్నాడు. ఇంతకన్నా ఇక్కడ వివరంగా చెప్పవలసిన అవసరం లేదు. వివరాలన్నీ కథ చెప్పుతుంది. అయితే వొక్కటి చెప్పగలను. బహుముఖాలతో నటించే మనుషుల కంటే జంతువులే ఎంతో గొప్పవి. అలా నటించి, నమ్మకద్రోహం చేసింది చాలక, నేనే నమ్మకద్రోహం చేసినట్లు ప్రచారం చేసి, నేను కోర్టుకు వెళ్లితే, ఆర్బిట్రేటర్‌ని కొని పడేసి, 14 సంవత్సరాలు నన్ను వేదించిన వాళ్లున్నారు. ఇది మరొక సాహిత్య వస్తువు, ఈ వస్తువును గురించి కూడా ఆలోచిస్తున్నాను. ఇటువంటి వాళ్లు చాలామంది ఉన్నారు, ఉంటారు జాగ్రత్త అని సమాజానికి తెలిపితే తప్ప, లోపల గూడు కట్టుకొన్న వేదన చల్లారదని భావిస్తున్నాను.

ప్రశ్న 10: శ్రమశక్తిని చాటే ఉంగటం తెగింది..కథలో – సుంకన్నని ఆదర్శంగా తీసుకుని, ‘విద్యావంతులందరూ తమ వర్ణ వర్గ స్వభావాన్ని వదులుకోవాలని అంటాడు రచయిత అమర్‍నాథ్. ప్రస్తుత సమాజంలో ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందా? ఈ ఆశయాన్ని సాకారం చేయాలంటే ఏమేం చెయ్యాల్సి ఉంటుందని మీరు భావిస్తున్నారు?

జ: ‘ఉంగటం తెగింది’ కథ కూడా, అనంతపురంలో పాపులర్ షూమార్టు దగ్గర చెప్పులు కుట్టే వ్యక్తికి ఎదురయిన అంశం, విద్యావంతులు, సంపన్నులు తమ వర్గ వర్ణ స్వభావాన్ని వదులుకోవాలని కథలో అమర్‌నాథ్ అంటాడు. వర్గ వర్ణస్వభావాలు మొత్తం మాసిపోవడం ఈ సమాజంలో సాధ్యం కాకపోవచ్చు. అయితే ఆ స్వభావాలు సర్వత్రా చెల్లుబాటు కావని, ఆ స్వభావాలను ప్రదర్శించడానికి పోతే చెంపపెట్టులూ తిరస్కారాలూ ఎదుర్కోక తప్పదు, కథలోని సుంకన్న ప్రతిస్పందనే అందుకు నిదర్శనమని సూచించడమే కథ అంతస్సారం.

ప్రశ్న11: సాధారణంగా రచయితలకి తాము రాసే అన్ని రచనలు నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీకు బాగా నచ్చింది? ఎందుకు?

జ: నిజమే! రచయిత తాను రాసిన ప్రతి కథా మంచిదే అనుకుంటాడు. అనుకుంటే తప్ప, పుస్తకంలో కథలన్నిటిని అచ్చు వేసుకోలేడు. ఇతరులు, ఈ సంవత్సరంలో వచ్చిన మంచి కథలు అని, అదనీ ఇదనీ కథా సంకలనాలు తెస్తున్నారు. వాళ్ల దృష్టిలో అవి మంచి కథలు అయ్యుండొచ్చు. అంతమాత్రాన అవన్నీ మంచి కథలని, అవే మంచి కథలని ఎవరూ సర్టిఫికెట్ ఇవ్వరు. ఆ విధంగానే ఒక రచయిత తాను వేసుకున్న కథాసంపుటిలోని కథలన్నీ మంచివే అని తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకున్నా వాటి మంచి చెడ్డలను గురించి నిర్ణయించేది పాఠకులే! అయితే ఈ పాఠకులు కూడా తమ తమ అభిరుచులు, దృక్పథాల మేరకే, నచ్చిన కథలను మంచి కథలని భావిస్తారు.

ఈ సంపుటిలో నేను ఇష్టంగా చెప్పుకునే కథ’ గీతలు చెడిపి..’. అందుకు, నా దృష్టి కోణంలో వొక కారణముంది.

ఈ సమాజంలో ఎవరెవరు ఏయే పనులు చేయాలో వర్ణవ్యవస్థ ఎప్పుడో నిర్ణయించి, ఎవరు చేయరాదో ఆంక్షలు విధించింది. సమాజం నిరంతర చలనశీలకం. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం, అందుకే ఎన్నో ఆంక్షలు ఛేదింపబడుతున్నాయి. ఎన్నో అసహజనమైన, స్వార్థచింతనతో కొన్ని శక్తులు కల్పించి. సమాజంపైన బలవంతంగా రుద్దిన కట్టుబాట్లను తెంచుకొని బయటకి వొస్తున్నారు. మొన్నటి వరకు ఉదాత్తమయినదిగా భావింపబడిన కావ్యవస్తువు మారి, ప్రజాస్వామికమైంది. చుట్టూ వున్న సమాజంలోని ప్రజలందరి జీవితాలే కథా, కావ్యవస్తువులని, అదే ఆధునిక సాహిత్యమని ఈ రోజు మనమంతా భావిస్తున్నాం.

అయితే ఇన్ని మార్పులు జరిగినా, జెండర్ పరంగా కొన్ని పనులు మగవాళ్లు మాత్రమే చేయగలిగినవని మనమింకా భావిస్తున్నాం. ముఖ్యంగా ఈ భావనలు గ్రామీణ జీవితంలో బలంగా ఉన్నాయి. ఇటువంటి ఈ సామాజిక సందర్భంలో, ఒక పల్లెలో కులవృత్తిగా క్షవరం (మంగలి పని) చేసే ఇంటిలోని మగవాడు అకస్మాత్తుగా అంగవికలుడయిపోయినప్పుడు, ఇంట్లోవున్న అమ్మా అవ్వాతాతల పోషణ కోసం ఆ యింటి ఆడపిల్లలు, తమ తండ్రి వృత్తిని చేపట్టడం వొక సంచలన వార్త. యవ్వనంలోకి అడుగుపెట్టిన ఆడపిల్లలు, మగ దురహంకార సమాజం గీసిన గీతల్ని చెడిపి, సామాజిక హద్దుల్ని దాటి, మగవాళ్లకు క్షవరం చేయడానికి కల్తీ కత్తెర్లను చేతపట్టుకొని కుల వృత్తిలోకి దిగిన సందర్భం కథగా తయారయింది. అనూచానంగా వస్తున్న ఆంక్షల్ని – గీతల్ని చెడిపిన కథ ఇది. ఈ గీతలు నేను నా ఆలోచనతో చెరపలేదు. ఇందులో పాత్రలయిన యువతులే వీరనారీమణులై తమను ముందుకు కదలనీయకుండా గీసిన గీతల్ని తామే చేదిపేసిన వాస్తవిక వృత్తాంతం ఇది. అందుకే ఈ కథ నాకు బాగా నచ్చుతుంది.

ప్రశ్న12. ఈ సంపుటిలోని ఏ కథైనా రాయడం కష్టమనిపించిందా? ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?

జ: ఈ సంపుటిలోని ‘కాషాయ వైద్యం’ కథను రాస్తున్నప్పుడు ప్రస్తుత మత రాజకీయాల కాలంలో కొంచెం బెరుకు బెరుకుగా మనసు కొట్టుమిట్టాడింది. అయినా ధైర్యం చేశాను. రచయితగా భయపడిన వాడు ప్రజా పక్షం వహించలేడని నాలో నేను తర్కించుకొని, అంతకు ముందు – తిక్కోని చేతిలో రాయి, స్వాములు, వెట్టికి వెట్టి, కంచమ్మీద కట్టడి – మొదలయిన కథలూ, కథానికలూ, కాలం కతలూ; పెన్నేటి మలుపులు (నవల), సాధన (నవల), ముడి (నవల) రాసినప్పుడు లేని పిరికితనం ఇప్పుడెందుకు అని నన్ను నేను ప్రశ్నించుకొని ఈ కథను రాసి విశాలాక్షి మాస పత్రికకు పంపాను. పంపిన మరుసటి నెలలోనే పత్రిక, ఈ కథను ప్రచురించింది. సంకలనంలో వేస్తున్నప్పడు మిత్రుల సూచన ప్రకారం మూడు నాలుగు చోట్ల మత సంబంధమయిన పేర్లను మార్చి ఈ కథను యథాతథంగానే ఈ సంపుటంలో తెచ్చాను.

ప్రశ్న13. ‘గీతలు చెడిపి..’ పుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా ఉంటే వాటిని పంచుకుంటారా? ఈ సంపుటిని పాఠకులకు ఎలా దగ్గర చేశారు?

జ: పైన పేర్కొన్న అంశాలే ఈ ప్రశ్నకు సమాధానాలుగా నేను భావిస్తున్నాను.

ఈ సంపుటనే కాదు ఏ కథా సంపుటిని అయినా పాఠకుల దగ్గరికి తీసుకొని పోడానికి మొన్నటి వరకూ ప్రింట్ మీడియానే ప్రధాన వాహిక, ప్రసిద్ధ పత్రికల సాహిత్యం పేజీలతో ప్రసిద్ధులు సమీక్షలు రాసి వాటి ద్వారా చాలా మందికి కథా సంపుటిని గురించి తెలియజేశారు. తెలిసిన తర్వాత ఆసక్తి వున్న కొందరు పాఠకులు సంపుటిని కొని చదివారు. ఇప్పుడయితే సామాజిక మాధ్యమాల ద్వారా సాహిత్యాభిలాషులందరికీ పుస్తకం గురించి బాగా తెలిసే అవకాశముంది. ఇంకా అంతకంటే కూడా ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు సాహిత్యాభిలాషు లందరికీ చక్కని రివ్యూల ద్వారా ‘సంచిక’ వంటి ప్రసిద్ధ అంతర్జాల పత్రికలు ఈ కథా సంపుటిని పాఠకుల దగ్గరికి చేరుస్తాయని భావిస్తున్నాను..

ప్రశ్న14. రచయితగా మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలు ఏవైనా సిద్ధమవుతున్నాయా?

జ: రచయితగా నా భవిష్యత్ ప్రణాళిక – ఇంకా వొక యాభై కథలు, నూతన ఆర్థిక సామాజిక పరిణామ ప్రభావాలను, ప్రభుత్వాలు అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను, ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే హామీలను, అనవసర సంక్షేమ పథకాల వల్ల జరుగుతున్న అనర్థాలను ఇంకా ఇతరేతర సామాజిక సమస్యల నేపథ్యంగా రాయాలని అనుకుంటున్నా. ఈ ప్రశ్నావళిలో 9వ ప్రశ్నకు సమాధానంగా చెప్పిన విషయాలతో వొక అంశం పైన సమీపకాలంలో వొక నవల రాయబోతున్నాను. వాటికంటే ముందు నా జీవిత చరిత్రను, యథార్థ కథనాత్మక స్వీయ చరిత్రగా రాయాలనుకొని ఆ దిశగా నడుస్తున్నాను.

~

సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు డా. శాంతి నారాయణ గారు.

డా. శాంతి నారాయణ: ఈ ఇంటర్వ్యూ ద్వారా అనేక విషయాలను ప్రస్తావనకు తెచ్చి పాఠకులకు నా అభిప్రాయాలను, సాహిత్యదృక్పథాలను, నా రచనలను తెలియజేయడానికి చక్కని అవకాశం కల్పించిన ‘సంచిక’ టీమ్ సభ్యులకు, ముఖ్యంగా కస్తూరి మురళీకృష్ణ గారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను.

***

గీతలు చెడిపి.. (కథలు)
రచన: డా. శాంతి నారాయణ
ప్రచురణ: విమలా శాంతి ప్రచురణలు, అనంతపురం
పేజీలు: 200
వెల: 250/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
రచయిత: 8074974547
ఆన్‌లైన్‍లో:
https://www.telugubooks.in/te/products/geethalu-chedipi

 

 

 

~

గీతలు చెడిపి.. పుస్తక సమీక్ష లింక్:
https://sanchika.com/geetalu-chedipi-book-review-kss/

Exit mobile version