Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రచయిత్రి, అనువాదకురాలు డా. రాజేశ్వరి దివాకర్ల ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘పగడాల దీవి’ అనే కథానికల సంపుటి వెలువరించిన డా. రాజేశ్వరి దివాకర్ల గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం డా. రాజేశ్వరి దివాకర్ల గారూ.

డా. రాజేశ్వరి దివాకర్ల: నమస్కారం.

~

ప్రశ్న 1. మీరు రచించిన 56 కథానికల సంపుటికి శీర్షికగా 31వ కథ పగడాల దీవిపేరునే ఎంచుకోవడంలో ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?

జ: పగడం ధరించడం మంచి ఫలితాలను కలిగిస్తుంది. ఆ కథలో తల్లి పిల్లలకు పాఠ్యాంశాల చదువుతో బాటు వ్యాయామము, క్రీడలు, చర్చా స్పర్థ వంటి విషయాలలో ప్రోత్సాహాన్ని కలిగించింది. వారి ఉన్నతికి దోహదం చేసింది. ఆకాశవాణి ‘పగడాల దీవి’ కార్యక్రమ నిర్వాహకురాలిగా పేరు పొందింది. యువజనులకు చదువుతో ఇతర విద్యల పట్ల నూతనోత్సాహము కలిగించడానికి కథానుసారంగా ఆ పేరును ఉంచాను.

ప్రశ్న 2. కవయిత్రిగా, రచయిత్రిగా, అనువాదకురాలిగా మీ సాహితీ ప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా? మొదటగా ఏ ప్రకియతో సాహిత్య వ్యాసంగం మొదలుపెట్టారు? ఎప్పుడు? మీ కథా రచన గురించి వివరిస్తారా?

జ: మా నాన్నగారు దివాకర్ల వెంకటావధాని గారు. తల్లిగారు శ్రీమతి చంద్రావతి గారు. నాన్న గారు సాహిత్యమే జీవితంగా మనుగడ సాగించారు. వారు ఇంట్లో ఉన్న కొద్ది సమయం, కవి పండితుల చర్చలు, పరిశోధక విద్యార్థుల తోడి మార్గదర్శకత్వం, తమ గదిలో కూచుని పుస్తక పీఠికలను రాయడం, లోనికి వచ్చినప్పుడు ఫోల్డర్ బెడ్డింగ్ సద్దుకుని బయట ఊర్లకు ఉపన్యాసాలకు వెళ్ళడం జరిగేది. నిరంతరమైన సాహిత్య వాతావరణం రచనాభిలాషను కలిగించింది.

ప్రత్యేకించి చెప్పాలంటే మా ముగ్గురత్తయ్యలలో చిన్నత్తయ్య ఈరంకి బాలా త్రిపుర సుందరి, చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిగారి కుటుంబంతో గల సాహచర్యం వలన వినికిడి జ్ఞానంతో కవయిత్రిగా పాటలను, పద్యాలను రాసింది. హైదరాబాదులో అన్నగారి ఇంటికి (మా నాన్నగారి) వచ్చినప్పుడల్లా ఆమె కవిత్వాన్ని విని, ఆకర్షితురాలిని అయ్యాను.

నేను విద్యార్థినిగా రాసిన కథలు, కవితలు, ఆనాటి పత్రికలు, కృష్ణా పత్రిక, చుక్కాని, సైనిక సమాచార్, వంటి వాటిలో ముద్రణ పొందాయి. నా రచనాభి లాషను గుర్తించి నాన్నగారు ప్రోత్సహించారు.

నా విద్యాభ్యాసం అంతా తెలుగు మాధ్యమం లోనే జరిగింది. నేను మాడపాటి హనుమంత రావు బాలికల ఉన్నత పాఠశాల ముగిసిన తరువాత రాజా బహద్ధుర్ వెంకట రామ రెడ్డి కళాశాలలో బి.ఏ., ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఏ., అటు పిమ్మట బెంగళూరు విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి చేసాను.

నా వివాహానంతరం, భర్తగారి ఉద్యోగ రీత్యా బెంగళూరులో స్థిరపడడం జరిగింది.

బెంగళూరు విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం ప్రత్యేక స్థాపన 1974లో జరిగింది. అంతకు పూర్వం 1969లో సెంటర్ ఆఫ్ కన్నడ స్టడీస్ విభాగంలో ఆనర్సు, స్నాతకోత్తర తరగతులకు తెలుగును బోధించడానికి డా. తంగిరాల సుబ్బారావుగారు వచ్చి చేరారు. బెంగళూరు విశ్వవిద్యాలయంలో 1974లో తెలుగు స్నాతకోత్తర తరగతులు ఆరంభం అయ్యాయి. డా. టి. వి. సుబ్బారావుగారు 1976 లో తెలుగు విభాగానికి అధ్యక్షులయ్యారు.

నేను తంగిరాల వారి మార్గదర్శకత్వంలో 1974లో పరిశోధక విద్యార్థిగా చేరాను. నా సిద్ధాంత వ్యాస అంశం ‘తెలుగులో ప్రబంధ (కావ్య) రూపమును పొందిన సంస్కృత నాటకాలు’. తెలుగులో సంస్కృత నాటకాల అనువాదం 1860 వ సంవత్సరం వరకూ జరుగలేదు, కోరాడ రామచంద్ర శాస్త్రిగారి మంజరీ మధుకరీయం ఆధునిక నాటక శాఖకు మూలమైన గ్రంథం. కందుకూరి వీరేశ లింగంగారి వ్యవహార ధర్మబోధిని మొదట ప్రదర్శన పొందిన నాటకం.

నన్నయ తన భారత అవతారికలో రసాన్విత కావ్యనాటకముల్ పెక్కుజూచితి అనడాన్ని బట్టి, నన్నయ కాలానికి నాటక ప్రదర్శనలుండేవని అర్ధం చేసుకొవచ్చు. కాని ఆధునిక కాలం వరకూ నాటకాలు అనువదింప బడక పోడానికి గల కారణాలను పండితులు పేర్కొన్నారు.

నాటకం అభినయ ప్రధానం ప్రదర్శనా ప్రాముఖ్యం కలిగినది సంభాషణలతో కూడినది. సూచ్యాంశాలకు అర్థోపక్షేపములుండాలి. రాజులు సభా భవనాలలో సంస్కృత నాటకాలను చూచి ఆనందించేవారు. రాజాశ్రయంలో ఉన్న కవులు గద్యప్రధానమైన నాటకానువాదాలను చేయడానికి తమ పాండిత్యానికి భంగం కలుగుతుందని భావించి ఉండవచ్చు. ఇక సంస్కృత నాటకాలకు పాత్రోచిత భాష ఉంది. తెలుగులో ఆనాడు గ్రామ్యం నిషిద్ధం.

ఇక నాటకం దృశ్యం. కావ్యం శ్రవ్యం. కావ్యాలు వర్ణనా ప్రధానమైనవి దృశ్య శ్రవ్య కావ్య ప్రక్రియలు భిన్నమైనవి.

తెలుగులో సంస్కృత నాటకాలను అనువదించడానికి పూనుకున్న కవులు నాటక రూపంలో కాక కావ్య రూపంలో అనువదించారు.

మొదటగా మంచన కేయూర బాహుచరిత్ర, (రాజశేఖరుని విద్ధ సాలభంజిక), క్రీడాభిరామము (త్రిపురాంతకుని ప్రేమాభిరామము), పిల్లలమర్రి పినవీరన శృంగార శాకుంతలము (అభిజ్ఞాన శాకుంతలము), ప్రబోధ చంద్రోదయము (కృష్ణ మిశ్రుడు), బొడ్డుచెర్ల చినతిమ్మయ ప్రసన్న రాఘవ నాట్య ప్రబంధము. (జయదేవుడు) మురారికృత అనర్ఘ రాఘవము, బిజ్జుల తిమ్మభూపాలుడు ఈ కావ్యాలను గ్రహించి అనువాద విధానాలను విపులంగా రాసాను.

నా సిద్ధాంత వ్యాస గ్రంథం ప్రచురణ పొందింది. నా పరిశోధన 1974 నుంచి 78 వరకు పూర్తి కావించాను.

నేను. పి హెచ్ డి. విద్యార్థినిగా బెంగళూరు విశ్వవిద్యాలయంలో ఆరంభం అయిన ప్రథమ స్నాతకోత్తర విద్యార్థులుకు పాఠ్య బోధన కావించాను. పదవిని పొందిన తరువాత కర్నాటక కాలేజియేట్ ఎడ్యుకేషన్‌లో ప్రభుత్వ కళాశాలలలో తెలుగు ఉపన్యాసకిగా వృత్తిని ఆరంభించాను.

ఉపన్యాసకిగా ఉంటూనే తెలుగుపరిశోధక విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించాను. నా మార్గదర్శనలో ఏడుగురు పి.హెచ్.డి. పట్టాలను పొందారు.

కవిత్వం నా అభిలాష. నాలోని అంతరంగ మథనాన్ని వచన కవిత్వంలో విద్యార్థినీ దశనుండీ వెలార్చుతూనే ఉన్నాను. నా కవిత్వం సమాజ ముఖంగా స్త్రీ కి కలిగిన సంవేదన, ఆకాంక్ష ఆశయాలను వెల్లడిస్తుంది. స్త్రీల అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తుంది. కుటుంబ బాంధవ్యాలను స్పృశిస్తుంది. నేను ‘నక్షత్ర దాహం’, ‘నీరు స్తంభించిన వేళ’, ‘భూమి తడిపిన ఆకాశం’ అని మూడు సంపుటులను ప్రకటించాను. నా కవితలు ఆంధ్ర ప్రదేశ్, విద్యార్థి, తదితర తెలుగు పత్రికలలో ప్రచురితం అయ్యాయి.

నా కవిత్వ రచన ఈనాటికీ కొనసాగుతోంది. అంతర్జాల వేదికలు సాహితీ సిరికోన, కవితావేదిక లలో కవితలను చదివాను. ఈ నాడు పత్రిక వారు నిర్వహించిన కరోనా కవితల పోటీలో నా కవిత ‘చేతులు’ ఎన్నిక అయింది (2020). వంగూరి ఫౌండేషన్ వారి ఉగాది కవితలలో నా కవిత ‘అందాల రాక్షసి’ ఎన్నికయింది. ‘ఒకసారి చూడండి’ వాట్సప్ గ్రూప్ వారు నిర్వహించిన దసరా కవితల పోటీలో నా కవిత బహుమానం పొందింది. ‘సంచిక’ ఉగాది కవితల పోటీలో (2024) ఉత్తమ కవితల వర్గంలో బహుమతిని పొందింది.

నేడు సర్వత్రా విద్యా ఉన్నతులకు అవకాశం కలిగి, సమాన హక్కుల కోసం ఆవేదన వ్యక్తం చేస్తున్న కొందరు స్త్రీవాదుల కంటే, చీకటిలో వెలుగును వెతుకుకుని తమ నీడలను దాచుకుని పురోగమించిన నిన్నటి స్త్రీమూర్తుల చరిత్ర నాకెంతో ఆత్మీయమౌతుంది. అటువంటి స్త్రీల స్మృతిలో నేను రాసిన కవిత ‘నిన్నటి వాళ్ళు’ దానినిక్కడ ఉదహరిస్తాను.

‘నిన్నటి వాళ్ళు,
రాసుకునేందుకు
కాగితం కలమైనా లేకున్నా,
గడ్డి పోచ నందుకుని వెలుగు దారిని వెతికారు.
గృహ స్వేద మాధ్యమంలో
అక్షరాలను ఒత్తిడి చేసారు.
అచ్చమైన అభిమానవతులు,
చాప కింద నీటి బరువును మోసారు.
రచ్చ గెలిచే కోరికలకు, గడప దాటకనే
నాందిని పలికారు.
బాల వితంతువులు, ఆత్మ దుఖ గాయాలను
శరీరం పిట్ట గోడ మీద ఆరేసు కున్నారు.’

నా మొదటి కవిత్వ సంపుటుల ఆవిష్కరణ బెంగళూరు చిత్ర కళా పరిషత్తు ప్రాంగణంలో జరిగింది. ఆవిష్కర్త శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు. వారు శ్రీమతి ఇందిరా దేవి ధన్ రాజ్ గిరి గారితో విచ్చేసారు.

నా పి.హెచ్.డి. పరిశోధనానుభవం సాహిత్య విషయిక పరిశోధనలకు దారి తీసింది. పరిశోధన నాకు ఆసక్తిని కలిగిస్తుంది. నా వ్యాస రచన సరికొత్త అంశాలను స్పృశించాలని అభిలషిస్తుంది. వాజ్మయి పత్రికలో ప్రకటించిన అక్క మహాదేవి ఆధునికత, వడ్డారాధన లోని కధలు, తెలుగు కన్నడ కవయిత్రులు ఇత్యాది వ్యాసాలు ఆదరణను పొందాయి. నేను రాసిన తులనాత్మక వ్యాసాలు వాజ్ఞ్మయి సంచికలోనూ, జాతీయ చర్చా గోష్ఠులలో చదివిన వ్యాసాలే కాక, ఇతర సంస్థల ప్రత్యేక సంచికలలోనూ, ప్రచురితం అయ్యాయి. పరిశోధకు రాలిగా వ్యాసాలతో బాటు ‘ఆధునిక కర్నాటక తెలుగు సాహిత్యం సంస్కృతి’ గ్రంథాన్ని ప్రకటించాను.

బెంగుళూరు లోని శ్రీరస, తెలుగు విజ్ఞాన సమితి, అరసం, సాహిత్య సాంస్కృతిక సంఘాలలో కార్యదర్శిగా వ్యవహరించాను. వెలువరించిన సంచికలకు సంపాదకత్వం వహించాను. ఆయా సంఘాలు నిర్వహించిన సభలకు వ్యాఖ్యాతగా కార్యక్రమ నిర్వహణను కావించాను. తిరుపతిలో అన్నమాచార్యుల జయంతి సభలలో ప్రసంగించాను. సాహిత్య అకాడమీ జాతీయ కవితా గోష్ఠులలో పాల్గొన్నాను. రచయితలు కోరిన గ్రంథాలకు పీఠికలను రాసాను. గ్రంథ సమీక్షలు కావించాను.

నేను ప్రభుత్వ కళాశాలలో వృత్తి నిర్వహించడం వల్ల కన్నడ పరీక్షను తప్పక రాయాలి. అందువల్ల కన్నడ భాషను నేర్చుకోవడం జరిగింది. నేను ఎం.ఏ. విద్యార్థినిగా ఉన్నప్పుడు సైతం కన్నడ సాహిత్యాన్ని చదివినందువలన కొంత సానుకూలత కలిగింది. అందువల్ల అనువాద రంగంలో ప్రవేశం కలిగింది. ‘అక్క మహా దేవి’, ‘ఊరు వాడ’, ‘కువెంపు మోనోగ్రాఫ్’ ల అనువాదాలు కన్నడము నుండి తెలుగుకు సాహిత్య అకాడమీ ప్రచురించింది. ఎన్ గోపి గారి ‘కాలాన్ని నిద్రపోనివ్వను’ తెలుగు కవిత్వ సంపుటి కన్నడ అనువాదమును కూడా అకాడమీ ప్రచురించింది. జె. బాపు రెడ్డి గారి ‘అనంత సత్యాలు’ సంపుటిని కన్నడ అనువాదం కావించాను. తదితరంగా కొన్ని తెలుగు – కన్నడ, కన్నడ- తెలుగు అనువాదాలను చేసాను.

బెంగళూరు బసవ సమితి వారు ‘బసవన్న సమగ్ర వచనాలు’ను కన్నడము నుండి తెలుగు అనువాదమును ప్రచురించారు. ప్రత్యేకించి ‘వచనాలు’ అనువాదములో పాలు పంచుకున్నాను. బసవ సమితి వారి ‘బసవ పథం’ తెలుగు సంచికకు సంపాదక బాధ్యతలను కొన్ని సంవత్సరాలు నిర్వహిచాను. వీరప్ప మొయిలీ గారి ‘రామాయణాన్వేషణము’ తెలుగు అనువాదంలో సహభాగం వహించాను. సాహిత్య అకాడమీ వారి జాతీయ సమ్మేళనాలలో తదితర భాషల కవితలను కన్నడ భాషకు అనువదించి భాషా సామరస్యానికి తొడ్పడ్డాను. భల్కి వీరశైవ కర్ణాటక వారు ప్రచురించిన గ్రంథాలకు సంపాదకత్వం వహించాను.

ప్రపంచ తెలుగు మహా సభల వారు రాసి ఇవ్వమన్న ‘ఆధునిక కర్ణాటక తెలుగు సాహిత్యం-సంస్కృతి’ని గురించిన గ్రంథాన్ని నా వ్యక్తిగత కారణాల వల్ల సకాలానికి అందజేయలేదు. 2014లో స్వయంగా ముద్రణను కావించాను.

నవ తెలంగాణా వారు ప్రచురించిన ‘ఆత్మ వృత్తాంత’ కన్నడ నవల అనువాదం, ‘ఆత్మకథ’ (మూల రచయిత్రి రజనీ నరహళ్ళి) వెలువడింది.

ఇలా సక్రియాత్మకంగా ఆత్మవంచన లేకుండా కావిస్తున్న నా సాహితీ యాత్ర జీవితంలో కలిగిన విపర్యాసానికి కుంటువడింది. నా భర్త డెమెన్షియా వ్యాధికి గురి కావడంతో నా దృష్టి వారిని గురించిన ఆరోగ్య విషయికంగా కుంచించుకు పోయింది. ఒంటరిగా ఉండడం కష్టం కనుక అమెరికా జీవితం ఆరంభం అయింది. అక్కడకు వెళ్ళాక అంతర్జాల వేదికల పరిచయం కలిగింది. వాటిలో ముఖ్యంగా శ్రీ గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారి సాహితీ సిరికోన, శ్రీ నవీన్ చంద్ర గారి వేదికలు ప్రధానమైనవి. సాహితీ సిరికోన గల్పికా రచన పోటీలకు సుమారు 20, తదితరంగా మరొక 40 చిన్ని గల్పికలను రాసాను. అడ్మిన్‌గా ఒక సంవత్సరం పాటు ఏరోజు కారోజు వాక్స్థలి విశేషాలను క్రోడీకరించాను. కెనడా నవీన చంద్రగారి సాహితీ యాత్ర, కథా, కవితా వేదికలలో అవధాన పృచ్ఛకత్వంలో క్రమంగా పాల్గొన్నాను. వారు ప్రచురించిన కథా, కవితా సంపుటాలలో నా రచనలు చోటు చేసుకున్నాయి.

నా కథా రచన గురించి ప్రత్యేకించి వివరించాలంటే, నేను రాసిన కథలు ఆంశిక ప్రాధాన్యతతో కూడినవి. అనుభవాత్మకమైనవి. నా కవిత్వం కూడా అను భావముతో కాక అనుభవాన్ని వ్యక్తం చేస్తుంది. ఊహాలోక ప్రయాణము, కథలలో మెలికలను తిప్పగలిగిన కాల్పనికత నా రచనలలో కనుపించదని చెప్పాలి. కవికైనా కథకునికైనా లోకానుభవము, లోక స్వభావ విమర్శనా శక్తి కావాలి. అటువంటి లౌకికతా దృష్టి నాలో విస్తృత ప్రమాణాలను తాకదు. జీవితం విస్మయావహమైనది. సమయ ప్రజ్ఞ కథలకు చాలా అవసరం.

ప్రశ్న 3. మీకు కవిత/కథానిక/అనువాదం – వీటిలో ఏది వ్రాయడం సులువని అనుకుంటారు? ఎందువల్ల?

జ: కవిత రాయడం సులువు. ఒక భావన కలిగిన వెంటనే అక్షర రూపంలో పెట్టాలన్న ఆతృత కలుగుతుంది. ఆ భావనకు సరియైన పదాలు, వచన అన్వయం కుదిరిన తక్షణమే రాస్తాను. కథకు విస్తృత ప్రణాళిక అవసరం. అనువాదం ఆలోచన ప్రధానమైనది. రెండు భాషలు తెలుస్తే చాలదు. పరస్పర భాషల జాతీయ వినిమయము, నుడికారాల సంబద్ధత కుదరాలి. అనువాదం సులువు కాదు. మూల స్వారస్యం భంగ పడకుండా జాగ్రత వహించాలి.

ప్రశ్న 4. వ్యవహారంలో షార్ట్ స్టోరీని తెలుగులో అందరూ కథ అనే అంటున్నా, మీరు కథానిక అని ఎందుకు అన్నారో వివరిస్తారా?

జ: కథకు ప్రాణం, సంఘటన, సంఘర్షణ, నిర్మాణ సౌష్టవం, కల్పనలు ప్రథానం. నా కథలు ఆంశిక ప్రథానమైనవి. ఆ అంశాలు. ఒక భావాన్ని ప్రతిపాదిస్తాయి. ఒక ఆదర్శాన్ని వెల్లడించే ప్రయత్నం జరిగింది. ఈ దృష్టి కోణం కథానికలు అనడానికి ప్రేరేపించింది.

ప్రశ్న 5. కథానికకి సంబంధించి – వస్తువు, శిల్పం, శైలి లలో మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారో చెప్తారా?

జ: శిల్పం అనే మాట లోతైనది. వస్తువు సహజమైనది. నాశైలి సరళమైనది. క్లుప్తమైనది.

ప్రశ్న 6. “ఈ కథానికల్లో ముగింపు ఏ మాటా చెప్పదు. ఆ సన్నివేశం ఇంకా కొనసాగుతున్నట్లు.. లేదా ఏదో మలుపు తిరిగి ముందుకు వెళ్తున్నట్లుగానో కథానికలని ఆపేయటం.. తదుపరి సన్నివేశాన్నిపాఠకుల ఊహాశక్తికి వదిలేయడం.. ఇలాంటి సృజనాత్మక శక్తిగల రచయితలకే సాధ్యం” అని వ్యాఖ్యానించారు శ్రీ ఉలి తమ ముందుమాటలో. కథానికలని ఇలా ముగించటం మీ శైలిగా లేదా మీ ముద్రగా పరిగణించవచ్చా?

జ: ఉలి గారు చెప్పిన మాట రచయితపై గల అభిమానాన్ని సూచిస్తుంది. నేను పుటలకొద్దీ కథలను రాయలేక పోవడం బలహీనత. దానినే బలంగా వారు ప్రకటించారు.

ప్రశ్న 7. అయిదో ఆరో తప్పితే, మిగతా కథలన్నీ సుమారు రెండు – రెండున్నర పేజీలలో ముగిసాయి. ఎంచుకున్న ఇతివృత్తాలకీ, సన్నివేశాల కల్పనకీ, క్లుప్తత ఆటంకం కాలేదా? క్లుప్తంగా రాస్తూనే కథానికను ప్రభావవంతంగా చెప్పడం ఎలా అలవడింది?

జ: నిజం చెప్పాలంటే నేను కథలను గల్పికలు అనే ఉద్దేశంతో రాయడం జరిగింది. నాకు కొన్ని పత్రికలలో బొమ్మలకు కథలు, ఒక పేజీ కథలు రాయమనడం ఆసక్తిని కలిగించింది. నాకున్న సమయ పరిధిలో వాటిని రాసి ఆలోచనకు పదును పెట్టుకోగలననిపించింది. క్లుప్తత నాకు సహకరించింది. ప్రభావవంతంగా అన్న మాట ఎంత వరకూ సాధ్యమయిందో పాఠకులు నిర్ణయించాలి.

ప్రశ్న 8. మూల్యాంకనం’ – పరీక్ష పేపర్లు దిద్దేటప్పుడు చూపాల్సిన విచక్షణని చక్కగా ప్రస్తావిస్తుంది. ఛీఫ్ ఎగ్జామినర్ తీసుకున్న నిర్ణయం వల్ల వింధ్యకి మానసిక వ్యథ తప్పుతుంది. ఈ కథానిక నేపథ్యం గురించి చెప్తారా?

జ: ఈ నేపథ్యం వ్యక్తిగతం అని అనుకోవచ్చు, అధ్యాపక వృత్తిలో పరీక్షల జవాబు పత్రాలను ఆంతరంగిక సమస్యల వల్ల అలవోకగా దిద్దడం నిబద్దత గల వారికి ఎంతటి పాశ్చాత్తాపాన్ని కలిగిస్తుందో తెలుపడానికి రాసాను.

ప్రశ్న 9. దీదీకథానికలో వార్ధక్యాన్ని వాయిదా వేసుకోవాలని చూసిన పార్వతి, చివరలో వయసుని గౌరవించాలని నిర్ణయించుకుంటుంది. పార్వతి కల్పిత పాత్రా లేక నిజజీవితంలో మీకు తారసపడిన వ్యక్తా?

జ: నగర జీవితంలో వయసు మళ్ళిన స్త్రీలకు తమ వయసును బేరీజు వేసుకుంటూనే, వాయిదా వేసుకునే ప్రయత్నం సాధ్యమైనంతవరకూ, తప్పనిసరి అని భావించాను.

ప్రశ్న 10. మనసుకు మరమత్తుకధానికలో అత్తగారి పట్ల కోడలి వైఖరిలో మార్పు రావడానికి కొడుకు కారణమా? లేక భర్త మాటలలో నిజం గ్రహించి, కోడలే తన వివేకాన్ని ప్రదర్శించిందంటారా?

జ: భర్త వారించడం వల్ల నిజాన్ని గ్రహించింది. అందుకు ఆమె వివేకం తోడయిందనుకోవచ్చు.

ప్రశ్న11. చదువుకీ, హోలీ పండగకి, రవీంద్రుని శాంతినికేతన్‌కి ముడిపెట్టి రాసిన రంగులుకథానిక నేపథ్యం వివరిస్తారా?

జ: విశ్వకవి రవీంద్రనాథ ఠాగూర్ గారి ప్రస్తావన చదువులో శాంతినీ. పండుగలో సఖ్యతనూ ప్రతి పాదిస్తుందని అనుకున్నాను.

ప్రశ్న12. ఈ పుస్తకంలోని కథానికలు గతంలో వివిధ పత్రికలలో ప్రచురితమైనవే కదా. కథానిక చివర అది మునుపు ప్రచురితమైన పత్రిక పేరు, తేదీ తదితర వివరాలు ఇవ్వకపోవడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? ఆ వివరాలు ఉండి ఉంటే, పరిశోధకులకు ఉపయుక్తంగా ఉండేది కదా!

జ. ప్రత్యేక కారణం ఏమీ లేదు. ప్రచురణ సమయానికి వివరాలు అందజేయక పోవడం జరిగింది.

ప్రశ్న13. సాధారణంగా రచయితలకు తాము రచించేవన్నీ నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథానిక మీ మనసుకు బాగా దగ్గరయింది? ఎందువలన?

జ: చదువుల పండుగ, మా మనుమడి విజయాన్ని తలచినది. వాడిప్పుడు హార్వర్డ్‌లో మెడిసన్ చేస్తున్నాడు.

ప్రశ్న14. ఈ సంపుటిలోని ఏదైనా కథానిక రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కథానికనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా.

జ: కష్టం అనిపించలేదు. దాదాపు అన్ని కథలూ, ప్రయత్నించి మెరుగుగా రాయవచ్చుననిపించింది.

ప్రశ్న15. పగడాల దీవిపుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఈ సంపుటిని పాఠకుల వద్దకు ఎలా చేర్చాలనుకుంటున్నారు? పుస్తకం గురించి అందరికీ తెలిసేందుకు ఏం చేద్దామని అనుకుంటున్నారు?

జ: ఈ కథలన్నీ దాదాపు 2020-24ల నడుమ వాట్సప్ సమూహ సంపర్కాల వల్ల రాసినవి. సమూహంలో సదస్యులందరూ ఎప్పటికప్పుడు మంచి స్పందనలను తెలిపారు. ‘పగడాల దీవి’ సంపుటిని గురించి కీ.శే. గంగిశెట్టి గారి నిర్వహణలో జూమ్ మాధ్యమంలో పరిచయ సభ జరిగింది. ఆటా వారి సాహిత్య విభాగం సదస్సులో పుస్తక పరిచయాన్ని శ్రీ వేణు నక్షత్రం కావించారు.

సంస్థల ద్వారా జరిగిన అనువాదాలు (ఉదా- సాహిత్య అకాడమీ, బసవ సమితి, మొ) పాఠకులకు చేర్చే బాధ్యతను తాము వహిస్తాయి.

ప్రచారం కావించుకోడం రచయిత బాధ్యత. దానిలో ‘పగడాల దీవి’ సంపుటికి మీ ద్వారా కొంత గుర్తింపు లభించవచ్చు. మిత్రులకు చాలా మటుకు అందజేయడం జరిగింది.

ప్రశ్న16. సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి?

జ: కవితా సంపుటిని ప్రచురించాలని ఆశిస్తున్నాను. వ్యాసాలను కూడా ప్రచురించే ఉద్దేశం ఉంది. ‘కర్ణాటక సంస్కృతి సమీక్షె’ (హెచ్ తిప్పె రుద్ర స్వామి) బృహత్ గ్రంథ తెలుగు అనువాదాన్ని కావించి, సాహిత్య అకాడమీకి సమర్పించాను. నా కవితల స్వీయ కన్నడ అనువాదాన్ని ప్రకటించే ఉద్దేశం ఉంది.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు డా. రాజేశ్వరి దివాకర్ల గారూ.

డా. రాజేశ్వరి దివాకర్ల: ధన్యవాదాలు.

***

పగడాల దీవి (కథానికలు)
రచన: రాజేశ్వరి దివాకర్ల
పేజీలు: 206
వెల: ₹ 300/-
ప్రతులకు:
శైలి గ్రాఫిక్స్,
5-126/51
వెంకటాద్రి నగర్,
గోవిందపల్లె
జగిత్యాల 505327
~
రచయిత్రి: 9343716723 (వాట్సప్)
Email: rajeswari.diwakarla@gmail.com

~
‘పగడాల దీవి’ కథానికల సంపుటి సమీక్ష:
https://sanchika.com/pagadaala-deevi-book-review-kss/

Exit mobile version