Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కవయిత్రి, కథా రచయిత్రి డా. శ్రీమతి మంథా అనూరాధ ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘అనుస్వరం’ అనే కవితాసంపుటి వెలువరించిన డా. శ్రీమతి మంథా అనూరాధ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

నమస్కారం డా. మంథా అనూరాధ గారూ.

డా. మంథా అనూరాధ: నమస్కారం.

~

ప్రశ్న 1. అనుస్వరంకవితాసంపుటిని వెలువరించినందుకు అభినందనలు. ఈ సంపుటికి ఈ శీర్షిక పెట్టడంలో మీ ఆలోచన ఏమిటి? మీ స్వరానికి (కవనం) మీ పేరు జోడించారా? లేక బిందువుని (సున్నాని; ఆధ్యాత్మికంగా శూన్యాన్ని) సూచించే అనుస్వారంఅనే పదంలో స్వాని హ్రస్వం చేసి శీర్షికగా ఉంచారా?

జ: ధన్యవాదాలు. కవితలు మన భావావేశానికి సంబంధించినవి. నా పేరుకి నా స్వరాన్ని జత చేసి ఈ కవితాసంపుటికి నామకరణం జరిగింది.

ప్రశ్న 2. జ్యోతిష్యంలో డాక్టరేట్ చేయడానికి మీకు ప్రేరణ ఏమిటి/ఎవరు? మీ వృత్తికి, ప్రవృత్తికి జ్యోతిష్య శాస్త్రంతో సంబంధం ఏదైనా ఉందా?

జ: నా చదువు, ఉద్యోగం, వృత్తి, ప్రవృత్తీ అన్నీ కూడా ఒకదానికి ఒకటి భిన్నం గానే ఉన్నాయి. బాల్యం నుంచీ నాకు గ్రహాలు నక్షత్రాల మీద మక్కువ ఎక్కువ. మా తాతగారు (పితృవంశం) జ్యోతిష్యంలో ప్రవీణులు. జ్యోతిష్య శాస్త్రం మీద ఇష్టంతో నేను నేర్చుకుని డాక్టరేట్ చేసాను. ఇంట్లో మా తాతగారి వారసత్వాన్ని కొనసాగించడం కూడా నా ధర్మం అని భావించాను. వృత్తితో సంబంధం లేదు. ప్రేరణ అంటే ఇక ఏ విషయానికైనా జవాబు మన అనుభవాలు, ఆలోచనలు మరియు సమస్యలు. ఇది లోకవిధితం.

ప్రశ్న 3. పుస్తకంలో మీ పరిచయాన్ని గమనిస్తే, మీరు ఆధ్యాతిక/భక్తి భావాలు అధికంగా ఉన్న కుటుంబం నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. ఆ ఆధ్యాత్మిక ప్రభావంతో ఈ పుస్తకంలోని మొదటి విభాగంలో ఆధ్యాత్మిక/భక్తి కవితలని అమర్చారా?

జ: మా ఇంట్లో దైవారాధన అనేది ఉగ్గుపాలతోనే మొదలయ్యింది. దేవుని దయ వలన దైవ చింతన, పూజా పునస్కారాలు అలవాటు. వ్రాసిన కవితలను నవ రసాలకు తగ్గట్లు విభజించి మొదటగా ఆధ్యాత్మిక కవితలను అమర్చాను.

ప్రశ్న 4. ఇది తొలి కవితా సంపుటి. మీ సాహిత్య ప్రస్థానం గురించి వివరించండి. ఎప్పుడు, ఏ ప్రక్రియతో రచనలు మొదలుపెట్టారు?

జ: మొట్టమొదటిగా నేను మా తల్లిగారి మొదటీ కవితాసంపుటి వెలువరించినపుడు (2008) నా వంతుగా మా తల్లిగారి గురించి తెలుగులో అచ్చులతో వరుస క్రమంగా ఆవిడ గుణగణాలని వర్ణిస్తూ వ్రాసాను. కానీ నాకు తెలియదు నాలో రచనశక్తి ఉంది అని. కొన్నేళ్ళ వినాయకచవితి రోజు ఆ కథని సూక్ష్మంగా పాటరూపంలో వ్రాద్దామని అనిపించి వ్రాసాను. అయినా నేను గుర్తించలేదు. మా మావయ్య షష్టిపూర్తికి మా అమ్మగారు కవిత వ్రాసారు. నాకు కూడా వ్రాయాలనిపించి ఈసారి తెలుగు అచ్చులు హల్లులు కూడా కలిపి సంస్కృతం తెలుగు మేళవించి వ్రాసాను. ఆ పదప్రయోగాన్ని చాలా మంది మెచ్చుకున్నారు. మా తల్లిగారు రచయిత్రి, సాహితీ ప్రియులు. ఆవిడ తెలుగుసాహితీవనం గ్రూప్‌లో జాయిన్ అవ్వడం ఆవిడ స్ఫూర్తితో సాహితీవనంలో అడుగుపెట్టి పోటీలకి వ్రాస్తూ సాహిత్యాభ్యాసం మొదలుపెట్టాను. తరువాత కవిసాయంత్రం అనే గ్రూప్‌లో జాయిన్ అయ్యి అక్కడా వివిధ ప్రక్రియలలో నెలకి 10 టాస్కులు ఉంటాయి. వాటన్నిటికీ పోటీగా వ్రాస్తూ కొంచెం అనుభవం సంపాదించాను. విరివిగా కవితలు వ్రాయడానికి ఆస్కారం కలిగింది. తెలుగుసాహితీవనం వారు పుట్టిల్లు అయితే కవిసాయంత్రం వారు స్కూలింగ్ అయ్యింది.

ప్రశ్న 5. మీరు కవితలు, కథలు, ఆధ్యాత్మిక/జ్యోతిష సంబంధ వ్యాసాలు రాశారు. వీటిల్లో ఏది రాయడం మీకు సులువు? ఎందువల్ల?

జ: సహజంగానో పోటీతత్వం గానో గానీ ఏది వ్రాసినా భిన్నంగా ఉండాలని అనుకుంటాను. అదే సమయంలో జ్యోతిష్య శాస్త్రం ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా నేర్చుకోలేరు. హిందూమతం అనేది మతం కాదు, అది ఒక జీవన తత్వం. అలాగే జ్యోతిష్య శాస్త్రం అనేది జీవన విధానం. గ్రహచారం వలన ఇలా జరగబోతోంది దానికి మనస్సుని మన చర్యలని నియంత్రించుకుని తదనుగుణంగా నడచుకోవాలని చెప్పే శాస్త్రాన్ని నేడు వేరే విధాలుగా ఉపయోగిస్తున్నారు. అందుకని ఆ శాస్త్రం మరియు గ్రహ కారకత్వాలు నిత్యజీవితంలో అందరి మనసుల్లోకి చొచ్చుకుపోవాలని నా మాటల్లో వ్రాతల్లో కూడా తెలియబరుస్తూ ఉంటాను. కవితలకీ, కథలకీ, ఏ వ్యాసాలకి అయినా రచనా శక్తి తత్సంబంధిత విషయంపై అవగాన, భాషా పటిమ, చాతుర్యత ముఖ్యం. ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటూ ఉండాలి.

ప్రశ్న 6. ఈ కవితాసంపుటిలోని 109 కవితలని తొమ్మిది విభాగాలలో కూర్చారు. ఒక్కో విభాగానికి చక్కని పేరు పెట్టారు. ఈ అన్ని కవితలలో ఏకసూత్రత ఏదైనా ఉందా?

జ: ఏకసూత్రత అనేది ఏమీ లేదు. భావాంశాలని బట్టీ తొమ్మిది రకాలుగా విభజించడం జరిగింది.

ప్రశ్న 7. కవితకి లయ ప్రధానమా? వస్తువు ప్రధానమా? భావ వ్యక్తీకరణ ప్రధానమా? మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారు?

జ: మూడూ ముఖ్యమైనవే. సందర్భానుసారంగా ఉపయోగించుకోవాలి. వీటి ప్రాధాన్యత అంతర్గతంగా మారుతూ ఉంటుంది కానీ వస్తువు, లయ, భావ వ్యక్తీకరణ మూడూ ఉంటేనే చక్కని రచన అవుతుంది. నేను ఈ మూడింటితో పాటుగా భాషాప్రయోగం మీద ఎక్కువ దృష్టి పెడతాను.

ప్రశ్న 8. రామాయణానికి 42 పంక్తులలో కవితారూపం కల్పించి సంక్షిప్తంగా, సుబోధకంగా ఎలా చెప్పగలిగారు? దీని వెనుక ఉన్న నేపథ్యం చెప్పండి.

జ: మా పూర్వీకులు (మాతృవంశం) పద్యకావ్యాలు కీర్తనలు అన్నీ భగవుంతునికి సంబంధించినవే వ్రాసారు. వారందరూ తెలుగు, సంస్కృతం మరియు సంగీతం లోనూ ఉద్ధండులు. వారి రచనల స్ఫూర్తితో వ్రాసినది ఈ సంక్షిప్త రామాయణం. ఉద్యోగం చేసుకునేవారు రోజు సులువుగా ఒక 5 నిమిషాల్లో మన జీవన పారాయణమైన రామాయణాన్ని తలచుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నది నా ఉద్దేశం.

ప్రశ్న 9. మా బాల్కనీఅనే కవితలో, చంద్రుడిని ఉద్దేశిస్తూ, “మామను నేనే మనస్సును నేనే/ఆలోచనా నేనే పరిష్కారమూ నేనే” అని అన్నారు. ఈ పంక్తుల వెనుక ఉన్న ఆలోచనని వివరిస్తారా?

జ: ఇవన్నీ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్రుడు కారకత్వాలు మనస్సు, అలోచన, వ్యక్తపరచడం, భావాలు.. వీటి ఆధారంగా నేను రాత్రి మా బాల్కనీలోంచి చూస్తున్నప్పుడు నా కంటికి కనబడిన దృశ్యాన్ని కవితలాగ మలిచాను.

ప్రశ్న 10. మేఘ గర్భధారణంఅనే కవిత నేపథ్యాన్ని వివరిస్తారా? ఎక్కువ భాగం శ్లోకంలా, కొంత భాగమే వచనంలా తోచేలాగా ఈ కవితని వ్రాయడంలో మీ ఉద్దేశం ఏమిటి?

జ: ఇది సందర్భవాక్యం “ప్రసవం ఓ మరణం, జననం ఓ సూర్యోదయం” అని పోటీకి ఇచ్చిన అంశం. ఇది చూడగానే నాకు మేఘం గుర్తుకు వచ్చి, మేఘధారణ ఎలా ఎప్పుడు జరుగుతుంది, ఎలాంటి మేఘం ఏ ఫలాలని ఇస్తుంది అన్న జ్యోతిష్య శాస్త్రాన్ని కుదించి వ్రాసిన కవిత. పూర్వం రైతులు ఈ విషయాన్ని సహజంగానే కనిపెట్టేవారు. ఇప్పటివారి గూర్చి నాకు తెలియదు. ఈ కవిత పూర్తిగా శాస్త్ర సంబంధిత విషయం.

ప్రశ్న 11. ప్రణతి పడతీకవితలో “ఏ సీమ అయినా ఏ రాజ్యమైనా/ నీవు లేని జగతి శూన్య తిథి” అని అన్నారు. స్త్రీలు లేని చోట అంతా ప్రతికూలతే అనే అర్థం వస్తోంది శూన్య తిథిపదప్రయోగం వల్ల. అలాగే, ‘అమ్మ చేతి కమ్మని వంటలుకవితలో “భౌమ వారమా భామ వారమా/కుజహోరలో భోజనం” అన్నారు. శూన్య తిథి’, ‘కుజహోరవంటి పదాలను కవితలలో ఉపయోగించడంలో జ్యోతిష్యం ప్రభావం ఉందని భావించవచ్చా?

జ: అవును. నా ప్రతీ చర్యలోనూ జ్యోతిష్యానికి అన్వయిస్తాను. శూన్యతిథి అంటే సూర్యోదయానికి లేని తిధి. అటువంటి తిథి ఏ పనికీ ఉపయోగించము. అలాగే భౌమవారానికి అధిపతి కుజుడు. సేనాధిపతి. ఉగ్రుడు, ఎఱ్రని మిరపకారం..

ప్రశ్న 12. పంచభూతాలు – పంచేంద్రియాలుగొప్ప ప్రేరణనిచ్చే కవిత. ఈ కవిత వ్రాయడానికి నేపథ్యమేమిటో చెప్తారా?

జ: భగవద్గీతలో సాంఖ్యయోగమునందు ఇంద్రియ నిగ్రహం గురించి చదువుతున్నప్పుడు ఇలా కవిత రూపంలో నాకు అర్ధమయినది వ్రాయలనే ఆలోచన వచ్చింది.

ప్రశ్న 13. వివాహ ర(బం)ధ చక్రంకవితలో ఒక పంక్తిలో కపాలం లేని మేలాపకమే అయినాఅని అన్నారు. మేలాపకమంటే వివాహ సందర్భంగా కాబోయే వధూవరుల జాతక పొంతన చూడడం. దానికీ కపాలానికీ సంబంధం ఏమిటి? కపాలం అంటే పుర్రె అని కాకుండా మరేదైనా అర్థంలో వాడారా? వివరించండి.

జ: కపాలం అంటే పుర్రెగానే తీసుకున్నాను. మేలాపకం అంటే వధూవరుల పొంతనలు. పెళ్ళి తరువాత పొంతనలు కుదరకపోతే ఇష్టం, విలువ లేకుండా సాగే పయనానికి పూర్ణత్వం ఉండదు అని కపాలం లేని మేలాపకం అని సంబోధించాను. అయినా వాటిని సర్దుకుంటూనో తగినట్లు మార్చుకుంటూనో వివాహబంధాన్ని కొనసాగిస్తూ ఆ బంధానికి విలువ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ కవిత వ్రాసాను. అయితే ప్రస్తుతం సమాజంలో ఇహానికీ పరానికీ కాకుండా అహానికి మాత్రమే ప్రాముఖ్యతనిస్తున్నారు. వయస్సుతో బాధ్యతలతో సంబంధం లేకుండా స్వేచ్ఛకీ స్వాతంత్ర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కుటుంబవ్యవస్థ క్షీణతకి కారకులవుతున్నారు. ఇదేనేమో కలి ప్రభావం మరి. ఒక రకంగా ఈ కవిత వ్రాసిన ఒక సంవత్సరంలోనే ఔట్ డేటెడ్ అయిపోయింది.

ప్రశ్న 14. సాధారణంగా రచయితలకు తామే రాసేవన్నీ నచ్చుతాయి. కానీ ఈ సంపుటిలో మీకు బాగా నచ్చిన కవిత ఏది? ఎందువల్ల?

జ: నాకు నచ్చిన కవిత, ఏభైలో అభిమతం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మనుష్యులు, మాయలు, మర్మాలు అర్థం కావడానికి అర్ధ జీవిత కాలం పడుతుంది. అప్పటినుంచీ మనలో మసకబారిన అసలయిన నిజస్వరూపం పరిణతి చెంది లోకాన్ని చూస్తుంది. అప్పుడు అన్నిటిపట్లా సమభావం ఏర్పరుచుకోడానికి దోహదపడుతుంది.

ప్రశ్న15: పుస్తకం కవర్ పేజీ మీరే డిజైన్ చేసుకున్నారు. ఆకర్షణీయంగా ఉంది. మీకు చిత్రలేఖనంలో ప్రవేశం/ప్రావీణ్యం ఉందా? లేదా AI వంటి సాంకేతికతని ఉపయోగింకున్నారా?

జ: చిత్రలేఖనంలో ప్రవేశం ఉంది కానీ ఇంత ప్రతిభ లేదు. రాహుప్రభావం వలన ఆకర్షణీయమైన వాటికి నేను అజ్యం పోస్తాను. అలాగ రూపొందిందే ఈ కవర్ పేజీ. నా ఆలోచనలకి సరిపడా నెట్‌లో వెతుక్కుని రెండు మూడు ఇమేజెస్‌ని సాంకేతికంగా మిక్స్ చేసుకున్నాను.

ప్రశ్న 16. ఈ సంపుటిలో ఏ కవితని రాయడానికి మీరు ఎక్కువ కష్టపడ్డారు? ఎందుకని?        

జ: నేను ఎక్కువగా కష్టపడింది ‘సంక్షిప్త రామాయణం’ వ్రాయడం గూర్చి. రెండురోజులు పట్టింది. కాశీప్రయాణంలో వ్రాసినది. అటువంటి గ్రాంథిక తెలుగు వ్రాయడానికి సమయం పట్టింది. మొట్టమొదటిగా నా తల్లిదండ్రులకి ఎంతో ఉత్సాహంతో చెప్పి వారిచ్చిన సలహాలతో కొన్ని మార్పులు చేర్పులు చేసాను. వారికి చాలా బాగా నచ్చింది.

ప్రశ్న 17. ఈ పుస్తకం ప్రచురణ అనుభవాలు చెబుతారా? పాఠకుల ఆదరణ ఎలా ఉంది?

జ: తెలుగుసాహితీవనం వారు నిర్వహించే వార్షికోత్సవానికి వెళ్ళినప్పుడు పుస్తకావిష్కరణలు వాటి సమీక్షలు చూసాకా నా కవితలు 100 దాటాక ప్రచురించాలని ఒక ఆలోచన వచ్చింది. శాంతికృష్ణ గారి ప్రోద్బలంతో పుస్తకంగా రూపుదిద్దుకుంది. పాఠకులు అందరూ పదజాలాన్ని, భాషాప్రయోగాన్నీ మెచ్చుకుంటున్నారు.

ప్రశ్న 18. భవిష్యత్తులో ఎలాంటి రచనలు చేయాలనుకుంటున్నారు? కొత్త పుస్తకాలు ఏవైనా ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయా?

జ: అన్నిరకాల రచనల మీదా ఇష్టం ఉంది. కానీ భవిష్యత్తులో భక్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఉంది. అంశం ఏదైనా దైవభక్తిగా మార్చి వ్రాయాలని ఉంది. అలాగే ఏ సమస్యకైనా మనస్సు ఎలా స్పందిస్తుంది.. గాయపడిన మనస్సుకి ఎలాంటి సూచన ఇవ్వాలని అన్నది నా అభిమతం. ఉద్యోగస్థులకు అనుగుణంగా అన్ని రకాల బుక్స్ వెతుక్కోకుండా మన తెలుగు వారి పండగలు వాటి పూజా విధానాలు అన్నీ కలిపి ఒక సంకలనం మా అమ్మగారి పర్యవేక్షణలో మా చెల్లెలు నేనూ తయారు చేసాము. అది సిద్ధంగా ఉంది. నా తరువాత పుస్తకం గేయకవిత్వం అని ప్రయత్నిస్తున్నాను, రెండు సంవత్సరాలు పట్టవచ్చు.

ప్రశ్న19: తెలుగు సాహిత్యం మీద AI, Chat GPT ల ప్రభావం ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు?

జ: ఈ టూల్స్ ఆలోచింపచేసేవే. సాంకేతికమైన మేధస్సుతో వీటిని తయారు చేసారు. ‘ఆర్టిఫీషియల్’ అని పేరులోనే ఉంది. అయినా ఈ టూల్స్ ఏ విషయం గూర్చి చెప్పగలిగినా మనిషి మనస్సుని కవితావేశాన్ని అయితే ప్రస్తుతం అధిగమించలేవనే చెప్పుకోవచ్చు. కవితలు అనేవి భావానికీ భాషకీ సంబంధించినవి. కాబట్టీ వీటి సహాయం కవిత్వానికి కొంచెం వరకూ ఉన్నా సంపూర్ణంగా ఉండదని నా అభిప్రాయం. ఒకవేళ ఉపయోగించుకుంటే అది కృత్తిమం అని అర్ధం అయిపోతుంది. మనస్సు మెదడు కృత్తిమం అయితే ఆరోగ్యం కూడా కృత్తిమమే మరి. సాధ్యమైనంతవరకు రచయితలు ఈ కృత్తిమమేధస్సుని వాడుకోకపోవడమే ఉత్తమం.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు డా. మంథా అనూరాధ గారూ.

డా. మంథా అనూరాధ: ధన్యవాదాలు.

***

అనుస్వరం (కవిత్వం)
రచన: డా. మంథా అనూరాధ సెంథిల్
ప్రచురణ: శామ్ పబ్లికేషన్స్
పేజీలు: 164
వెల: ₹ 150/-
ప్రతులకు:
డా. మంథా అనూరాధ సెంథిల్
ఫ్లాట్ నెం. 45080, బ్లాక్ 4, వింగ్ B,
జనప్రియ ఉటోపియా అపార్ట్‌మెంట్స్,
అత్తాపూర్
హైదరాబాద్ 500048
Ph: 9642903945
Email: anu20345@gmail.com

~
‘అనుస్వరం’ కవితాసంపుటి సమీక్ష:
https://sanchika.com/anuswaram-book-review-kss/

Exit mobile version