[డా. బొడ్డోజు మల్లయా చారి గారి ‘తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం – పరిశీలన’ అనే పరిశోధనా గ్రంథాన్ని ధారావాహికంగా అందిస్తున్న సందర్భంగా వారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం డా. బి. మల్లయా చారి గారు.
డా. బి. మల్లయా చారి: నమస్కారం.
~
నేపథ్యం:
నేను ఎం.ఎ. పూర్తి చేసిన తర్వాత ఎం.ఫిల్ కోసం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రికి వెళ్ళాను. ఆచార్య ఎన్. గోపి గారి ‘మైలురాయి’ కవితా సంపుటి మీద చేయడం జరిగింది.
విశ్వవిద్యాలయంలో జరిగిన సంఘటనలకు పి.హెచ్.డి. చేయాలనే కోరిక లేకుండా పోయింది. కానీ డిగ్రీ కాలేజీ పోస్టు సంపాదించాలనే కోరిక తీరదనే భయం ఏర్పడింది. దాని కోసం అనేక పుస్తకాలు చదివాను.
డిగ్రీ కళాశాలలో (ప్రైవేట్) పనిచేసేటప్పుడు యూనివర్శిటీ అధ్యాపకుల పరిచయం సన్నిహితంగా మారింది. ఆచార్యుల సలహాలు సాహిత్యంపై చర్చలు.. చాలా కాలం తర్వాత పి.హెచ్.డి. చేయాలనే తపన ఏర్పడింది.
డిగ్రీ కాలేజీ పేపర్ వాల్యూషన్ సమయంలో ఆచార్య ఎన్.ఆర్. వెంకటేశం గారు “చారి, సాహిత్యం గురించి చాలా ఆలోచిస్తున్నావు. పి.హెచ్.డి. చేసే అర్హత నీకు ఉన్నది. ఒకసారి ఆలోచించు” అని సలహా ఇచ్చారు.
వారంలో ‘వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం మార్మిక పదాలు – విశ్లేషణ’ టాపిక్ పైన వ్యాసం రాసుకుని వచ్చాను. దానిని కసిరెడ్డి గారికి చూపించాను. వ్యాసం చూసి, “బాగున్నది, కొత్త విషయాలు కనిపిస్తున్నాయి” అన్నారు. “కానీ పురాణ సాహిత్యం, హిందు సంప్రదాయాలు, గ్రంథాలు, టెక్నాలజీ మొదలైన వాటిపైన విషయ అవగాహన ఉండాలి. వాటిని చదువాలి” అన్నారు. మరో వారంలో ‘తెలుగు సాహిత్యంలో ఝాన్సీరాణి’ గురించి ఆలోచించాను. ఆ సందర్భంలో ఆచార్య కసిరెడ్డి గారు, నేను సాహిత్య చర్చ జరుపుతున్నప్పుడు ‘ధర్మాగ్రహం’ అను నాటికను (అముద్రితం) నాకు ఇచ్చారు. ఆ సందర్భంలో వచ్చిన టాపిక్ తెలుగు సాహిత్యంలో ‘ప్రథమ భారత సంగ్రామం’. ఈ విషయంలో ఆచార్య కసిరెడ్డిగారికి సర్వదా కృతజ్ఞుడిని.
“సార్ దగ్గర కొన్ని రోజులు శిష్యరికం చేశాను” అన్నాను. “అయినా ఒకసారి కలువు” అన్నారు. ఇక్కడ ఏదో లోపం ఉన్నదని సినాప్సిస్ ఒకటికి రెండు సార్లు చదివాను. మళ్ళీ ఆచార్య కసిరెడ్డి గారిని కలిసి చూసాను. ఆయన మళ్ళీ చూశారు. ఆయన ఓకే అన్న తర్వాత, ఆ పుస్తకాలు అన్ని తీసుకొని ఇంటర్వ్యూకు వెళ్ళాను. ఆ కమిటీలో ఆచార్య ఎన్ గోపి, సుమతీ నరేంద్ర గారు, ఆచార్య కుసుమా బాయి గారు, ఆచార్య ననుమాస స్వామి గారు, ఆచార్య ఎస్.వి. సత్యనారాయణ గారు, ఆచార్య మసన చెన్నప్ప గారు మొదలైన వారు కూర్చున్నారు.
నా పుస్తకాల సేకరణను చూసి ఆచార్య గోపి గారు చాలా సంతోషించారు. ఆచార్య ఎన్. ఆర్. వెంకటేశం గారిని చూసి “గో ఎహెడ్” అన్నారు. సుమతీ నరేంద్ర గారు పుస్తకాలన్ని తన దగ్గర పెట్టుకొని నాకు ఆశీస్సులందించారు.
ఇది నా పి.హెచ్.డికి మూల ప్రస్థానం.
ప్రశ్న 1: మీకు ‘తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం – ఒక పరిశీలన’ అంశం ఆధారంగా పరిశోధన చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
జ: నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు చరిత్రతో పాటు భారతీయ సంప్రదాయం మొదలైన విషయాలను వంటబట్టించుకున్నాను. ఎం.ఎ. అయిపోగానే ధ్యాన కేంద్రంలో (నారాయణగూడ) సుమారు మూడు నెలలు ఉన్నాను. ఆశ్రమ వాతావరణం పరిచయం అయ్యింది.
ఆ తరువాత మా ఊరిలో జరిగిన రాజకీయ పరిణామాలకు నేను కూడా బాధ్యత తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఒక బి.జె.పి. (భారతీయ జనతా పార్టీ) శాఖని గ్రామంలో ప్రారంభించాను. ఆ తరువాత నల్లగొండ నగరంలో శ్రీ రాఘవేంద్ర డిగ్రీ కాలేజీలో పని చేశాను. ఆ సమయంలో ఎబివిపి, ఆర్.ఎస్.ఎస్. సంస్థలలో పని చేసే అవకాశం వచ్చింది. ఆర్.ఎస్.ఎస్.లో నాకు నగర బౌద్ధిక్ బాధ్యత ఇచ్చారు. ఆ సమయంలో చాలా పుస్తకాలు చదివే అవకాశం లభించింది. భారతీయ సిద్ధాంత గ్రంథాలపై అవగాహన కలిగింది.
ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారితో సాహిత్య చర్చ జరిగేటప్పుడు సావర్కర్ గారి ‘ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం’ పుస్తకం చదివాను. ఆ విధంగా ‘తెలుగు సాహిత్యంలో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం’ అనే అంశం పుట్టుకొచ్చింది.
ప్రశ్న 2: పరిశోధనకు ప్రాతిపదికను ఎలా ఏర్పాటు చేసుకున్నారు? పరిశోధన ఎలా ప్రారంభించారు?
జ: నాకు ఎం.ఫిల్ చేసిన అనుభవం ఉన్నది. పరిశోధనకు ముందే అనేక పుస్తకాలు చదివిన జ్ఞానం ఉన్నది. ఆర్.ఎస్.ఎస్. బౌద్ధిక్ గా పనిచేశాను కాబట్టి అంశానికి సంబంధించిన అవగాహన ఉన్నది.
పి.హెచ్.డి. ఇంటర్వ్యూ సమయంలో అనేక లైబ్రరీలలో ఉన్న పుస్తకాలను సేకరించి జరిగింది. వీటన్నింటిని చదివిన తర్వాత ఆచార్యులతో కలిసి చర్చించాను.
అయితే నాకు వివిధ ప్రాంతాలను తిరగాలని, విషయసేకరణ చేయాలని తపన ఉంది, కానీ నాది ప్రైవేట్ ఉద్యోగం, ఆపై ఆర్థిక విషయాలలో పూర్తిగా వెనుకబడ్డాను. నా సంపాదనతో ఇల్లు గడవడమే కష్టంగా ఉన్నది. నేను తిరగడం తక్కువే.
అయినా రాజమండ్రి గౌతమి గ్రంథాలయం, చీరాల దగ్గర వేటపాలెం గ్రంథాలయం వంటి లైబ్రరీలకు విషయ సేకరణకు తిరిగాను. సేకరించిన విషయాన్ని సినాప్సిస్ ఆధారంగా కూర్చుకున్నాను.
భార్యాపిల్లలతో డా. బి. మల్లయా చారి
ప్రశ్న 3: పరిశోధనకు మీరు పాటించిన పరిమితులు, విధించుకున్న నియమాలు ఏమిటి?
జ: ఆచార్య ఎన్. ఆర్. వెంకటేశం గారు నాకు కొన్ని ఆంక్షలు సూచించారు. పరిమితులను విధించారు. వివాదస్పదమైనటు వంటి విషయాలపై సమగ్రంగా తెలుసుకున్న తర్వాతనే స్వీకరించడం అందులో ఒకటి.
ప్రతి విషయం ఆచార్య ఎన్. ఆర్. వెంకటేశం గారితో చర్చించేవాడిని. ఏ విషయాన్ని ఎంత స్వీకరించాలో తెలుసుకుని, వాటిలోని పరిమితులు దాటు సమయంలో గురువుగారి సూచనలను పాటించేవాణ్ణి. ఆచార్య ననుమాస స్వామి వంటి వారి సలహాలు తీసుకునేవాణ్ణి.
పరిశోధనకు కావలసిన అర్హత సంపాదించాను. కాబట్టి క్రమశిక్షణా జీవితం అలవాటు చేసుకున్నాను. పరిశోధనలలో కొన్ని పరిమితులను స్వీకరించాను. దీని ద్వారా ఆచార్య ఎస్.వి. సత్యనారాయణ గారు నా అవార్డు సమయంలో కొన్ని ఇబ్బందులను కలిగించారు.
ప్రశ్న 4: సిపాయి విప్లవం అని బ్రిటీష్ వారంటే, ప్రథమ స్వతంత్ర్య సంగ్రామం అని భారతీయులు అంటున్నారు. ఒక నిష్పాక్షిక పరిశోధకుడిగా మీ అభిప్రాయం ఏమిటి?
జ: అవును బ్రిటిష్ వారు అనే విషయం సమంజసమే. కాని సిపాయిలు మాత్రమే తిరుగుబాటు చేయలేదు. మొఘల్ వంశం చివరి పాలకుడు బహదూర్ షా ఒక వైపు భారతీయ పోరాట కర్తలకు ప్రేరణ కలించారు. బ్రిటిష్ వారి ఆగడాలను భరించలేని భారతీయులు అక్కడక్కడ ఉద్యమాలు తమ శక్తి మేరకు చేస్తున్నారు. సావర్కర్ వంటి వారలు దేశ విదేశాలలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమ శక్తులను తయారు చేస్తున్నారు. అందులో ఆ ఇంగ్లాండ్‌లో ఖుదీరాం బోస్ ఒకడు.
ఉత్తర భారతదేశంలోనే కాక మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, దక్షిణ భారతదేశంలో కూడా అనేక ఉద్యమాలు నడిచాయి. కాబట్టి యావద్భారతదేశం ఉద్యమాల పుట్టగా మారింది. అందుకే ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం అని భావించి సాహిత్యంలో దీని గురించి ఉన్న విషయాలను సేకరించాను.
ప్రశ్న 5: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, గుర్రాల గోపిరెడ్డి వంటి వారి పోరాటాన్ని స్వతంత్ర పోరాటంలో భాగంగా భావించటం సబబేనా?
జ: ఎందుకు కాకూడదు. వందేమాతరం ఉద్యమ సమయంలో ఒక సాధారణ పౌరుడు సంతలో, బ్రిటిష్ సైనికుని చూసి ‘వందేమాతరం’ అని నినదించినవాడని అందరికీ తెలిసిన విషయమే. బ్రిటీష్ అధికారి అతనిని అడిగితే, “ఈ పండు వంద ఏ మాత్రం అని అడుగుతున్నాను” అని తప్పించుకున్నాడు.
నేను మాత్రం బాల్యంలో వీరపాండ్య కట్టబొమ్మన పాటను పాడుకునే వాణ్ణి. అదే నాకు ప్రేరణ.
‘ఓ.. వీర పాండియా కట్టా బొమ్మన్నా!
నీ పేరు విన్న సర్దారులే నిద్ర పోరన్నా!!’
అల్లూరి సీతారామరాజు వంటి ప్రాంతీయ ఉద్యమ నేతలు జాతీయోద్యమానికి పునాదులు.
ఉయ్యాలవాడ వంటి వారలు కూడా ప్రాంతీయ ఉద్యమ రథ సారథులు. వారి ప్రేరణ తరువాత తరం ఉద్యమాలకు నెలవైంది.
ప్రశ్న 6: ఎందుకని దక్షిణ భారతదేశంపై ప్రథమ స్వతంత్ర పోరాటం ప్రభావం అంతగా లేదని అనుకుంటున్నారు?
జ: ఎందుకు లేదు, ఉన్నది. కాకుంటే హైదరాబాద్ వంటి సంస్థానాలు రాజుల అధీనంలో ఉన్నవి. బ్రిటీష్‍వారు దక్షిణ భారతదేశంలో తమ ప్రభావం తక్కువగా ఉందనవచ్చు. వారి పాలనలో ఉన్న ప్రాంతాలలో తిరుగుబాటు జరుగుతునే ఉంది.
ప్రశ్న 7: ఇటీవలి కాలంలో స్వతంత్ర్య పోరాటంలో మంగళ్ పాండేకు అనవసరమయిన ప్రాధాన్యాన్ని కల్పించారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అబ్బరాజు శ్రీనివాసమూర్తిగారి కావ్యాన్ని మనం చారిత్రక కావ్యంగా భావించ వచ్చంటారా?
జ: ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తొలి తూట పేల్చిన భారత సింహం మంగళ్ పాండే. బ్రిటీష్ వారి ఆగడాలను భరించలేని పాండే తాను తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం సైన్యంలో చేరి బ్రిటీష్ వారిని ఎదిరించి స్వాతంత్ర్య సంగ్రామానికి ప్రాణం పోశాడు. ఇంతటి చారిత్రక సంఘటనను గ్రంథస్థం చేసిన అబ్బరాజు శ్రీనివాసమూర్తి ధన్యుడు. దీనిని చారిత్రక కావ్యంగానే భావించగలము.
ప్రశ్న 8: ‘బాపు, జవహరు, వల్లభ్ భాయ్ పటేలు/హిందూవీర సావర్కర్, హెడ్గేవారు..’ అంటూ కవి ఈనాడు అనేక అపోహలకు, దూషణలకూ గురవుతున్న సావర్కర్, హెడ్గేవార్ లను బాపు, జవహర్, పటేల్ లతో సమానంగా సంబోధించాడు. దీనిపై మీ వ్యక్తిగత అభిప్రాయం ఏమిటి? మనం మన వీరులకు రాజకీయాల రంగులు పులిమి మన చరిత్రను సరిగా విశ్లేషించుకోలేకపోతున్నామా?
జ: ఈనాడు మనం విశ్లేషించుకునే తీరు కొంత బాధను కల్గిస్తుంది.
జాతీయ నాయకులను అంటే విశాల దృక్పథంతో చూడాలి. నాటి కాల, ప్రాంత పరిస్థితులకు వారు స్పందించిన తీరు, ప్రవర్తించిన తీరు అలానే ఉండాలి.
అతివాద జాతీయ నాయకులకు మితవాద జాతీయ నాయకులకు ప్రవర్తనలో తేడా ఉన్నది. ఇద్దరి అభిప్రాయాలు జాతి విముక్తి కోసమే.
తమ ప్రాణ, మాన, ఆస్తులను త్యాగం చేసిన మహా మహోన్నతులను వెతికి స్మరించుకోవలసిన స్థానంలో ఉన్నవారి గురించి కొందరి అభిప్రాయాలపై రంధ్రాన్వేషణ చేయకూడదు.
గాంధీ, నెహ్రూ వంటి నాయకుల ప్రస్థానంలో కొన్ని తప్పులు జరిగి ఉండవచ్చు. ఆనాటి ప్రజలు నాయకులను తప్పు పట్టలేదు. అలాగే సావర్కర్ వంటి జాతీయ ఉద్యమ నాయకుడు లేడనే చెప్పగలను. ఈ రోజుల్లో కొందరు సందర్భాన్ని కల్పించుకుని అనవసర రాద్ధాంతం చేస్తున్నారు.
డాక్టర్ హెడ్గేవార్ నాటి ప్రవర్తన బీజప్రాయమే కావచ్చు కాని అది ఈ రోజు విశ్వమంతా పరుచుకుంది.
చివరగా జాతీయ నాయకులను జాతి అంతా విశాల హృదయంతో విశ్లేషించవలసిన అవసరం ఉంది. కాని విశ్వవిద్యాలయ స్థాయిలో కూడా ఈ వివక్ష చూపించడం విచారకరం. నా మటుకు చూసినట్లయితే, నా పి.హెచ్.డి. టాపిక్ పేరు వినగానే నన్ను ఒక దోషిని చూసినట్టు చూశారు.
ఇటువంటివి చేయకూడదని నా అభిప్రాయం.
ప్రశ్న 9: విశ్వనాథ – ఝాన్సీ లక్ష్మీబాయి కావ్యం ఇతర స్వతంత్ర పోరాట రచనకు భిన్నంగా అనిపిస్తుంది. ఇతరులు పోరాటం గురించి రాశారు. విశ్వనాథ ఈ పోరాటాన్ని అనంతకాల గమనంలో జీవన పరిమాణ క్రమంలో భాగంగా రాశారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
జ: జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేలా? అన్నట్లు ఆధునిక కాలంలో శ్రీమద్రామాయణ కల్పవృక్షం రాసిన విశ్యనాథ వారి దృష్టికోణం కూడా అంతే గొప్పగా ఉన్నది. తాను ఏది రాసిన అంతటి గొప్ప స్థితినే కల్పించుకుంటారు. ఝాన్సీ కావ్యం కూడా నా దృష్టిలో అంత గొప్ప అనుభూతిని అందించింది.
ప్రశ్న 10: ముదిగొండ వీరభద్రమూర్తిగారి కావ్యం పరిధి గాంధీయుగం వరకూ విస్తరించింది. ఈయన శైలి గురించి చెప్పండి.
జ: వీరభద్రమూర్తి గారి ‘వందేమాతరం’ కావ్యం గొప్పది. ఈయన పరిణతి చెందిన కవి.
ప్రశ్న 11: మీ పరిశోధనలో మరువలేని అనుభవమేదైనా వుందా?
జ: నా పి.హెచ్.డి సమయం మొత్తం అనుభూతుల కాలం. నేను సేకరించిన పుస్తకాలు చదువుతుంటే – ఆ కాలంలో నేను పుట్టి ఉంటే.. అట్టి ఉద్యమంలో పాల్గొనే వాడిని కదా!.. అనుకునేవాడిని. నాటి జాతీయ నాయకులు తాము పడిన కష్టనష్టాలను జాతీయభావంతో స్వీకరించారు. అంతటి త్యాగమయ జీవులు పుట్టిన గడ్డలో పుట్టినందుకు సర్వదా గర్వపడుతున్నాను. నిత్య పారాయణులు నా జాతి నేతలు అంటూ నేటికి ఆ మార్గంలో శక్తి మేరకు పయనిస్తున్నాను..
నాకు ఎదురైన అడ్డంకులను వారి స్ఫూర్తి బలంతో తొలగించుకొని ముందుకు సాగాను.
ప్రశ్న 12: మీరు మీ పరిశోధన గ్రంథాన్ని పుస్తక రూపంలో ఎందుకు ప్రచురించలేదు?
జ: నాకు ఆర్థిక బలం సరిపోవడం లేదు. కానీ దీనిని తప్పనిసరిగా పుస్తక రూపంలో తీసుకొస్తాను. ఇంకొంత సమయం పట్టవచ్చు. ఇతరులపై ఆధారపడటం నాకు మర్యాదగా అనిపించదు. కావున తొందరలో తీసుకవస్తాను. జాతికి అంకితం చేస్తాను.
ప్రశ్న 13: పరిశోధిస్తూంటే – దేశం గురించి, పోరాటం గురించి, త్యాగాల గురించి, ప్రస్తుత పరిస్థితుల గురించి మీ మనసులో కలిగిన భావాలేమిటి?
జ: నా పరిశోధన మొత్తం అనుభూతులమయం. వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది. దైవభక్తి కన్న దేశభక్తి మిన్న అన్న విషయాన్ని అవగాహన చేసుకున్న వ్యక్తిని.
జాతీయ భావాలను వంటబట్టించుకున్నవాణ్ణి. కావున కొన్ని విషయాలలో పూర్తిగా అవగాహన చేసుకున్నాను. వాటిని అమలుపరిచేను.
నాటి కాల పరిస్థితులను నేటి కాల పరిస్థితులకు సరిపోల్చడం కూడా జరిగింది.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు డా. బి. మల్లయా చారి గారూ.
డా. బి. మల్లయా చారి: మీకు అనేక ధన్యవాదాలు.