[శ్రీమతి వాణి వేమవరపు రచించిన ‘స్పర్శ’ అనే కథని అందిస్తున్నాము.]
ఎక్కడో సన్నటి గొంతుతో తియ్యటి పాట వినపడుతోంది. చాలా అలవాటు అయిన పాట. అవును అమ్మ ఎంతో మధురంగా పాడుతోంది. బొజ్జలో ఉంటూ ఇలా అమ్మ పాట వినడమే కానీ చూడలేదు అమ్మని. అమ్మని చూడాలని ఆత్రుత రోజురోజుకీ పెరిగిపోతోంది. ఎప్పుడు బయటికి వస్తాను, కనులారా ఎప్పుడు చూస్తాను అనుకుంటూ “నీ పాట వింటున్నా అమ్మా” అంటూ కాళ్లతో కోడుతూ, చేతులతో తడుతూ అమ్మని పిలుస్తున్నా. ఇంతకాలం అమ్మే నా ప్రపంచం.
“నెలలు నిండాయి ఎక్కువ అలసిపోయేలా పని చేయకు” అంటూ ప్రేమగా నాన్న అమ్మని కోప్పడడం వినిపించింది.
“బుజ్జిగాడు తంతున్నాడండి” అంటూ అమ్మ మురిసిపోతూ నాన్నతో అనడం వినిపించింది. ఆనందంగా నవ్వుతున్న నాన్న గొంతుక వినిపించింది.
త్వరగా బయటికి వచ్చి అమ్మను చూసి మురవాలని నాన్న చేయి అందుకోవాలని ఆతృత పెరిగింది.
ఇంతలో “నొప్పి మొదలైంది అండి” అన్న అమ్మ మాటలు వినిపించాయి. కొద్దిసేపటికి ఎవరో లాగేసినట్టు అయింది. భయపడి నేను ఏడుపు మొదలు పెట్టాను.
“నేనున్నాను నాన్నా” అంటూ ప్రేమగా దగ్గరికి తీసుకున్న నాన్న స్పర్శ తగిలింది. ఎంతో అలసినా, ఆనందంగా నన్ను చూస్తున్న అమ్మని చూశాను.
“ఇదిగోరా మీ అమ్మ” అంటూ అమ్మ చేతికి నన్ను ఇచ్చారు నాన్న. ఆ స్పర్శ తగిలి అద్భుతమైన ఆనందమే నాకు.
హమ్మయ్య, నా ప్రపంచం నుండి నన్నే ప్రపంచం అనుకున్న అమ్మానాన్నలను చూశాను. బయట ప్రపంచం చూడ్డానికి చాలా సమయం ఉందిలే అని వారి చల్లని ఒడిలో సేద తీరాను. ఆ లాలి పాటను మరి మరి వింటూ, ఆస్వాదిస్తూ నిదురపోయాను.
