Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సౌందర్య లహరి

[రోహిణి భైరవజోశ్యులు గారు రచించిన ‘సౌందర్య లహరి’ అనే కథని అందిస్తున్నాము.]

లేత గులాబీరంగుచీర కట్టుకుని, పొడవైన జడ కొసలను అల్లుకుని, కళ్ళకు కాటుక దిద్దుకుందామని అద్దంలో చూసుకుంది సౌందర్య.

అంతే.. కెవ్వున కేకేసింది.

అద్దంలో వికారమైన రూపం.

‘ఎవరిదా రూపం? తనదేనా.. అవును.. తనదే ఆ రూపం.’

‘అయ్యో భగవంతుడా!’ అంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది.

“సౌందర్యా! ఏమిటే ఆ అరుపులు?” అని కుదుపుతూ లేపుతున్న తల్లి శ్యామలను అయోమయంగా చూసింది.

“ఏమైంది? ఎందుకలా కేకలేసావ్? ఏమైనా పీడకల గానీ వచ్చిందా?” అంటూ తాగటానికి కాస్తనీళ్ళు ఇచ్చింది శ్యామల.

అప్పుడు తేరుకుంది సౌందర్య. టైమ్ చూసింది. నాలుగుగంటలు చూపిస్తోంది గోడ గడియారం.

వెంటనే లేచి లైట్ వేసుకుని అద్దం ముందుకెళ్ళి నిలుచుంది.

మళ్ళీ అదే వికృతరూపం.. నల్లగా, పీలగా పొట్టిగా ఉంది తను. పిలకలాంటి జడ, ఒక కన్ను సొట్టబోయింది, మొహంమీద స్పోటకం మచ్చలు.. ‘ఏమిటి! తను ఇలా ఉంది?’ తనమీద తనకే అసహ్యం వేసింది.

కళ్ళు నులుముకుని మళ్ళీ చూసింది. ఈసారి కనబడింది అసలైన రూపం.

దబ్బపండులాంటి శరీరచ్చాయ, నల్లటి పొడవాటి జడ, అందమైన మీనాల్లాంటి పెద్దపెద్ద కళ్ళు.

‘హమ్మయ్య! ఎంత హడలిపోయింది తను!’ అనుకుని నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంది. మరీమరీ చూసుకుంది తనఅందాన్ని.

“ఈ రాత్రప్పుడు లైట్ వేసి అలా ఎంత సేపు చూసుకుంటావే అద్దంలో! ఇలావచ్చి కాసేపు పడుకో” తల్లి హెచ్చరించే సరికి స్పృహలోకి వచ్చింది సౌందర్య. వచ్చి తల్లిపక్కన పడుకుంది.

“అమ్మా! తెల్లవారుఝామున వచ్చే కలలు నిజమౌతాయట కదా” అడిగింది శ్యామలను.

“నీకేమైందే? రాత్రంతా అరుస్తూ అందరినీ నిద్రలేపావ్. ఇప్పుడేమో ఇలాంటి తిక్క ప్రశ్నలు వేస్తున్నావు. నోరుమూసుకుని పడుకో!” అన్న తల్లి కేకలతో కళ్ళు మూసుకుని పడుకుంది సౌందర్య.

పడుకుందన్న మాటే కానీ అద్దంలోని ఆ వికృతరూపం పదేపదే గుర్తుకు రాసాగింది.

“సౌందర్యా! కాలేజీకి టైమ్ అయింది. లే!” అని అక్క పావని నిద్రలేపేవరకు మెలకువ రాలేదు.

ఒక్కసారి ఉలిక్కిపడి లేచింది. గబగబా లేచి బాత్ రూమ్ లోకి దూరింది రెడీ అవడానికి.

***

పద్మనాభరావు, శ్యామలలకు ఇద్దరు పిల్లలు.

పెద్దమ్మాయి పావని.. డిగ్రీ పూర్తిచేసింది. సంబంధాల వేటలో ఉన్నారు. చిన్నమ్మాయి సౌందర్య. ఇంటర్ రెండో సంవత్సరంలో ఉంది.

పద్మనాభరావుది గవర్నమెంట్ ఆఫీస్‌లో చిన్న గుమాస్తా ఉద్యోగం. ఊరిలో కాస్త పొలం ఉంది. దానిమీద వచ్చే కాస్త ఆదాయంతో సంసారం ఏ ఒడిదుడుకులు లేకుండా సజావుగా సాగిపోతోంది.

ఇద్దరు పిల్లలు చూడడానికి చక్కగా ఉంటారు. అందరికన్నా మిన్నగా ఉంటుంది సౌందర్య అందం.

సౌందర్య పుట్టినప్పటినుండి అందరూ ఆ అమ్మాయి అందాన్ని పొగడడం, అందానికి తగ్గపేరు అనడంతో ఆ అమ్మాయి కాస్త పొగరుగా తయారైంది. అందంగాలేని పిల్లలతో అసలు స్నేహం చేసేది కాదు. ఈ ప్రవర్తన చూసి ఆ పిల్లలు ఆమెకు దూరంగా ఉండేవాళ్ళు. బాగా చదువుకునే పిల్లలతో స్నేహం చేయడం మొదలు పెట్టేవాళ్ళు. ఇది ఆమె భరించలేకపోయేది. ఆమె అహం దెబ్బ తినేది.

అందాన్ని మెరుగులు పరచుకోవడంలో చూపించే శ్రద్ధ చదువులో చూపించేది కాదు. అందుకే అత్తెసరు మార్కులతో పాస్ అయింది. ఇప్పుడు డిగ్రీ కాలేజీలో చేరింది.

అబ్బాయిలంతా తన వెంటపడడం, తన కడగంటి చూపులకై తపించిపోవడం, కొందరు ప్రేమలేఖలు రాయడం.. అంతా రంగులకలగా ఉండేది. మిగిలిన అమ్మాయిలు తనవైపు ఈర్ష్యగా చూస్తుంటే తను నవ్వుకునేది.

సౌందర్యకు ఒకటే కొరత. తన అందానికి తగ్గట్టు తండ్రి దగ్గర డబ్బులు లేకపోవడం. కనీసం తనకు కాబోయే భర్తకు కార్లు, బంగళాలు ఉండాలని, తనను ఏరికోరి వివాహం చేసుకోవాలని కలలుకనేది.

అలా నవ్వుతూ తిరుగుతూ వుండగానే మూడు సంవత్సరాల డిగ్రీ చదువు ఇట్టే అయిపోయింది.

ఈమధ్య కాలంలో పావనికి పెళ్లి కుదిరింది. ఆ పెళ్లికొడుకు అతి చిన్న ఉద్యోగస్థుడు.

“అక్కా! ఆఫీసర్ అయితేగానీ ఒప్పుకోకు” అన్నది.

ఆ మాటలకు పావని నవ్వి ఊరుకున్నది. మనసులో మాత్రం, ‘మనలాంటి మధ్య తరగతి ఆడపిల్లలకు అలాంటి కోరికలు ఉండకూడదు. ఎక్కువ కట్నం ఇచ్చి పెద్ద సంబంధాలు తెచ్చే స్థోమత తమ తండ్రికి లేదు. ఈ అమ్మాయి పరిస్థితులను ఎప్పుడు అర్థం చేసుకుంటుందో?’ అనుకుని నిట్టూర్చేది.

పావని పెళ్లి ఇంటిముందర పందిరి వేసి అతిసామాన్యంగా చేసి తృప్తిగా నిట్టూర్చాడు పద్మనాభరావు.

ఇక సౌందర్య పెళ్లి చేయడం ఒక పెద్దగండంగా మారింది. వచ్చిన సంబంధాలన్నీ ఏదో ఒక వంకపెట్టి తిరగ్గొట్టేసేది. తండ్రితో తెగేసి చెప్పింది అక్కలా గుమాస్తా పెళ్ళికొడుకును తెస్తే తను చేసుకోదని.

తన అందాన్ని చూసి బాగా డబ్బున్నవాడు కారులో వచ్చి చేసుకుంటాడని కలలు కంటూ ఉండేది.

చివరకు ఒక ఆఫీసర్ సంబంధం వచ్చింది. కట్నం కావాలన్నారు. సౌందర్య అహం దెబ్బతిన్నది. ‘తనలాంటి అందగత్తెను కట్నం కావాలని ఎలా అడిగారు?’ అని ఒకటే మథన పడసాగింది. ఇక ఆ సంబంధమూ పోయినట్టే అనుకున్నారు అంతా.

కానీ ఆఅబ్బాయి పట్టుపట్టి, తల్లిదండ్రులను ఒప్పించి, కట్నం లేకుండా సౌందర్యను పెళ్లి చేసుకున్నాడు. ఆఫీసర్ వరుడు వచ్చాడని సంతోష పడ్డది. అతను కట్నం లేకుండా కోరి చేసుకోవడంతో సౌందర్య గర్వం ఇంకొంచెం పెరిగింది.

పెళ్లయ్యాక కొత్తజంట సినిమాలకు షికార్లకు సరదాగా తిరిగారు. కాశ్మీర్ కు హనీమూన్ వెళ్లారు.

***

ఇక మామూలు సంసారం మొదలయ్యాక అసలు సమస్య ఎదురైంది అభిరామ్‌కు.

చీరలనీ, మేకప్ సామాన్లనీ డబ్బు విచ్చలవిడిగా ఖర్చుపెట్టేది. అభిరామ్ ముందులాగా తనను పొగడడం లేదని అలిగేది.

ఏదో పెద్ద ఆఫీసర్ అంటే చేతినిండా డబ్బు ఉంటుందని కలలుకన్న తనకు.. అది కల్ల అని తేలిపోయింది.

అభిరామ్‌కు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. చెల్లెలి పెళ్ళికోసమని కొంత డబ్బు పంపేవాడు. కొంతలోకొంత తండ్రికి సాయపడాలని అతని కోరిక. అతను ఇలా డబ్బును అత్తింటి వాళ్ళకోసం ఖర్చు చేయడం చూస్తే సౌందర్యకు ఒళ్ళు మండేది.

ఒకటి రెండుసార్లు అత్త, మామ, ఆడబడుచులు ఇంటికి వస్తే, వాళ్ళతో అంటీ ముట్టనట్టుగా ఉండేది. అత్తమామలు తనను కట్నం అడిగారని పదేపదే అంటూ దెప్పిపొడిచేది. పైగా ఆడపడుచు తనంత అందంగా లేదని మిడిసిపడేది. దాంతో వాళ్ళు అభిరామ్ ఇంటికి రావడం తగ్గించారు.

అభిరామ్‌కు కూడా సౌందర్య స్వభావం చిరాకు కలిగించేది.

***

ఇంట్లో విసుగ్గా ఉండే సౌందర్యకు ఆ కాలనీలో ఆడవాళ్ళతో స్నేహం కలిసింది. వాళ్లంతా తన అందాన్ని ఆరాధనగా చూడడం, బాపు బొమ్మలాగా ఉందనడం తనకు ఎంతో నచ్చింది.

వాళ్ళతో పాటు కిట్టీ పార్టీలకు వెళ్ళేది. ఒకరోజు దీప ఇంట్లో కిట్టీపార్టీకి వెళ్ళింది. అందంగా చీర కట్టుకుని వెళ్ళేటప్పటికి అందరూ వచ్చేశారు. అందరూ తన కోసమే ఎదురుచూస్తున్నట్టు అనిపించింది.

అక్కడ ఖాళీగా ఉన్న సోఫాలో అలేఖ్య పక్కన కూర్చుంది. వాళ్లంతా ఇంకా ఎవరికోసమో ఎదురు చూస్తున్నారు. ఆ విషయమే అలేఖ్యను అడిగింది.

“ఈ చివరి ఇంట్లోకి కొత్తగా ఎవరో వచ్చారని తెలుసు కదా! ఆవిడ ఇక్కడికి వస్తుందట”

“మరి ఎందుకు ఆలస్యం చేస్తోంది” అన్నది సౌందర్య చిరాగ్గా మొహం పెట్టి.

“ఆవిడ ఇలాంటి వాటికి రానన్నదట. మనవాళ్ళే రమ్మని బలవంతపెట్టారు” అన్నది అలేఖ్య.

“అంత బతిమిలాడాల్సినంత గొప్ప వ్యక్తా?” అని ఆశ్చర్యంగా అడిగింది.

వీళ్ళిలా మాట్లాడుకుంటూ వుండగానే ఒకావిడ లోపలికి వస్తూ కనిపించింది.

కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది సౌందర్య! మరుక్షణం ఆమె మొహంలో రంగులు మారిపోయాయి.

నల్లగా, పొట్టిగా, పొట్టిజడతో, ఒక కన్ను చిన్నగా.. వికారంగా కనిపించింది సౌందర్యకు.

‘ఈవిడ కోసమా ఇంతమంది ఎదురు చూసేది’ అనుకున్నది ఆశ్చర్యంగా.

ఆమెను ఎక్కడో చూసినట్టు అనిపించింది సౌందర్యకు ఎక్కడ చూసిందో గుర్తుకు రాలేదు.

ఆమెను పరిచయం చేసింది షాలిని. “ఈమె పేరు లహరి. కొత్తగా మన కాలనీకి వచ్చారు”

ఆవిడ అందరికీ నమస్కారం చేసి, “ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి! ఇంట్లో మా అత్తగారు మామగారు ఉన్నారు. వాళ్లకు భోజనంపెట్టి వచ్చేటప్పటికి ఈ టైమ్ అయింది” అంటూ సౌందర్య పక్కన కూర్చుంది. ఆమె తనపక్కన కూర్చోవడం సౌందర్యకు అస్సలు నచ్చలేదు.

కాసేపయ్యాక కావాలని మంచినీళ్ళ కోసం లేచి, నీళ్ళు తాగాక వేరే చోట కూర్చుని ‘హమ్మయ్య!’ అని ఊపిరి పీల్చుకుంది. పార్టీ ముగిశాక అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు.

వచ్చేవారం అందరినీ తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది లహరి. “అలాగే” అన్నారు అంతా.

ఇంటికి వచ్చిన ఆమెకు హఠాత్తుగా లహరిని ఎక్కడ చూసిందో గుర్తుకు వచ్చింది.

ఆరోజు కలలో తన మొహం అద్దంలో చూసుకున్నప్పుడు ఇలాంటి వికృత రూపమే కనపడింది.

అది గుర్తుకు వచ్చి ఒళ్ళు జలదరించింది

***

ఒకరోజు మధ్యాహ్నం అలేఖ్య వచ్చింది. “రేపు మనం లహరి ఇంటికి వెళ్ళాలి గుర్తుందిగా!” అని గుర్తు చేసింది.

“అబ్బే! నేను రాను. నాకిష్టం లేదు” అన్నది సౌందర్య మొహం అదోలా పెట్టి.

సౌందర్య మనసులోని విషయం అర్థం అయింది అలేఖ్యకు. “లహరి గురించి తెలిస్తే నువ్విలా మాట్లాడవు” అంటూ ఇంకా ఏమో చెప్పబోయింది.

“ఏమిటో ఆవిడ గొప్పతనం?” అన్నది ముఖం చిట్లిస్తూ.

“లహరి భర్త మీవారి ఆఫీస్ లోనే పనిచేస్తున్నాడట తెలుసా!” అన్నది అలేఖ్య.

‘అవునా!’ అన్నట్టు చూసింది సౌందర్య.

“లహరి కూడా పెళ్లికి ముందు, అమర్ ఆఫీస్‌లో ఉద్యోగం చేసేదట. తన జీతంలో కొంతభాగం పేదవిద్యార్థుల కోసం ఖర్చు చేసేదట. ఎవరికి ఏకష్టమొచ్చినా నేనున్నానంటూ వెళ్లి సహాయం చేసేదట. ఈమె చేసే సేవా కార్యక్రమాలు చూసి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అమర్. పెళ్లయ్యాక అత్తమామలను చూసుకోవడానికని ఉద్యోగం మానేసిందట. ఉచితంగా పెయింటింగ్స్, సంగీతం నేర్పిస్తుంది. అందుకే ఎప్పుడూ బిజీగా ఉంటుంది.” చెప్పడం ముగించింది.

“లహరిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడా? వాళ్ళు బాగా డబ్బున్నవాళ్లా? వాళ్ల డబ్బుకు ఆశపడి చేసుకున్నాడేమో?” అనుమానంగా అడిగింది సౌందర్య.

“ఊహూ! వాళ్ళు మనలాంటి సామాన్యమైన మధ్యతరగతివాళ్ళు” అలేఖ్య చెప్పింది.

ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు సౌందర్య.

“సరేకానీ రేపు తయారుగా ఉండు వెళదాం” అని వెళ్ళిపోయింది అలేఖ్య.

***

మరుసటిరోజు అందరూ లహరి ఇంటికి వెళ్ళారు. లహరి అత్తగారు వీళ్ళను ఆప్యాయంగా ఆహ్వానించి సోఫాలో కూర్చోబెట్టింది. లహరి ఇల్లు చాలా అందంగా ఉంది. గోడలపైన లహరి వేసిన పెయింటింగ్స్, అక్కడక్కడ తను స్వయంగా తయారుచేసిన ఫ్లవర్ వాజ్‌లు, పువ్వులు..

అన్నిటినీ పరిశీలనగా చూస్తున్న సౌందర్య సడెన్‌గా అమర్, లహరిల ఫోటో చూసి నిర్ఘాంత పోయింది!

అమర్ ఎంతో అందంగా, ఠీవిగా ఉన్నాడు ‘కాకిముక్కుకు దొండపండులాగా’ అనుకున్నది.

“క్షమించండి! వంటింట్లో ఉన్నాను” నవ్వుతూ వచ్చింది లహరి.

ఇంతలో “అమ్మా! బజారు నుంచి ఏమైనా తెమ్మంటారా?” అంటూ ఇద్దరు పిల్లలు వచ్చారు.

“ఏమి అవసరంలేదులే రాజు! నిన్ననే అన్నీ తెచ్చుకున్నాను” అని, ఆశ్చర్యంగా చూస్తున్న వీళ్లవైపు తిరిగి. “వీళ్లపేర్లు రాజు, విజయ్.. నా పెంపుడు కొడుకులు” అని ఆప్యాయంగా వాళ్ల జుట్టు నిమురుతూ అన్నది.

అర్థం కాలేదు సౌందర్యకు. ఏమిటి విషయం అన్నట్టు అలేఖ్యను మోచేత్తో పొడిచింది.

అంతలో మిగిలిన స్నేహితురాళ్ళు వచ్చారు.

‘మళ్ళీ చెప్తాను’ అన్నట్టు సైగ చేసింది అలేఖ్య.

లహరి అందరికీ టిఫిన్లు, కూల్ డ్రింక్స్ ఇచ్చింది. అందరి కోరికపై అద్భుతంగా కొన్ని త్యాగరాయ కృతులు పాడింది లహరి.

‘నిజంగా గాన కోకిల’ మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది సౌందర్య.

ఇంటికి వస్తూండగా అసలు విషయం చెప్పింది అలేఖ్య. లహరి ఇంట్లో ఉన్న పిల్లలను ఆమె చదివిస్తోందట.

లహరి అంటే సౌందర్యకు ఉన్న ఏహ్యత కాస్త తగ్గింది. కానీ పూర్తిగా కాదు.

***

ఒకరోజు సినిమానుంచి వస్తున్న వీళ్ళ స్కూటర్‌ను ఒక ఆటో గుద్దేసింది. రోడ్ మీద పడిపోయిన వీళ్ళను ఎవరో ఆస్పత్రిలో చేర్చారు.

అభిరామ్‌కు కొంచెం తక్కువగా తగిలాయి దెబ్బలు. కానీ సౌందర్యకు కాస్త గట్టిగా తగిలాయి. ఆమె షాక్‌కు గురై స్పృహ కోల్పోయింది.

మధ్యలో కాస్త కళ్ళు తెరచిన సౌందర్యకు ఎవరో అస్పష్టంగా ఉన్న స్త్రీరూపం కనపడింది. ఆమె తన నోటిలో టాబ్లెట్ వేసి నీళ్ళు తాగించడం గమనించింది.

‘ఎవరూ? అమ్మ.. అవును.. అమ్మ వచ్చింది తన కోసం’ అనుకుంటూ మళ్ళా మత్తులోకి జారిపోయింది.

పొద్దున పూర్తిగా మెలకువ వచ్చి గబుక్కున లేవబోయింది సౌందర్య. కానీ ఒళ్ళంతా భారంగా అనిపించి చూసుకుంది. తలకు, చేతులకు, కాళ్ళకు కట్లుకట్టి ఉన్నాయి.

ఏమీ అర్థం కాలేదు. ఆమె లేవడం గమనించిన అభిరామ్, “ఎలా ఉంది సౌందర్యా?” ఆమెను పట్టుకుని అడిగాడు.

“నాకేమయింది?” అయోమయంగా అడిగింది.

ప్రమాదం జరిగిన సంగతి చెప్పాడు అభిరామ్.  మెల్లగా జరిగిన సంఘటనలన్నీ గుర్తుకు వచ్చాయి.

“రాత్రి మా అమ్మ వచ్చినట్టుంది. ఏదీ?” అని చుట్టూ చూసింది.

“ఆవిడ మీ అమ్మ కాదు సౌందర్యా! ఆమె లహరి. మనకు యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిన వెంటనే ఆమె భర్తతో కలసి వచ్చింది. రెండు రోజులనుంచీ మనకు భోజనం తెస్తోంది. నీకు తోడుగా ఇక్కడే ఉంది. పొద్దున్నే ఇంటికి వెళ్ళింది. అదిగో మాటల్లోనే వచ్చింది” అప్పుడే లోపలికి వచ్చిన లహరిని చూస్తూ అన్నాడు అభిరామ్.

“అవునా!” లహరి వైపు విభ్రాంతిగా చూస్తూ అన్నది సౌందర్య.

“సౌందర్యా టిఫిన్ తింటావా! అసలు మొహం కడుక్కున్నావా?” అంటూ సౌందర్యను పట్టుకుని లేపుతూ అన్నది.

సౌందర్యను బాత్‌రూమ్ లోకి తీసుకెళ్ళి మొహం కడిగించి మంచం మీద కూర్చోబెట్టి, టిఫిన్ ఇచ్చింది.

“తినగలవా సౌందర్యా! లేక స్పూన్‌తో నోట్లో పెట్టాలా” అంటున్న లహరిని ఆశ్చర్యంగా చూసింది.

లహరిని వారించి తనే తినసాగింది.

“మీకెలా కృతజ్ఞతలు తలపాలో అర్థం కావడం లేదు” టిఫిన్ తింటున్న అభిరామ్ లహరిని చూస్తూ అన్నాడు.

“అయ్యో! దానిదేముంది. ఎవరైనా ఇలాగే సహాయం చేస్తారు. నాకే ఇలాంటి సమస్యవస్తే మీరు చేయరా?” అన్నది లహరి.

అప్పుడే ఊరినుంచి వచ్చిన సౌందర్య అమ్మానాన్నలు కంగారుపడుతూ “ఏమయింది తల్లీ?” అని కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ సౌందర్య దగ్గరకు వచ్చారు.

“బాగానే ఉందండి. కొద్దిగా షాక్ వల్ల స్పృహతప్పి పడిపోయింది. ఇంకో పదిహేను రోజులకు కోలుకుంటుంది. కంగారేం లేదు” అన్నాడు అభిరామ్.

“ఈ అమ్మాయి ఎవరూ?” సాలోచనగా లహరిని చూస్తూ అడిగింది శ్యామల. లహరిని పరిచయం చేశాడు.

“సౌందర్యను ఆస్పత్రిలో చేర్చినప్పటినుంచి, ఈవిడ ఇక్కడే ఉండి సహాయం చేస్తోంది.” అన్నాడు అభిరామ్.

“అవునా!” అంటూ లహరి చేతులు పట్టుకుని, “దేవతలాగా వచ్చి, మా అమ్మాయికి సహాయం చేస్తున్నావు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేము” అన్నది కృతజ్ఞతగా శ్యామల.

“మీరు పెద్దవారు. అలా అనకూడదు. ఈరోజు వంట ఏమీ చేసుకోకండి. నేను పంపిస్తాను” అన్నది లహరి.

మరుసటిరోజు సౌందర్యను ఇంటికి తీసుకుని వచ్చారు. ఆరోజు అభిరామ్ తల్లీతండ్రీ వచ్చి రెండురోజులు ఉండి వెళ్ళిపోయారు.  ఇంకో నాలుగురోజులు ఉండి, పావనికి పురిటిరోజులు దగ్గరపడ్డాయని, తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. తమవెంట రమ్మని సౌందర్యను పిలిచారు. కానీ ఆమె రానన్నది.

ఇంకో పదిహేను రోజులకు కానీ సౌందర్య పూర్తిగా కోలుకోలేదు. అన్ని రోజులు సెలవుపెట్టడం కష్టం అవడంతో ఏం చేయాలో తోచలేదు అభిరామ్‌కు.

ఆ సమయంలో దేవతలాగా ఆదుకున్నది లహరి. రోజూ సౌందర్యకు మందులు వేయడం, నడిపించడంలాంటివన్నీ చేసింది. దీనితో కాస్త త్వరగానే కోలుకుంది సౌందర్య.

పూర్తిగా కోలుకున్న సౌందర్య ఒకరోజు జడ వేసుకుందామని అద్దం దగ్గరకు వెళ్ళి తన మొహం చూసుకుంది.. గొంతులోనుంచి రాబోయిన కేక గొంతులోనే ఆగిపోయింది. మందులు ఎక్కువగా వాడుతున్నందువల్లనేమో జుట్టంతా పల్చగా అయిపోయింది. కంటికింద గీచుకుపోవడం వల్ల ఒక కన్ను కాస్త చిన్నగా అయిపోయింది. ఎంత వికారంగా ఉంది తను! ఇంకా నయం! కంట్లో గీచుకుపోయి ఉంటే కన్నుపోయి గుడ్డిది అయేది. తన ప్రతిబింబాన్ని చూసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.

‘ఈ అందాన్ని చూసుకునా!.. ఇన్ని రోజులూ గర్వపడింది తను. ఛీ.. ఛీ.. లహరిలాంటి వాళ్ళను ఎంత అసహ్యించుకున్నది’

ఇంతలో లహరి నవ్వుతూ వచ్చింది లోపలికి. అదేమిటి ఇప్పుడు లహరి ఇంత అందంగా కనిపిస్తోంది? స్వచ్చమైన మనసున్న వాళ్ళు నవ్వితే అందంగా కనబడతారని ఇప్పుడే అర్థమైంది. అందరినీ మనస్ఫూర్తిగా ప్రేమించే ఆమె అందంముందు తానెంత! అందుకే కాలనీలో ఉన్న వాళ్లంతా లహరితో స్నేహం చేయాలని తహతహలాడుతారు.

లహరి అత్తగారి కళ్ళల్లో ఒక రకమైన తృప్తి, సంతోషం కనబడేది. అదే తన భర్త, అత్తగారి కళ్ళల్లో అసంతృప్తి, వ్యతిరేకభావన కనబడుతాయి. ఇదంతా తన ప్రవర్తన వల్లేగా.

“ఏంటి ఆలోచిస్తున్నావు సౌందర్యా?” అన్నది.

“నన్ను క్షమించు లహరీ! గర్వంతో కళ్ళు మూసుకుపోయిన నాకు బుద్ధి రావడానికే దేవుడు ఈ పరీక్ష పెట్టాడు” లహరిని అల్లుకుపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది సౌందర్య.

“ఈమాత్రం దానికే అంతలా బాధపడాలా? పద! భోజనం చేద్దువు కానీ!” అని లోపలికి తీసుకెళ్ళింది లహరి.

***

ఇప్పుడు లహరితో పాటు సౌందర్య కూడా సేవాకార్యక్రమాల్లో పాల్గొంటోంది. అత్తామామలతో, ఆడపడుచుతో ఎంతో స్నేహంగా ఉంటోంది.

Exit mobile version