Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సారీ అత్తమ్మా..

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన వి. శాంతి ప్రబోధ గారి ‘సారీ అత్తమ్మా..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

త్తమ్మ జీవితం ముగిసింది.

ఈ మధ్య అత్తమ్మ భావోద్వేగాలకు అతీతంగా ఉంటున్నదని మామయ్య చెప్పినప్పుడు, ఆయనకు కొంత విశ్రాంతి, వెసులుబాటు లభిస్తుందని అనుకున్నాం నేను, సూర్య.

కానీ ఇంతలోనే పూర్తి విశ్రాంతి దశలోకి వెళ్ళిపోతుందని అనుకోలేదు. కార్డియాక్ అరెస్ట్ అని చందు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు.

చాలా దిగులుగా ఉంది. ఆవిడతో కొంత సమయమైనా గడపలేని మా స్థితికి మమ్మల్ని మేం క్షమించుకోలేకుండా ఉన్నాం.

వేల మైళ్ళ దూరంలో ఉన్న మేం మాతృదేశం వెళ్లి చివరి క్షణాలు అత్తమ్మతో గడపాలనే ప్రయత్నంలో ఉన్నాం. సూర్య తల్లిని చూసి ఐదేళ్ల పై మాటే. అందుకే ఎప్పుడెప్పుడా అని తహతహలాడుతున్నాడు.

అయితే, ఇండియా వెళితే వీసా స్టాంపింగ్ వేయించుకోవాలి. అందుకు డేట్స్ దొరకడం లేదు. ఈ లోగా ఈ వార్త.

ఎలా ఇప్పుడు? సూర్య దుఃఖాన్ని నేనెలా తీర్చగలను?

కాస్తో కూస్తో మాట్లాడగలిగిన రోజుల్లో వీడియో కాల్ చేస్తే ‘మనిద్దరం బడికెళ్లి ఆడుకుందామా..’ అని ఒకసారి, ‘చందమామ రమ్మని పిలుస్తోంది. నువ్వూ వస్తావా నాతో’ అని అడిగిన అత్తమ్మే కళ్ళముందు కదలాడుతున్నది.

అత్తమ్మ అనారోగ్యం అనేక సంకేతాలు ఇచ్చినప్పటికీ మేమెవరం పట్టించుకోలేదు. అందరం చాలా నిర్లక్ష్యం చేశాం. కొంత దృష్టి పెట్టి ఉంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేదేమో! ఆవిడ ఇంత త్వరగా వెళ్ళిపోయేవారు కాదేమో! పూర్తిగా కాపాడలేకపోయినా కనీసం ఇంకొంత కాలం ఆవిడ మాతో ఉండేదని వ్యథ చెందుతున్నది మనసు.

ఎదుటివారిని అమితంగా ప్రేమించే అత్తమ్మ నా చిన్నతనం నుంచే తెలుసు. సహజంగా ఆవిడ చాలా చురుకైన వ్యక్తి. అందరికీ తలలో నాలుకలా ఉండేది.

ఆ రోజుల్లోనే ఆవిడ పోస్ట్ గ్రాడ్యుయేట్. మంచి ఉద్యోగం వదిలేసి ఇంటిని, పిల్లల్ని చూసుకుంది. ఇంటిని ఇంటి వాతావరణాన్ని సంతోషంగా, సుఖంగా ఉండేలా చూసుకుంటుందని అంతా ఆదర్శ గృహిణి అని సర్టిఫికెట్ ఇచ్చారు.

బహుశా ఆదర్శ గృహిణి అన్న పొగడ్త ఆమెను ఆమె మర్చిపోయేంత మాయ చేసిందేమో! ఇంటికి కట్టి పడేసిందేమో!

నా పెళ్ళై అత్తింట్లో అడుగుపెట్టినప్పటి నుంచి గమనిస్తున్నా అత్తమ్మ ఆదర్శ గృహిణి బరువు, బాధ్యత సంతోషంగా మోస్తున్నది.

ఆ బరువు, బాధ్యతలే ఆమెను ఈ విధంగా మార్చేశాయా, తనలోకి తాను తొంగి తీసుకోవడం మొదలు పెట్టి కోల్పోయిన జీవితాన్ని తలుచుకుని కుంగిపోయిందా అని సందేహం.

ఏరి కోరి మనువాడిన మామయ్య అత్తమ్మతో కావలసినవన్నీ చేయించుకోవడమే కానీ ఆవిడకి ఏం కావాలో ఏనాడూ పట్టించుకోలేదు. భూదేవంత ఓర్పుతో మెసిలే ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకోలేదు. అదే అత్తమ్మ పరిస్థితికి కారణమేమో అనిపిస్తుంది. అఫ్‌కోర్స్, అది నిజం కావచ్చు, కాకపోవచ్చు. నేను ఈ మాట పైకి అనలేను. అంటే ఎవరు ఎలా అర్థం చేసుకుంటారో తెలీదు.

అలాగని అత్తమ్మను అడగలేను. ఆవిడ లోపల ఏమి సుడులు తిరుగుతున్నాయో.. ఎన్ని అగ్నిపర్వతాలు పేలుతున్నాయో.. ఏవి ఆమెను ఈ స్థితికి తెచ్చాయో చెప్పే స్థితిలో లేదామె.

ఒకప్పుడు పిల్లల కోసం వంట చేయడం అంటే అత్తమ్మకు చాలా ఇష్టం. భర్త అర్ధరాత్రి వచ్చినా అప్పటికప్పుడు వేడివేడిగా వండి వడ్డించడం, ఎంత కష్టమైనా ఎదుటి వారిని సంతృప్తి పరచడానికి, ఆనంద పరచడానికి యత్నించడం ఆమె అలవాటు.

అవసరార్థం నగరానికి వచ్చిన కుటుంబ స్నేహితులో, బంధువులో ఎప్పుడూ ఎవరో ఒకరు ఇంట్లో ఉండేవారు. వారి ఆతిథ్యానికి ఏ మాత్రం తక్కువ కాకుండా అందరినీ ఆదరించేది. అడపా తడపా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నించింది కానీ ఆమెకు అవకాశం చిక్కేది కాదు.

నా పెళ్ళైన ఈ ఐదారేళ్ళ కాలంలో రెండేళ్ల పైగా అత్తమ్మని తరచూ కలవడం దగ్గరగా ఉండటం వల్ల ఆమె ప్రవర్తనలో మార్పు నాకు స్పష్టంగా తెలుస్తున్నది. కానీ ఇంట్లో ఎవరు దాన్ని గమనించినట్లు లేరు. గమనించినా పట్టించుకోలేదో, ప్రాముఖ్యత ఇవ్వలేదో, వాళ్ళ పనులన్నీ సక్రమంగా జరిగి పోతున్నాయి కాబట్టి అలసత్వమో తెలియదు.

అత్తమ్మ మాత్రం ఎప్పటిలాగే తన వాళ్ళందరినీ ప్రేమిస్తూ ఉంది. తాను లేకపోతే వాళ్ళ జీవితం ఆగిపోతుందేమో అన్న భ్రమలో ఉంది. కానీ తనను తాను ప్రేమించుకోలేదు. తనకేమి కావాలో ఇచ్చుకోలేదు. అది ఆవిడ తప్పు.

మామయ్య ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు. ఆయన తన ఆసక్తులపై దృష్టి పెట్టారు. స్థానిక రాజకీయాల్లో చురుకైన పాత్ర తీసుకున్నారు. విజిటింగ్ ప్రొఫెసర్‌గా వెళ్ళేవారు. ఆర్థిక అంశాలపై విశ్లేషణలు చేసేవారు. పరిశోధన పత్రాలు రాసేవారు. చాలా పుస్తకాలు రాశారు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఇంటాబయటా పొందారు. జీవితాన్ని మరింత బిజీగా మార్చుకున్నారు. ఎప్పుడైనా సమయం ఉంటే టీవీ చూస్తూనో, టిఫిన్ చేస్తూనో అత్తమ్మ చేసే పనులకు ఏదో ఒక వంక పెట్టి సాధించడం మాత్రం మానలేదు.

పిల్లలు పెద్దవాళ్లై చదువులు ఉద్యోగాల కోసం తలో దిక్కు అయ్యాక ఆమె చాలా ఒంటరి అయింది. అమ్మ వెనుక తిరిగిన పిల్లలు పెద్దయ్యాక నాన్నకు బాగా దగ్గరయ్యారు. స్నేహితుల్లా కబుర్లు చెప్పుకునేవారు. అటువంటి ముచ్చట్లేవీ తల్లితో ఉండేవి కావు. వాళ్ళ దృష్టిలో అమ్మకు ఏమీ తెలియదు.

నాకు అత్తమ్మ పట్ల సానుభూతి. ఆవిడ కుంగుబాటుకు కారణం ఒంటరితనమేనా ఇంకా ఏమైనా కారణాలున్నాయా అని ఆలోచించేదాన్ని.

ఆవిడ అత్తగారిగా నాపై ఏనాడూ పెత్తనం చేయలేదు. నాతో చాలా స్నేహంగా ఉండేది. అందుకే ఆవిడ వ్యక్తిగతం అయినా ఒకటి రెండు సార్లు మామయ్య అట్లా మాట్లాడుతుంటే ఎందుకూరుకుంటుందో అడిగాను.

అది ఆయన స్వభావం. నాకు ఆయనకు అలవాటైపోయింది అని చెప్పిందే కానీ పల్లెత్తు మాటనలేదు. ఉత్తమ గృహిణి కదా మరి! తండ్రిని చూస్తూ పెరిగిన సూర్య కూడా అలాగే ప్రవర్తిస్తే భరించే ఓపిక నాకుందా అని నాలో నేను ప్రశ్నించుకునేదాన్ని.

అత్తమ్మపై అధికారం చెలాయించి, తన పనులన్నీ చేయించుకునే మామయ్య మనసుకు ఆమె దగ్గర కాలేకపోయిందేమో. మామయ్య భార్య సమస్యను గుర్తించి దృష్టి అంతా భార్యపైనే పెట్టాల్సిన సమయం ఇది. కానీ వాస్తవాన్ని ఆయన గమనించట్లేదు.

ఆమె మానసిక కల్లోలం, అస్థిర ప్రవర్తన నాటకం అని చాలా సార్లు చిరాకు పడేవాడు. పెళ్లిళ్లకు, ఫంక్షన్స్‌కి అత్తమ్మ, మామయ్య జంటగా వెళ్లి అక్షింతలు వేసొచ్చేవారు కానీ ఆ ఇద్దరి మధ్య కనిపించని దూరం ఉండేది.

ఆయన అత్తమ్మతో కొంత సమయం గడిపితే బాగుంటుంది, కానీ ఆ విషయం నేను ఎలా చెప్పాలని తటపటాయించి మా ఆయన సూర్యకి చెప్పాను. అంతా నీ అపోహ. అమ్మకేమైంది బాగుంది. అతిగా ఆలోచించి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకు. నీ హద్దుల్లో నువ్వు ఉండమని సలహా.

ఆగలేక ఒకటి రెండు సార్లు ఆడపడుచు వెన్నెలతో అత్తమ్మ విషయం ప్రస్తావించా. తనేమో అమ్మవి పోస్ట్ మోనోపాజ్ లక్షణాలు అని తేలిగ్గా తీసి పారేసింది.

మా పెళ్ళైన కొద్ది కాలానికే సూర్య ఉద్యోగరీత్యా అమెరికా వెళ్ళిపోయాడు. నేను కూడా విజిటింగ్ వీసాతో వెళ్లి ఆరు నెలలు ఉండి వచ్చేశా. డిపెండెంట్‌గా వెళ్లి ఉద్యోగం లేకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకే వచ్చేశా. హెచ్ 1బి వీసా కోసం ప్రయత్నిస్తున్నాను బెంగుళూరులో ఉద్యోగం చేస్తూ తరచూ ఇంటికి వచ్చేదాన్ని. ఆ సమయంలో వెన్నెల పెళ్లి కుదిరింది. మా మరిది చందు యూకే లో ఉన్నాడు.

పెళ్లి పనులు మొదలయ్యాయి. అత్తమ్మ ప్రవర్తనలో తేడా స్పష్టంగా బయటపడుతున్నది. పెళ్లి షాపింగ్‌లో ఆసక్తి చూపలేదు. మా పెళ్లి సందర్భంలో నగలు, బట్టలు కొనడం, బంధువులను పిలవడం వంటి విషయాలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించిన అత్తమ్మ ఇప్పుడు అసలు ఉత్సాహం చూపటం లేదు, చాలా నిరుత్సాహంగా, నిర్లిప్తంగా ఉంటున్నది. తల్లి ఏవీ సరిగ్గా పట్టించుకోవట్లేదని వెన్నెల బాధ పడుతున్నది.

నేను ఈ ఇంట అడుగు పెట్టిన కొత్తలో వంటగదిలో ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టి ఉండేవి. ఇప్పుడు అలా కాకుండా ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయి.

కోడలు వచ్చిందని ఇల్లు, వంటిల్లు పట్టించుకోవడం లేదని మామయ్య అత్తమ్మను చివాట్లు వేసేవారు. మొదట్లో అదే నిజం కావచ్చని నేనూ భావించా.

కూతురు పెళ్ళికి సంబంధించిన పనుల ఒత్తిడిలో ఉందేమో, కొడుకులిద్దరూ దేశాంతరాలలో ఉన్నారు. వెన్నెల కూడా ఇప్పుడు వెళ్ళిపోతుందని దిగులు కావచ్చు అని భ్రమపడ్డా.

వెన్నెల పెళ్ళికి తను బట్టలు కొనుక్కోవడం పట్ల అత్తమ్మ అస్సలు ఉత్సాహం చూపలేదు. వెన్నెల నేను గట్టిగా ఒత్తిడి చేసి కొనిపించాం.

కన్యాదానం జరగాలి. అత్తమ్మ కనిపించలేదు. వెతికితే దూరంగా ఎక్కడో కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఉంది. ఆమె పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. ప్రవర్తన చాలా వింతగా ఉంది. తప్పని సరై ఏదో మొక్కుబడిగా చెప్పిన పనులు చేస్తున్నది. ఏ మాత్రం సంతోషంగా కనిపించలేదు.

మా పెళ్ళిలో, బంధువుల పెళ్లిళ్లలో ఆమె ఎంతో ఉత్సాహంగా ఉన్న అత్తమ్మ చాలా విచారంగా కనిపిస్తున్నది. త్వరలో బయటపడుతుందని అనుకున్నాను.

వెన్నెల కొత్త జీవితం ప్రారంభించబోతున్న ఉహల్లో, ఉత్సాహంలో తల్లి ప్రవర్తనలో వచ్చిన మార్పుకి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు.

పెళ్లయి కొత్త అల్లుడు కూతురు ఇంటికి వస్తే అత్తమ్మ వంట ఆసక్తిగా చేయలేదు, ప్రత్యేక వంటకాలు లేవని నువ్వయినా ఇక్కడ ఉండాల్సింది అంటూ బెంగుళూరులో ఉన్న నాకు వెన్నెల ఫిర్యాదు.

నేను వీలైనంత ఎక్కువ సార్లు అత్తమ్మ దగ్గరకు వెళ్తున్నా. ఆమె చాలా నిశ్శబ్దంగా మారిపోయింది. అనాసక్తిగా ఉంది.

వెన్నెల హైదరాబాద్ లోనే మరో ప్రాంతంలో ఉంటున్నది. ఆమె ఉద్యోగం, కొత్త కాపురం మధ్య తల్లి కోసం ఎక్కువ సమయం కేటాయించలేక పోతున్నది.

ఈ లోగా నా హెచ్ వన్ వీసా వచ్చి అమెరికా వెళ్ళిపోయా.

మొదటి కాన్పు కోసం తల్లిగారింటికి చేరిన వెన్నెల ఓ రోజు ఫోన్ చేసి ‘వదినా అమ్మ ఇలా మారిపోయిందేమిటి? పసిబిడ్డను ఎత్తుకోవడానికి భయపడింది. వంట కూడా సరిగా చేయడం లేదు. ఒకటి చేయబోయి మరొకటి చేస్తున్నది.

నాన్న తప్పులు ఎత్తి చూపితే మర్చిపోయానని సర్ది చెబుతుంది. లేదా కోపంతో విరుచుకపడుతున్నది.

నాన్నేమో అమ్మ అజాగ్రత్తగా వ్యవహరిస్తోందని, ఉద్దేశపూర్వకంగానే ఆమె అలా ప్రవర్తిస్తోందని కోపగించుకుంటున్నారు. చిరాకు పడుతున్నారు.

నా బిడ్డకు స్నానం చేయించడం, నూనె పెట్టడం వంటి పనులు నాకేం తెలుసు. అమ్మ ఆ పనులు చేయాలి. నాకు నేర్పించాలి. కానీ అదేం లేదు. నా తర్వాత ఈ ఇంట్లోకి వచ్చిన పసిబిడ్డని ఎంత మురిపెంగా చూసుకోవాలి చెప్పు. కానీ అమ్మలో ఆ ఆనందం ఉత్సాహం ఏ కోశానా లేవు. ఆసక్తి చూపలేదు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అమ్మ అవేమీ పట్టించుకోవట్లేదు.

ఒకప్పుడు నేను నాన్న పక్కన చేరి అమ్మను చాలా విసిగించాను. వేధించాను. అయినా తన ప్రేమను పంచింది. ఇప్పుడు నేను తనకేమీ కానట్లుగా ఉంది. అసలు ఈవిడ మా అమ్మేనా అని సందేహం వస్తున్నది వదినా.

ఒక్కోసారి నాక్కూడా కోపం వచ్చి చిరాకు పడుతున్నా. విరుచుకుపడుతున్నా. అయినప్పటికీ మౌనమే అమ్మ సమాధానం.

నేను పుట్టినప్పుడు పురిటి కోసం అమ్మ పుట్టింటికి వెళ్లలేదట. పచ్చి బాలెంతగానే ఇంటి పనులు, మా ముగ్గురి పనులు చేసుకునేదట మొన్న మా పెద్దమ్మ వచ్చినప్పుడు చెప్పింది. నేను ఒక్క కూతుర్ని పెంచలేక పోతున్నా. అమ్మ ముగ్గురు పిల్లల్ని ఎలా పెంచిందో కదా!

చిన్నప్పటి నుంచి నేను నాన్న కూతురిని. అమ్మకి ఎప్పుడు విలువ ఇవ్వలేదు. ఎప్పుడు ఏదో ఒకటి అని ఎంత బాధపెట్టానో’ అని తలుచుకుని వెన్నెల బాధ పడింది. తనకు తాను అసహ్య పడింది.

అప్పటికి ఏదో సముదాయించా. రోజు రోజుకు వెన్నెల బిడ్డ పెరుగుతున్నది, కానీ అత్తమ్మ మానసిక స్థితి దిగజారుతున్నది. ఎక్కువ సమస్యలు సృష్టిస్తున్నది.

అత్తమ్మ కుంగుబాటుకు లోనవుతున్నది. ఆ విషయం మెల్లగా మాటల్లో పెట్టి అత్తమ్మ నుంచి తెలుసుకోవాలి. లేదా సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకువెళ్లాలి.

మేము ఇప్పుడప్పుడే వచ్చే పరిస్థితి లేదు. తన కుటుంబం, పిల్లలు, ఉద్యోగంతో చాలా బిజీగా ఉన్నది వెన్నెల. అప్పుడప్పుడు తల్లిదండ్రులను చూడడానికి వచ్చినప్పటికీ తల్లి ఇన్నేళ్ళలో ఎంతగా మారిందో గమనించుకో లేదు.

అత్తయ్య చాలా స్తబ్దుగా తయారయిందని, నిశ్శబ్దంగా మారిపోయిందని, ఎటో చూస్తూ కుర్చుంటుందని, మతిమరుపు బాగా పెరిగిపోయిందని మావయ్య మాతో అప్పుడప్పుడు చెప్పేవారు. మిగతా అన్ని విషయాలు బాగానే ఉన్నాయని చెప్పేవారు.

డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు నేను అత్తమ్మతో మాట్లాడడానికి ప్రయత్నం చేసేదాన్ని. ఒక్కోసారి చాలా బాగా మాట్లాడేది. ఒకోసారి ఆసక్తి చూపేది కాదు. కాల్ తీసుకునేది కాదు.

అనుకోకుండా పనిలో భాగంగా ఒకరోజు అల్జీమర్స్ – డిమెన్షియా వర్క్‌షాప్‌కి హాజరయ్యాను. డాక్టర్ నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌లో వాటికి సంబంధించి ప్రతి హెచ్చరిక సంకేతాన్ని వివరిస్తున్నారు. చాలా శ్రద్ధగా విన్నా. ఆ లక్షణాలు వింటున్నప్పుడు అత్తమ్మ గుర్తొచ్చింది. ఆమె ప్రవర్తన, లక్షణాలు కనిపిస్తున్నాయి.

అత్తమ్మ డిమెన్షియా పేషెంట్ అని అర్థమైంది. ఇన్నాళ్లు ఆ విషయాన్ని గమనించనందుకు అపరాధ భావన నాలో.

వ్యాధి రివర్స్ చేయడం గురించి వైద్యులు చెబుతారని ఆశించా. అప్పుడు అత్తమ్మ సమస్యలు కూడా రివర్స్ చేసి పరిష్కరించవచ్చని ఆశపడ్డా. అది న్యూరో డీజనరేటివ్ వ్యాధి అని రివర్స్ చేయలేమని తెలిసి చాలా బాధ కలిగింది.

అత్తమ్మే కాదు, భారతీయ స్త్రీ జీవితంలో భార్యగా, తల్లిగా సాంప్రదాయిక సంరక్షణ బాధ్యతలు కనిపిస్తాయి. అల్జీమర్స్ వచ్చిన స్త్రీల సామర్థ్యం తగ్గుతుంది. బాధ్యతలు వెనక్కి అవుతాయి. అందువల్ల ఆమెను సంతానం, కుటుంబం, సమాజం నిందిస్తుంది. ప్రశ్నిస్తుంది. వ్యాధి పెరిగిన కొద్దీ ఆమె అనేక అవమానాలు పొందుతుంది. ఆమె వ్యాధిని గుర్తించరు. ప్రవర్తనను నమ్మరు. ఆమెకు సానుభూతి ఉండదు. క్షిణిస్తున్న ఆమె పరిస్థితిని అర్థం చేసుకోరు. ఆమెను, ఆమె సామర్థ్యాలను చిన్నచూపు చూస్తారు. అల్జీమర్స్ వచ్చిన మహిళలను కుటుంబం, సమాజం దూరం చేస్తుంది. బహిష్కరిస్తుంది.

స్త్రీ వివక్షతో ఆమెను చిన్న చూపు చూసే సంకుచిత సమాజంలో ఆమె పరిస్థితి సంక్షోభంలో పడుతుంది. సమాజం, సంస్కృతి, చరిత్ర, కాల్పనిక సాహిత్యం అన్ని ఆమెకు చేదు అనుభవాలే మిగులుస్తున్నాయి.

అత్తమ్మ పరిస్థితి నాకు అర్థమైతే లాభం లేదు. మిగతా కుటుంబ సభ్యులకు ఎలా అర్థం చేయించాలో, వైద్యులను సంప్రదించాల్సిన అవసరం గురించి సూర్యతో, మామయ్యతో, వెన్నెలతో, చందుతో ఎలా ప్రస్తావించాలో తెలియలేదు. ఆలస్యం చేసే కొద్దీ పరిస్థితి మరింత అదుపు తప్పే ప్రమాదం ఉంది కాబట్టి నెమ్మదిగా సూర్యకి చెప్పాను. తర్వాత మామయ్యతో మాట్లాడాను.

అత్తమ్మ సమస్యను ఎవరు ఒక మానసిక సమస్యగా గుర్తించడం లేదు. మామయ్యని ఒప్పించి వైద్యుడి దగ్గరకు ఎలా అయినా తీసుకెళ్లమని వెన్నెలకి చెప్పాను. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపుకి మానసిక వైద్యుడి దగ్గరకు వెళ్లాలా అని ఆశ్చర్యపడింది. తల్లి లేని నేను అత్తమ్మ పట్ల అతిగా ఆలోచిస్తున్నానని అభిప్రాయపడింది.

ఇంట్లో అందరూ విద్యావంతులే. కానీ మానసిక వైద్యుడిని సంప్రదించడం అనే ఆలోచనే వాళ్ళకి పరాయిది. మానసిక సమస్యలు, కౌన్సిలింగ్ వంటి పదాలు మనకు పరాయివి. భయపెట్టేవి అని స్పష్టమైంది.

అత్తమ్మ పరిస్థితి మరింత దిగజారింది. మేం ఫోన్ చేస్తే ఆమె గుర్తించడం లేదు. ఓ సారి తనకు పిల్లలు లేరని చెప్పింది. మరోసారి బిడ్డ మాత్రమే ఉందని చెప్పింది.

ఆ మాటలు సూర్యకి చాలా బాధ కలిగించాయి. తల్లికి దూరంగా ఉండడం వల్ల ఆమె అలా మాట్లాడుతున్నదని భావించాడు.

హాస్పిటల్‌కి తీసుకెళ్లమని మామయ్యకు, వెన్నెలకు ఫోన్ చేసి చెప్పాడు. పెద్ద కొడుకు చెప్పాక మామయ్యకు తప్పలేదు.

న్యూరాలజిస్ట్ దగ్గర చూపించమన్న నా సలహా మేరకు పెద్ద హాస్పిటల్‌లో అవుట్ పేషెంట్‌గా చూపించారు. జూనియర్ డాక్టర్ చూశారు. ఎటువంటి రక్త పరీక్షలు చేయలేదు. స్కాన్ చేయించలేదు. అల్జీమర్స్‌కు ఇచ్చే మందులేవో ఇచ్చారు. ఆ డాక్టర్ వ్యాధి గురించి వివరించలేదు. మందుల గురించి వాటి దుష్ప్రభావాల గురించి ఏమి చెప్పలేదు. ఏదో ఒక మందు ఇస్తే తప్ప తృప్తి చెందని మనుషులు అన్నట్లు, ఏమీ తెలియని మనుషులన్నట్లు ఆ కుర్ర డాక్టర్ ప్రవర్తించాడని మామయ్య విసుక్కున్నారు.

ఆ మందులు ప్రారంభించిన తర్వాత అత్తమ్మ పరిస్థితి మరింత దిగజారింది. అప్పటివరకూ తన పనులు తాను చేసుకోగలిగిన అత్తమ్మని బాత్ రూమ్‌కి కూడా వెళ్లలేకపోయింది. నడవడానికి కాళ్లు ఎలా పైకి ఎత్తాలో తెలియక తికమక పడింది. ఏ కాలు ఎత్తాలో ఏ కాలు కదపాలో తెలియక అయోమయంగా చూస్తుంది. మళ్ళీ మళ్ళీ చెప్పినా అర్థం కాదు. మనం చేసే సూచనలు ఆమెను మరింత గందరగోళానికి గురి చేసి కదలికలు ఆగిపోయాయి. బిగుసుకుపోయింది. అటువంటప్పుడు ఆమెను కదల్చడం చాలా కష్టం. మామూలప్పుడు కూడా వేలాడిపోతూ కింద పడిపోయేది.

బిగుసుకు పోయినప్పుడు ఆమెను మంచం దాకా తీసుకెళ్లడం చాలా కష్టమైన పని. చాలా బరువుగా ఉంటుంది. అది మామయ్యకి మరింత విసుగు చిరాకు తెప్పించేది.

అల్జీమర్స్ డిమెన్షియా ఉన్న వ్యక్తులు ఆందోళన చెందడం అసాధారణం ఏమీ కాదు. ఆ ఆందోళనతోనే టాయిలెట్ ఎక్కడుందో తెలుసుకోలేరు. తమ ఇంట్లో తాము లేరని అనుకుంటారు. నేను వెళ్ళిపోవాలి అంటారు.

వారిని ఎంత శాంతియుతంగా ఉంచగలిగితే వారి జీవన నాణ్యత అంత పెంచగలిగినట్టు. ఈ విషయం వైద్యులు మామయ్యకు చెప్పాలి. కానీ చెప్పలేదు.

ఇన్నాళ్ళూ కూర్చున్న చోటు నుంచి కదలకుండా పనులు చేయించుకున్న మామయ్య ఇప్పుడు ఆమెకు చేయాల్సిన రావడం కొత్త అనుభవం. అది ఆయనకు నచ్చట్లేదు. అసహనం పెంచింది.

అత్తమ్మేమో తానిప్పుడు ఇంట్లో ఉన్నప్పటికీ ఇంటికి వెళ్ళాలి అంటుంది. అంటే వారి మనసు ప్రస్తుతంలో లేదు, గడచిన కాలంలో ఎక్కడో చిక్కుబడి ఉంది. తానిప్పుడు భర్తతో ఉంది. కానీ ఆమె మనసు తన తల్లిదండ్రులతో ఉన్న రోజుల్లో ఉంది. తర్కించే సామర్థ్యం ఉండదని మామయ్యకి అర్థమయ్యేలా చెప్పాలని చూసి నేను చివాట్లు వేయించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.

ఓ రోజు మామయ్య బయటికి వెళ్లి మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి సాయంగా ఉంచిన సహాయకురాలు హెల్ప్ హెల్ప్ అని అరుస్తున్నది. అప్పుడు అత్తయ్య బాత్ రూమ్ నుండి మంచం దగ్గరికి నడుస్తున్నది. ఆయా గొంతు విని ఆయన పరుగు పరుగున వెళ్లారు. జారిపడుతున్న అత్తమ్మను మంచంపైకి చేర్చడం ఆమె వల్ల కావడం లేదు.

అత్తమ్మ నోటి నుండి నురగ, వాంతి వస్తున్నట్టు వాక్ వాక్ అంటున్నది. ఆమె ఒళ్ళంతా వణికిపోతోంది. మొత్తమ్మీద కస్టపడి ఆమెను కుర్చీలో కూచోబెట్టగలిగారు.

డాక్టర్‌తో మాట్లాడితే ఆ సమయంలో అత్తమ్మకు స్ట్రోక్ వచ్చిందన్నారు.

మరో రోజు అత్తమ్మకు తోడుగా అదే గదిలో పడుకున్న ఆయా మంచి నిద్రలో ఉన్నప్పుడు జరిగిందది. తెల్లవారు ఝామున అత్తమ్మ తనకు తాను లేవడానికి ప్రయత్నించి మంచం పై నుంచి కింద పడిపోయింది. పెద్ద శబ్దం వచ్చింది కానీ ఆమె చాలా నిశ్శబ్దంగా ఉంది.

అత్తమ్మ తలకు దెబ్బ తగిలింది. రక్తం కారుతున్నది. మరో చోట పెద్ద బొప్పి కట్టింది. అంబులెన్స్ పిలిచి హాస్పిటల్‌కి తీసుకెళ్ళారు. అవేకాక ఇంకా కొన్ని దెబ్బలు తగిలాయని ఆసుపత్రికి వెళ్ళాక తెల్సింది. ఎడమ భుజం, మణికట్టు ఫ్రాక్చర్ అయ్యాయి. ఆమె ఎడమ తొడ ఎముక విరిగింది.

ఆమె వయసు, ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకుని వైద్యులు ఆపరేషన్ చేయలేమన్నారు. ఖరీదైన ఆసుపత్రి వైద్యులు వారం రోజులు ఉంచి ట్రాక్షన్ పెట్టారు. తర్వాత ఆసుపత్రిలో ఉంచినా లాభం లేదు ఇంటికి తీసుకు పొమ్మన్నారు.

బెడ్, ఆక్సిజన్ వంటి సదుపాయాలన్నీ సమకూర్చుకొన్నాక ఒక నిస్సహాయ స్థితిలో అత్తమ్మ ఇంటికి చేరింది, ఇంటి దగ్గర బరువైన మూటలు పెట్టి ట్రాక్షన్ ఇచ్చారు.

ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు వైద్యులు. ఆమె ముక్కులో ఒక ట్యూబ్, కాథెటర్, ట్రాక్షన్ ఉన్నాయి.

అత్తమ్మ మహా అయితే కొన్ని నెలల కంటే ఎక్కువ సమయం లేదని అర్ధమవుతున్నది. దూరాన ఉన్న మాకు ఇంటి వద్ద ఉన్న వాళ్ళకి పెద్ద సవాలుగా ఉంది.

ఇలాంటి స్థితి నుంచి అత్తమ్మ బయటపడింది. కానీ, ఇంట్లో వాళ్ళని ఒకసారి గుర్తిస్తే మరోసారి గుర్తించేది కాదు. మామయ్యని చూసి ఏయ్ ముసలీ అని పిలవడం చూసి మేం అంతా నవ్వుకుంటే మామయ్య ఉక్రోషంతో ఉడుక్కున్నారు.

ఆమె స్వభావం మారిపోయింది. ఉద్రేకపడి పోతున్నది. చిరాకు ఎక్కువైయింది.

విచిత్రంగా తనో కాలేజీ అమ్మాయిలా ప్రవర్తించడం మొదలుపెట్టింది. నెరసిన జుట్టు చూసి బాధ పడిపోయింది. బాల మెరుపు అని చందు చెబితే, అవునవును, సరిగ్గా చెప్పావు అంటూ తలూపి ‘ఎవరబ్బాయి నువ్వు’ అని అడిగింది.

హైదరాబాద్‌లో మానసిక వైద్యుల వివరాలు ఆన్లైన్‌లో సేకరించి ఆశ హాస్పిటల్‌లో అప్పోయింట్మెంట్ తీసుకుని మామయ్యకు చెప్పారు సూర్య. తప్పని సరై మామయ్య అత్తమ్మను తీసుకొని అక్కడికి వెళ్లారు.

అక్కడ డాక్టర్‌కి విషయం చెప్పినప్పుడు మందు డోసు తగ్గించాడు. పరీక్షలు చేసి అల్జీమర్స్ అని స్పష్టం చేశారు. అప్పుడు కూడా అత్తమ్మ వ్యాధి రివర్స్ అవుతుందని నమ్మకంతో ఉన్నారూ మా వాళ్ళు.

ఆ సమయంలో న్యూరో అసెస్మెంట్ చేశారు. దానికి వెన్నెల హాజరైంది.

డాక్టర్ అత్తమ్మకు వెన్నెలను చూపి ఎవరు అని అడిగితే ‘నా చెల్లెలు’ అని చెప్పిందని వెన్నెల అల్లాడిపోయింది. అమ్మ నా పేరు ఎట్లా మరిచిపోయింది. ఎదుట ఎప్పుడూ కనిపించే నన్ను మర్చిపోయి ఎక్కడో ఉన్న తన చెల్లి పేరు చెప్పడం ఏంటని బాధపడింది.

ప్రగతిశీలమైన వ్యాధి అని, మందులు కొంత సహాయపడతాయని ఆపకుండా వాడమని వైద్యులు సూచించారు. అత్తమ్మలో భ్రాంతులు పెరుగుతూనే ఉన్నాయి. ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చెబుతూనే ఉంది. ప్రవర్తన వింతగా ఉంది.

అద్దంలో చూసి తనతో తాను మాట్లాడుకుంటుంది. అపార్టుమెంట్ నుంచి బయటికి వెళ్లిపోవాలనుకుంటుంది. తన తండ్రి ఇంటికి వెళ్లిపోవాలని అనుకుంటుంది. ఆమె ప్రవర్తన ఎదుర్కోవడం చాలా సమస్యగా ఉంది.

కుటుంబంలో ఎవరూ అత్తమ్మ లాంటి సమస్య ఉన్న వ్యక్తుల్ని మీరు చూసి ఉండకపోవచ్చు. కలిసి ఉండక పోవచ్చు. కానీ మీరు ఆమెతో ఎప్పటిలా ఉండండి. ప్రేమగా చూడండి. ఆమె పట్ల జాలి చూపకండి. కుటుంబంలో భాగంగా ఉంచండి. సహనంగా వ్యవహరించండి. అత్తమ్మ ఇప్పటికీ మీ భార్య. ఆమె బాధ్యత మీది. ఆమె వ్యాధి సంకేతాలను విస్మరించకండి. ఆమె మాట్లాడేటప్పుడు పదాలు అందవు. భాష దొరకదు. అల్జీమర్స్ వచ్చినప్పటికీ ఆమెకు జీవితం ఉందని గుర్తించండి. మనం అత్తమ్మతో ఎంత సౌమ్యంగా ఉంటె ఆవిడ జీవితం అంత తేలిక అవుతుంది. కాబట్టి ఆమెతో యథావిధిగా ఉండటానికి ప్రయత్నించండి అని మామయ్యకు వీలయినప్పుడల్లా చెబుతూనే ఉన్నాను.

నేను వెళ్లిన అల్జీమర్స్ డిమెన్షియా క్లాసు నాకు ఎంతగానో ఉపకరించింది. నా కుటుంబానికి వ్యాధి గురించి అర్థమయ్యేలా చెప్పడానికి దోహదమైంది.

మామయ్య కూడా పెద్దవారపోతున్నారు. ఆయనకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువ తిరగలేకపోతున్నారు. దాంతో ఆయన చిరాకు, కోపం ఇప్పుడు మరింత పెరిగాయి.

ఆయన ఒకటి చెబితే అత్తమ్మ అర్ధంకాక మళ్ళీ మళ్ళీ అడిగేది. చెప్పింది అర్థం చేసుకునేది కాదు. తికమక పడేది లేదా మరొకటి చేసేది. ఆమె కావాలనే అతనితో ఇలా ప్రవర్తిస్తుందని, ఇబ్బంది పెడుతున్నదని అనుకుంటారు మామయ్య. అత్తమ్మ డిమెన్షియా వల్లనే అలా ప్రవర్తిస్తున్నదని అతనికి ఎంత నచ్చచెప్ప జూసినా నమ్మేవారు కాదు. ఆమె వింత ప్రవర్తన అంగీకరించేవారు కాదు.

మారిన అత్తమ్మ వ్యక్తిత్వం మామయ్యలో చాలా ఒత్తిడి కలిగించింది. అతను అనేకసార్లు ఉద్రేకానికి గురయ్యాడు. అత్తమ్మతో వేగలేకపోతున్నానని ఆమెను ఏదైనా హోమ్‌లో చేర్చుదామని ప్రయత్నించారు. కానీ ఆమె మానసిక స్థితికి ఏ ఓల్డేజ్ హోమ్ అవకాశం ఇవ్వలేదు.

కుటుంబం చాలా కష్టకాలంలో ఉన్నది. దూరాన ఉన్న మేం ఆర్థిక సహాయం అందించగలం కానీ వచ్చి ఉండలేని స్థితి. దగ్గర ఉన్న వెన్నెల అత్తమామల సేవ, పసిపిల్లాడి పనులతో తల్లికి తోడ్పాటు అందించలేకపోతున్నాని దిగులుపడేది. ఆమె మనసు తల్లి దగ్గరే ఉండేది.

మామయ్య అలసిపోయినా ఎంతో నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పటికీ సహాయం తీసుకోవడానికి ఇష్టపడలేదు. అందరికీ ఆందోళన కలిగిస్తూ సవాలు విసురుతూ అత్తమ్మ అనేక ఎపిసోడ్ లతో ఒక్కోసారి ఒక్కో విధంగా ప్రవర్తన. ఆమెకు హెల్త్ కేర్ ఇవ్వడం ఒక పెద్ద యుద్ధమే అవుతున్నది. అటువంటి సమయంలో చందూ ఇంటి వద్ద ఉండడం మాకు పెద్ద రిలీఫ్.

ఓ రోజు చందూని చూసి ‘ఓ.. వచ్చావా, నువ్వు వచ్చావా, పద మనింటికి పోదాం’ అంటూ కుర్చీలోంచి లేచింది. ఎప్పుడూ ఏటో వెళ్ళలంటుంది. వెళ్లే శారీరక స్థితిలో లేదు కానీ ఉంటేనా.. మామయ్య ఇంటికి తాళం వేసి ఉంచాల్సి వచ్చేది.

వీల్ చైర్‌లో చందూ లేదా ఆయమ్మ అప్పుడప్పుడు ఇంటికి దగ్గరలోనే ఉన్న పార్క్‌కి తీసుకెళ్తున్నారు. అలా వెళ్లడం ఆమెకు చాలా ఇష్టం.

అత్తమ్మ తన జుట్టును ముడివేసుకునేది. చూడడానికి బాగానే కనిపించేది. కానీ దువ్వుకునేది కాదు. భయంకరమైన చిక్కులు పడిపోయి ఉంది. అది అత్తమ్మకు కష్టమైన పని అని వెన్నెల పార్లర్‌కి తీసుకెళ్లి జుట్టు కత్తిరించేసి క్రాఫ్ చేయించింది. అద్దంలో చూసుకుని అత్తమ్మ చాలా బాధపడింది.

ఆ తర్వాతి రోజు ఇంటికి వచ్చిన వ్యక్తిని చూసి తన జుట్టు కత్తిరించడానికే వచ్చారని ఊహించుకుని ఆ వ్యక్తిపై విరుచుకుపడింది. ఆ వచ్చిన వ్యక్తి తన జుట్టు కత్తిరించిందని ఆరోపించింది.

మామయ్య మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా ఉన్నాయి. సర్జరీ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. తాను సర్జరీ చేయించుకోకపోతే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నచ్చచెప్పి చికిత్సకు ఒప్పించాడు చిన్న కొడుకు. చివరికి చేయించుకున్నాడు. బాగానే తిరగ గలుగుతున్నారు. ఆయన చిరాకు కాస్త తగ్గింది. అత్తమ్మ సంరక్షణ బాధ్యత తీసుకున్నారు. ఆమె పనులు చాలా పనిచేస్తున్నారు. పూర్తిస్థాయి సహాయకురాలిని పెట్టుకోవడానికి ఒప్పుకోవట్లేదు.

మందుల వల్లే అత్తమ్మ అలా అయిపోయిందని మొదటి నుంచి మామయ్య ఆరోపణ. ఆయన అత్తమ్మకు మందులు వేయడం మానేశారు. ఆమెలో మార్పు కనిపించింది. భ్రాంతులు తగ్గాయి. మందులు వేసుకున్నప్పుడు అమ్మ గద్ద కళ్ళతో కనిపించేది. ఇప్పటికీ మతిమరుపు ఉంది కానీ గందరగోళం, ఆందోళన కలిగించే ప్రవర్తన ఆగిందని చెప్పారు మామయ్య.

మందులు సరిపడకపోవడం వల్ల అత్తమ్మ, ఆమెతో పాటు కుటుంబమంతా చాలా ఇబ్బంది పడ్డామని బాధ. మందుల దుష్ప్రభావాల గురించి డాక్టర్లు హెచ్చరించనందుకు, అత్తమ్మలో కలిగే భ్రాంతుల గురించి చెప్పినప్పుడు కూడా మందులు మానేయమని డాక్టర్ చెప్పలేదు. కొంతమందికి ఆ మందులు బాగా పనిచేసి ఉండొచ్చు. ప్రయోజనం పొంది ఉండొచ్చు. కానీ అందరికి ఒకే విధంగా పనిచేయవని డాక్టర్‌కి తెలిసే ఉంటుంది కదా.. దుష్ప్రభావాల గురించి చెప్పి ఉండాల్సింది కదా. తమని నమ్మి వచ్చే రోగుల పట్ల ఇంత నిర్లక్ష్యమా.

మామయ్య అత్తమ్మని చూసుకుంటున్నాడు. ఉన్మాద లక్షణాలు అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి. కానీ వాటి తీవ్రత తక్కువగా ఉంది. అప్పుడప్పుడు అద్దంతో, దిండుతో మాట్లాడుతుంది. లేదా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది.

ఒకసారి కుర్చీ మించి పడిపోయి చేతికి కుట్లు వేయాల్సి వచ్చింది. అక్కడ గోకేది. మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చేది. మామయ్యకు తోడుగా చందూ ఉన్నాడు కాబట్టి సరిపోయింది. లేదంటే చాలా ఇబ్బంది అయ్యేది.

అత్తమ్మ రాత్రిపూట అసలు నిద్రపోవట్లేదు. వచ్చి కాసేపు పడుకో అంటే పడుకోదు. నిద్రపోతే ఎవరో వచ్చి తనను తీసుకుపోతారని భయపడేది. అలాంటప్పుడు ఆమెకు ఇష్టమైన పాతపాటలు చిన్నగా పెడితే వింటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకునేది.

చందూ వచ్చాక మావయ్యకి కొంత వెసులుబాటుగా ఉంది. చేయాలనుకున్న బయట పనులు చేస్తుంటారు. చందూ అత్తమ్మని అల్జీమర్స్ డిమెన్షియా డే కేర్ సెంటర్‌లో చేర్చాడు. అత్తమ్మ అక్కడ ఉంటే మామయ్యకి తోచట్లేదు. ఒంటరితనం ఫీలవుతున్నాడు. ఆశ్చర్యంగా.. అత్తమ్మ సంరక్షణ, ఆమె అవసరాలు తాను తప్ప ఎవరూ చూడలేరని ఆయన ఫీలవుతున్నాడిప్పుడు.

అత్తమ్మను చూసుకోవడంలో ఆయనకు ఒక తృప్తి ఉన్నట్లుంది. ఆయన ఎంతకాలం చూడగలిగితే అంతకాలం అలాగే కొనసాగిద్దామనుకున్నాం. అవసరమైనప్పుడు మనిషి సహాయం తీసుకుంటానని చెప్పారు.

చందూని వెంటనే ఉద్యోగంలో చేరిపొమ్మని మామయ్య గోల. తల్లిని చూసుకుంటాను కొన్నాళ్ళు అంటే మామయ్య అస్సలు ఒప్పుకోలేదు. ఆమె వల్ల పిల్లల జీవితాలు, ఉద్యోగం, వారి బాధ్యతలను ప్రభావం చూపకూడదని అనుకుంటాడు ఆ తండ్రి.

అత్తమ్మకి అల్జీమర్స్ ఉందని కొందరు బంధువులు నమ్మరు. అందువల్ల కూడా మేం సమస్యలు ఎదుర్కొన్నాం. మేము వారికి వివరిస్తాం.

దగ్గరి బంధువులు వచ్చినప్పుడు అత్తమ్మ చాలా సంతోషంగా ఉంటుంది. నిరంతరం అసంబద్ధంగా మాట్లాడుతున్నప్పటికీ అన్ని ప్రశ్నలకు జవాబిస్తుంది. ఆనందిస్తున్నట్టు కనిపిస్తుంది.

ఇంటికి వచ్చినవాళ్లు తర్వాత కాలంలో ఆమె సమాధానాలు అర్థమైనా కాకపోయినా వ్యాఖ్యానించరు. స్నేహంగా చూస్తారు. ఆప్యాయంగా పలకరిస్తారు.

తమాషా ఏంటంటే, ఆమె చిత్తవైకల్యాన్ని గురించి బంధువులకు చెప్పినప్పుడు వాళ్ళు మాకు అత్తమ్మ ప్రవర్తనకు సంబంధించిన పాత సంఘటనలు కొన్ని చెప్పారు. అవి వింటున్నప్పుడు అత్తమ్మకి ఎప్పటి నుంచి ఈ సమస్య ఎదుర్కొంటున్నదో అర్థమవుతుంది.

ఇరుగుపొరుగు రారు. వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అనుకుంటారు. చందు, మామయ్య అత్తమ్మను చిన్న చిన్న ప్రయాణాలకు తీసుకెళుతున్నారు. దగ్గరి బంధువుల ఫంక్షన్స్‌కి తీసికెళుతున్నారు. అలాంటప్పుడు డైపర్ వేసుకోవడానికి చాలా ఇబ్బంది పెడుతుంది. కానీ ఫంక్షన్‌కి వెళ్తున్నామని చెప్పగానే మారు మాట్లాడకుండా డైపర్ వేసుకుంటున్నది. అందువల్ల చిన్న చిన్న ప్రయాణాలు సాధ్యమయ్యాయి.

కుటుంబం అంతా ఎవరికీ చేతనైన పని వాళ్లు చేస్తూ మామయ్యకి భారం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం. మేం ఆర్థిక భారం తగ్గిస్తే, చందూ అత్యవసర పరిస్థితిలో మామయ్యకి తోడవుతున్నాడు. వెన్నెల మానసికంగా చాలా దగ్గరగా ఉంటుంది.

డిమెన్షియా గురించి వీలైనంత సమాచారం తెలుసుకుని కుటుంబ సభ్యుల అవగాహన పెంచే బాధ్యత నాదిగా చేసుకున్నా. ఈ సమయంలో అది కూడా అవసరం.

మామయ్యకి చిన్న చిన్న సలహాలు ఇస్తుంటా. కానీ ఆయన ఎప్పుడు అర్ధిక వ్యవహారాలు మాతో మాట్లాడరు. తనకు నచ్చిన పద్ధతిలో చాలా స్వతంత్రంగా వ్యవహరిస్తారు.

డబ్బు సంపాదన తప్ప కుటుంబ వ్యవహారాలేమీ పట్టించుకోని మామయ్యలో ఈ మధ్య చాలా మార్పు వచ్చింది. అత్తమ్మని విసుక్కోవడం, తగ్గింది. అపార్ధం చేసుకోవడంలేదు. ఆమె నా భార్య. వీలయినంత వరకు చూసుకుంటాను. ఆమె స్థానంలో నేనుంటే ఆమె ఇంతకన్నా బాగా చూసుకుంటుందని నాకు తెలుసు అంటున్నారు.

కొన్ని ఆస్తులు అత్తమ్మ పేరుమీద ఉన్నాయి. వీలునామా వంటి విషయాలు మాట్లాడితే నన్ను అపార్ధం చేసుకుంటారేమో అని ఆ విషయం మామయ్య దగ్గర ప్రస్తావించలేదు.

అయితే అత్తమ్మ మరణం తర్వాత అల్జీమర్స్ డిమెన్షియా వ్యాధుల గురించి పరిశోధించడానికి ఆమె శరీర దానం చేయాలని నా ఆలోచన.

ఆ విషయం వచ్చే ఆదివారం మదర్స్ డే. వాట్సప్ గ్రూప్ కాల్‌లో అందరం కల్సి అత్తమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు అందజేయాలనుకున్నాం. ఆవిడకు మదర్స్ డే అన్నా, మదర్స్ డే బహుమానాలన్నా చాలా ఇష్టం.

ఎలక్ట్రానిక్ ఫోటో ఆల్బమ్ అత్తమ్మకి ఇష్టం. పాతది పనిచేయడం లేదని మదర్స్ డే గిఫ్ట్ గా కొన్నాను. అది పంపిస్తున్నానని చెప్పాలనుకున్నాను.

ఆ సందర్భంలోనే ఇంట్లో అందరికీ శరీర దానం గురించి వివరించి మరో నలుగురిలో అత్తమ్మని చూసుకోవాలనుకున్నా.

ఈలోగా తొందరపడి అత్తమ్మ వెళ్ళిపోయింది. అందరినీ శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయింది.

మదర్స్ డే. శుభాకాంక్షలు అందుకోకుండానే వెళ్లిపోయింది.

సారీ అత్తమ్మా..

Exit mobile version