Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సారీ

[శ్రీమతి అక్షర రాసిన ‘సారీ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

వేగంగా పరుగెడుతున్న క్యాబ్ కంటే వేగంగా పరిగేడుతున్నాయి సునీత ఆలోచనలు. ఉదయం ఆఫీసుకి బయల్దేరే ముందు సునీత, ప్రకాష్ చాలా తీవ్రంగా ఘర్షణ పడ్డారు. ఇక మీదట కలిసి బ్రతకలేకపోతే విడిపోవటమే మేలని చెప్పి ప్రదీప్ మొహం మీద దభేల్‌మని తలపు వేసి బయటకు వచ్చి, అప్పటికే వేచి ఉన్న క్యాబ్‌లో ఆఫీస్‌కి వచ్చేసింది.

పెళ్లి అయిన ఈ నాలుగు ఏళ్లలో వారిద్దరు వాదించుకున్న సందర్భాలు లేకపోలేదు, కానీ తను తల్లి కాబోతున్నదని తెలిసిన దగ్గరనుంచీ ఇద్దరి మధ్య కయ్యాలు ఎక్కువై ఆ ఉదయం చిలికి చిలికి వాన కాదు కాదు కుంభవృష్టే అయింది. కయ్యానికి కారణం – ‘ఆర్థికంగా బాగా నిలదొక్కుకున్నాక సంతాన విషయం ఆలోచిద్దామ’ని ప్రదీప్. ‘ఇప్పటికే చాలా ఆలస్యం అయింది ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాద’ని సునీత, ‘అబార్షన్ చేయించుకోమ’ని ప్రదీప్. ‘వీల్లేద’ని సునీత. తీవ్రమైన మతాభిభేదం.

ఆఫీసుకి వచ్చి కొంత పని చేసుకుని కాసేపటికి మనసు కుదుటపడ్డాక – ‘ఇలా గట్టిగా ఒకరిపై ఒకరు కేకలు వేసుకుని రభస పడే కంటే ఒక్కసారి ఇద్దరం ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావాలి’ అన్న ఆలోచన వచ్చాక మనసు కాస్త స్తిమిత పడి హాఫ్ డే సెలవ పెట్టి తిరిగి ఇంటికి బయల్దేరింది సునీత.

ఈసరికి ప్రదీప్ ఆవేశంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోలేదు కదా అని భయపడి, ఆలస్యం చేయకుండా తను ‘సారీ’ చెపుతూ ప్రదీప్‌కి మెసేజ్ పెట్టి చాలాసేపు అయింది. ఎంత సేపటికి తన మెసేజ్ చూసిన గుర్తు కూడా కనిపించక ఆదుర్దా ఎక్కువ అయింది సునీతకి. పరి పరి విధాలుగా కలుగుతున్న ఆలోచనలు మనసును కంగారు పెడుతుంటే తమ అపార్ట్‌మెంట్ దగ్గర పడిన వెంటనే క్యాబ్ దిగి తమ ఫ్లాట్ వేపు చూసింది ప్రదీప్ ఆచూకీ కోసం. లోపల ఏమీ అలికిడి కనిపించక ‘ఉదయం తను కోపంగా ఆఫీసుకి బయల్దేరి వచ్చేశాక ప్రదీప్ ఏం చేసి ఉంటాడా’ అనుకుంటూ తన దగ్గర ఉన్న డూప్లికేట్ తాళంతో తలుపు మీద చేయి వేసిన వెంటనే తెర్చుకునేసరికి ఒక్క క్షణం లయ తప్పిన గుండెని అదుపులోకి తెచ్చుకుని లోపలికి అడుగు పెట్టింది సునీత.

ఎదురగా అందమైన పువ్వుల గుత్తి పట్టుకుని కళ్ల తోనే సారీ చెప్తూ నిలుచున్న ప్రదీప్‌ని చూసి ఎలా స్పందించాలో అర్థం కాక నిలబడిపోయిన సునీతతో “అలా చూడకు, నీలానే నా కోపం చల్లారాక నీకు మెసేజ్ పెట్టే లోపున వచ్చిన నీ ‘సారీ’ మెసేజ్ చూసి అప్పటికి అప్పుడు ఇలా ప్లాన్ చేశాను” అంటూ సునీతకి పూల గుత్తి అందించాడు ప్రదీప్.

Exit mobile version