[ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం నిర్వహించిన ‘సోమేపల్లి సాహితీ సౌరభం’ కార్యక్రమం పై నివేదిక అందిస్తున్నారు శ్రీ చలపాక ప్రకాష్.]
సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారు చిరస్మరణీయులనీ, ఉన్నత ప్రభుత్వ ఉద్యోగిగా వృత్తి పట్ల నిజాయితీ, నిబద్ధతతో పనిచేయడంతో పాటు సాహిత్య రంగంలో రైతుల, పేద ప్రజల జీవనశైలి, ప్రకృతి పట్ల ప్రేమ, అంతరించిపోతున్న మానవీయ విలువల పట్ల ఆర్ద్రతతో కథలు, కథానికలు, నానీల పేరుతో వ్రాసిన రచనలు సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారి ఉన్నత వ్యక్తిత్వాన్ని, జీవన శైలిని ప్రతిబింబిస్తాయని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో, గుంటూరు జిల్లా రచయితల సంఘం, రమ్య భారతి, సోమేపల్లి లెటరరీ అసోసియేషన్ల సహకారంతో స్థానిక లక్ష్మీపురం కాటన్ అసోసియేషన్ సమావేశ మందిరంలో ‘సోమేపల్లి సాహితీ సౌరభం’ పేరుతో ఐదు సాహిత్య సమావేశాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. తొలుత కీర్తిశేషులు సోమేపల్లి వెంకటసుబ్బయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన తొలి సభకు రాష్ట్ర రచయితల సంఘం కార్యదర్శి చలపాక ప్రకాష్ స్వాగతం పలుకగా అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ సభకు అధ్యక్షత వహించారు.
ప్రారంభ ఉపన్యాసం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రచయితల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ చిల్లర భవానీ దేవి మాట్లాడుతూ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆవిర్భావాల ద్వారా యువ రచయితలకు స్ఫూర్తిదాయకంగా కార్యక్రమాలు నిర్వహించిన గొప్ప మానవతావాది వెంకటసుబ్బయ్య అని కొనియాడారు. సోమేపల్లి వెంకటసుబ్బయ్య స్మారక సంచిక ‘హరిత సంతకం’ గ్రంథావిష్కరణ గావించి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ శివశంకర్ మాట్లాడుతూ వెంకటసుబ్బయ్య కుటుంబ, వృత్తి, సమాజ ధర్మాలు సమపాళ్లలో నిర్వహించి గడిపిన వారి ఉత్తమోత్తమ జీవితం వర్తమాన సమాజానికి ఆదర్శప్రాయం అన్నారు. మానుకొండ ఉపేంద్రరావు, తోటకూర వెంకటనారాయణ, షేక్ ఇస్మాయిల్, వెంకటసుబ్బయ్యతో తమ జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు.
రెండవ సభ సోమేపల్లి సాహితీ విశ్లేషణ సభకు డాక్టర్ వి. నాగరాజ్య లక్ష్మి అధ్యక్షత వహించగా డాక్టర్ సుంకర గోపాలయ్య వచన కవిత్వం, కేజే రమేష్ నానీలపై ప్రసంగించారు. మూడవ సమావేశానికి షేక్ హాసింబి అధ్యక్షత వహించగా నాగిశెట్టి నాగేశ్వరరావు వ్రాసిన ‘నా నానీలు’ పుస్తకాన్ని సోమేపల్లి విజయలక్ష్మి ఆవిష్కరించారు. రాష్ట్ర సంఘం అధ్యక్షురాలు డాక్టర్ సి భవానిదేవి, రాచమల్ల ఉపేందర్ సమీక్ష గావించారు.
‘ప్రాతస్మరణీయులు’ పుస్తకావిష్కరణ అనంతరం 15వ సోమేపల్లి సాహితీ పురస్కారాల సభకు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సాహితీవేత్త కాట్రగడ్డ దయానంద్ మాట్లాడుతూ తన రచనల ద్వారా సమాజ జాగృతికి రచయిత కృషి చేయడం ద్వారా ప్రజల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించుకుంటారని సోమేపల్లి వెంకటసుబ్బయ్య వారసత్వాన్ని ఆయన కుమారుడు శ్రీ వశిష్ఠ కొనసాగించాలని కోరారు.
ఈ సందర్భంగా మొదటి బహుమతి సాధించిన డొక్కు బండి రచయిత వెంకు సనాతనికి, ఆసరా కథా రచయిత మయూఖ, ఉచ్చిష్టం రచయిత సింగరాజు శ్రీనివాసరావులకు ప్రత్యేక ప్రశంస పురస్కారాలు శాలువా జ్ఞాపిక , నగదు బహుమతులను అందజేసి ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు ఎస్ఎం సుభాని, నానా, శ్రీ వశిష్ఠ, విరంచి, ఉమామహేశ్వర రెడ్డి, శర్మ, జయప్రకాష్, పుష్పా దేవి, చంద్రశేఖర్, పలువురు రచయితలు, కవులు, సాహితీవేత్తలు, వెంకటసుబ్బయ్య బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.