[9 ఆగస్టు 2025 రాఖీ పౌర్ణమి సందర్భంగా శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘సోదరసోదరీమణుల అనుబంధాల వేడుక’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
సోదరీ సోదరుల మధ్య
అనురాగం, ఆప్యాయత,
అనుబంధాలకు సూచిక
రక్షాబంధన వేడుక!
తన సోదరుడు తనకే కష్టం
రాకుండా చూస్తాడని,
అసలు కష్టాన్ని దరిచేరనివ్వనంత
ధైర్యాన్ని ఇస్తాడని,
ఆడపడుచులు భావిస్తూ కట్టే
అమూల్య బంధం రక్షాబంధనం!
రాఖీ పండుగ ప్రతి సంవత్సరం
శ్రావణ పౌర్ణమి రోజు వస్తుంది!
అనుబంధాల వేడుకై
కుటుంబ సభ్యుల
ఐక్యతకు కారణమై నిలుస్తుంది!
ద్రౌపది శ్రీకృష్ణుడి గాయపడిన
చేతిని తన చీర ముక్కతో కట్టగా..
కౌరవ నిండు సభలో
దుశ్శాసనుడు ద్రౌపది దేవికి
వస్త్రాపహరణం చేస్తుంటే
శ్రీకృష్ణ భగవానుడు చీరలిచ్చి
ద్రౌపదిని రక్షించాడని
బలిచక్రవర్తి మణికట్టుపై
లక్ష్మీదేవి రాఖీని కట్టి
అతడిని సహోదరుడిగా భావించినట్లుగా..
అమిత పరాక్రముడైన
భారతీయ మహారాజు పురుషోత్తముడికి,
అలెగ్జాండర్ భార్య రోక్సానా రాఖీ కట్టి,
అలెగ్జాండర్ పై దాడి చేయవద్దని కోరినట్లు..
ఇతిహాస పౌరాణికాలలో సైతం
సోదరసోదరీమణుల వాత్సల్యానికి
ప్రతీకగా నిలిచిన పండుగ.. రాఖీ పౌర్ణమి!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.
