[డా. చక్రపాణి యిమ్మిడిశెట్టి రచించిన ‘స్నేహపు గాలులు’ అనే కవితని అందిస్తున్నాము.]
ఎవరెవరు ఎక్కడెక్కడివారైతేనేం
స్నేహపు కొమ్మలపై వాలే చిలుకలే
కలిసారా ఊసుల ఊటలు ఊరుతాయి
భుజాలపై చేతులు భరోసా చాటుతాయి
వెలుగు ఒకరైతే నీడ మరొకరు
పువ్వు ఒకరైతే తొడిమ మరొకరు
ఆకలయినా ఆటలయినా చెరిసగమే
వేదనలైనా, వెతలైనా సరిసమమే
స్నేహానిది బాట ఒక్కటే మాట ఒక్కటే
రక్తబంధాన్ని మించిన భావనొక్కటే
ఎదపై వెన్నెల కురిపించే వేళలెన్నెన్నో
ఎడమై జ్ఞాపకాలు తలచుకున్న రోజులెన్నెన్నో
ఏ వయసు స్నేహం ఆ వయసుదే
మనసుకెంతో హాయి స్నేహమంటూ కుదిరితే
స్నేహపు గాలులు వీస్తున్నంతకాలం
మాసిపోదు లోకాన మనసుతనం
చిగురాకుల ఊయలలో
ఎవరు ఏ కొమ్మన ఉన్నా
చిలక పలికే పలుకు ఒక్కటే
చెలిమి కోరే భావాల ఊపిరొక్కటే
డా. చక్రపాణి యిమ్మిడిశెట్టి విశాఖజిల్లా అనకాపల్లిలో 3.9.1954 న లక్ష్మీకాంతం, రాధాకృష్ణ దంపతులకు జన్మించారు. ఎం.కాం.,ఎం.ఫిల్.,పి.హెచ్.డి, హిందీ సాహిత్యరత్న విద్యార్హతలు. అనకాపల్లి వర్తకసంఘ లింగమూర్తి కళాశాల వాణిజ్యవిభాగంలో 1976 లో లెక్చరర్ గా ప్రవేశించి రీడర్గా పదోన్నతి పొంది 2012 సెప్టెంబర్లో శాఖాధిపతిగా పదవీవిరమణ.
గ్రంథాలయాల పట్ల, పుస్తకాల పట్ల అభిరుచి పెరిగింది వారి అన్నగారి వలన. 1970 నుంచి తన భావాలకు అక్షరరూపం యివ్వటం ప్రారంభించారు. ఆ ఆసక్తి కవితలు,గేయాలు రాయటానికి దోహదమైంది. అందరిలాగే ఆయననూ శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం ప్రభావితం చేసిందని చెబుతారు.
రంగుల చినుకులు, నెలవంక, కవచం పలుకే బంగారమాయే – కవితాసంపుటులు వెలువరించారు. ప్రస్తుతం కన్వీనర్, అనకాపల్లి సాహితీమిత్రులు.