[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘స్నేహపరిమళాలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
‘లక్ష్మీ నిలయం’, ‘విష్ణు నిలయం’. అవి ప్రక్కప్రక్కన ఉండే నిలయాలు.
ఆ రెండు ఇండ్లలో ఉండే వారు గొప్ప సంగీత దర్శకులు. వారిద్దరూ తెలుగువారికి సుపరిచితులు. ఒకరంటే ఒకరికి అభిమానం. ఒకరి పేరు నటరాజ్, మరొకరి పేరు శివప్రసాద్.
ప్రస్తుతం వారి పుత్రులు సింగర్స్‌గా సినీరంగంలో మంచి పేరు గడిస్తున్నారు. నటరాజ్ గారి అబ్బాయి సాగర్, శివప్రసాద్ గారి అబ్బాయి ఆకాశ్.
సాగర్ పాటలు మాస్ మరియు క్లాస్ ప్రేక్షకులు అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడుతుంటే ఆకాశ్ పాటలు భక్తివే ఎక్కువగా ఉండటం కేవలం క్లాస్ వారిని మాత్రమే అలరించేవి.
దేశ విదేశాల్లో కచేరీల్లో పాల్గొంటూ పేరుతో పాటు అధికంగా డబ్బు సంపాదించేవాడు ఆకాశ్.
తమ పుత్రులిద్దరూ పోటాపోటీగా సినీరంగాన్ని పోటీపడుతూ ఉర్రూతలూగిస్తున్నా.. నటరాజ్,శివప్రసాద్ మధ్య మాత్రం స్నేహబంధం చెక్కు చెదరలేదు.
వారిద్దరూ తమ స్నేహానికి గుర్తుగా పక్కపక్కనే ఇళ్ళు కట్టుకున్నారు. ఉదయం, సాయంత్రం కలిసి వాకింగ్‌కి వెళ్లడం వారి దినచర్య.
తన వద్దకు వచ్చిన ఓ సినిమా దర్శకుడితో.. “అతడేంటండి.. ఎలాంటి పాటలైనా ఒప్పుకుంటాడు, పైగా నిర్మాతలు ఎంత డబ్బులిచ్చినా స్వీకరిస్తాడట! సాగర్‌కి ఆత్మాభిమానం లేదా? వాళ్ళ నాన్న ఎలాంటి వ్యక్తి, సాగర్ కొత్తవాళ్ళతో, సరిగ్గా పాడటం రాని వాళ్ళతో కూడా కలిసి పాడుతాడు? సో సిల్లీ కదా!!” అన్నాడు ఆకాశ్.
అతడు నవ్వుతూ “కొందరు అంతేలెండి సార్!” అన్నాడు.
ఆకాశ్ తనకు కావలసిన మొత్తాన్ని ఖరాఖండిగా చెప్పేసి.. రెండు రోజుల తరువాత సాంగ్ రికార్డింగ్‌కి వెళ్ళాడు.
తన గురించి ఆకాశ్ అంటున్న ఎన్నో మాటలు విన్నా, ఎవరెన్ని రకాలుగా రెచ్చగొట్టి తమ మధ్య విబేధాలు సృష్టించాలని చూసినా తన విధానాన్ని, చిన్ననాటి నుండి తమ మధ్య ఉన్న స్నేహాన్ని మర్చిపోలేదు సాగర్.
‘సృష్టిలో స్నేహం గొప్పది’ అని నమ్మి ఇప్పటికీ తన తండ్రి నటరాజ్, శివప్రసాద్ గారితో స్నేహంగా ఉండడాన్ని ఆదర్శంగా తీసుకున్నాడు సాగర్.
***
శివభక్తిని హృదయమంతా నింపుకుని అద్భుతంగా ‘హృదయమంతా నిండిన దేవా..’ అంటూ ఆకాశ్ పాడిన పాటని పదే పదే విన్నాడు సాగర్.
తన దగ్గరకు వచ్చిన వారితో.. ఆ పాట గురించి సంబరంగా చర్చించేవాడు సాగర్.
ఆకాశ్ గళం పంచిన మాధుర్యం, అతడు తన్మయుడై పాట చివర్లో అద్భుతంగా గానం చేయడం తెగ నచ్చేసింది సాగర్‌కి.
ఆ యేడు ఆకాశ్ పాడిన పాట ‘జాతీయ ఉత్తమ గీతం’ గా ఎన్నికవడమే కాకుండా ‘నేషనల్ బెస్ట్ సింగర్’గా ఆకాశ్ రాష్ట్రపతి అవార్డు అందుకున్నాడు.
అప్పటి నుండే అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది.
సినిమా పరిశ్రమలోని పెద్దవారిని కూడా లెక్క చేయకుండా స్టేట్మెంట్స్ ఇవ్వసాగాడు.
నూతన దర్శకులు ఎవరైనా మెలోడీ సాంగ్స్ ఆకాశ్ గారు బాగా పాడతారని వస్తే డబ్బు దగ్గర పట్టుపట్టి తను అడిగినంత ఇవ్వకపోతే పాడనని తెగేసి చెప్పేవాడు.
అదేమంటే తక్కువ పారితోషకాన్ని తీసుకోమంటే తన గౌరవాన్ని తగ్గిస్తారా అంటూ పేచీలకు దిగేవాడు ఆకాశ్.
పెద్దవారి పట్ల వినయ విధేయతలతో, అడిగిన వారికి అడిగినట్లుగా అందరూ ఇష్టపడేలా శ్రావ్యమైన పాటలు పాడే సాగర్‌కి విరివిగా అవకాశాలు రావడం.. అన్ని రకాల పాటలు అవిశ్రాంతంగా పడుతుండడం జరిగింది.
సాగర్ తెలుగులోనే కాకుండా, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో కూడా పాటలు పాడటం ప్రారంభించాడు. పరభాషలు తనకు రాకపోయినా ఆయా భాషలు నేర్చుకొని పట్టుదలగా పాడి విమర్శకుల ప్రశంశలు సైతం అనుకుంటున్నాడు.
తనకు అవకాశాలు రావడం లేదని.. తెలిసిన వాళ్ళని తనకి వారి సినిమాలో పాట పాడే అవకాశాన్ని ఇవ్వమంటూ అడిగి.. ఒకప్పటిలా తనకు అవకాశం ఇవ్వని నిర్మాత, దర్శకుల పట్ల ద్వేషం భావాన్ని పెంచుకుని, స్నేహితుల దగ్గర వాళ్ళపై ఇష్టారీతిన కామెంట్స్ చేసేవాడు ఆకాశ్.
డబ్బు తాగుడికి ఖర్చు చేస్తూ భార్య, పిల్లల పట్ల సైతం నిర్లక్షంగా వ్యవహరించేవాడు.
నెల రోజుల వ్యవధిలో నటరాజ్, శివప్రసాద్ కాలం చేశారు.
వాళ్ళు జీవిత కాలం పరిపూర్ణమైన స్నేహానికి నిర్వచనంలా మెలిగారు.
అలాగే ఒకరి వెంట ఒకరు స్వర్గలోక పయనమయ్యారు.
***
“వాట్? మీరు చెబుతున్నది నిజమా?” ప్రశ్నించాడు సాగర్ మిత్రుడ్ని.
“అవును! ఆకాశ్ వాళ్ళ ఇల్లు వేలానికి పెట్టారు బ్యాంక్ వాళ్ళు, రేపే వేలంపాట.” అంటున్న మిత్రుడి వైపు చూస్తూ..
“ఇప్పుడెలా.. రేపే కదా నేను ప్రధానమంత్రి గారిని కలవాలి. వారి నివాసంలో కచేరీ ఉంది కదా?” బాధపడుతూ అన్నాడు సాగర్ మిత్రుడితో..
“రేపటి కార్యక్రమం నీకు లైఫ్‌లో వచ్చిన ఓ బెస్ట్ అవకాశం. ఇంతకాలం ఎన్నో కచేరీలలో పాల్గొన్నా ఇది ప్రత్యేకం. విశిష్టమైన కార్యక్రమం. రేపు మన ప్రధానమంత్రి గారే కాదు, విదేశీ ప్రముఖులు సైతం పాల్గొనే ఓ అద్భుతమైన కార్యక్రమం. నీతో పాటు పాల్గొంటున్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక కలిగిన వాళ్ళు. మనమా ఒక ప్రాంతీయ బాషకు చెందిన వాళ్ళం. వాళ్ళకున్నంత పలుకుబడి, పేరుప్రఖ్యాతులు మనకు లేవు. బాలీవుడ్ లోనే కాదు దేశం, ప్రపంచం ఆ ఇద్దరి సింగర్స్ పాటలకి దాసోహం అంటూ ఉర్రూతలూగుతుంది”
“ఇప్పుడెలా?” స్నేహితుడితో అంటుంటే.. అతడు ఇదేమీ పట్టనట్లు రేపటి కార్యక్రమానికి ప్రిపేర్ అవ్వు అన్నట్లుగా చూస్తూ ముందుకు కదిలాడు.
జీవితం.. అనేక ప్రశ్నలమయం.
ఒక దాన్ని అందుకునే ప్రయత్నాల్లో ఉండగా మరో పరీక్ష!
రాత్రంతా నిద్ర రాలేదు సాగర్‌కి..
ఓ వైపు తాను తొలిసారిగా ప్రధాని నివాసంలో తన గానామృతాన్ని వినిపించబోతున్నాడు.
మరోవైపు స్నేహానికి అర్థమై నిలిచిన ఇద్దరు సంగీత దర్శకుల కుమారుల విధిరాత తో భగవంతుడి లీల.
తెలుగు సినీ పరిశ్రమలో పేరెన్నికగన్న తన తండ్రి నటరాజ్ గారి మిత్రుడు శివప్రసాద్ ఇల్లు వేలంపాట!
***
అద్బుతంగా జరిగింది నాటి కార్యక్రమం.
ప్రధానమంత్రి తన దగ్గరకు వచ్చి ఆత్మీయంగా అల్లుకుంటూ మెచ్చుకోవడం అతడి మనసంతా ఆనందమయం.
క్షణాల్లోనే విచారవదనంతో నుంచున్నాడు సాగర్.
ప్రధానమంత్రి పి.ఏ. దగ్గరకు వచ్చి చెప్పిన మాట వింటూనే అతడి హృదయమంతా ఆనందం అల్లుకుంది.
“రాత్రి నువ్వు ఫోన్ చేసి నీ మిత్రుడి గురించి చెప్పిన మాటలు వింటూనే నేను సార్‌కి ఈ సంగతి చెప్పాను. స్నేహితుడి పట్ల నీకున్న అభిమానాన్ని సార్ మెచ్చుకున్నారు. ఇంకో సంగతి తెలుసా.. నేను సార్ తరపున బ్యాంకు మేనేజర్‌తో మాట్లాడాను. నేడు ఇంటి వేలంపాట లేదు. వ్యసనాలకు బానిసైన మిత్రుడిని మార్చే ప్రయత్నం చేయండి. అతడి ఇంటిపై ఉన్న అప్పు తీర్చే అవకాశాలు పరిశీలించి నిర్ణయం చేస్తాము.
తప్పు చేయడం మానవ సహజం. మారినప్పుడే కదా మనిషి గొప్పతనం ప్రపంచానికి తెలిసేది. నీ అభ్యర్థన మేరకు భవిష్యత్తులో అతడికి కూడా ఈ చోట కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పిస్తాము.. సంతోషమేనా” అంటున్న ప్రధాని పి.ఎ.కి వినయంగా నమస్కరించాడు ప్రముఖ తెలుగు సినీ గాయకుడు ‘గాన విశారద’ డాక్టర్.సాగర్.
తరాలు మారినా తమ స్నేహపరిమాళాల ఔన్నత్యం తగ్గకూడదని కాంక్షించిన నాటి ప్రముఖ సంగీత దర్శకులు దివి నుండే భువికి సాగర్‌పై దీవెనలు కురిపిస్తున్నారు.
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.