[బాలబాలికల కోసం ‘స్నేహం విలువ’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి ద్వారకనాథ్.]
ఒక అడవిలో సుబుద్ధి అనే కోతి స్వేచ్ఛగా చెట్ల కొమ్మలపై ఎగురుతూ దొరికిన పండ్లు, కాయలు తింటూ సుఖంగా, ఎలాంటి కల్మషం లేకుండా హాయిగా కాలం గడుపుతూ వుండేది.
ఒకరోజు అడవిలోని పెద్ద చెట్టు ఎక్కి కొసాన వున్న కొమ్మపై కూర్చుని చుట్టుపక్కల చూస్తూ ‘ఆహా.. ఈ అడవి ఎన్నో రకాల చెట్లు, పూలు, పండ్లతో అందంగా వుంది’ అనుకుంటూ తలపక్కకి తిప్పి చూసింది. అడవికి పక్కనే ఉన్న ఊరు రంగు రంగుల ఇళ్ళతో, చెట్లతో ఎంతో అందంగా కనపడగానే ‘ఇన్నాళ్ళు అడవి అందాలు చూస్తూ ఈ అడవి దారిలో ఊర్లకు వెళుతున్న వాళ్ళని, కట్టెలు కొట్టే వాళ్ళను చూసాను, కాని ఆ ఊరు అందాలు, మనుషుల్ని చూడాల్సిందే’ అని నిర్ణయించుకుని బయలుదేరింది.
చెట్లు, కొమ్మలు దాటుకుని రామయ్యపట్నం చేరిందే కాని ఎక్కడికి వెళ్ళాలో తెలియక చెట్లు కొమ్మలపై, ఇంటి కప్పుల గోడలపై నడుచుకుంటూ ఒక స్కూలు ఆవరణలో చేరి చెట్టుపై కూర్చుంది.
పిల్లలు గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. ఒక పిల్లవాడు చెట్టు పైన వున్న కోతిని గమనించి “ఒరేయ్.. కోతి వచ్చిందిరా” అని అరుస్తూ కోతిని చూపించాడు. అక్కడ పిల్లలు “హాయ్ హాయ్.. కోతి.. హాయ్ హాయ్” అని అరవసాగారు. ఒకడు రాయి తీసుకుని కోతి పైకి విసిరాడు. కోతికి కోపం, భయం రెండు ఒక్కసారి రాగా ఏమి చేయాలో అర్థం కాక నోరు తెరచి కోరపళ్ళు బయట పెట్టి కిచకిచ అరుస్తూ అక్కడనుండి చెట్లపై దూకుతూ; ఒక పక్క ఆకలి, నీరసం కలగగా, వెళ్లి ఒక గుడిని చేరి ప్రహరి గోడపై కూర్చుని చూడసాగింది. భక్తులు పళ్ళు, ప్రసాదాలు తింటున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు. ఎప్పుడు చూడని ఇలాంటివన్ని చూసి చిత్రమనిపించింది. భక్తులు తింటున్నవి చూసి సుబుద్ధికి నోరు ఊరింది. కాని ‘ఆహారం సంపాదించడం ఎలా?’ అని ఆలోచన. ఆకలి నీరసంతో ఏం చేయలేక మెల్లగా నడుస్తూ గోపురం లోని విగ్రహాల పక్కన నక్కి కూర్చుంది. కళ్ళు మూతలు పడుతున్నాయి.
ఎప్పటి నుండో ఆ గుడిలోనే వుంటున్న జాలికుడు అనే కోతి దూరం నుండి అంతా గమనించింది. ‘ఇన్నాళ్ళు నేను ఒక్కడే ఇక్కడ ఉంటే ఇంకో వానరం వచ్చింది.. వెంటనే వెళ్లి ఏ ఊరు, ఎక్కడనుండి వచ్చిందో కనుక్కోవాలి’ అనుకుని చేతిలో అరటి పళ్ళతో సుబుద్ధి దగ్గరకు వచ్చింది. సుబుద్ధి దాన్ని చూసి కొంచం భయపడింది. బాగా గమని౦చిన జాలికుడు ‘ఎంతో దూరం నుoడి వచ్చినట్లుంది. నీరసంగా వుంది. కళ్ళు మూతలు పడుతున్నాయి’ అనుకుని మెల్లగా, “ఓయ్.. భయపడకు నేను నీ జాతివాడినే.. ఆకలితో నీరసంగా వున్నట్లున్నావు” అంటూ అరటి పళ్ళు అందించింది. ఆకలితో వున్నసుబుద్ధి ఏమి ఆలోచించకుండా అందుకుని గబగబా తినసాగింది. ‘అమ్మా ప్రాణం లేచి వచ్చినట్లుంది..’ అనుకుంది. మనసులో భయం కొద్దిగా తగ్గిపోగానే ఇక్కడ నాకొక మిత్రుడు దొరికాడని సంతోషించింది..
“ఇప్పుడు చెప్పు.. ఎవరు నీవు? ఎక్కడనుoడి వచ్చావు?” అని అడుగగా సుబుద్ధి తనకథంతా చెప్పి “ఇక్కడ నాకు ఏమి తెలియదు. ఎక్కడ వుండాలో తెలియదు. ఆహారం ఎలా సంపాదించుకోవాలో తెలియదు” అని అనగానే జాలికుడు “ఓస్, అంతేనా చూడు.. నా పేరు జాలికుడు..” అని తన కథంతా చెప్పి “నీకేం భయం వద్దు. నేనున్నానుగా. నాకు ఎవ్వరు లేరు, మనమిద్దరం మిత్రులుగా ఉందాం, నీకు ఆహారం ఎలా సంపాదించుకోవాలో నేర్పుతాను. సరేనా” అంది.
రెండవ రోజు ఆహారం ఎలా సంపాదించుకోవాలో చెప్పమని సుబుద్ధి అడుగగా జాలికుడు “ఏముంది నేను ఎప్పటి నుండో ఈ గుడిలో భక్తుల తెచ్చుకున్న ఆహారం, ప్రసాదాలు, పళ్ళు అన్ని లాక్కుని తింటాను. కొంతమంది భయపడి ఇచ్చేస్తారు. పిల్లలు తినేవి కూడా భయపడి పారేసి వెళుతారు. అలా నీవు సంపాదించుకోవచ్చు. చూడు ఇప్పుడు అక్కడున్న భక్తుడు దగ్గరవున్న పళ్ళ సంచి ఎలా లాక్కొని వస్తానో” అని మెల్లగా స్తంభం మీద జారుకుంటూ కిందికి దిగి మెల్లగా నడుస్తూ గబాలున భక్తుడి వద్ద సంచి లాక్కుని స్తంభం ఎక్కి వచ్చేసింది. అది చూసి సుబుద్ధి “వాళ్ళు ఎందుకు నిన్ను ఏమి అనలేదు?” అని అడిగింది.
“ఇక్కడికి వచ్చే వాళ్లకు భక్తి ఎక్కువ. నన్ను దేవుడని భావిస్తారు. కొందరు భయపడి ఇచ్చేస్తారు. ఇక ఈ రోజు నుండి నీవు కూడా ఇలానే చేసి ఆహారం సంపాది౦చుకుని రా. నీకేమి కాదు నేనున్నుగా” అన్నది.
సుబుద్ధి కూడా ఆహారం సంపాదించుకోవడానికి జాలికుడు చెప్పినట్లు చేస్తూ రకరకాల పళ్ళు, ప్రసాదాలు తింటూ కాలం గడుపుతూ వచ్చింది. ఆరునెలల సావాసం చేస్తే వాడు వీడు అవుతాడు అన్నట్లు సుబుద్ధి మారుతూ వచ్చింది. కొద్ది రోజులకి జాలికుడు ఆలోచనలో మార్పు వచ్చింది. సుబుద్ధిని ఆహారం తెమ్మని కూర్చుని హాయిగా తినడం మొదలుపెట్టింది. సుబుద్ధికి అప్పుడప్పుడు అడవిలో స్వేచ్చగా తింటూ ఎలాంటి భయం లేకుండా హాయిగా వున్న రోజులు జ్ఞాపకానికి వస్తుండేవి.
ఒక రోజు గుడి ప్రహరి గోడపై కూర్చుని పక్కనే ఉన్న రైతు ఇంట్లోకి చూసింది. అప్పుడే రైతు అరటి పళ్ళ గెల తీసుకొచ్చి పక్కగాపెట్టి తలుపు తెరవపోతున్నాడు. సుబుద్ధి మెల్లగా గోడ దిగి అక్కడికి చేరి అరటి గెలలోని పళ్ళు లాగుతుండగా రైతు గమనించి అక్కడే వున్న లావుపాటి కర్ర తీసుకుని కొట్టగా సుబుద్ధి కాలు చీరుకు పోయి రక్తం కారి కిచకిచ అని అరస్తూ బాధతో ఎలాగోలాగ గోడ ఎక్కి గుడిని చేరింది.
సుబుద్ధికి తగిలిన గాయం చూసి జాలికుడు “హాయిగా గుడిలో దొరికేవి తినకుండా అక్కడికి ఎందుకు పోయావ్? అందరూ భక్తుల్లా వుండరు. అయినా ఇవన్ని మనలాంటి వాళ్లకు మామూలే.. రెండు రోజుల్లో గాయం మానిపోతుందిలే” అని సర్ది చెప్పింది.
సుబుద్ధి ఆలోచనలో పడింది. జ్ఞానోదయం అయ్యింది. ‘ఈ ఊర్లో ఆహారం సంపాదన కోసం ఇన్ని అవస్థలు, దొంగతనాలు, పరుగులు, లాక్కోవడాలు అవసరమా? లాభం లేదు. అడవిలో ఉండడమే నయం. అసలు మిత్రుడు అంటే మంచి నేర్పించాలి, అలాగే బాధల్లో, కష్టాల్లో చేదోడు వాదోడుగా ఉండాలే కాని దొంగతనం, లాక్కోవడం, బానిసగా వాడుకోవడం చేయకూడదు. ఇవన్ని నాకు అవసరం లేదు. స్నేహం చేసే ముందు మంచి చెడు ఆలోచించే స్నేహం చేయాలి. ఇలాంటి విలువలు లేని స్నేహం నాకు వద్దు, అందుకే నీ స్నేహితులు ఎవరో తెలిస్తే నీవు ఎలాంటి వాడివో తెలుస్తుంది అంటారు. ఈ బతుకు బతకడం కంటే అడవిలో కాయో పండో తింటూ స్వేచ్ఛగా బతకడం మేలు’ అని తలచి అక్కడను౦డి మెల్లగా, జాగ్రత్తగా నడుచుకుంటూ అడవిలోకి సంతోషంగా వెళ్ళిపోయింది.
~
నీతి: మంచి స్నేహం చిరకాల౦ నిలబడుతుంది.
