[శ్రీ షేక్ అమీర్ బాషా రాసిన ‘స్నేహం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
హజరత్ నిజాముద్దీన్ నుండి బయలుదేరి బెంగుళూరుకు వెళుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ సాయంత్రం ఐదు గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌లో ఆగింది. తన ఎయిర్ బ్యాగ్ చేతి సంచి తీసుకొని పెట్టేలోంచి ప్లాట్‌ఫారంపై దిగాడు శివయ్య. దాదాపు 24 గంటల పాటు ఏసీలో ప్రయాణం చేసినందువల్ల బయట వాతావరణం వేడిగా అనిపించింది. బయటికి వెళ్లేందుకు ఓవర్ బ్రిడ్జ్ వైపు నడవసాగాడు. ముందున్న ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ వద్ద జనం గుమిగూడి ఉన్నారు. ఇద్దరు కానిస్టేబుల్స్, ఓ నర్సు ఓ అంబులెన్స్ డ్రైవర్‌తో పాటు స్టేషన్ ఇన్చార్జి కూడా అక్కడే ఉన్నారు. పెట్టెలోంచి ఓ వ్యక్తిని నలుగురు పట్టుకొని కిందకు దింపి స్ట్రెచర్ వైపు తీసుకెళుతున్నారు. అక్కడే ఉన్న అంబులెన్స్ డ్రైవర్‌ని శివయ్య “ఏమైంది బాబు?” అని అడిగాడు.
“ఎమర్జెన్సీ కేసు. ఎవరో ఫస్ట్ క్లాస్ ప్రయాణికుడు హార్ట్ ఎటాక్ అయిందట. అక్కడున్న డాక్టర్ చెప్పిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి పేషంటుని తీసుకెళ్తున్నాం.” అంటూ స్ట్రెచర్ వైపు అడుగేశాడు.
ఎవరో పాపం దురదృష్టవంతుడు అనుకుంటూ స్ట్రెచర్‌కు దగ్గరగా వెళ్ళాడు శివయ్య. తెల్లటి పైజామా లాల్చీలో ఉన్నాడు. వయసు 60 ఏళ్ల పైబడే ఉండవచ్చు. ఆయన పేరు మధుసూదన్ రావని ఢిల్లీ నుంచి బెంగళూరుకు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడని స్టేషన్ ఇంచార్జ్ పోలీసులతో చెబుతుండగా విన్న శివయ్య కుతూహలాన్ని ఆపుకోలేక ఇంకా దగ్గరగా వెళ్లి పరిశీలనగా చూశాడు. తెల్లటి ముఖ వర్చస్సు, తీరైన ముక్కు, కొంచెం పెరిగిన గడ్డం, తనకు బాగా తెలిసిన వ్యక్తి అనిపించింది. అప్పుడే నర్సు అతని ముక్కుకు ఆక్సిజన్ పైపు తొడిగింది. గతం తాలూకు జ్ఞాపకాలు వెన్ను తట్టాయి. ఆ వ్యక్తి ఎవరో గుర్తుకొచ్చింది. స్ట్రెచర్‌ని అదిమి పట్టుకొని “అయ్యా ఈయన నాకు బాగా తెలుసండి.” అని స్టేషన్ ఇన్చార్జితో ఆత్రుతగా అన్నాడు.
“అలాగా మంచి సమయంలో దొరికారు. పోలీసులు బెంగళూరులోని వీళ్ళ వాళ్లకు విషయం తెలిపే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం ఈయన స్పృహలో లేరు. స్పృహ లోకి రాగానే ఎవరో ఒకరు తెలిసినవాళ్లు ఉంటే ఆయనకు ధైర్యంగా ఉంటుంది. అంటే – ఓ గంటసేపు మీరు ఈయనతోపాటు హాస్పిటల్‌కి వస్తే మంచిదని నా అభిప్రాయం. కొంచెం తోడుగా రాగలరా?”
“తప్పకుండా వస్తానండి. అది నా ధర్మం కూడా. గంట రెండు గంటలే కాదు ఎన్ని రోజులు ఉండమన్నా ఉంటాను.” అంటూ వారితో పాటే వెళ్ళాడు శివయ్య.
మధుసూదనరావుని అంబులెన్స్‌లో పడుకోబెట్టి మరో మెషిన్ ఏదో అమర్చారు, నర్సు ప్రక్కనే కూర్చుని గుండెపై నిమరసాగింది. శివయ్య ఉబికి ఉబికి ఏడవసాగాడు. 40 నిమిషాలలో అంబులెన్స్ ఖైరతాబాద్ లోని వాసవి హాస్పిటల్‌కు చేరింది. పేషంటును హుటాహుటిన ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లారు. అంబులెన్స్‌తో పాటే వచ్చిన పోలీసులు డాక్టర్లతో మాట్లాడుతున్నారు. ఏవో కాగితాల మీద పోలీసులు సంతకాలు పెట్టి ఇచ్చిన తర్వాత ఓ డాక్టరు శివయ్య దగ్గరకు వచ్చి అడిగాడు.
“మీకు ఈయన ఏమవుతారు?”
“ఈయన నా చిన్ననాటి స్నేహితుడు. చాలా ఏళ్ల తర్వాత ఈయనను ఈ పరిస్థితుల్లో చూడాల్సి వచ్చింది” అంటూ ఏడుస్తూ జవాబు ఇచ్చాడు శివయ్య.
“రైల్వే వాళ్ళ ద్వారా పోలీసులు ఈయన అడ్రస్ తెలుసుకుని వాళ్ల కుటుంబ సభ్యులకు తెలియజేస్తారు. బహుశా రేపు వాళ్లు రావచ్చు. అంతవరకు ఎవరైనా తోడుంటే మంచిది. ఆయన ఏ సమయంలోనైనా స్పృహ లోకి రావచ్చు. మీరు తోడుగా ఉండగలిగితే మంచిది. ఇబ్బంది అయితే మీ అడ్రస్ ఇచ్చి వెళ్లిపోవచ్చు. వైద్య పరీక్షల తర్వాత ఆయన పరిస్థితి మీకు తెలపగలము.”
“అయ్యా డాక్టర్ బాబు. ఆయన బాగై లక్షణంగా ఇక్కడ నుంచి వెళ్లే వరకు ఉంటాను. ఆయన నాకు చాలా సహాయం చేసినవాడు. ఆయన ట్రీట్మెంట్‌కు డబ్బులు ఎంత అవసరమైన నేను కడతాను. మేలైన వైద్యం చేయండి బాబు.” అంటూ శివయ్య డాక్టర్ చేతులు పట్టుకున్నాడు.
డాక్టరు శివయ్య భుజం మీద తట్టి వార్డు బయట ఉన్న కుర్చీలో కూర్చోమని సైగ చేసి లోపలికి వెళ్ళిపోయాడు.
తన సామాను బల్లపై పెట్టి కుర్చీలో కూర్చొని ఫోను బయటికి తీశాడు. భార్యకు ఫోన్ చేశాడు.
“లక్ష్మీ”
“ఏమయ్యా ఎక్కడున్నావు? ఆటోలోనా, బస్సు లోనా?”
జరిగింది క్లుప్తంగా భార్యకు చెప్పాడు.
“అంటే ఇప్పుడే ఇంటికి రావా?”
“కొంచెం టైం పట్టవచ్చు. ఈయన మనకు చాలా కావలసిన వాడు. అవన్నీ ఇంటికొచ్చి చెప్తాను. చిన్నోడు ఇంట్లోనే ఉన్నాడా?”
“ఉన్నాడయ్యా. వాడితో అన్నం పంపమంటావా?”
“అన్నం వద్దు కానీ బీరువాలో 15 వేలు డబ్బులు ఉండాలి, అవి తీసుకొని ఇంకో 25 వేలు ఏటీఎంలో తీసుకొని ఖైరతాబాద్ వాసవి హాస్పిటల్‌కి రమ్మను. నేను ఎమర్జెన్సీ వార్డు దగ్గర ఉంటాను.”
“అట్టాగేనయ్యా నువ్వు, జాగ్రత్త. దిండు, దుప్పటి, స్వెటర్ పంపిస్తాను. మీ మందులు ఉన్నాయి కదా?”
“ఉండాయి లేవే” అంటూ ఫోన్ జేబులో పెట్టుకున్నాడు. వార్డులోంచి డాక్టర్ బయటికి రావడం చూసి దగ్గరికి వెళ్ళాడు శివయ్య.
“ఎలా ఉందయ్యా పెద్దాయనకి?”
“అంతగా భయపడాల్సింది ఏమీ లేదండి. మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. ఇంకా కొన్ని టెస్టులు చేయాలి. కొన్ని అవసరమైన మందులు ఇవ్వాలి. వాళ్ల కుటుంబ సభ్యులను సంప్రదించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ మంచి వైద్యం అందుతుంది. గాబరా పడకండి. ఎప్పుడైనా ఆయన స్పృహలోకి రావచ్చు. మీరు వార్డు లోపలే ఉండండి. పడుకునేందుకు కూడా వసతి ఉంది. ఏమేం చేయాలో నర్సు మీకు చెబుతుంది. మీ భోజనం కూడా హాస్పటల్ వాళ్లే పంపిస్తారు.”
“డాక్టర్ బాబు! వాళ్ల వాళ్లు తప్పకుండా వస్తారు. కానీ వాళ్లు వచ్చినంత వరకు ట్రీట్మెంట్‌లో ఎలాంటి ఆలస్యం జరగకూడదు. ఇంకొక అరగంటలో ఓ యాభై వేలు కడతాను. ఇంకా ఎంత అవసరం అవుతుందో చెపితే రేపు ఉదయాన్నే కడతాను. అవసరమైన వైద్య పరీక్షలన్నీ చేయించండి. రూము కూడా అన్ని వసతులు ఉన్నది ఇవ్వండి.”
“మీరంత భరోసా ఇచ్చిన తర్వాత ఇంకేం కావాలి! చూస్తూ ఉండండి, ఆయన నవ్వుతూ చలాకీగా ఇక్కడ నుంచి బెంగళూరు వెళతారు.”
“చాలా చాలా థాంక్స్ సార్.”
అంతలో ఓ పోలీసు శివయ్య దగ్గరకు వచ్చి “పేషంటుతో మీరు ఉంటాను అన్నారట కదా. ఈ పేరు ఫోన్ నెంబరు చెప్తారా?” అని అడిగాటు.
“నా పేరు శివయ్య అండి. నేను రిటైర్ అయిన రైల్వే ఉద్యోగిని. ఇల్లు మలక్‌పేటలో. నా పెద్ద కొడుకు ఢిల్లీ యూనివర్సిటీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. నేను వాడి దగ్గరే 10 రోజులు ఉండి వస్తున్నాను. నా ఫోన్ నెంబర్ రాసుకోండి” అంటూ ఫోన్ నెంబర్ చెప్పాడు.
“శివయ్య గారు, నిజంగా ఓ విధంగా మీరు మా పని కొంచెం తగ్గించారు. ఈ రాత్రికి ఆయన వాళ్లని కాంటాక్ట్ చేస్తాము. విషయం మీకు తెలియజేస్తాము.”
“పర్వాలేదు సార్. ఆయన విషయం నేను చూసుకుంటాను.”
పోలీసు తన నంబరు కూడా శివయ్యకిచ్చి ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయమని చెప్పి వెళ్లిపోయాడు.
రాత్రి ఎనిమిది గంటలకి శివయ్య చిన్న కొడుకు మోహన్ రావు పైకము, బెడ్ రోల్ తెచ్చి ఇచ్చి అపస్మారక స్థితిలో ఉన్న మధుసూధనరావును చూసి “ఎవరు నాన్నా? ఏమిటి ఇదంతా?” అంటూ ఆశ్చర్యంగా అడిగాడు.
తాను రైలు దిగిన తర్వాత జరిగిన సంఘటనంతా చెప్పి, “ఈయన మనకు చాలా కావలసిన వాడు రా. మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దానికి ఈయనే కారణం. అదంతా ఇంటికి వచ్చిన తర్వాత స్థిమితంగా చెప్తాలే. ఇదిగో ఈ 10 వేలు కూడా తీసుకొని మొత్తం 50 వేలు, ఎమర్జెన్సీ స్పెషల్ వార్డు లోని మధుసూదన రావు గారి పేరు మీద హాస్పిటలుకు కట్టి రా”.
కొడుకు అటు వెళ్లిన తర్వాత శివయ్య లోపలికి వెళ్లి మెల్లగా “సార్, మధు సార్..” పిలిచాడు. ఎలాంటి చలనం లేదు. బయటికి వచ్చి “ఇంకా స్పృహలోకి రాలేదు రా. ఆయన వాళ్ళు వచ్చినంత వరకు నేను ఇక్కడే ఉంటాను. నాకేం పర్వాలేదు. నువ్వు ఇంటికి వెళ్లి అమ్మకి విషయం చెప్పు.”
“సరే నాన్నా, వీలైతే రేపు ఉదయం వస్తాను. నువ్వు జాగ్రత్త.”
కొడుకు వెళ్ళిపోయిన తర్వాత శివయ్య లోనికి వెళ్లి మధుసూదన రావు పడక ప్రక్కనే కుర్చీ వేసుకుని కూర్చుని గతాన్ని నెమరు వేసుకోసాగాడు. ఎనిమిది గంటలకే హాస్పిటల్ ఆయా భోజనం తెచ్చి పెట్టింది. శివయ్యకు తినబుద్ధి కాలేదు. మజ్జిగ మాత్రం తాగి భోజనాన్ని తిప్పి పంపించేశాడు.
ఏదో అలికిడైతే వర్తమానంలోకి వచ్చాడు శివయ్య.
పడకపై మధుసూదన్ రావు అటు ఇటు కదులుతూ ఏదో పలవరిస్తున్నాడు. శివయ్య ఆయన భుజంపై చేయి వేసి మెల్లగా కదుపుతూ “మధు సార్! మధు సార్!” అని పిలిచాడు. “ఊ” అంటూ మగతగా జవాబు ఇచ్చాడు ఆయన. శివయ్య వెంటనే బయటికి వెళ్లి నర్సుకు జరిగింది చెప్పి హడావుడిగా వార్డులోకి వచ్చాడు. రెండు నిమిషాల తర్వాత డాక్టర్ లోనికి వస్తారు. మధుసూదనరావుకు పెట్టి ఉన్న వైద్య పరికరాల రీడింగులను క్షుణ్ణంగా పరిశీలించారు. సీనియర్ డాక్టర్ కేషీటుపై ఏదో రాసి నర్సుకు సూచనలు ఇచ్చిన తర్వాత శివయ్య వైపు తిరిగి “శివయ్య గారు ఈయన ప్రమాదస్థితి దాటిపోయింది. స్పృహలోకి వస్తున్నారు. కానీ మందుల ప్రభావం వల్ల బాగా నిద్రపోతారు. మీరేం మాట్లాడించవద్దు. మీరు కూడా ప్రశాంతంగా పడుకోండి. ఉదయానికి అంతా పూర్తిగా కోలుకుంటారు. కాకపోతే మరో రెండు రోజులు ఇక్కడే అబ్జర్వేషన్‌లో ఉండవలసి వస్తుంది. ఇంకా కొన్ని అవసరమైన పరీక్షలు చేయాలి. బహుశా ఉదయానికి వాళ్ళ వాళ్ళు ఎవరైనా రావచ్చు. మీరు కూడా ఇంటికి వెళ్ళవచ్చు.”
“మంచి విషయం చెప్పారు సార్. నేను ఈయన దగ్గరే ఉంటాను. అవసరమైన పరీక్షలన్నీ జరిపించండి. పైకం నేను కడతాను.”
“50 వేలు కట్టారటగదా, ఇంకా అవసరమైతే ముందుగానే చెప్తాము.”
“అలాగే బాబు.”
శివయ్య సరిగా నిద్రపోలేదు. తెల్లవార్లు నాలుగైదు సార్లు లేచి మధుసూదన రావు పరిస్థితి గమనిస్తూనే ఉన్నాడు. నర్సు కూడా మూడుసార్లు వచ్చి మీటర్లు, సెలైను, ఆక్సిజన్ కనెక్షన్ చెక్ చేసుకుని వెళ్ళింది. మధుసూదనరావు రెండు మూడు మార్లు మగతగా పలవరిస్తూనే ఉన్నాడు. అప్పుడప్పుడు అవిశ్రాంతంగా శరీరాన్ని కదిలిస్తూ ఉన్నాడు.
ఉదయం ఐదు గంటలకే నిద్ర లేచాడు శివయ్య. మధుసూదనరావు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ప్రయాణ బడలిక, నిద్రలేమి వల్ల కొంచెం నలతగా అనిపించి స్నానం చేస్తే మంచిదని బాత్రూంలోకి వెళ్లాడు. కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి బాత్రూమ్‌లో నుంచి వచ్చిన శివయ్యకు తన స్నేహితుడిని పరీక్షిస్తున్న డ్యూటీ డాక్టరు, నర్సు కనిపించారు. ఇద్దరికీ నమస్కరించాడు.
“ఎలా ఉంది డాక్టర్ బాబు”.
“పర్వాలేదండి. కోలుకుంటున్నారు. ఆయన స్పృహలోనే ఉన్నారు కాకపోతే నిన్న ఇచ్చిన మందుల ప్రభావం వల్ల నిద్రపోతున్నారు. ఎప్పుడైనా మెలకువ రావచ్చు. 8 గంటలకు కార్డియాలజిస్ట్ వస్తారు. ఏ ఏ పరీక్షలు చేయాలి, ఏం తినాలి అనేది ఆయన చెప్తారు. మెలకువ వస్తే మాకు చెప్పండి. కొంచెం పాలు తాగిస్తాము. ఆయన్ను ఎక్కువగా మాట్లాడించవద్దు. ఆయన మనసుకు సంతోషాన్ని కలిగించే సాధారణ విషయాలు మాత్రం మాట్లాడండి.”
“అట్టాగే బాబు”.
డాక్టర్ వెళ్లిపోయిన తర్వాత మంచం పక్కనే కుర్చీలో కూర్చుని దేవుణ్ణి ప్రార్థించసాగాడు శివయ్య.
8 గంటలకు శరీరాన్ని కదుపుతూ కళ్ళు తెరిచాడు మధుసూదన్ రావు. వెంటనే నర్సును పిలిచాడు. కళ్ళు తెరిచిన మధుసూదనరావు ఓ అర నిమిషం అయోమయంగా చుట్టూ చూశాడు. తనకేదో జరిగింది అని అనుకున్నాడేమో కొంచెం తేరుకొని నర్సు వైపు చూశాడు. నర్సు తడి గుడ్డతో ఆయన మొహం మెత్తగా తుడిచింది. ఆయన నర్సుని మెల్లగా అడిగాడు “ఏమైంది?” అని. ఈలోపు ఆయా పాలు తెచ్చింది. నర్సు గ్లాస్ అందుకొని ఆయనకు మెల్ల మెల్లగా తాగించసాగింది. పాలు తాగుతున్నంతసేపు ఆయన పక్కనే ఉన్న శివయ్య వేపు పరీక్షగా చూడసాగాడు. అంతలో పెద్ద డాక్టర్ లోపలికి వచ్చారు.
“గుడ్ మార్నింగ్ మధుసూదన్ రావు గారు, ఐ యాం శిరీష్ కుమార్, కార్డియాలజిస్ట్. ఇది వాసవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్” అంటూ ముందు రోజు జరిగిన సంఘటన చెప్పి
“కంగారు పడాల్సింది ఏంలేదు రావు గారు. చాలా మైల్డ్ స్ట్రోక్‌కి గురయ్యారు. మిమ్మల్ని హాస్పిటలుకు ఇన్ టైం తీసుకొచ్చారు. యువర్ అవుట్ ఆఫ్ డేంజర్. రీడింగ్స్ అన్ని నార్మల్ కు వస్తున్నాయి. ఫర్ సేఫర్ సైడ్ ఈకో, కార్డియాక్ సీ.టీ, ఎమ్మారై లాంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈరోజు అవన్నీ ముగించి రిపోర్ట్స్ అన్ని రెడీ చేసి రేపు మధ్యాహ్నం డిశ్చార్జ్ చేస్తాం. బెంగళూరులో మీరు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయవచ్చు. మరో విషయం. మీ ఫ్యామిలీకి ఈ వార్త అందిందని పోలీసులు ఉదయం నాకు ఫోన్ చేసి చెప్పారు. మీవాళ్లు బయలుదేరి వస్తూ ఉండవచ్చు. ఫీల్ కంఫర్టబుల్. హావ్ బ్రేక్ ఫాస్ట్ అండ్ జ్యూస్. ఈరోజుకి స్పాంజ్ బాత్ తీసుకోండి. రేపు స్నానం చేయవచ్చు.”
డాక్టర్ చెబుతున్నది మౌనంగా వింటూనే మధుసూధనరావు శివయ్య వైపు పరీక్షగా చూస్తూ ఉన్నాడు.
మళ్లీ డాక్టర్ చెప్పసాగాడు “బై ద బై ఈయన..” అంటూ శివయ్య వైపు చూశాడు.
“శివయ్య కదూ!” అన్నాడు మధు.
డాక్టర్ నవ్వుతూ “అరే గుర్తుపట్టారా! నిన్న స్టేషన్ నుంచి మీతో పాటు వచ్చారు. అప్పటినుంచి ఇక్కడే ఉన్నారు. అంతేకాదు మేము అడగకపోయినా మీ ట్రీట్మెంట్ కొరకు 50 వేలు కట్టారు. మీ బాల్య స్నేహితుడట.”
“అవును డాక్టర్, మై గుడ్ ఫ్రెండ్, చాలా ఏళ్ల తర్వాత చూశాను. దేవుడి మమ్మల్ని ఇలా కలిపాడు.” తృప్తిగా నవ్వాడు రావు.
“ఇంకేం, మీ అనారోగ్యాన్ని గురించి పూర్తిగా మర్చిపోయి స్నేహితులిద్దరూ ముచ్చటలాడుకోండి. హ్యావ్ ఏ గుడ్ టైం.” అంటూ డాక్టర్ కదిలారు.
“డాక్టర్ గారు, డూ మీ ఏ ఫేవర్” అన్నారు రావు.
“చెప్పండి”.
“నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఆ వివరాలు ఇస్తాను. శివయ్య గారు కట్టిన పైకం వెనక్కి ఇచ్చేయండి.”
“అలాగే, 10 గంటలకు మా హాస్పిటల్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ వాళ్లు వస్తారు. మీ దగ్గరకు పంపిస్తాను, ఇన్సూరెన్స్ కార్డు ఇవ్వండి చాలు. రావు గారు యు హావ్ ఏ గ్రేట్ ఫ్రెండ్. రియల్లీ ఐ ఫీల్ జెలస్” అని నవ్వుతూ వెళ్లిపోయాడు డాక్టర్.
శివయ్య మధుసూదన రావు చేయి వేసి “డబ్బుల విషయం అవసరమా మధు సార్.”
“సార్ అని పిలిచి నన్నెందుకు దూరం చేస్తావురా శివయ్య. ఈ వయసులో మనల్ని ప్రేమగా ఒరేయ్ అని పిలిచేవాళ్లు దొరుకుతారా?”
“అలా పిలిచి అలవాటైపోయింది”
“అది ఆఫీసులో. ఇప్పుడు మన మధ్య ఆఫీసు సంబంధాలు లేవు. కేవలం స్నేహసంబంధమే”.
“సరే! అలాగే, నువ్వు ఎక్కువగా మాట్లాడవద్దు.”
“అట్లయితే అప్పటినుంచి ఇప్పటివరకు నీ విషయాలు పూర్తిగా చెప్పు. వింటూ కూర్చుంటాను.”
ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఆయమ్మ ఇద్దరికీ అల్పాహారం తెచ్చింది. ఒక ప్లేటు శివయ్యకు అందించింది. నర్సు పేషంట్ మంచాన్ని కొద్దిగా పైకి లేపి మధుసూదనరావుని కూర్చోబెట్టి ప్లేటులోని ఇడ్లీలు తినిపించేసాగింది. టిఫిన్ చేస్తూ శివయ్య గతాన్ని చెప్పసాగాడు.
“మధు బాబు! గూడూరులో ప్రాజెక్టు ముగిసిన తర్వాత నుంచి చెప్తాను. గూడూరు నుంచి రేణిగుంట, తిరుపతి వరకు మొదటిసారిగా కరెంట్ రైలు నడిచిన సంబరాల్లో మీతో ఆఖరిసారిగా మాట్లాడాను. తరువాత మీరు మీ పేరెంట్ డివిజన్‌కి వెళ్లిపోయారు. నన్ను ఎలక్ట్రికల్ కలాసిగా విజయవాడకు పంపించారు. 9 సంవత్సరాలు అక్కడే పని చేశాను. విజయవాడలోనే ఇద్దరు కొడుకులు పుట్టారు. తర్వాత ట్రేడ్ టెస్ట్ పాసై ఫిట్టర్‌గా ప్రమోషన్ పొంది సికింద్రాబాద్‌కు ట్రాన్స్ఫర్ అయ్యాను. ఇద్దరు పిల్లలు ఇక్కడే చదివారు. నాకు అందని చదువు వాళ్ళిద్దరికీ అబ్బింది. ఇద్దరూ రైల్వే స్కూల్లో చదివి గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీలు చేశారు. పెద్దవాడు ప్రసాదు స్కాలర్షిప్ మీద ఎమ్మెస్సీ పీహెచ్డీ చేశాడు. ప్రస్తుతం ఢిల్లీ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. వాడికి పెళ్లి అయింది, ఒక బాబు కూడా. వాడి దగ్గరే పది రోజులు ఉండి తిరిగి వచ్చేటప్పుడు నా అదృష్టం కొద్దీ మిమ్మల్ని కలిశాను.”
ఉత్సాహంగా వింటున్న మధుసూదన్ రావు మధ్యలో కొంచెం విసుక్కుంటూ “మళ్ళా మీరు ఏంట్రా దేవుడా” అన్నారు.
“సరే సరేలే, నువ్వు కోప్పడబాక. రెండో వాడి పేరు మోహన్. వాడు ఫార్మసీ చేసి ఇక్కడే రెడ్డి ల్యాబ్స్‌లో పనిచేస్తున్నాడు. ఈ మధ్యనే వాడికి పెళ్లయింది. కోడలు ఇక్కడే రైల్వేలో క్లర్క్‌గా పని చేస్తుంది. నేను రిటైర్ అయిన తర్వాత మలక్‌పేటలో ఓ ఇల్లు కొనుక్కున్నాము. నిన్ను కలవాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ ఉద్యోగం, సంసార బాధ్యతలు అవకాశం ఇవ్వలేదు. నేను రిటైర్ అయిన రోజు నిన్ను తలుచుకుని చాలా ఏడ్చాను. మధుబాబు, నేను కానీ, నా పిల్లలు కానీ ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి కారణం నీవేనయ్యా.”
“కష్టపడి పనిచేశావు, బాధ్యతగా పిల్లల్ని పెంచావు, బాగా చదివించి ప్రయోజకుల్ని చేశావు. మంచి తండ్రివని నిరూపించుకున్నావు. ఇందులో నా పాత్ర ఏముంది రా. ఏదైనా చేసి ఉంటే స్నేహ ధర్మంతో చేశాను. స్నేహితుడిగా మీకు సహాయ పడటం నా బాధ్యత. అంతే.”
“మధుబాబు! ఎన్ని జన్మల పుణ్యమోకాని ఈ జన్మలో నీలాంటి స్నేహితుడు నాకు దొరికాడు. నీ గురించి తెలుసుకోవాలని ఉంది కానీ, నిన్ను ఎక్కువగా మాట్లాడించ వద్దన్నాడు డాక్టరు.” నొచ్చుకుంటూ అన్నాడు శివయ్య.
“పర్వాలేదు లేరా, ఏం కాదు. నాకు అంత పెద్ద చరిత్ర లేదు. రెండు ముక్కల్లో చెప్పేస్తాను. ఒకవేళ ఏదైనా అయితే నువ్వు ఉన్నావు కదా చూసుకునే దానికి” అంటూ నవ్వుతూ చెప్పసాగాడు – “పేరెంట్ డివిజన్‌కి వెళ్ళిన తర్వాత మూడు నెలలు లీవ్ పెట్టి బెంగళూరుకు ట్రాన్స్ఫర్ ట్రై చేశాను. కొంచెం కష్టమైనా పని జరిగింది. బెంగళూరు డివిజనల్ ఆఫీసులో ఆఫీసు సూపరింటెండెంట్‌గా చార్జ్ తీసుకున్నాను. అక్కడే పెళ్లయింది. ఒక బాబు ఒక పాప కూడా పుట్టారు. గ్రేడ్ టు ఆఫీససర్‌గా రిటైర్ అయ్యాను. పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు అయినాయి. కొడుకు అమెరికన్ బ్యాంకులో మేనేజర్‌గా ఉన్నాడు. కోడలు డైటీషియన్. కూతురు ట్రావెల్ ఏజెన్సీ నడుపుతుంది. అల్లుడేమో ఇంజనీరు. ఇది నా గురించి.”
“40 ఏళ్ల తర్వాత కలిశాము. నాదొక కోరిక కాదనబాక మధు బాబు”
ఏమిటి అన్నట్లు సైగ చేశాడు మధుసూదన రావు.
“రేపు నిన్ను డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి రెండు రోజులు మాతో ఉండు మధు.”
“ముందు ఇక్కడి నుంచి బయటపడని. ఒరేయ్ శివయ్యా నీకు గుర్తుందా! ఎనిమిదవ తరగతిలో ఓ రోజు మధ్యాహ్నం స్కూలు ఎగ్గొట్టి నువ్వు, నేను, జాఫర్, సుబ్బారెడ్డి ‘ప్రేమించి చూడు’ సినిమాకి మ్యాటని షోకి వెళ్ళాము. మరుసటి రోజు హెడ్మాస్టర్ దగ్గర బెత్తం దెబ్బలు తిన్నాము. ఈ విషయం అప్పుడప్పుడు మా పిల్లలకి కూడా చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటాను.”
శివయ్య నవ్వుతూ “ఎలా మర్చిపోగలం రా ఆ రోజులు!, అన్నట్టు మన మిత్రులు ఎక్కడున్నారో నీకు తెలుసా?” అడిగాడు.
“సుబ్బారెడ్డి అమెరికాలో సెటిల్ అయ్యాడు. జాఫర్ ఏమో ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్లో పనిచేస్తూ రిటైర్ అయిన తర్వాత కడపలో సెటిల్ అయ్యాడు. అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుంటాడు. నీ గురించి వింటే సంతోషపడతాడు.”
అంతలో శివయ్య రెండవ కొడుకు మోహన్ రావు రావడంతో మాటలకు ఆనకట్ట పడింది. ఇంటి నుంచి తెచ్చిన పండ్లు పాల ఫ్లాస్కు తండ్రికి అందించి మధుసూదనరావుకు పరిచయం చేసుకొని పాదాభివందనం చేసి వెళ్లిపోయాడు. అతను వెళ్ళిన రెండునిమిషాలకే నర్సు వచ్చి మధుసూదనరావును మెల్లగా వీల్ చైర్‌లో కూర్చోబెట్టి వైద్య పరీక్షలకు తీసుకువెళ్లింది. శివయ్య తోడుగా వెళ్ళాడు.
మూడు రకాల వైద్య పరీక్షలు జరగడానికి రెండు గంటలు పట్టింది. 12 గంటల ప్రాంతంలో వార్డు రూములో కొచ్చారు. అప్పటికే భోజనం వచ్చేసింది. మధుసూదనరావును మంచం మీద వాలుగా కూర్చోబెట్టి మెల్లగా భోజనం తినిపించేసాగింది నర్సు.
అదే సమయంలో మధుసూదన్ రావు గారి భార్య కొడుకు కంగారుగా రూమ్ లోపలికి వచ్చారు. ఆయన భార్య సుజాత వెక్కి వెక్కి ఏడవసాగింది. కొడుకు అరవింద్ దగ్గరకు వచ్చి “ఏమైంది నాన్నా” అన్నాడు. తినిపించడం ఆపమని నర్సుకు సైగ చేసి కొడుకు చేయి పట్టుకొని మెత్తగా ఒత్తుతూ, “గాబారా పడాల్సిందేమీ లేదు లేరా, మైల్డ్ స్ట్రోక్ అట” అని భార్య వైపు తిరిగి “సుజాతా! ఏడవటానికి ఇక్కడ ఏం కాలేదు. నాకు బాగానే ఉంది. ఓ నాలుగు రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే పోతుంది. సమయానికి వచ్చావు నీ చేత్తో అన్నం తినిపించు” అని నవ్వుతూ అన్నాడు. నర్సు నవ్వుకుంటూ భోజనం ప్లేట్ ఆమెకిచ్చి బయటికి వెళ్లిపోయింది. అన్నం తింటూనే మధుసూదన్ రావు వాళ్ళిద్దరికీ శివయ్యను పరిచయం చేశాడు. ఇద్దరూ ప్రేమగా శివయ్యకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అరవిందు డాక్టర్‌తో మాట్లాడి వచ్చి తృప్తిగా అమ్మతో చెప్పాడు “భయపడాల్సిదేమీ లేదంటమ్మ, అవసరమైన టెస్టులన్నీ చేశారంట. రిపోర్ట్స్ రాగానే మందులు రాసిస్తారట, రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు, మనం రేపు మధ్యాహ్నం ఫ్లైట్ కి వెళ్ళిపోవచ్చు.” అని తల్లిని సముదాయించి తండ్రి వైపు తిరిగ “ఫ్లైట్లో రమ్మని ఎన్నిసార్లు చెప్పినా వినవు” బాధగా అన్నాడు.
“మేము రైల్వే వాళ్ళం రా. రైలు అంటేనే మాకు ప్రేమ” అని నవ్వాడు.
అంతలో ఓ కానిస్టేబుల్ లోపలికి వచ్చి మధుసూదనరావు లగేజీ సెల్ టెలిఫోను ఇచ్చి సంతకాలు తీసుకొని పోయాడు.
సుజాత మెల్లగా చెప్పసాగింది “రాత్రి మూడు గంటలకు బెంగళూరు రైల్వే పోలీసు వాళ్లు మాకు విషయం తెలిపారు. మీకు ఫోన్ చేస్తే జవాబు లేదు. చాలా భయపడ్డాం. కోడలికు అన్ని జాగ్రత్తలు చెప్పి వెంటనే ఎయిర్పోర్టుకు బయలుదేరాము. 9 గంటల ఫ్లైట్‌కి టికట్లు దొరికాయి. గాబరా పడతారని అమ్మాయికి అల్లుడికి ఏం చెప్పలేదు.”
“మంచి పని చేశావు సుజాతా” అంటూ మధుసూదన్ రావు తన బ్యాగులో నుంచి ఇన్సూరెన్స్ కార్డు తీసి అరవింద్‌కు ఇచ్చి “బాబు, ఇది హాస్పిటల్ ఆఫీసులో ఇచ్చి వాళ్లు కాపీ చేసుకున్న తర్వాత శివయ్య కట్టిన 50 వేలు రిఫండ్ ఇవ్వమని చెప్పిరా.”
“అదంతా అంతా నేను చూసుకుంటాను, మీరు నింపాదిగా భోంచేయండి.”
శివయ్య వాళ్ళిద్దరి వంకా చూస్తూ “అమ్మా, పదండి మా ఇంటికి వెళదాం.”
“పర్వాలేదు అంకుల్, దగ్గర్లోనే పంజాగుట్టలో మా బ్యాంకు గెస్ట్ హౌస్ ఉంది. వచ్చే ముందే బుక్ చేశాను. హాస్పిటల్లో నాన్నకు తోడు నేనుంటాను మీరు ఇంటికి వెళ్ళండి అంకుల్.”
“మీ నాన్న డిశ్చార్జ్ అయ్యేవరకు నేను ఇక్కడే ఉంటానయ్యా. మీరిద్దరూ వెళ్లి సాయంత్రం రండి.”
“అవున్రా, శివయ్య ఉంటాడులే. మేమిద్దరం చిన్ననాటి ముచ్చట్లు మాట్లాడుకుంటున్నాం.”
“అలాగే నాన్నా.”
***
రాత్రి ఎనిమిది గంటలకి కార్డియాలజిస్ట్ వచ్చి మధుసూదనరావుని పరీక్షించి అన్నాడు – “రావు గారు ఒక్క రోజులోనే బాగా కోలుకున్నారు. మీ రిపోర్ట్స్ చూశాను. భయపడాల్సింది ఏమీ లేదు. మీ డిస్చార్జ్ సమ్మరీ కూడా రెడీ అవుతుంది. రాత్రి ప్రయాణం మంచిది కాదు. రేపు ఉదయాన్నే మీరు వెళ్ళవచ్చు. ఓ నెల రోజులు మాత్రం నేను రాసిన మందులు వాడండి. తేలికపాటి ఎక్సర్సైజ్ చేయండి. మందులు అయిపోయిన తర్వాత బెంగళూరులో కార్డియాలజిస్టును సంప్రదించండి. బీ చీర్ఫుల్ అండ్ హ్యాపీ.”
డాక్టర్ వెళ్ళిన తర్వాత అరవింద్ కౌంటర్‌కు వెళ్లి డిస్చార్జ్ సమ్మరీ, మందులతో పాటు శివయ్య పేరున ఇచ్చిన 50వేల రూపాయల చెక్కు కూడా తీసుకొచ్చాడు.
శివయ్య బేలగా తన మిత్రుని చూసి “నాదో చిన్న కోరిక మధు. మీరందరూ మా ఇంటికి వచ్చి నాలుగు రోజులు ఉండి వెళ్లండి. మాకు తృప్తిగా ఉంటుంది. ఎప్పుడు కలుస్తామో ఏమో!”
“పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు రా, ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవవచ్చు. పాసులు ఉన్నాయి, కలిపే రైళ్లు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మీ ఇంటికి వద్దు. అర్థం చేసుకో. త్వరలోనే నేను, సుజాత వచ్చి మీ ఇంట్లోనే నువ్వు వెళ్ళమన్నంతవరకు ఉంటాము. వీలైతే జాఫర్ ని కూడా పిలిపిస్తాను. ఇది నా అభయం.” అన్నాడు రావు
***
మరుసటి రోజు ఉదయాన్నే అందరూ ఎయిర్పోర్టుకు వెళ్లారు. ఫ్లైట్ 9 గంటలకు. మధుసూదన రావు లోపలికి వెళుతుంటే శివయ్య చిన్నపిల్లడిలా ఏడవసాగాడు.
శివయ్యను గుండెలకు హత్తుకుని “తొందరలోనే వస్తారా. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు.” అని సముదాయించి చేయి ఊపుతూ కళ్ళ నిండా నీళ్లు నింపుకొని లోనికి పోయాడు.
అందరికీ వీడ్కోలు పలికిన తర్వాత శివయ్య ఇంటి ముఖం పట్టాడు.
***
ఇల్లు చేరగానే శివయ్యను అందరూ చుట్టుముంటారు. ఆయన మిత్రుడి గురించి అడిగారు. ఆరోజు ఆదివారం. అందరూ ఇంట్లోనే ఉన్నారు. భోజనాల అనంతరం అందరూ హాల్లో కూర్చున్నారు. యథావిధిగా పెద్ద కుమారుడు ప్రసాదు వీడియో కాల్ చేశాడు. తండ్రిని ప్రశంసించడం మొదలుపెట్టాడు. “నాన్నా జరిగినది అంతా తమ్ముడు నాకు చెప్పాడు. మంచి పని చేశావు. నువ్వు మంచి తండ్రివే కాదు, మంచి స్నేహితుడివి కూడా.”
“పెద్దోడా ఆయన నాకు చేసిన సహాయంతో పోలిస్తే నేను చేసింది ఆవగింజంత రా. ఆయన గురించి మీరంతా తెలుసుకోవాలి. చెప్తాను వినండి.
మా నాయన అదే మీ తాతయ్య గూడూరు బస్టాండ్‌లో హమాలీగా చేసేవాడు. ఒక్కో రోజు కూలి పని దొరికేది కాదు. నన్ను బాగా చదివించాలని మా అయ్య ఆశ, నేను కూడా బాగా చదివేవాడిని. ఐదవ తరగతి వరకు మునిసిపల్ స్కూల్లో చదివాను. జిల్లా పరిషత్ స్కూల్లో ఆరవ తరగతి చేరాను.
అక్కడే నాకు మధు స్నేహితుడు అయ్యాడు. నేను, మధు, జాఫర్, సుబ్బారెడ్డి నలుగురు ఒకే బెంచీలో కూర్చునేవాళ్ళం, ఓకే జట్టుగా ఉండేవాళ్లం. ప్రతిరోజు మధు నాకోసం కూడా అన్నం తెచ్చేవాడు, ఇంటర్వెల్లో బిస్కెట్లు కొనిచ్చేవాడు. అంతేకాదు సినిమాలకు వెళితే టిక్కెట్టు కూడా వాడే కొనేవాడు. రెండు మూడు సార్లు వాళ్ల నాన్నతో చెప్పి నాకు బట్టలు కూడా కుట్టించాడు. నేను ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు మా అయ్యకు కాలు చేయి పడిపోయాయి. నేను మా అమ్మ తోటి కూలి పనికి పోవడం మొదలు పెట్టాను. అంతటితో నా చదువు అయిపోయింది. ఆ తర్వాత మధుతో కానీ మా జట్టులో మరి ఎవరితో కానీ కలవలేకపోయాను, ఏళ్లు గడిచిపోయాయి. నాకు పెళ్లయింది. బ్రతుకు ఇంకొంచెం భారమైంది. అప్పట్లో ఓ నిమ్మకాయల మండీలో పనిచేసేవాణ్ణి. ఓ రోజు నిమ్మకాయల బస్తాలు రైలు బండిలో లోడ్ చేయడానికి స్టేషన్ కు వెళ్లాను. అనుకోకుండా అక్కడ మధుసూదన్ రావు నరాసపడ్డాడు. ఆయనే నన్ను గుర్తుపట్టాడు. అప్పట్లో విజయవాడ నుంచి తిరుపతి వరకు రైల్వే ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్టు మొదలైంది. గూడూరులో ఓ ఆఫీసు పెట్టారు. దానికి ఇన్చార్జి నా స్నేహితుడు మధు. తను నా గురించి తెలుసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు వాళ్ల ఆఫీసుకు రమ్మన్నాడు. నా టీసీ కూడా తెమ్మన్నాడు. అలాగే వెళ్లాను. అప్పుడు ఈ రైల్వే ప్రాజెక్ట్ కోసం దిన కూలీలను రిక్రూట్ చేసేవాళ్లు. జీతం బాగానే ఉండేది. మధు వాళ్ల పై ఆఫీసర్‌కి చెప్పి నన్ను పనిలోకి తీసుకున్నాడు. దిన కూలీలకు పని కష్టంగా ఉండేది. రైల్వే లైన్ వెంబడి బరువులు మోస్తూ ఎండ లోను, వానల్లోనూ దూరం నడవాల్సి వచ్చేది. మధు నన్ను ఆఫీసులోనే అటెండర్‌గా వాడుకునే వాడు. తేలికైన పని మంచి జీతం. మూడు పూటలా అన్నం తినే వాళ్ళుo, మా అయ్యకు , అమ్మకు మందులు కొనగలిగే వాడిని. నా స్నేహితుడి చలవ. ఆ ప్రాజెక్టు దాదాపు నాలుగు సంవత్సరాలు సాగింది. మా పోస్ట్‌లు ఎంపానెల్ చేసి ఎలక్ట్రికల్ కళాసిలుగా నెల జీతం ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది కూడా మధు చేసిందే. గూడూరులో ఆఫీసు ఎత్తేసిన తర్వాత ఆయన తన పేరెంట్ డివిజన్‌కి వెళ్లిపోయారు. నన్ను విజయవాడకు ట్రాన్స్ఫర్ చేశారు. తరువాత ఆయనను లేక పోయాను. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ విధంగా కలుసుకున్నాము. పిలిచి ఉద్యోగం ఇచ్చి నిలబెట్టిన మహానుభావుడు రా నా మధు.” అంటూ కళ్ళు తుడుచుకోసాగాడు.
అటు వీడియో కాల్‌లో మాట్లాడుతున్న పెద్ద కొడుకు ప్రసాదు, ఇటు శివయ్య ఎదురుగా కూర్చున్న చిన్న కొడుకు మోహన్ ముక్తకంఠంతో ఈసారి అన్నారు “యువర్ ఫ్రెండ్షిప్ ఈడ్ గ్రేట్ నాన్నా.”
తృప్తిగా నవ్వాడు శివయ్య.