Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

స్మృతి కవిత్వంలో ఒక కొత్త ఒరవడి ‘స్మరించుకుందాం’

[డా. వైరాగ్యం ప్రభాకర్ గారు రచించిన ‘స్మరించుకుందాం’ అనే కవితాసంపుటిని సమీక్షిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

వానీ సాహిత్యవేదిక, కరీంనగర్, వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ కవి, విమర్శకులు డా. వైరాగ్యం ప్రభాకర్ తమ సంస్థ ద్వారా వంద పుస్తకాలను ప్రచురించారు. అందులో ఆయన స్వీయరచనలు, కథా సంకలనాలు, కవితా సంకలనాలు, వ్యాససంకలనాలున్నాయి. ‘స్మరించుకుందాం’ ఆయన స్వీయకవితా సంపుటి. దాని శీర్షికే కవిత్వంలోని ఒక ముఖ్యప్రక్రియను సూచిస్తుంది. ఇంగ్లీషు సాహిత్యంలో దానిని నోస్టాల్జిక్ పోయట్రీ అంటారు. స్మృతి కవిత్వంలో ఒక లబ్ధప్రతిష్ఠుడైన మహనీయుని గురించి, ఆయన ఏ రంగానికి చెందినవాడైనా కావచ్చు, మన ఎమోషన్స్‌ను పదాలుగా మార్చాల్సి ఉంటుంది. అవి ఒక నెమ్మదైన ప్రవాహంలా సాగాలి. భావోద్వేగాలు శృతి మించకూడదు. వ్యక్తి పూజ గోచరించకూడదు.

జాషువా గారు స్మృతి కవిత్వాన్ని సుసంపన్నం చేశారు. రాయప్రోలు, గురజాడ సైతం దీన్ని పండించారు. ఆధునికుల్లో ఎన్. గోపి గారు ‘సంజీవనీస్పర్శ’ అనే సంపుటిలో, డా. సి.నా.రె. మరణించినపుడు రాసిన కవిత గొప్పది. దాని శీర్షిక, ‘జననమంత సుందర మరణం’ . జాషువా గారు లైకా అన్న కుక్కపై కూడా కవిత్వం వ్రాశారు. దానిని రష్యా, తన స్పుత్నిక్-2 రాకెట్‌లో అంతరిక్షం లోకి పంపింది. తిరిగి వచ్చేటప్పుడు అది మరణించింది. జాషువాగారి పద్యం.

కం.:
ఆకసపు బాటసారీ
లైకా! నీ మరణమొక యలంకృతి, రష్యా
రాకెటు సృష్టి చరిత్రకు
నీకివె మా వేడికంటినీటి నివాళుల్

“Our sweetest songs are those that tell our saddest thoughts” అంటారు పి.బి. షెల్లీ, తన ‘Ode to Skylark’ లో. ఇంగ్లీష్ సాహిత్యంలో ప్రశంసిస్తూ వ్రాసేవాటిని ‘ode’ (a song in praise) అనీ, దుఃఖస్మృతులను ‘elegy’ అనీ అంటారు. ఏ కవిత్వమైనా ఆవిష్కరణలో మాధుర్యమే పండాలి.

“విప్రలంభ శృంగార కరుణయోస్తు మాధుర్యవేవ ప్రకర్షవత్.” – -ధ్వన్యాలోకము, ఆనందవర్ధనుడు.

భావకవులు ప్రేయసి మీద తప్ప, భార్య మీద కవిత్వం వ్రాయరని, వారిపై ఒక ఆరోపణ! అది నిజం కాదని డా॥ వైరాగ్యం నిరూపించారు. ఈ పుస్తకంలో తొలి కవితనే తన ‘మెరుగైన సగం’ శ్రీమతి లక్ష్మీ భవానిపై వ్రాశారు. తన సంస్థకు కూడా ఆమె పేరే పెట్టారు. ఆమెను గురించి ఇలా వ్రాశారు:

“ఆమే నా హృదయ చలనం, ఆమే నా ఉచ్ఛ్వాసనిశ్వాసాల గమనం/నా చిటికెనె వేలు పట్టుకుని నడుస్తుంది.. కాదు కాదు నడిపిస్తుంది/సా సాహిత్య ప్రస్థానానికి పునాదిగా నిలిచింది.”

వైరాగ్యం ప్రభాకర్ తన స్మృతి కవిత్వంలో స్మరించుకున్న మహనీయుల్లో, పత్రికా సంపాదకులు, కవులు, గాయకులు, ఉద్యమకారులు, రాజకీయనాయకులు, నటులు, సంఘసంస్కర్తలు.. ఇలా అందరూ ఉన్నారు. దీనిని చూస్తే నాకు, ఆంగ్ల కవితా పితామహుడు ‘సర్ జియోఫెరీ చాసర్’ వ్రాసిన ‘క్యాంటర్‌బరీ టేల్స్’ గుర్తొచ్చింది. అందులో ఆయన వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులను తీసుకొని, వారి ఆహార్యం నుంచి, అభిరుచులు, మనస్తత్వాల వరకు వర్ణించి, ఇంగ్లీషు సమాజం సమగ్ర స్వరూపాన్ని మన ముందుంచారు. అయితే చాసర్‌ది స్మృతి కవిత్వం కాదు.

ఈ కవితా సంపుటిలో మన సంస్కృతిని శోభిల్లేలా చేసిన ఎందరో మహనీయులున్నారు. దాస్యం సేనాధిపతి గారన్నట్లు, వీరంతా ప్రాతఃస్మరణీయులే. పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రముఖ కవి, సినీ గీతరచయిత, శ్రీ మౌనశ్రీ మల్లిక్, “ఇలాంటి పుస్తకాన్ని రూపొందించాలనే ఆలోచన నాకెందుకు రాలేదు?” అని ఆత్మీయ వాక్యంలో అన్నారు. గ్రేట్ మెన్ థింక్ అలైక్. అవిష్కరణ సభకు విశిష్ట అతిథిగా హాజరైన ప్రముఖ హాస్యావధాని, శ్రీ శంకర నారాయణ గారు “డా॥ వైరాగ్యంగారు ఎన్నో మధురస్మృతులను అతిరమ్యంగా అక్షరబద్ధం చేశారు” అని కొనియాడారు.

మొదటి కవిత ‘మహా స్మృతి’ అది అమరగాయకులు ఘంటసాల వారిపై. ఆయనను “ఆకాశం నుంచి మనకై వచ్చిన గాన పుష్పం” అంటారు కవి. కాళోజీ గారి ‘గొడవ’ ను “అసలు మరచిపోతే కదా!” అంటారు. ‘తెలంగాణయే కాళోజి, కాళోజీయే తెలంగాణ!’ అనే చివరి పాదాలు అద్భుతం.

డా. వైరాగ్యానికి కులమత ప్రాంతీయ భేదాలు లేవు. అలా ఉన్నవాడు ఉత్తమ కవి ఎలా అవుతాడు? అమరజీవి పొట్టి శ్రీరాములు గారినెలా స్మరించాడో, కుసుమ ధర్మన్ననూ అలాగే యాది చేసుకున్నాడు. ‘కలామ్‌కు సలామ్’ చేశాడు. సి.పి.బ్రౌన్ గారి గురించి రాస్తూ, “నిలువ నీడ లేని వాగ్దేవికి, సాహితీ పర్ణశాల నందించి. నిండు ముత్తయిదువను చేశాడు.” అన్న మాటలు ఆణిముత్యాలు. ‘సాహితీ పర్ణశాల’ గొప్ప మెటఫర్. నా ఉద్దేశంలో ఉపమాలమాలంకారం కంటే రూపకాలంకారాన్ని వాడడం కష్టం. ‘మన నందమూరి’ కవితలో “అందరి మదిలో నిలిచిన నయనానంద స్వరూపం మన నందమూరి” అంటారు. ఈ కవిత ఒక చక్కని పదచిత్రం. టాగోర్ విశ్వమానవుడు ఎందుకయ్యాడో ఆయన పై రాసిన కవిత వివరిస్తుంది. ఆయనను ‘మూర్తీభవించిన భారతీయ సంస్కృతి’ (Indian culture Personified) అనడం ఎంతయినా సముచితం.

“గురజాడ గిడుగుకు గొడుగయ్యాడు!” – ఇందులో ఎంతో అర్థం ఉంది. వ్యావహారిక భాషోద్యమానికి గిడుగువారు బాటలు వేస్తే, గురజాడ ఆయనకు రక్షణగా నిలిచాడని! ‘బ్రీవిటీ ఈజ్ ది సోల్ ఆఫ్ విట్’ అన్న మహాకవి షేక్‌స్పియర్ సూక్తి ఇక్కడ వర్తిస్తుంది. చెప్పేది నాలుగే మాటలు. వ్యాఖ్యానం చేస్తే బోలెడంత!

సినీనటుడు కృష్ణ మీద కూడా కవిత రాశారు వైరాగ్యం వారు. బహుశా ఆయనలోని మానవతాకోణం ఆయన్ను ఆకర్షించి ఉంటుంది. ఇక ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారి స్కృతి పరిమళం గుప్పుమంటుంది.

“లలిత స్వర రాగామృతం గంగాప్రవాహమది” అంటారు బాలు గాత్రాన్ని. వచన కవులు సమాసాలు వేయరని ఎవరన్నారు?

ఇక సి.నా.రె. గారిని, ‘రెండంచుల పదునుకత్తి’గా అభివర్ణించారు కవి. అది “అగ్నిని చల్లగలదు”, “అమృతం కురిపించగలదు” అంటారు. విరోధాభాసాలంకారం ఇక్కడ బాగా పండింది.

శ్రీ జి.వి. కృష్ణమూర్తి గారిని కూడా గుర్తు చేసుకొని, పద్యం పై తనకుగల అభిమానాన్ని చాటుకొన్నారు డా. వైరాగ్యం. ఆయన తన అభినందన వందనాలతో, ‘తన ఎదుగుదల’లో తన వెంట నిలిచిన ఎందరో మహానుభావులను స్మరించుకున్నారు. అందులో నేను కూడా ఉండటం చూసి నా కళ్ళు చెమర్చాయి.

భార్యపై ఆయన రాసిన కవితను చూసి, చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి గారి శిష్యులు శ్రీ మాధవపెద్ది బుచ్చిసుందరరామశాస్త్రి గారి ‘సతీ స్మృతి’ లోని పద్యం నాకు గుర్తుకువచ్చింది.

మ.:
ఒడియందుండిన యట్టి మల్లెపువులందొక్కకటిన్ దీసి, వా
ల్జడ యల్లించు కొనంగ తల్లికిడు వేళన్, వచ్చునన్ గాంచి వె
ల్వడగా, నిల్వగ బాఱువోక, మునిగాళ్లన్ నిల్చు నానాటి నీ
పడుచుం బ్రాయపు జిన్నె నా కనులకున్ ప్రత్యక్షమౌగావుతన్

ఎంత మధుర భావన! భార్యను ప్రేమించగలవారు ధన్యులు!

వంద పుస్తకాలు ప్రచురించడం ఆషామాషీ వ్యవహారం కాదు. తెలుగు సాహిత్య చరిత్రలో అది ఒక రికార్డు! దాన్ని సాధించిన సోదరుడు డా. వైరాగ్యం శ్లాఘనీయుడు. ఆ చారిత్రాత్మక సభకు ప్రధాన వక్తగా నేను వెళ్లి పుస్తకాన్నిసమీక్షించడం నా అదృష్టం.

“ఇంటి పేరది వైరాగ్య మేను గాని
కనగ సాహిత్య వైరాగ్య మెపుడు లేదు
నీవు సాహిత్యమను మిన్ను, రవి వి హితుడు
చిరము విలసిల్లు శేముషీ భరిత రీతి”

***

స్మరించుకుందాం (స్మృతి కవిత్వం)
రచన: డా. వైరాగ్యం ప్రభాకర్
ప్రచురణ: భవానీ సాహిత్య వేదిక, కరీంనగర్
పేజీలు: 102
వెల: ₹ 160
ప్రతులకు:
డా. వైరాగ్యం ప్రభాకర్
2-102,
సీతారాంపూర్,
కరీంనగర్ 505001
ఫోన్: 9014559059

Exit mobile version