[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]
పాత్రల వెనుక ముఖాలు ఇవా
~
చిత్రం: శ్రీ వేమన చరిత్ర
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: సత్యం
గానం: రామకృష్ణ.
~
పాట సాహిత్యం
పాత్రల వెనుక ముఖాలు ఇవా
నటనల వెనుక నిజాలు ఇవా
చితిమంటల వెలుగులో
ప్రకాశించు నిజమిదా
బ్రతుకంటే ఒక కలయని
నిరూపించు ఋజువిదా
నరులకు చివరకు మిగిలే
ఆస్తులు ఈ అస్థికలా
పాలుగారు పసిపాపల చిరునవ్వుల కాంతులు
తేనెలూరు యవ్వనాల వసంతాల పువ్వులు
నడిమి వయసు చల్లుకొన్న అనుబంధపు విత్తులు ముదిమిలోన కోసుకున్న అనుభవాల పంటలు
అన్నీ ఇటు చేరేనా మన్నై ఇటు మారేనా
♠
తల్లి పొత్తిళ్ళ నుండి పుడమి తల్లి ఒడిలోకి చేరే మధ్య కాలాన్నే జీవితం అంటాం. అపురూపమైన ఆ కొద్ది కాలాన్ని ఎంత గొప్పగా ఉపయోగించగలమో, అంత గొప్పగా ఉపయోగించి జీవితాన్ని సార్ధకం చేసుకోవాలి. జీవితంలో వచ్చే చిన్న చిన్న ఒడిదుడుకులను ఓర్పుతో, సామరస్యంతో, సామర్థ్యంతో, సరైన దృక్పథంతో ముందుకు నడిపించి, మన ఆశయాలను, లక్ష్యాలను సిద్ధింపచేసుకోవాలి.
దిగుళ్లతో, కన్నీళ్ళతో, ఆ కాలాన్ని వృధా చేసుకోకూడదు, ‘కల కానిది విలువైనది బ్రతుకు, కన్నీటి ధారలలోనే బలి చేయకు అంటారు శ్రీశ్రీ. మనకు వున్నది ఒకటే జిందగీ, దాన్ని నవ్వుతూ తొలుతూ గడిపేయాలిగా! కొంతకాలం నేలకొచ్చాం అతిథులై ఉండి వెళ్ళగా, కోటలైనా, కొంపలైనా ఏవి స్థిరాస్తి కాదుగా..? (ముసుగు వెయ్యొద్దు మనసు మీద -ఖడ్గం) అంటారు సిరివెన్నెల.
Because I could not stop for Death అనే ప్రసిద్ధమైన తన కవితలో Emily Dickinson ఇలా అంటారు. ఈమె themesలో ఎక్కువ శాతం death, immortality, love, Nature and the self మీద ఉంటాయి.
Because I could not stop for Death
He kindly stopped for me
The Carriage held but just
Ourselves
And Immortality..
We slowly drove – He knew no haste
And I had put away
My labor and my leisure too,
For His Civility.
Emily, మరణాన్ని వరంగా, అమరత్వాన్ని శాపంగా పరిగణిస్తుంది. ఆమె చెప్పినట్టు immortality వరం అవుతుందా శాపం అవుతుందా ఆలోచించండి! మన ఆయువు గనుక ఏ ఏడెనిమిది వందల ఏళ్ళో, వెయ్యేళ్లో అవుతే, మన జీవన విధానం ఎలా ఉండేది? హెలెన్ కెల్లర్ వ్రాసిన Three Days to See, అనే వ్యాసంలో తనకు కనుక మూడు రోజులపాటు చూపు వస్తే ప్రపంచంలో ఎన్ని అంశాలను చూడాలనుకుంటుందో తెలిస్తే, మన మెదడు ఒక్కసారి కంపించిపోతుంది. కళ్ళు ఉన్న మనం దాని విలువను ఏమాత్రం గుర్తించలేకపోతున్నామని అర్థమవుతుంది. అదేవిధంగా చావు అన్న ఒక ఫుల్ స్టాపే, జీవితంపై ఆసక్తిని పెంపొందిస్తుంది. మన జీవితం గనక ఒకవేళ beyond stretchable limits ఉంటే, మనం కూడా మంజునాథుడిలా స్వాగతమయ్యా ఓ యమరాజా! అని పాటలు పాడుకుంటామేమో? చీకటి వల్ల వెలుగు వెలువను గుర్తించినట్లే, మరణం వల్లే జీవితం విలువను మరింత విస్తృతంగా అర్థం చేసుకోగలం కదా!
~
గుర్రం జాషువాగారి ‘శ్మశాన వాటిక’ ఖండ కావ్యంలోని పద్యాలను స్పృశించకుండా, ఈ అంశాన్ని చర్చించడం సబబు కాదు..
ఎన్నో యేండ్లు గతించిపోయినవి గానీ, యీ శ్మశానస్థలిన్
గన్నుల్ మోడ్చిన మందభాగ్యు డొకఁడైనన్ లేచిరాఁ, డక్కటా!
యెన్నా ళ్ళీచలనంబు లేని శయనం? బేతల్లు లల్లాడిరో!
కన్నీటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్!
…………..
ఇచ్చోట; నేసత్కవీంద్రుని కమ్మని-కలము, నిప్పులలోనఁగఱఁగిపోయె!
యిచ్చోట; నేభూము లేలు రాజన్యుని-యధికారముద్రిక లంతరించె!
యిచ్చోట; నే లేఁత యిల్లాలి నల్లపూ-సలసౌరు, గంగలోఁగలసిపోయె!
యిచ్చోట; నెట్టిపే రెన్నికం గనుఁగొన్న-చిత్రలేఖకుని కుంచియ, నశించె!
ఇది పిశాచులతో నిటాలేక్షణుండు-గజ్జె గదలించి యాడు రంగస్థలంబు;
ఇది మరణదూత తీక్ష్ణమౌ దృష్టు లొలయ-నవనిఁ బాలించు భస్మసింహాసనంబు..
భూమిని పాలించే భస్మ సింహాసనమని, పరమశివుడు నర్తించు రంగస్థలమని ఈ మరుభూమిని జాషువా వర్ణించినారు.
~
ఇటీవల మరణానికి సంబంధించిన తత్వాన్ని తెలియజేసే ఒక హిందీ భజన్ చాలా వైరల్ అవుతోంది.
/మౌత్ జబ్ తుమ్ కో ఆవాజ్ దేగీ
ఘర్ సె బాహర్ నికల్ నా పడేగా@2
జిందగీ ఏ కిరాయా క ఘర్ హై
ఏక్ న ఏక్ దిన్ బదల్నా పడేగా@2/
(మరణమెపుడైన ఒడిచేరమంటే
దేహమే వీడి కదలాలి వెంటే
జీవితం నీకు ఓ అద్దె ఇల్లు..
ఏదో నాడు ఋణం నీకు చెల్లు)
ఇది విన్న తరువాత, సిరివెన్నెల గారు philosophy of life, గురించి ఎంత లోతుగా చెప్పారో philosophy of death గురించి కూడా అంతే నిశితంగా, సున్నితంగా వివరించారని నాకు అనిపించింది. అందుకే, ఆయన సాహిత్యంలో, ఈ అంశానికి సంబంధించిన కొన్ని పాటలను మీ ముందుకు తేవాలని అనుకున్నాను.
మన చేతిలో లేని విషయాల గురించి అనవసరమైన హైరానా పడకుండా, మన చేతిలో ఉన్న మన చేతిలో ఉన్న విలువైన జీవితాన్ని ఎలా ఆనందమయం చేసుకోవాలో ఆలోచించాలని ఆయన సూచిస్తున్నారు, గమ్యం చిత్రంలోని ఈ పాట ద్వారా.
/పుట్టుక చావు రెండే రెండు, నీకవి సొంతం కావు, పోనీ
జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ../. (ఎంతవరకు ఎందుకు వరకు -గమ్యం)
~
ఎంతటి నిరాశనుండైనా మనల్ని బయటికి తెచ్చి, ఆశ అనే ఊపిరి పోసి, గెలుపు వైపు పరుగు తీయించే అద్భుతమైన పాట. మనకు భగవంతుడు ఇచ్చిన ఆయువు ఉన్నంతవరకు, మరణం కూడా తన నీడను మనపై పడనివ్వలేదని, పట్టుదల వదులుకోకుండా ముందుకు సాగమని బలమైన స్ఫూర్తిని ఇస్తుంది ఈ పాట.
/నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన
జీవితాన అడుగు అడుగునా
ఆయువంటూ ఉన్న వరకు చావు కూడా నెగ్గలేక
శవము పైనే గెలుపు చాటురా..
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి../( పట్టుదల)
~
భగవంతుడిచ్చిన అద్భుతమైన వరం మన ప్రాణం. ఎలాంటి కారణం కోసమైనా ప్రాణత్యాగం చేయకూడదనీ, ప్రాణం ఉన్నంతవరకు పోరాటం చేస్తూనే ఉండాలని బలంగా చెబుతున్నారు సిరివెన్నెల.
/దేహానికైన గాయం ఏ మందుతోనో మాయం
విలువైన నిండు ప్రాణం మిగిలుండడడం ప్రధానం
అది నిలిచినంతకాలం సాగాలి నీ ప్రయాణం/ (నువ్వేమి చేసావు నేరం-పెళ్లి చేసుకుందాం)
~
భయపడుతూ, పిరికిపందలా అనుక్షణం చస్తూ బ్రతకకూడదని.. ధైర్యంగా బ్రతుకును ఎదుర్కోవాలని, చావే అన్నిటికన్నా పెద్ద కీడనీ, మిగిలిన ఏ సమస్యలైనా దానికంటే చిన్నవేనని.. భయపడాల్సిన అగత్యమే లేదని చెబుతూ చైతన్యాన్ని రగిలించే గీతం.
ఎవడున్నాఁడు క్రూరుఁడు, యముఁడిని మించిన వాఁడు?
ఏముంటుంది చూడు, చావుని మించిన కీడు!
తలవంచేసి దాఁగినా వదిలేనా ఒక నాఁడు?
కలకాలం బ్రతికుండునా రోజూ చచ్చే వాఁడు!
భయమే బరువు కంటి ఎరుపే కాగడాగా నిశిని తరిమెయ్యరా! (బెదిరితే భయపెడుతుంది వెనుకనే లోకము – హలో డార్లింగ్)
~
శతకోటి సమస్యలనైనా ఎదుర్కునేందుకు, బ్రతికి ఉండగల సాహసమై, కాలాన్నే శాసించాలని.. ఈ గీత సందేశం.
/పరుగులు తీయ్ బిర బిర బిర బిర
ఉరకలు వేయ్ చర చర చర చర
ఆయువు తీసే ఆపద కూడా, అలసటతో ఆగేలా చెయ్
మట్టిలోకి తన గిట్టలతో నిను తొక్కెయ్యాలని
తరుముకువచ్చే కాలాశ్వంపై స్వారీ చెయ్
ఎడారి దారుల తడారి పోయిన
ఆశకు చెమటల ధారలు పోయ్
నిస్సత్తువతో నిలబడనివ్వక
ఒక్కో అడుగును ముందుకు వెయ్
వంద ఏళ్ల నీనిండు జీవితం
గండి పడదనే నమ్మకమై
శతకోటి సమస్యలనెదుర్కొనేందుకు
బ్రతికి ఉండగల సాహసానివై../ (మర్యాద రామన్న)
~
మనల్ని ప్రేమించే నలుగురు మనుషులు ఉన్నప్పుడు, తుమ్మినా, దగ్గినా నూరేళ్లు ఆయుష్షని దీవిస్తూ, మన శుభాన్ని ఆకాంక్షిస్తున్నప్పుడు, ఆ అనురాగాలు, అనుబంధాలే మనకు మరింత ఆయువు పోస్తాయంటూ, అనుబంధాల విలువను చెప్పే పాట.
/అయిన వాళ్లు ఉన్న లోగిళ్లలో ఆయువాగిపోదు నూరేళ్లలో, తర తరముల కధ చెబుతుందిర చిన్నా../ (-అల్లుడుగారొచ్చారు)
~
ఏ కథ అయినా అనగనగా అంటూ మొదలై, ఓ నది లాగా సాగి కడలిలో కలవాల్సిందే కదా! చివరకు మిగిలేది ఆ స్మృతులు మాత్రమే! అనే కఠినమైన సత్యాన్ని వివరించే పాట.
/అనగా.. అనగా, మొదలై.. కథగా
అటుగా, ఇటుగా, నదులై.. కదులు
అపుడో, ఇపుడో, దరిచేరునుగా
కడలే ఎదురై , కడదేరునుగా../ (మహానటి)
~
అదే చిత్రంలోని మరో పాట.. కాలంతో మనిషి చేసే సమరమే జీవితం! అనే అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్నది.
/గెలుపులేని సమరం
జరుపుతోంది సమయం
ముగించేదెలా ఈ రణం
మధురమైన గాయం
మరిచిపోదు హృదయం
ఇలా ఎంత కాలం
భరించాలి ప్రాణం???/
~
కాలమనే ఇరుసుతో తిరుగుతున్న కాలచక్రం.. మానవులను ఎలా ఆడిస్తుందో తెలిపే ఒక తత్వం..
నారాయణ హరి నారాయణ నీ లీల ఏమిరా మా నాయనా ॥నారాయణ॥
కాలమను కీలుతో నడిపించుతున్నావు ॥2॥
ఈ తోలు బొమ్మలను ఆడించుతున్నావు ॥నారాయణ॥ (శ్రీ యోగి వేమన)
~
గమనాలు ఏవైనా గమ్యాలు ఒకటేనని.. చివరకు చేరే మజిలీ ఒకటేనని చెప్పే.. రంగమార్తాండ చిత్రంలోని ఒక పాట.
పల్లవి:
పువ్వై విరిసే ప్రాణం పండై మురిసే ప్రాణం రెండు ఒకటే నాణానికి బొమ్మా బొరుసంతే!.
తీసే ఊపిరి ఒకటేగా, వేషం వేరంతే! ॥పువ్వై విరిసే॥
చరణం:
నడకైనా రాని పసిపాదాలే అయినా బతుకంతా నడిచి అలిసిన అడుగులె అయినా చెబుతాయా చేరే మజిలీ ఏదో ॥పువ్వై విరిసే॥
~
పునరపి జననం.. పునరపి మరణం.. సందేశాన్ని అందిస్తున్న విడుదల కాని చిత్రంలోని ఒక పాట.
ఒక పాత్ర ముగిసింది నేడు-ఇంకెన్ని మిగిలాయో చూడు రాసేది/ నడిపేది పైనున్న వాడు నటుడేగ నరుడన్న వాడు తానే తన ప్రేక్షకుడు ఔతాడు/తనుకూడా ప్రేక్షకుడే ఔతాడు
…………..
ఎవడో ఆ సూత్రధారి తెలుసా ఓ వేషధారీ
మళ్ళీ మళ్ళీ వందేళ్ళూ రోజూ సరికొత్తే ఎప్పటికైనా తెలిసేనా బతకడవేంటంటే..!
~
చావు పుట్టుకల నిత్యసత్యాన్ని వివరించే విడుదల కాని చిత్రంలోని ఒక పాట.
పల్లవి:
నీకే తెలిసున్న సత్యం నిన్నే ఏమార్చే నిత్యం/
నీకూ తెలిసే సత్యం అయినా మరుపే నిత్యం
నీవాళ్ళంతా నీతో ఉంటారనుకుంటావు నీతోనే వస్తారంటూ భ్రమలో పడతావు
చరణం:
మునిమాపు ముసిరేటి వేళ నీడైన నిను వీడి పోదా
నీ ఊపిరే నీది కాదే నీ గుండెలో ఉండిపోదే
ఎవ్వరికీ ఎవరూ ఏవీ కారే..
~
క్షీరసాగర మధనం కావ్యంలో చివరి చరణాలలో మృత్యువు తత్వాన్ని విశ్లేషించిన విధానం, దాన్ని జయించడమంటే ఏమిటి అన్న సునిశితమైన వివరణ, అనన్య సామాన్యం.
~
ఇక ‘పాత్రల వెనుక ముఖాలు ఇవా?’ పాటను చర్చించుకుందాం. వేమన చరిత్ర మనందరికీ సుపరిచితమే. అనవేమారెడ్డి సామంత రాజు, తమ్ముడు వేమారెడ్డి బాధ్యత లేకుండా విశ్వద అనే వేశ్య వ్యామోహంలో పడతాడు. నిజానికి ఆమె ఉత్తమ స్త్రీ. వేమయ్య వదిన, మిత్రుడు అభిరాముడు కోరడంతో వేమయ్యకి ద్వేషం కలిగేలా ప్రవర్తించి అతడికి దూరమౌతుంది. కప్పం కట్టలేక పెద్దరెడ్డి గారు చెరసాల పాలౌతారు. పెద్దరెడ్డి గారి కుమార్తెకి చిన్నాన్న అంటే అలవిగాని అభిమానం. అతడిపై బెంగతో మంచంపట్టి మరణిస్తుంది. వేమన మనసు వికలమై ఆ వైరాగ్యంలోంచి పుట్టిన పాటను సిరివెన్నెల ఈ విధంగా రచించారు.
పాత్రల వెనుక ముఖాలు ఇవా
నటనల వెనుక నిజాలు ఇవా
చితిమంటల వెలుగులో
ప్రకాశించు నిజమిదా
బ్రతుకంటే ఒక కలయని
నిరూపించు ఋజువిదా
నరులకు చివరకు మిగిలే
ఆస్తులు ఈ అస్థికలా?
ఇది ఒక వైరాగ్యంలో వచ్చిన మేలుకొలుపు, ఒక పశ్చాత్తాపం. జీవితమనే నాటకం నిజ స్వరూపం చితిమంటల వెలుగులో తేటతెల్లమైంది. బ్రతుకు అసలు స్వరూపం, చివరి స్వరూపం మనసుకు పూర్తిగా అర్థమైంది.
తత్వము బోధపడినప్పుడే సత్యాన్వేషణ సాధ్యమవుతుంది, నిరంతర సాధన అవుతుంది. దుఃఖం దూరమవుతుంది. అప్పుడే భోగి, యోగిగా మారి, సత్య మూలాలను తెలుసుకోవడానికి పయనం సాగిస్తాడు. ఎవరి జీవితంలో జరిగే సంఘటనలైనా సరే.. అవి భగవత్ లిఖితమైన గమ్యం వైపుకే వారిని నడిపిస్తాయి. వేమారెడ్డి జీవితంలో జరిగిన అనూహ్య పరిణామాలు, ఆయనను సంపూర్ణంగా ప్రక్షాళన చేసి, యోగివేమనగా తీర్చిదిద్దాయి.
పాలుగారు పసిపాపల చిరునవ్వుల కాంతులు
తేనెలూరు యవ్వనాల వసంతాల పువ్వులు
నడిమి వయసు చల్లుకొన్న అనుబంధపు విత్తులు ముదిమిలోన కోసుకున్న అనుభవాల పంటలు
అన్నీ ఇటు చేరేనా మన్నై ఇటు మారేనా?
మనిషి పసిప్రాయంలో, యవ్వనంలో, నడి వయస్సులో, వృద్ధాప్యంలో పేర్చుకున్న అన్ని అనుభవాల, జ్ఞాపకాల చివరకు మట్టిలో కలిసి పోవలసిందేనా? ఈ మాయలో పడి అసలు నిజాన్ని గుర్తించలేకపోయానన్న తీవ్రమైన శోకం నుండి అంతర్మథనం జరిగి జ్ఞానోదయమై.. ఒక ప్రజా కవి, ఒక సంఘసంస్కర్త, ఒక్క తత్వజ్ఞుడు, ఒక యోగి జనించి, మానవులకు మార్గదర్శనం చేసి, చెరగని ముద్ర వేసి, జన్మ చరితార్థం చేసుకున్నాడు.
‘భయమే మృత్యువు, అభయమే అమృతత్త్వ కైవల్యము’ అని ఉద్ఘోషించే ఉపనిషత్తులు స్వయంగా తద్వ్యాఖ్యానము పాటలుగా పల్లవింప చేయడానికి సృజించిన ఒక అపురూపమైన, అపూర్వమైన సత్యజ్ఞానశివసుందర కల్పతరువు ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రిగారు.
‘వెన్నెలకు అంచులు లేవు. కీర్తిని వెన్నెలతో పోల్చడమంటే, తనకు అంచులు లేనట్లే, ఆ కీర్తిమంతుని అంచులను అనంతముగా పెంచుతుంది. అట్టి వెన్నెలలో తడిసి మన అనుభూతి మోపెడవుతుంది. ఆ నిజశాస్త్రానికి నిఘంటువైన స్వర పద్మావతీ సీతారామ దీప్తికి జోతలంటూ’- శ్రీచరణ్, ‘పూర్ణత్వపు పొలిమేరలు’ పుస్తకంలో తమ అమూల్యమైన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ఈ విధంగా సిరివెన్నెల బ్రతుకు విలువలకు ఎంత అర్థం కడుతూ సాహిత్యాన్ని వెలువరించారో, అంతుపట్టని చావు యొక్క రహస్యాలను కూడా అంతే గొప్పగా ఆవిష్కరించారు. ఈ విధమైన వెల కట్టలేని తత్వ చింతనను రగిలించే ఇటువంటి పాటలు , ఆయన అక్షర భాండారంలో ఎన్ని నిక్షిప్తమై నిలచిపోయాయో, మనం ఊహించలేము. నవరసాలను అలవోకగా పలికించిన ఆయన పాటలు మన జ్ఞాపకాలపుటల్లో కూడా చెరగని ముద్రలు వేసి జీవితంలోని ప్రతి సందర్భంలో మేమున్నామంటూ వెన్ను తట్టి మనల్ని నడిపిస్తాయి. ఆ పాటలు చెవులకు సోకి, మనసును తాకి, బుద్ధిని ప్రేరేపిస్తాయి.. చేయి పట్టుకుని, ఎవరి గమ్యాలకు వాళ్ళని చేర్చడానికి అలుపెరుగని స్ఫూర్తినిస్తాయి. ఆయన పలుకే పల్లవై, ఆలోచనే గీతమై, గీతమే వేదమై, మానవతను ఆవిష్కరించడమే ఆగని తపస్సై.. జీవితమే సాధనై.. నిరంతరం జ్వలిస్తూ, అనంతమైన వెన్నెలలు పరుస్తూ.. వినీల గగనంలో.. సాగుతూనే ఉంటుంది.
Images Source: Internet
శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ గారు ఆంగ్ల అధ్యాపకురాలు, వ్యక్తిత్వ వికాస నిపుణురాలు, గీత రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు(తెలుగు-ఇంగ్లీష్-హిందీ), సామాజిక కార్యకర్త.