[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]
పాడు కబురు వినగానే
~
చిత్రం: మనీ మనీ
సంగీతం: శ్రీ మారుతి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో, చక్రవర్తి, చిత్ర.
~
పాట సాహిత్యం
పాడు కబురు వినగానే..ఏ..
పైకం తెస్తాడా..ఆ.. పైకం తెస్తాడా?
ఎవ్వడి బాబు సొమ్మంటూ
వైఫు గొంతు కోస్తాడా?
ఏమో ప్లానేశాం గానీ, partneరూ డబ్బురా
పాడు కబురు వినగానే..
పైకం తెస్తాడా.. అయ్యయయ్యో.. పైకం తెస్తాడా..
నోరు మూయరా పిరికి పంద
శుభం పలకవా.. ఊహూ..
ఆది లోనే హంస పాదా, రేయ్..
ఆశ లేదా.. ఏంటీ.. ఊహూ..
సపోజు ఖర్మ కాలిపోతే
suddenగ ప్లాను మారిపోతే
పదేళ్ళు కఠిన ఖైదు అంతే..
ఇదిగో మనీ ఎటున్నా విని
ఇలారా కిడ్నాపరూ
రా.. రా.. రా.. అ..రా.. రా.. హహ
వదిలేయ్ మరి నా ఇల్లాలిని
నా ఇంటికి చిరుదివ్వెనీ
ఆస్థీ పాస్థీ బలాదూరేరా
నా దేవేలే మిన్నా..
బం చిక్ బంబం బబుచిక్ బంబం
బాబా బీబీబాబాబీబి.బా..
ప్రాణాలైనా ఇస్తాకానీ మానేనా
పాతాళానా నిను పాతేయ్ నీ రాలేనా
పాతాళానా నిను పాతేయ్ నీ రాలేనా
ప్రాణం కన్నా పెళ్ళాం మిన్నా అంతేగా
నీ చేతుల్లో చచ్చే భాగ్యం నాదేగా.. ఆఅ..
నీ చేతుల్లో చచ్చే భాగ్యం నాదేగా.. హహహ..
యురేకా సకామికా
తొక్కింది నక్కతోకా
నెగ్గింది చిట్కా పండూ..
దక్కింది చక్కా ఫండూ
దొరికెరా ఈజీ ఫినాన్సు
జరుపుకో క్రేజీ రొమాన్సు
యురేకా సకామికా
తొక్కింది నక్కతోకా
పెళ్ళి ఈడు పిల్ల ఉండీ
కళ్ళముందే అల్లుడుండీ,అల్లుడుండీ
టైమ్ వేస్ట్ చేస్తారేంటి మావయ్యా.. ఫాదరిన్లా..
మా మ్యారేజికి లేటవుతుంది నీవల్లా
ప్రాపర్టీ పైసా లేదే, పోషించే పథకం లేదే
పెళ్ళానికి ఫుడ్డేమిట్రా, పచ్చగడ్డి పెడతావా
పోరా సోంబేరి గాడా, నీ ఫేసుకి పెళ్ళొకటా
నీకె ఓ కంత లేదే, నీ మెడలో డోలొకటా
కన్నెగానే ఉండిపోనా? కన్నతండ్రీ!
పెళ్ళి ఊసే మరిచిపోనా? పిచ్చితండ్రీ!
ముల్లె తెచ్చాడుగా పిల్లడూ, ముళ్ళు వేయించవా ఇప్పుడే
రూపాయ్ లొచ్చే సంబరం
లాల్లా..లాల్లా..
పాపాయ్ నిచ్చే సంబరం
లాల్లా..లాల్లా..
సొమ్మొకళ్ళదీ సోకొకళ్ళదీ
గప్ చుప్ గప్ చుప్
రిఫ్రెషింగ్ కోలా
రిఫ్రెషింగ్ కోలా థమ్సప్..
♠
/వేషము మార్చెను, భాషను మార్చెను, మోసము నేర్చెను
అసలు తానే మారెను, అయినా
మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు,
మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు../
ఈ పాటకు ‘మీసము నెరిసెను, గడ్డం నెరిసెను, అంతా మెరిసెను.. అయినా మనిషి మారలేదు.. ఆతని యావ చావలేదు/… /జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా, జన్మలోన భార్యకెపుడు లొంగబోకురా .. లొంగబోకురా../ లాంటి జొన్నవిత్తుల గారు పాడిన పేరడీ పాటలు ఎందరి మనసులనో దోచుకున్నాయి. పాడుతా తీయగా కార్యక్రమంలో, ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఆయనను అతిథిగా తీసుకొని, ఎన్నో పేరడీ పాటలను పాడించడం జరిగింది. ఆయన చాలా పాటలకు పేరడీలు వ్రాస్తూ… ఇటీవల ఆస్కార్ అవార్డుకు ఎంపికైన ‘నాటు, నాటు, నాటు నాటు’ పాటకు కూడా కొందరు రాజకీయ నాయకుల (సం)భాషణలపై వ్యంగ్యాస్త్రాన్ని సంధిస్తూ.. ‘బూతు బూతు బూతు.. బూతు.’ అనే ప్యారడీ పాటను సృజించారు.
‘పేరడీ’ అనే పదం పోస్ట్-క్లాసికల్ లాటిన్ పరోడియా అనే నుండి ఉద్భవించింది. గ్రీకు భాషలో దీనికి పద్యం లేదా పాట అని అర్థం. తెలుగులో దీనిని ‘పాటలోని సాహిత్యపు హాస్య లేదా వ్యంగ్యానుసరణ’గా భావించవచ్చు. పేరడీ సంగీతం, లేదా సంగీత పేరడీ అనే టెక్నిక్, ఇప్పటికే బాగా ప్రచారంలో ఉన్న సంగీత బాణీలలోని సాహిత్యాన్ని మార్చడం ద్వారా హాస్యాన్ని సృష్టించడానికి ఉపయోగిస్తున్నారు. సంగీతంలో, పేరడీని విభిన్న ప్రయోజనాల కోసం, వివిధ సంగీత సందర్భాలలో వాడుతున్నారు. సాంకేతికంగా గొప్ప కూర్పును, పాత ప్రసిద్ధ బాణీలను అధునాతనంగా తిరిగి ఉపయోగించుకోవడం, ఇప్పటికే ఎంతో ప్రచారంలో ఉన్న పాటలను హాస్యభరితంగా తిరిగి రూపొందించడం, కొన్నిసార్లు వ్యంగ్య ప్రభావం కోసం కూడా ఉపయోగిస్తారు.
సామాజిక మాధ్యమాలు ఎక్కువ ఉపయోగంలోకి వచ్చిన తర్వాత ఈ పేరడీ పాటల ప్రాముఖ్యత ఎంతో పెరిగింది. కొన్ని టీవీ ఛానళ్ళలో ఏకంగా వీటిపై లైవ్ షోలను నిర్వహిస్తున్నారు. చంద్రగిరి సుబ్బు లాంటివాళ్ళు, ఎన్నో spoofs తో , యూట్యూబ్ లో ప్యారడీ పాటలను వీక్షకులను అలరిస్తున్నారు.
ఈ వారం మనం సిరివెన్నెల కలం నుండి జాలువారిన పేరడీ పాటలను చూద్దాం. మొత్తం మీద ఆయన ఒక నాలుగైదు పేరడీ పాటలు మాత్రమే వ్రాశారు. వాటన్నిటిని మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాను.
శ్రీ, సంగీత నేపథ్యంలో వందేమాతరం, గురు రాధిక, శ్రీ, రామ్ చక్రవర్తి, చిత్ర గానం చేసిన ‘మనీ మనీ’ చిత్రంలోని పాట ఇది.
ఈ పాటలో /అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాంరా.. అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనీయనంతే.. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు../ లాంటి తన పాటలకు తానే పేరడీ వ్రాసుకున్నారు సిరివెన్నెల. ఈ పాట కూడా చాలా satirical గా ఉండి, ఎంతో హాస్యాన్ని పుట్టిస్తుంది.
సాకీ: యాదగిరిమామ
పల్లవి:
అతడు: గుండెల్లో దడదడదడలాడే గుబులొచ్చి ఒళ్ళంతా గడగడగడలాడే వణుకొచ్చి
ఇష్కంటే రిస్కుంటాదని తెలిసొచ్చే తెలివొచ్చి యెనకాలే యముడున్నట్టే అనిపించి
బేజారై పరుగెట్టోచ్చా పడుతూ లేస్తు బ్రతికుంటే అంతేచాల్లే అనుకొని
చరణం:
అతడు: యే జేబో కొట్టేసావా ఫుల్బాటిల్ పట్టేసావా చెప్పబ్బాయ్ ఏంచేశావో సిగ్గెందుకు
అతడు: నైజాము పోరిని చూశా నాజూగ్గా లైను వేశా అంతే భయ్ ఔర్ కుఛ్ నహీ మైనే కియా
అతడు: యే.. నీలా పరుగెత్తేవాడు లవ్లో పడి ఈదలేడు ప్యార్ కియా తో డర్ నా హే క్యా.. లవ్ చేసే యే మొగాడు ఇట్టా బెంబేలు కాడు జబ్ ప్యార్ కీయా తో డర్ నా హే క్యా..
అతడు: అంతు తేల్చుకుంటా తాడో పేడో అందమైన జాంపండా నా జంట చేర్చుకుంటా నేడో నాడో పందెమేనా జాజులచెండా
ఆమె: నవ్వులాట కాదోయ్ లవ్వాటంటే దేవదాసుననుకోకోయ్ నా మాట వినకుండా మారాంచేస్తే బావ కంట పడిపోతావోయ్
అతడు: మునిగేదాక తేలదు గనకా దిగుదాం పద లవ్లోకి సరదాగా ॥అంతు తేల్చుకుంటా॥
ఆమె : ||నవ్వులాట|॥
‘భరణి’ కలం పేరుతో కథలు, నాటికలు కూడా వ్రాసిన సిరివెన్నెలగారు, ‘ఆదివారమే మనకు ప్రతివారం’ అనే పాటను ఒక musical ballet లాగా తీర్చిదిద్ది ఎంతో హాస్యాన్ని పండించారు. ఎన్నో రకాల పాత పాటల బాణీలతో ఆయన ఈ పాటను కూర్చి రక్తి కట్టించారు. ఇందులో రిటైర్డ్ లైఫ్ సాధక బాధకాల గురించి, ఆ సమస్యను ఎలా అధిగమించాలి అనే సందేశాన్ని జోడించి, /చందురుని మించి అందమొలికించు చిట్టి పాపాయివే.. నేను పుట్టాను.. ఈ లోకం ఏడ్చింది, ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, కాశీకీ పోయాను రామా హరే – శివుని కళ్ళార చూశాను రామాహరే../ వంటి ఎన్నో పాటలు కలిపి అద్భుతమైన హాస్య సందేశాన్ని అందించారు సిరివెన్నెల.
చిత్రం: ఆడదే ఆధారం, సంగీతం: శంకర్ గణేష్ -గానం : ఎస్.పి.బాలు, ఎమ్. రమేష్, ఎస్.పి.శైలజ
పల్లవి :
అతడు:
ఆదివారమే మనకు ప్రతివారం నిజమే ఆదివారమే
మనకు ప్రతివారం ఇది ముసలితనము మనకిచ్చిన కొత్త వరం ఆరునెల్ల పాపాయల్లే నవ్వేద్దాం పకపకలాడేందుకు పళ్ళెందుకు అనుకుందాం బాదరబందీ రిటైరైపోయింది – బాధలబండి షెడ్డుకెళ్లిపోయింది వేళకింత తిని వాలు కుర్చీలో పడుకొని కోడికునుకు తీసేందుకు బోలెడంత తీరికుంది
అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా
ఆర్చేరా తీర్చేరా నా బాధను ఎవరైనా అంత విచారం దేనికి తాతయ్య నీ వింతకథేదో వింటా చెప్పయ్య ॥ఆదివారమే॥
సాకీ:
అతడు:
ఏమిటలా చెవికోసిన మేకలా ఆ.. ఆ.. అంటావు మరి ఆ తర్వాత ట్యూన్ మర్చిపోయానే దానిదేముంది ట్యూన్ మార్చేస్తే సరి- ఓయ్ అలాక్కానివ్వండి
అతడు:
చందురునిమించు అందమొలికించు ఆలినే కాదని
ఈ గాలి తిరుగుళ్ళు మానరా అంటు అడ్డుపడినానని కన్నతండ్రన్న గౌరవంలేక కాలదన్నాడయా ఆ సాని కొంగొదిలి రానుపొమ్మన్న హీనుడయ్యాడయ్యా
అడ్డాలనాడే గాని గడ్డాలొస్తే బిడ్డలా గడ్డిమేసే కొడుకు ఉన్నా ఊడినట్టే- తద్దినాలే పెట్టి ఉరుకోవయా అడ్డాలనాడే గాని గడ్డాలొస్తే బిడ్డలా
నేను తాగాను మా ఆవిడ ఏడ్చింది
నేను తాగాను నా పిల్లలు ఏడ్చారు.
ఇంకా తాగాను ఇక బయటకీడ్చారు.
తాగందే గతిలేక నేనేడ్చాను డ్రింక్ మోర్ ॥నేను॥
బీరు కొట్టి బజారెక్కి నాటు సారా నిషా ఎక్కి
తప్పుదారిలో తుళ్ళుతు ఉంటే ముప్పురాదా ముసలోడా ముసలోడా
కిక్కుమీద ఆ సంగతి గుర్తురాదు
కాని ఒక్క నిముషమైనా ఆ తిక్కపోదు
కైపులేనిదే ఊపిరాడదే కైపులేనిదే ఊపిరాడదే
ఆ కైపు ఎక్కువైతే ఇక ఊపు ఆగదే
పెళ్ళామేమో బెల్లమయ్యే తల్లిదండ్రి అల్లమయ్యే
కాస్త ఆగవయ్యా ముసాలయాన
దానికి ముందు ఓ హమ్మింగుంది అది వొదిలేస్తే ఎట్టాగా
హమ్మింగ్
అయ్యయ్యో హమ్మింగ్ రూటుమారిపోయిందయ్యా
ముసాలాయనా.. నువ్వేలాగించు కానియ్..
పెళ్ళమేమో బెల్లమయ్యే తల్లీతండ్రీ అయ్యే
ఆమె: అల్లమయ్యే
అతడు: ఇల్లువెళ్ళ గొట్టేశాడు చూడయ్యా మాగోడు చెప్పుకునే దిక్కులేదయ్యా అయ్యయ్యో ఓ… ఓ..
ఆమె: చూడయ్యా
ఆమె:
తలకు పిలక భారమా, వలకు చిలక భారమా, కాలికి వేలు భారమా, అయ్యయ్యయ్యో ఐనా ఇంత ఘోరమా ఛీ ముదనష్టపోడ.. అవునండీ
అతడు:
గుండెమంట వదిలింది గువ్వజంట మిగిలింది ||2|| ఒకరికొకరు బిడ్డలుగా భావిస్తూ బ్రతకండి
ఆమె: అలాగే
ఆమె: కాశీకిపోయాడు మా ఆయన పోయి బైరాగి అయినాడురా నాయన ॥2॥
కాషాయమే కట్టి మా ఆయన నన్ను గంగలో ముంచాడురా నాయన ॥2॥
అతడు: శభాష్
అతడు: వయసై పోయిన పెళ్ళాంతో ఇక లాభం లేదనుకున్నాడో
రంభా ఊర్వశి మేనకకోసం తపస్సు చేస్తూ ఉన్నాడో
అనిగాని కంగారుపడుతున్నావా అదేం జరగదులే ఏమంటే
గడ్డం నెరిసిన సరసుడితో ఏ రంభా ముచ్చటపడదమ్మా
నువ్వే దిక్కని రేపో మాపో తప్పకవస్తాడే బామ్మ
ఆమె: సుందరా ఎందరినో కాదని కన్నెగా మిగిలానురా
నిను చేరగా సుందరా.. సుందరా.. సుందరా..
అతడు: బామ్మా! నేను శంకరశాస్త్రిని కాను నువ్వు మంజుభార్గవి కాదుగాని ఇక ఆపవే తల్లీ ఈ ఏడుపు వర్షం
॥ఆదివారం॥
‘లక్కీ ఛాన్స్’ చిత్రం కోసం, శ్రీ సంగీత నిర్వహణలో, రాజేంద్రప్రసాద్, చిత్ర పాడిన పాట, ‘మిస్సమ్మ’ చిత్రంలో పింగళిగారి రచన ‘రావోయి చందమామకు’ పేరడీగా ఈనాటి మొదటి రేయి అనే పాటను సిరివెన్నెల రచించారు. పాట వింటే/ చదివితే కథ మనకు పూర్తిగా అర్థమవుతుంది. అతడు ‘రావోయి చందమామా: అని పిలవడం ఆమె ‘పోవోయి చందమామ’ అని చెప్పడంలోనే మనకు వారిద్దరి మధ్య ఉన్న ఘర్షణ అర్థం అవుతుంది. అబ్బాయి ఏమని బుజ్జగిస్తున్నాడు? అమ్మాయి ఎలా తిరస్కరిస్తుంది? అతని మనసులో ఏముంది? ఆమె మనసులో ఏముంది? అనే ఆలోచనలన్నిటికీ అద్దం పడుతుంది ఈ సిరివెన్నెల పాట.
పల్లవి:
అతడు: రావోయి చందమాను మా వింతగాథ వినుమా రావోయి చందమామ
ఆమె: పోవోయి చందమామ పనివుంటే చూసుకోమ్మా, పోవోయి చందమామ
అతడు ఏకాంతముగల గదిలో ఏమాత్రము సుఖపడదోయ్ సరసము విరసము చేసే చిటపటలెందుకు చెపుమా.. చెప్పు
ఆమె: ఇతరులనేమార్చుటకే పతిగా నటనలు చాలోయ్ అతిగా జీవించేస్తే మొదలే చెడునని చెపుమా
॥రావోయి చందమామ॥
చరణం:
అతడు:
వాతావరణము చూస్తే మదనుడికే మతిపోదా రాయో ఏమో గాని చెంతకు రానే రాదోయ్.
ఆమె: అతిగా అల్లరిమాని బుద్ధిగపడుకో కన్నా
చెంతనే ఉన్నాగాని అంతటి సీనే లేదోయ్
॥పోవోయి చందమామ॥ ॥రావోయి చందమామ||
చరణం:
అతడు: ఈనాటి మొదటి రేయి నూరేళ్ళ జంట హాయి.. ఈనాటి మొదటి రేయి
ఆమె: మూణ్ణాళ్ళ ముచ్చటోయి ఆపైన చెల్లదోయి.. మూణ్ణాళ్ళ ముచ్చటోయి
చరణం:
అతడు: అన్యోన్యము కల జతగా ఆనందంగా ఉందాం దాంపత్యానికి ఋజువు గంపెడు పిల్లలు కందాం
ఆమె: లక్షల విలువనుచేసే పుత్రుడు ఒక్కడు చాలోయ్ స్టేట్సుకి వీసా తెచ్చే పరిమితి సంతతి మేలోయ్
॥మూణ్ణాళ్ళ ముచ్చటోయ్॥
చరణం:
ఆమె: చైనా పంచాంగంలో చెప్పిన మూర్తం చూసి
నీ నా కలలను తీర్చే మగనలుసుని పొందాలోయ్
అతడు: ఆలూమగలము అయినా విరహముతో గడపాలా అమ్మానాన్నల చేసి విడదీసే కొడుకేల
॥ఈనాటి మొదటి రేయి॥
‘మనీ మనీ’ చిత్రం కోసం సిరివెన్నెల గారు పేరడీ టెక్నిక్ ఉపయోగించి, రచించిన ఒక రీమిక్స్ లాంటి హాస్య భరితమైన పాటను ఇప్పుడు చూద్దాం. పల్లవి లేకుండా, అన్నీ చరణాలతోనే సాగే పాట ఇది. ఒక్కొక్క చరణం ఒక్కో బాణీలో సాగడం దీని ప్రత్యేకత.
పాడు కబురు వినగానే.. ఏ..
పైకం తెస్తాడా.. ఆ.. పైకం తెస్తాడా?
ఎవ్వడి బాబు సొమ్మంటూ
వైఫు గొంతు కోస్తాడా?
ఏమో ప్లానేశాం గానీ, partneరూ డబ్బురా
పాడు కబురు వినగానే..
పైకం తెస్తాడా..అయ్యయయ్యో..పైకం తెస్తాడా…
( మావిచిగురు తినగానే కోయిల పలికేనా..)
నోరు మూయరా పిరికి పంద
శుభం పలకవా.. ఊహూ..
ఆది లోనే హంస పాదా, రేయ్..
ఆశ లేదా.. ఏంటీ.. ఊహూ..
సపోజు ఖర్మ కాలిపోతే
suddenగ ప్లాను మారిపోతే
పదేళ్ళు కఠిన ఖైదు అంతే..
(జామురాత్తిరీ జాబిలమ్మ.. జోల పాడనా ఇలా..)
ఇదిగో మనీ ఎటున్నా విని
ఇలారా కిడ్నాపరూ
రా..రా..రా..అ..రా..రా.. హహ
వదిలేయ్ మరి నా ఇల్లాలిని
నా ఇంటికి చిరుదివ్వెనీ
ఆస్థీ పాస్థీ బలాదూరేరా
నా దేవేలే మిన్నా..
బం చిక్ బంబం బబుచిక్ బంబం
బాబా బీబీబాబాబీబి.బా..
(ఇంతేనయా, తెలుసుకోవయా, ఈ లోకం ఇంతేనయా)
ప్రాణాలైనా ఇస్తాకానీ మానేనా
పాతాళానా నిను పాతేయ్ నీ రాలేనా
పాతాళానా నిను పాతేయ్ నీ రాలేనా
ప్రాణం కన్నా పెళ్ళాం మిన్నా అంతేగా
నీ చేతుల్లో చచ్చే భాగ్యం నాదేగా.. ఆఅ..
నీ చేతుల్లో చచ్చే భాగ్యం నాదేగా.. హహహ..
( దిల్ దివానా బిన్ సజనా కే మానేనా..)
యురేకా సకామికా
తొక్కింది నక్కతోకా
నెగ్గింది చిట్కా పండూ..
దక్కింది చక్కా ఫండూ
దొరికెరా ఈజీ ఫినాన్సు
జరుపుకో క్రేజీ రొమాన్సు
యురేకా సకామికా
తొక్కింది నక్కతోకా
(నవ్వింది మల్లెచెండు.. నచ్చింది గర్ల్ ఫ్రెండు)
పెళ్ళి ఈడు పిల్ల ఉండీ
కళ్ళముందే అల్లుడుండీ,అల్లుడుండీ
టైమ్ వేస్ట్ చేస్తారేంటి మావయ్యా.. ఫాదరిన్లా..
మా మ్యారేజికి లేటవుతుంది నీవల్లా
(అద్దమంటి మనసు ఉంది, అందమైన సొగసు ఉంది..)
ప్రాపర్టీ పైసా లేదే, పోషించే పథకం లేదే
పెళ్ళానికి ఫుడ్డేమిట్రా, పచ్చగడ్డి పెడతావా
పోరా సోంబేరి గాడా, నీ ఫేసుకి పెళ్ళొకటా
నీకె ఓ కంత లేదే, నీ మెడలో డోలొకటా
(ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే ఎదురవుతుంటే)
కన్నెగానే ఉండిపోనా? కన్నతండ్రీ!
పెళ్ళి ఊసే మరిచిపోనా? పిచ్చితండ్రీ!
ముల్లె తెచ్చాడుగా పిల్లడూ, ముళ్ళు వేయించవా ఇప్పుడే
(వానజల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మా)
రూపాయ్ లొచ్చే సంబరం
లాల్లా..లాల్లా..
పాపాయ్ నిచ్చే సంబరం
లాల్లా..లాల్లా..
సొమ్మొకళ్ళదీ సోకొకళ్ళదీ
గప్ చుప్ గప్ చుప్
రిఫ్రెషింగ్ కోలా
రిఫ్రెషింగ్ కోలా థమ్సప్..
రిప్రెషింగ్ కోలా అని.. పాటకి ముక్తాయింపు పలికినట్టు.. ఈ పాట మనసుకు మంచి రిఫ్రెషింగ్ మూడ్ ఇస్తుంది. మనల్ని కడుపుబ్బా నవ్విస్తూ, ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇటు శారీరక ఆరోగ్యాన్ని, అటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, నవ్వు ఎంత మంచి మార్గమో మనకు తెలియనిది కాదు. అయితే ఇంత హాస్యాన్ని నింపే ఈ పాటలో తెలుగు పలుకుబళ్ళు, నానుళ్ళు, ప్రాసలు, వ్యంగ్యోక్తులు మెండుగా ఉన్నాయి.
/ఎవడబ్బ సొమ్ము, గొంతు కోయడం, శుభం పలకరా పెళ్ళికొడకా, ఆదిలోనే హంస పాదం, కర్మ కాలడం, ఇంటికి దీపం ఇల్లాలు, ఆస్తిపాస్తి, ముల్లె తేవడం, ముళ్ళు వేయించడం, కడుపుకి గడ్డి పెడతావా, సోంబేరి గాడు, తా దూర కంత లేదు, మెడకోడోలా?, సొమ్మొకడిది సోకొకడిది, ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చిప్../ వంటి ముత్యమంటి పొందికైన పదాలు ఇందులో ఉన్నాయి. అసలు ఇలాంటి ఓ రీమిక్స్ పాటలో, ఇంత తెలుగుదనం ఉట్టి పడుతుందని, ఇంత అందమైన భాషా సంపద మూటగట్టుకొని వస్తుందని, ఎవరైనా ఊహించగలరా? అదే మరి, సిరివెన్నెలగారి విశిష్టత.
ఈ పాటను వింటున్నంతసేపు, మనం కడుపార నవ్వుకుంటూనే ఉంటాం. ఆయన కొన్ని పేరడీ పాటలే వ్రాసినా, ఇంత హాస్యభరితమైన పాటలని మనకోసం ఒక నిధిలా అందించడం తెలుగువారి అదృష్టం. తన పాటలకు తనే పేరడీ రాసుకోవడం కూడా, ఇందులో ఒక కొత్త మలుపే. Rhyming, timing, sarcasm, sense of humour కలగలిపిన ఈ సరదాల, సరాగాల సందళ్లు మిమ్మల్ని తప్పకుండా అలరిస్తాయని ఆశిస్తున్నాను.
Images Source: Internet
[ఈ అంశాన్ని నాకు సూచించి, కొంత సమాచారాన్ని అందించిన, చక్రవర్తుల కిరణ్ (నచకి) గారికి కృతజ్ఞతలు.]
శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ గారు ఆంగ్ల అధ్యాపకురాలు, వ్యక్తిత్వ వికాస నిపుణురాలు, గీత రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు(తెలుగు-ఇంగ్లీష్-హిందీ), సామాజిక కార్యకర్త.