[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]
ఊహలు ఊరేగే గాలంతా
~
చిత్రం: సమ్మోహనం
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: వివేక్ సాగర్
గానం: హరిచరణ్, కీర్తన
~
పాట సాహిత్యం
పల్లవి:
అతడు: ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంట॥ ఊహలు ఊరేగే ॥
ఈ సమయానికి తగు మాటలు ఏమిటో ఎవ్వరినడగాలట చాలా పద్ధతిగా భావం తెలిసి ఏదో అనడం కంటే సాగే కబుర్లతో కాలం మరిచి సరదా పడదామంతే ॥ ఊహలు ఊరేగే ॥
చరణం:
అతడు: పరవశమా మరీ ఇలా పరిచయమంత లేదుగా
ఆమె: పొరబడిపోకు అంతలా నను అడిగావా ముందుగా
అతడు: నేనేదో భ్రమలో ఉన్నానేమో నీ చిరునవ్వేదో చెబుతోందని
ఆమె: అది నిజమే అయినా నాతో అనకు నమ్మలేనంతగా ॥ ఊహలు ఊరేగే ॥
చరణం:
ఆమె: తగదు సుమా అంటూ ఉంటే తలపు దుమారం ఆగదే..
అతడు: తొలిదశలో అంతా ఇంతే కలవరపాటు తేలదే..
ఆమె: ఈ బిడియం గడియే తెరిచేదెపుడో నా మదిలో మాట తెలిపేందుకు
అతడు: నన్నిదిగో, ఇదదే అనుకోమనకు, ఆశలే రేపగా ॥ ఊహలు ఊరేగే ॥
♠
ఆమె: సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు
విరహాల గోల ఇంకానా వీలు కాదు..
వంటింట్లో గారాలు ఒళ్ళంతా కారాలే సారు
అతడు: చురుకైన ఈడు వద్దన్నా ఊరుకోదు
విరజాజిపూలు వంటింట్లో వాడరాదు
లాంటి trending romantic songsతో కొత్త ఒరవడి సృష్టించారు సిరివెన్నెల. శివ చిత్రంలోని ఈ పాటలో కొత్తగా పెళ్లయిన ఆలుమగల మధ్య సరదాలను, సరసాలను, చిలిపి సంభాషణలను ఎంతో అందంగా కూర్చి, సాహితీ అభిమానుల మనసులను దోచుకున్నారు. స్నానానికి సాయం రావాలని తగువు పెట్టుకోవడం, చూపులు సోప్ గా కావాలని సరదా పడడం, పైటతో పాటే లోనికి వచ్చి పాపలా పారాడడం, పగలు రాత్రి తేడా లేకుండా, అడ్డూ, అదుపూ లేకుండా, భార్యతో గడపాలని ఆరాటపడడం.. వంటి సహజమైన శృంగార భావనలు ఈ పాటలో మెండుగా కనిపిస్తాయి. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో జానకి, మనోలు పాడిన ఈ పాట ఒక ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది.
ఇలాంటి ఎన్నో సమ్మోహన గీతాలను సిరివెన్నెల వివిధ చిత్రాలకు వందలాదిగా అందించారు. వాటిలో కొన్నింటిని ఇప్పుడు పరిశీలిద్దాం.
~
బొబ్బిలి రాజా చిత్రంలో యువతను ఎంతో ఉర్రూతలూపిన ‘బలపం పట్టి’, పాటలో భామ బడిలో, ప్రేమ ఒడిలో, అచ్చులు మొదలెట్టి .. అం, అః వరకు చేరుకొని, మరి కాస్త ముందుకు వెళ్లి.. హల్లుల్లో హలో దాకా వెళ్లాలని.. చాలా గుంభనంగా చెప్పాల్సిన విషయాన్ని.. ప్రేమికులతో చెప్పించారు సిరివెన్నెల.
అతడు: బలపంపట్టి భామ బళ్లో అఆఇఈ నేర్చుకుంటా
పంతంపట్టి ప్రేమ ఒళ్లో ఆహాఓహెూ పాడుకుంటా ‘అం అః’ అంటా అమ్మడూ
హెుయ్యారె హెుయ్యారె హెుయ్
కమ్మహా వుండేటప్పుడూ
బుజ్జిపాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో
ఆమె:
సరసం ఇంక ఎక్కువైతే ఛఛాఛిఛీ తప్పదయ్యో
అపుడె ఇట్టే ప్రేమ ఒళ్లో అయితే గియితే ఎందుకయ్యో
అచ్చులే అయ్యాయిప్పుడు
హెుయ్యారె హెుయ్యారె హెుయ్ హల్లుల్లో హల్లో ఎప్పుడు?
~
పోలీస్ రిపోర్ట్ చిత్రం కోసం గంగై అమరన్ సంగీత నేతృత్వంలో, ఎస్.పి.బాలు, ఎస్. జానకి గానం చేసిన మరో రసభరిత శృంగారగీతంలో.. సుమ పరిమళాలతో రాగలీల సాగాలనీ, మోహ వీణ పరవశాలతో మ్రోగాలనీ.. అంద చందాల సముద్రంలో శృంగార నావ సాగాలనీ.. సంగీత భరితమైన ఉపమానాలతో భావాతీతమైన పద చిత్రాన్ని సిరివెన్నెల రచించారు.
ఆమె: సాగనీ రాగలీల సుమాల పరిమళాల
అతడు: మ్రోగనీ మోహవీణ సుఖాల పరవశాల
ఆమె: పూలగంధాలు స్వరాలుగా
అతడు: మేని అందాలు సయ్యాడగా
ఆమె: కాలం శిలగా మారి నిలువగా
అతడు: సాగనీ రాగలీల సుమాల పరిమళాల
ఆమె: మోగనీ మోహవీణ సుఖాల పరవశాల
చరణం:
అతడు: అందచందాల సంద్రాలలో శృంగార నావ సాగే
ఆమె: ఇంద్రచాపాల వర్ణాలతో ఒంగారు దీవి చేరె
అతడు: కాలమే ఏలుదాం విడని కౌగిళ్ళలోన
ఆమె: కథలుగా మిగులుదాం వలపు కావ్యాలలోన
అతడు: ప్రేమే మరపురాని మధుర భావ రాగ తాళమై
ఆమె: సాగనీ రాగలీల సుమాల పరిమళాల
అతడు: మ్రోగనీ మోహవీణ సుఖాల పరవశాల
~
హ్యాపీ వెడ్డింగ్ చిత్రంలోని ‘కాదని నువ్వు అంటున్నది’.. అనే పాటలో చెలి మనసులోని భావానికి, పెదవి పలికే మాటకు మధ్య పొంతనలేదనీ, కవ్వించే కయ్యాలతో చెలి మాట నెగ్గదనీ, ప్రణయంలో ఓటమిని గెలుపుగా భావించుకోవాలనీ.. ప్రియుడి చేత ప్రణయ రహస్యాలను చెప్పించారు సిరివెన్నెల. హేమచంద్ర, శ్రావణభార్గవి పాడిన ఈ పాటకు, శక్తికాంత్ కార్తీక్ సంగీతం కూర్చారు.
పల్లవి:
అతడు: కాదని నువ్వంటున్నది ఔనని వినిపిస్తున్నది నిజమేనా ॥ 2 ॥
ఆమె: ఏమో ఏమన్నానో ఏమో ఏం విన్నావో
అతడు: ఏం కావాలంటున్నది అటు ఇటు ఊగే నీ మది తెలిసేనా ॥2॥
ఆమె: ఏమో ఏం కావాలో తనకి తెలుసో లేదో
చరణం:
అతడు: నీలో నీతోనే దోబూచి దొంగాట, నీకే నువు దొరికేదెపుడంట
ఆమె: ఆటో వేటో తేలని మన ఈ చెలగాట, ఆలోచిద్దాం అందాక తప్పేం లేదంట
అతడు: కవ్వించే కయ్యాలతో నెగ్గదు చెలి మాట, ఓటమినే గెలుపంటుంది మనసుల ముద్దాట
ఆమె: అవునా అంతేనేమో అయినా ఇంతేనేమో ॥ 2 ॥
॥ కాదని నువ్వంటున్నది ॥
~
గోల్కొండ హైస్కూల్, సినిమాలో చిత్రవిచిత్రమైన out of box పదబంధాలతో.. ప్రేయసి ప్రియుల మధ్య romantic feelingsకి అద్దం పడుతూ ‘ఇది అదేనేమో’ అనే గీతాన్ని సిరివెన్నెల రచించారు.. ఇందులో /బిడియానికి కూడా దుడుకు రావడం, ఏకాంతం ఎరుపెక్కడం, చలికి చమట పట్టించడం, తీయని ఇబ్బంది.. లాంటి చిత్ర పదబంధాలతో ఊహలకందని భావాన్ని.. ఇది అదేనేమో! అని ఎత్తుగడతో ప్రయోగించారు ఆయన. కళ్యాణి మాలిక్ సంగీతం కూర్చగా శ్రీ కృష్ణ, గీతా మాధురి, ఈ పాటను ఆలపించారు.
అతడు:
ఇది అదేనేమో అలాగే ఉందే తెలుసునో లేదో తెలీడం లేదే ఫలనా అని అనుకోమని ఏ రోజు చెబుతుందో ఏమో
ఆమె: ఇది అదేనేమో అలాగే ఉందే తెలుసునో లేదో తెలీడం లేదే ఫలనా అని అనుకోమని ఏ రోజు చెబుతుందో ఏమో
ఆమె: ఇది అదేనేమో..
అతడు: అలాగే ఉందే
చరణం:
ఆమె: ఏకాంతం ఎరుపెక్కేలా అంతిదిగా చూడాలా మీతో మహకష్టం మాస్టారు
అతడు: చలిగాలికి చెమటట్టేలా కవ్విస్తూ నవ్వాలా ఉడికిస్తూ ఉందే నీ తీరు
ఆమె: ఇదివర్లా ఉండాలో ఇంకోలా మారాలో ఈ తీయని ఇబ్బంది ఇదేవిటో
అతడు: దూరంగా ఆగాలో దగ్గరగా చేరాలో ఏం చేస్తే బాగుంటుందో
ఆమె: ఫలనా అని అనుకోమని ఏ రోజు చెబుతుందో ఏమో
అతడు: ఇది అదేనేమో
ఆమె: తెలుసునో లేదో తెలీడం లేదే..
~
మిరపకాయ్ చిత్రంలో ఈడు పడే తపనని ప్రేయసి వర్ణించగా.. అరమరికలు పోవడానికి ఆ అలజడులు రేగాయనీ, ఆమె రహస్యంగా పడే యాతనను పోగొట్టడానికే తాను ఆమె దరికి వచ్చాననీ ప్రియుడు చెప్తాడు. ఆమె పడే ఆపసోపాలకు కారణం విరివిగా మెరిసిన వయసనీ, సిగ్గు వదిలి ఆ జంట ఒక్కటైనప్పుడే, భారమంతా మాయమవుతుందనీ, ఉరికే ఈ ఊహలో విహరిస్తూ.. మతిపోయే మాయలో మునకేసేద్దామనే, సరస శృంగారాన్ని అభివ్యక్తీకరించారు సిరివెన్నెల. తమన్ సంగీత దర్శకత్వంలో కార్తీక్, గీతా మాధురి, పాటను గానం చేశారు.
పల్లవి:
ఆమె: గది తలుపుల గడియలు బిగిసెను చూసుకో మహానుభావా,
అది తెలిసిన బిడియము జడిసెను ఎందుకో
అతడు: తలమునకల తలపుల అలజడి దేనికో గ్రహించలేవా,
అరమరికల తెర విడు అలికిడి పోల్చుకో తేల్చుకో
ఆమె: ఉడికే ఈ ఈడుతో పడలేకున్నా దయతో నన్నాదుకో దరికొస్తున్నా కొరికే ఈ కోరికే వివరిస్తున్నా నిను తాకే గాలితో వినిపిస్తున్నా
అతడు : రమణి రహస్య యాతన చూశా, తగు సహాయమై వచ్చేశా, కనుక అదరక బెదరక నా జంటే కోరుకో చేరుకో..
॥ ఉడికే ఈ ఈడుతో ॥
~
గుడుంబా శంకర్ సినిమాలో.. హీరోయిన్ అందాలను వర్ణిస్తూ.. ఆమె చిట్టి నడుములోని రహస్యాలను ఎలాగైనా పట్టుకోవాలంటూ.. శృంగార భావాలను, అల్లరిగా పలికించారు సిరివెన్నెల. సంగీతం: మణిశర్మ, గానం: మల్లిఖార్జున్, ప్రమ్జీ అమరన్.
పల్లవి:
చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసలో చస్తున్నా కంటపడదు ఇక ఎదురేమున్నా
చుట్టుపక్కలేమౌతున్నా గుర్తుపట్టనేలేకున్నా చెవినపడదు ఎవరేమంటున్నా
నడుమే ఉడుమై నను పట్టుకుంటే జాణా అడుగే పడదే ఇక ఎటుపోదామన్నా
ఆ మడతలో మహిమేమిటో వెతకాలి తొంగి చూసైనా ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా ॥ చిట్టి నడుమునే ॥
~
తన సొంత వయ్యారమే తనకు శత్రువు అయిందని, జాలిపడే లాలనతో భారం లొంగదనీ, కస్సుమనే లక్షణమే దానికి పగ్గం వేస్తుంది అన్న భావనతో వర్షం చిత్రంలోని ఒక యుగళగీతం. అసలు అమ్మాయి ప్రాయానికి వచ్చిందన్న భావాన్ని, లంగా వోణీ నేటితో రద్దయిపోని.. అనే సున్నితమైన ఎత్తుగడతో ఈ పాట ప్రారంభమవుతుంది. దేవి శ్రీ సంగీత నేపథ్యంలో, ఉష, టిప్పు పాడిన పాట ఇది.
పల్లవి:
అతడు: లంగా వోణి నేటితో రద్దైపోనీ, సింగారాన్ని చీరతో సిద్ధం కానీ
నిన్నలా కన్నెలా తుళ్ళకే అమ్మాణి, చిందులే ఆపగా ముళ్ళు వేయనీ..
ఆమె: సర్లేగాని చక్కగా పెళ్ళైపోనీ, అల్లర్లన్నీ జంటలో చెల్లైపో,నీ
లగ్గమే పగ్గమై పట్టుకో ప్రాయాన్ని సొంతమై అందమే అప్పగించనీ..
~
మంచివారు మావారు చిత్రం కోసం ఐ.వి. శశి దర్శకత్వంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించిన ఒక శృంగార గీతం. ఈ పాటలో కలయిక కోసం ఒక జంట పడే తపనని ఎంతో భావాత్మకంగా.. /స్వాగతాలే సాగరాలై గుండెదాటే కోరికలతో కాదనేదే కరుగుతుంది, నింగి ఇలపై ఒరుగుతుంది కోటి కౌగిళ్ళతో, మెరుపుల మైకం ముగిసిన వెనుకే చల్లని వలపో, వెల్లువ ముంపో తేలునుగా/.. రచించారు. ప్రకృతి సంగమాన్ని ఉపమానంగా తీసుకొని.. ఎంతో అందంగా ఈ గీతాన్ని పలికించారు సిరివెన్నెల.
పల్లవి:
అతడు: ఆషాఢవేళ ఆటాడనేల ఆకాశమంతా ఆనందడోల ఈ చలిగీతం ఈ జలపాతం ఊపిరి శృతిగా ఊయల గతిగా సయ్యనగా ॥ ఆషాఢవేళ॥
చరణం:
మోగుతుంటే వానవీణ మేలుకోదా మౌనమైనా
జాలువారే నీలిస్నేహం పొంగిపారే నేలదాహం వాయువేగాలతో సాగిన వేగం ఆగేదాక
వాగులు నడిపే వానకు తెలుసా తుదిమలుపు ||ఆషాఢవేళ||
~
గోపాలరావు గారి అబ్బాయి చిత్రంలో.. రసభరితమైన లలిత శృంగార గీతాలు..
1.
అతడు: కోమలి తనువే కాముని ధనువై విసిరే విరిశరములనే
ఆమె: నీ తొలిచూపుల లేవిరితూపులు ముసిరే హృదయములోనే
అతడు: ఆమని వెన్నెలలోన భామిని వన్నెల వాన ॥2॥
ఆమె: మరులే మదిలో మొలిచే కలలే ఇలలో నిలిచే
అతడు: కోమలి తనువే కాముని ధనువై విసిరే విరిశరములనే…
2.
పల్లవి:
అతడు: పరువాల మురిపాలు మనపాలే నేడు ॥2॥ సరదాల సరసాల విరివానే నేడు
ఆమె: విరహం తీరే మధురిమతో నా మది పాడే సమయమిది..
చరణం:
అతడు: రాసక్రీడకు సై అంది జిలిబిలి చెలి చలి రేపింది
ఆమె: ఏ హద్దు ఇక లేదంది తలపుల తలుపులు తీసింది
………..
3.
పల్లవి:
అతడు: రావె మోహిని రసరాగవాహిని ||2|| మనలో మరులే సుధలై నిలువనీవే రావె మోహిని రసరాగవాహిని
చరణం:
ఆమె: శ్వాసలోని ఆశ నీవే చలువ జాబిలి
అతడు: తేనెసోనలోన నేను తేలియాడనా చెలి
ఆమె: నిను కోరి విరిసేను నీది ఈ కలువ
అతడు: నిను చేరి మురిసేను నీవు నా కలవే..
~
చెంగల్వ పూదండ చిత్రంలోని మరో శృంగార తరంగం..
పల్లవి:
ఆమె: గుండెలో యవ్వనాల థిల్లానా, ఎవ్వరో మీటుతున్న రసవీణ
అతడు: అల్లరి అందెలై పాడనీ ఈడునీ, వెల్లువే పల్లవై పాడనీ హాయినీ
ఆమె: కౌగిలింతలే కృతులై జతులాడే సంగమం
అతడు: గుండెలో యవ్వనాల థిల్లానా ఎవ్వరో మీటుతున్న రసవీణ..
~
వదినగారి గాజులు చిత్రంలోని మరో romantic song..
పల్లవి:
చుంచుంచుం తననననోం, చినుకులలో చిలిపితనం ఘుంఘుంఘుం తననననం, కులుకులలో మెలిక సుఖం
పసిపరువానికి సిగ్గంట కసికసి ఉరుములు అగ్గంట
గాలుల గలాటా ఆగదు పొమ్మంటా, కమ్ముకొమ్మంటా కప్పుకొమ్మంటా..
~
బలరామకృష్ణులు సినిమాలోని మరో మోహాల అల్లర్లు వినిపించే ఓ యుగళ గీతం..
పల్లవి:
అతడు: అమ్మమ్మో ఎన్నున్నాయో నిక్షేపాలు
ఆమె: నమ్మయ్యో నీకేనయ్యో నైవేద్యాలు
అతడు: ఎట్టాతాకాలి చూసే మాసే అందాలు
ఆమె: కళ్ళేమూసేలా కైపును కలిగిస్తే చాలు
॥ అమ్మమ్మో ఎన్నున్నాయో॥
~
ఇలా చెప్పుకుంటూ పోతే.. లెక్కకు మిక్కిలిగా ఉన్న..శృంగార గీతాలు ఎన్నెన్నో.. సిరివెన్నెల గారు వ్రాసిన మూడు వేలకు పైగా పాటలలో, మూడవ వంతు ఇవే ఉంటాయేమో! అని నాకు అనిపిస్తుంది. సినిమాల్లో యుగళగీతాలపై మొదట్లో ఆయనకు ఒక సదభిప్రాయమే ఉండేది కాదు.. కానీ, ఒక సినీ గేయ రచయితగా ఆయన ఎంతో పొందికగా ఇలాంటి గీతాలను చిత్రసీమకు అందించారు. ఇక చివరగా, సమ్మోహనం చిత్రంలోని ‘ఊహలు ఊరేగే గాలంతా’ పాటలోని సాహిత్యాన్ని ఒకసారి తరచి చూద్దాం.
పల్లవి:
అతడు: ఊహలు ఊరేగే గాలంతా
ఇది తారలు దిగివచ్చే వేళంట॥ ఊహలు ఊరేగే ॥
ఈ సమయానికి తగు మాటలు ఏమిటో ఎవ్వరినడగాలట చాలా పద్ధతిగా భావం తెలిసి ఏదో అనడం కంటే
సాగే కబుర్లతో కాలం మరిచి సరదా పడదామంతే ॥ ఊహలు ఊరేగే ॥
ఒక యువ జంట పాడుకునే ఈ పాటలో ఒకవైపు అందమైన భావ చిత్రాలను అందిస్తూ, మరోవైపు practical గా మనసులో వచ్చే ఆలోచనలకు పదాలను కూరుస్తూ, ఎంతో అందమైన ప్రేమ గీతాన్ని సిరివెన్నెల అందించారు. చల్లని సాయంత్రం వేళ.. తారలు దిగి రావడానికి సన్నద్ధమవుతున్న వేళ.. ప్రియురాలికి సంబంధించిన ఊహలు వెల్లువలా పొంగి.. గాలిలో తేలి.. ఎక్కడెక్కడో పయనిస్తున్నాయట. అలాంటి సందర్భంలో ఎలాంటి మాటలు మాట్లాడాలో తనకు తెలియదని, ఎవరిని అడగాలా కూడా అర్థం కావడం లేదని హీరో ఆలోచనలో పడి, అంతలోనే ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎలా మాట్లాడాలో, ఏమి మాట్లాడాలో, మాట్లాడే పద్ధతి ఏమిటో??? ఇవన్నీ ఆలోచించకుండా, కబుర్లు ఎలా సాగితే అలా సాగుతూ సరదాగా కాలం గడిచిపేయడం మేలని, అనుకున్నాడు. ఈ అభివ్యక్తి ఎంత సహజ సిద్ధంగా ఉంది కదా! ప్రేయసి ప్రియుల మధ్య ఎక్కడో స్క్రిప్ట్ వ్రాసుకుని అప్పజెప్పిన సంభాషణల్లాగా కాకుండా, మనసులో ఆ సమయానుసారం దొర్లిన భావాలను partnerతో పంచుకోవడం సబబని సిరివెన్నెల పరోక్షంగా సూచిస్తున్నారు.
చరణం:
అతడు: పరవశమా మరీ ఇలా పరిచయమంత లేదుగా
ఆమె: పొరబడిపోకు అంతలా నను అడిగావా ముందుగా
అతడు: నేనేదో భ్రమలో ఉన్నానేమో నీ చిరునవ్వేదో చెబుతోందని
ఆమె: అది నిజమే అయినా నాతో అనకు నమ్మలేనంతగా ॥ ఊహలు ఊరేగే ॥
ఇప్పుడు హీరో హీరోయిన్ల మనసులో కలిగే భావాలను, ఒక సంభాషణ రూపంలో అందిస్తున్నారు, సిరివెన్నెల. ‘నా మనసులో పొంగి పొర్లే ఈ భావాన్ని పరవశమని అనుకోవాలా? పరవశం అంటే, మనసు మన వశం తప్పిపోవడం కదా? అయినా మా ఇద్దరి మధ్య అంతస్థాయి పరిచయం లేదు కదా?’, ఇది హీరో మాట. ‘పరిచయం లేదని అంతగా పొరబడకు, ఈ విషయం గురించి నీవేమైనా ముందుగా నన్ను అడిగావా?’ అన్నది హీరోయిన్ సమాధానం. దానికి మళ్లీ ప్రియుడు అంటాడు, నీ చిరునవ్వు చూసి దాన్ని ప్రేమకు ఒక signal గా భావించి, నేనేమన్నా పొరబడుతున్నానేమో! దానికి హీరోయిన్, చెప్పీ, చెప్పకుండా, గుట్టు విప్పీ, విప్పకుండా../అది నిజమే అయినా నాతో అనకు నమ్మలేనంతగా../ అని సమాధానం ఇస్తుంది. ‘ఆ విషయం నిజమని నాకు కూడా ఇంతవరకు నమ్మకం కలగడం లేద’న్న భావాన్ని ఆమె వ్యక్తపరుస్తుంది.
చరణం:
ఆమె: తగదు సుమా అంటూ ఉంటే తలపు దుమారం ఆగదే..
అతడు: తొలిదశలో అంతా ఇంతే కలవరపాటు తేలదే..
ఆమె: ఈ బిడియం గడియే తెరిచేదెపుడో నా మదిలో మాట తెలిపేందుకు
అతడు: నన్నిదిగో, ఇదదే అనుకోమనకు, ఆశలే రేపగా॥ ఊహలు ఊరేగే ॥
ఇప్పుడు హీరోయిన్ తన మనస్థితిని ఇలా వివరిస్తోంది. ఎంత ఆపినా, ప్రియుడికి సంబంధించిన తలపుల దుమారం మనసులో రేగుతూనే ఉంది. ఇలా ఆలోచించడం తగదు అని నా మనసుకు, నేను అప్పటికి చెబుతూనే ఉన్నాను, అది నా దారికి రానంటోందని’ అంటుంది. ప్రేమ తొలి దశలో ఉన్నప్పుడు, ప్రతి వారి పరిస్థితి ఇదే, ఆ కలవరం ఏమిటో, అది ఎందుకో, అంత సులభంగా తేలదు, అని హీరో సమాధానం ఇస్తాడు. అయితే, తన మనసు అనే తలుపుకు బిడియం గడియ పెట్టిందని, ఆ గడియ విడివడితే కానీ నా మనసులో మాటను బయటకు చెప్పలేనని, ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. దీనికి సమాధానమిస్తూ ఎంత directగా, ఇదిగో చూడు! ఇది అదే అనుకోమని చెప్పకు, అలా చెప్పి నాలో ఆశలు రేపకు! అంటూ సున్నితమైన warning ఇస్తాడు హీరో.
ఈ విధంగా ప్రేమ తొలిదశలో ఉన్న ప్రేయసి ప్రియుల మధ్య కలిగే భావాలు, వారికి వచ్చే ఆలోచనలు, శరీరంలో కలిగే తహతహలు, కరిగిపోని బిడియాలు, ఊరేగే ఊహలు.. కళ్లెం వేయలేని అసహాయత, తలపు దుమారాలు.. వీటన్నిటిని పోగు చేసి, మనోహరమైన పాటల ద్వారా మనకు అందించారు సిరివెన్నెల. ఆయన వ్రాసిన గొప్ప Romantic lyrics లో కొన్నింటిని ఈ విధంగా మీ ముందు ఉంచగలిగాను.
యవ్వనంలో ఉన్న అమ్మాయిలలో ఉండే సోయగాల భారాలు, పడుచు జంటలలో ఉండే తమకాల వెల్లువలు, ఆరాటాలు, పోరాటాలు, తపనల తుఫాన్లు, వయసు థిల్లానాలు, ఎదలోని మంటలు, తరగని ఆవిరులు, మెలికల్లో దొరకని అందాలు, కసి కసి ఉరుములు.. కవ్వింపులు, వారించలేని వయసు అల్లర్లు.. మ్రోగే మోహ వీణలు, సాగే రస తరంగాలు.. ఇలాంటి ‘జగడపు చనువుల జాజరలు’ ఎన్నో శృంగార కావ్యాల్లా, సిరివెన్నెల కలం నుండి జాలువారాయి. అందులోని సున్నితమైన, లలితమైన భావాలు, ఎంత పరోక్షంగా చెప్పవచ్చో, విలువలకు కట్టుబడిన ఒక కళాకారుడు ఎంత గుంభనంగా వాటిని చెప్పగలడో ఈ పాటలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇటువంటి సాహితీ పరమైన అభివ్యక్తులు రసానుభూతిని ఆస్వాదించే సాహితీ అభిమానులకు, ఎప్పటికీ తరగని చెలమలాగా రసాలను అందిస్తూనే ఉంటాయి.
Images Source: Internet
శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ గారు ఆంగ్ల అధ్యాపకురాలు, వ్యక్తిత్వ వికాస నిపుణురాలు, గీత రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు(తెలుగు-ఇంగ్లీష్-హిందీ), సామాజిక కార్యకర్త.