[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]
చూస్తున్నా చూస్తూనే ఉన్నా
~
చిత్రం: V
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: అమిత్ త్రివేది
గానం: శ్రేయా ఘోషల్, అమిత్ త్రివేది, అనురాగ్ కులకర్ణి
~
పాట సాహిత్యం
పల్లవి:
ఆమె:
చూస్తున్నా చూస్తూనే ఉన్నా కనురెప్పయినా పడనీక
వస్తానని చెబుతున్నా మనసుకు వినిపించదు తెలుసా..
చూస్తున్నా చూస్తూనే ఉన్నా, కనురెప్పయినా పడనీక
ఏం చేస్తున్నా నా ధ్యాసంతా నీ మీదే తెలుసా..
నిను చూడనిదే ఆగననే ఊహల ఉబలాటం ఉసి కొడుతుంటే..
అతడు:
వస్తున్నా వచ్చేస్తున్నా వద్దన్నా వదిలేస్తానా
కవ్విస్తూ కనపడకున్నా ఉవ్వెత్తున ఉరికొస్తున్నా
చరణం:
అతడు:
చెలియా చెలియా నీ తలపే తరిమిందే
అడుగే అలలయ్యే ఆరాటమే పెంచగా
ఘడియో క్షణమో ఈ దూరం కరగాలే
ప్రాణం బాణంలా విరహాన్ని వేటాడగా
ఆమె:
మురిపించే ముస్తాబై ఉన్నా
దరికొస్తే అందిస్తాగా ఆనందంగా
అతడు;
ఇప్పటి ఈ ఒప్పందాలు ఇబ్బందులు తప్పించాలే
చీకటితో చెప్పించాలే ఏకాంతం ఇప్పించాలే
అతడు:
వస్తున్న వచ్చేస్తున్నా వద్దన్నా వదిలేస్తానా
కవ్విస్తూ కనపడకున్నా ఉవ్వెత్తున ఉరికొస్తున్నా
ఆమె:
చూస్తున్నా చూస్తూనే ఉన్నా కనురెప్పయినా పడనీక
వస్తానని చెబుతున్నా మనసుకు వినిపించదు తెలుసా
♠
చీకటి బహుముఖ చిహ్నం. పగటి శ్రమతో అలసిన దేహాలకు, విశ్రాంతినీ, హాయినీ కూర్చి, సేద తీర్చేది రాత్రి చీకటి. అదేవిధంగా చీకటి కోణాల్లో జరిగే ఎన్నో పనులకు తెర తీసేది కూడా, ఈ నిశీధే. పట్టపగలే జరగాల్సిన పనులన్నీ జరుగుతుంటే, చేయాలనుకున్న మోసాలన్నీ చేయగలుగుతుంటే, చీకటి కోసం ఎవరు కాచుకుంటారు? అనుకుంటున్నారా! అది నిజమే లెండి! ఈ కాలంలో పగలు రాత్రి తేడా ఏముంది? నిద్రను కరిగించే వెచ్చటి రాత్రులు పచ్చటి జంటలకు ఆనందాన్ని కలిగిస్తే… నిద్రను మరిచిపోయి, సృజనను తట్టి లేపే కొంతమంది కవులకు అమృత ధారలను కురిపిస్తుంది ఈ రాత్రి. అమావాస్య నిశిలోనే ఆనందాల వెలుగులను మోసుకొస్తుంది దీపావళి రాత్రి. మొత్తం మీద భయానికి, మోసానికి, ద్రోహానికే కాకుండా ఆనందాలకు, ఆలోచనలకు, సృజనాత్మకతకు కూడా చీకటి రాత్రులు సోపానాలు పరుస్తాయనడంలో సందేహం లేదు. పగలు రాత్రి తేడా లేకుండా, కంటిమీద కునుకు లేకుండా జవాన్లు కావలి కాస్తుంటేనే కదా మనం నిర్భయంగా మనగలుగుతున్నాం. కుట్రలు చేసే కుటిల శక్తులు రాత్రిని ఆశ్రయిస్తే, కుట్రలు ఆపే అభయ శక్తులు కూడా, వారికి ధీటుగా నిద్ర మేల్కొని సమాధానం ఇవ్వవలసిందే కదా!
చీకటి గురించిన ఈ ఉపోద్ఘాతానికి కారణమేమిటంటే.. ఒక సాయం సంధ్య వేళ జరిగే రెండు సన్నివేశాలకు సంబంధించిన ఒక పాట గురించి ఈవారం చర్చించబోతున్నాం. ఒకే పాటను ప్రేయసి, ప్రియులు కానీ, స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఒక్కొక్క విభిన్నమైన versions లో పాడుకునే లాగా ఎన్నో చిత్రాల్లో సినీ కవులు గీత రచన చేయడం మనం చూసాం. ఉదాహరణకు, మంచి మిత్రులు చిత్రంలో, ఇద్దరు కథానాయకులు జీవితాన్ని తాము చూసిన కోణంలో, ఎదుటివారితో పంచుకోవాలనుకుంటూ పాడుకునే డాక్టర్ సినారె గారి పాటను గమనిద్దాం.
పల్లవి:
ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే
ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే
ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసి పోతుంటే
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇక చరణాలలో గమనిస్తే…
/మంచిని పెంచిన మనిషిని, ఏ వంచన ఏమీ చేయదని
నీతికి నిలబడు వానికి ఏనాటికి ఓటమి లేదని/
అనే భావజాలంతో ఒకరూ..
/నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని,
కత్తులు విసిరే వానిని ఆ కత్తితోనే గెలవాలని../
అన్న దృక్పథంతో మరొకరు ఈ పాటను పాడుకుంటారు.
~
‘జనమ్ జనమ్ కి ఫేరే’ చిత్రంలో భరత్ వ్యాస్ రచించగా లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ పాడిన ఈ పాటను ఒకసారి గమనించండి.
ज़रा सामने तो आओ छलिए
छुप-छुप छलने में क्या राज़ है
यूँ छुप ना सकेगा परमात्मा
मेरी आत्मा की ये आवाज है
ఈ చిత్రంలో నాయకుడేమో భగవంతుడిని అన్వేషిస్తూ.. ‘నా ఆత్మ చేస్తున్న ఈ ప్రార్థనను విను, పరమాత్మా! నీవు ఎంతో కాలం దాక్కుని తిరగలేవు, అలా దాక్కుని తిరగడంలో రహస్యం ఏంటి? నీవు నాకు ఎదురు పడవయ్యా!’ అంటూ ప్రార్థిస్తాడు.
ఇక నాయిక, ఆ నాయకుడ్ని అన్వేషిస్తూ.. ‘నన్ను తప్పించుకుని ఎందుకు తిరుగుతావు? నాకు ఎదురు పడవయ్యా మోసగాడా!’.. అంటూ.. అదే పదాలతో తన భావాన్ని వ్యక్తపరుస్తూ పాడుతుంది.
~
ఇప్పుడు మనం అక్షరం మార్పుతో శివస్తుతి, విష్ణు స్తుతిగా మారే చిత్రమైన పద్యాన్ని ఒకదాన్ని చూద్దాం. విష్ణు భక్తుడు, శివ ద్వేషి అయిన ఒక మహారాజుకు, తాను రోజు ప్రార్థనలో ఉపయోగించే విష్ణు స్తుతులకు తోడుగా ఏదైనా శ్లోకం కొత్తగా వ్రాయించుకోవాలని అనిపించిందట. ఆయన గుడిలో కనిపించిన ఒక సాధువును ఆ విషయమై అభ్యర్థించాడట. అప్పుడు ఆయన ఈ క్రింది శ్లోకాన్ని మహారాజుకు వ్రాసి ఇచ్చాడు.
‘గవీశపాత్రో నగజార్తిహారీ కుమారతాతః శశిఖండమౌళిః లంకేశ సంపూజిత పాదపద్మః పాయాదనాదిః పరమేశ్వరో నః’
ఆ శ్లోకాన్ని చదివిన మహారాజుకు పట్టరానంత ఆగ్రహం వచ్చింది, ఎందుకంటే అది శివ స్తుతి.
వృషభాన్ని ఎక్కి తిరిగేవాడు, పార్వతి దేవి మనోవేదన పోగొట్టి, ఆనందాన్ని కలిగించే వాడు, కుమారస్వామికి తండ్రి అయినటువంటివాడు, నెలవంకను శిరస్సుపై ధరించిన వాడు, లంకేశ్వరుడైన రావణాసురుని చేత పూజలు అందుకునే పాదపద్మాలు కలవాడు, ఆది లేని పరమేశ్వరుడు మనల్ని రక్షించుగాక! అని దాని అర్థం.
అప్పుడు ఆ రాజు, ఆ సాధువును విష్ణు స్తుతి వ్రాయమంటే, శివ స్తుతి వ్రాశావేమిటని ప్రశ్నించాడట. దానికి ఆ సాధువు నవ్వి.. శ్లోకాన్ని సరిగ్గా అర్థం చేసుకో నాయనా, అంటూ.. దాని అర్థాన్ని ఇలా వివరించాడట.
ప్రతిపదంలోనూ మొదటి అక్షరాన్ని (అనాది) తొలగించి చదివితే.. వీశపాత్ర అంటే గరుత్మంతుడు, గజార్తిహారీ అంటే మకరితో పోరాడుతున్న గజేంద్రుని దుఃఖాన్ని పోగొట్టినవాడు.. ఇలా అర్థం వస్తూ, మొత్తం మీద – గరుత్మంతుడి పైనెక్కి తిరిగేవాడు, గజేంద్రునికి దుఃఖాన్ని తొలగించి, మోక్షం ప్రసాదించినవాడు, మన్మథుడికి తండ్రి, నెమలి పింఛాన్ని శిరస్సుపై ధరించిన వాడు, బ్రహ్మ ఈశ్వరుల చేత పూజింపబడే పాదాపద్మాలు కలిగిన వాడు, రమాదేవికి భర్తయైన శ్రీహరి మనల్ని రక్షించుగాక అన్న అర్థం వస్తుందని చెబుతూ, శివ – కేశవ అభేదాన్ని చెప్పి, అతని కళ్ళు తెరిపించాడట.
ఈ విధంగా, అదే పదాలతో రెండు విభిన్నమైన భావాలను సమకూర్చడం చాలా కఠినమైన సాహితీ ప్రక్రియ. ఇది మనకు సంస్కృత సాహిత్యంతో పాటు, తెలుగు సాహిత్యంలో కూడా కనిపిస్తుంది. ఎన్నో సినిమాలలో రెండు వేరువేరు versions లో, సంతోషంగానూ, దుఃఖంతోను – (happy note, pathetic toneలలో ) పాటలు వుండడం మనకు కొత్తేమీ కాదు.
కానీ మనకు ‘వీ’ సినిమాలో ‘చూస్తున్నా చూస్తూనే ఉన్నా’ పాటలోని సాహిత్యం మనకు రెండు సన్నివేశాలకు అన్వయం చేయగలిగేలా ఒక వినూత్న సాహితీ ప్రయోగం జరిగింది. ఆ పాటలోని గొప్పదనం, కొత్తదనం మనకు అర్థం కావాలంటే ఆ కథా నేపథ్యాన్ని ఒకసారి గమనించాలి.
కథా నేపథ్యం:
డీసీపీ ఆదిత్య (సుధీర్ బాబు) నిజాయితీ గల, ధైర్యవంతుడైన ఒక పోలీస్ అధికారి. గ్యాలంటరీ మెడల్ సహా ఎన్నో అవార్డులు అందుకున్నవాడు. ఈ చిత్రంలో నాని (సీరియల్ కిల్లర్ విష్ణు) ప్రతినాయక పాత్రలో కనిపిస్తాడు. అత్యంత కిరాతకంగా హత్యలు చేస్తూ, దమ్ముంటే తనను ఆపమని ఆదిత్యకు సవాలు విసురుతాడు. అతని డిపార్ట్మెంట్లోని ఓ పోలీస్ ఇంట్లోనే హత్య చేస్తాడు. ఆ తరువాత ఒక్కొక్కరిని రకరకాలుగా చంపుతూ తరువాతి హత్య ఏంటనే క్లూ ఇస్తుంటాడు. ఈ క్లూ తెలుసుకోగలిగితే నేరస్థుడిని పట్టుకోవచ్చని డీసీపీ తన ప్రేయసి అపూర్వ (నివేదా థామస్) సాయం కోరతాడు. కానీ చివరికి అతనికే మెరుపులాంటి ఆలోచన వచ్చి, అతనే ఆ చిక్కుముడిని విప్పుతాడు. వెంటనే నేరస్థుడిని (నానిని) పట్టుకునేందుకు పరుగెత్తుతాడు. కానీ ఆ anti- hero, అంతకు మించిన ఎత్తులు పై ఎత్తులతో, చిక్కినట్లే చిక్కి తప్పించుకుని మళ్లీ హత్యలు చేస్తుంటాడు.
భారీ ఘర్షణలకు, హత్యలకు కారణమైన నలుగురు వ్యక్తులను మట్టుపెట్టడానికి అతడు ప్రయత్నిస్తున్నాడు విషయం, సినిమా చివరిలో మనకు తెలుస్తుంది. చివరగా నాని తను అనుకున్న ముగ్గురు వ్యక్తులను దారుణంగా హత్య చేసి, నాలుగవ వ్యక్తిని హతమార్చడానికి సిద్ధమవుతూ, సన్నాహాలు చేసుకుంటుంటాడు.
అదే సమయంలో అపూర్వ కూడా ఆదిత్యను కలవడానికి రెడీ అవుతూ ఉంటుంది.
ఈ రెండు సన్నివేశాలకూ అన్వయించుకునేలాగా, సిరివెన్నెల గారు ఒక గమ్మత్తైన పాట రచించారు. నాకు తెలిసినంతలో ఇటువంటి పాట తెలుగు సినిమా చరిత్రలో ఇంతవరకు లేదు. ఇటువంటి క్లిష్టమైన సాహితీ ప్రయోగాలు చేయడం సిరివెన్నెల గారికి ఎంతో ఇష్టం. ప్రేయసిని కలవడానికి.. బయలుదేరిన ఆదిత్య, తన టార్గెట్ చేజ్ చేయడానికి బొంబాయికి బయలుదేరిన. విష్ణు..
వస్తున్నా.. వచ్చేస్తున్నా.. అంటున్నారు.. ఇలా…
పల్లవి:
ఆమె:
చూస్తున్నా చూస్తూనే ఉన్నా కనురెప్పయినా పడనీక
వస్తానని చెబుతున్నా మనసుకు వినిపించదు తెలుసా..
చూస్తున్నా చూస్తూనే ఉన్నా, కనురెప్పయినా పడనీక
ఏం చేస్తున్నా నా ధ్యాసంతా నీ మీదే తెలుసా..
నిను చూడనిదే ఆగననే ఊహల ఉబలాటం ఉసి కొడుతుంటే..
అతడు:
వస్తున్న వచ్చేస్తున్నా వద్దన్నా వదిలేస్తానా
కవ్విస్తూ కనపడకున్నా ఉవ్వెత్తున ఉరికొస్తున్నా
Goal chasing ఎప్పుడూ excitementలతో నిండి ఉంటుంది. అది కాబోయే life partner అయినా, మన వెంబడిస్తున్న target అయినా! ఆ ఎక్సైట్మెంట్ ఈ పాటలో మెండుగా ఉంటుంది.
ఈ పాట సరిగ్గా, క్షుణ్ణంగా అర్థం కావాలంటే, visual imagery, music effects రెండూ కూడా బాగా ఫాలో అవ్వాలి. ఇప్పుడు పాటని రెండు వర్షన్స్ లోనూ అర్థం చేసుకుందాం.
Version 1:
/చూస్తున్నా చూస్తూనే ఉన్నా కనురెప్పయినా పడనీక
వస్తానని చెబుతున్నా మనసుకు వినిపించదు తెలుసా/
హీరోను ఆరాధనగా, అనునిత్యం తాను చూస్తూనే ఉన్నాననీ, తన దరికి వస్తానని సర్ది చెప్పినా కూడా, మనసు ఆగడం లేదని.. తన ధ్యాసంతా అతని మీదే ఉందనీ, ఎప్పుడెప్పుడు కలుసుకుంటానా అని, మనసు తహతహలాడుతోందనీ, ఆ ఊహల ఉబలాటం తనను నిలబడనివ్వడం లేదని.. ప్రియుడ్ని కలిసేదాకా.. ఊపిరి ఆడనివ్వడం లేదని.. హీరోయిన్ నేపథ్యంలో మనకు వినిపిస్తుంది.
దానికి బదులుగా హీరో కూడా..
/వస్తున్నా వచ్చేస్తున్నా వద్దన్నా వదిలేస్తానా
కవ్విస్తూ కనపడకున్నా ఉవ్వెత్తున ఉరికొస్తున్నా../
అని సమాధానం ఇస్తాడు. అంటే ఆమె అంత ఆరాటపడుతున్నప్పుడు, తను వద్దన్నా ఆమె దగ్గరికి తాను వస్తానని, తనకు ఎదురుపడకుండా కవ్విస్తున్న సరే.. ఉరికి ఉరికి, తన దరికి చేరుకుంటానని హీరో సమాధానం ఇస్తున్నాడు. ఇది ఈ పాటలో పూర్తిగా తొలిసారిగా కలుసుకుంటున్న హీరో హీరోయిన్ల మధ్య ఉన్న సున్నితమైన ఆరాటం..అనే romantic versionను చిత్రీకరిస్తుంది.
Version 2:
ఇక విష్ణు(నాని) కోణంలో చూస్తే.. తన చివరి టార్గెట్ అయిన నాల్గవ వ్యక్తిని హత్య చేయడానికి, అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు. అతని కోసం థాయిలాండ్‌కు బయలుదేరుతుంటాడు. ప్రతీకార భావంతో రగిలిపోతున్న అతని మనసుకు కూడా ఈ పల్లవి అద్దం పడుతుంది. కనురెప్ప కూడా వేయకుండా తన టార్గెట్ యొక్క కదలికల్ని గమనిస్తూనే ఉన్నానని, ఏ పని చేస్తున్నా తన ధ్యాసంతా హత్య చేయవలసిన వ్యక్తి మీదే కేంద్రీకృతమై ఉందనీ, తను అనుకున్న పనిని(goal) పూర్తి చేసేంతవరకు, తన ఊహల ఉబలాటం, ఊపిరి తీసుకొని ఇవ్వడం లేదనీ.. అందుకే తాను బయలుదేరి..
/వస్తున్నా వచ్చేస్తున్నా వద్దన్నా వదిలేస్తానా
కవ్విస్తూ కనపడకున్నా, ఉవ్వెత్తున ఉరికొస్తున్నా../
అనే విష్ణు భావాలను కూడా ఈ వాక్యాలు పలికిస్తాయి. అయితే ఈ రెండు లైన్లు మాత్రం కర్కశమైన గొంతుతో, తను చేయబోయే పనిలో ఉన్న కసిని ప్రతిబింబించేలా పాడడం జరిగింది. ఈ రెండో కోణం ప్రతి నాయకుడిలో దాగి ఉన్న Killer instinctని, కసిని, క్రోధాన్ని పలికిస్తుంది.
చరణం:
అతడు:
చెలియా చెలియా నీ తలపే తరిమిందే
అడుగే అలలయ్యే ఆరాటమే పెంచగా
ఘడియో క్షణమో ఈ దూరం కరగాలే
ప్రాణం బాణంలా విరహాన్ని వేటాడగా
ఆమె:
మురిపించే ముస్తాబై ఉన్నా
దరికొస్తే అందిస్తాగా ఆనందంగా
అతడు:
ఇప్పటి ఈ ఒప్పందాలు ఇబ్బందులు తప్పించాలే
చీకటితో చెప్పించాలే ఏకాంతం ఇప్పించాలే
అతడు:
వస్తున్న వచ్చేస్తున్నా వద్దన్నా వదిలేస్తానా
కవ్విస్తూ కనపడకున్నా ఉవ్వెత్తున ఉరికొస్తున్నా
Version 1:
హీరోయిన్ ముస్తాబై హీరోను కలుసుకోవడానికి ఇంటి నుండి బయలుదేరుతుంది. హీరో కూడా ఇంటి బయలుదేరి, చెలియ తలపులే తనను వెంటపడి తరుముతున్నాయనీ, ఊరికే ప్రవాహం లాగా అడుగులు అలలై ఎగసిపడుతున్నాయనీ, ఒక ఘడియ లోనో, మరో క్షణంలోనో.. వారి మధ్య ఉన్న దూరం కరిగిపోవాలనీ, తన ప్రాణమే బాణమై.. వారి మధ్య ఉన్న విరహాన్ని వేటాడి దూరం చేయాలనీ కోరుకుంటాడు.
దానికి సమాధానంగా, అతని కోసమే ముస్తాబై, అలరించడానికి సిద్ధంగా ఉన్నాననీ, ప్రియుడు తన దరి చేరితే, తన అందాలను.. ఆనందాలను.. అందించగలనంటుంది, ప్రియురాలు.
/ఇప్పటి ఈ ఒప్పందాలు ఇబ్బందులు తప్పించాలే.. చీకటితో చెప్పించాలే.. ఏకాంతం ఇప్పించాలే../
సిరివెన్నెల గారు ఇక్కడ ఎంత సున్నితమైన శృంగార భావనను వ్యక్తపరిచారో చూడండి! వాళ్ళిద్దరూ.. ఒకరినొకరు కలుసుకున్న తరువాత.. వారి మధ్య బెరుకుతనం పోయి.. శృంగార భరితమైన ఒప్పందాలేవో కుదురుతాయట! వారిద్దరి మధ్య ఏకాంతాన్ని కల్పించమని.. చీకటికి రెకమెండ్ చేయాలట! ఏకాంతం కావాలని చీకటిని అభ్యర్థించడం.. ఎంత ఊహకందని.. యోచన! ఇలాంటివి సిరివెన్నెల గారికే సాధ్యమేమో అనిపిస్తుందని ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమంలో డైరెక్టర్ ఇంద్రగంటి కృష్ణ కుమార్ అన్నారు. నిజం అదే కదా మరి!
Version 2:
ఇక మరోసారి విష్ణు కోణం నుండి ఆలోచిస్తే.. తన ఆశయమే అతన్ని తన శత్రువు వైపు తరుముతోంది, అతన్ని చేరుకోవాలని ఆరాటాన్ని పెంచుతోంది. గమ్యం వైపు అడుగులు ప్రవాహంలా పరుగులు పెడుతున్నాయి. క్షణాలలో అక్కడికి చేరుకోవాలని మనసు తహతహలాడుతోంది. తన ప్రాణమే బాణమై.. అతన్ని వేటాడేయాలనిపిస్తోంది. అందంగా ముస్తాబైన ప్రియురాలిలా అతని టార్గెట్ అతన్ని ఊరిస్తోంది.
తను చేయాలనుకున్న హత్యకు చీకటితో ఒప్పందం కుదుర్చుకొని, తన సమస్యను పరిష్కరించుకొని, ఇబ్బందులను తప్పించుకోవాలని అనిపిస్తోందన్న భావం మనకు అంతర్లీనంగా (in between the lines) కనిపిస్తుంది.
పాట మళ్లీ పల్లవితో అనుసంధానించబడి,
/వస్తున్నా వచ్చేస్తున్నా వద్దన్నా వదిలేస్తానా..
కవ్విస్తూ కనపడకున్నా ఉవ్వెత్తున ఉరికొస్తున్నా../
అని ముగుస్తుంది.
ఈ విధంగా ఒకవైపు romantic కోణాన్ని, మరోవైపు villainous angle నీ, ఒకే రకమైన పదాలతో, భావాలతో, పలికించగలడం ఎంతో కష్టసాధ్యమైన ప్రయోగం. పాటలు వ్రాయాలనుకునే వారికి, తమకున్న నైపుణ్యాలను మెరుగు పెట్టుకోవాలనుకునే గీత రచయితలందరికీ ఇది ఒక మంచి reference guide లాగా పనిచేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి వినూత్న ప్రయోగాలు సాహితీ లోకంలో ఎప్పటికీ చిరస్థాయిగా మన్నన పొందుతూ, సిరివెన్నెల గారికి కీర్తిని శాశ్వతంగా నిలుపుతాయి.
Images Source: Internet
శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ గారు ఆంగ్ల అధ్యాపకురాలు, వ్యక్తిత్వ వికాస నిపుణురాలు, గీత రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు(తెలుగు-ఇంగ్లీష్-హిందీ), సామాజిక కార్యకర్త.