Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సిరివెన్నెల పాట – నా మాట – 95 – లోతైన తర్కంతో కూడిన పాట

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

తను వెతికిన తగు జత నువ్వేనని

~

చిత్రం: శైలజా రెడ్డి అల్లుడు
సాహిత్యం : సిరివెన్నెల
సంగీతం: గోపీ సుందర్
గానం: సత్య యామిని

~

పాట సాహిత్యం

పల్లవి:
తను వెతికిన తగు జత నువ్వేనని
కను తెరవని మనసుకు తెలుసా అని
బదులడిగిన పిలుపది నీదేనని
తెరమరుగున గల మది విందా అని
వెలుగేదో కనిపించేలా నిన్నే గుర్తించేలా
చుట్టూ కమ్మే రేయో మాయో మొత్తం కరగాలి
ఒట్టు అంటూ నమ్మించే నీ స్నేహం కావాలి
తను వెతికిన ॥

చరణం:
ఉరికే అల్లరి ఉడికే ఆవిరి ఎవరూ నా సరి లేరను వైఖరి పొగరనుకో తగదనుకో సహజ గుణాలివి వలదనుకో వరమనుకో వరకట్నాలివి ఒడుపుగ వరస కలిపి మహాశయా మగువనేలుకో నిను తలవక గడవదు కదా కాలము
నిను కలవక నిలవదు కదా ప్రాణము

చరణం:
కన్నె కళ్యాణికి కళ్ళెము వేయవా, అతి గారానికి అణకువ నేర్పవా
కసురుకొనే కనుబొమ్మలో కలహము ఓడనీ బిడియపడే ఓటమిలో గెలుపును చూడనీ
చెలియక చెలిమి కలిపి తలపు తడిమి తడిని తెలుసుకో అదుపెరుగని దివి గంగని నేనట అతిశయమున ఎగసిన మది నాదట
ఒడుపెరిగిన శివుడవు నీవేనట జడముడులతో నిలుపద నను నీ జత
పనిమాలా బ్రతిమాలాలా ప్రేమ పలకవదేలా నువ్వే నువ్వే నువ్వే నువ్వే కావాలంటున్నా
పట్టు విడుపు లేనే లేని పంతం ఇంకానా
తను వెతికిన ॥

‘ప్రేమ’ రెండక్షరాలు చిన్న మాటే కానీ, సృష్టి అంతటా నిండి ఉన్న అమృతమయమైన బంధాలకు అది చిరునామా. ప్రేమను నిర్వచించడం, ప్రేమ లక్షణాలను క్రోడీకరించడం ఎవరికీ సాధ్యమయ్యే పని కాదు. అది అనిర్వచనీయమైనది. అయినా, గొప్ప గొప్ప ప్రేమకావ్యాల సాహితీ సృష్టి, యుగయుగాలుగా సాహితీ ప్రియులను అలరిస్తూనే ఉంది. ప్రేమ ఇతివృత్తంగా వచ్చిన కావ్యాలు, కథలు, పాటలు.. ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా రూపుదిద్దుకుంటూనే ఉన్నాయి. ఏ తరానికి సంబంధించిన తత్వానికి అనుగుణంగా ఆయా కాలాల్లో పాటలు రచించబడి, ఆదరణ పొందాయి.

సినీ సాహిత్యంలో ప్రేమ అంశంగా వచ్చినన్ని పాటలు ఇంకా ఏ అంశం మీద కూడా ఉండకపోవచ్చు. ఎంతోమంది గొప్ప గొప్ప దిగ్గజ కవులు, ప్రేమకు ఎంతో లోతైన నిర్వచనాలు ఇచ్చి, రసజ్ఞులను భావలోకాల్లో విహరింపచేశారు.

ఈ చిత్రంలో కథానాయిక, అహంకారానికి icon వంటి శైలజా రెడ్డి కూతురు. తను చాలా అహంకారిగా ఉండి, తన దృక్పథం వల్ల, తనకు ఆత్మీయంగా దగ్గరైన కథానాయకుడిని దూరం చేసుకుంటుంది. అటువంటి సందర్భంలో ఆమె మనసులో పశ్చాత్తాపం మొదలవుతుంది. ఆ సందర్భంగా ఆమె మనఃస్థితికి అద్దం పడుతూ సిరివెన్నెల గారు రచించిన గీతమిది.

పల్లవి:
తను వెతికిన తగు జత నువ్వేనని
కను తెరవని మనసుకు తెలుసా అని
బదులడిగిన పిలుపది నీదేనని
తెరమరుగున గల మది విందా అని
వెలుగేదో కనిపించేలా నిన్నే గుర్తించేలా
చుట్టూ కమ్మే రేయో మాయో మొత్తం కరగాలి
ఒట్టు అంటూ నమ్మించే నీ స్నేహం కావాలి
తను వెతికిన ॥

చాలామంది సరియైన ప్రేమను, సరియైన సమయంలో గుర్తించలేక చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. మనసులో రకరకాల, ఉద్దేశాలు, అపోహల చీకట్లు కమ్ముకున్నప్పుడు, ఎదుటివారి ప్రేమను గుర్తించడం సాధ్యం కాదు. ఆ ప్రేమను గుర్తించడం అంత సులభ సాధ్యమూ కాదు. పింగళి గారు అన్నట్టు అది కలో, నిజమో గుర్తించలేని అయోమయమే!

/నీవేనా నను తలచినది, నీవేనా నను పిలచినది..
నీవేనా నా మదిలో నిలచి, హృదయం కలవరపరచినది, నీవేనా!!!..
..
కలలోనే ఒక మెలకువగా , ఆ మెలుకువలోనే ఒక కలగా
కలయో నిజమో వైష్ణవమాయయో, తెలిసీ తెలియని అయోమయంలో../

ఈ పాట ఎత్తుగడలో అలాంటి భావాన్నే వ్యక్తపరుస్తూ,

/తను వెతికిన తగు జత నువ్వేనని

కను తెరవని మనసుకు తెలుసా అని/ నువ్వు ఎటువంటి జత కోసం వెతుకుతున్నావో.. నీకు సరియైన ఆ జోడీ తానే అన్న విషయం, కళ్ళు తెరవని (కళ్ళు మూసుకుపోయిన) మనసుకు తెలుసా? అని, నిద్రపోతున్న తన హృదయాన్ని తట్టి లేపి ప్రశ్నిస్తున్నాడు కథానాయకుడు. ఆ ప్రశ్న అడిగి, సమాధానం కోసం తను వేచి చూస్తున్నాడన్న విషయం తెరచాటున ఉన్న ఆమె మనసుకు అర్థమైందా? అని సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ‘కను తెరవని మనసు’, ‘తెర మరుగున గల మది’, అన్న పదబంధాల ద్వారా, కథానాయిక మనసు ఇంకా ప్రేమను గుర్తించలేని చీకట్లో, అయోమయంలో ఉందని సిరివెన్నెల స్పష్టంగా తెలియజేస్తున్నారు.

ఇప్పుడు సమస్య ఏంటి? ఆమె అతని ప్రేమను అర్థం చేసుకోలేక మనసుకు ముసుగు వేసుకొని కూర్చున్నది! దానికి సమాధానంగా, ఇప్పుడు ఆయన ఎంత చక్కటి logical sequencing ఇస్తున్నారో చూడండి! మరి, అతని స్నేహాన్ని ఆమె గుర్తించాలంటే.. ఆ చీకట్లు కరిగిపోయే వెలిగేదో రావాలి! దాన్ని సిరివెన్నెల ఈ క్రింది పంక్తుల్లో వ్యక్తికరిస్తున్నారు.

/వెలుగేదో కనిపించేలా, నిన్నే గుర్తించేలా

చుట్టూ కమ్మే రేయో మాయో మొత్తం కరగాలి

ఒట్టు అంటూ నమ్మించే నీ స్నేహం కావాలి/.. నిన్ను గుర్తించే ఆ వెలుగు ఏదో వచ్చి తన చుట్టూ కమ్ముకున్న చీకటో, అహంకారమనే మాయో.. ఏదైనా సరే, కరిగిపోయి.. తన స్నేహం నిజమైనదని నమ్మించే ఒక భరోసా కావాలి! అప్పుడే ఆమె, అతడి ప్రేమను నమ్మకంతో స్వీకరించగలదని సిరివెన్నెల చక్కటి ఉపమానంతో విశదీకరిస్తున్నారు. జీవితంలో ఏ విషయంలోనైనా సరే మాయో, అబద్ధమో తొలగిపోవాలంటే, ‘నిజం’ అనే వెలుగు కావాలి. ఆ వెలుగులోనే అన్నీ స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి, నిజాన్ని గ్రహించాలి.

చరణం:
ఉరికే అల్లరి ఉడికే ఆవిరి ఎవరూ నా సరి లేరను వైఖరి పొగరనుకో తగదనుకో సహజ గుణాలివి వలదనుకో వరమనుకో వరకట్నాలివి ఒడుపుగ వరస కలిపి మహాశయా మగువనేలుకో నిను తలవక గడవదు కదా కాలము

నిను కలవక నిలవదు కదా ప్రాణము.
తను వెతికిన ॥

మనిషి వినాశనానికి దారి తీసే లక్షణాలలో అదుపు లేని అహంకారం ఒకటి. ‘నా అంతటి వాళ్లు ఎవరూ లేరు, అని విరుచుకు పడే రెండు ఉపమానాలుగా ‘ఉరికి అల్లరిని, ఉడికే ఆవిరిని’ తీసుకున్నారు సిరివెన్నెల. ఆ రెండు కూడా నన్ను మించిన వారు ఎవరూ లేరని పొగరుతో, పైకి ఎగస్తూనే వుంటాయిగా మరి! తన Ego అనే free verseలో రమా బాలసుబ్రమణ్యన్ ఇలా వివరిస్తున్నారు.

Ego, a three letter word,
rules a man’s world,
and make him wish,
he ruled the world!
..
With it in his head
man feels, he is the best,
definitely better than the rest.
About himself he always praises..

హీరో స్నేహాన్నీ, ప్రేమనీ బలంగా కాంక్షిస్తున్న కథానాయిక ఇలా అంటుంది. ‘నాలో ఉన్న ఈ లక్షణాన్ని నీవు పొగరనుకో, అంత దురహంకారం పనికిరాదనుకో, లేదా.. అవి నా సహజ గుణాలనుకుని, ‘అలాంటి గుణాలు ఉండకూడదు’, అని భావించుకో.. నువ్వు ఏ విధంగా నిర్ణయించుకున్నా పర్వాలేదు. నేర్పుగా నాతో వరస కలుపు, నాలో ఉన్న ఈ లక్షణాలు వరమనుకో, లేదా నీకు నేనిచ్చే వరకట్నమనుకో.. నన్ను ఇల్లాలిగా చేసుకో.. మహాశయా!’ అంటూ నాయకుడికి విన్నవించుకుంటోంది. తనలో ఉన్న ఈ బలహీనతను మన్నించి తనను స్వంతం చేసుకోమని అడుగుతూ, తన మనసులో నిగూఢంగా దాగి ఉన్న ప్రేమను ఈ విధంగా బయటపెడుతోంది. /నిను తలవక గడవదు కదా కాలము, నిను కలవక నిలవదు కదా ప్రాణము/ అతన్ని తలవకుండా కాలం గడవదు కాబట్టి, కలవకపోతే ప్రాణమే నిలవదు కాబట్టి, ఆమె ప్రేమను అతడు తప్పక స్వీకరించాలి, అన్న భావాన్ని ఆమె తరఫున వకాల్తా తీసుకొని, సిరివెన్నెల గారు బలంగా తన వాదన వినిపిస్తున్నారు.

చరణం:
కన్నె కళ్యాణికి కళ్ళెము వేయవా, అతి గారానికి అణకువ నేర్పవా
కసురుకొనే కనుబొమ్మలో కలహము ఓడనీ బిడియపడే ఓటమిలో గెలుపును చూడనీ
చెలియక చెలిమి కలిపి తలపు తడిమి తడిని తెలుసుకో అదుపెరుగని దివి గంగని నేనట అతిశయమున ఎగసిన మది నాదట
ఒడుపెరిగిన శివుడవు నీవేనట జడముడులతో నిలుపద నను నీ జత
పనిమాలా బ్రతిమాలాలా ప్రేమ పలకవదేలా నువ్వే నువ్వే నువ్వే నువ్వే కావాలంటున్నా
పట్టు విడుపు లేనే లేని పంతం ఇంకానా
తను వెతికిన ॥

In fact, true love includes accepting someone’s weaknesses are a common and valid perspective. It emphasizes the importance of understanding and accepting flaws, rather than focusing on perfection, which can strengthen relationships.

ఈ నిర్వచనం ప్రకారం మనలో ఉన్న ప్రేమ ఎదుటివారి లోపాలను కూడా, అంగీకరించేలాగా చేస్తుంది. అసలు లోపాలను లోపాలుగా భావించదు. కానీ చిత్రంలో, కథానాయికలో ఉన్న అహంకారం అనే బలహీనత వల్ల, ఆమె అతనికి దూరమవ్వాల్సి వస్తుంది. ఇక్కడ సిరివెన్నెల గారు, హీరోయిన్ విన్నపాన్ని మరింత పొడిగించి, నాలోని లోపాలను సరిదిద్ది, ‘నన్ను మనస్ఫూర్తిగా నీ దానిగా చేసుకో’మని అడిగిస్తున్నారు. దాన్ని ఎలా సాధించాలో కూడా దారులు వివరిస్తున్నారు.

/కన్నె కళ్యాణికి కళ్ళెము వేయవా? అతి గారానికి అణకువ నేర్పవా?/ ఆమె ఇలా అంటుంది.. పంచ కళ్యాణి అంటే విశిష్టమైన, అతివేగంగా పరుగులు పెట్టగల అశ్వజాతి, అని మనందరికీ తెలుసు. అయితే సిరివెన్నెల గారు పొగరుతో చిందులు తొక్కుతున్న కథానాయికను ‘కన్నె కళ్యాణి’, అని వర్ణిస్తూ, నా పొగరుకు నువ్వు కళ్లెం వేయవచ్చు కదా? నాకు అణుకువ నేర్పవచ్చు కదా? ఒక గురువు లాగా నీవు నన్ను కసురుకుంటే, నాలో తిరగబడే గుణం కరిగిపోతుంది.. నేను అప్పుడు ఓడిపోతూ.. ఓడిపోతూ.. గెలుపును చవిచూస్తాను అంటుంది. అంతేకాకుండా, నాలో ఉన్న ఒక కోణాన్ని మాత్రమే చూస్తున్న నువ్వు నాతో చెలిమి కలిపి, నా తలపులలో ఉన్న ఆర్ద్రతను, స్నేహమాధుర్యాన్ని కూడా గుర్తించాలని అడుగుతూ.. /చెలియక చెలిమి కలిపి తలపు తడిమి తడిని తెలుసుకో/.. అంటుంది.

మొదటి చరణంలో ఉరికే అల్లరి, ఉడికే ఆవిరితో పోల్చిన ఆమె పొగరుకు, రెండవ చరణంలో పురాణ సంబంధమైన గొప్ప ఉపమానాన్ని జోడిస్తున్నారు సిరివెన్నెల.

/అదుపెరుగని దివి గంగని నేనట అతిశయమున ఎగసిన మది నాదట..

ఒడుపెరిగిన శివుడవు నీవేనట జడముడులతో నిలుపద నను నీ జత /.. నేను కన్నె కళ్యాణిని, నన్ను అదుపు చేయి.. అన్న స్థితి నుండి.. ‘అదుపే తెలియని దివి గంగవంటి దాన్ని నేను, అతిశయంతో నా మనసు ఎగిరి పడుతోంది.. శివుడి లాగా నేర్పుగా నీ జటాజూటంలో నన్ను బంధించి, నాకు కాస్త అదుపును నేర్పి, నన్ను నీ జతగా మార్చుకో’’, అని తన మనసులోని భావాలను తెలియజేస్తుంది.

/పనిమాలా బ్రతిమాలాలా ప్రేమ పలకవదేలా
నువ్వే నువ్వే నువ్వే నువ్వే కావాలంటున్నా
పట్టు విడుపు లేనే లేని పంతం ఇంకానా..

ఆమె విన్నపాలు.. బ్రతిమాలు కోవడానికి పూర్తయిపోయాక.. ఆమె చివరగా.. తను అలకను ప్రదర్శిస్తుంది. నాకేం పని లేక ఇంతగా బ్రతిమాలుతున్నానని అనుకుంటున్నావా? ఇంత అడిగినా పలకవేంటి? (ఇక్కడ సిరివెన్నెలగారు సరదాగా.. పలకవదేలా? అనే పాత తెలుగును ఉపయోగించారు.) నా తప్పును నేను తెలుసుకుని, కావాలని ఎన్నిసార్లు అడుగుతున్నా, కాస్త పట్టు, విడుపు లేకుండా, అంతానికి వెళ్తావేంటి? అని వాదనలోకి దిగుతుంది.

ఈ విధంగా, పల్లవి నుండి అంచెలంచెలుగా కథానాయిక మనోభావాన్ని విడమర్చి చెప్పి, ముందుగా తన తప్పును గుర్తించడం, realize అవ్వడం, తనలోని లోపాన్ని సరిదిద్దమని పలు ఉపమానాలతో హీరోను convince చేయడం, ఎన్నో విధాలుగా బ్రతిమాలడం, చివరగా అతని నుండి తగిన స్పందన రాకపోవడంతో.. తన చిరాకును, అలకను ప్రదర్శించడంతో.. పాటకు ముక్తాయింపు పలుకుతున్నారు.

ఈ పాట గమనిస్తే, సాహిత్యంలోని well-knit scheme లో మనకు అర్థం అవుతుంది. సిరివెన్నెల గారి sequencing గమనిస్తే, అందులో ఉన్న లోతైన తర్కం మనల్ని ఆశ్చర్య చకితులను చేస్తుంది. ఇలాంటి పాటలు మనలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తూ, మనకి ప్రతిరోజూ సందర్భాలలో ఉపయోగపడతాయి. రోజువారి సంఘటనలో మనకు ఇవి మార్గదర్శకత్వం ఇస్తాయి. మానవ జీవితంలో సర్వసామాన్యంగా జరిగే విషయాలు, ఇతివృత్తాలు, సిరివెన్నెల గారి పాటలలో ఆయా సందర్భాలకు తగినట్టుగా చోటు చేసుకుని, మనకు అన్ని విధాల మార్గదర్శనం చేస్తాయి. ఆయన సాహితీపటిమకు జోహార్లు!!

Images Source: Internet

Exit mobile version