Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సిరివెన్నెల పాట – నా మాట – 94 – పరిపూర్ణ యోగ తత్వాన్ని ఆవిష్కరించిన పాట

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

శివ పూజకు చివురించిన సిరిసిరిమువ్వ

~

చిత్రం: స్వర్ణకమలం
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎస్పీ బాలసుబ్రమణ్యం, సుశీల

~

పాట సాహిత్యం
పల్లవి:
అతడు:
శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా
మృదు మంజుల పదమంజరి పూచిన పువ్వా
యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా నటనాంజలితో బ్రతుకును తరించనీవా ॥సిరి॥
ఆమె:
పరుగాపక పయనించవె తలపులనావా
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధుసీమలు వరించి రావా ॥పరు॥

చరణం: అతడు:
పడమర పడగలపై మెరిసే తారలకై
రాత్రిని వరించకే సంధ్యాసుందరీ
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ
నిదురించిన హృదయరవళి ఓంకారం కానీ ॥శివ॥
ఆమె:
తన వేళ్లే సంకెళ్లె కదలలేని మొక్కలా
ఆమనికై ఎదురు చూస్తూ ఆగిపోకు ఎక్కడా
అవధి లేని అందముంది అవనికి నలుదిక్కులా
ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా
ప్రతిరోజొక నవగీతిక స్వాగతించగా
వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా ॥పరు॥
అతడు:
చలిత చరణ జనితం నీ సహజ విలాసం
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం, తిలకించిన రవి నయనం,
గగన సరసి హృదయంలో..
వికసిత శతదళ శోభిత సువర్ణ కమలం ॥పరు॥

‘విధాత తలపున ప్రభవించినది, అనాది జీవన వేదం ఓం/ ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవ నాదం ఓం’ అనే పాటతో తన సినీ ప్రస్థానానికి శ్రీకారం చుట్టిన సీతారామశాస్త్రి గారు ‘సిరివెన్నెల’, ‘స్వర్ణకమలం’, ‘స్వాతికిరణం’, వంటి కావ్య స్థాయిగల చిత్రాలకు అపూర్వమైన రీతిలో, అద్భుతమైన గీతాలను అందించారు.

‘స్వర్ణకమలం’ చిత్రకథే ఒక కావ్యమని, అందులో పాటలు వ్రాయడం తన భాగ్యమనీ, ఆ పాటలు తనకి ఎంతో ఇష్టమని, సిరివెన్నెల పలుమార్లు వ్యాఖ్యానించారు. తన సినీ ప్రస్థానంలో తనకు క్లిష్టంగా అనిపించిన పాట ఏదని అడిగినప్పుడు, ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. “నాకు సంబంధించి నేను ‘స్వర్ణకమలం’ సినిమాలో వ్రాసిన పాటలు చాల క్లిష్టమైనవి. కనుక చాలా ఇష్టమైనవి. అందులో ‘శివపూజకు చివురించిన’ పాట గురించి చెబుతాను. కవిగా తన సత్తా చూపించాలి అని అనుకునే ఎవరికైనా, సరైన ఛాలెంజ్ ఎదురైతే ఎంతో ఆనందం కలుగుతుంది. తన సర్వశక్తుల్నీ ధారపోసే అవకాశం దొరికిన సంతోషం అది. అసలు ‘స్వర్ణకమలం’ సినిమా కథలోనే గొప్పతనం ఉంది. ఆ సినిమా కథకి పాటలు వ్రాయడం అనేక విధాల కత్తిమీద సాములాంటిది. అయితే ఎప్పుడో అరుదుగా ఎదురయ్యే అసాధారణ స్థితి లాంటిది ‘స్వర్ణకమలం’ కథ. అలాంటి అసాధారణమైన అవకాశం నాకు దక్కడం నా అదృష్టం. విశ్వనాథ్‌గారికి నాపట్ల ఉన్న ఆదరణ.”

కథా నేపథ్యం:

‘శివ పూజకు చివురించిన సిరిసిరిమువ్వా’, పాటకు నాకు తెలిసి కొన్ని వందల వ్యాఖ్యానాలు వచ్చి ఉండవచ్చు. స్వయంగా సిరివెన్నెల గారే ఆ పాటకు వ్యాఖ్యానం అందించారు. అయితే ఆ పాటను అర్థం చేసుకోవడానికి, ఆ కథా నేపథ్యాన్ని ముందుగా మనం గ్రహించాలి. భగవద్దత్తంగా తనకు లభించిన నాట్య కళ మీద ఏమాత్రం మక్కువ లేని మీనాక్షి, ఈ చిత్ర కథానాయిక. తన కాలానికి గొప్పగా జీవించడానికి పనికిరాని నాట్య విద్య కన్నా, ఆధునిక జీవన విధానాన్ని పాటిస్తూ మంచి ఉద్యోగంలో చేరి, ఆర్థికంగా మెరుగైన జీవనాన్ని సాగించాలని ఊహ లోకంలో ఆమె విహరిస్తూ, బంగారు కలలు కంటూ ఉంటుంది. కానీ ఆమె కళను గుర్తించిన చంద్రం ఎలాగైనా ఆమె నాట్యాన్ని ప్రోత్సహించాలని, నృత్య కళకు ఆమెను అంకితం చేయాలని ఆరాటపడుతుంటాడు. అయితే, నాట్యకళ పట్ల ఆమెకున్న విముఖత వల్ల ఆమె నాట్యంలో ప్రాణం, రసానుభూతి, తన్మయత్వం ఉండదు. ఎలాగైనా ఆమెకు నచ్చజెప్పి, ఆమెను నాట్యానికి మరింత దగ్గర చేయాలన్న పట్టుదలతో ఉన్న చంద్రానికి, స్వేచ్ఛా జీవనానికై పరుగులు తీసే మీనాక్షికి మధ్య జరిగే సంవాదాన్ని ఈ పాట రూపంలో ఆయన మనకు అందించడం జరిగింది. ఈ పాట వ్రాయడంలో తాను ఎంతో క్లిష్టతను చవి చూశాననీ, అయినా కవిగా తనకు ఆ పాట ఎంతో తృప్తినిచ్చిందనీ, ఆ పాట అంటే తనకు ఎంతో ఇష్టమని సిరివెన్నెల తెలియజేశారు.

‘స్వర్ణకమలం’ పాటలు వ్రాయడంలో సిరివెన్నెల గారికి ఎదురైన సవాళ్ళు:

ఆ చిత్రంలో..
/ ఆకాశంలో ఆశల హరివిల్లు/
/ఘల్లు ఘల్లు ఘల్లు మంటూ మెరుపల్లే తుళ్ళు//
/శివ పూజకు చిగురించిన సిరిసిరిమువ్వా//..
ఈ మూడు పాటల్లో ఒకే విషయాన్ని చెప్పాల్సిన రావడం, అన్ని పాటల్లో కూడా మీనాక్షికి జీవితం పట్ల ఉన్న ఆశలను, ఆశయాలను, దృక్పథాన్ని, సంప్రదాయ కళలకు ప్రోత్సాహం ఇవ్వాలన్న చంద్రం దృక్పథాన్ని, వాటి మధ్య జరిగే సంఘర్షణను చెప్పాల్సి రావడం, ఒక బలమైన సవాలుగా అనిపించిందని, సిరివెన్నెల చెప్పారు.

‘శివ పూజకు చివురించిన సిరిసిరిమువ్వా’ పాటలో.. కళాకారుడైన చంద్రం పక్షాన పాటను వినిపించినప్పుడు కవితాత్మకమైన పదబంధాలు, మీనాక్షి పక్షాన వాదన వినిపించినప్పుడు కావ్య భాషని వాడకుండా, సాధారణ పదాలతో లోతైన భావాన్ని వ్యక్తికరించడానికి, ఇద్దరి వాదనలు ఎవరి కోణంలో వారివి సరైనవేనని సమర్థించేలా, ఒప్పించేలా, మెప్పించేలా వ్రాయడంలో సిరివెన్నెలగారు ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యానని కూడా చెప్పారు. భావపరంగా కవిత్వపరంగా, వీరిద్దరి వాదనల మధ్య సమతుల్యాన్ని సాధించడానికి, తన సర్వశక్తుల్నీ, ఆలోచనా తీవ్రతని వినియోగించి తిరుగులేని విధంగా ఆరోపణ చేసి, దాంట్లో లోతైన కవిత్వాన్ని పొదిగి తనను తానే గెలిపించుకోవాల్సి వచ్చిందని, ఆయన తన మనోభావాలను వెలిబుచ్చారు. అంత తీవ్ర తపస్సు తరువాత ఆయన అనుకున్న విధంగా, అద్భుతమైన భావసామరస్యాన్ని, చరిత్రలో నిలిచిపోయే ఒక అసామాన్య గీతాన్ని, వెలికి తీసుకువచ్చి ప్రభంజనాన్ని సృష్టించారు.

ఆయన వ్రాసిన చాలా పాటల్లో తాత్వికత నిండి ఉంటుందన్న విషయం మనందరికీ తెలియనిది కాదు. తండ్రి, యోగిగారి వారసత్వంగా అందుకున్న వేదవాఙ్మయాన్ని, ఉపనిషత్ జ్ఞానాన్ని, పురాణాల ప్రమాణాన్ని, సద్గురు శివానందమూర్తిగారి ప్రియ శిష్యులుగా ఆయన స్వంతం చేసుకున్న ఆధ్యాత్మిక నిధిని, భక్తి తత్పరతను, ఆణిముత్యాల్లాంటి పాటల ద్వారా మనకు అందజేశారు.

అయితే సినిమా పాటకు కథాంశంతో సంబంధం లేకుండా, ఆ పాటను వినకుండా, చూడకుండా, పాడకుండా, అందులోని సాహిత్యాన్ని విడిగా తీసి చదివితే కూడా అది ఒక రసభరితమైన కవితలాగా, మానసిక ఆనందాన్ని కలిగించాలనీ, సాహిత్యానికి స్వయం ప్రతిపత్తి, సమగ్రత ఉండాలని సిరివెన్నెల గారికి ఎంతో పట్టుదల. అదే విషయాన్ని ఆయన చాలా ఇంటర్వ్యూలలో తెలియజేశారు. సినిమా కథకు, పాత్రకు పరిమితం కాకుండా, జీవితానికి, మానసిక వికాసానికి, మన దృక్పథాన్ని మార్చుకోవడానికి అన్వయించుకునేలాగా నిలిచిపోయే సజీవ భావ చిత్రాల్ని, ఆయన ఎన్నో పాటల ద్వారా మనకు అందించారు.

ఈ ‘స్వయం ప్రతిపత్తి’ అనే అంశమే నన్ను ఈ పాటను మరో కొత్త కోణంలో పరిశీలించడానికి, ఈ పాటకు నా మనసుకు తట్టిన సమన్వయం చెప్పడానికి ప్రేరణ కలిగించింది. ఈ పాటను నాయికా, నాయకుల దృక్పథాల మధ్య జరిగే సంఘర్షణలా కాకుండా, మనస్సు – ఆత్మల మధ్య జరిగే నిత్య సంఘర్షణకు అన్వయిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది. వెంటనే నా ఆలోచనను నా స్నేహితురాలు డా. శ్రీవాణి అర్జున్, M.A. Music, Ph.D., తో పంచుకున్నప్పుడు, తాను ఎంతో ఆనందించి నన్ను ప్రోత్సహించడమే కాకుండా, నాకు తగిన inputs, references అందించింది. అందుకు నేను ఆమెకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

స్వయం ప్రతిపత్తి కావాలంటే poetry Open-endedగా వుండాలి. Open-endedness is a deliberate choice by the poet to invite interpretation and engagement with the poem beyond the literal lines, where the reader can ponder over and provide interpretation of his or her choice. సిరివెన్నెల గారి పాటలు, Open-endedగా వుంటూ, ఎంత విస్తృతమైన ఆలోచనకు, దృష్టి కోణాలకు అవకాశాన్ని ఇస్తాయో చెప్పనవసరం లేదు. అందుకే నేను చేసిన ఈ ప్రయత్నాన్ని, సాహసించి మీ ముందుకు తీసుకు వస్తున్నాను.

ప్రకృతిలోని సకల చరాచర జీవరాశులకు సృష్టిచే నిర్దేశించబడిన అర్థం, పరమార్థం ఉంటాయి. బుద్ధి జీవులు కాబట్టి జీవిత లక్ష్యం, జీవిత పరమార్థం తెలుసుకోవాల్సిన అవసరం మనిషికి మాత్రమే ఉంది. మోక్షాన్ని పొందడానికి మానవ జన్మ ఆధారం కాబట్టి, జన్మ వృథా చేసుకోకుండా ప్రయత్నము చేస్తూ ఉంటే, ఎప్పటికైనా భగవంతుని సాన్నిధ్యము పొందవచ్చు కాబట్టి, పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారం, జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మానవ జన్మ, ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది, అని అన్నారు. 84 లక్షల జీవరాశులలో పుట్టి గిట్టిన తరువాత లభించే అపురూపమైన జన్మ ఈ మానవ జన్మ. కనుకనే ఈ మానవ జన్మను, ‘జంతూనాం నర జన్మ దుర్లభం’ అని ఆచార్య శంకరులు ‘వివేక చూడామణి’ గ్రంథంలో తెలియజేసారు.

మిగిలిన అన్ని ప్రాణులకు స్వయం నిర్ణయాధికారం లేదు. అవి ఏ జాతికి చెందినవో ఆ జాతి లక్షణాలు మరణించే వరకు కలిగి ఉంటాయి. మనిషి జీవిత లక్ష్యానికి పరిమితి లేదు. అది ఆకాశమంత విశాలం. అయినా జీవిత లక్ష్యం, అంతిమ లక్ష్యం జీవన్ముక్త స్థితి అని జ్ఞానులు విశ్వసిస్తారు. పరమాత్మ నుండి శరీరమనే ఉపాధిని తీసుకుని, ఈ భూమి మీదికి వచ్చిన మానవుడు, తన సస్వరూప జ్ఞానం కలిగి, తను నిజమైన విలాసమేదో తెలుసుకొని, తాను తిరిగి ఆ పరమాత్మలో ఐక్యం కావడమే మోక్షమని, ముక్తి అని అంటారు. ఈ నేపథ్యంతో, ఇప్పుడు ఈ పాటను, ఈ దృష్టి కోణంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.

పల్లవి: ఆత్మ బోధ-
శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా
మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా
యతిరాజుకు జతిస్వరముల పరిమళమివ్వా?
నటనాంజలితో బ్రతుకును తరించనీవా?

ఆత్మ మనసుకు ఇలా బోధిస్తోంది: మానవ జీవితం తీసుకున్న తరువాత సాధించవలసిన అత్యున్నతమైన లక్ష్యం, మోక్షం. కాబట్టి ప్రతి వ్యక్తీ కూడా శివ పూజ కోసం, అంటే పరమాత్మను చేరుకోవడం కోసం చిగురించిన సిరిమువ్వలాంటి వాళ్ళు. వ్యక్తి చేసే సర్వ క్రియలు ఆ పరాత్పరుని ఆరాధనలే. పరమాత్మ కోసం పరుగులు పెట్టే మృదు మంజుల పాదాలు – స్వామి పూజ కోసం పూయించిన పువ్వుల వంటివి ఆ మువ్వలు. భగవదనుగ్రహాన్ని పొందే అభివ్యక్తులతో, మనసును, చిత్తాన్ని భగవంతునిపైనే నిలిపి, నిరంతరం ఆయన ధ్యానంలోనే గడపాలి. భక్తి అనేది బాహ్యంగా కనిపించే కర్మాచరణలు అవసరం లేని ఒక అంతర్లీన స్థితి అని. మనస్సు నిశ్చలమై, సమర్పణతో, విశ్వాసంతో నిండినప్పుడు, అదే నిజమైన ఆరాధన. ఆ పువ్వుల మువ్వలతో యతిరాజుకు, జతి స్వరాలే పరిమళాలుగా సమర్పిస్తూ, మనసు ఆనంద తాండవం చేస్తుండగా, తన్మయత్వంతో, అద్వైత స్థితిని పొంది, బ్రతుకును తరింపచేసుకో!

మనసు సమాధానం:
పరుగాపక పయనించవె తలపులనావా
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధుసీమలు వరించి రావా ॥పరు॥

మనసు ఇలా సమాధానమిస్తూ, తన వాదనను వినిపిస్తోంది: జీవితాన్ని సార్థకం చేసుకోవడం అంటే ఏమిటి? పరమాత్మలో ఐక్యమవ్వడం మాత్రమే జీవితానికి పరమార్థమా? సాధారణంగా మానవులకు జీవిత లక్ష్యాలు ఏమిటి? కావలసినంత ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి తమకు నచ్చిన పనులు చేయాలి. పంచేంద్రియాలకు సుఖం కలిగించే అన్ని సౌఖ్యాలను చేకూర్చుకోవాలి. తమ ప్రవృత్తికి తగిన వృత్తులు చేపట్టి బాగా సంపాదించి తన కుటుంబంతో సహా అనేక భోగాలు అనుభవించాలి. భోగాలు, సౌఖ్యాల వైపు మనసు నిరంతరంగా పరిగెడుతూనే ఉంటుంది. తాము కోరుకున్నవి సాధించినప్పుడు మాత్రమే అంతులేని ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆ తలపుల నావ ఎటువంటి కెరటాలకు తలవంచకుండా, తను కోరుకున్న తీరం వైపు, అంటే లక్ష్యం వైపు సాగిపోతూనే ఉండాలి. ఏదైనా బలమైన సుడిగాలి ఎదురై దారి మళ్ళించాలని ప్రయత్నించినా, ఏదో జ్ఞానము, ఎఱుక వంటి బలమైన ఉపదేశాలు ఇచ్చినా, వాటన్నిటినీ పెడచెవిన పెట్టి, కఠినమైన సాధనలతో మనసును కట్టడి చేయకుండా, మనసు కోరుకున్న, మధు సీమలవైపు పయనాన్ని కొనసాగించి, అంతులేని ఆనందాన్ని స్వంతం చేసుకోవాలి. పంచ భౌతికమైన ఈ శరీరం, పనిచేంద్రియాలను సంతృప్తి పరచడంలో, అత్యున్నతమైన ఆనందాన్ని పొందాలి.

ఈ వాదనకు ధీటుగా ఆత్మ ప్రతివాదం:
పడమర పడగలపై మెరిసే తారలకై
రాత్రిని వరించకే సంధ్యాసుందరీ
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ
నిదురించిన హృదయరవళి ఓంకారం కానీ ॥శివ॥

మాయ అనే చీకట్లో, ఎక్కడో మిణుకు మిణుకుమని మెరుస్తూ, తమస్సులోకి తీసుకునిపోయే అశాశ్వతమైన ఆ ఆనందాలను వరించడం సరి కాదు. ఆ సంధ్యా సుందరి మాయలో, మత్తులో, మైకంలో అసలైన సత్యాన్ని గుర్తించడం మరిచిపోవద్దు. ఎన్ని సుఖాలు, భోగాలు అనుభవించినా, ఈ మనస్సుకు ఎదో ఒక వెలితి వుంటుంది. దీనికి కారణం మనం అనుభవించేవి ఏవి కూడా నిత్యమైన, పరిపూర్ణమైన సుఖాలు కాదు. ఎందుకంటే ఇవన్నీ అనిత్యమైన వస్తువుల ద్వారా వచ్చే సుఖాలు. నిత్యమైన, పరిపూర్ణమైన, శాశ్వతమైన సుఖం కావాలంటే నిత్య వస్తువు, పరిపూర్ణ వస్తువు, శాశ్వత వస్తువు ద్వారానే లభిస్తుంది. నిత్యమైన ఆ ఆనందాన్ని పొందాలంటే, జ్ఞానమనే ఉషోదయపు కాంతిలోకి వచ్చి, ఈ భూమిని మురిపించేలాగా, నువ్వు కూడా కాంతులు వెదజల్లు. ఆదిశంకరుల వంటి ఎందరో జ్ఞానులు తాము గ్రహించిన సత్యంతో, ఈ జగతిని ఎలా ప్రకాశింప చేస్తున్నారో, ఆ స్థితిని నువ్వు కూడా అందుకుని తరించు.

ఆ నిత్యమైన వస్తువు ఒక్క ‘పరమాత్మ’ మాత్రమే. ‘నిత్య వస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం’ అని తత్వబోధలో శంకరాచార్యులవారు స్పష్టం చేసారు. అంటే నిత్య వస్తువు ఏకమైన పరమాత్మ మాత్రమే. దానికి వేరుగా ఉన్న సర్వమూ, అనిత్యమైనవే అని అర్థం. అలాంటి స్థితిని చేరుకోకుండా మనిషిని అడ్డుకుంటున్నది అజ్ఞానమే! అచేతనమైన స్థితిలో ఉండిపోతే, చేతనత్వం మరుగున పడిపోతుంది.

మనిషి తల్లి గర్భంలో నుండి బయటికి వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు చైతన్యాన్ని బ్రహ్మ రంధ్రం ద్వారా ఆ శరీరంలో ప్రవేశింప చేస్తాడు. ఆ కుండలిని శక్తి ప్రాకుతూ వెళ్లి, మూడున్నర చుట్టల పాము రూపంలో, తోకను నోటిలో ఇముడ్చుకొని మూలాధారంలో అచేతనంగా పడి ఉంటుందని, సౌందర్యలహరిలో ఆదిశంకరాచార్యులు తెలియజేశారు. కుండలినిలోని పరిణామ క్రమంలో; మొదటి చుట్ట ఖనిజస్థితిని, రెండవ చుట్ట వృక్ష స్థితిని, మూడవ చుట్ట జంతు స్థితిని, ఇక మిగిలిన ఆ అర్థచుట్ట మానవ స్థితికి ప్రాతినిధ్యం వహిస్తాయట. అయితే మానవ పరిణామక్రమం పరిపూర్ణత సాధించలేదు కాబట్టి అది సగం చుట్టగానే ఉంటుందట. అందుకే ప్రణవ నాదంతో, యోగ సాధనతో స్పందనలు కలిగిస్తే, ఆ చైతన్యం వికసితమవుతుందట. సిరివెన్నెల గారు, /నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ నిదురించిన హృదయరవళి ఓంకారం కానీ/ అనే వాక్యం ద్వారా, అచేతనంగా ఉన్న ఆ చైతన్యాన్ని ఉత్తేజితం చేయడానికి ఓంకారంతో శ్రీకారాన్ని చుట్టమని ఉపదేశిస్తున్నారు.

మళ్లీ పాత పాటే పాడుతూ, తన వాదనను బలంగా వినిపిస్తున్న మనసు:
తన వేళ్లే సంకెళ్లె కదలలేని మొక్కలా
ఆమనికై ఎదురు చూస్తూ ఆగిపోకు ఎక్కడా
అవధి లేని అందముంది అవనికి నలుదిక్కులా
ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా
ప్రతిరోజొక నవగీతిక స్వాగతించగా
వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా ॥పరు॥

నేను, నన్ను, నాది, నాకు, నీవు, నిన్ను, నీది, నీకు- అనే ఈ అష్టమాయల, నిన్ను ఆనంద స్వర్గాలు చేరుకోకుండా చేసి, తన వేళ్ళే సంకెళ్లుగా మారి కదల్లేని మొక్కలాగా జీవితాన్ని బంధీ చేసుకోకు. నువ్వు సృష్టించుకున్న మమతలు, నువ్వు పెంచుకున్న మమకారాలు, నువ్వు అల్లుకున్న బంధాలే ఆశయ సాధనకు నీకు ప్రతిబంధకాలవుతాయి. ఒక్కసారి ఆ సంకెళ్లు తెంచుకుంటే, ప్రపంచమంతా.. అన్ని దిక్కులలో.. అవధిలేని ఆనందం వేచి చూస్తోంది. నీ ఆశలన్నీ చిగురించే ఆమని నీకోసం వచ్చేవరకు వేచి చూస్తూ, కాలాన్నీ, ప్రాయాన్నీ వృధా చేసుకోకు. ఆమని ఎక్కడ ఉందో వెతుక్కుంటూ, నీ పయనం అటువైపుగా సాగించు. జీవితం అనే నీ పడవను ‘ఆనందం’, అనే గాలివాలు సహాయంతో, ఆనందం కోసం, పరుగులు తీయించు. అలా బలమైన సంకల్పంతో నువ్వు పొందాలనుకున్న సుఖాల తీరాలకు నీవు చేరుకున్నప్పుడు, ప్రతిరోజు నీకు ఒక కొత్త గీతం వినిపిస్తుంది. ఉషోదయం రాకున్నా ఫర్వాలేదు, మసక వెన్నెల్లో, కిన్నెరగానం నిన్ను అలరిస్తుండగా.. నీవు అందుకోవాలనుకున్న ఆ ఆనందాలను చేరుకొని.. తనివి తీరా ఆస్వాదించు.

కానీ, ఈ చపల చిత్తాల నుంచి దూరం కావాలంటే ఆత్మలో వినిపిస్తున్న నాదాన్ని, షట్చక్రాల గుండా ప్రయాణం చేయిస్తూ, నాదోపాసన చేస్తే పరమాత్మలో లీనం అయ్యే యోగం సిద్ధింప చేసుకోవచ్చు అంటున్నాడు వేమన.

నాదబిందు కళల నయమొంది యాత్మ‌యం
దంటిన చపల చిత్తమమర విప్పి
బ్రహ్మ రంధ్రమునను ప్రబలిన యోగిరా
విశ్వదాభిరామ వినురవేమ.

తాత్కాలిక ప్రపంచపు ఆకర్షణలలో చిక్కుకుని, వాటిని శాశ్వతమని భావిస్తూ మనసు కలవరపడుతుంది. మనిషి నిజ జీవితంలో ఈ తాత్కాలికమైన భావాలనే శాశ్వతమైనవి అనుకొని ఆశలలో చిక్కుకుంటాడు. అంత మనో వ్యథ, కలవరము లేకుండా ఎవ్వరూ మాయలోంచి బయట పడలేరు. కోరికలను దాటి, ఓ మహత్తర ప్రయోజనం దిశగా నడవాలంటే, తన నిజమైన స్థితిని తెలుసుకొని, మేలుకోవలసిందే.

ఆత్మబోధ: జీవిత పరమార్ధాన్ని తెలియజేసే ఘట్టం-
చలిత చరణ జనితం నీ సహజ విలాసం
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం, తిలకించిన రవి నయనం,
గగన సరసి హృదయంలో..
వికసిత శతదళ శోభిత సువర్ణ కమలం ॥పరు॥

/చలిత చరణ జనితం/ ఈ సృష్టి మొత్తం నిరంతరంగా చలిస్తూనే ఉంటుంది. ఆ చలిత చరణాల నుండి జనించిందే మాయా మోహితమైన ఈ మానవ జన్మ. అదే నీ సహజ విలాసం.‌ నీ విలాసాన్ని నీవు చేరడమంటే, ఎఱుకతోటి నీలోకి నీవు చేరుకోవడమే! నేను ఎవరు? నేను ఎక్కడ ఉన్నాను? నా లక్ష్యం ఏమిటి? అని తెలుసుకుంటేనే కదా, వికాసం కలిగేది. అందుకే ముందుగా విలాసాన్ని తెలుసుకుంటే వికాసం దిశగా ఎదగడం సుసాధ్యం అవుతుంది.

/జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం/ అంతరంగంలో ఉన్న జ్ఞానాన్ని బయటపడనీకుండా చేసేది అజ్ఞానము, భోగము, లేదా మాయ. అందువలన మనం అజ్ఞానంతో, అవివేకంతో మరియు అవిద్యతో ఏర్పరచుకున్న ఈ కర్మ బంధనాల నుండి విముక్తి పొందడానికి వున్న ఏకైక మార్గం ఈ మానవ జన్మే.

ఈ మానవ జన్మలో మనిషికి దేవుడు బుద్ధి అనే ఒక ఆయుధాన్ని ప్రసాదించాడు. దీని ద్వారా శాశ్వతమైన, నిత్యమైన, సత్యమైన, సత్తు గల దానిని, అంటే నాశనం లేనిది ఏది అని గ్రహించి, అదే విధంగా, జ్ఞానాన్ని పొంది, “నేను ఎవరు? ఎందుకు పుట్టాను? ఎవరికోసం రావలసి వచ్చింది? నా లక్ష్యం ఏమిటి? నా ధ్యేయం ఏమిటి?” అనే విషయాలు తెలుసుకొని, మనస్సును మరియు బుద్దిని అదుపులో వుంచుకొని, పరమాత్మ తత్వాన్ని, నిత్య సత్యమైన దానిని, సంపూర్ణముగా తెలుసుకొని, తద్వారా, ఆత్మానాత్మ వివేకాన్ని గ్రహించడమే, జ్ఞానం అని అంటారు. యోగ సాధన ద్వారా మాత్రమే చైతన్యం కలిగి, ఆ జ్వలిస్తున్న జ్ఞాన కిరణాలు, సౌందర్య వికాసానికి దారితీస్తాయి. ఇక్కడ సౌందర్యం అంటే, ఆత్మజ్ఞానం.. అదే శాశ్వతమైన, నిత్య నూతనమైన సౌందర్యం, అదే సత్యం, అదే శివం, అదే సచ్చిదానందం!

ఆ దిశగా నీ అభినయాన్ని, అంటే నీ అభివ్యక్తిని, నీ హృదయ ఆకాశంలో ఉన్న జ్ఞానాగ్ని అనే సూర్యుని నయనం తిలకించినప్పుడు, నీలోని తపనకు సమాధానం దొరుకుతుంది.

ఆత్మలోని నాద మాలించి యాలించి
యాశలందు చిక్కడాది యోగి
యాత్మలోని కళల నంటిన తత్వంబు
విశ్వదాభిరామ వినురవేమ..

అని వేమన చెప్పినట్టు, నిత్యమైన పరమాత్మతో ఐక్యత వలన లభించే సుఖం ఆనందం అందుకునేవరకు, మానవుడికి తృప్తి కలగదు. అసంతృప్తి తీరదు. అందుకే పరమపదమే గమ్యంగా గమనానికి శ్రీకారం చుట్టాలి.

జన్మసార్థకత పొందే మార్పుకు ఈ ఘట్టం ఆరంభాన్ని వ్యక్తం చేస్తుంది. అది ఒక ఆత్మ పరమ సత్యాన్ని సేవించేందుకు సిద్ధమవుతున్న ఘడియ అది. బాహ్యమైన కర్మాచరణలతో కాకుండా సమర్పణతో నిండిన తపస్సుతో ఆత్మయాత్రలో తుది ఘట్టాన్ని చేరుకోవడమే! అట్టి శాశ్వతానందాన్ని అందుకోవడమే జన్మను సార్ధకం చేసుకోవడమంటే. ఆ శాశ్వతానందాన్నే మోక్షం, ముక్తి అంటారు!

/గగన సరసి హృదయంలో.. వికసిత శతదళ శోభిత సువర్ణ కమలం/ఆ తురీయాతీత స్థితిలో, గగనసరసి అంటే హృదయాకాశంలో.. ప్రతి మనిషి తనంతట తాను ఒక విశ్వమే! విశ్వానికి ప్రతిబింబమే! కాబట్టి ఆ హృదయ ఆకాశంలోని, హృదయంలో అంటే కేంద్ర బిందువులో ముకుళితంగా ఉన్న శతదళ శోభితమైన సువర్ణ కమలం (మంచి తెల్లటి వర్ణము) శోభాయమానంగా రెక్కలు విచ్చుకుంటుంది. ఆ జ్ఞాన పరిమళాలు, మూలాధారం నుండి షట్చక్రాల గుండా ప్రయాణిస్తూ, కుండలిని శక్తిని జాగృతపరచి, సహస్రారకమలం వికసితమౌతుంది. జీవి ఆత్మ స్వరూపమై, పరమాత్మలో లీనమై, జీవన్ముక్త స్థితిని చేరుకుంటుంది.

‘శివ పూజకు చిగురించిన సిరిసిరిమువ్వా’ అని మొదలుపెట్టి, నిదురించిన హృదయ రవళిని: అచేతనత్వాన్ని, ఓంకారంతో మేల్కొల్పమని చెబుతూ, ఆత్మశక్తి ప్రచోదనమై.. చలిత చరణం: వికసిత శతదళ శోభిత సువర్ణ కమలం: లాంటి అభివ్యక్తులతో సంపూర్ణ చైతన్య స్థితికి చేరుకున్న/చేరుకునే మార్గాన్ని సూచిస్తూ, పరిపూర్ణమైన యోగ తత్వాన్ని ఈ పాట ద్వారా అద్భుతంగా సిరివెన్నెల ఆవిష్కరించారు. ఎవరి దృష్టి కోణంలో వారు సాహిత్యాన్ని అవగాహన చేసుకుని, వారికి తగినట్టు విశ్లేషించుకోవాలని కోరుకునే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, ఏ దివ్య లోకాల్లో ఉన్నా, నా ఈ ప్రయత్నాన్ని ఆస్వాదిస్తారనీ.. ఆశీర్వదిస్తారనీ మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ..

Exit mobile version