[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]


భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరు..
~
చిత్రం: మనీ
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: శ్రీ
గానం: శ్రీనివాసమూర్తి, శ్రీ
~


పాట సాహిత్యం
పల్లవి:
భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు
భర్తగా మారకు బ్యాచిలరు
షాదీ మాటే వొద్దు గురు
సోలో బ్రతుకే సో బెటరు
ఆలికి మెళ్ళో ముళ్ళేసానని
ఆనందించే మగవారు
ఆ తాడే తమ ఉరితాడన్నది
ఆలోచించక చెడతారు
మొగుడయ్యే ముహూర్తమే మగాడి
సుఖాల ముగింపు చాప్టరు
॥భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు॥
చరణం:
వంటకని వైఫెందుకురా హోటళ్ళే చాలు
వొంటికని ఒకటా రెండా అంగడి అందాలు
కోతికి ఉందా కోడికి ఉందా ఈ పెళ్ళాచారం
జంటలు కట్టే జంతువులెరుగవు వెడ్డింగ్ విడ్డూరం
ఎందుకు మనకీ గ్రహచారం.. అందుకనీ..
॥భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు॥
చరణం:
చచ్చీ చెడి డే అండ్ నైటు చాకిరి చేస్తావు
తెచ్చినది డార్లింగ్ దెయ్యం చేతిలో పోస్తావు
బీడీ కోసం బీబీ ముందు దేహీ అంటావు
గాడిని దాటని గానుగ ఎద్దై బతికేం చేస్తావు
బాండేడ్ బానిసవౌతావు,
॥భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు॥
చరణం:
పులిలాగే పెళ్ళికి కూడా లెటర్సు రెండేరా
ఫర్వాలేదని పక్కకు వెళితే ఫలారమైపోరా
ఇడీ అమీను సదామ్ హుసేను హిట్లర్ ఎక్సెట్రా
ఇంట్లో ఉన్న పెళ్ళాంకన్నా డిక్టేటర్లట్రా
అంతటి డిక్టేటర్లట్రా బాబోయ్..
భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు
భర్తగా మారకు బ్యాచిలరు
షాదీ మాటే వొద్దు గురూ
సోలో బ్రతుకే సో బెటరు
భద్రం డింగ్ డాంగ్ డింగ్ బ్రదరు
లబ్సిగ్ లబ్సిగ్ లగ్ బ్రదరు
షాదీ మాటే ఐబాబోయ్
లస్కో లస్కో సో బెటరు
♠
నవ్వు, ఏడుపు పుట్టుకతోనే సహజంగా మనకు అలవాటయిన ప్రక్రియలు. ఏడుపు ఎంత సహజమో నవ్వూ అంతే. నవరసాల్లో ఒకటైన నవ్వు, ఒక ఉత్తమ ఔషధం. నవ్వును హాసము అంటారు కాబట్టి, ఆ నవ్వు పుట్టించేది హాస్యము. నవ్వు పుట్టించే విషయాలు ఏవి? అసహజము, విపరీతము అయినది ఏదైనాసరే మనము చూస్తే నవ్వు వస్తుంది. వేషము విపరీతంగా ఉంటే నవ్వు పుడుతుంది; చేష్టలు విపరీతంగా ఉంటే హాస్యం జనిస్తుంది; మాటలు వంకరగా ఉంటే తప్పక నవ్వుతాము. అందుకే హాస్యం – వ్యంగ్యం, అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. హాస్యాన్ని పుట్టించే వ్యంగ్యం కూడా దివ్యౌషధమే. “Sarcasm is the lowest form of wit but the highest form of intelligence,” అంటారు Oscar Wilde.
హాస్యము నాటకంలో, నాట్యంలో, సంగీతంలో, చిత్రలేఖనంలో, సాహిత్యంలో.. ఎన్నో కళలలో మిళితమైపోయిన ఒక ప్రధాన రసం. సాహిత్యం విషయానికి వస్తే, ప్రాచీన పద్య సాహిత్యం నుండి, ఆధునిక సాహిత్యం వరకు కూడా మనకు ఈ వ్యంగ్య, హాస్య మిశ్రమాలు కనిపిస్తాయి. ఉదాహరణకు, “పట్టుమని మా ఆయన చిట్టెడు నూనె తెస్తే ఏమి సరిపోతుందమ్మా! నట్టింట్లో దీపం: ముందు కొట్లో దీపం: వదినె నెత్తికి, మంగలి కత్తికి, మా బావ జుత్తుకు!” అన్నదట ఒకావిడ. ఇందులో చమత్కారం మాటల కూర్పులో ఉంది.
హాస్యాన్ని పుట్టించే కుందవరపు కవి చౌడప్ప కందపద్యాన్ని ఒక దాన్ని చూడండి.
ఆడిన మాటలు తప్పిన – గాడిద కొడుకంచు తిట్టగా విని, మదిలో
వీడా కొడుకన ఏడ్చును – గాడిదయును కుందవరపు కవి చౌడప్పా!
~
హాస్యాన్ని పండించే, వ్యంగ్య రసాన్ని నింపుకున్న, వేమన పద్యం:
గుహలలోన జొచ్చి గురువుల నెదుకంగ
గ్రూర మృగ మొకండు తారసిలిన
ముక్తి మార్గమదియె ముందుగా జూపురా
విశ్వదాభిరామ విరనువేమ!..
ఈ వేమన పద్యం ఒకవైపు సత్య దర్శనం చేయిస్తూ, మరోవైపు హాస్యాన్ని కూడా ఎలా పుట్టిస్తుందో చూడండి.
~
మనుషుల గురించి శ్రీశ్రీ నిర్వచనం:
ఇస్పేటు జాకీలం/ఎగేసిన బాకీలం
మృత్యువు సినిమాలో/మూడు భాషల టాకీలం
భగవంతుని టోపీలం/కవిత్రయపు కాపీలం
గోరంతల కొండంతలం ఒకటికి రెండింతలం!
మనిషిని చాచికొట్టి, చావచితగ్గొట్టి యిలా హేళన చేయడం ఎంత సహజంగా వుందో అంత నవ్విస్తుంది కూడా!
~
ఇక సినీ సాహిత్యం విషయానికి వస్తే, ఒకప్పటి సినిమాలలో హాస్య పాత్రధారుల కొరకే హాస్య ప్రధాన గీతాలు వ్రాసేవారు.
/పొరుగింటి మీనాక్షమ్మను చూశారా.. వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా?/
/అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే.. అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే/
వంటి పాటలు దీనికి మంచి ఉదాహరణలు. ఇంకా ఒకటి రెండు పాటలు గమనిద్దాం.
అతడు: కాశీకి పోయాను రామా హరి
గంగ తీర్థమ్ము తెచ్చాను రామా హరి
గంగ తీర్థాము తెచ్చాను రామా హరి
ఆమె: కాశీకి పోలేదు రామా హరి
ఊరి కాల్వలో నీళ్లండి రామా హరి
మురుగుకాల్వలో నీళ్లండి రామా హరి/
మరో ఉదాహరణ:
/సుందరి నీవంటి దివ్య స్వరూపంబు
ఎందెందు వెదకిన లేదుకదా
ఎందెందు వెదకిన లేదుకదా..
నీ అందచందాలింక నా వే కదా
సుందరి ఓహో సుందరి.. అహ సుందరి/
~
ఈ విధంగా మొదలుపెట్టి ఎందరో సినీ గేయ రచయితలు, చాలా చక్కటి హాస్య గీతాలను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అందించి, తెలుగు ప్రేక్షకులకు కావలసినంత మరపురాని హాస్యాన్ని పంచారు. కాలక్రమేణా హీరో, హీరోయిన్లు ఒకరినొకరు ఏడిపించేందుకు ఉపయోగించే, / మీకు మీరే మాకు మేమే../ /పొగరుబోతు పోట్ల గిత్త రా// ఆడువారి మాటలకు అర్థాలే వేరులే// వెయ్యినొక్క జిల్లాల వరకు..// చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే// పిల్లా మెల్లగ వచ్చిందే..//లాంటి ఎన్నో teasing songs బాగా ప్రజాదరణ పొందాయి. ఇవి కూడా ఎంతో హాస్యాన్ని పండించాయి.
ఇక సిరివెన్నెల గారి విషయానికి వస్తే, అత్యంత ప్రజాదరణ పొందిన ప్రేరణాత్మక, ప్రబోధాత్మక, సామాజిక స్పృహ రంగరించిన గీతాలు, దేశభక్తి గీతాలు, భక్తి గీతాలు, ప్రేమ – విరహ గీతాలు, బాంధవ్యాలు, అనుబంధాలపై గీతాలు, భావ గీతాలు, వీటన్నిటిలో అంతర్లీనంగా నడిచిన తాత్త్విక గీతాలే కాక వ్యంగ్య, హాస్య గీతాలు కూడా ఆయన ఖాతాలో లెక్కకు మించి ఉన్నాయి. 360 డిగ్రీలలో, అన్ని కోణాల్లో సాహిత్యంతో పాఠకులను/ శ్రోతలను ఆయన ముంచెత్తారు.
సినిమా సాహిత్యమే కాక, సినిమాయేతర సాహిత్యంలో కూడా ఈ హాస్య గీతాలు శ్రోతల మనసులను దోచుకున్నాయి. ముందుగా, కొన్ని ప్రైవేట్ పాటలను గమనిద్దాం. 2001 నుండి ఆరేళ్లపాటు నడిచిన ఒక హాస్య ధారావాహిక అమృతం. కళ్యాణి మాలిక్ సంగీతం కూర్చిన ‘ఒరేయ్ ఆంజనేయులు..’ అనే సిరివెన్నెల గారి సాహిత్యం ఇప్పటికి కూడా refreshing vibes ఇస్తోందని నేటి యువత కొనియాడుతున్నారు. అది ఒక mood booster లాగా, విపరీతంగా వైరల్ అయింది.
అమ్మోలూ.. హమ్మోలూ.. ఇంతేనా బతుకు హుఁహూఁహూఁ
ఆహాలూ ఓహోలూ ఉంటాయి వెతుకు హ్హహ్హహ్హ
మన చేతుల్లోనే లేదా రిమోట్ కంట్రోలు
ఇట్టే మార్చేద్దాం ఏడుపుగొట్టు ప్రోగ్రాంలు
వార్తల్లో headlinesగా మనకొచ్చే చిలిపి కష్టాలు
అయొడిన్ తో అయిపోయే గాయాలే మనకి గండాలు
ఒరే ఆంజనేలూ తెగ ఆయాస పడిపోకు చాలు
మనం ఈదుతున్నాం ఒక చెమ్చాడు భవసాగరాలు
కరెంటూ, రెంటూ ఎట్సెట్రా మన కష్టాలు
కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్ళు
నైటంతా దోమల్తో ఫైటింగే మనకి గ్లోబల్ వార్
భారీగా ఫీలయ్యే టెనెన్లేం పడకు గోలీమార్..
మధ్యతరగతి జీవితాలను కాచి వడబోసి, వారి జీవితంలో వచ్చే, కరెంట్ బిల్లు, రెంటు, లాంటి టెన్షన్ లపై ఒక చిన్న వ్యంగ్యాస్త్రం ఈ పాట. /మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు/నైటంతా దోమల్తో ఫైటింగే మనకి గ్లోబల్ వార్/.. లాంటి అతిశయోక్తులు వాడి, మనిషి అనవసరమైన హైరానా పడకూడదనీ, టెన్షన్లకు ముగింపు పలకమని సరదా సరదాగానే.. ఇవ్వవలసిన సందేశం ఇస్తున్నారు సిరివెన్నెల. చిన్నచిన్న కష్టాలను, పెద్దవిగా ఊహించుకుంటూ.. ఒత్తిడికి గురవ్వకుండా.. సింపుల్ జీవితాన్ని.. కాంప్లెక్స్ చేసుకోకుండా బ్రతకమనేది ఆయన హితోపదేశం.
~
ముద్దోస్తున్నావోయ్ గోపాలం.. టైటిల్ సాంగ్ కూడా హాస్య-వ్యంగాల మిళితమైనప్పటికీ, గోపాలం పాత్ర
ముద్దోస్తున్నావోయ్.. గోపాలం.. ముద్దోస్తున్నావోయ్
ఏ చుక్కల్లో చిక్కుకుందో నీ చిత్రమైన చూపు
అంత జాలిగా చూస్తావెందుకు మా అందరి వైపు
ఏ లోకం నీదో మాలోకం..
……..
ఎంత దువ్వినా లొంగుతుందా ఆ పొగరుబోతు క్రాఫు పైక్కనిపించే మెత్తని వాడివి కాదని అదేగా ప్రూఫు
అది కూడా బాగానే ఉందని అనిపించడమే నాఖర్మం ఏమైతేనేం గానీ మహా ముద్దోస్తున్నావోయ్ గోపాలం
~
పూర్వకాలం పెళ్లి పాటల్లో.. ఆడపెళ్లి వారిని వియ్యాల వారు ఆట పట్టిస్తూ, ‘ఏలాగు భోంచేస్తుము..ఈ వియ్యాలవారి విందు.. మేమేలాగు భోంచేస్తుము’.. అని చమత్కారయుతంగా వేళాకోలపు పాటలు పాడేవారు.
‘పెళ్లి పందిరి’ సీరియల్ కోసం సిరివెన్నెలగారు అలాంటి పాట ఒకటి వ్రాశారు. వియ్యాలవారి వెటకారానికి ఆడపిల్ల వారు తగిన సమాధానం కూడా చెబుతున్నారు చూడండి.
ఓహోహో.. ఏమి విందండీ.. వియ్యాల వారిది.. ఓహోహో.. ఏమి విందండీ.. ||2||
చెక్కర తగలని బూరెలతో.. చప్పని కూరలతో..
అచ్చం ఇది పత్యం వంటండీ..
ఓహోహో.. ఏమి విందండీ..
వియ్యాల వారిది..ఏమి విందండీ
కళ్ళారా మా పిల్లను చూసి
మామంచి మర్యాదలు చూసి..
కడుపు నిండిపోయిన మీకు
ఇంకా ఈ విందెందుకు లెండి..
అయినా శాస్త్రానికి అనుకోండి..
ఓహోహో.. ఏమి విందండీ.. వియ్యాల వారిది ఊహల్లో లేని విందండీ..
~
సినిమా పాటల్లో హాస్యాన్ని, వ్యంగ్యాన్ని అవసరమైనంత మేరకు జోడించి ఎన్నో పాటలు వ్రాసే అవకాశం సిరివెన్నెల గారికి వచ్చింది. ఆయా సందర్భాలకు తగినట్టుగా ఆయన పాటలను ఎంతో ముచ్చటగా తీర్చిదిద్దారు. అలాంటి పాటలను కొన్నింటిని చూద్దాం.
‘శివ’ సినిమాలో ‘బాటనీ పాఠముంది.. మ్యాటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా..’ అనే పాట ఎందరో మనసుల్ని దోచుకుంది.. ఒక కొత్త ట్రెండ్ సృష్టించింది. వచన రూపంలో సాగిన ఈ పాటలో కోడి జుట్టు దువ్వుకోవడం, ఏడ్చినట్టు నవ్వడం, వింత గరీబు, కొత్త నవాబు వంటి oxymorons కూడా ఉపయోగించి హాస్యాన్ని పుట్టించారు సిరివెన్నెల.
దువ్వెనే కోడి జుట్టు, నవ్వెనే ఏడ్చినట్టు,
ఎవ్వరీ కొత్త నవాబు.
కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు
ఎవ్వరి వింత గరీబు..
జోరుగా వచ్చాడే జేమ్స్ బాండు
గీరగా వేస్తాడే ఈల సౌండు..
ప్రాసలు, చమత్కారాలతో, ఒక కొత్త ఒరవడిని సృష్టించింది.
~
‘మనీ’ చిత్రంలోని చక్రవర్తికీ, వీధి బిచ్చగత్తెకీ అనే పాటలో డబ్బు యొక్క విశ్వరూపాన్ని, నిజరూపాన్ని వర్ణించడంలో హాస్య రసాన్ని ఎంచుకొని.. లవ్వాడుకోవడం డ్రీమించుకోవడం.. వంటి సరదా పదబంధాలు సృష్టించి చమత్కారాన్ని పండించారు.
చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువవౌతానని
అంది మనీ మనీ!
అమ్మ చుట్టమూ కాదు అయ్య చుట్టుమూ కాదు అయినా అన్నీ అంది మనీ మనీ!
పచ్చనోటుతో లైపు లక్షలింకులు పెట్టుకుంటుందనీ
అంది మనీ మనీ!
పుట్టడానికీ పాడె కట్టడానికి మధ్య అంతా తనే అంది మనీ మనీ।
కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ!
తైలం తమాషా చూద్దాం పదండి అంది మనీ మనీ!
డబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరా దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా..
~
‘మనసిచ్చి చూడు’, అనే చిత్రంలోని పాటలో, చదువుపై శ్రద్ధసక్తులు లేని విద్యార్థుల అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ, వాళ్ల dimensional లో ప్రపంచాన్ని చూపిస్తూ.. జీవితంలో విజయాన్ని రంగంలో అయినా సాధించవచ్చు.. అనే జీవిత సత్యాన్ని కూడా జోడించారు.
బోడి చదువులు వేస్టు- నీ బుర్రంతా భోంచేస్తూ
ఆడి చూడు క్రికెట్టు టెండుల్కర్ అయ్యేటట్టూ!
ఒక్క ఫోజు కొట్టు – లక్షలు వచ్చిపడేటట్టు
అడిడాస్ బూట్లు తొడగవ – నీకు ఆరు కోట్లు..
ఎంత చదివితే సంపాదిస్తావ్ అంత పెద్ద అంతస్తూ
ఓరి ఇన్నోసెంటు స్టూడెంటూ!!..
~
‘లాఠీ’ చిత్రంలోని మరో వ్యంగ గీతం.
గొప్పకథే అనుకో బ్రదరు చెప్పినదే ఎవరో ఒకరు
ఇప్పటికే బాగా ముదురు విప్పకురా ఇపుడా రీలు
ఏడు చేపల కథా ఇది కజిన్స్
ఎంత కొత్తదో వినండొహ అనొద్దురా..
అంతలేదురో సీను జస్టింతేను ..
~
‘W/o.వి.వరప్రసాద్’, చిత్రంలోని ఈ పాటలో, మోసాలు కుట్రలు చేయడం కూడా ఒక కళేనని, గోల్మాల్ ఎలా చేయాలో నేర్చుకొని గొప్పవాడైపోమని పైకి చెబుతూ.. అలాంటి వాటి జోలికి పోకుండా ఎదగాలన్న సందేశాన్ని అంతర్లీనంగా అందిస్తున్నారు సిరివెన్నెల.
మోసాలు మతలబులు కానీరోయ్ దేశానికి రాజైపోతావోయ్ ఈ ఛీటింగనబడు ఘనవిద్య కడుకష్టం కదరా బచ్చా ప్రతికుంకా ఎగబడి ఈమధ్య తెగ మిస్ యూజ్ చేసెర శిష్యా గోలుమాలెలా చేస్తారో నన్ను చూసి చక్కగా ఫాలో అయిపోరో పైకొస్తావురోయ్..
~
‘మాయలోడు’ చిత్రం కోసం గారడి విద్యతో పొట్ట పోసుకునే హీరో నేపథ్యానికి సాహిత్యాన్ని అందిస్తూ.. గుట్టు బయట పెట్టనంతవరకే.. ఏ చిట్కాలు అయినా ఆనందం కలిగిస్తాయనే పరమ సత్యాన్ని తెలియజేస్తున్నారు.
ఛూమంతర్ కాళీ! ఇది జంతర్ మంతర్ మోళీ
మాయాలేదు మంత్రం లేదు యంత్రం లేదు తంత్రం లేదు
మోసం గీసం మొదలే లేదు
మస్కా కొట్టే సిట్కా ఏదో – బైటెట్టేస్తే సరదాపోదూ..
~
గల్లీ రౌడీ అయిన ఖాన్ దాదాను (బ్రహ్మానందాన్ని), అనవసరంగా రెచ్చగొడుతూ పాడే పాట.. మనీ చిత్రం నుండి.. బ్రహ్మానందం గారి కటౌట్ కి ఏ మాత్రం, match అవ్వని ఉపమానాలతో పోలుస్తూ, ఉత్రేక్షలతో అద్భుతమైన హాస్యాన్ని ఈ పాటలో పండించారు సిరివెన్నెల.
వారెవ్వా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసువచ్చింది సినిమా ఛాన్సు ఇంక వేసేయి మరో డోసు@2
పిచ్చెక్కి ఆడియన్సు రెచ్చిపోయేలా చెయ్యి డాన్సు
చెప్పింది చేయరా నీవేరా ముందు డేసు..
అమితాభ్ బచ్చన్ కన్నా ఏం తక్కువ నువ్వైనా
హాలీవుడ్లో అయినా ఎవరెక్కువ నీకన్నా
ఫైటూ ఫీటూ ఆటా పాటా రావా నీకైనా
చిరంజీవైనా పుడుతూనే మెగాస్టార్ అయిపోలేదయ్యా
తెగించే సత్తా చూపందే సడన్గా స్వర్గం రాదయ్యా
బాలయ్య, వెంకటేషు, నాగార్జున, నరేషు,
రాజేంద్రుడు, సురేషు, రాజశేఖరు, అదర్సు
మొత్తంగా అందరూ అయిపోవాలోయ్ మటాషు..
~
నిప్పురవ్వ చిత్రంలోని.. హాస్య భరితమైన ఒక టీజింగ్ సాంగ్..
హూ ఈజ్ షీ, వో కౌన్ థీ
టైమెంతా.. రాత్రి ఒంటి గంట
ఎవరంటా వచ్చే ..ఒంటి గుంట
అమ్మాయే.. అబ్బే కాదనుకుంటా
నమ్మాలో వద్దో కనుక్కుంటా వచ్చేసింది
వచ్చేసింది బాబోయ్ స్వాతంత్య్రం వచ్చేసింది బాబాయ్ చీకట్లో షికారేసుకుందోయ్ పాపాయ్
గాంధీజీ బొమ్మేడుందో చూడోయ్ చెప్పొద్దాం ఇమీడియట్లి రండోయ్
జై అందాం జెండాలెగరేద్దాం లెండోయ్ ఏం ఫిగరు చూడ్రా అబ్బాయ్
నో ఫికరు రంభోయ్ హోషియార్ అన్రా సుబ్బాయ్ నో ఫియరు అందోయ్..
~
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే.. పాట తరహాలో ‘నిర్దోషి’ చిత్రం కోసం సిరివెన్నెల గారు పంచిన మరో వ్యంగగీతం. పేక ముక్కల్ని నమ్ముకొని.. జీవితాల్ని అమ్ముకుంటున్న.. పేకాటరాయుళ్ల స్థితికి ఇది అద్దం పడుతుంది.
అమ్మ దీని తస్సాదియ్యా గుమ్మం దాకా వచ్చిందయ్యా షో! షో! షో!
నమ్ముకున్న ముక్కరాక సొమ్ము కాస్త దోచిందయ్యా షో! షో! షో!
కోసే దాక ఆశే పోక చూసేశాక ఎ.సి. పేక భేషో। శహభాషో! వేసై బాసు ఇస్పేటాసు నొక్కేసావో, లెక్కేసావే షో! షో చూసెయ్ బోసు ఏదీ పర్సు డీలే నాది డీలా నీది షో! షో! జోకర్ వాటము పట్టానమ్మా చేతుల తీటకు చెడ్డానమ్మా! రమ్మీ నిన్ను నమ్మి.
~
‘బావా బావా పన్నీరు’, చిత్రంలో ముసలి మన్మథరావు పెళ్లికి హాస్యాన్ని జోడిస్తున్న మరో సిరివెన్నెల గీతం.
బావా బావా పన్నీరు! బాసికఁమెప్పుడు కడతారు? మనవలనెత్తే మన్మథరావుకి మనుగుడుపులకై కంగారు తాంబూలాలిచ్చే సారండీ! తాతాశ్రీ పెళ్ళికి ఆహ్వానాలిచ్చేశారండీ!
తాంబుళాలిచ్చేశారిక తన్నుకు చావండి..
***
మనీ చిత్రంలోని ఒక హాస్య గీతాన్ని గురించి సంపూర్ణంగా చర్చించుకుందాం. ఈ సినిమాలో కోటా శ్రీనివాసరావు గారు, ఒక కమెడియన్ పాత్రలో కనిపిస్తారు. ఆయన పాత్రకు తగినట్టుగా ఈ పాట వ్రాయడం జరిగింది.
పల్లవి:
భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు
భర్తగా మారకు బ్యాచిలరు
షాదీ మాటే వొద్దు గురు
సోలో బ్రతుకే సో బెటరు
ఆలికి మెళ్ళో ముళ్ళేసానని
ఆనందించే మగవారు
ఆ తాడే తమ ఉరితాడన్నది
ఆలోచించక చెడతారు
మొగుడయ్యే ముహూర్తమే మగాడి
సుఖాల ముగింపు చాప్టరు
॥భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు॥


పెళ్లి అనే అంశంపై వ్యతిరేకత కలిగిన ఒక ముదురు బ్రహ్మచారి (కోటా శ్రీనివాసరావు), పెళ్లి కాబోతున్న ఒక వ్యక్తికి ఇచ్చే సలహాను, అతని కోణం నుంచి వ్యక్తంచేశారు సిరివెన్నెల. పెళ్లి తర్వాత స్త్రీలు మాత్రమే కాకుండా, పురుషులు కూడా స్వతంత్రాన్ని కోల్పోతారని.. సుఖాలకు దూరమవుతారని.. అందుకే.. బ్రహ్మచారిలా.. సోలోగా బ్రతకమని.. నాయకుడు సందేశమిస్తున్నాడు. భార్యకు మెడలో వేసిన తాడు.. తన జీవితానికి.. ఉరితాడు అవుతుందన్న ఉత్ప్రేక్షలను సిరివెన్నెల ఇక్కడ ఉపయోగించారు.
చరణం:
వంటకని వైఫెందుకురా హోటళ్ళే చాలు
వొంటికని ఒకటా రెండా అంగడి అందాలు
కోతికి ఉందా కోడికి ఉందా ఈ పెళ్ళాచారం
జంటలు కట్టే జంతువులెరుగవు వెడ్డింగ్ విడ్డూరం
ఎందుకు మనకీ గ్రహచారం.. అందుకనీ..
॥భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు॥


మగవాడు ఒంటరిగా బ్రతకడం కష్టమేమీ కాదనీ ఆకలి తీర్చడానికి హోటళ్ళు, శరీరానికి ఆనందం, సౌఖ్యం, ఇవ్వడానికి కావలసిన ఏర్పాట్లు ఉన్నాయనీ, దిగులు పడాల్సిన అవసరం ఏమి లేదని చెప్పడం వరకు బాగుంది. కానీ, కోడి, కోతి లాంటి జంతువులకు ఈ పెళ్లి తంతు లేదు కదా, మనకెందుకు ఈ వింత ఆచారం, అంటూ హాస్యాన్ని పుట్టించే ఉపమానాలు గుప్పించారు సిరివెన్నెల.
చరణం:
చచ్చీ చెడి డే అండ్ నైటు చాకిరి చేస్తావు
తెచ్చినది డార్లింగ్ దెయ్యం చేతిలో పోస్తావు
బీడీ కోసం బీబీ ముందు దేహీ అంటావు
గాడిని దాటని గానుగ ఎద్దై బతికేం చేస్తావు
బాండేడ్ బానిసవౌతావు,
॥భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు॥
కోటాగారు ఏదో భార్యా బాధిత సంఘం అధ్యక్షుడైనట్టు, భర్తల కష్టాలను ఈ చరణంలో ఏకరువు పెడుతున్నారు సిరివెన్నెల. గానుగెద్దులా పనిచేస్తూ కూడా, భార్య దయాదాక్షిణ్యాయాలపై ఆధారపడి, bonded labour లాగా ఎందుకు జీవిస్తావని ప్రశ్నిస్తున్నారు.
చరణం:
పులిలాగే పెళ్ళికి కూడా లెటర్సు రెండేరా
ఫర్వాలేదని పక్కకు వెళితే ఫలారమైపోరా
ఇడీ అమీను సదామ్ హుసేను హిట్లర్ ఎక్సెట్రా
ఇంట్లో ఉన్న పెళ్ళాంకన్నా డిక్టేటర్లట్రా
అంతటి డిక్టేటర్లట్రా బాబోయ్..


పులికి రెండక్షరాలే, పెళ్లికి రెండు అక్షరాలేనట! పర్వాలేదులే అని ధైర్యం చేసి ముందుకు దూకితే.. బలైపోతారట! హిట్లర్, సద్దాం హుస్సేన్ వంటి నియంతలు ఇంట్లో ఉన్న పెళ్ళాం కన్నా గొప్ప dictators కాదంటూ.. గొప్పగా చమత్కరిస్తున్నారు సిరివెన్నెల. పులి, పెళ్లి, ఫలారం, ఫర్వాలేదు.. లాంటి చక్కటి ప్రాసలతో ఈ పాటను ఆయన రసవత్తరంగా తీర్చిదిద్దారు. మొత్తం మీద పెళ్లి అనే వ్యవస్థని నిరసిస్తున్న ఒక పాత్రకు, ఆ పాత్ర మనసులోకి దూరి, అలాంటి భావాలను వ్యక్తం చేసి, ఈ పాటకు సంపూర్ణమైన న్యాయం చేశారు సిరివెన్నెల.
పై పాటలన్నిటిలో హాస్యాన్ని ఉత్ప్రేరితం చేసేందుకు- ఉత్ప్రేక్ష, అతిశయోక్తి, అసంబద్ధత (farce), సందర్భం మార్పు (reframing), సమయస్ఫూర్తి, శ్లేష లాంటి పద్ధతులను ఉపయోగిస్తూ, హాస్యాన్ని పుట్టించే పాటలను సిరివెన్నెల వ్రాయడం జరిగింది. అంతేకాకుండా, రాజకీయ కోణంలోనూ, సామాజిక స్థితిగతులలోనూ, paradical situationsగా మలచటం లాంటి ఎన్నో ఇతర ప్రక్రియలను కూడా ఈ సాహిత్యాన్ని సృష్టించడంలో ఆయన ఉపయోగించారు. హాస్యాన్ని సృష్టించడం అంత సులభమేమీ కాదు. వ్యంగ రచనలు చేయడానికి ఎక్కువ సృజనాత్మకత కావాలి.
వ్యంగ్యోక్తులు విసురుతున్న వారే కాకుండా, దాన్ని అర్థం చేసుకునే వారికి కూడా మంచి సృజనాత్మకత ఉండాలి. అందుకే ఒక రకంగా వ్యంగ్యం మనలోని సృజనాత్మకతను trigger చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి వ్యంగ్య గీతాలు వ్రాయడానికి చాలా స్పష్టమైన, గొప్ప సృజనాత్మకత కలిగిన ఆలోచనా సరళి కూడా ఉండాలి. హాస్యం వెర్రితనం కాదనీ, వెకిలితనం కానే కాదనీ, సమస్యలు అమావాస్యలైతే అవశ్యకరణీయాలు హాస్యకిరణాల ప్రసారణాలురా శిష్యా.. అంటారు శ్రీశ్రీ.
Sarcasm involves constructing or exposing contradictions between intended meanings. The most common form of verbal irony. Sarcasm is often used to humorously convey thinly veiled disapproval or scorn.
సలక్షణమైన హాస్యాన్ని సృష్టించడానికి మనం చేసే ఎగతాళిలోనూ, చమత్కారంలోను, చతుర్లలోను, వెక్కిరింతలు, వేళాకోళాల్లోనూ, పరాచికాల్లోనూ, ఎకసెక్కాల్లోనూ.. స్వాతిశయం దాగి ఉండాలి. అలా ఉన్నప్పుడే అది హాస్యాన్ని సృష్టించగలదని Burgson అంటారు.
అనూహ్యమైన మలుపు, (unexpected twist) కూడా మనకు ఎంతో నవ్వును తెప్పిస్తుంది. ఒక భావం తరువాత ఏదో సహజంగా అనుసరిస్తుందని మనం భావిస్తే.. అందుకు భిన్నంగా.. ఊహించని విధంగా.. వచ్చే మలుపు హాస్యాన్ని సృష్టిస్తుంది. కథనంలో అనూహ్య మైన మలుపు హాస్యానికి మూలమని ఈ సిద్ధాంతము చెపుతుంది. “శివుడద్రిని శయనించుట, రవి చంద్రులు మింటనుంట, రాజీవాక్షండవిరళముగ శేషునిపై బవళించుట నల్లి బాధ పడలేక సుమా!” అనే పద్యంలో చెప్పిన సంఘటనలన్నింటికీ కారణము నల్లి బాధ అని మనము అనుకోము. మనము అనుకోని విషయము చెప్పగానే నవ్వొస్తుంది. నీకు పెళ్లితో ఏం అవసరం అని ఒకరిని ప్రశ్నిస్తూ, కోతి కోడి లాంటి జంతువులకు పెళ్లి ఆచారం లేదు కదా అని సమన్వయం చేయడం, ఇలాంటి ప్రయోగమే!
We laugh at others’ ignorance, అనే విషయం మనందరికీ తెలుసు. కానీ, ఆ ignoranceని కూడా సరిదిద్దుతూ, సందేశం ఇవ్వడం, సిరివెన్నెల విలక్షణ శైలి.
ఎదుటివారు తమకన్నా బలవంతులై ఎక్కువ retort ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు, వారిని సాధించడానికి వ్యంగ్యాన్ని వాడి వాళ్లని humiliate చేసి, అవమానించడానికి ప్రయత్నిస్తామని, సిరివెన్నెల అంటారు. ఒక రకంగా చూస్తే, వ్యంగ్యం కూడా దైవపరంగా ఐతే నిందాస్తుతేననీ, పైకి నిందిస్తున్నా, లోపల పొగడ్త వుంటుందనీ, ఐతే ఈ వ్యంగ్యం గీతాల్లో పైకి కొంచెం పొగడుతున్నట్లనిపించినా, తేలిగ్గా తీసుకున్నట్లనిపించినా అంతరంగంలో చూస్తే ఒక రకమైన concern, లేదా ఆయా పరిస్థితుల పట్ల వ్యతిరేకతను తెలియపరుస్తున్నట్లు వుంటుందనీ, అంటారాయన.
‘రసాలన్నిట్లోకి, హాస్యం, వ్యంగ్యం ఎక్కువగా ఆకట్టుకుంటాయి. ఆకట్టుకోవాలని చేసే ప్రయ్నతం కంటే, అలా ఆకట్టుకోవడం ద్వారా ఆయా పాటల్లోని ఇతివృత్తం, శ్రోతల, పఠితల దృష్టిని ఆకర్షించడం అనే ప్రయత్నం నేనెక్కువగా చేసాను’ అని ఆయన తన భావతరంగాల్లో వ్రాసుకున్నారు.
సహజ సిద్ధంగానే హాస్య ప్రియులైన సిరివెన్నెల గారికి హాస్య గీతాలను రక్తి కట్టించగలగడం పెద్ద విషయమేమీ కాదు. మీరు ఇంత simple గా ఎలా ఉండగలరని ప్రశ్నించినప్పుడు complex గా ఉండడం చేతకాక, అని సమాధానమిచ్చారంటే ఆయన మేధస్సు ఎంత పదునుగా, పాదరసంలా పనిచేస్తుందో మనం గ్రహించగలం. హాస్య గీతాలను, వ్యంగ్య గీతాలను సృష్టించడంలో సంపూర్ణమైన లక్షణాల సమన్వయాన్ని మనం గమనించవచ్చు.
శబ్దం, అలంకారం, సౌందర్యం, వెటకారం కలగలిపి వ్యంగ్య, హాస్య రసాలతో సంపూర్ణంగా తెలుగు నుడికారాలతో, అనూహ్యమైన మలుపులతో, మైమరిపించే పదబంధాలతో సరదాల సందళ్ళతో, రమనీయమైన హాస్య గుళికలతో మన మనసులను అందంతో నింపి వేశారు సిరివెన్నెల.
Images Source: Internet

శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ గారు ఆంగ్ల అధ్యాపకురాలు, వ్యక్తిత్వ వికాస నిపుణురాలు, గీత రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు(తెలుగు-ఇంగ్లీష్-హిందీ), సామాజిక కార్యకర్త.