Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సిరివెన్నెల పాట – నా మాట – 87 – డబ్బు మీద ప్రవచనం లాంటి పాట

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

ఎప్పుడైతే పుట్టిందో..

~

చిత్రం: పైసా
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం : సాయి కార్తీక్
గానం : కృష్ణవంశీ, విట్టల్, జి.వేణుగోపాల్, ధనరాజ్, తాగుబోతు రమేష్, చంద్ర

~

పాట సాహిత్యం

పల్లవి:
ఎప్పుడైతే పుట్టిందో మనిషిలోన మాయదారి ఆశ దాని చిటికెనేలు పట్టుకొని వెంటపడి వచ్చింది పైసా
ఎప్పుడైతే నేల మీద కాలు మోపినాదో గానీ పైసా పచ్చి గాలి మానేసి దాన్నే పీల్చుకుంటోంది శ్వాస పైసా గలగలగలమంటుంటే పైసా పైసా దిల్లంతా ఏందో దిలాసా పైసా
కళ్ళబడకుంటే పైసా గల్లంతైపోదా కులాసా పైసా ఏతావాతా ఏమిటంటే అందరిదీ ఒకటే ధ్యాస పైసా ॥ పైసా పైసా ॥

చరణం:
చిటికెడు నవ్వుల కిటుకీ పైసా కడవెడు కన్నీళ్ళ గుటకే పైసా
చారెడు చెమటల ఖరీదు పైసా బారెడు నిట్టూర్పు రసీదు పైసా
ఆకలి వేటకి ఎర ఈ పైసా ఊహల పాటకి దరువీ పైసా
పండని పంటల ఎరువీ పైసా అందని ద్రాక్షల పులుపీ పైసా
బలమున్నోళ్ళకి బానిస పైసా బాంచన్ గాళ్ళకి బాసీ పైసా
దొరక్కపోతే సమస్య పైసా అరక్కపోతే చికిత్స పైసా
ఉగ్గుకి పైసా పెగ్గుకి పైసా శక్తికి పైసా ముక్తికి పైసా నేలకి పైసా గాలికి పైసా నీటికి పైసా నిప్పుకి పైసా ఎన్నన్నా ఎన్ననుకున్నా ఉన్నది ఒకటే తెలుసా పైసా పైసా ॥ పైసా పైసా ॥

చరణం:
అక్కరకొచ్చే ఆప్తుడు పైసా చిక్కులు తెచ్చే ధూర్తుడు పైసా
Fatal attraction రా పైసా
Total destruction రా పైసా
ఆత్మ బంధువుల హారం పైసా
అనుబంధాల దారం పైసా
తేడా వస్తే అర్థాలన్నీ తలకిందయ్యే తమాషా పైసా
ఆహాహా సంతోషం పైసా
హాహాహా ఆక్రోషం పైసా
ఓహోహో సౌందర్యం పైసా
ఔరౌరా ఆశ్చర్యం పైసా
ప్రాణం తీసే పాపం పైసా
దానం చేసే పుణ్యం పైసా
ఇహము పైసా పరము పైసా
ఋణము పైసా ధనము పైసా
ఒప్పు పైసా తప్పు పైసా
భయము పైసా అభయం పైసా
మానవులంతా మాట్లాడుకునే ఏకైక ప్రపంచ భాష పైసా ॥ పైసా పైసా ॥

‘ధర్మమూలమిదం జగత్!’ – ‘ధనమూలమిదం జగత్!’గా మారిపోయి చాలా శతాబ్దాలు అవుతోంది. ‘పైసా మే పరమాత్మ హై’ అంటూ, డబ్బుకు లోకం దాసోహం అయిపోతోంది. నిస్సందేహంగా డబ్బు ప్రపంచాన్ని ఆడిస్తోంది, డబ్బు మాత్రమే ఆడిస్తోంది. కాలాన్ని, ప్రాయాన్ని, జ్ఞానాన్ని, శక్తిని పెట్టుబడి పెట్టి, కట్టుబడిగా కట్టలు కట్టలు డబ్బు(virtual money) తో ఆనందాలు కొనాలని ఆరాటపడుతున్నాడు మానవుడు.

డాలర్ రోలర్ స్కేటింగ్ చేస్తూ రేటింగ్ పెంచుకుంటోంది; యూరో.. క్యార్ క్యార్ మనిపిస్తోంది; బిట్ కాయిన్.. జెట్‌లా దూసుకుపోతోంది; పౌండ్లు, దినార్లు, యెన్లు.. రకరకాల క్రిప్టో కరెన్సీలు రేసుగుర్రాల్లా పరిగెడుతున్నాయి. Power in money: money in power, ప్రపంచాన్ని ఆడిస్తున్నాయి.

‘ధనమేరా అన్నిటికీ మూలం.. ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం@2
ధనమేరా అన్నిటికీ మూలం..
మానవుడే ధనమన్నది సృజియించెనురా.. దానికి తానే తెలియని దాసుడాయెరా@
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే@2 గుణవంతుడు, బలవంతుడు, భగవంతుడురా’ – అన్నారు ఆరుద్రగారు డబ్బు విలువ తెలియజేస్తూ.

~

‘చక్రవర్తికీ, వీధి బిచ్చగత్తెకీ, బంధువౌతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు, అయ్య చుట్టము కాదు, ఐనా అన్నీ అంది మనీ మనీ
పచ్చనోటుతో లైఫు లక్ష లింకులు పెట్టుకుంటుందని, అంది మనీ మనీ
పుట్టడానికి, పాడెకట్టడానికి మధ్య అంతా తనే అంది మనీ మనీ..
కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ..
తైలం తమాష చూద్దాం పదండి అంది మనీ మనీ
డబ్బుని లబుడబ్బని గుండెల్లో పెట్టుకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా’..
అంటూ, ఇహలోకంలో సర్వాంతర్యామిలాంటి తైలం మహత్యాన్ని వివరించారు సిరివెన్నెల.

~

पैसा ये पैसा, पैसा है कैसा नहीं कोई ऐसा,
जैसा ये पैसा के हो मुसीबत ना हो मुसीबत हो मुसीबत, ना हो मुसीबत सात आठ नौ दस- అన్నారు ఆనంద్ బక్షి.

~

‘Money is a tool,
Like a hammer or fuel;
It can buy a lot,
Any car, any stock.

But its value is not,
What ought be sought;
Can corrupt a man,
And his thought.
………..

We valued not,
What you bought;
But every minute,
That we caught.
……….

You’ll miss me now,
My memory;
But understand,
That values not money’- అన్నారు Dennis K. Fehr

~

ఇలా చెప్పుకుంటూ పోతే, కరెన్సీలు ఎన్ని రకాలు ఉన్నాయో, అన్ని రకాల నిర్వచనాలు డబ్బుకు ఉన్నాయి. మచ్చుకు నలుగురు సాహితీకారులు డబ్బు గురించి ఏం నిర్వచనాలు చెప్పారో మాట్లాడుకుని, మన విశ్లేషణ లోకి వెళ్తున్నాం.

ఇంతలా ఈ డబ్బు డప్పు ఏంటి, అనుకుంటున్నారా? ఈరోజు మనం చర్చించబోతున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహితీ ప్రవచనం డబ్బు మీదే మరి! ఈ కాస్త ఉపోద్ఘాతంతో, పాటలోని వివరాల్లోకి వెళ్దాం.

‘పైసా’ చిత్రం కోసం డబ్బు ప్రాధాన్యతను వివరిస్తూ, సినిమాకు థీమ్ సాంగ్‌గా రూపొందిన, ‘ఎప్పుడైతే పుట్టిందో మనిషికి మాయదారి ఆశ..’ పాటని ఈరోజు విశ్లేషించుకుందాం.

పల్లవి:
ఎప్పుడైతే పుట్టిందో మనిషిలోన మాయదారి ఆశ దాని చిటికెనేలు పట్టుకొని వెంటపడి వచ్చింది పైసా
ఎప్పుడైతే నేల మీద కాలు మోపినాదో గానీ పైసా పచ్చి గాలి మానేసి దాన్నే పీల్చుకుంటోంది శ్వాస పైసా గలగలగలమంటుంటే పైసా పైసా దిల్లంతా ఏందో దిలాసా పైసా
కళ్ళబడకుంటే పైసా గల్లంతైపోదా కులాసా పైసా ఏతావాతా ఏమిటంటే అందరిదీ ఒకటే ధ్యాస పైసా ॥ పైసా పైసా ॥

అవసరాల కోసం డబ్బు సంపాదించాలన్న ధ్యేయం నుండి ‘డబ్బు సంపాదించడం ఒక్కటే ధ్యేయం’, అన్న తీరుకు సమాజం మారిపోయిందని సిరివెన్నెల గారు పల్లవిలో వివరిస్తున్నారు. అవసరాలకు మించి డబ్బు సంపాదించాలనీ, దాచుకోవాలని, ఆశ ఎప్పుడైతే మానవుడిలో మొదలైందో అప్పటినుండి అన్ని రకాల అనర్థాలు మొదలయ్యాయి. /ఎప్పుడైతే నేల మీద కాలు మోపినాదో గానీ పైసా, పచ్చి గాలి మానేసి దాన్నే పీల్చుకుంటోంది శ్వాస/ అంటారు ఆయన. డబ్బు మైకంలో పడి సహజమైన అన్ని లక్షణాలకు మానవుడు దూరం అయ్యాడని ఎద్దేవా చేస్తూ, పైసా భూమ్మీద కాలు మోపినప్పటి నుండి, తాజా గాలిని కాకుండా, డబ్బునే శ్వాసిస్తున్నాడని ఆయన విమర్శిస్తున్నారు. చేతిలో డబ్బులు గలగలలాడుతుంటే మనసు ఉషారుగా మేఘాలలో తేలిపోతోందని, చేతిలో కాసులు తిరగకుంటే కులాసాలన్నీ గల్లంతయిపోయి, గుండెల్లో గుబులు మొదలవుతోందని, మానవుడి నైజం ఇంతగా డబ్బు వ్యామోహంలో పడి కొట్టుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మొత్తం మీద చెప్పొచ్చేది ఏంటంటే, సంపాదనే ఏకైక లక్ష్యంగా మానవులు జీవించడం మొదలుపెట్టారని, సిరివెన్నెల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చరణం:
చిటికెడు నవ్వుల కిటుకీ పైసా కడవెడు కన్నీళ్ళ గుటకే పైసా
చారెడు చెమటల ఖరీదు పైసా బారెడు నిట్టూర్పు రసీదు పైసా
ఆకలి వేటకి ఎర ఈ పైసా ఊహల పాటకి దరువీ పైసా
పండని పంటల ఎరువీ పైసా అందని ద్రాక్షల పులుపీ పైసా
బలమున్నోళ్ళకి బానిస పైసా బాంచన్ గాళ్ళకి బాసీ పైసా
దొరక్కపోతే సమస్య పైసా అరక్కపోతే చికిత్స పైసా
ఉగ్గుకి పైసా పెగ్గుకి పైసా శక్తికి పైసా ముక్తికి పైసా నేలకి పైసా గాలికి పైసా నీటికి పైసా నిప్పుకి పైసా ఎన్నన్నా ఎన్ననుకున్నా ఉన్నది ఒకటే తెలుసా పైసా పైసా

మొదటి చరణంలో పైసా విరాట్ రూపాన్ని సిరివెన్నెల వివరిస్తున్నారు. అందమైన ఉపమానాలతో, రూపాయినీ, మానవుని భావావేశాలనీ తూకం వేసి వివరిస్తున్నారు. చిటికెడు నవ్వుల్ని పూయించేది, కడివెడు బాధల్ని దిగమింగేలా చేసేది పైసానే. బారెడు నిట్టూర్పుల రశీదుగా, చారెడు చెమటల ఖరీదుగా పైసాను అభివర్ణిస్తున్నారు.

/ఆకలి వేటకి ఎర ఈ పైసా, ఊహల పాటకి దరువీ పైసా/.. కొత్త మందుల ప్రయోగాలకి, మత మార్పిడులకు, డ్రగ్ మాఫియా వంటి సంఘ విద్రోహ కార్యకలాపాలకు, కట్టు బానిసలుగా, సెక్స్ వర్కర్లుగా, ఎన్నో రకాల హ్యూమన్ ట్రాఫికింగ్‌కి, కారణం ఆకలి; పేదరికం. వాటన్నిటికీ డబ్బును ఎర చూపి ఏ విధంగా exploit చేస్తున్నారో, సిరివెన్నెల వివరిస్తున్నారు. చేతినిండా డబ్బు సంపాదిస్తే జీవితం ఎలా ఉంటుందో అన్న ఊహ ఒక పాటైతే, దానికి పైసా దరువు అవుతుందట. Speculations మీద, gambling మీద జీవితాన్ని నడిపించే వారిని ఉద్దేశించి, /పండని పంటల ఎరువీ పైసా‌, అందని ద్రాక్షల పులుపీ పైసా/ అంటారు సిరివెన్నెల. అనుకున్న విధంగా లాభాలు రాకపోతే, అదృష్టం కలిసి రాకపోతే, హా! ఏముందండీ! అవి అందరికీ కలిసి రావు! అటువంటి వాటి జోలికి పోవడం శుద్ధ దండగ! అనడం మనం తరచూ వింటూనే ఉంటాం. అనుకున్నంత సంపాదించుకుంటే నా అంత ఘనుడే లేడని కాలర్ ఎగరేయడం కూడా చూస్తూ ఉంటాం.

Money is a good Servant but a very bad Master అనే ఇంగ్లీషు నానుడికి సమంగా,
/బలమున్నోళ్ళకి బానిస పైసా బాంచన్ గాళ్ళకి బాసీ పైసా/ అంటారు.
/దొరక్కపోతే సమస్య పైసా అరక్కపోతే చికిత్స పైసా/
లేని వాడికి ఆకలి జబ్బు, ఉన్నవాడికి అరగని జబ్బు అని వ్యంగాస్త్రాలు వేస్తున్నారు, సిరివెన్నెల. ఇంట్లో తయారు చేసే ఉగ్గు కూడా మార్కెట్లో బాటిల్ లోకి మారిపోయింది. అందుకే ఆయన ఉగ్గు కొంటున్నారు, పెగ్గు కొంటున్నారు, అని అంటూ, శక్తికీ, ముక్తికీ కూడా ఈ కలికాలంలో డబ్బే సాధనంగా మారిపోయిందని వాపోతున్నారు. నిజం నిష్ఠూరంగా ఉన్నా, దైవ సన్నిధిలో extra privileges కావాలంటే కూడా డబ్బు వెదజల్లాల్సిందే మరి!

సహజంగా ప్రకృతిలో దొరికే, మనిషికి కావలసిన నీరు, నిప్పు, గాలీ, నేల కూడా అనుకున్నట్లుగా అనుభవించాలంటే రొక్కం అవసరమవుతోంది.

గల్ఫ్ దేశాలలో నీళ్లు కొనుక్కోవాల్సి ఉంటుందని విని ఒకప్పుడు ముక్కున వేలేసుకున్న మనమే, ఇప్పుడు నీళ్లను కొనుక్కొని తాగుతున్నాం. కాబట్టి ఎన్ని మాట్లాడుకున్నా, ప్రపంచాన్ని నడిపిస్తున్నది మాత్రం డబ్బే, అని అంగీకరించక తప్పదు!

చరణం:
అక్కరకొచ్చే ఆప్తుడు పైసా చిక్కులు తెచ్చే ధూర్తుడు పైసా
Fatal attraction రా పైసా
Total destruction రా పైసా
ఆత్మ బంధువుల హారం పైసా
అనుబంధాల దారం పైసా
తేడా వస్తే అర్థాలన్నీ తలకిందయ్యే తమాషా పైసా
ఆహాహా సంతోషం పైసా
హాహాహా ఆక్రోషం పైసా
ఓహోహో సౌందర్యం పైసా
ఔరౌరా ఆశ్చర్యం పైసా
ప్రాణం తీసే పాపం పైసా
దానం చేసే పుణ్యం పైసా
ఇహము పైసా పరము పైసా
ఋణము పైసా ధనము పైసా
ఒప్పు పైసా తప్పు పైసా
భయము పైసా అభయం పైసా
మానవులంతా మాట్లాడుకునే ఏకైక ప్రపంచ భాష పైసా

‘I will tell you the secret to getting rich on Wall Street. You try to be greedy when others are fearful. And you try to be fearful when others are greedy’- అంటారు Warren Buffett. నిస్సందేహంగా money is an inevitable devil. ‘Worship of Mammon’ అంటే సంపదలకు పెద్దపీట వేయడం సమాజంలో రివాజు అయిపోయింది.

అవసరానికి డబ్బు కావాలి కానీ, అవసరానికి మించి ఉంటే ఎన్నో అనర్థాలకు, total destructionకు దారితీస్తుందని, ఆప్తుడైనా, ధూర్తుడైనా, బంధమైనా, ఆత్మబంధువైనా, అన్నీ పైసాయే! అని వర్ణిస్తున్నారు ఆయన. Karl Marx అన్నట్టు All human relationships are nothing but economic relations. డబ్బు వల్ల కలిసిన బంధాలు ఎన్నో, డబ్బు కారణంగానే విడిపోయిన బంధాలెన్నో మనం చూస్తూనే ఉన్నాం. మన సంతోషం, ఆక్రోశం, ఆశ్చర్యం, సౌందర్యం.. అన్నిటి వెనక ఉండి నడిపిస్తున్నది ఏదో మనకు తెలియనిది కాదు.

దానం చేసి పుణ్యం సంపాదించాలంటే పైసా కావాలి, ప్రాణాలు తీసి పాపం మూట కట్టుకోవాలన్నా.. ధనమే! భయం, అభయం, ఇహము – పరము, అన్నీ అందరికీ పైసాలోనే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిరివెన్నెల. మొత్తం మీద, డబ్బు అనేది, Universal Language గా మారిపోయిందని,

చివరగా statement ఇస్తూ, మానవులంతా మాట్లాడుకునే ఏకైక ప్రపంచ భాష ‘పైసా’, అని సిరివెన్నెల ముక్తాయింపు పలుకుతున్నారు.

ఈ డబ్బు వ్యామోహంలో విలువలు ఎలా వెలవెల పోతున్నాయో, ‘శుభలగ్నం’ చిత్రంలో సిరివెన్నెల వివరిస్తూ, ‘కురిసే ఈ కాసుల జడిలో తడిసీ నిరుపేదైనావా?’ అని మనసుకు కావలసినంత డబ్బు చేకూరినా, అనుబంధాలు, ఆత్మీయతలకు దూరమైన కథనాయిక పట్ల తన జాలిని వ్యక్తం చేశారు. ఈ విషయం సమాజంలో చాలామంది జీవితాల్లో నిజమని నిరూపిస్తోంది.

సంపాదనల వేటలో మునిగిపోయి, కావలసినంత సమకూర్చుకున్న తరువాత, వెనక్కి తిరిగి చూసుకుంటే, కోల్పోయింది ఏమిటో అర్థం అవుతోంది. కాలమంతా కరిగిపోయాక పొందవలసినది మిగలదు. డబ్బుతో కాలాన్ని కొనలేం కాబట్టి, అతి సర్వత్రా వర్జయేత్ అని గుర్తుపెట్టుకుని, జీవితాన్ని సరైన విధంగా నడిపించుకోవాలన్నది సిరివెన్నెల గారి సందేశం.

మొత్తం మీద ఈ పాట డబ్బు మీద సిరివెన్నెల గారి సాహితీ ప్రవచనం అని చెప్పుకోవచ్చు.

Images Source: Internet

 

Exit mobile version