Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సిరివెన్నెల పాట – నా మాట – 85 – ప్రకృతి పట్ల ప్రేమావేశాన్ని చిత్రించిన పాట

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

మానస వీణ మౌన స్వరాన

~

చిత్రం: హృదయాంజలి

సాహిత్యం: సిరివెన్నెల

సంగీతం: ఎ.ఆర్.రెహమాన్

గానం : చిత్ర & కోరస్

~

పాట సాహిత్యం

పల్లవి:
మానస వీణ మౌన స్వరాన ఝుమ్మని పాడే తొలి భూపాలం
మానస వీణ మౌన స్వరాన ఝుమ్మని పాడే తొలి భూపాలం
పచ్చదనాల పానుపు పైన అమ్మై నేల
జోకొడుతుంటే
పచ్చదనాల పానుపు పైన అమ్మై నేల
జోకొడుతుంటే ॥ మానస వీణ॥

చరణం:
పున్నమి నదిలో విహరించాలి..
పువ్వుల ఒళ్లో పులకించాలి
పావురమల్లే పైకెగరాలి తొలకరి జల్లై దిగిరావాలి తారల పొదరింట రాతిరి మజిలి
వేకువ వెనువెంట నేలకు తరలి
కొత్త స్వేచ్ఛకందించాలి నా హృదయాంజలి
॥ మానస వీణ ॥

కోరస్:
తూగే వాగు నా నేస్తం చెలరేగే వేగమే ఇష్టం మనలాగే నింగికే నిత్యం ఎదురేగే
పంతమే ఎపుడూ నా సొంతం ॥ 2 ॥

చరణం:
ఊహకు నీవే ఊపిరి పోసి
చూపవే దారి ఓ చిరుగాలి
కలలకు సైతం సంకెల వేసే
కలిమి ఎడారి దాటించాలి
తుంటరి తూనీగనై తిరగాలి
దోశెడు ఊసులు తీసుకువెళ్లి
పేద గరిక పూలకు ఇస్తా నా హృదయాంజలి
॥ మానస వీణ ॥

ప్రతి యుగంలో, ప్రతి దేశంలో, ప్రతి భాషలో పునరావృతమయ్యే అంశాలలో ప్రకృతి కవిత్వం ఒకటి. మన చుట్టూ ఉన్న సహజ ప్రపంచం, దాని వివిధ ప్రకృతి దృశ్యాలు, మారుతున్న ఋతువులు, దాని చుట్టుపక్కల దృగ్విషయాలను, అవ్యక్తంగా వాటిలో వున్న రహస్యాలను, వివరించాలనే తపన, ఉద్వేగం, కవిత్వంలో ఒక అనివార్యమైన భాగం. ప్రకృతిని కవితా వస్తువుగా, కవిత్వానికి ప్రేరణగా భావించడమే ప్రకృతి కవిత్వంగా నిర్వచించుకోవచ్చు. Nature is the best Teacher కాబట్టి ప్రకృతి సత్యాలు జీవితానికి వాస్తవ ప్రతీకలుగా, జీవన రాగాలుగా, వ్యక్తిత్వ వికాసానికి ఉత్తమ మార్గదర్శకాలుగా భావించవచ్చు. “The world is charged–energized, loaded, entrusted maybe even assailed—with God’s grandeur” అంటారు Gerard Manley Hopkins.

ప్రకృతి అంటే కేవలం మన కంటికి కనిపించేది కాదని, అది స్వర్గమనీ, చెవులకు వినిపించేది మాత్రమే కాదని, అది ఒక సామరస్యత అనీ, మనకి బాగా తెలిసినట్టే అనిపిస్తున్నా, ప్రకృతిలోని అనిర్వచనీయ అందాలను, simplicityని వర్ణించే సమర్థత మన జ్ఞానానికి లేదనీ Emily అంటారు.

‘Nature’ is what we see-
The Hill-the Afternoon-
Squirrel-Eclipse-the Bumble bee-
Nay-Nature is Heaven-
Nature is what we hear-The Bobolink-the Sea-Thunder-the Cricket-
Nay-Nature is Harmony-
Nature is what we know-
Yet have no art to say-
So impotent
Our Wisdom is
To her Simplicity.-Emily Dickinson

‘హృదయాంజలి’ చిత్రంలో ఏ ఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో చిత్ర – బృందం పాడిన, సిరివెన్నెల రచన, ‘మానస వీణ మౌన స్వరాన’, చాలా పెద్ద మ్యూజికల్ హిట్. హిట్లర్ లాంటి తండ్రి అలనా పాలనలో, భరించలేనన్ని కట్టుబాట్లతో, హీరోయిన్ ఎంతో frustrate అయిపోయి, మనసు నిరంతరం స్వేచ్ఛను కోరుకుంటు ఉంటుంది. ఆనందం తప్ప తన జీవితంలో కావాల్సినవన్నీ ఉంటాయి. ఆనందాలను వెతుక్కుంటూ, అందమైన ప్రకృతి ఒడిలోకి తాను వచ్చినప్పుడు, బ్యాక్‌గ్రౌండ్‌లో మనకు ఈ పాట వినిపిస్తుంది. చిత్రీకరణ మొత్తం అందమైన ప్రకృతి నేపథ్యంలో సాగుతుంది. ప్రకృతితో ఒక మనసు చేసే మౌన విన్నపాలను ఈ పాట మనకు అందిస్తుంది.

పల్లవి:
మానస వీణ మౌన స్వరాన ఝుమ్మని పాడే తొలి భూపాలం
మానస వీణ మౌన స్వరాన ఝుమ్మని పాడే తొలి భూపాలం
పచ్చదనాల పానుపు పైన అమ్మై నేల
జోకొడుతుంటే
పచ్చదనాల పానుపు పైన అమ్మై నేల
జోకొడుతుంటే ॥ మానస వీణ॥

వాయిద్యాలతో(instrumental music) వినిపించే ‘కౌసల్యా సుప్రజా రామా’ తో పాట ప్రారంభమవుతుంది. మనసు ఆనందంగా ఉన్నప్పుడు, బాహ్యమైన చెవులకి కాకుండా, మౌనస్వరంతో మానసవీణ స్వరాలను వినిపిస్తూ ఉంటుంది. ఆ మౌనరాగం, భూపాల రాగాన్ని (ఉదయ రాగం) వినిపిస్తూ.. ఎలా? ఝుమ్మని.. ఉల్లాసవంతంగా వినిపిస్తూ.. మన ఆనందాలకూ, అనుభూతులకు మేలుకొలుపు పాడుతూ ఉంటుంది. అసలు మాటలకు అందని భావాలను అందించగలిగేది మౌనం మాత్రమే. ప్రేమికుల మధ్య మౌనం.. మౌనంగా మనసు పాడిన వేణుగానాన్ని వినిపిస్తుంది. ధ్యాన సాధనలోని మౌనం విశ్వంతో, సృష్టికర్తతో సంభాషించగలుగుతుంది. ప్రకృతిలోని అద్భుతాలన్నీ మౌనంలోనే, మౌనంతోనే ఆవిష్కృతమవుతాయి, అందుకే మౌనమే నీ భాష ఓ మూగ మనసా అని పాడుకుంటాం.

పచ్చదనాల పానుపు పైన భూమాతే అమ్మగా మారి, జో కొడుతుంటే.. మనసు మరి ఎన్ని రాగాలు ఒలికిస్తుందో.. సిరివెన్నెల గారికే తెలియాలి. తల్లి లేని పిల్లగా పెరగడం వల్ల హీరోయిన్.. ప్రకృతిలో ఆ ప్రేమను వెతుక్కుంటుంది. ఈ పల్లవి వింటే ‘నీల్ గగన్ కే తలే.. ధర్తీ పే ప్యార్ ఖిలే’, గుర్తొస్తుంది. Green planet గా పిలువబడే ఈ భూగోళంలో పచ్చదనపు అందాలు.. అనిర్వచనాలు!

చరణం:
పున్నమి నదిలో విహరించాలి..
పువ్వుల ఒళ్లో పులకించాలి
పావురమల్లే పైకెగరాలి
తొలకరి జల్లై దిగిరావాలి
తారల పొదరింట రాతిరి మజిలి
వేకువ వెనువెంట నేలకు తరలి
కొత్త స్వేచ్ఛకందించాలి నా హృదయాంజలి..

అలా wild beautyని చూసి మనసు వశం తప్పిపోయిన హీరోయిన్ అదుపు లేని స్వేచ్ఛను, ఆనందాలని కోరుకుంటుంది. పున్నమి వెన్నెల ఒక నదిలా ప్రవహిస్తే, ఆ నదిలో ఓలలాడాలని, పువ్వుల ఒడిలో పులకించి పోవాలనీ ఆమె ఆశిస్తుంది. ఇది పూర్తిగా ఒక surrealistic poetry. ఇందులో మనకు pure Romantic school of thought కనిపిస్తుంది. పావురంలా గగనంలో విహరించాలనీ, ఆ మబ్బుల్లో నుండి తొలకరి జల్లై నేలకు దిగి రావాలనీ, ఆ నేల ఆర్తిని తీర్చాలనీ.. తారల పొదరింట్లో నిదురించాలనీ.. వేకువతో పాటుగా నేలకు తరలివచ్చి.. ‘కొత్త స్వేచ్ఛకందించాలి నా హృదయాంజలి’, అని మనసారా తాను కోరుకుంటుంది. తను కోరుకునే స్వేచ్ఛా స్వర్గానికి మనసారా అంజలి ఘటిస్తోంది హీరోయిన్. తన ఊహలు ఎలా పరిగెడుతుంటే, అలా జీవించడానికి ఆమె ఆశ పడుతోందని సిరివెన్నెల మనకు చెప్పకనే చెబుతున్నారు. ఆమె మనసు స్వేచ్ఛకై ఎంత ఆరాట పడుతుందో, ఈ చరణంలో మనకు ఆయన వివరిస్తున్నారు.

దాదాపు ఇలాంటి భావాన్నే, Theo Williams ‘Nature’s Lullaby’ లో కూడా మనం చూడవచ్చు.

Sounds of singing birds so early in the morn
Is a beauty in life that no one can adorn.
Soothing peace of waves gently caressing the sand
……….
Surrounded by nature’s love, most peaceful escape.
…………..
To nature’s love and heart I surrender.
I lay my head down and say goodbye
To nature’s beauty; my sweet lullaby..

కోరస్:
తూగే వాగు నా నేస్తం చెలరేగే వేగమే ఇష్టం మనలాగే నింగికే నిత్యం ఎదురేగే
పంతమే ఎపుడూ నా సొంతం ॥ 2 ॥

తుళ్ళి పడే వాగు తన నేస్తమనీ, దాని ప్రేరణతో తాను కూడా చెలరేగి పోవాలనీ కోరస్ మనకు వినిపిస్తుంది. ‘మనలాగే నింగికే నిత్యం ఎదురేగే పంతమే ఎపుడూ నా సొంతం’.. అనే వాక్యం ద్వారా, జీవితంలో రాజీ పడకుండా, పోరాటానికి నిత్యం ఎదురెళ్ళే పంతం ప్రతివారికి సొంతమవ్వాలని సిరివెన్నెల చెప్పకనే చెబుతున్నారు.

చరణం:
ఊహకు నీవే ఊపిరి పోసి
చూపవే దారి ఓ చిరుగాలి
కలలకు సైతం సంకెల వేసే
కలిమి ఎడారి దాటించాలి
తుంటరి తూనీగనై తిరగాలి
దోశెడు ఊసులు తీసుకువెళ్లి
పేద గరిక పూలకు ఇస్తా నా హృదయాంజలి

మనిషికి ఊపిరి పోసే గాలే, తన ఊహలకు కూడా కూడా ఊపిరి పోసి, ఆ ఆశలు నెరవేర్చుకునే దారిని కూడా చూపమని హీరోయిన్ గాలికి విన్నవించుకుంటుంది. ఎంతో ధనవంతుల అమ్మాయి కావడం వల్ల, ఆమె జీవితమంతా restrictions అనే సంకెళ్ళలో చిక్కుకుపోయి ఉంటుంది. అందుకే ఆమె, కలలు కనే తన స్వేచ్ఛను కూడా హరించే ఈ సిరి సంపదలు – తన ఆశలు తీర్చలేని, ఈ ఎడారి వంటి కలిమి సంకెళ్లు తెంచమని కూడా కోరుకుంటోంది. ఒక తుంటరి తూనీగ లాగా మనసుకు నచ్చిన చోట తిరగాలనీ, ఈ ఊసులన్నీ పోగేసుకుని వెళ్లి పేద గరిక పూవులతో పంచుకుని, హృదయాంజలి అర్పిస్తానని తన ఆశాభావాన్ని వెలిబుచ్చుతుంది, హీరోయిన్.

గరిక పూల పేరు వినగానే నాకు ఏకవీర చిత్రంలోని /ఏ పారిజాతమ్ములీయగలనో.. సఖీ గిరి మల్లికలు తప్ప.. గరికపూవులు తప్ప ఏ కానుకలను అందించగలనో.. చెలీ గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప/ అన్న సినారె గారి సాహిత్యం; / గరిక పూవున నిలచి, గగనమును కాంచుచూ, నీ రాకకై నేను వేచితిని కృష్ణా/ అన్న దుర్గారావు గారి కవిత గుర్తొస్తాయి.

గడ్డి పువ్వుకైనా దాని సొగసు, దాని విలువ దానికి ఉండనే ఉంటాయి. పచ్చని పచ్చికపై, తెల్లగా మెరుస్తూ చిన్న గరిక పూలు కూడా మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

మొత్తం మీద ఈ పాటలో ప్రకృతిని చూస్తూనే వయసుతో సంబంధం లేకుండా మనిషికి కలిగే ప్రేమావేశాన్ని, హర్షాతిరేకాల్ని, సిరివెన్నెల మన మనసులపై స్పష్టంగా చిత్రీకరించారు. ఆ ప్రకృతి చిత్రాలు, పున్నమి (వెన్నెల) నది, తారల పొదరిల్లు, తొలి వేకువ, తొలకరి జల్లు, పచ్చని తివాచీలు, గరిక పూలు, తుంటరి తూనీగ.. ‘సిరావెన్నెల’ రంగుల్లో ముంచిన తైల వర్ణ చిత్రాల్లా మన ఊహల్లోకి వచ్చి మనపై గుప్పెడు ఊసుల్ని దోసిళ్ళతో పంచుతూనే ఉంటాయి. మన దోసిలి పట్టి, ఆ ఊసుల్ని ఒడిసి పట్టి, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి హృదయాంజలి ఘటించడమే తరువాయి.

Exit mobile version