[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]
కాన్వెంటులో కాలేజ్లో ఏం నేర్చుకున్నాం
~
చిత్రం: ఇష్టం
సంగీతం: డీజే గోపీనాథ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎస్పీ బాలసుబ్రమణ్యం
~
పాట సాహిత్యం
కాన్వెంటులో కాలేజ్లో ఏం నేర్చుకున్నాం మనమసలు
Footpath లో food వేటలో నా అక్షరాభ్యాసం మొదలు
అడుగు అడుగు ఒక అవసరం, విషమ పరీక్షలే అనుదినం
ఎదురుపడిన బేతాళ ప్రశ్నలకు బదులు పలకనిదే కదలవు ముందుకు
బతుకు ఒళ్ళో చదువు అంటే వరద ఒళ్ళో ఎదురీతే ॥ కాన్వెంటులో ॥
చరణం:
ఎంత కష్టపడి సొంత తిండి తిని ఆకల్లో రుచి తెలుసుకున్నా
కటిక నేలపడి ఒళ్ళు అలసి నిదురోయే హాయిని కలసుకున్నా
జన్మలోనే తొలిసారి చెమట పరిమళాన్ని చూస్తున్నా
ఫ్రీడం మన పాలసీ మనమే మన ఫాంటసీ
ఎవ్వరి వెనకనో నీడగ నిలబడి పడుండాలా మనం
యవ్వన తరుణము రవ్వలు చిమ్మతే తలొంచాలీ జనం కేరాప్ గాళ్ళుగ బతుకమురా..
yes, We Have our own dress & address ॥ కాన్వెంటులో ॥
చరణం :
చేజారాకే తెలిసింది గతకాలంలోని సౌందర్యం దూరం నుంచి పిలిచింది అనుబంధంలోని మాధుర్యం
మార్గం మన మొండితనం దీపం మన గుండె బలం
కోరిన విలువలు చేతికి దొరకవ ఆదీ చుద్దాం చలో చలో
జారిన వెలుగులు తళ తళ వెలగవ జ్వలించే కళ్ళలో
రేయే తెలియని సూర్యుడినౌతా, మాయే తగలని మెలకువనౌతా ॥ కాన్వెంటులో ॥
♠
విద్య అనేది శిక్షణ ద్వారా లభించే జ్ఞానము. కోటి విద్యలు కూటి కొరకే కాబట్టి, ధనార్జనకు- చేతి పనులో, కళలో, వృత్తిపరమైన లేదా సాంకేతిక పరమైన skills/ నైపుణ్యాలు ప్రతి వారికి కావాలి.
అవన్నీ విద్యలే. పుస్తకాల ద్వారా, గురుముఖత పొందే జ్ఞానాన్ని చదువు అనుకోవచ్చు. సంస్థాగత విద్య అనేది నిజమైన విద్య కోసం పొందే జ్ఞానమూ, శిక్షణలకు పునాది మాత్రమే. విద్యా సంస్థల portals నుండి బయటకు వచ్చిన తర్వాతే నిజమైన విద్య ప్రారంభమవుతుంది. ఇది లైబ్రరీలో పుస్తకాలు చదవడంతో మొదలై, జీవితాన్ని, ప్రపంచాన్ని చదవడమే కాక ప్రకృతిలోని సత్యాలను అర్థం చేసుకోవడానికి మేధోపరమైన ఆలోచనలతో ముందుకు సాగుతుంది. బడి చదువు తరువాతే, బతుకు చదువు ప్రారంభమవుతుంది.
బ్రతుకు బడిలో చదువుకున్నవాడే అన్ని ఒడిదుడుకులనూ తట్టుకుంటూ, జీవితంలో ముందుకు సాగిపోగలడు.
Life Is A Lesson- అనే thought provoking poemలో Jerely జీవితాన్ని ఇలా నిర్వచించడం జరిగింది.
Life is a lesson full of adventures
to ride it is a product of
achievement and joy, suffer and pain..
………………..
but people always choose the easy route
rather than the hard route that will only
make them overwhelmed and uncomfortable,
though uncomfortable things will only l
et you G-R-O-W once you give it a G-O-
Το C-H-A-N-G-E is a M-U-S-T and so is to be a better self..
జీవితం నేర్పే పాఠాలు కఠినంగా ఉన్నా, ఇబ్బందికరంగా ఉన్నా, మనల్ని మనం ఉన్నతీకరించుకోవాలంటే మార్పు తప్పదనీ, సంతోషం, దుఖం, చింత, ఉత్సాహం, నిరుత్సాహం, ఆశ-నిరాశలు అన్ని కలగలిపిన సాహస యాత్రే జీవితమని దీని సారాంశం.
~
“నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే ఎవ్వరో విడిపించరుగా”..
అనే పాటలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కూడా.. “బతుకంటే బడి చదువా? అనుకుంటే అతి సులువా? కష్టపడినా, పడినా, జాలి పడదే కాలం మనలాగా..” అంటారు. బడి చదువు కన్నా, బ్రతుకు చదువే చాలా కష్టమైనది ఎందుకంటే బడిలో చదువు నేర్పి పరీక్షలు పెడితే, .. ‘బ్రతుకు బడి’, పరీక్షలు పెడుతూ చదువు నేర్పుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే.
~
‘మనసిచ్చి చూడు’ చిత్రంలో కథాంశానికి అనుగుణంగా, పుస్తకాల్లో అసలైన చదువు లేదని.. అది ఒకరి నైపుణ్యాలల్లో దాగి ఉందని, సవివరమైన సందేశాత్మక గీతాన్ని సిరివెన్నెల రచించారు. అది ఇలా సాగుతుంది..
‘బోడి చదువులు వేస్టు/నీ బుర్రంతా భోంచేస్తూ..
ఆడి చూడు క్రికెట్టు/టెండూల్కర్ అయ్యేటట్టూ..’
అని పాట పల్లవిని మొదలుపెట్టి, నిజ జీవితానికి కావలసిన అసలైన విద్యను తర్వాత చరణాల్లో వివరించారు..
‘మార్కుల కోసం ఏడవలేదుర ఎదిగిన ఏ సైంటిస్టూ
గుర్తుపట్టరా ఏ రంగంలో ఉందో నీ ఇంట్రస్టూ
నీక్కూడా ఉండే ఉంటుంది ఏదో ఒక టాలెంటు
నీకు నువ్వు బాసవ్వాలంటే దాని బయట పెట్టు
రేసు హార్సువై లైఫును గెలిచే పరుగు మొదలుపెట్టు..
ఓరి ఇన్నోసెంటు స్టూడెంటు..’
అంటూ, ఇలాంటి అద్భుతమైన హితోక్తిని యువతకు అందించారాయన.
ఈ రోజు మనం చర్చించబోతున్న ‘ఇష్టం’ చిత్రంలోని ‘కాన్వెంటులో, కాలేజ్లో ఏం నేర్చుకున్నాం మనమసలు’ అనే పాట కథానాయకుడి అంతరంగాన్ని వివరిస్తుంది. బాగా ధనిక కుటుంబానికి చెందిన హీరో కార్తీక్ (చరణ్), చదువుపై ఎలాంటి శ్రద్ధాసక్తులు లేకుండా, స్నేహితులతో కలిసి సరదాగా కాలం గడుపుతూ, విలువలకు పెద్ద ప్రాధాన్యతనివ్వకుండా జీవితాన్ని గడుపుతుంటాడు. ఒకానొక సందర్భంలో, ఒక స్నేహితుడి ఇంట్లో తలదాచుకోవలసి వస్తుంది. తండ్రి అండలేని ఆ సంసారం, తల్లి రెక్కల కష్టం మీద నడుస్తున్నా, అది ఏ మాత్రం పట్టించుకోకుండా, తన సరదాలు, తన తీరు తనదే అంటూ తిరిగే స్నేహితుడిని చూసి, తన ప్రవర్తనను కూడా అర్థం చేసుకుంటాడు. పరివర్తన చెందిన స్థితిలో, స్నేహితుడితో కలిసి సంపాదన కోసం రకరకాల మార్గాలు వెతికి, చివరకు పీజా డెలివరీ బాయ్‌గా పనిచేస్తుంటాడు. ఆ పరిస్థితిలో, హీరో మనస్తత్వాన్ని చిత్రీకరిస్తూ సిరివెన్నెల వ్రాసిన పాట ఇది.
పల్లవి:
కాన్వెంటులో కాలేజ్లో ఏం నేర్చుకున్నాం మనమసలు
Footpathలో food వేటలో నా అక్షరాభ్యాసం మొదలు
అడుగు అడుగు ఒక అవసరం, విషమ పరీక్షలే అనుదినం
ఎదురుపడిన బేతాళ ప్రశ్నలకు బదులు పలకనిదే కదలవు ముందుకు
బతుకు ఒళ్ళో చదువు అంటే వరద ఒళ్ళో ఎదురీతే ॥ కాన్వెంటులో ॥
తను ఇంతకుముందు గడిపిన జీవితంలోని ఊహల ప్రపంచాన్ని, ఇప్పుడు తను చూస్తున్న నిజమైన ప్రపంచాన్ని పోల్చుకుంటూ, హీరో బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ పాట మనకు వినిపిస్తుంది. ఉద్యోగం కోసం వేటాడుతూ, వీలున్న చోట తింటూ, ఫుట్‌పాత్ మీద తిరుగుతూ ఉన్నప్పుడు, జీవితానికి నిజంగా అవసరమైన, అసలైన అక్షరాభ్యాసం జరిగిందని హీరో గ్రహిస్తాడు. ప్రతి అడుగునా తిరస్కారాలు, కఠిన పరీక్షలు ఎదురవుతున్నప్పుడు, కాలేజీలో పరీక్షలు అయితే ఎగరగొట్టి తిరగొచ్చు కానీ.. నిజజీవితంలోని బేతాళ ప్రశ్నలు.. సమాధానమివ్వకుంటే పక్కకు తొలగవని అర్థం చేసుకుంటాడు. ఈ సందర్భంలో సిరివెన్నెల మనసుకు హత్తుకునే ఒక నిర్వచనాన్ని మనకు ఇస్తున్నారు. ‘బతుకు ఒళ్ళో చదువు అంటే వరద ఒళ్ళో ఎదురీతే’ ..అనుభవ సారాన్నంత ఒక్క వాక్యంలో నింపి, బ్రతుకు బడిని, వరద ఒడితో పోల్చి ఎంతో చక్కటి ఉపమానాన్ని మనకు అందిస్తున్నారు.
చరణం:
ఎంత కష్టపడి సొంత తిండి తిని ఆకల్లో రుచి తెలుసుకున్నా..
కటిక నేలపడి ఒళ్ళు అలసి నిదురోయే హాయిని కలసుకున్నా
జన్మలోనే తొలిసారి చెమట పరిమళాన్ని చూస్తున్నా
ఫ్రీడం మన పాలసీ మనమే మన ఫాంటసీ
ఎవ్వరి వెనకనో నీడగ నిలబడి పడుండాలా మనం
యవ్వన తరుణము రవ్వలు చిమ్మతే తలొంచాలీ జనం
కేరాప్ గాళ్ళుగ బతుకమురా..
Yes; We Have our own dress & address
ఇక చరణంలోకి వచ్చేసరికి individuality లోని సౌందర్యాన్ని, ఆనందాన్ని సిరివెన్నెల వివరిస్తున్నారు. ఆకలి రుచి తెలియాలంటే, సొంతంగా కష్టపడి సంపాదించుకొని తిని చూడాలి! ఈ ఆధునిక యుగంలో, Dragon Parenting ఒక fashion గా, passion గా మారి, పిల్లలకు డబ్బు విలువ కానీ, వస్తువులు విలువ కానీ, ఆహారపు విలువ కానీ, బాంధవ్యాల విలువ కానీ, ..చివరకు విలువల విలువ కానీ తెలియకుండా పెరుగుతున్నారు/ పెంచబడుతున్నారు! ఇప్పట్లో ఎక్కువ మందికి ఆహారాన్ని వృథా చేయడం తప్ప, ఆకలితో అలమటించిపోవడం తెలియదు. శ్రమ పడిన తర్వాత వచ్చే నిద్రలోని సుఖం తెలియదు. చెమట పట్టే అవకాశం ఇవ్వకుండా, ఏసీ గదుల్లో కాలాన్ని గడుపుతున్నారు. ఇలాంటి practical situationలను తన సాహిత్యం ద్వారా అందరి ముందు పెట్టి, ఆలోచించమని, ఆలోచనల కవాటాలు తెరుస్తున్నారు సిరివెన్నెల.
ఆర్థిక స్వేచ్ఛ కావాలనుకుంటూ, ఎవరి కాళ్ళకిందో బ్రతికితే ఫ్రీడమ్ అనేది ఒక fantasy అవుతుందంటారు సిరివెన్నెల. ఆకలి రుచిని, నిద్ర సుఖాన్ని, చెమట వాసనని తొలిసారి చవిచూసిన హీరో అంతరంగం నుండి గట్టి నిర్ణయాలు బయటికి వస్తాయి. ఇవన్నీ ఆలోచించిన తర్వాత, ఎవరి కేరాఫ్ అడ్రస్‌తో బ్రతక కూడదని, స్వతంత్ర జీవనం గడపాలని, మనకంటూ ఒక డ్రస్సు, అడ్రస్సు ఉండాలని గట్టిగా హీరో నిర్ణయించుకున్నట్టుగా ఆయన మనకు పాటలో తెలియజేస్తారు.
చరణం:
చేజారాకే తెలిసింది గతకాలంలోని సౌందర్యం దూరం నుంచి పిలిచింది అనుబంధంలోని మాధుర్యం
మార్గం మన మొండితనం దీపం మన గుండె బలం
కోరిన విలువలు చేతికి దొరకవ ఆదీ చుద్దాం చలో చలో
జారిన వెలుగులు తళ తళ వెలగవ జ్వలించే కళ్ళలో
రేయే తెలియని సూర్యుడినౌతా మాయే తగలని మెలకువనౌతా..
తల్లిదండ్రులకు, సౌకర్యాలకు దూరంగా జీవితాన్ని గడుపుతున్నప్పుడు, స్నేహితులు, సుఖాలు దూరమైనప్పుడు, చేజారిన అందమైన గతం పదే పదే గుర్తుకు వస్తుంది. అందులోని సౌందర్యం తెలిసి వస్తుంది. అమ్మ మీద అలిగి, ఇంటి నుండి బయటకు వచ్చేశాక, అమ్మ ప్రేమ మాధుర్యం తన మనసుని మరిగిస్తుంది. ఆ తీయటి అనుబంధానికి అర్థం అవగతమవుతుంది.
అనుకున్నదేదైనా సాధించాలంటే, పట్టుదల కావాలి. తన మాటల్లో సిరివెన్నెల ఇలా అంటారు. /మార్గం మన మొండితనం దీపం మన గుండె బలం/, మొండితనం అనే బాటలో, గుండె బలం అనేది దీపాన్ని పట్టుకుని, పయనం కొనసాగించాలట! అలా పయనాన్ని ముందుకు సాగించినప్పుడు, చేజారిన విలువలు, దూరమైన వెలుగులు అన్నీ చేరువవుతాయని, సిరివెన్నెల మనకు మార్గదర్శనం చేస్తున్నారు.
హీరోలో వచ్చిన పరివర్తనకు, జనించిన పట్టుదలకు అద్దం పడుతూ.. /రేయే తెలియని సూర్యుడినౌతా, మాయే తగలని మెలకువనౌతా/ అంటున్నారు. నిరంతరం జ్వలించే సూర్యుడిలా, రాత్రి అనే చీకటికి కూడా కట్టుబడకుండా, మాయలో చిక్కుపడకుండా, మెలకువగా ఉంటానని హీరో చెప్పడం ఎంతో సందర్భోచితంగా ఉంటుంది. జీవితపు విలువలు, మమతల మాధుర్యాలు తెలియని చీకటిలో నుండి బయటపడిన నాయకుడు, ఇక ఎన్నటికీ, ఏ మాయలో చిక్కుకోకుండా, అందమైన జీవితాన్ని గడపాలని నిర్ణయం తీసుకుంటాడు.
Only Real Education Makes a Person Complete అనే poemలో T. A. Ramesh ఇలా అంటారు.
Education in four walls of schools is a
prison house learning only sans freedom sure;
To know value of freedom and joy,
all have to live in Nature both for joy and sorrow in life;
With that great experience only, maturity
of mind, development of heart and spirit
take place!
ఈ పాటలో సిరివెన్నెల అందించిన విలువైన ఆణిముత్యాలు ఎన్నో! ఇది ఆయన ప్రపంచ జ్ఞానానికి, అర్థం పడుతుంది. నిజమైన జ్ఞానులకు simplicity ఒక ఆభరణం. సత్యాన్ని ప్రత్యక్షంగా గ్రహించిన వారికి పదాలను కాయిన్ చేయడం అందమైన పదబంధాలతో పాఠకుల grey- matterని కాక, మనసులను స్పృశించేలా చేయడం పెద్ద విషయమేమీ కాదు. వారి సత్య దర్శనం యొక్క వ్యక్తీకరణలు ఎంతో సరళంగా ఉంటాయి. పిల్లల వంటి సరళత స్వీయ-సాక్షాత్కార జ్ఞాని యొక్క స్వభావం. తన సాహిత్యం ద్వారా practical problems/situation లకు మరింత practical solutions/guidance అందివ్వగలిగిన ప్రపంచానుభవం సిరివెన్నెల సీతారామశాస్త్రిగారిది.
తన ఆలోచనలు, మార్గాలు, హితోపదేశాలు, ప్రేరణలను అత్యంత సరళతతో, అందరి హృదయాలను ఆకర్షిస్తూ అందించే తత్వవేత్తగా ఎందరో జీవితాలను ఆయన సాహిత్యం మేల్కొల్పింది! అత్యంత శక్తివంతమైన విద్యుత్ ప్రవాహాన్ని అందించే రాగి తీగ వంటి కవనం ఆయనది. ఆ సాహితీ ప్రకాశంలో మనందరి జీవితాలు ఆనందంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తూ, సిరివెన్నెల గారికి ఇదే నా హృదయాంజలి!
శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ గారు ఆంగ్ల అధ్యాపకురాలు, వ్యక్తిత్వ వికాస నిపుణురాలు, గీత రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు(తెలుగు-ఇంగ్లీష్-హిందీ), సామాజిక కార్యకర్త.