[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]
ఆరాటమా.. అతిగా తడబడకు
~
చిత్రం: కథా కమామీషు
సంగీతం: ఆర్ ఆర్ ధృవన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శంకర్ మహదేవన్
పాట సాహిత్యం
పల్లవి: ఆరాటమా.. అతిగా తడబడకు! ఆలోచనా.. సుడిలో పడకు! ఏదో అలా పడనీ ముందడుగు ఏ తోవలో తెలుసా అనకు! ఈ మనువనే మలుపులో ఇపుడిలా ఎన్నెన్నో ప్రశ్నలు రేపుతూ ఆగకు! ॥ఆరాటమా॥
చరణం : దడ దడమని కురవదా మరి తొలకరి మేఘం అది చినుకుల నడకల గతి తెలిపిన రాగం ఆ అలికిడే వినగా ఆనందమే కనగా కలవరమే కలగదుగా తడిసే ఇలకు! గుసగుసమని పలుకదు కదా మంగళ వాద్యం పరిణయమున పందిరికే సందడి సహజం కోలాహలమే కానీ గోలే అనరుగ దాన్ని? కల్లోలం అంటారా కళ్యాణాన్ని? ఈ చిలిపి వేడుకలను అనవసరపు గొడవనుకుని ఇకపై ఆరాటమా.. అతిగా తడబడకు! ఆలోచనా.. సుడిలో పడకు!
చరణం: కడవరకిక ముడి విడువక బిగిసిన సూత్రం ఇరు మనసులకొక మనుగడ అని పరమార్థం ఏడడుగులూ వేస్తూ నీ వెనుక తానొస్తే వెంటాడే వేటేమో అని భయపడకు! చిన చిన చిన తగవులకిది మొదలని సత్యం శృతి ముదరని జత చెదరని చెలిమికి సాక్ష్యం పేచీ పడే పంతం రాజీ పడే బంధం వియ్యంలో కయ్యాలే తియ్యని సమరం ఆ సంగతి వినమని ఆరాటమా.. అతిగా తడబడకు! ఆలోచనా.. సుడిలో పడకు!
♠
ఒక వ్యక్తి రోడ్డు పక్కన ఆదమరచి నిద్రపోతున్నాడు. అతని ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. ఆ రోడ్డు మీదుగా ఒక దొంగ వెళుతూ అతణ్ణి చూశాడు. బహుశా రాత్రి ఎక్కడో కన్నం వేసుంటాడు. దోచుకున్న సోమ్మంతా మోయలేక ఇక్కడిలా పడి ఉంటాడనుకున్నాడు. కొద్దిసేపటికి ఒక తాగుబోతు ఆ దారిన వెళుతూ పడుకున్న మనిషిని చూశాడు. బహుశా తప్పతాగి పడి ఉంటాడనుకున్నాడు. మరికొంతసేపటికి అదేమార్గంలో ఒక సాధువు వెళుతూ నిద్రపోతున్న ఆ మనిషిని చూసి, బహుశా ఈ మనిషి దైవధ్యానంలో పూర్తిగా మునిగిపోయి ఉంటాడు. అందుకే ఒళ్ళు తెలియని స్థితిలో ఇలా పడుకుని ఉన్నాడు, ఎంత అదృష్టవంతుడు! అనుకున్నాడు. మన స్వభావాన్ని బట్టే మన ఆలోచనలుంటాయి. దృష్టిని బట్టే సృష్టి ఉంటుందనేది మనందరికీ తెలిసిన సత్యం. సానుకూల దృక్పథంతో చూస్తే, ప్రతి వ్యక్తీ, పరిస్థితీ మనకు ఆనందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అలా కాకుండా, దేన్నైనా వ్యతిరేక దృష్టితో చూస్తే, మనసు అశాంతికీ, ఆందోళనకు ఆలవాలమవుతుంది. మనసును ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో చెపుతూ, రామకృష్ణ పరమహంస మనకు ఈ కథను వినిపించారు.
దీన్నే మానసిక పరిభాషలో మనం perception అని వ్యవహరిస్తూ ఉంటాం. ఈ పర్సెప్షనే మన జీవితాన్ని వరంగానో శాపంగానో మారుస్తుంది.
జీవితాన్ని ఏ దృక్కోణంలో చూడాలో తెలియజేస్తూ, సిరివెన్నెల వ్రాసిన వందల పాటల్లో ‘ఆరాటమా అతిగా తడబడకు’ ఒకటి.
నేరుగా ఓటీటీలో విడుదలైన ‘కథా కమామీషు’ చిత్రం పెళ్లయిన నాలుగు జంటల, వివాహానంతర సంఘటనల నేపథ్యంతో రూపొందింది. పెద్దల అంగీకారంతో జరిగిన పెళ్లి.. అందుకు వ్యతిరేకంగా జరిగిన పెళ్లి.. కొన్ని కారణాల వలన జరిగిన రెండో పెళ్లి.. ఇలా పెళ్లి అనేది ఆయా జంటలను ఎలా ప్రభావితం చేస్తుందనేది చెప్పడానికి దర్శక ద్వయం గౌతమ్ – కార్తీక్ ప్రయత్నించారు. ఒకే ఊరిలోని ఈ నాలుగు కుటుంబాల చుట్టూనే ఈ కథ తిరుగుతుంది.
సత్య (వెంకటేశ్ కాకుమాను) ఉష (హర్షిణి) ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. తల్లి ఆదరణ లేని కుటుంబం, పెళ్లి కాకుండా మిగిలిపోయిన అన్నలు వీరి వివాహ జీవితానికి ఆటంకాలుగా ఉంటారు. దివ్య – బాలు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారు. ప్రతిదీ పద్ధతి ప్రకారం జరగాలని ఆరాటపడి బాలు స్వభావం వల్ల వారి పెళ్లి తర్వాత జీవితంలో ఆనందం కొరవడుతుంది.
ఇక మూడవ జంట శ్రీధర్ – కల్పన (కరుణ కుమార్ – ఇంద్రజ) రెండో పెళ్లి చేసుకుంటారు. అప్పటికే ఇద్దరికీ పిల్లలు ఉంటారు. కల్పన అదే ఊర్లో పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటుంది. ఒక తోడు అవసరమనుకుని వాళ్లు పెళ్లి చేసుకుంటారు. ఆమెను అతిగా గౌరవించడం, ఆమె మనసుని సరిగ్గా గ్రహించలేకపోవడం వల్ల వారిద్దరి జీవితంలో ఎంతో నిశ్శబ్దం చోటు చేసుకుంటుంది.
ఇక కిరణ్ – స్రవంతి ప్రేమించుకుంటారు. అయితే వారి పెళ్లికి స్రవంతి తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత రావడంతో, ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటారు, కానీ పెద్దలను బాధపెట్టానన్న పశ్చాత్తాప ధోరణి వల్ల ఆ జంట పయనంలో కూడా ఆందోళన చోటు చేసుకుంటుంది.
ఈ కథా నేపథ్యాన్ని పాటలో చిత్రీకరిస్తూ, ఆ జంటల మధ్య ఏర్పడిన అసంతృప్తికి, ఆనందంగా గడపలేకపోతున్నామన్న ఆరాటానికి అద్దం పడుతూ, సిరివెన్నెల ఈ పాటను తెరకెక్కించారు.
పల్లవి: ఆరాటమా.. అతిగా తడబడకు! ఆలోచనా.. సుడిలో పడకు! ఏదో అలా పడనీ ముందడుగు ఏ తోవలో తెలుసా అనకు! ఈ మనువనే మలుపులో ఇపుడిలా ఎన్నెన్నో ప్రశ్నలు రేపుతూ ఆగకు ॥ఆరాటమా॥
ఆరాటపు పెళ్ళికొడుకు పేరంటాళ్ళ వెంట పడ్డాడన్నట్టు.. ఏదో ఒకటి సాధించాలన్న ఆరాటంలో మనిషి సహజంగా అయోమయంలో పడుతూ ఉంటారు. ‘లేని వాటి కోసం ఆరాటపడి ఉన్న వాటిని పోగొట్టుకుంటారని, కురుక్షేత్ర యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పాడట!’
ఆరాటాన్ని Browning, Elizabeth Bartett Human Life’s Mystery అనే poem లో ఇలా నిర్వచిస్తున్నారు.
..senses folding thick and dark About the stifled soul within, We guess diviner things beyond, And yearn to them with yearning fond; We strike out blindly to a mark Believed in, but not seen.
ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికీ, జీవితాన్ని ఆనందంగా గడపడానికీ ఆ జంటలు పడుతున్న ఆరాటాన్ని personify చేస్తూ, ‘ఆరాటమా! అతిగా తడబడకు!’ అని పాటని మొదలుపెట్టారు సిరివెన్నెల. ఏదైనా ఆరాటం ఉన్నప్పుడు, విపరీతంగా ఆలోచనల సుడిలో కొట్టుకుపోతాం. రకరకాల ప్రశ్నలతో ఎటు పోవాలో తెలియక సతమతమైపోతూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో, సిరివెన్నెల మనకు ఏ తోవలో అయినా సరే, ఎలా అయినా సరే, ముందుకు వెళుతూనే ఉండమనీ, మీనమేషాలు లెక్కపెట్టకండనీ చెబుతూ, జీవితంలో పెళ్లి అనేది ఒక గొప్ప అందమైన మలుపనీ, ఆ మలుపులో తడపడకుండా సాగిపోవాలనీ బలంగా మనకు సూచిస్తున్నారు.
చరణం: దడ దడమని కురవదా మరి తొలకరి మేఘం అది చినుకుల నడకల గతి తెలిపిన రాగం ఆ అలికిడే వినగా ఆనందమే కనగా కలవరమే కలగదుగా తడిసే ఇలకు! గుసగుసమని పలుకదు కదా మంగళ వాద్యం పరిణయమున పందిరికే సందడి సహజం కోలాహలమే కానీ గోలే అనరుగ దాన్ని? కల్లోలం అంటారా కళ్యాణాన్ని? ఈ చిలిపి వేడుకలను అనవసరపు గొడవనుకుని ఇకపై ఆరాటమా.. అతిగా తడబడకు! ఆలోచనా.. సుడిలో పడకు!
Truth is same but perceptions are different. ప్రకృతిలో ఒక్కో ఋతువులో జరిగే మార్పులన్నీ మనకు అందమైన సందేశాలను ఇస్తాయి. అయితే వాటిని సరిగ్గా చూడగలగడం మనం నేర్చుకోవాలి. పైకి కనిపించే gift wrapperని చూసి లోపల ఏముందో నిర్ణయించుకోవడం తప్పు కదా! దడ దడమని కురిసే తొలకరి మేఘం, చినుకుల గతిని వినిపించే రాగమట. ఆ చినుకుల రాగాల్ని భూమి ఆస్వాదించి నృత్యం చేస్తుంది కానీ, దాని గురించి ఆందోళన చెందదు కదా! భార్యాభర్తల మధ్య వచ్చే చిరు చిరు కోపతాపాలు, అలకలు, సమస్యలు, అదే విధంగా అర్థం చేసుకొని ముందుకు సాగిపోవాలన్నది సారాంశం.
Marriage is a dynamic and often contradictory concept అని అభివర్ణిస్తూ Benjamin Franklin లిఖించిన ఈ ఆంగ్ల సాహిత్యాన్ని ఒకసారి గమనించండి.
Unto a public crowd or common rout; Wedlock as old men note, hath likened been, Where those that are without would fain get in, And those that are within, would fain get out Grief often treads upon the heels of pleasure, Some by experience find these words misplaced, Marry’d in haste, we oft repent at leisure; Marry’d at leisure, they repent in haste..
మరో ఉదాహరణ తీసుకొని, పెళ్లి పందిరికి సందడే అలంకారమనీ, పెళ్లిలో మ్రోగే బాజాలు రహస్యంగా గుసగుసమని మోగవు కదా, హై సౌండ్ తోనే మోగినా ఎవరికీ చికాకు కలిగించవు కదా, దాన్ని ఎవరూ గోలగా పరిగణించరు కదా?
అలాంటప్పుడు, పెళ్లి తర్వాత జరిగే చిరు చిరు ఇబ్బందికర సంఘటనలకు కలత చందన అవసరం లేదు, అని బలంగా చెబుతున్నారు సిరివెన్నెల. దాన్ని గోలగా భావించకుండా అందమైన ఆస్వాదించమని సిరివెన్నెల సందేశం.
ఇలాంటి వాటినన్నిటిని చిరు సందళ్లు అనుకోవాలి కానీ, గోల అనుకొని, వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఆరాటపడకండని సిరివెన్నెల ఉపదేశిస్తున్నారు.
భారతీయ జీవన విధానంలో వివాహ బంధం యొక్క ప్రాముఖ్యతను ఎన్నో పాటల ద్వారా చాటి చెప్పిన సిరివెన్నెల ఈ పాటలో పెళ్ళికి చాలా అందమైన నిర్వచనం ఇస్తూ, పెళ్ళి పరమార్థాన్ని తెలియజేస్తున్నారు. రెండవ చరణంలో ప్రతి వాక్యంలోనూ వివాహ బంధాన్ని అభివర్ణించారు సిరివెన్నెల. నన్ను ఎంతో ఆకట్టుకున్న వాక్యం..
‘కడవరకిక ముడి విడువక బిగిసిన సూత్రం ఇరు మనసులకొక మనుగడ అని పరమార్థం’
వివాహం అనేది విడివడని ఒక శాశ్వత బంధం అని, రెండు మనసులు కలిసి మనుగడ సాగించడమే దాని పరమార్థమనీ, హృద్యంగా అక్షరబద్ధం చేశారు సిరివెన్నెల. మన వెన్నంటే నడుస్తూ ఉండే వ్యక్తిని చూసి, వెంటాడే వేటగా దాన్ని అపార్థం చేసుకోకూడదని హెచ్చరిస్తున్నారు. వివాహమనేది ‘శృతి ముదరని, జత చెదరని, చెలిమికి సాక్ష్యమట’. ఎంత గంభీరమైన అర్థంతో కూడిన వాక్యమో చూడండి! ఆధిపత్య పోరులాగా సాగుతున్న జంటలు జీవితంలో నేర్చుకోవాల్సిన కఠినమైన సత్యం.. పెళ్లంటే బలమైన స్నేహం!
చిరు చిరు గొడవలు, అలకలు, పంతాలు, ప్రతి జంటకు సాధారణమే కానీ, ‘పేచీ పడే పంతం రాజీ పడే బంధం’.. పెళ్ళి అంటూ జీవితానికి అందమైన compromising formula ను ఆయన అందిస్తున్నారు.
రెండు వేరువేరు కుటుంబాల నుండి ఒక్కటైన జంటలో ఎన్నో రకాల బేదాభిప్రాయాలు ఉండవచ్చు. భౌతికంగా మనషుల ముడి లాగా కనిపించే ఈ బంధం, నిజానికి ఒక మనసుల ముడి. రెండు మనసులు కలిసి చేసే ఒక ఆనందపు ప్రయాణం కాబట్టి, ‘వియ్యంలో కయ్యాలే తియ్యని సమరం’ అంటున్నారు సిరివెన్నెల. ఎలాంటి తీపి యుద్దాలని గొడవలు అనుకొని ఆవేశపడకండనీ, ఆరాటపడకండనీ.. అనుభవపూర్వకమైన సూచన చేస్తున్నారు.
ప్రేమ, ఆనందం, ఆవేశం, గమ్యం, మనసు, గెలుపు, నిరాశ, వంటి abstract concept లను పాటల రూపంలో అద్భుతంగా నిర్వచించిన సిరివెన్నెల, ఈ పాటలో వివాహబంధ ప్రాధాన్యత, పరిస్థితులను గ్రహించవలసిన దృక్కోణం కలగలిపి మరింత అందంగా మనకు అందించారు.
Images Source: Internet
శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ గారు ఆంగ్ల అధ్యాపకురాలు, వ్యక్తిత్వ వికాస నిపుణురాలు, గీత రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు(తెలుగు-ఇంగ్లీష్-హిందీ), సామాజిక కార్యకర్త.
You must be logged in to post a comment.
ఒక నీటి బిందువు
మరుగునపడ్డ మాణిక్యాలు – 63: హవర్డ్స్ ఎండ్
భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైన తొలి భారతీయ మహిళ శ్రీమతి సరోజినీ నాయుడు
కల్తీ కాలం
లోకల్ క్లాసిక్స్ – 25: భావజాలాల పట్టూ విడుపూ
నల్లటి మంచు – దృశ్యం3
‘కృష్ణ ఘట్టం’, ఒక విభిన్న ప్రయోగం
బూడిద కుప్పలో దాగిన ఆణిముత్యాలు ఆదిపురుష్ పాటలు
హోమ్ కమింగ్
మరుగునపడ్డ మాణిక్యాలు – 7: ఫ్లైట్
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®