[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]
బ్రహ్మలా నేనే నిను సృష్టించాననుకోనా
~
చిత్రం: గోపాల గోపాల
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: అనూప్ రూబెన్స్
గానం: సోనూ నిగమ్
~
పాట సాహిత్యం
పల్లవి:
బ్రహ్మలా నేనే నిను సృష్టించాననుకోనా
బొమ్మలా నువ్వే నను పుట్టించావనుకోనా నమ్ముకుంటుందో నవ్వుకుంటుందో
ఏమి అంటుందో నీ భావన
నీదే నీదే ప్రశ్న నీదే
నీదే నీదే బదులు నీదే ॥బ్రహ్మలా నేనే నిను॥
చరణం:
నీ దేహంలో ప్రాణంలా వెలిగే కాంతి నా నవ్వే అని
నీ గుండెల్లో పలికే నాదం నా పెదవిపై మురళిదని తెలుసుకోగలిగే తెలివి నీకుందే
తెరలు తొలిగిస్తే వెలుగు వస్తుందే
నీదే నీదే స్వప్నం నీదే
నీదే నీదే సత్యం నీదే ॥బ్రహ్మలా నేనే నిను॥
చరణం:
ఎక్కడెక్కడెక్కడని దిక్కులన్నీ తిరిగితే నిన్ను నువ్వు చూడగలవా
కరుణతో కరిగిన మది మందిరమున కొలువై నువ్వు లేవా
అక్కడక్కడక్కడని నీలి నింగి తడిమితే నిన్ను నువ్వు తాకగలవా
చెలిమిని పంచగ చాచిన చేయివైతే దైవం నీవు కావా
నీదే నీదే ధర్మం నీదే
నీదే నీదే మర్మం నీదే ॥బ్రహ్మలా నేనే నిను॥
♠
ఈ నవ నాగరిక యుగంలో దేవుడి పేరుతో జరుగుతున్న మోసాలు, గారడీలు చూస్తుంటే.. నిజంగా దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు వీటన్నింటినీ పట్టించుకోకుండా ఉన్నాడు? దుర్మార్గులను ఎందుకు శిక్షించడం లేదు? ఈ పాపాలకు అంతం ఎప్పుడు? అనే ప్రశ్నలు, మేధావులు, సన్మార్గుల మదిలో నిరంతరం కలవరం సృష్టిస్తూనే ఉంటాయి. ఈ సందర్భంలో మనకు దేవుడు చేసిన మనుషులు చిత్రం కోసం ఆచార్య ఆత్రేయ రచన..
‘దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం..
మనుషులనేవారున్నారా అని దేవుడి కొచ్చెను అనుమానం’.. గుర్తుకొస్తుంది.
అదే కాకుండా, ఉన్నావా? అసలున్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఈ లోకం కుళ్ళు చూడకున్నావా? అని మనం కూడా గొంతు శృతి కలిపి పాడుకోవాల్సి ఉంటుంది.
మరి ముఖ్యంగా దృశ్యశ్రవణం మాధ్యమాలు విచ్చలవిడిగా పెరగడంతో, అసంఖ్యాకమైన, అనారోగ్యకరమైన ఆధ్యాత్మికవేత్తలు పుట్టుకొచ్చి, ఎవరికి తోచిన రీతిలో వారు ప్రజల్ని మభ్యపెడుతూ, చిత్రవిచిత్ర పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ, అందినంత దండుకుంటూ, అయోమయంలో పడేస్తున్నారు. భక్తికి నిర్వచనమే మారిపోయింది. అసలైన భక్తికి, ఆధ్యాత్మికతకు ఆనవాళ్లు దొరకడం కష్టమైపోతోంది. తమ ఉనికిని నిజంగా తెలుసుకోవాలనుకునే సత్యాన్వేషకులకు నిజమైన మార్గదర్శకులు నూటికో, కోటికో ఒక్కరు దొరుకుతున్నారు. స్వచ్ఛమైన ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్న సంస్థలు అక్కడక్కడా మాత్రమే మనకు సరైన జ్ఞానాన్ని పంచుతున్నాయి. సరియైన జ్ఞాన దృష్టిని ప్రసాదించడంలో వాటి కృషి అవి చేస్తున్నాయి. భగవంతుని అసలైన తత్వాన్ని విప్పి చెప్పే ప్రయత్నాలలో ఇటీవలి కాలంలో P.K., ఖలేజా, శ్రీ ఆంజనేయం, గోపాల గోపాల.. వంటి చిత్రాలు, ప్రేక్షకుల దృష్టి కోణం పై కొంత ప్రభావాన్ని చూపాయి.
హిందీ చిత్రమైన Oh! My God! చిత్రానికి రీమేక్‌గా తెలుగులో ‘గోపాల గోపాల’ చిత్రం తెర మీద కొచ్చి ఎంతో మన్నన పొందింది. ఆ చిత్రంలో ‘మై తో నహీ హూ ఇన్సానోమ్మే..’ అనే పాట స్థానంలో సిరివెన్నెల ‘బ్రహ్మలా నేనే నిను సృష్టించాననుకోనా..’ పాటను వ్రాయడం జరిగింది.
కథా నేపథ్యానికి వస్తే, నాస్తికుడైన గోపాల్‌రావు (వెంకటేష్) మోసపూరితమైన మాటలు చెప్పి దేవుడి విగ్రహాలు అమ్ముకుని భక్తుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటుంటాడు. ఒకానొక సందర్భంలో దేవుడి ఉనికినే ప్రశ్నిస్తూ, ఒక భక్త కూటమిని చెదరగొట్టి, వారి భక్తిని అపహాస్యం చేస్తాడు. అదే రోజు రాత్రి సంభవించిన భూకంపంలో తన దుకాణం ఒక్కటే నేలమట్టమై, ఎనభై లక్షల అప్పుతో నడి వీధికి వచ్చేస్తాడు. Act of God వల్ల జరిగిన నష్టానికి తాము బాధ్యత వహించమని, బీమా మొత్తం చెల్లించడానికి బీమా సంస్థ అంగీకరించదు. ‘దేవుడి చర్య’ వల్ల జరిగిన నష్టం బీమాలో కవర్ అవదని అంటే.. తనకి జరిగిన నష్టాన్ని దేవుడే భర్తీ చేయాలని కోర్టుకి వెళతాడు. దేవుడి మిషన్లు నడిపే సంస్థలకి, దేవాలయాలకి, ట్రస్టులన్నిటికీ సమన్లు పంపిస్తాడు. గోపాల్‌రావు వాదనలో న్యాయం ఉందని అతని కేసుని కోర్టు స్వీకరిస్తుంది. అలాంటి సమస్యలు ఉన్న ఇతర పీడితులు ఎంతోమంది, గోపాల్‌రావుతో జత కడతారు. అయితే ఆ పేరుపొందిన స్వామీజీల భక్తులు గోపాల్రావుపై పగబట్టి, అతడిని చంపాలని చూస్తారు. అప్పుడు భగవంతుడే మనిషి రూపంలో (పవన్ కళ్యాణ్) వచ్చి గోపాల్రావుని కాపాడి, అతడికి దిశా నిర్దేశం చేస్తాడు.
అలా భూమి మీదికి వచ్చిన భగవంతుడు దేవుడి పేరుతో జరుగుతున్న రకరకాల వ్యాపారాలను, పూర్తిగా మారిపోయిన మనిషి మనస్తత్వాన్ని గమనించినప్పుడు, అతని అంతరంగంలో ఎన్నో ఆలోచనలు రేకెత్తుతాయి.
అటువంటి భావాలకు అక్షర రూపమే ఈ పాట.
ఆత్మసాక్షాత్కారం పొందగలిగిన అత్యుత్తమ బుద్ధి జీవిని తాను సృష్టిస్తే, భగవంతుడు నుండి, సత్యం నుండి దూరంగా సాగిపోతున్న ఈ మానవులను చూసినప్పుడు భగవంతుని మదిలో కలిగిన ఆవేదనను అనుభవించి ఈ పాట రూపంలో మనకు అందించారు సిరివెన్నెల.
హిందీ మాతృకను పరిశీలిస్తే, ఆ భావం ఇలా ఉంటుంది.
मैं तो नहीं हूँ इंसानों में, बिकता हूँ मैं तो इन दुकानों में मैं तो नहीं हूँ इंसानों में, बिकता हूँ मैं तो इन दुकानों में
दुनिया बनाई मैंने हाथों से मिट्टी से नहीं, जज़्बातों से फिर रहा हूँ ढूँढता
मेरे निशाँ है कहाँ? मेरे निशाँ है कहाँ? मेरे निशाँ..
हो-हो-हो, मेरे निशाँ (मेरे निशाँ) हो-हो-हो, मेरे निशाँ (मेरे निशाँ)..
మనుషుల అంతరాలలో నేను లేను, ఈ అంగళ్లలో అమ్మబడుతున్నాను.. ఈ చేతులతో నేను ఈ ప్రపంచాన్ని సృష్టించాను, మట్టితో కాకుండా భావోద్వేగాలు నింపి మిమ్మల్ని సృజించాను, అయినా నా ఉనికి కనరాక, వెతుకుతూనే ఉన్నాను.. నా ఉనికి ఎక్కడ? నా గుర్తులే కనరావడం లేదు ఇక్కడ.
మీ వెన్నంటి ఛాయలా నడిచానుగా, ఎండలో నీడగా నిలిచానుగా, సహప్రయాణికుడినై మీ రహదారులలో నిలిచానుగా, అయినా మీరు మాయా వలల్లో చిక్కుకుంటున్నారు, స్పష్టమైన కాంతిలో కూడా తికమక పడుతున్నారు, సమాధానాల్లో ప్రశ్నల్ని వెతుక్కుంటున్నారు, మీ ఉనికిని మీరు ఎక్కడ కోల్పోయారు? నా ఉనికి ఎక్కడ? నా గుర్తులే కనరావడం లేదు ఇక్కడ.
ఈ పక్షులకూ, పారే నీళ్లకు సృష్టికర్త నేనే, భూమి నుండి ఆకాశం వరకు అంతా నా కథే, నిన్ను కూడా సృష్టి చేసింది నేనే, అయినా మీరు నన్ను ఎందుకు విభజించి చూస్తున్నారు? మీ తలరాతలు కూడా నేనే వ్రాసి, శ్వాస నింపిన సజీవ చిత్రాలుగా తీర్చిదిద్దాను, అయినా, ఆ చిత్రాలు ఎందుకు మూగపోయాయి? నా ఉనికి ఎక్కడ? నా గుర్తులే కనరావడం లేదు ఇక్కడ.. ఇదీ హిందీ పాట సారాంశం.
ఇప్పుడు మన తెలుగు పాట సాహిత్యాన్ని పరిశీలిద్దాం.
పల్లవి:
బ్రహ్మలా నేనే నిను సృష్టించాననుకోనా?
బొమ్మలా నువ్వే నను పుట్టించావనుకోనా? నమ్ముకుంటుందో నవ్వుకుంటుందో
ఏమి అంటుందో నీ భావన
నీదే నీదే ప్రశ్న నీదే
నీదే నీదే బదులు నీదే ॥బ్రహ్మలా నేనే నిను॥
సృష్టికర్తగా, బ్రహ్మనై నేను మానవులను సృష్టించానని భావించుకోవాలా? లేక విగ్రహాల రూపంలో బొమ్మలా నన్ను తయారుచేసి, గుళ్ళల్లో ప్రతిష్ఠించి, మానవులే నన్ను పుట్టించారని భావించుకోవాలా? అన్న మీమాంసతో పల్లవి మొదలవుతుంది.
‘దేవుడు చేసిన మనుషుల్లారా.. మనుషులు చేసిన దేవుళ్ళారా..
వినండి మనుషుల గోల.. కనండి దేవుడి లీల
వినండి మనుషుల గోల.. కనండి దేవుడి లీల..’
అనే దాగుడుమూతలు చిత్రంలోని శ్రీశ్రీ రచన కూడా ఇదే భావాన్ని ప్రతిబింబిస్తుంది. జ్ఞానదృష్టితో పరిశీలించి సత్యాన్ని అవగాహన చేసుకోమని చెప్పటమే వీటి సందేశం.
సత్యం వేరు భావన వేరు. కళ్ళకు కనిపించేది సత్యం అయితే, మనసుకు అనిపించేది భావం. కాబట్టి, చెప్పింది నమ్ముతావో, లేక హాస్యంగా భావించి నవ్వుకుంటావో.. మీకే వదిలేస్తున్నానని ‘నీ ప్రశ్నలు నీవే ఎవరు బదులివ్వరుగా.. నీ చిక్కులు నీవే.. ఎవ్వరూ విడిపించరుగా..’ అనే సిద్ధాంతాన్ని పదేపదే మనకు గుర్తు చేస్తుంటారు సిరివెన్నెల. ఈ పాటలో కూడా మీ ప్రశ్నలకు నువ్వే, సమాధానాలు వెతుక్కోవాలి అన్న ఆధ్యాత్మిక పాఠంతో, స్వీయ అన్వేషణలోనే సత్యం వెలికి వస్తుందన్న.. ఉపనిషత్ సారాంశాన్ని జోడించారు సిరివెన్నెల.
చరణం:
నీ దేహంలో ప్రాణంలా వెలిగే కాంతి నా నవ్వే అని
నీ గుండెల్లో పలికే నాదం నా పెదవిపై మురళిదని తెలుసుకోగలిగే తెలివి నీకుందే
తెరలు తొలిగిస్తే వెలుగు వస్తుందే
నీదే నీదే స్వప్నం నీదే
నీదే నీదే సత్యం నీదే ॥బ్రహ్మలా నేనే నిను॥
ఎన్నో లక్షల జీవరాశుల్లో బుద్ధిజీవిగా ఒక్క మానవుడికి మాత్రమే జన్మ దక్కింది. తన అంతరాత్మలోని పరమాత్మను గుర్తించలేని అయోమయంలో మానవులు ఉన్నప్పుడు, మనిషిలో మనిషితనం మాయమైనప్పుడు, మానవుడిలో మానవత్వం మృగ్యమై పోయినప్పుడు, భగవంతుడు ఇలా ఉపదేశం చేస్తున్నాడు. నీ ఆత్మలోని జ్యోతి నేనే, నీ గుండెల్లో పలుకుతున్న నాదాన్ని నేనే. ఈ విషయాన్ని తెలుసుకోగలిగిన జ్ఞానాన్ని నీకు ప్రసాదించాను కదా? ఎందుకు అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నావు? అన్న ప్రశ్నలను ఎఱుక నేర్పే గురువుగా సిరివెన్నెల సంధిస్తున్నారు.
శుద్ధ చైతన్య స్వరూపమైన మన ఆత్మ దర్శనము, ఎదుట నిలిచిన దైవం రూపంలో జరిగేటప్పుడు మొదటగా కంటికి కానవచ్చేది అనంతమైన కాంతి, దాని తర్వాత వినిపించేది నాదం, చివరగా కనిపించేది భగవద్రూపం.. ఇలాంటి అనుభవైక సారాన్ని మొదటి రెండు వాక్యాల్లో, సరళమైన తెలుగు పదాలతో అందిస్తున్నారు సిరివెన్నెల. ఎంతటి జ్ఞాన ధార అది!
తెరలు తొలగిస్తే వెలుగు వస్తుంది! అనేది అమృత గుళిక వంటి మరో మహా వాక్యం. ఏ తెరలు తొలగించాలి? అజ్ఞానము, అవిద్య, అహంకారం.. అరిషడ్వర్గాల వంటి అంధకారాలను తొలగిస్తే, లోపల ఉన్న జ్ఞాన జ్యోతి ప్రకటితమవుతుంది. “Education is nothing but dis-‘covering’ the inner light..” అంటారు స్వామి వివేకానంద. మన inner light పై వున్న cover.. అడ్డుపొరను తొలగించడమే విద్య. కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను క్రమశిక్షణతో పనిచేయిస్తే, ఆ పొరలు తొలగిపోతాయి. దీనికి అకుంఠిత దీక్ష, సాధన, అవసరం.
‘నీదే నీదే స్వప్నం నీదే
నీదే నీదే సత్యం నీదే..’
మాయలో చిక్కుకొని, స్వాప్నిక జగత్తులో సంచరిస్తూ, తమస్సులోనే ఉండిపోతే తప్పెవరిది? స్వప్నం నీదైనప్పుడు, దాని నుండి బయటపడి, సత్యాన్ని తెలుసుకోవలసిన బాధ్యత కూడా నీదే కదా! అన్న బలమైన చురక అది! సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ! అన్న ఉపనిషద్వాక్య సారాంశమది. ఎంత విశిష్టమైన వేద సారాన్ని మనకు సినిమా పాటల సాహిత్య రూపంలో ఆయన అందిస్తున్నారో తలుచుకుంటే రోమాంచితమవ్వక తప్పదు! స్వప్నం సాకారమైతే సత్యం. ఆత్మసాక్షాత్కారం పొందాలన్న స్వప్నం మీద అయితే, దాన్ని ఆవిష్కరించుకొని పొందే ఫలితమే సత్యం!
చరణం:
ఎక్కడెక్కడెక్కడని దిక్కులన్నీ తిరిగితే నిన్ను నువ్వు చూడగలవా?
కరుణతో కరిగిన మది మందిరమున కొలువై నువ్వు లేవా?
అక్కడక్కడక్కడని నీలి నింగి తడిమితే నిన్ను నువ్వు తాకగలవా?
చెలిమిని పంచగ చాచిన చేయివైతే దైవం నీవు కావా?
నీదే నీదే ధర్మం నీదే
నీదే నీదే మర్మం నీదే॥బ్రహ్మలా నేనే నిను॥
ప్రశ్నలతోనే సమాధానాలు గ్రహింప చేయగలిగే techniqueలో సిరివెన్నెలకు, సిరివెన్నెలే సాటి! ఇక రెండవ చరణమంతా శరపరపరల్లాంటి ప్రశ్నలతో సాగుతుంది. నీ స్వస్వరూపాన్ని దర్శించాలంటే, ఆత్మలోనికి ప్రయాణం సాగించాలి.
నీ ఆత్మ శక్తిని గుర్తించిన నాడు నీకు దైవానికి భేదం లేదని నువ్వే దైవమని, అహం బ్రహ్మాస్మి అని అవగతమవుతుంది. నీ లోపలికి లో లోతులకు నీ సత్యాన్వేషణ సాగాలి. అంతేకానీ, బయటెక్కడో వెతికితే అది సాధ్యపడుతుందా? Empathy, sympathy, compassion వంటి humane లక్షణాలతో ఉన్న ప్రతి మనిషిలో కూడా మనం దైవాన్ని చూడగలం. Helping hands are better than the praying lips, అనే practical philosophyని సిరివెన్నెల అనునిత్యం మనకు అందజేస్తూనే ఉంటారు. శూన్యకాశంలో నిన్ను నీవు వెతుక్కోవడం ఎంత అవివేకం? అని ఆయన ప్రశ్నిస్తూ.. మానవత్వపు చెలిమిని ప్రదర్శించే హృదయం నీకుంటే, ఇతరుల బాధలకు నీ హృదయం స్పందిస్తే, మనసు ద్రవిస్తే, ఆ స్నేహంలో, ఆ కరుణలో, నీలోని భగవంతుడిని నీవు చూడలేవా? అని సమాధానాన్ని కూడా జత చేస్తున్నారు.
‘నీదే నీదే ధర్మం నీదే
నీదే నీదే మర్మం నీదే..’
మానవుడిగా పుట్టినవాడు, మానవుడిగానే రూపుదిద్దుకుంటూ, మానవ ధర్మాన్ని పాటిస్తూ, మాధవుడిగా ఎదగడమే, జీవిత సారం. అదే వేద సారం! సూక్ష్మీకరించడం మర్మం. అనంతమైన శక్తి సూక్ష్మంలోనే వుంది. సూక్ష్మంలోనే ఉంది మోక్షం! అన్న సత్యం మనకు తెలియనిది కాదు. వృక్షంలో ఉన్న బీజం మనందరికీ కనపడుతుంది, కానీ బీజంలోని వృక్షం గ్రహించాలంటే, ఎంత సూక్ష్మ పరిశీలన జ్ఞానం ఉండాలో, ఎంత అనుభవైక శక్తి ఉండాలో బీజవృక్ష న్యాయం మనకు తెలియజేస్తుంది.
మనలో ఉన్న దేవుడిని గుర్తించి, మనమే బయటకు రప్పించాల్సిన అవసరాన్ని, మార్గాన్ని ఈ చరణంలో ఆయన మనకు విశదపరిచారు. కృష్ణం వందే జగద్గురుం చిత్రంలో ‘జరుగుతున్నది జగన్నాటకం’.. పాటలో ‘నరుడి లోపలి పరుడిపై దృష్టిపరుపగా.. తలవంచి కైమోడ్చి శిష్యుడివి నీవైతే.. నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడివి నీవే..’ అని ఆత్మ పరమాత్మల అద్వైతాన్ని అలవోకగా బోధించినట్లు, ఈ పాటలోను అలాంటి అభివ్యక్తినే అందిస్తున్నారు, సిరివెన్నెల.
భావ స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యతనిచ్చే సిరివెన్నెల, కథ, చిత్రీకరణ, పాత్ర స్వభావాన్ని తనదైన శైలిలో ఆవిష్కరిస్తూ, nativity ఉట్టిపడేలా ఈ పాటను ఎంత సమర్థవంతంగా వ్రాసారో గమనించండి! తాను సృష్టించిన ప్రపంచంలో మానవుడు తన గుర్తులు, ఉనికి, విలువలు పోగొట్టుకున్నట్టు దేవుడు వాపోతాడు హిందీ మాతృకలో! సిరివెన్నెల తాను స్వతహాగా గొప్ప ఆశావాది కావడం, తన తత్వానికి భిన్నంగా సాహిత్యాన్ని వ్యక్తీకరించకపోవడం, మనందరికీ తెలుసు. అందుకే తను నమ్మే తత్వం ప్రకారం దేవుడు జీవుడు వేరు కాదనే అద్వైత తత్వాన్ని మరో మారు ఈ పాటలో ఆవిష్కరించారు. దైవ తత్వాన్ని ఎలా చూడాలి? మన దృష్టి కోణాన్ని ఎలా మార్చుకోవాలి? పురాణ పురుషుల వ్యక్తిత్వాలనుండి ఏమి నేర్చుకోవాలి? మనల్ని మనం ఎలా తీర్చుకోవాలి? అని ఎంతో logical గా అందరినీ, మరి ముఖ్యంగా యువతనీ convince చేశారు సిరివెన్నెల. భగవంతుని మదిలో జరిగే అంతర్మథనాన్ని తాను అనుభవించి, స్వీయ ముద్రతో మన కందించిన సిరివెన్నెల చేసిన గొప్ప intellectual pursuits లో ఇది కూడా ఒకటి. ఇంత మేథోపూరితమైన, వర్తమాన సమాజానికి అత్యంత ఆవశ్యకమైన జ్ఞాన సారాన్ని తనలో ఇముడ్చుకున్న ఈ పాట అనుకున్నంత ప్రేక్షకాదరణ పొందలేక పోయింది.
అయినా, భవిష్యత్తులో దీని ప్రభావాన్ని, ప్రేరణను నిస్సందేహంగా భావితరాలు అందుకుంటాయని నేను మనసారా ఆకాంక్షిస్తున్నాను.
Images Source: Internet
శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ గారు ఆంగ్ల అధ్యాపకురాలు, వ్యక్తిత్వ వికాస నిపుణురాలు, గీత రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు(తెలుగు-ఇంగ్లీష్-హిందీ), సామాజిక కార్యకర్త.