[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]
నువ్వెవరైనా నేనెవరైనా
~
చిత్రం: ఓకే బంగారం
సంగీతం: ఏ ఆర్ రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం : కె. ఎస్. చిత్ర, డా. నారాయణ్
~
పాట సాహిత్యం
పల్లవి:
ఆమె:
మనసే తీయగా స్వరములు చిందెనే
తీరని తృష్ణకి అమృతము అందెనే
నేనే ఇకపై ॥ 2 ॥ నీకే కొలువై ॥మనసే తీయగా ॥
నేనే ఇకపై నీకే కొలువై ॥మనసే తీయగా ॥
చరణం:
కన్నులు ఉన్నవి నిను చూసేందుకే
కదలికలున్నవి నిను చేరేందుకే
అని నా తలపే ॥ 2 ॥ తెలిపిన క్షణమున
॥ కన్నులు ఉన్నవి ॥ ॥మనసే తీయగా॥
చరణం:
ఆమె: అణువణువున్నది నీకందించగా చెలువము ఉన్నది నిను అలరించగా
అని నా ప్రాణం ॥ 2 ॥ పలికిన క్షణమున
॥ అణువణువున్నది ॥
ఇద్దరు: మనసే తీయగా ॥
♠
ప్రపంచంలో అంతుచిక్కని ఎన్నో రహస్యాలలో, ప్రథమ స్థానంలో ఉన్నదీ, అతి ముఖ్యమైనదీ మనసే. నిరంతరం మనతోనే ఉంటూ, మనల్ని నడిపిస్తూ, కనిపించకుండా ఆడించే ఒక అద్భుత యంత్రమది. మనం భౌతికంగా కొన్ని పనులు చేసినా, మనల్ని బాధ పెట్టే కొన్ని విషయాల గురించి మనం మనసుతో సమర్థంచుకుంటాం. అంటే ఇది లోలోపల జరిగే ప్రక్రియ. మనలో భావోద్వేగాలు, అనుభూతులు, కోరికలు కలిగించేది మనసు లేదా మనస్సు. ఏదైనా వస్తువు లేదా జీవరాశిపై ప్రేమ లేదా ద్వేషం కలిగించే ఒక అంతరాళమిది. ప్రతి మనిషి యొక్క భావాలు, అనుభూతులు, అభిప్రాయాలు వారి వారి మనసు, అది ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది. మన శరీరంలో రక్తం ప్రవహించినంత కాలం ఆ మనసు ఆజ్ఞలు జారీ చేస్తూనే ఉంటుంది. మనం ఊపిరి తీస్తున్నంత కాలం, ఆ మనసు మనల్ని ఆడిస్తూనే ఉంటుంది.
సముద్రం ఎంత అనంతమైనదో, ఎంత అపారమైనదో, ఎంత లోతైనదో, మనసు కూడా అంతే అనంతమైనది. Thoughts, Emotions, Desires, Memory వంటి లక్షణాలతో ఇది మన లోపల ఉండే భావోద్వేగాలు, ఆలోచనల ప్రక్రియలు, మరియు ఆత్మచింతనల (self-reflection) కేంద్రీకరణను సూచిస్తుంది.
ఇంగ్లీష్ భాషలో Mind అని పిలుచుకునే మనసు అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంటుంది? అనే ప్రశ్నలు ప్రతివారిలోనూ తలెత్తుతాయి. ఆధ్యాత్మికవేత్తలయితే, మనసును హృదయంలో గమనించమంటారు. ఏకాగ్రత కొరకు యోగులు చూపే కొన్ని ముఖ్యస్థానాలలో ఇది ఒకటి. హృదయాకాశమని, చిదాకాశమని వేరు వేరు పేర్లతో కూడా దీన్ని పిలుస్తారు. హృదయాకాశంలో ‘నేను, నేను..’ అనే ఆలోచనా స్రవంతి మూలాన్ని స్వయంగా శోధించిగానీ, లేక గాలిని నిరోధించి ప్రాణాయామం ద్వారా గానీ, తెలుసుకొని, ఆత్మయందు స్థిరంగా ఉండమని ఎందరో యోగులు మార్గదర్శనం చేశారు. కానీ, మనసు ఎల్లప్పుడూ స్వేచ్ఛగా తిరగాలని, కట్టుబాట్లను వదిలేయాలని చూస్తుంది. కట్టుబాట్లను వదిలేసినప్పుడు సంతోషంగా ఉన్నా, తర్వాత సమాజం నుంచి వచ్చే విమర్శల వల్ల దుఃఖమూ కలుగుతుంది. మనసు ఒక్కోసారి ఆకాశంలో విహరిస్తున్నట్టుగా, ఒక్కోసారి దుఃఖపడుతూ, ఒక్కోసారి నిస్తేజంగానూ, నిరుత్సాహంగానూ ఉంటుంది. Face is the index of the mind, అన్నట్టు, మన మనసు ఎలా ఉంటే, అలా ఆ భావం ముఖంలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఒక మనిషి చెడ్డవాడా, మంచివాడా అనే నిర్ణయం మనసును బట్టే ఉంటుంది. అందుకే, ఎందరో వాగ్గేయకారులు, గేయ రచయితలు ఎంతో అనుభవంతో, మనసును సంబోధిస్తూ రచనలు చేశారు. ఆత్మయోగులు, ఆత్మజ్ఞానులు మనసుకే ఆత్మబోధ చేసుకుంటూ తమ బుద్ధి వికాసానికి కృషి చేస్తూ ఉంటారు.
భారతీయ శాస్త్రీయ, లలిత, జానపద సంగీతాలలోనూ, తత్వాలలోనూ, వివిధ సాహిత్య రీతుల్లోనూ మనసును సంబోధిస్తూ అనేక రచనలు చోటు చేసుకున్నాయి. మనసుకు ఒక రూపం అంటూ లేదు. కానీ, మన ఇంద్రియాలకు మాత్రం అధికారి మనస్సే. మనం ఏ పనిచేసినా, అది మనసుతో ముడిపడి ఉంటుంది. మనిషి పురోగతికి, తిరోగతికీ మనసే కారణం.
సంగీత త్రిమూర్తులలో త్యాగరాయ స్వామి ఎక్కువగా మనసును సంబోధిస్తూ కీర్తనలు వ్రాశారు. ‘మనసా ఎటులోర్తునే, నా మనవిని చేకొనవే/ దినకరకుల భూషణుని’ అంటూ మనసును చెడు స్నేహాలు చేయకుండా, తరింపజేసే మార్గం తెలుపమంటూ వేడుకుంటున్నట్టుగా సాగుతుందీ పాట. ‘అలాగే, ఉండేది రాముడొకడు/ ఊరక చెడిపోకే మనసా/’ లాంటి ఎన్నో కీర్తనలు మనకు సాదృశ్యంగా నిలుస్తాయి. రామదాసు కీర్తనలు కూడా మనసును సంబోధిస్తూ వుంటాయి.
మనసు గురించి పద్యాలతో ప్రారంభమై, నవరసాలను కురిపిస్తూ, అనేక రీతులను తనలోకి తీసుకుంటూ శాస్త్రీయ, లలిత, జానపద సంగీతాలకు దీటుగా చలనచిత్ర సంగీతం ఆవిర్భవించింది. సినీ గేయ రచయితలలో ఒకరైన ఆత్రేయ ‘మనసు కవి’గా చెరగని ముద్ర వేసుకున్నారు.
మనసు స్వరూపాన్ని, స్వభావాన్నీ చక్కగా వివరించిన ‘మౌనమే నీ భాష ఓ మూగ మనసా, తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కల్లలు కాగానే కన్నీరవుతావు.. చీకటి గుహ నీవు, చింతల చెలి నీవు, నాటక రంగానివే మనసా/ఎందుకు వలచేవో/ఎందుకు వగచేవో.. ఎందుకు రగిలేవో..’ అని ఈ పాట సాగుతుంది. మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన ఈ పాట ప్రేక్షకుల మనసును దోచుకున్నది.
ఈ రోజు మనం చర్చించబోతున్న, ‘మనసే తీయగా’.. అనే ‘ఓకే బంగారం’ చిత్రంలోని సిరివెన్నెల సాహిత్యానికి, రెహమాన్ సంగీతం సమకూర్చగా, మధురాతి మధురమైన తన అమృతగళంతో శ్రీమతి చిత్ర కర్ణాటక సంగీత బాణీలో ఒక మరపురాని గీతాన్ని ఆలపించారు.
అనేక సంగతులతో, చిట్టి స్వరాలతో, ఈ పాట అద్యంతము రసానుభూతిని కురిపిస్తూ, పాట ఒక ప్రేమైక భావనను ప్రతిబింబిస్తుంది.
పల్లవి:
మనసే తీయగా స్వరములు చిందెనే
తీరని తృష్ణకి అమృతము అందెనే
నేనే ఇకపై ॥ 2 ॥ నీకే కొలువై ॥మనసే తీయగా॥
కథానాయక మనసులో ప్రేమ భావనలు మొదలైనప్పుడు, తన మనసు తీయటి స్వరాలు పలుకుతోందని, మనసులో అప్పటి వరకూ ఉన్న ఆరాటం తీరి అమృతమయమైన ఆనందం తనకు అంది వచ్చిందనీ, తాను ఇకపై తన ప్రియుని కోసమే కొలువుతీరి ఉంటాననే భావాన్ని పల్లవి మనకు అందిస్తుంది. ఈ పల్లవిలో సిరివెన్నెల గారు వాడిన రెండు ‘తృష్ణ, అమృతం’ అనే రెండు పదాలు, ఎంతో గంభీరమైన అర్థాలను కలిగి ఉన్నాయి.
ఇందులో తృష్ణ అంటే దప్పిక, కోరిక అని రెండు అర్థాలున్నాయి. దప్పిక నీళ్లు తాగాలనే కోరికను పెంచుతుంది. కోరిక అనుకున్నది సాధించాలనే ఆశను పెంచుతుంది. మనిషి పుట్టినప్పటి నుంచి అతణ్ని తృష్ణ వెంటాడుతూనే ఉంటుంది. తృష్ణ దాహమే కదా? మానవ శరీరం నిరంతరం నీటిని కోరుతుంది. దాహాన్ని తీర్చుకోకుండా మనిషి ఎక్కువకాలం బతకలేడు. మనిషిలోని జలదాహం ఆజీవనాంతం తీరనిది. మనిషి దాహాన్ని తీర్చే జలం ప్రాణంతో సమానం. అందుకే నీటికి జీవనమని, అమృతమని పేర్లున్నాయి. మనిషిలోని తృష్ణ కేవలం నీటిని మాత్రమే కోరదు. ఈ ప్రపంచంలోని అన్ని సంపదలను, సుఖాలను కోరుతుంది. తృష్ణ ఎన్నటికీ ఆరని నిప్పువంటిది.
ఎన్నో తీరని ఆరాటాలలో- ప్రేమ అత్యంత ప్రాధాన్యమైనది. ఆ తృష్ణ తీరాలంటే, అమృతమయమైన ప్రేమ అందాల్సిందే! అలాంటి సమయంలో మనసు పాడే మధురమైన రాగాలు ఎలా ఉంటాయో.. సిరివెన్నెల సోదాహరణంగా పల్లవిలో వివరించారు. ఇక సంగీత పరంగా తీసుకుంటే తృష్ణ అంటే లయకు మించిన తాళం.
తృష్ణ అంటే మితికి మించిన మోతాదు.
అంతర్లీనంగా మనకు ఇందులో మరో హెచ్చరిక కూడా కనిపిస్తుంది. ఎండమావులను మృగతృష్ణ అంటారు. ఎడారులలో సుదూరం నుండి కనిపించే ఈ మాయాసరస్సులు, దూరము నుండి చూసేవారికి నీటి మడుగులు ఉన్నట్లు భ్రమను కలిగిస్తాయి. అందుకే, మృగతృష్ణల వలలో చిక్కుకుని హాలాహలాన్ని అందుకోకూడదనే బలమైన సందేశం కూడా మనకి ఇందులో అందుతుంది.
జామాతా, జఠరం, జాయా, జాతవేదా, జలాశయః
పూరితనైవ పూర్యస్తే జకారాః పంచ దుర్లభాః
లోకములో తృప్తి అనేది వేటికి వుండదు? అని ఆలోచించి ఒక కవి యిలా అంటున్నాడు. ఈ లోకంలో ఐదు ‘జ’ కారాలున్నాయి. వాటికి ఎంత చేర్చినా తృప్తి అనేదే వుండదు. అవి ఏమిటంటే, మొదటిది ‘జామాతా’ అంటే అల్లుడు. ఎంత యిచ్చినా చాలు అనని వాడు. రెండోది జఠరం (కడుపు) దీనికీ అంతే ఎంత తిన్నా మరునాటికి మామూలే. ‘జాయా’ అంటే భార్య. ఈవిడా అంతే ఎన్ని చీరలున్నా, నగలున్నా యింకా కావాలని అంటుందట. ‘జాతవేదా’ – అగ్ని యిది నాల్గవ ‘జ’కారం. ఎన్ని వస్తువులు వేసినా కాలిపోతూ వుంటాయి. ఇంక ఐదవది ‘జలాశయః’ – సముద్రము. ఎంతనీరు వచ్చి పడినా తృప్తి లేదు. ఈ ఐదు ‘జ’ కారాలనూ తృప్తి పరచటం కష్టం అని చమత్కారంగా చెప్తున్నాడు.
‘ప్రపంచం ఒక పద్మవ్యూహం. కవిత్వం ఒక తీరని దాహం’, అంటారు శ్రీశ్రీ. కళా తృష్ణ, జ్ఞాన తృష్ణ, లాంటి ఎన్నో తీరని ఆరాటాలే మానవాళికి ఎన్నో అద్భుతాలను అందించాయి.
చరణం:
కన్నులు ఉన్నవి నిను చూసేందుకే
కదలికలున్నవి నిను చేరేందుకే
అని నా తలపే ॥ 2 ॥ తెలిపిన క్షణమున
॥ కన్నులు ఉన్నవి ॥ ॥మనసే తీయగా॥
కమాలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ..
సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు
శేషశాయికి మ్రొక్కుశిరము శిరము..
అన్న పోతన లాగా.. కన్నులు ఉన్నవి నిను చూసేందుకే.. అంటూ, చరణాన్ని ప్రారంభించారు సిరివెన్నెల. భగవంతునిపై ఉన్న ప్రేమను భక్తి అంటారు. అప్పుడు ఈ శరీరంలోని అణువణువు, భగవంతుని సేవకే అర్పితమైందనే భావన ఉంటుంది. భగవంతుని చేరుకోవడమే గమ్యంగా మారుతుంది.
అదే అనురాగం వ్యక్తులపై ఉన్నప్పుడు, దాన్ని ప్రేమ అని వ్యవహరిస్తాము. ఇందులో కథానాయిక కూడా నా పంచేంద్రియాలు నీ కొరకే పరితపిస్తున్నాయి.. నా కళ్ళు నిన్నే చూడాలని కోరుకుంటున్నాయి.. నా కదలికలు నిన్ను చేరే విధంగా నన్ను నడిపిస్తున్నాయి.. అని నా తలపు/నా మనసు.. ఈ నిమిషమే తెలియజేసింది.. అందుకే ఈ క్షణంలో నా మనసు తీయటిరాగాలను ఆలపిస్తూ, నీలోనే కొలువై ఉన్నది.. అన్న మధురమైన భావాలను ఎంతో సున్నితంగా ఆవిష్కరిస్తున్నారు సిరివెన్నెల.
చరణం:
ఆమె:
అణువణువున్నది నీకందించగా
చెలువము ఉన్నది నిను అలరించగా
అని నా ప్రాణం ॥ 2 ॥ పలికిన క్షణమున
॥ అణువణువున్నది ॥
ఇద్దరు: మనసే తీయగా ॥
‘యీ రమణి చెలువము యేమని పొగడవచ్చు తేరకొన విభునికి దినబోగాలాయను’..అనే అన్నమయ్య శృంగార కీర్తన లాగా, నాలోని అణువణువు నీకే అర్పించుకోమంటున్నది.. నాలోని చెలువము.. అంటే.. మనసుకు ఆహ్లాదం కలిగించే రూప సౌందర్యం.. అందము.. నిన్ను ఆహ్లాదపరచడానికే! అని నా ప్రాణమే నాకు తెలిపింది.. అంటుంది కథానాయిక. నా ప్రాణం, నా సర్వస్వం నీవే అన్న సాగర గంభీర భావాన్ని.. ఈ పదబంధాలతో సిరివెన్నెల అలవోకగా మనకు అందిస్తున్నారు.
గాఢమైన ప్రేమ తత్వాన్ని ప్రతిబింబించే ఈ పాట, ఒక పల్లవి రెండు చరణాలతో సముద్రమంత నిండైన భావాన్ని తనలో ఇముడ్చుకొని సాగుతుంది. అద్యంతం మధుర స్వరాలతో సాగే ఈ పాట వీనులకు విందు అందించడమే కాక.. మనసును కూడా సుదూర తీరాలకు తీసుకుని వెళుతుంది. ఒక చక్కటి శృంగార కీర్తన లాంటి ఈ పాట, సిరివెన్నెల, రెహమాన్, చిత్రల త్రివేణి సంగమంతో చిరస్థాయిగా ప్రేక్షకుల మనసును దోచుకుంటున్న అనడంలో ఏమాత్రం సందేహం లేదు!
Images Source: Internet
శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ గారు ఆంగ్ల అధ్యాపకురాలు, వ్యక్తిత్వ వికాస నిపుణురాలు, గీత రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు(తెలుగు-ఇంగ్లీష్-హిందీ), సామాజిక కార్యకర్త.