Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సిరివెన్నెల పాట – నా మాట – 31 – భావ గాంభీర్యంతో వరదలా సాగిన పాట

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

ఏ రాగముంది మేలుకొని…

~

చిత్రం: మనసులో మాట

సాహిత్యం: సిరివెన్నెల

గాత్రం: ఎస్పీ బాలసుబ్రమణ్యం

సంగీతం: ఎస్వీ కృష్ణారెడ్డి

~

పాట సాహిత్యం

సాకీ: కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంతా త్రైలోక్యం మంగళం కురు…

ఏ రాగముంది మేలుకుని ఉండి లేవనంటున్న మనసుని పిలువగ
ఏ తాళముంది సీసమును పోసి మూసుకొని ఉన్న చెవులను తెరువగ
సంగీతమంటే ఏమిటో తెలిసి ఉండాలి మనకి ముందుగా
అంత సందేహముంటే తీర్చుకో గురువులున్నారు కనుల ముందుగా
వెళ్ళి నీలిమేఘాన్ని గాలి వేగాన్ని నింగి మౌనాన్ని అడగరా
కడలి ఆలపించేటి ఆ తరంగాల అంతరంగాన్ని అడగరా
మధుర ప్రాణగీతాన్ని పాడుతూ ఉన్న ఎదసడినడిగితె శ్రుతిలయ తెలుపద బ్రతుకును నడిపిన సంగతి తెలియద
ఏ రాగముంది మేలుకుని ఉండి లేవనంటున్న మనసును పిలువగ
ఏ జోలపాట చలువతో నింగి సేద తీర్చింది అలసిన పగటిని
స్వర్ణ తరుణాలు చంద్రకిరణాలు జిలుగులొలికి బదులు పలుకునెవరికి
మంచు మౌనాలు పంచమంలోన మధువు చిలుకు ఎవరి చెలిమి రవళికి తోటలో చేరి పాట కచ్చేరి చేయమంటున్న వినోదమెవరిది
వేల అందాల పూలగంధాల చైత్రగాత్రాన సునాదమెవరిది
పంచవర్ణాల పించమై నేల నాట్యమాడేటి వేళలో మురిసి వర్షమేఘాల హర్షరాగాల వాద్యమయ్యేటి లీలలో
తడిసి నీరుగా నీరు ఏరుగా ఏరువాకగా నారు చిగురులు తొడగగ పైరు పైటేసి పుడమి పాడేటి పసిడి సంక్రాంతి పదగతులెవరివి
ఏ తాళముంది సీసమును పోసి మూసుకొనివున్న చెవులను తెరువగ
ఏ సుప్రభాత గళముతో నేల స్వాగతిస్తుంది తొలితొలి వెలుగుని
ఆరు కాలాలు ఏడు స్వరములతో అందజేస్తున్న రసమయ మధురిమ వినగల చెవులను కలిగిన హృదయము తన ప్రతి పదమున చిలకద సుధలను జోహరు నీకు సంద్రమా ఎంత ఓపికో అసలు అలసట కలగద
ఓ హోరు గానగ్రంథమా ఎంత సాధనో దిశల ఎదలకు తెలియద నీ గీతమెంత తడిమినా శిలలు సంగీత కళలు కావనీ ఎంత నాదామృతాన తడిసినా ఇసుక రవ్వంత కరగలేదనీ తెలిసి అస్తమిస్తున్న సూర్యతేజాన్ని కడుపులో మోసి నిత్యమూ కొత్త ఆయువిస్తున్న అమృతంలాంటి ఆశతో ఎగసి ఆవిరై అష్టదిక్కులూ దాటి మబ్బులను మీటి
నిలువున నిమిరితె గగనమె కరగద జలజల చినుకుల సిరులను కురవద
అణువణువణువున తొణికితె స్వరసుధ అడుగడుగడుగున మధువని విరియదా?..

‘నా ఉచ్ఛ్వాసం కవనం.. నా నిశ్వాసం గానం..
సరసస్వరసురఝరీగమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం.. ఈ గీతం..
విరించినై విరచించితిని..’

అంటూ, సినిమా పాటను సంపూర్ణమైన సాహితీ విలువనీ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన శిల్పంగా మలచే ప్రక్రియలో ఎనలేని కృషి చేసి, తెలుగు సినీగేయాలను సుసంపన్నం చేసిన మార్గదర్శక కవులలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకరు.

కళాతపస్వి కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలోని కావ్యాల్లాంటి చిత్రాల్లో సంగీత, సాహిత్యాలకు పెద్దపీట వేయగా, సిరివెన్నెల చిత్రంతో ప్రారంభించి.. ఎన్నో చిత్రాల్లో నాట్య, సంగీత వేదాలకు భాష్యాలు చెబుతూ సినీ గీతాలు రాసే అవకాశం సీతారామశాస్త్రి గారికి దక్కింది.

సరసస్వరసురఝరీగమనమని సంగీతాన్ని నిర్వచిస్తూ తొలి చిత్రంలో సంగీతానికి ఒక అద్భుతమైన నిర్వచనాన్ని అందించారు. తన మొదటి పాటలోనే ఈ విశ్వమంతా ప్రణవ నాదం నుండి ఆవిర్భవించిందన్న వేద ప్రామాణికమైన తత్వాన్ని, సత్యాన్ని ఆవిష్కరించారు. ఓంకారాన్ని నిర్వచిస్తూ, సృష్టిలో అణువణువునా ఉండే నాదాన్ని మనకు వివరిస్తూ, ఈ నాదం/రాగం అనంతజీవనవాహిని అని భాష్యం చెప్పారు. “మానసవీణ మౌనస్వరాన ఝుమ్మని పలికే తొలి భూపాలం” (హృదయాంజలి) , అని సంగీతానికి నీరాజనాలు పట్టారు. ఇలాంటి సంగీత ప్రాభవాన్ని, విశిష్టతను చాటిచెప్పే ఎన్నో పాటలు సిరివెన్నెల కలం నుంచి జాలువారిన రాగాల హొయలు పోయాయి.

జానపదాలుగా, సంప్రదాయ సంగీతంగా.. పలు రకాల ప్రక్రియల్లో పాటలు ఎంతో విశిష్టతను సంతరించుకున్నాయి. పాశ్చాత్య సంగీతం కూడా భారతీయ సంగీతంపై చాలా గొప్ప ప్రభావాన్ని చూపుతోంది. రావణ విరచిత శివతాండవ స్తోత్రం, కాలభైరవాష్టకం, హనుమాన్ చాలీసా వంటి స్తోత్రాలు కూడా విరివిగా మనకు వెస్ట్రన్ మ్యూజిక్ ఫ్యూషన్‌తో వినిపిస్తూ, యువతను ఎంతో ఆకర్షిస్తున్నాయి. ర్యాప్ సాంగులు, బ్రీత్ లెస్ సాంగులు, ఎంతో ప్రజాదరణ పొందుతున్నాయి.‌

ఈ మధ్య కాలంలో శంకర మహదేవన్ పాడిన ‘బ్రెత్‌లెస్ సాంగ్’ అనేది టి.వి ద్వారా దేశాన్ని ఊదరగొట్టేసింది. Breathless అంటే గుక్క తిప్పుకోకుండా ఏకబిగిని పాడే పాట అని వారి భావం. ప్రముఖ గీత రచయిత జావేద్ అఖ్తర్ రచించిన,

‘కోయూజో మీలాతో ముఝే, ఐసా లగాతో థా,
జైసే మేరీ సారి దునియా మే, గీతంకి రుతు ఔర్ రంగోంకి బర్ గా హై..’ పాట అది.

‘ఓ పాపా లాలి చిత్రంలో’ పాటల మాంత్రికుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించిన ‘మాటేరాని చిన్నదాని’ అనే పాట ఎంతో హిట్ అయింది.

~

‘మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు..
ప్రేమే నాకు పంచే.. జ్ఞాపకాలురా..
రేగే మూగ తలపే.. వలపు పంటరా!!
వెన్నెలల్లే పూలు విరిసే తేనెలు చిలికెను..
చెంతచేరి ఆదమరచి ప్రేమలు కొసరెను..
చందనాలు జల్లు కురిసె చూపులు కలిసెను..
చందమామ పట్టపగలే నింగిని పొడిచెను!!’

..ఇలా కొనసాగుతుంది ఆ పాట.

ఇక ‘అద్భుతం’ అనే సినిమాలో, వేటూరి సుందర రామమూర్తి గారు రచించిన ‘నిత్యం ఏకాంత క్షణమే అడిగా’, అనే 80 వాక్యాల పాటని గుక్క తిప్పుకోకుండా పాడి బాలు గారు రికార్డు సృష్టించగా, పలు వేదికల మీద గాయని కల్పన అదే పాటతో ఎంతో మురిపించి, ఎందరినో మైమరపించారు.

~

‘నిత్యం ఏకాంత క్షణమే అడిగా
యుద్దం లేనట్టి లోకం అడిగా
రక్త తరంగ ప్రవాహం అడిగా
ఉదయం లాంటి హృదయం అడిగా
అనుబంధాలకు ఆయుష్షడిగా
ఆనందాశ్రువులకు ఆశీస్సడిగా
మదినొప్పించని మాటలు అడిగా
ఎద మెప్పించే యవ్వనం అడిగా
పిడుగులు రాల్చని మేఘం అడిగా
జ్వలించు నూరేళ్ళ పరువం అడిగా
వరించి తరించు వలపే అడిగా
ప్రాణతుల్యమౌ బంధం అడిగా
పచ్చికలో మంచు ముత్యాలడిగా
పువ్వుల ఒడిలో పడకే అడిగా
తనువోదార్చే ఓర్పుని అడిగా
తలను నిమిరే వ్రేళ్ళను అడిగా
నెమలి ఆటకు పదమే అడిగా
కోయిల పాటకు పల్లవి అడిగా
గదిలో గుక్కెడు నీళ్ళే అడిగా
మదిలో జానెడు చోటే అడిగా..’

ఇలా సాగుతుందా పాట.

~

‘పూసిన పున్నమి వెన్నెల మేన తెలంగాణ వీణ
వాసిగ చరితల వెలుగొందిన గత వైభవాల కోన
పద గతుల వాణి స్వర జతుల వేణి
ఉప్పొంగి మురిసే ఉల్లముల బాణి
తాళాల జోల దరువుల యాల
సంబూరమాడే సింగిడి మేళ
మోదుగులపూల వసంతహేల
తంగెడుపూల బంగరు నేల
జమ్మికొమ్మన పాలపిట్టల’

అన్న గోరేటి వెంకన్న తెలంగాణ గీతం ‘బందూక్’, చిత్రంలో సాకేత్ పాడి, పాటకు ఎంతో గొప్ప క్రేజ్ పట్టుకొచ్చాడు.

పై తరహా పాటలన్నీ ఎంతో ప్రజాదరణకు నోచుకున్నాయి. ఈ ‘బ్రెత్‌లెస్’ ప్రక్రియకి వచ్చిన ప్రజాదరణని బట్టి, చంద్రకిరణ్ ఫిలింస్ ‘మనసులో మాట’ సినిమాలో, దర్శకుడు సంగీత దర్శకుడూ అయిన శ్రీ ఎస్వీ కృష్ణారెడ్డి గారు, ఓ ముఫై ముఫ్పైఅయిదు పంక్తుల పాటు ఏకబిగిని నడిచేలా ఓ ట్యూన్ చేసి, ఆ ట్యూనుకు సిరివెన్నెల గారిని ‘ఏదో’ రాయమన్నారట.

ఆ ప్రక్రియ పట్ల ఆసక్తి సరే. అంతసేపు ఏకబిగిన ఏ భావాన్ని పలికించాలి? ఎలా నడిపించాలి? అని ఆయన ఆలోచనలో పడ్డారట. నిర్మాత, మిత్రుడు రవికిశోర్‌కి ఫోన్ చేయగా, “భావమూ, భాషా, నీ యిష్టం సీతారాముడూ!” అన్నాడట. ఇంక కావలసిందేముంది? పాత్రలూ, సన్నివేశాలూ అన్న నిబంధనలూ వసుదేవుడికి యమున దారిచ్చినట్టు తప్పుకున్నాయి. బాణీ ఆటంకం అవడానికి బదులు ప్రోత్సాహకరంగా, సరళంగా, సుదీర్ఘంగా తెలుగుతనం పలికేందుకు వీలు అందించారు ఎస్వీ కృష్ణారెడ్డిగారు.

అప్పుడు ‘సంగీతాన్నే’ భావంగా పట్టుకుని, ప్రకృతిలోని రంగులు, ఋతువులు, అలలు, మేఘాలు, గాలి, ఆకాశం అన్నిటినీ, స్పర్శిస్తూ, అన్నిటిలోనూ ఉన్న సంగీతాన్ని వినలేకపోతే చెవుల్లో సీసం పోసుక్కూచున్నవాడి హృదయాన్ని తెరిచే ‘తాళం’ గాని, వాణి పిలిచే ‘రాగం’ గానీ లేదని చెబుతూ ఎడతెరిపిలేని భావ గాంభీర్యంతో పాట వరదలా సాగిపోయిందని తన సిరివెన్నెల తరంగాలలో వివరించారు.

“రాగస్వరశ్చ తాళశ్చ త్రిభి సంగీత ముచ్యతే” అను ప్రమాణము రాగ, స్వర, తాళముల చేరికయే సంగీతం.

“గీతం వాద్యం తథా నృత్యం త్రయ సంగీతముచ్యతే” (సంగీత రత్నాకరము) అను ప్రమాణముచే గీత, వాద్య, నృత్యముల చేరికయే సంగీతమని సంగీత రత్నాకరములో పేర్కొనడం జరిగింది.

“సామవేదాదిదం గీతం సంజగ్రాహి పితామః”

సామ వేదము నుండి “సంగీతము పుట్టింద’ని సంగీత రత్నాకరం’ అభివర్ణించింది.

పారమార్థికంగానూ, ఐహికంగాను, మనిషి ఉన్నతస్థితిని పొందే కళలలో అత్యుత్తమమైన కళ ఈ ‘సంగీతము’ అని పెద్దలు చెప్పుచున్నారు. “

తాను వైకుంఠంలో కానీ, యోగి హృదయాలలో కానీ నివసించనని, ఎక్కడైతే తమ భక్తులు భక్తితో గానం చేస్తుంటారో అక్కడ స్థిరంగా ఉంటానని పరమాత్మ చెప్పినట్టు ‘నారద సంహిత’లో ఒక శ్లోకం వ్రాయబడింది. “నాహంవసామి వైకుంఠే, నయోగి హృదయే, నరవౌమద్భక్తాయత్రగాయంతే, తత్ర తిష్ఠామి నారదః”.

‘సంగీత కల్ప ద్రుమ’ గ్రంధము నందు “జపకోటి గుణం ధ్యానం, ధ్యానం కోటి గుణోలయః లయకోటి గుణం గానం గానాత్పరతరం నహి”

ఇటువంటి గొప్ప మహత్తర గంధర్వ విద్యయైనటువంటి ‘సంగీతము’ను ఆరాధిస్తూ, ఆస్వాదిస్తూ, తనదైన బాణీలో, ఇటు భావుకత అటు మధురమైన తెలుగు కలనేతలతో అందమైన రాగాల చీరను అల్లినారు సిరివెన్నెల. ప్రకృతి నుండి సంగీతం పుట్టిందని, మనసుకు చెవులు ఉంటే ప్రతి చోటా సంగీతం వినిపిస్తుందని, దాన్ని ఆస్వాదించడం ఒక భాగ్యమని ఈ పాటలో వివరిస్తారు. సంగీతాన్ని ఆనందించలేని వాళ్లను నిలదీస్తూ, సంగీతం అంటే మనసుకు తెలిసి ఉండాలి, అలా తెలియకపోతే తెలుసుకోవడానికి ఎందరో గురువులు మనకు ఉన్నారు, వారి నుండి తెలుసుకోండి, అని చురకలు వేస్తారు సిరివెన్నెల.

ప్రకృతిలో ఉన్న అన్ని శక్తులూ గురువులేనని, నీలి మేఘాన్ని, వాయువు ఆలపించే రాగాన్ని, కడలి తరంగాల్ని, మధుర గీతం పాడుతున్న ఎదలోని శృతిలయల అంతరంగాల్ని అడిగి తెలుసుకోమంటారు.

చంద్ర కిరణాలు అలసిపోయిన భూమికి, పగటికి జోలలు పాడుతాయట! వేల అందాలు విప్పరే చైత్రమాసం, వర్షానికి మురిసిపోయి నాట్యమడే భూమి అందాలు, నీరు ఏడు లాగా మారి, ఏరువాకగా సాగి, ప్రకృతికి పులకలు కలిగించి, పైరు పైటలు వేసి సంక్రాంతి సంబరాలు చేసుకుంటుందని ఎంతో భావవేశంతో వర్ణిస్తారు సిరివెన్నెల. ప్రతి ఋతువులోనూ వినగల అద్భుతమైన సంగీతం ప్రకృతిలో వినిపిస్తుందని, ఆరుగాలాలు వంటి మంచి తెలుగు నుడికారాలను వాడుతూ రమ్యమైన బాణీలో పాట సాగుతుంది.

రసాస్వాదన ఎరుగని కఠిన హృదయులను ఎద్దేవా చేస్తూ, సముద్రం ఎంత ఓపికగా, తన హోరు అనే గ్రంథంతో ఎంత సాధన చేసినా, ఆ నాదామృతంలో తడిసినా, ఆ సముద్రంలోని శిలలు కానీ, అక్కడి ఇసుక కానీ రవంత కూడా కరగవనీ, కఠిన పాషాణాలుగా మిగిలిపోతాయని ఎద్దేవా చేస్తారు.

నిత్యం సానుకూల దృక్పథంతోనే తాను సాగుతూ, తన కవితా శిల్పాన్ని సాగించే సిరివెన్నెల, ‘ఏ స్థితిలోనూ నిరాశనీ, చీకటి కోణాలనీ చూడడం ఇష్టంలేకపోవడం వల్ల సముద్రాన్ని ప్రతీకగా తీసుకుని, ప్రతి రోజూ పడమర చీకటిలో ‘అస్తమిస్తున్న’ సూర్యుణ్ణి బడబాగ్ని రగిలే తన కడుపులో దాచుకుని, మరుసటి రోజు కొత్త ఆయువిచ్చి తూర్పు నింగి మీద నిలిపే సముద్రంలోని ఆశ, అలలుగా ఆకాశాన్నందుకోవడంలో విఫలమైనా, అవిరిగా మేఘమై అంబరాన్ని తాకి, నీలిమను చినుకులుగా కరిగించి నేలకు తీసుకువచ్చే నిరంతర ఆశాలాపనని చిత్రీకరించానని,’ తానే వివరించారు. ఇంత హృద్యమైన గీతాన్ని మనకు అందించిన సిరివెన్నెలకు మనం తెలుగువారిగా ఎంతో ఋణపడి ఉన్నాం.

Images Courtesy: Internet

Exit mobile version