[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]
ఒక విత్తనం మొలకెత్తడం..
~
చిత్రం: గోల్కొండ హై స్కూల్
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం : కళ్యాణి మాలిక్
గానం : హేమచంద్ర
~
పాట సాహిత్యం
పల్లవి:
ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం
నిలువెత్తుగా తల ఎత్తడం నేర్పేందుకదే తొలి పాఠం
మునివేళ్ళతో మేఘాలనే మీటేంతగా ఎదిగాం మనం
పసివాళ్ళలా ఈ మట్టిలో ఎన్నాళ్ళిలాగ పడి ఉంటాం
కునికే మన కనురెప్పల్లో వెలిగిద్దాం రంగుల స్వప్నం
ఇదిగో నీ దారిటు ఉందని సూరీడుని రారమ్మందాం
॥ జాగో జాగోరే జాగో ॥
చరణం:
ఆకాశం నుండి సూటిగా దూకేస్తే ఉన్నపాటుగా
ఏమౌతానంటూ చినుకలా ఆగిందా బెదురుగా
కనుకే ఆ చినుకు ఏరుగా ఆ ఏరే వరద హోరుగా
ఇంతింతై ఎదిగి అంతగా అంతెరుగని సంద్రమైందిగా
సందేహిస్తుంటే అతిగా సంకల్పం నెరవేరదుగా
ఆలోచన కన్నా త్వరగా అడుగేద్దాం ఆరంభంగా
॥ జాగో జాగోరే జాగో ॥
చరణం:
ఏ పనీ మరీ ఆసాధ్యమేం కాదే ఆ నిజం మహా రహస్యమా
వేసే పదం పదం పదే పదే పడదోసీ సవాళ్ళనే ఎదుర్కోమా
మొదలెట్టక ముందే ముగిసే కథ కాదే మన ఈ పయనం
సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే విజయం
॥ జాగో జాగోరే జాగో ॥
♠
Attitude is everything. It can make a hell of heaven and heaven of hell. జీవితం పట్ల మనకున్న దృక్పథం, మన విశ్వాసాలు, మన జీవిత గమనంలో, లక్ష్యసాధనలో అతిపెద్ద భాగం. జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితుల కన్నా, వాటి పట్ల మనం ఎలా స్పందిస్తున్నామన్నది చాలా ముఖ్యమైన విషయం. ఆ స్పందించే విధానం, లేదా దృక్పథమే మన పురోగతికి దారి తీయవచ్చు, లేదా అక్కడే ఉంచేయవచ్చు, లేదా వెనక్కి కూడా నెట్టవచ్చు. జీవితంలో ఏ రంగంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులలో ఉన్నా, ఎంత బలంగా దేవుణ్ణి ప్రార్థించినా, ఎవ్వరికైనా దాని ఫలితం ఒకటే. ఏ అంశంలోనైనా సానుకూల, వ్యతిరేక ఫలితాలన్నిటిని సమాన దృష్టితో పరిశీలించి, ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో, ఆ పరిస్థితికి సరైన విధంగా స్పందించడమే విజయ రహస్యం. ‘We have to have trust and faith for ourselves, have confidence, and always watch for positive signs’ అంటారు The Original Tom Maxwell.
విజయ రహస్యాలను విప్పి చెప్పి, సరైన దృక్పథాన్ని బోధించే స్ఫూర్తిదాయకమైన సిరివెన్నెలగారి పాటతో నా నూరవ పాట విశ్లేషణను ముగించాలనుకుంటున్నాను. ‘గోల్కొండ హైస్కూల్’ చిత్రంలోని ఒక విత్తనం మొలకెత్తడం.. పాట సాహిత్యాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.
పల్లవి:
ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం
నిలువెత్తుగా తల ఎత్తడం నేర్పేందుకదే తొలి పాఠం
మునివేళ్ళతో మేఘాలనే మీటేంతగా ఎదిగాం మనం
పసివాళ్ళలా ఈ మట్టిలో ఎన్నాళ్ళిలాగ పడి ఉంటాం
కునికే మన కనురెప్పల్లో వెలిగిద్దాం రంగుల స్వప్నం
ఇదిగో నీ దారిటు ఉందని సూరీడుని రారమ్మందాం
॥ జాగో జాగోరే జాగో ॥
/ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం../ అనే ఎత్తుగడ ఎంతో గంభీరమైన విషయాన్ని మనకు తెలియజేస్తోంది. ప్రకృతిలో అన్ని విషయాలు సహజంగా కొనసాగుతూనే ఉంటాయి. కానీ వాటిని చూసి ఏమి నేర్చుకోవాలో, మనిషి అర్థం చేసుకున్నప్పుడు, బ్రతుకు సార్థకమవుతుంది. ఆపిల్ పండు కోట్ల సార్లు కిందికి పడడం అందరూ చూస్తూనే ఉండి ఉంటారు. అయితే అది కిందికే ఎందుకు పడుతుంది? అని ఆలోచన వచ్చిన న్యూటన్, భూమ్యాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించగలిగాడు. అందుకే, ఏ విషయాన్ని అయినా కొత్త కోణంలో చూడడం నేర్చుకోవాలి, out of box thinking చేయగలగాలి. అందుకే సిరివెన్నెలగారు, విత్తనం మొలకెత్తడాన్ని కొత్త కోణంలో చూడడం వల్ల, తల ఎత్తుకొని జీవించడమనే తొలి పాఠాన్ని నేర్చుకోవచ్చని అంటూ, ఎంతో గొప్ప జీవిత సత్యాన్ని తెలియజేస్తున్నారు
ఆకాశాన్ని అలవోకగా అందుకునే స్థాయికి ఎదిగిన మనం, పసిపిల్లల్లా ఈ మట్టిలోనే ఎన్నాళ్ళు ఇలా పడి ఉంటామని, గట్టిగా ప్రశ్నిస్తున్నారు. సూర్యుని చుట్టూ భూమి మొదలైన నవగ్రహాలు పరిభ్రమిస్తూ ఉండొచ్చేమో కానీ, మనం ఎందుకు సూర్యుడిని మన దారికి తెప్పించుకోలేమా? అనే సరికొత్త సూచన చేస్తూ.. మనం కలలుకనే ఉషోదయాన్ని సృష్టించడానికి సూర్యుడికి ఆహ్వానం పలుకుదాం అంటున్నారు.
/కునికే మన కనురెప్పల్లో వెలిగిద్దాం రంగుల స్వప్నం..
ఇదిగో నీ దారిటు ఉందని సూరీడుని రారమ్మందాం/
ఈ దృక్పథం గురించి Charles Swindoll, ఏమంటున్నారో ఒకసారి గమనిస్తే, సిరివెన్నెల గారి సాహిత్యంలోని సారూప్యత మనకు అర్థం అవుతుంది.
“The longer I live, the more I realize the impact of attitude on life.
Attitude, to me, is more important than facts.
…………..
We cannot change the inevitable.
The only thing we can do is play the one string we have, and that is our attitude..
I am convinced that life is 10% what happens to me and 90% how I react to it.
And so it is with you.. we are in-charge of our Attitudes” – (Attitude) Charles Swindoll.
చరణం:
ఆకాశం నుండి సూటిగా దూకేస్తే ఉన్నపాటుగా
ఏమౌతానంటూ చినుకలా ఆగిందా బెదురుగా
కనుకే ఆ చినుకు ఏరుగా ఆ ఏరే వరద హోరుగా
ఇంతింతై ఎదిగి అంతగా అంతెరుగని సంద్రమైందిగా
సందేహిస్తుంటే అతిగా సంకల్పం నెరవేరదుగా
ఆలోచన కన్నా త్వరగా అడుగేద్దాం ఆరంభంగా
॥ జాగో జాగోరే జాగో ॥
‘Arise, Awake and Stop not’, అని స్వామి వివేకానంద అన్నట్టు, జాగోరే జాగో జాగో.. అంటూ సిరివెన్నెల మనల్ని మేలుకొలుపుతున్నారు. దృక్పథం గురించి పల్లవిలో వివరిస్తే, ఆత్మవిశ్వాసం గురించి, చరణంలో పలికిస్తున్నారు.
అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి।
నాయం లోకోఽస్తి న పరో న సుఖం సంశయాత్మనః॥
..అంటారు గీతాచార్యులు.
(జ్ఞానము, విశ్వాసమూ రెండూ లేని వారు మరియు అనుమానపడే స్వభావం కలవారు, పతనమైపోతారు. విశ్వాసములేక, సందేహించే వారికి ఈ లోకంలో ఇంకా పర లోకంలో కూడా సుఖం ఉండదు, అనేది శ్లోక తాత్పర్యం)
అంత గొప్ప శ్లోకార్థాన్ని, ఉల్లాసంగా పాడుకొనే ఒక పాటలో కూర్చి, ఎంతో మృదువుగా ఆ సత్యాన్ని మనకు అందిస్తున్నారు సిరివెన్నెల. అంత ఎత్తు ఉన్న గగనం నుండి కిందికి దూకితే ఏమైపోతానో అన్న సంశయం చినుకుకి లేదు కాబట్టే, ఆ చినుకే ఏరై, అలాంటి చినుకులన్నీ కలిసి వరదహోరై.. వాగులై, వంకలై, నదులై, ఇంతింతగా ఎదిగి, చివరకు మహా సంద్రమౌతుంది.. ఆత్మవిశ్వాసం అనంతమైన సంద్రమై నిలుస్తుంది. ఇందులో సందేహానికి ఏ మాత్రం తావు లేదు. ప్రతి విషయానికి అనవసరంగా, నిరంతరంగా సందేహిస్తూ ఉంటే, అడుగు ముందుకు పడేది ఎప్పుడు? సంకల్పం నెరవేరేది ఎప్పుడు?
అందుకే, సందేహాలన్నీ పక్కకు పెట్టి, ఆత్మవిశ్వాసంతో ‘ఆలోచన రావడం కన్నా ముందే అడుగేద్దాం, మన సంకల్పానికి శ్రీకారం చుడదాం’, అని పిలుపునిస్తున్నారు, సిరివెన్నెల.
చరణం:
ఏ పనీ మరీ ఆసాధ్యమేం కాదే ఆ నిజం మహా రహస్యమా
వేసే పదం పదం పదే పదే పడదోసీ సవాళ్ళనే ఎదుర్కోమా
మొదలెట్టక ముందే ముగిసే కథ కాదే మన ఈ పయనం
సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే విజయం
॥ జాగో జాగోరే జాగో ॥
ఇక రెండవ చరణంలో, విజయ రహస్యాలను విప్పి చెబుతున్నారు సిరివెన్నెల. ప్రపంచంలో ఏ పనైనా, ఇది అసాధ్యం, అంటూ ఉండదు. ఈ విషయం అందరికీ తెలిసిందే! ఇదేమంత గొప్ప రహస్యం కాదు. సవాళ్లు మనల్ని అడుగడుగునా అడ్డుకుంటున్నా, వాటిని పడదోసి మనం ముందుకు పోలేమా? ఆలోచించండి, అని సూటిగా, ఘాటుగా ప్రశ్నిస్తూ, మనకు ప్రేరణ నిస్తున్నారు. అర్థం లేని సందేహాలతో, పని ప్రారంభించక ముందే, మన వల్ల కాదేమోనని ముగిసే పయనం కాదు మన జీవితం, అలా నిస్తేజంగా పయనం ఆగిపోకూడదు. నిజమైన సమరం చేసే ముందు, మానసికంగా దానికి సంసిద్ధత కావాలి. ఆ సమరాన్ని ఎదుర్కోగలమని అనుకోగలిగే, అనగలిగే, సంసిద్ధత పేరే విజయం. విజయం అంటే, గెలిచిన తరువాత వచ్చే స్థితి కాదు. మానసికంగా, విజయాన్ని పొందడానికి తగిన ధైర్యాన్ని కూర్చుకోవడమే, తొలి విజయం. మన Victory తగిన blueprint ముందుగా మన మనసులో తయారు కావాలి, మనం మెదడుపై బలమైన ముద్ర వేయాలి, మనం దాన్ని నిరంతరంగా నిరంతరంగా visualise చేయగలగాలి. అప్పుడు విజయం తనంత తానుగా మన దరికి చేరుకుంటుంది.
ఈ విధంగా మన జీవితాలపై attitude యొక్క impactని సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు, ఎంతో అందమైన కూర్పుతో ఈ పాట ద్వారా మనకు అందిస్తున్నారు. పల్లవిలో దృక్పథం యొక్క ప్రాముఖ్యతను, మొదటి చరణంలో దృక్పథానికి తోడుగా ఉండవలసిన ఆత్మవిశ్వాసాన్ని, దానికి కొనసాగింపుగా రెండవ చరణంలో nothing is impossible in this world, when worked out with right attitude, అనే సిద్ధాంతాన్ని బలపరుస్తూ, సవాళ్లను ఎదుర్కొని పోరాడే బలమైన సానుకూల దృక్పథాన్ని ప్రేరేపిస్తూ, మన కలలను సాకారం చేసుకునే పోరాటంలో, దానికి సంసిద్ధతగల మానసిక స్థితి పేరే విజయమని, అనన్య సామాన్యమైన నిర్వచనాన్నిస్తూ, ఎంతో గొప్ప వ్యక్తిత్వ వికాస సూత్రాల్ని రంగరించి, మనకు అందించారు సిరివెన్నెల.
సిరివెన్నెల పాట నా మాట, 50వ సంచికను అభిమానుల కవితలతో తీర్చిదిద్దడం జరిగింది. ఈ నూరవ సంచికలో, సిరివెన్నెల కుటుంబం అనే సమూహ సభ్యుల, ఇతర అభిమానుల నుండి, ‘నా దృష్టిలో సిరివెన్నెల అంటే..’ అనే శీర్షికన, అభిప్రాయాలు సేకరించి పొందుపరచడం జరిగింది. ఈ సమూహ సభ్యులకు కూడా నన్ను ఎంతో ఆదరించి, వారి తోడ్పాటును అందించారు. వీరందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
మొట్టమొదటిసారిగా ‘ఆది బిక్షువు వాడినేమి కోరేది’, పాటకు నేను వ్రాసి పెట్టుకున్న సమీక్షను ‘సంచిక’ సంపాదకులు శ్రీ కస్తూరి మురళీకృష్ణగారికి చేర్చి, నన్ను ఆ పత్రికకు పరిచయం చేసిన శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మిగారికి, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నూరు వారాలుగా ‘సిరివెన్నెల పాట నా మాట’ శీర్షికన నేను సమీక్షించిన దాదాపు 130 పాటలను చదివి, స్పందించి, నన్ను ప్రోత్సహించిన పాఠకులకు, ఎంతో ఓర్పుతో నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిన పత్రికా సంపాదకులు, శ్రీ కస్తూరి మురళీకృష్ణగారు, కొల్లూరి సోమ శంకర్ గారు, సంచిక సంపాదక మరియు సాంకేతిక వర్గానికి నేను ఎంతో ఋణపడి ఉన్నాను. ఈ పాటలను పొందుపరచడంలో నా కుటుంబ సభ్యులు, మిత్రులు నాకు ఎంతో తోడ్పాటు అందించారు. వారందరికీ పేరుపేరునా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ నూరు వారాల గమనంలో ఎన్నో ఒడిదుడుకులు, ఒత్తిళ్లు, శుభశుభాలు, ప్రయాణాలు, అనారోగ్యాలు.. ఆటంకాలు కలిగినా, నా వెన్నంటి ఉండి, నిరంతరం ప్రోత్సహిస్తూ, ఒక్క వారం కూడా కుంటు పడకుండా, నన్ను నడిపించిన, నా ఈ విజయంలో ప్రధాన భాగస్తులు, నా జీవిత భాగస్వామి అయిన డా॥ ఆర్.ఎన్. శర్మగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నూరు వారాలపాటు, నిరంతరంగా సమీక్షలు వ్రాయగలిగినందుకు నాకు ఎంతో తృప్తిగా ఉంది. ఈ పాటలలో క్లిష్టమైనవి, బాగా జనాదరణ పొందినవి మాత్రమే కాకుండా, అద్భుతమైన సాహిత్యం ఉండి అంతగా ప్రజలకు చేరువ కాని పాటలను కూడా పొందుపరచగలిగాను. ఇంత అద్భుతమైన అవకాశాన్ని అందించిన సంచిక డిజిటల్ వెబ్ మ్యాగజైన్ కు నేను నిరంతరం ఋణపడి ఉంటాను. నా సేవలను ఈ పత్రిక ద్వారా అందించడానికి సర్వదా సన్నద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను.
‘నా దృష్టిలో సిరివెన్నెల అంటే..’
~
నమస్కారం. నా పేరు ఆదిత్య కౌశిక్ భాగవతుల. నేను సిరివెన్నెల గారి కుటుంబంలో ఒక సభ్యుడిని.
సిరివెన్నెల గారి పాటతో పరిచయం:
అలా మొదటి పరిచయం..
చిన్న చిన్న ఊర్లల్లో పండుగల (కార్తీక మాసం భూలోకమాంబ అమ్మవారి) సమయంలో పాత సినిమాలు మళ్ళీ వేయడం అలవాటు.. అలా చాలా సినిమాలు చూశాను. అందులో ఒకటి ‘సిరివెన్నెల’ వేశారు. ముక్కంటి, ముక్కోటి, తిక్క శంకరుడు.
సిరివెన్నెల గారి జీవితంలోనే కాదు, ఆయన అభిమానులుగా మారేవారికి కూడా అన్ని యాదృచ్ఛికంగా జరుగుతాయి అనుకుంటాను.
అయితే ‘ఈశ్వర్’ అనే సినిమాలో ఒక పాట లైన్ దగ్గర బాగా ఆకర్షించబడ్డాను, ‘చిరంజీవి అయినా సినిమాలు చూడగలడా? మొదటి ఆట క్యూలో నిలబడి..’
ఇలా చాలా పాటలు ఉన్నాయి.
2012లో ‘కృష్ణం వందే జగద్గురుం’లో చెలియలి కట్టను తెంచుకొని పాటతో ఇక నా మనసులో గుడి కట్టేసుకున్నాను.. ఎంతలా అంటే కొన్నాళ్ల పాటు అదే పాట కోసం మాట్లాడేంత.. పడుకునే ముందు వింటూ ఉండేంత,నిద్రలేచాక సుప్రభాతం లాగ మననం చేసుకునేంత..
అమావాస్య రోజు వెన్నెల రాదు అంటారు.. సిరివెన్నెల పాట ఉన్నంత వరకు అమావాస్య రాదు అంటాను నేను..
ఎందుకంటే ఆయన శివైక్యం పొందిన రోజు, నేను ఏడిచిన క్షణాలు ఉన్నాయి, ఆరోజే నేను ఆశ్చర్యపోయిన క్షణాలు ఉన్నాయి..
60 ఏళ్ల వృద్ధులు ఆయన మరణ వార్త మరియు పాటల కోసం మాట్లాడటం విన్నాను.. 25 ఏళ్ల పిల్లలు అదే విషయం మాట్లాడటం విన్నాను..
అంటే ఒక మనిషి వారి వయస్సు వాళ్ళకో, పిల్లలకో, మనవళ్ళకో నచ్చడం సహజం.. ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తి కోసం, ఎప్పుడూ కలవని మనిషి కోసం మాట్లాడటం ఆశ్చర్యంగా అనిపించింది.
ఆ క్షణాన్నే నాకు గర్వంగా అనిపించింది..
ఒక సిరివెన్నెల పాట వినడమే అదృష్టం అయితే, ఆయనకి అభిమానిగా ఉండటం పుణ్యం. ఆ క్షణాన్న గర్వం ఎంత అంటే రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్త గలిగేంత గర్వంతో ఎంత విర్రవీగాడో అంతకంటే ఎక్కువ..
ఆయన మన మధ్య లేరనేది ఎంత నిజమో, ఆయన మనతోనే ఉన్నారు అనేది అంత సత్యము..
మృత్యువుని జయించిన వాడు మృత్యుంజయుడు.. మరణం లేని వారు చిరంజీవుడు.. మరణించినా బ్రతికే వాడు దేవుడు, గొప్పవారు.. ఈ మూడు కలగలిపిన వారు మన సీతారాముడు..
సీ మంతమైన కలం
తా పీగా తైత్తకలాడి
రా స్తుంది ఎన్నో సుద్దులు బుద్ధులు
మ దిని రింగురింగుమనుచు
శా రికలా పచ్చ పచ్చగా
స్త్రి (స్థి)రముగా మది వెలుగు
A R Girija Krishna, Retd BSNL employee, Hyderabad
వీరరాఘవరావు ఆతుకూరి
నమస్కారం. నా పేరు అయ్యగారి రవితేజ. నేను ఒక Data Scientist ని.
నా దృష్టిలో సిరివెన్నెల..
వైద్యం రాకపోయినా మనసుకు తగిలిన గాయాన్ని నయం చెయ్యగల మానసిక వైద్యుడు!
వేదాంతాన్ని చాలా సున్నితమైన భాషలో చెప్పగలిగిన ఆత్మ యోగి!
తప్పటడుగు వేసే యువతని సరైన గమ్యం వైపు నడిపించే మార్గదర్శి!
మనిషికి కలిగే ప్రతి భావనను అనుభవించడానికి, ఆ భావనలకు తగినట్లుగా ప్రతిస్పందించడానికి వేల, వేల పాటలను మనకు వరంగా అందించిన ఒక స్నేహితుడు!
జీవితంలో తప్పొప్పులను సరి చెప్పి, జీవితాన్ని సరైన దారిలో నడిపించే గురువు!”
ఆయన ద్రోణాచార్యుడైతే నేను ఏకలవ్య శిష్యుడిని.
శ్రీ గురుభ్యోన్నమః
అయ్యగారి రవితేజ
‘సిరివెన్నెల’ సినిమా నుండి శాస్త్రి గారి సినీ సాహిత్యాన్ని వింటున్నాను. నా దృష్టిలో సిరివెన్నెల అంటే ఒక సాహిత్యపు ఎన్సైక్లోపీడియా. ఆయనదో ప్రత్యేక సాహితీ పంథా. ఆయన సాహిత్యం చాలా అర్థవంతంగా, అనుభవైకంగా ఉంటుంది. ఆయన సాహిత్య పదప్రయోగం అసామాన్యం. సులువుగా ఆకళింపుకు అందదు. చాలా లోతైన నిగూఢ అర్థం ఇమిడి ఉంటుంది. అర్థం చేసుకుంటే జీవిత పరమార్ధం అవగతమవుతుంది. శ్రీకృష్ణ భగవానుని భగవద్గీత లాంటి సారాంశం ఇమిడి ఉంటుంది ఆ సాహిత్యపు లోతులలో. అలాగని ఆయన సరళమైన భాషలో రాయలేదని కాదు. జీవితపు ఒడిదుడుకులు, ఆటుపోట్లు, సుఖదుఃఖాలు, కష్ట నష్టాలను చవిచూసి అలసిన ప్రతి మనిషి జీవితంలో ఒంటరి తనపు భావం తలెత్తడం సహజం. అటువంటి సమయంలో శాస్త్రి గారి సాహిత్యంలోని అర్థవంతమైన పాట ‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది’, అన్న పాట మరువరానిది. పాటలోని ప్రతి పదం మన కోసమే అన్నట్లుగా అనిపిస్తుంది. జీవితం ఇంతే ఏది మనది కాదు ఎవరు మనకు లేరు, అన్నింటా నేనే అంతా నేనే అన్న భావంతో ముందుకెళ్లాలి, అన్న సత్యం స్ఫురిస్తుంది.
మునుపెందరో కవులు జీవితానికి సంబందించి పంచిన భావాలను ఈ ఒక్క పాటలో పలికించిన ఘనత శాస్త్రి గారిది. సాహితీ ప్రపంచంలో చిరస్మరణీయులు శాస్త్రిగారు. శాస్త్రి గారి గురించి నా మనోభావాలు పంచుకోగల్గడం నాకు మధురనుభూతియే.
చెంబోలు సీతారామ శాస్త్రి గారిని గురువుగా భావించి, ఏకలవ్య శిష్యరికం చేసిన నన్ను నావాళ్ళు ‘ఆకలి రాజ్యం’ సినిమా డైలాగులా, “ఏం ఇప్పుడు లేవా పాడటానికి మీ గురువు గారి పాటలు” అని కొన్ని సందర్భాల్లో సవాల్ చేయడం, దానికి నేను ధీటుగా సందర్భానుగుణంగా నాలుగు పంక్తులు విసరడం చాలా అలవాటు అయినది.
అయన నాకు “నాన్న చూపిన జీవన బాట! జీవిత తీపి రుచి చూపిన గురువు.”
దాసు శ్రీహవిష
నా పేరు జి. రంగబాబు. నా దృష్టిలో సిరివెన్నెల అంటే ఒక అద్భుతమైన పరిపూర్ణ వ్యక్తిత్వం.
నేను డిగ్రీ పూర్తి చేసి పి.జి.చదువుతుండగా ‘సిరివెన్నెల’ సినిమా పాటల ఆడియో ముందుగా రిలీజ్ అయింది. టేప్ రికార్డర్ లో ‘విరించినై విరచించితిని’ పాట వింటూ ఆ పాటలోని పదాలకు అర్థాలు నిఘంటువులో వెతుక్కుంటూ ఉండేవాడిని. అదే నేను విన్న మొదటి పాట.
సిరివెన్నెల మా ఊరి వారే అవడం మరో గొప్ప అనుభూతి. ఇక 1986 లో ‘సిరివెన్నెల’ సినిమా రావడం, LIC లో నాకు ఉద్యోగం రావడం, LIC లో సిరివెన్నెల కనిష్ఠ సోదరుడు వెంకట రామ శాస్త్రి గారి పరిచయం ఇవన్నీ నా జీవితాన్ని మలుపు తిప్పాయి.
సిరివెన్నెల పాటలు రికార్డు చేసుకుని వినడం నా హాబీ అయింది.
సిరివెన్నెల గారి పరిచయ భాగ్యం, చెన్నైలో సిరివెన్నెల గారి ఇంటిలో 5 రోజులు CVR శాస్త్రి గారితో పాటు ఉండి వారు పాటలు రాసే విధానం గమనించడం, వారితో తమ్ముడిలో తమ్ముడిగా కలిసిపోవడం ఇవన్నీ నా పూర్వ జన్మ సుకృతాలు.
వారిపై మూడు వ్యాసాలు రాసి వారి పట్ల నా ఆరాధనా భావాన్ని తెలుపుకున్నాను.
అనునిత్యం వారి పాటలనే పెదాలపై పలికించుకుంటూ, జీవితానికి అన్వయించుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాను.
జి. రంగబాబు
జీవిత బీమా విశ్రాంత ఉద్యోగి, అనకాపల్లి.
నా పేరు గొంతిన కావ్య. నా చిన్నప్పటి నుండి నాకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలు అంటే ఎంతో ఇష్టం. నాకు ప్రేరణ కలిగించాయి. సిరివెన్నెల గారి పాటల వల్లనే నాకు పదాలకు, భావాలకు అర్థాలు తెలిశాయి. తెలుగు సాహిత్యంలో ఆయన స్థానం ఎప్పుడు ప్రత్యేకమైనదే.
ఆయన పాటలు విన్న ప్రతిసారీ నాలో ఒక ఆలోచన.. ఒక చైతన్యం..
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మన మధ్య లేకపోయినా, ఆయన పాటలు కాలాన్ని మించి నిలుస్తాయి. చాలా పాటల్లో తాత్వికత, జీవన వైవిధ్యం ఉంది. ప్రతి చరణం వెనుక ఒక జీవితం కనబడుతుంది.
అలాంటి మహా రచయితను అభిమానించటం అంటే జీవితాన్ని ప్రేమించటం. మనల్ని మనమే మలచుకోవడం. వారి పాటలు వినగలగడం మా జనరేషన్ చేసుకున్న అదృష్టం.
గొంతిన కావ్య, M.Tech Computers
నా పేరు ఇరువెంటి దుర్గామాధురి. ‘విరించినై..’ అనే పాట వచ్చేనాటికి 2 ఏళ్ళు రాలేదు. కానీ ఊహ తెలిశాక, ఆ పాట విన్న క్షణాన మాత్రం రచన అనే ప్రక్రియ పట్ల ఆసక్తి కలిగింది.
ఆ 10 అనే సంఖ్య చదువుల తరగతి లోకి వచ్చేసరికి, అందఱూ దాన్నో బూచిలా చూపిస్తే, చుట్టమల్లే కష్టమొస్తే.. అని విని, ౘదువు నా నేస్తం, పరీక్ష నా అతిథి, నవ్వుతూ గెలిచి పంపగలను అనుకున్నాను.
అంతటితో ఆగానా, ఆ తర్వాత కళాశాల వయసులో, చదువు, గణితం మీద మక్కువతో తెల్లవార్లూ ఆసక్తితో కూర్చునే దానిని, అయితే కుస్తీలు, భయంతో కాదు, కేవలం ఇష్టంతో.
అప్పుడు మా అమ్మ, నిశియే యింత బాగుంటే వెలుగింకెంత బాగుంటుందో అంటూ నిదుర పుచ్చేది, ఆకాశవాణిలో ఈ జామురాతిరీ, ఉదయ కాంతి అని వింటూ ఓ నూతనోత్సాహంతో విశ్రమించే దానిని.
అలా మా అమ్మ మమత చూసి ఏదైనా చెప్పాలంటే, అమ్మ అను కావ్యం కన్న కమ్మని కావ్యం ఎవరు వ్రాయగలరూ, ఆ అమ్మ పొత్తిళ్ళల్లో పసివారిని చూసి పొందే ఆనందం గురించి చెప్పాలంటే బ్రహ్మ అయినా అమ్మలా జన్మించవలసినదేనని తీర్మానించేశారు. పోనీ అనుబంధం అంటే ఏమిటో చెప్పాలంటే, ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే.. ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే అంటారు.
కనుఁక నా కలమునకూ, కరమునకూ వారిని వర్ణించే శక్తి లేదు, ఆత్మీయాశ్రువులతో అభిషేకం చేయటం ఒకటే సాధ్యము నాకు.
ఇరువెంటి దుర్గామాధురి(నాగిని)
నా పేరు జనార్దన్. నేను పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్యం వలన శాస్త్రి గారిని 2014లో కలవడం జరిగింది. శాస్త్రి గారి తమ్ముడు శ్రీరామశాస్త్రిగారితో 6 సంవత్సరాలు పైగా కలిసి పని చేయడం నా అదృష్టం. ‘సిరివెన్నెల’ నుంచి వారి సాహత్యం ప్రభావం నాపై చాలా వున్నది. ఈ సినిమాలో ఆయన రాసిన ‘మెరిసే తారలదే రూపం’ పాట నేను 50-60 సార్లు వివిధ కార్యక్రమాలలో పాడి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాను. శ్రీరామశాస్త్రిగారి స్నేహం వలన శాస్త్రి గారి వ్యక్తిత్వం నాకు కొంత అర్థం అయింది.
ఒక మనిషి తన పని ద్వారా ఇన్ని వేల మందిని ప్రభావితం చేయడం ఒక అధ్బుతం. ఇక నాకు నచ్చిన పాటలు-’శివపూజకు చివురించిన’, ‘ఆనతి నీయరా హరా’, ‘ఒంటరిగా దిగులు పడకు’, ‘సీతమ్మ అందాలు’, ‘విధాత తలపున’, ‘ఆది భిక్షువు..’
– జనార్దన్
నా పేరు మాధవపెద్ది కాళిదాసు.
మాధవపెద్ది కాళిదాసు Retd Airforce Engineer & Computer ఇంజనీరింగ్ ప్రొఫెసర్ 🙏
నమస్కారం. నా పేరు మాధురి ఇంగువ, US-తెలుగు రచయిత్రిని.
నా దృష్టిలో సిరివెన్నెల అంటే భావసాంద్రత గల అర్థ శబ్దాలంకారం.
మా ఇంట్లో చిన్నప్పటి నుండీ సంగీత సాహిత్య వాతావరణాలు ఉండటం వల్ల ఊహ తెలిసినప్పటి నుండి వేటూరి – సిరివెన్నెల గార్ల పాటలు నాకు రెండు కళ్ళలా మారాయి.
ముఖ్యంగా ‘సిరివెన్నెల’ సినిమాలోని ప్రతీ పాట యొక్క ప్రతిపదార్థాలు మా నాన్నగారు వివరించడం వల్ల సీతారామశాస్త్రి గారంటే నాకు మిక్కిలి అభిమానం. ఆపైన స్వయంకృషి, లేడీస్ టైలర్, స్వాతికిరణo వంటి ఎన్నో చిత్ర గీతాలకు ఆయనకు మనసులోనే పాదాభివందనం చేసుకున్నాను.
శాస్త్రి గారు రాసే విషాద గీతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రం. అందులోని భావ సాంద్రత, ఉపమానాల ప్రయోగం శ్లాఘనీయం. ఆయన రాసే ప్రేమ పాటలు కూడా నాకు భక్తి అద్వైత గీతాలలా వినబడతాయి. ఇక ‘రౌడీ అల్లుడు’ చిత్రంలో ‘తద్ధినక తప్పదిక’ పాట చరణాల్లోని శబ్దాలంకారం అత్యద్భుతం.
నమస్తే అండి. నా పేరు పూర్ణిమ. మొక్కపాటి. వృత్తి : రేడియో మిర్చీలో గ్రూప్ మేనేజర్ (కంటెంట్ రైటింగ్). ప్రవృత్తి: సిరివెన్నెల పాటలను నరనరానా ఆకళింపు చేసుకోవడం
ఇక నా దృష్టిలో సిరివెన్నెల అంటే..
సూరీడునైనా సల్లబరిచే మా ఱేడు చూపు
వెన్నెలనైనా వేడెక్కించే అక్షరశరాల తూపు
నడిరేయిలో సైతం కొత్త ఆశల పొద్దుపొడుపు
నైరాశ్యంలో నింపుతుంది కొండంత హోపు..!!
కలగనే కళ్లకి కళనిచ్చినా
కలతపడే మనసుకి కన్నీరొచ్చినా
సిరివెన్నెల కురిపించే వెన్నెల వాన హాయి.
ఆయన పాటల్లో చాలావరకు సామాజిక స్పృహ, ఆశావాదం చోటు చేసుకుంటాయి. మా శ్రీమతి, శ్రీవాణీశర్మ, సిరివెన్నెల సాహిత్యంపై లోతైన విశ్లేషణ చేస్తూ, నూరు వారాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆమెను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. సాహిత్యంపై ఆమెకున్న మక్కువ, సంపాదకవర్గం తోడ్పాటు, పాఠకుల ఆదరణ, ఆమె నూరు సంచికల గమనంలో తోడుగా నడిచాయి. నా దృష్టిలో సిరివెన్నెల అంటే, ఒక బాధ్యతాయుతమైన సామాజికవేత్త, ఒక ఆధ్యాత్మికవేత్త, నిరంతర ఆశావాది. ఆయన పాటలు నిరంతరం సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. మరి ముఖ్యంగా యువతను ఆకట్టుకున్న ప్రబోధాత్మకమైన వ్యక్తిత్వ వికాస గీతాలు, రాబోయే కాలాల్లో కూడా స్ఫూర్తిని కలిగిస్తూనే ఉంటాయి.
నా పేరు సిద్ధార్థ్ రామావజ్జల, నేను యునైటెడ్ స్టేట్స్ లోని నేషనల్ రెన్యుయబుల్ ఎనర్జీ లాబరేటరీలో సైంటిస్ట్ గా పని చేస్తున్నాను. అప్పటిదాకా నాకు తెలిసిన సిరివెన్నెల ఒక సినీ పాటల రచయిత. నాకు ఆయన మొదటి కవి పరిచయం, ఒక అవార్డ్స్ ఫంక్షన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ప్రసంగం ద్వారా అయ్యింది – “సిరివెన్నెల అర్ధ రాత్రి ఉదయించే సూరీడు, ఆయన పదాలు అనే కిరణాలు పట్టుకొని, అక్షరాలు అనే తూటాలు తీస్కొని, సమాధానాలు వేటాడడానికి ప్రపంచం మీదకి వెళ్తాడు.” అప్పటినుండి ఆయన సాహిత్యాన్ని విపరీతంగా ఆదరించడం మొదలుపెట్టాను.
నమస్తే. నా పేరు తెలిదేవర శ్రీకాంత్.
మనతో మనం రమించటం అనేది ఉంది చూశారు – అక్కడ పట్టుకున్నారండి అయన మన లాంటి వారందరి నాడి. ఎందుకంటే Self-love ప్రాముఖ్యతని బాగా నమ్మి, మనకి చేసి చూపించిన మనీషి ఆ మహానుభావుడు.
చిన్నపుడు రండి రండి రండి దయచేయండి అని ‘రుద్రవీణ’లో ఈ పాటని మా తాతగారి టేప్ రికార్డర్లో క్యాసెట్టు అరిగిపోయేదాకా విన్నాను – అందుకు ఇళయరాజా గారి సంగీతం ఒక కారణమైతే – సిరివెన్నెల గారి సాహిత్యం అసలు కారణమని యుక్త వయస్సుకు వస్తే కానీ అర్థం కాలేదు. 2011 – 12 లో ఊహ తెలిశాక ఒక పరిచయమైతే, చిన్నప్పుడే 8-10 ఏళ్ళ వయసులోనే మనస్సులో అయన ముద్ర పడిపోయింది. ఆ లెక్కన అయన నా జీవితమంతా సర్వాంతర్యామిలా ఉన్నారన్నమాటే.
‘సిరివెన్నెలకో నూలుపోగు’లో నాలుగు ముక్కలు వ్రాసే భాగ్యం దొరకటం నిజంగా నా అదృష్టం. అందులో చెప్పినట్టుగా “సిరివెన్నెల గారు రాసిన పాటలన్నీ timeless classics అనిపిస్తాయి నాకు. మరో వందేళ్ళ తర్వాత కూడా సిరివెన్నెల గారు చెప్పిన/నమ్మిన మనిషితనం అనేది ఒకటి ఉంటే, అప్పుడు కూడా ఆయన పాటలు చాలా relevant గా ఉంటాయి.”
“నిత్య జీవిత సత్యమని భాగవత లీలల అంతరార్థం” అని ఆయన ‘జరుగుతున్నది జగన్నాటకం’ పాటలో చెప్పినట్టు, నా వరకు “నిత్య జీవిత సత్యమని సిరివెన్నెల వారి పాటల అంతరార్థం”. ఇది ఒక individual గా, అభిమానిగా నేను ఆయనకి ఇచ్చుకున్న phenomenon!
ఆయన పాటలను విశ్లేషించేటంత అర్హత, శక్తి నాకు లేవు, పద సంపద అసలే లేదు. కానీ ఒక సగటు అభిమానిగా అయన ప్రత్యేకతలను చెప్పుకోవాలనిపించింది. ఎందుకంటే రామాయణ, మహాభారతాల్లాగా ఆయన పాటలు కూడా epics అని నా అభిప్రాయం. Epics ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అర్థమవుతాయి. ఎవరికి కావలసిన సారం వాళ్ళు నింపుకుంటూ ఉంటారు. అందుకే ఆయన పాటలు కూడా Epics/ Timeless Classics అంటాను నేను.
నా పేరు వెల్లాల శ్రీకర్. నేను వృత్తిరీత్యా గ్రాఫిక్ డిజైనర్ మరియు చిత్రకారుణ్ణి, హైదరాబాదు వాసిని.
తెలుగు సాహితీ మహోన్నత గ్రంధపు మధ్య పుఠలలోని ముఖచిత్రం. శాస్త్రి గారి ఇంటిపేరుని మార్చిన ‘సిరివెన్నెల’ చిత్రం పాటలలోని సాహిత్యాన్ని ఆస్వాదిస్తూ.. సాహితీశాస్త్రి’ గారికి దగ్గరయ్యాను.
శాస్త్రిగారి 100 పాటలపై లోతైన విశ్లేషణ చేసిన శ్రీవాణి శర్మను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. శాస్త్రి గారు తన బాణీలతో తెలుగు సినీగేయ/గేయ సాహిత్యంలో తనదైన ముద్రతో, ప్రత్యేక శైలితో, ఒక అధ్యాయమై, భావి గేయ రచయితలు అందుకోలేని మహోన్నత శిఖరాలకు తీసుకెళ్ళి, ఆయన స్థాయిలో, ఆయన శైలిలో ఇక పాటలు రాయడం కుదరదు, అని దిగులు పడి కలాలకు పని చెప్పలేక ఆగిపోయిన కొత్త రచయితలను చూస్తే.. ఆయన తెలుగు గేయ సాహిత్యానికి ‘తీవ్ర ద్రోహం’ చేశారేమో అనిపిస్తుంది నాకు.
నా దృష్టిలో సిరివెన్నెల అంటే:
కవిగా అతిశయోక్తి వ్రాసినా శాస్త్రవేత్తగా అసత్యం, అతార్కికం వ్రాయలే(రు)దు కనుక ఆయన మనిషి చరిత్రలో మొట్టమొదటి ‘వైజ్ఞానిక కవి!’. ‘మనిషితనం’ అంటూ నిర్వచించి, శోధించి, అనుక్షణం తనే ముందు ఆచరిస్తూ, మనిషి కోసం తపించి, ప్రేమించి రచించిన అందరివాడు, అభినవ శ్రీరాముడు, సీతారాముడు అన్నయ్య!
~
డా. వెంకట్ కొండా – కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ లో పిహెచ్.డి. చేసి ఇంటర్కనెక్ట్స్, ఏ. ఐయ్, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ లో అనేక డజన్ల పేటెంట్ల గ్రహీత; సిలికాన్ వ్యాలీ లో సీరియల్ ఎంట్రెప్రెన్యూర్. సాంకేతిక విజ్ఞానతృష్ణతో ముప్పైఐదేళ్ళుపైగా పాశ్చాత్యంలో (సిలికాన్ వాలీ, అమెరికా) స్థిరపడి సీతారామశాస్త్రిగారి కవిత్వము శైలి, భారతీయ సనాతన ధర్మము, మనిషితనం పరిశోధనలకు పూర్తిగా ప్రభావితమై ప్రాగ్దిశకు వారధిగా నిలచిన జీవితాంత శిష్యుడు, పరిశోధకుడు. పదమూడేళ్ళపైగా సీతారామశాస్త్రి అన్నయ్యతో అత్యంతఆత్మీయ సహప్రయాణం చేసిన అదృష్టంపొందిన తమ్ముడు, మిత్రుడు, జగమంత కుటుంబ సభ్యుడు.
నా పేరు విజయసారథి జీడిగుంట.
సినిమా పాటల రచనల ద్వారా.. కేవలం సినిమా పాటల రచనల ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక మహోన్నత స్థానాన్ని (legendary status) సంపాదించుకున్న వ్యక్తులెవరైనా వున్నారంటే నా దృష్టి లో అది కేవలం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మాత్రమే..
అవసరమైతే తమ విలువలకు తిలోదకాలు ఇవ్వవలసిన సినీ గేయ రచయిత వృత్తిని చేపట్టి కూడా ఉన్నతమైన ప్రమాణాలతో, తన ఉనికిని, విలువల్ని కాపు కాసుకుంటూ తన సిద్ధాంతాల్ని, నమ్మకాల్ని కాపాడుకుంటూ తెలుగు సాహిత్య చరిత్రలో కేవలం తన సినిమా పాటల రచనల ద్వారానే తారాస్థాయికి చేరుకొని, ఒక బాధ్యతాయుతమైన రచయితగా సుస్థిరమైన స్థానం సంపాదించడం ఏమంత సామాన్య విషయం కాదు.
తన పాటల్లో ఒకవైపు తనదైన భావం పలికిస్తూనే మరో వైపు సినిమా సన్నివేశానికి సరిగ్గా సరిపోయే భావాన్ని కూడా ఇవ్వగలగడం ఆయనకి పెన్నుతో పెట్టిన విద్య. అంతే కాదు తను నమ్మిన మానవీయతా విలువలకి, సిద్ధాంతాలకి కట్టుబడి చలన చిత్రపరిశ్రమ రంగంలో ఒక మహోన్నతమైన స్థితికి ఎదగగలిగారు.
సిరివెన్నెల పాటలతో నా మొదటి పరిచయం ‘సిరివెన్నెల’ పాటల తోటే. అంటే సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు వ్రాసిన పాటలతో నా సహవాసం ‘సిరివెన్నెల’ సినిమాలో పాటల ద్వారానే జరిగింది. సినిమా ద్వారా జరిగిన పరిచయం కాబట్టి It’s Love At First Sight and Sound అనాలేమో. చాలా మందిని ఆకర్షించి ప్రేమలో పడేసిన ‘విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం’ అనే పంక్తులతో ప్రారంభమైన ఆ సినిమా కోసం ఆయన వ్రాసిన ఆ మొదటి పూర్తి పాట నుంచి మొదలైన ప్రేమాభిమానాలు ఆయన చివరగా వ్రాసిన ‘శ్యామ్ సింగారాయ్’లో ‘నెలరాజుని ఇలరాణిని.. కలిపింది కదా సిరివెన్నెల’ పాట వరకు కొనసాగాయి. ప్రత్యక్ష పరిచయం 2007 ఏప్రిల్‌లో జరిగింది. అప్పటినుంచి ఎన్నిసార్లు కలిసామో ఎన్ని సినిమా పాటల మీద సినేతర సాహిత్యం మీద కబుర్లు చెప్పుకున్నామో లెక్కలేదు.
అదృష్టవశాత్తూ మా అబ్బాయి వరుణ్ సందేశ్ సినిమాలకు కూడా ఆయన అద్భుతమైన పాట వ్రాసారు. అందులో ఒక పాట అత్యంత జనాదరణ పొంది ఆయన రాసిన పది గొప్ప పాటల్లో కూడా చోటు చేసుకునే ‘నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా’ కావడం మావాడి పూర్వ జన్మ సుకృతంగా భావిస్తాను.
శ్రీవాణిగారు సంచిక అంతర్జాల పత్రిక కోసం ‘సిరివెన్నెల పాట నా మాట’ శీర్షికతో సిరివెన్నెల పాటల వ్యాఖ్యానం, 100వ వారాలు పూర్తిచేసుకున్న శుభ సందర్భంగా, ఆమెకు పరిచయమున్న సిరివెన్నెల జగమంత కుటుంబ/సమూహ/అభిమానల వద్ద నుండి వారి దృష్టిలో సిరివెన్నెల అంటే.. అనే నిర్వచనాలు కలెక్ట్ చేసి, ప్రచురించాలని అనుకోవడం చాలా ఆనందకరమైన విషయం.. ఆమె శాస్త్రి గారి ఎన్నో పాటల గురించి ఎంతో అద్భుతంగా విశ్లేషించారు కాబట్టి పాటల జోలికి వెళ్లకుండా సిరివెన్నెల అంటే ఎలా నిర్వచిస్తాం.. అని ఆలోచిస్తే రామాయణంలో రామ రావణ యుద్ధం గురించి చెబుతూ ఆ యుద్ధాన్ని దేనితో పోల్చాలో తెలియక వాల్మీకి మహర్షి వ్రాసిన శ్లోకం ఒకటి గుర్తొచ్చింది.
“గగనం గగనాకారం సాగరః సాగరోపమః
రామరావణయోరుయుద్ధం రామరావణయోరివ”
ఆకాశం ఆకాశంలాగే ఉంటుంది.. సముద్రం సముద్రంలాగే ఉంటుంది.. అలాగే రామారావణ యుద్ధం రామరావణ యుద్ధంలాగే ఉంది అని చెప్పి వదిలేశాడు ఆదికవి.
అలాగే నా దృష్టిలో సిరివెన్నెల అనే పదానికి నిర్వచనం సిరివెన్నెలే.. ఆయనకి ఆయనే సాటి అంటారుగా అలా..
నా చిరు పరిచయం
విజయసారథి జీడిగుంట:
నేను, కంప్యూటర్ సాఫ్ట్ వేర్ రంగంలో గత 31 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటూ ప్రస్తుతం Infosys కంపెనీలో principal consultant గా ఉద్యోగ రీత్యా పనిచేస్తున్నాను. చిన్నతనం నుండీ సంగీతం పట్ల, సినిమాల పట్ల, తెలుగు సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ. సినిమా పాటల మీద, అలాగే సినిమాల మీద, తెలుగు సాహిత్యం మీద అనేక పత్రికలలో, బ్లాగులలో వ్యాసాలు రాశాను. కొన్నేళ్ల క్రితం టోరీ లైవ్ రేడియో టాక్ షో లో ‘సిరివెన్నెల గీతా భాష్యం’ శీర్షికతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటలపై వ్యాఖ్యానాన్ని అందించాను. ఎప్పటికైనా సిరివెన్నెల సినీ గీతాలలో తాత్వికత మీద Ph.D. పట్టా పుచ్చుకోవాలని అభిలాష. ప్రస్తుత నివాసస్థలం అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రం లోని ఓర్లాండో నగరం.
నా పేరు వినోద్ కుమార్.
వినోద్ కుమార్, program Manager, Bangalore
నా పేరు వివేక్.
ఒక 14 యేళ్ళ పిల్లాడికి సాహిత్యం పట్ల ఆసక్తి కలిగి, తనకి కూడా ఒక పాటల రచయిత అవ్వాలని కోరిక బలంగా నాటుకుపోయేలా చేయగలగటం ఆయనకే చెల్లు.
పదాల సిరితో భావాల వెన్నెల కురిపించగల రేడు
పాటలతో మనసుల మార్చగల మాంత్రికుడు
అక్షరాలతో భక్తులను సృష్టించగల దేవుడు
పాటంత కాలం చిరస్మరణీయుడు
సాహితీ చరిత్రలో చిరంజీవుడు
మా (మన)సీతారాముడు
సాహో సిరివెన్నెల.
వివేక్
Software (lyricist)
నా పేరు యశ్వంత్ ఆలూరు
ఆ స్ఫూర్తితో మిగతా రచయితలనూ తెలుసుకోగలిగాను. నా దృష్టిలో సిరివెన్నెల దేవుడు కాదు. సాహిత్యమనే ఆలయంలోకి ప్రవేశించే దారి చూపిన గాలిగోపురం!
-యశ్వంత్ ఆలూరు
శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ గారు ఆంగ్ల అధ్యాపకురాలు, వ్యక్తిత్వ వికాస నిపుణురాలు, గీత రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు(తెలుగు-ఇంగ్లీష్-హిందీ), సామాజిక కార్యకర్త.