భాగవతం అంటే ఏమిటి?
చర్చ: ఆచార్య రాణీ సదాశివమూర్తి; డా.సూరం శ్రీనివాసులు; శ్రీ పాలడుగు శ్రీచరణ్; శ్రీ పాలకుర్తి రామమూర్తి; & డా. ఏల్చూరి
― ప్రశ్న, వ్యాస రూపీకరణ: గంగిశెట్టి లనా.
“భాగవతం తెలిసి పలుకుట చిత్రము, శూలి కైన తమ్మి చూలి కైన” అన్నాడు పోతన్న! లోతుకు వెళ్లే కొద్దీ ఆ మాట ఎంత సత్యమనిపిస్తుంది..!
ఆ మహాకవి పోతన్న అంత మధురంగా, పామరుల నోట కూడా నిలిచిపోయేటంత సులువుగా శ్రీ మద్భాగవతాన్ని తెలుగు చేసి మనకు అందించినా , నాకు మాత్రం దాన్ని చదివేకొద్దీ అనేక అనుమానాలు చిన్నవీ, పెద్దవీ తలెత్తుతూనే ఉంటాయి.
అధ్యయనబలం లేని కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వాణ్ణి కనుక, అనుమానాలు కలిగినప్పుడు పెద్దలను అడగడానికి ఇప్పటికీ సందేహించని విద్యార్థినే కనుక, ఏ అనుమానాలైనా తీర్చడానికి సహృదయ కల్పవల్లిలా మా సిరికోన ఉండనే ఉంది కనుక, అందులోని సహృదయ విద్వాంసులకు నా సందేహాలు నివేదించాను. ముఖే ముఖే సరస్వతీ…. కోనలోని మిత్రులు తమకు తోచిన రీతిలో సందేహ నివృత్తి చేయడానికి యత్నించిన దాని వ్యాస రూపమే ఇది:
నా ప్రశ్న: …..”ఏది చదవడానికి తీసుకొన్నా, ముందు ఆ రచన పేరుకు అర్థం ఏమిటి? దేని గూర్చి? అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి. ఉత్పన్నమై తీరాలి. అలాగే నాకూ భాగవతం అంటే ఏమిటి? అనే ప్రశ్న కలగడం సహజం.
ఏ ప్రశ్నకైనా, ముందుగా చూడవలసింది–ఆ గ్రంథంలో గ్రంథకర్త ఏం సమాధానం చెప్పాడు అనే విషయం.
భాగ. ప్రథమ స్కంధంలో పోతన గారు “నేనాంధ్రంబున రచియింప బూనిన శ్రీ మహాభాగవత పురాణమునకు కథా ప్రారంభం” ఎట్టి దనిన అంటూ (౧-33)
“సత్యం పరం ధీమహి” యను గాయత్రీ ప్రారంభమున గాయత్రీ నామ బ్రహ్మ స్వరూపంబై మత్స్య పురాణంబు లోన గాయత్రి నధికరించి ధర్మ విస్తారము వృత్రాసుర వధ నెందు చెప్పంబడు నదియ భాగవతంబని పలుకుటం జేసి యీ పురాణంబు శ్రీ మహాభాగవతంబన నొప్పుచుండు” (౧–35) అని స్పష్టంగా వివరించారు.
ఇక్కడే నాకు ప్రథమ అనుమానం కలిగింది….
పోతన్న గారు, దీనికి ముందున్న ౧–34 పద్యం చివర, జన్మ స్థితి విలయాలను నిత్యం ప్రవర్తింపచేసే, ఆ ‘సత్యు, పరుని, అనుదినం’ ధ్యానిస్తాననే స్పష్టం చేశారు. కనుక వారనుష్ఠించిన గాయత్రి లోని మూలపు మాటలు ఇవే అనేది స్పష్టం. పూర్వం ఒకప్పుడు ఈ మాటలే ఉండి, తర్వాత మార్పు వచ్చిందా? లేదా ఇలా చెప్పటం కూడా ఇప్పటికీ సమాంతరంగా ఉందా? లేదా ఏ ఏ దైవాలనుద్దేశించి ఆయా గాయత్రులను కూడా ప్రచారం లోకి తెచ్చారు కనుక (ఉదా: ‘శనీశ్వర గాయత్రి’- సుప్రసిద్ధ శనీశ్వర క్షేత్రం, తిరునల్లార్లో దీన్ని నాకు చెప్పారు), ఆ సంప్రదాయంలో భాగంగానే ఈ మాటలు వచ్చాయా?
ఇది నా మొదటి అనుమానం…
ఇందులో ప్రథమాంశమైన ధర్మమనే మాట అర్థం చాలా విస్తృతమైంది కనుక, ఇక్కడ చెప్పాడు, ఇక్కడ చెప్పలేదు అనే విచికిత్స ఉత్పన్నం కాదు కాబట్టి దాన్ని పక్కన పెట్టి– రెండో ముఖ్యాంశం ‘వృత్రాసుర వధ’ వృత్తాంతం చూద్దాం.
వేదంలో అతి ప్రధానంగా కనిపించే ఇతివృత్తాల్లో ఇదొకటి. వేదకల్పతరువు నాశ్రయించిన అన్ని కథనాల్లోనూ దాన్ని స్మరించడం ఆనవాయితీ. కేవలం ఆ ఆనవాయితీగానే పోతన్న దీన్ని స్మరించాడా?
ఆ వధ నొనర్చిన ధీరుడు, ఇంద్రదేవుని, బాలకృష్ణుడు పరాజితుని చేయటం తెలుగు భాగవతంలోని రసవద్ఘట్టాల్లో ఒకటిగా పోతనగారు చిత్రించారు. పశుబలి ప్రధానమైన యజ్ఞసంస్కృతి మీద తిరుగుబాటుగా శ్రీకృష్ణ వాసుదేవుని భాగవతోద్యమం వచ్చిందని చారిత్రకులు పరిగణించడం కూడా కద్దు…. దాన్నటుంచినా, ఇక్కడ, పోతన గారేమిటి? తాను ప్రథమంగా నిర్వచించిన ముఖ్య అంశాన్నే విస్మరిస్తూ, దానికి వ్యతిరేకంగా రచన చేశారు అనే అనుమానం పీడిస్తోంది.
గాయత్రి అనుష్టుప్పు ఛందస్సులో కదా ఉంది.. పంక్తికి 8 అక్షరాలు.
సత్యం పరం ధీమహి అంటే ఒక ఒక అక్షరం తగ్గుతుంది కదా(భర్గో దేవస్య ధీమహి లో అలా తగ్గటం లేదు). పోతన దృష్టిలో అది ‘పరం’ మాత్రమే, ‘పరమం’ కాదు అనడానికి ఆయన అంతకు మునుపటి పద్యంలో సత్యు, పరుని ననుదినంబు’ అనటమే సాక్ష్యం.
మరి అక్షరం కూడా తగ్గిన ఈ గాయత్రి స్తుతి, తద్రూపంగా, దాన్ని కూడా అతిశయించిన రూపంగా, భావించబడే భాగవతంలో నిర్వచనప్రాయ వచనంగా దర్శనమిస్తోందేమిటి?
ఇవి అర్థం లేని అనుమానాలుగా కొందరికి అగుపించవచ్చు. కానీ క్లాసికల్ స్టడీస్ అధ్యయనంలో, ముఖ్యంగా నిరంతర పరిణామ శీలమైన భారతీయ సంస్కృతి అధ్యయనంలో ఇవి కీలక ప్రశ్నలే అనే విషయాన్ని సంశోధక బుద్ధి కలిగిన మిత్రులు అంగీకరిస్తారని నా విశ్వాసం. పైగా నావంటి మరికొందరు అపరిణత బుద్ధులు కూడా మన కోనలో ఉన్నారు కనుక, మన్నించి ఈ చిన్న అనుమానాలు తీర్ప కోరుచున్నాను” అంటూ ఈ వ్యాసరచయిత సిరికోనలో ఆ మధ్య తన ప్రశ్నలనిలా ప్రవేశపెట్టాడు.
***
దీనిమీద మొదటగా డా.సూరం శ్రీనివాసులు గారు ఇలా దయతో స్పందించారు:
“భగవతః భగవత్యాః వా ఇదం భాగవతమ్’ అని భాగవతశబ్ద వ్యుత్పత్తి. భగవంతుని గూర్చి లేదా భగవతి గూర్చి చెప్పేది ఏదైనా భాగవతమే. అయినా ద్వాదశస్కంధాత్మకమై నారాయణుని అవతార విశేషాలను వర్ణిస్తూ వ్రాసిన పురాణార్థంలో అది రూఢమైంది. అది అష్టాదశపురాణాలలో ఒకటైంది. దేవీభాగవతం ఉపపురాణమైంది.
కొందరి లెక్కలో దేవీభాగవతమే మహాపురాణం. భాగవతం ఉపపురాణం.
మత్స్యపురాణంలోనే కాదు. ఇతర పురాణాలలోనూ భాగవత ప్రస్తావన ముంటుంది. భాగవత వ్యాఖ్యలో శ్రీధరస్వామి పద్మపురాణం నుండీ ఉద్ధరించి చూపారు. శబ్దకల్పద్రుమం మరో పురాణం నుండీ శ్లోకాలను
ఎత్తి చూపింది. ఇంకా ఉండవచ్చు కూడా. పురాణాల కాలనిర్ణయం పౌర్వాపర్యనిర్ణయం అసాధ్యం. శాస్త్రీయపరిశోధనకూ, భక్తికీ లంకె కుదరదు. రెండూ సమాంతరాలు. సమన్వయం చేయాలని ప్రయత్నిస్తే ఇద్దరూ ఒప్పుకోరు.”
ఈ చివరిమాట మరీ అమూల్యమైంది. అక్షర సత్యం కూడా! (అందుకే కాబోలు ఆ రెండో రోజో ఏమో ఒకరు నిష్క్రమించారు…)
ఆ మరుసటి రోజు శ్రీ పాలకుర్తి రామమూర్తి గారు ఇలా మరికాస్త విపులంగా స్పందించారు:
“ఆచార్య గ. ల. నా. గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే స్థాయి నాకు లేదు. అలాగని చాంచల్యత ఊరుకోదు. కాబట్టి భాగవత ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్నను నేనే వేసుకొని ఒకసారి “ధారా రాధాకృష్ణమూర్తి గారు” వ్రాసిన “ఆచార్య ఎక్కిరాల కృష్ణమాచార్య భాగవత హృదయము” అనే పుస్తకాన్ని చదివాను. దానితో నాలో కలిగిన అసంబద్ధ భావాలను పెద్దలు సవరిస్తారనే నమ్మకంతో.. మీ అందరి ముందు పెట్టేందుకు సాహసిస్తున్నాను. తప్పో ఒప్పో బయటకు రాకపోతే సరిచేసుకునే అవకాశం ఉండదనేది నమ్మిన వాడిని… కాబట్టి సాహసిస్తున్నాను. పరిశీలించగలరు.
“అలసులు, మందబుద్ధిబలు, లల్పతరాయువు, లుగ్ర రోగ సం
కలితులు, మందభాగ్యులు, సుకర్మము లెవ్వియుఁ జేయ జాలరీ
కలియుగమందు మానవులు గావున నెయ్యది సర్వసౌఖ్యమై
యలవడు, నేమిటిం బొడము నాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే!”
(పోతన భాగవతము 1-42)
భాగవతుల గాథలను గూర్చి చెప్పేది భాగవతము. భగవంతుని తత్త్వాన్ని గూర్చి వివరించేది భాగవతము. ఎక్కడి నుండి ఈ భూమికి వచ్చాము, ఎక్కడికి వెళతాము, రాకపోకల మధ్యనున్న ఈ జీవిత ప్రయోజనమేమిటో అవగతం చేసుకునేందుకు ఉపకరించేది భాగవతము. లక్ష్యాన్ని చేరడానికి కర్మమార్గము, జ్ఞానమార్గము, భక్తిమార్గము అనే మూడు మార్గాలనూ ప్రవచించింది, భాగవతము. కర్తవ్య నిర్వహణద్వారా, జ్ఞానాధ్యాయనంలో ఆధ్యయనాధ్యాపకత్వాల ద్వారా, సర్వ సమర్పణా భావన ద్వారా భగవంతుని చేరుకోవడం సాధ్యమని భాగవతం చెపుతున్నది.
వేద వ్యాసులు సమస్త వేదాది విజ్ఞానాన్ని సముపార్జించి, సంస్కరించి కలియుగానికి అవసరమైన విధానంలో అందించాడు. అలాగే పరాశరుడు వేదవాఙ్మయమున నున్న విజ్ఞానాన్ని సంస్కరించి విష్ణు పురాణముగా నిబద్ధీకరించాడు. దానిని వ్యాసులవారు 18 పురాణాలుగా విభజించి అందించాడు. ఆయన శిష్యుడైన సూతుని ద్వారా ఆ పురాణాలను ప్రచారం చేయించాడు.
కష్టజీవులకు కావలసినది అనుభూతి. భక్తిభావనతో కూడిన అనుభూతి, అనుభవ ప్రధానమై భగవంతుని గూర్చి అనుభవ పూర్వకంగా తెలుసుకునేందుకు మార్గం చూపుతుంది. వేద విజ్ఞానం అనుభూతిని ఇస్తుంది కాని దానిని అభ్యసించిన వేళ మనసు అనుభూతిని చెందడం కన్నా విజ్ఞానశాఖలపైకి మీమాంసలపైకి మళ్ళే అవకాశం ఉన్నది. జ్ఞాన సాధనలో అనుభూతికన్నా జిజ్ఞాసయే అధికం. భ్రమలు హెచ్చి గుణదోష విమర్శలతో మతభేదాలు కూడా ఆవిష్కృతం కావచ్చు. అంతేకాక మానవులు సాధారణంగా అర్థకామాదులను సాధించడంలో ధర్మాన్ని అనుసరిస్తారే కాని ధర్మం కొరకు అర్థకామాలనే భావనకూ దూరమయ్యే అవకాశమూ ఉన్నది.
దానిని దృష్టిలో పెట్టుకొని వ్యాసులవారు విజ్ఞానాన్ని అభ్యసించేందుకు అవసరమైన మేధ లేని వారిని కూడా తరింపచేసేందుకు భాగవత గాథలను ప్రవచించారు.. అలసత్వ భావన కలిగిన వారు, మందబుద్ధి కలిగిన వారు, అల్పాయుష్కులు, పెద్దపెద్ద రోగాలతో బాధింపబడేవారు, మందభాగ్యులు నైన మానవులు కలియుగంలో ఏకాగ్రతలేని కారణంగా అర్థకామాల సాధనలో తలమునకలై సకల సౌఖ్యప్రదమైన మార్గాన్ని గుర్తించలేరు. కాబట్టి వారిని తరింపచేసే మార్గాన్ని తాను తెలుసుకోలేని కారణంగా వ్యాసమహర్షి ఆ మార్గాన్ని చెప్పమని నారదుని అడగడం… నారదుడు ఆ మార్గాన్ని వ్యాసులకు ఉపదేశించడం జరిగింది.
సృష్టి సమయంలో విష్ణువుగా కృష్ణుడు బ్రహ్మకు ఉపదేశించిన భాగవత ధర్మ రహస్యాలు, కృష్ణ నిర్యాణకాలంలో మైత్రేయునికి, మైత్రేయునిచే విదురునికి ఉపదేశించబడ్డాయి.
నాదోపాసనద్వారా పరబ్రహ్మమున లయంకావడం కూడా భక్తిమార్గంగానే చెప్పబడింది. ఆ మార్గమే భాగవత సంప్రదాయంగా కూడా నిలిచిందని చెపుతారు. సంకీర్తనలు, భజనలలాంటి వాటికి అదే మూలం. ఏదయినా ఆనందానుభూతిని ప్రసాదించడమే అత్యంత ఆవశ్యకమైన విషయం. ఆ నాదోపాసనకు సమానమైనది సాహిత్యోపాసన అంటారు. నిజానికి భారతాది గ్రంథాల ప్రయోజనం విజ్ఞానార్జన కాగా భాగవతానికి అనుభూతిని పొందడం ప్రధానము.
నారదుడు (నారం దదాతి ఇతి నారద – జ్ఞానమును ఇచ్చువాడు నారదుడు) నాదోపాసనను, సాహిత్య ఉపాసనమును చేసి తరించాడు. అతని ఉపాసన మూడు అంతస్తరాలలో జరిగింది అంటారు. అవి ఒకటి విష్ణూపాసనము, రెండవది వాసుదేవోపాసనము, మూడవది నారాయణోపాసనము. విశ్వమే విష్ణువు అని భావిస్తూ ఆకారభావాదులను స్మరించుకొనుచు ముందుకు సాగడం విష్ణూపాసనగా చెపుతారు. అంతటా వసించునట్టి భగవంతుడిని అన్నింటిలోనూ దర్శిస్తూ, భావిస్తూ కామక్రోధాదులకు అతీతంగా ఉపాసించడం వాసుదేవోపాసనగా చెప్పబడింది. ఇక జీవుని అంతర్గత ప్రజ్ఞ భగవంతుని అనంత ప్రజ్ఞలో లయమై సర్వాంతర్యామిత్వాన్ని పొందుతుందనే “యెఱుక”ను కలగడం నారాయణోపాసనగా చెపుతారు. ఈ మూడు సోపానముల యందు లేదా అంతస్తరముల యందు లేదా పార్శ్వముల యందు ఆచరణీయమైన మార్గమును చూపి అనుభూతిని కలిగించి ఉపదేశమును చేయడమే భాగవతము యొక్క పరమార్థము.
ఆయా మార్గాలలో భగవంతుని దర్శించి తరించిన భాగవతుల గాథలను అస్వాదించి అనుభూతులను పెంచుకొని, ఆ మార్గాలలో ప్రయాణించి జీవితాన్ని సార్ధకం చేసుకోవడమే భాగవత ప్రయోజనంగా భావిస్తున్నాను…
ఆ మధ్యలో డా.రాయదుర్గం విజయలక్ష్మి గారు. నా ప్రశ్నలను, ఆచార్య ఏల్చూరి మురళీధరరావు గారికి పంపుతూ, వారి స్పందనను కోరగా, వారు ఇచ్చిన బదులును కోనలో మిత్రుల కోసం పంచారు:
డా.ఏల్చూరి గారి మాటలు: “మీరడిగిన ప్రశ్నలు రెండింటిలో గాయత్రీ మంత్రస్వరూపాన్ని గురించిన చర్చకు ప్రారంభ వివరణగా ఈ క్రింది లంకెను చూడండి.
https://www.auchithyam.com/articles/gayatri.php
ఆ తర్వాత పోతన గారి ఈ పద్యాన్ని, ఆ తర్వాత వచనాన్ని చూడండి:
సీ.
“విశ్వ జన్మస్థితివిలయంబు లెవ్వని
వలన నేర్పడు, ననువర్తనమున
వ్యావర్తనమునఁ గార్యములం దభిజ్ఞుఁడై
తాన రాజగుచుఁ జిత్తమునఁ జేసి
వేదంబు లజునకు విదితముల్ గావించె
నెవ్వఁడు, బుధులు మోహింతురెవ్వ
నికి, నెండమావుల నీటఁ గాచాదుల
నన్యోన్యబుద్ధి దా నడరునట్లు
ఆ.వె. త్రిగుణసృష్టి యెందు దీపించి సత్యము
భంగిఁ దోఁచు, స్వప్రభానిరస్త
కుహకుఁ డెవ్వఁ, డతనిఁ గోరి చింతించెద,
ననఘు సత్యుఁ బరుని ననుదినంబు.
ఇట్లు “సత్యం పరం ధీమహి”యను గాయత్రీ ప్రారంభమున గాయత్రీ నామబ్రహ్మ స్వరూపంబై మత్స్యపురాణంబులోన గాయత్రి నధికరించి ధర్మవిస్తరంబును వృత్రాసుర వధంబును నెందుఁ జెప్పంబడు నదియ భాగవతం బని పలుకుటం జేసి, యీ పురాణంబు శ్రీమహాభాగవతం బన నొప్పుచుండు.”
పైని లంకెలో ఇచ్చిన శ్లోకాన్ని గాయత్రీ మంత్రపరకంగా వ్యాఖ్యానించిన వారు శ్రీ శ్రీధరస్వామి వరేణ్యులు. సుప్రసిద్ధమే కనుక వారి వ్యాఖ్యను నేనిక్కడ ఉదాహరించటం లేదు. పోతన గారు శ్రీధరస్వామి వ్యాఖ్యను అనుసరించి ఆ మాటలను వ్రాశారు.
శ్రీధరస్వామి గారి ఆ ఒక్క వ్యాఖ్యపై కనీసం ఏడెనిమిది వందల పుటల వివరణలు సంస్కృతంలోనూ, హిందీలోనూ ఉన్నాయి. శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు ‘పోతనగారి సహజపాండిత్యము’ అనే గొప్ప గ్రంథంలో దానిని సప్రమాణంగా వివరించారు. ఆ మాటలకు మనము సరిక్రొత్తగా జోడింపగలదేమీ లేదు.
అది గాయత్రీ మంత్రమని కాదు అర్థం: గాయత్రీ మంత్రార్థం దానిలో ప్రతిపాదింపబడిందని….
మత్స్య – భాగవత పురాణముల పూర్వాపరవిషయమైన చర్చ:
పోతన గారు చాలా జాగ్రత్తగా తెలుగుచేశారు: “యత్రాధికృత్య గాయత్రీం వర్ణ్యతే ధర్మవిస్తరః” అని మత్స్యపురాణంలోని నిర్వచనం. ఆ మాటను ప్రస్తావించినవారు శ్రీధరస్వామి. అది భాగవతంలోని మాట కాదు. వ్యాఖ్యాతౄదాహృతమైన వాక్యం….
“ఈ శ్లోకము గాయత్రిని ప్రతిపాదిస్తున్నది” అన్న శ్రీధరస్వామి వ్యాఖ్యను పోతన గారు తెలుగుచేశారు….
“ఎందుఁ జెప్పం బడు” అన్న తెనిగింపు ఎంత అందంగా ఉన్నదో చూడండి. “ఎందులో చెప్పబడుతుందో” — అంటే, “ఎందులో (భావికాలంలో) చెప్పబడుతుందో” అనే అర్థంకూడా తొంగిచూస్తున్నది.”
కోనలో ఎవరికి ఏ సందేహం కలిగినా, ఝడితి సమాధానంతో తీర్చే ఉదార స్వభావులు ఆచార్య రాణీ సదాశివమూర్తి గారు. కానీ వారికి అత్యంత ఆప్తులు, సకల విద్వజ్జన మాన్యులు అయిన వారి కులపతుల (సంస్కృత జాతీయ విశ్వవిద్యాలయం, తిరుపతి) ఆకస్మిక మరణం వల్ల, విషణ్ణ చిత్తులై వెంటనే స్పందించలేకపోయారు. కొంత ఆలస్యంగా స్పందిస్తూ: “సూరం వారి సమాధానం కాలోచితం. సముచితం. అంతకంటే గొప్ప సమాధానం ఇవ్వడానికి లేదేమో. అయితే మీరు వెలిబుచ్చిన సందేశాంశము అయిన సత్యం పరం ధీమహి అది వైదిక గాయత్రీ మంత్రపాదం కాదు. భాగవత శార్దూల విక్రీడితంలో చరమపాదాంతభాగం.
ఆ శ్లోకం పూర్తి పాఠం ఇది:
జన్మాద్యస్య యతోఽన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞః స్వరాట్ ।
తేనే బ్రహ్మ హృదా య ఆదికవయే ముహ్యన్తి యత్సూరయః ।।
తేజోవారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గోఽమృషా ।
ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ।।1।।
ఈ శ్లోకానికి నాది కాని వ్యాఖ్యా చతుష్టయం ఉన్నది.👇 భాగవతానికి అద్వైత విశిష్టాద్వైత వ్యాఖ్యానాలే కాక ఇతర అన్వయాలు కూడా ఉన్నాయి
గాయత్రీ మంత్ర వ్యాఖ్యానం
ఇదే శ్లోకానికి గాయత్రీ మంత్ర పరమైన వ్యాఖ్యానం ఉంది.
సత్యంపరం ధీమహిః సూర్య భగవానునికి యేడు కిరణాలు. మూడు కన్నులు ఐదు శిరస్సులు.
సవిత. ఈ మూడే జన్మాది యద్య యతః
స్వేన ధామ్నా – అంటే దివ్యమైన తేజస్సు అంటే భర్గః.
జన్మాది అస్య యత: అనే దానికి సవితా అనేది సవితా అనే దానికి అన్వయం అవుతుంది
ధామ్నా స్వేన నిరస్త కుహకం – అంటే తన దివ్యమైన తేజస్సు. భర్గః అంటే తేజస్సు
పరం అంటే వరేణ్యం
ధియో యో నః ప్రచోదయాత్: అంటే మా బుద్ధిని ఎవరు ప్రచోదిస్తున్నారో. దీనికి తేనే బ్రహ్మ బృధా సరిపోతుంది. అంటే ధియో యోన: ప్రచోదయాత్. బ్రహ్మకు ఎవరు ప్రేరేపించి వేదాలని అనుగ్రహించారో భాగవత ధ్యాన శ్లోకం గాయత్రీ మంత్రం యొక్క అర్థాన్నే చెప్పింది. సృష్టిని సృష్టించి రక్షించే పరమాత్మ తేజస్సును ధ్యానిస్తున్నాను. ఆ తేజస్సు భగవంతుని మనం చేరడానికి కావల్సిన ఉత్తమ బుద్ధిని ప్రసాదిస్తుంది.
కృష్ణాన్వయం
ఈ శ్లోకం కృష్ణ పరమాత్మనే చెప్తుంది. సత్యం పరం ధీమహి. పరమాత్మ సత్యం యందే ఉన్నాడు.
పరమాత్మ సత్య స్వరూపుడు. సత్య నేమి (సత్యమే అంచుగా కలవాడు), సత్యానికే సత్యం.
సత్యం పరం ధీమహి అన్నమాట – పరం కృష్ణం ధీమహి
ఆద్యస్య జన్మ యత: పరమాత్మ పుట్టుకు ఎక్కడినుంచి
అన్వయాత్ ఇతరత: ఒక చోట పుట్టి ఇంకో చోటికి వెళ్ళాడు. ప్రతీసారి ఇంకోచోటికి వెళ్తూనే ఉంటాడు. మధురలో పుట్టి బృందావనంలో పెరిగి ద్వారకకు ఎందుకు వెళ్ళాడు – అర్థేషు అభిజ్ఞ్యా – యేమి చెయ్యాలో తెలిసిన వాడు కాబట్టి
తేనే బ్రహ్మ బృదా ఆది కవయే: చిన్నవాడిగా ఉన్నప్పుడే బ్రహ్మగారికే తత్వం చెప్పాడు.
ముహ్యంతి యత్ సూరయ: ఎంతోమంది జ్ఞానులు కూడా మోహం పొందారు. ఇంద్రుడు కాళీయుడు బలరాముడు అందరూ మోహం చెందారు. వీళ్ళందరూ సూరయ: (అంటే జ్ఞానులే)
తేజో వారి ….. యథా వినిమయ: రాసలీలలో కృష్ణ పరమాత్మ దగ్గరగా ఉన్నపుడు యమునా నది చల్లబడి రాయి అయ్యింది, చంద్రుడు కృష్ణుని అందాన్ని చూసి కళావిహీనుడయ్యాడు
యత్ర త్రిసర్గ: ….: ఇక్కడకూడ మధుర బృందావనం ద్వారకలో ఉన్నాడు
ధామ్నా స్వేన …కుహకం: అంతమంది రాక్షసులను తన దివ్యమైన తేజస్సుతో సంహరించాడు
భాగవత పరమైన అన్వయం
ఇవన్నీ కాకుండా భాగవతమే ఈ శ్లోకానికి వ్యాఖ్యానం
ఆద్యస్య – మొదటిపురుషుడు పరమాత్మ. ఈయన ఆవిర్భావం మనకు భాగవతమే. ఇక్కడినుంచే ఆవిర్భవించాడు.
అవయాత్ ఇతరత: భాగవతంలోనే కృష్ణ తత్వం సంపూర్ణంగా ఉంది
అర్థేషు అభిజ్ఞ్య: సంసారంలో ఉన్నవాళ్ళకు భగవంతుని యందు భక్తి యేమి చెప్తే మొలకెక్కుతుందో అది తెలిసినది భాగవతం. తక్కిన పురాణాల్లో లేని విషయం భాగవతంలో ఉంది. యెలా అంటే
నిమ్నగానాం యథా గఙ్గా దేవానామచ్యుతో యథా వైష్ణవానాం యథా శమ్భుః పురాణానామిదమ్తథా
కావాలి కావాలి అనే కోరిక ఉన్నకొద్దీ కోరిక భగవానుని మీదే ఉంటుంది. ఫలమును ఆశించకుండా భగవంతుని సేవించమని చెప్పిన గ్రంధం భాగవతం. అందుకే భాగవతం ఉత్తమోత్తమం తపస్సు దానం యగ్న్యం వ్రతం యేమీ అవసరంలేదు. ఇదే అర్థేషు అబిజ్ఞ్యా
తేనే బ్రహ్మ బృదా ఆది కవయే- వ్యాస భగవానునికి నారదుడు చెప్పిన భాగవతం అధ్యయనం చేస్తే ఈ జగత్తంతా నశ్వరం అశాశ్వతం అని తెలుస్తుంది (యత్ర త్రిసర్గ:మృష). భక్తి పరిపక్వమైతే జగత్తు అంతటా పరమాత్మ ఉన్నాడని అనుభవమవుతుంది.
తేజోవారిమృదాం యథా వినిమయో – పురాణాల్లో ఇది సాత్విక పురాణం. తామస పురాణాలను కూడ తెలియక సాత్విక పురాణంగా భ్రమపడతారు.. అందువల్ల పరమాత్మ స్వరూపం సరిగా తెలియదు
ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం ఇలాంటి భాగవతం తన జ్ఞాన జ్యోతి తోటి పరమాత్మ స్వరూపంతోటి అన్ని రకాల కపటములను నిర్మూలిస్తుంది.
ఇటువంటి భాగవతాన్ని ‘సత్యం పరం ధీమహీ’ ధ్యానం చేస్తున్నాను.
శృంగారపరమైన అన్వయం
శృంగారం రస రాజు అంటాం. ఆద్యస్య యద్యత: అంటే మొదటి రసం యొక్క జన్మ యే భావన వల్ల కలిగింది. అదే శృంగార రసం. అదే ఎందుకు అవ్వాలి. అన్వయాత్ ఇతరత: ఇతరముల (విభావ అనుభావ సాత్విక వ్యబిచార సమ్యొగాలనే భావలతో యేరప్డే రసం) యొక్క సహకారంతో యేర్పడిన రసం.
అర్థేషు అభిజ్ఞ్యా : అర్థములు మూడు రకాలు:
1.వ్యాక్యార్థం 2. లక్ష్యార్థం (”వాడు నిప్పులాంటి మనిషి” అనడం) 3. వ్యంగ్యార్థం
శృంగారం ఈ మూడు అర్థాలలో ఉపయోగపడుతుంది సమన్వయ పడుతుంది – అంటే అర్థేష్వభిజ్ఞ్యా
అర్థేషు అభిజ్ఞ్యా : అంటే మూడు అర్థాలు ధ్వని రసం గుణం; గుణాలు అలంకారములు రీతులు; వాక్యార్థం లక్ష్యార్థం వ్యంగ్యార్థం. రసం అనుభవించడానికి ఉపకరించే అన్ని అర్థములయందు అభిజ్ఞ్య:
స్వరాట్: స్వయం రాజతే. అన్నిటికీ శృంగారమే మూలం. అందుకే శృంగారం స్వరాట్.
తేనే బ్రహ్మ బృదా ఆది కవయే: రసం అంటే పరమాత్మ. రసోవై స: నాట్య శాస్త్రం రచించిన భరత ముని ఆదికవి. రసబ్రహ్మను భరతునికి ఉపదేశించింది శృంగారమే
ముహ్యంతి యత్ సూరయ: చాలా మంది జ్ఞానులు మోహపడింది శృంగారం వల్లనే
తేజోవారిమృదాం యథా వినిమయ: ఈ శృంగారంలో తేజస్సు జలము భూమి ఉన్నాయి. శృంగారమే హాస్యం కరుణ కూడా అవుతుంది.
పరమాత్మ మీద కాకుండా మనలో శరీర మనస్సు బుధ్ధులలో కలిగేది రసంకాదు రసాభాసం.
సత్వ రజో తమో గుణాలతో కలిగే ఈ రసం మృష – క్షణికం. అదే ఈ రసం గుణాతీతుడైన (త్రిసర్గ:)పరమాత్మ మీద కలిగితే అది నిత్యం
ఇదే పరం సత్యం. అలాంటి దాన్ని ధీమహి.”
ఇంత విపులంగా అనేక విశేషాలను ఆ వ్యథాభరిత స్థితిలో కూడా వివరించిన దేశికోత్తములకు కైమోడ్పులు తప్ప ఏమి అర్పించగలం?
ఆచార్యులు వివరించేలోగా స్థానిక విద్వన్మిత్రులు, అవధాని వతంసులు, శ్రీ పాలడుగు శ్రీ చరణ్ గారు (వృత్తిరీత్యా సీనియర్ సాఫ్ట్వేర్ నిపుణులు), ‘ సత్యం పరం ధీమహి’ అనేది శార్దూల విక్రీడితంలో భాగమని చెబుతూ, కొన్ని విశేషాలను ఫోనులో వివరించి చెప్పారు. నా అభ్యర్థనపై వాటిని రెండు మూడు తడవలుగా కోనలో పోస్టు చేశారు. వాటినిక్కడ క్రోడీకరించి పెడుతున్నాను. ఏవైనా హెచ్చుతగ్గులు ఏర్పడుతుంటే వాటికి నేనే బాధ్యుణ్ణి.
పాలడుగు గారు చెప్పిన అంశాలు:
“వ|| ‘నా న్నోదక సమం దానమ్, న తిథి ర్వాదశీ సమా,
న గాయత్ర్యాః పరో మంత్రో న మాతు రైవతం పరమ్! ||’ అని
మహానుభావుడు చాణక్యుడు నొక్కి వక్కాణించెను.
మహా మహిమాన్విత శక్తి వంతములైన బీజాక్షర సంపుటి యగు ‘గాయత్రీ మహా మంత్రము’, మనోబుద్ధ్యహంకారజానాతీతమగు చైతన్యమునకు మూలము. అంతటి మహిమాంచితమగు మంత్రమును ధ్యానించ వలెను, జపించ వలనే గాని, యథాలాపముగా ఉచ్చరించ రాదు. అర్ఘ్య ప్రదానము, యజ్ఞమువంటి ప్రత్యేక వేదకర్మల నాచరించు సమయములందు మాత్రమే, ఉచ్చరించ వలెను, అప్పుడునూ, వ్యాహృతుల తో మాత్రమే.
‘వ్యాహృతి’ అనిన ఉచ్చారణ. ‘భూ ర్భువ స్స్వ’రాది త్రి వ్యాహృతుల తోను,’భూర్భువ స్సువ ర్మహో జన స్తప సృత్య’ సప్త వ్యాహృతుల తోను మాత్రమే ఉచ్చరించ వలసిన ఈ మంత్రము జ్ఞాన చైతన్య ప్రకాశప్రదాత యగు ‘సవితృ’ దేవతా మంత్రము, ‘గౌరీ గౌర వర్ణా, వాగ్గేవతా’ నాదము. ‘ప్రణవాత్మనా ఏక పదీ, సావిత్రీ వ్యాహృతి రూపేణ ద్విపది’ అని విద్యారణ్యము బోధించు చున్నది. గాయత్రీ మంత్రమునకు ఋషి విశ్వామిత్రుల వారు, ఛందస్సు గాయత్రీ. గాయత్రీ చ్ఛందస్సు8 అక్షరములు గల పాదములు మూడింటి తో 24 అక్షరములు కలిగియుండును.
నిజానికి, గాయత్రీ మహామంత్ర మునకు ఛందస్సు ‘నిచృత్’గాయత్రీ’ చ్ఛందస్సు, 23 అక్షరములు. ఈ విషయము ఋగ్వేదమున చెప్పబడి యున్నది. మొదటి పాదము ‘వరేణ్యమ్’ వలన 7 అక్షరములే కలిగి యున్నది.జప, ధ్యాన సమయము లందు ‘నిచృద్గాయత్రీ ‘ చ్ఛందస్సు ఉండును. యజమున ‘స్వాహా’ కారము జెప్పునపుడు ‘వరేణియమ్’ అని ఉచ్చరించడము వలన, 24 అక్షరములై ‘గాయత్రీ ”చ్ఛందస్సగును. ఈ సవితృ దేవతా ప్రస్తావన వేదంలో ఇలా చెప్పారు.
“యుః తే మన ఉత యుజ్యతే ధియో విపా విప్రస్య బృహతో
విపశ్చితః | విహోతా దధీ వయునా విదేక ఇన్మహీ దేవస్య సవితుః
పరిషుతిః౹”
ఏకైక బృహత్సర్వజుడు, ఆత్మ జ్ఞాన ప్రకాశము కలిగించువాడు,ఇంద్రియ నియంత్రణ జేయు దేవతల యొక్క అధిపతి అయిన ఆ సవితా దేవత వైపుకు మనస్సును మరల్చి, ఆ దేవతను పరి పరి విధముల స్తుతించ (పరిష్క్రుతి) మని వేదము చెబుతున్నది. అంతే కాదు, జ్ఞాన చైతన్య సిద్ధికి, మొట్ట మొదట మనస్సును సవితాదేవత పై నిల్పమన్నది వేదము.
‘యు ఇశానః ప్రథమం మనస్తత్త్వాయ
సవితా ధియః…..సవితుః వరేణ్యం భర్గః ధీమహి: – సూర్య భగవానుని అత్యుత్తమమైనటువంటి కాంతి ధ్యానిస్తున్నాము. సవితా అంటే సకల జగత్తుని సృష్టించి రక్షిస్తున్నాడు సమ్హరిస్తున్నాడు కాబట్టి ఆ శక్తి కలవాడు.
మత్స్య పురాణములో అన్ని పురాణాలను గుర్తించే నిర్వచనము చెబుతూ, భాగవతానికి:
యత్రాధికృత్య గాయత్రీం
వర్ణ్యతే ధర్మవిస్తరః
వృత్రాసుర వధోపేతమ్
తద్భాగవతముచ్యతే ||
సారస్వతస్య కల్పస్య
మధ్యే యే స్యుర్నరోత్తమాః
తద్వృత్తాంతోద్భవం లోకే
లిఖిత్వా తచ్చ యో దద్యాత్
హేమసింహ సమన్వితమ్
పౌర్ణమాస్యాం ప్రౌష్ఠపద్యామ్
స యాతి పరమాం గతిమ్
అష్టాదశ సహస్రాణి
పురాణం తత్ప్రచక్షతే ||
అని మూడు శ్లోకాలలో చెప్పారు.
గాయత్రీ వర్ణనాధారమై ధర్మవిస్తరమై వృత్ర వధతో కూడినదై సారస్వత కల్ప నరోత్తముల గూర్చిన విషయము కలది, 18000 శ్లోకములు కలది భాగవతము అని చెప్పారు.
గరుడ పురాణంలో భాగవతమును గూర్చి చెబుతూ:
అర్థోऽయం బ్రహ్మసూత్రాణామ్
భారతార్థ వినిర్ణయః
గాయత్రీభాష్యరూపోऽసౌ
వేదార్థ పరిబృంహితః
పురాణానాం సారరూపః
సాక్షాద్భగవతోదితః
ద్వాదశ స్కంధ సమ్యుక్తః
శతవిచ్ఛేద సమ్యుతః
గ్రంథోऽష్టాదశ సాహస్రః
శ్రీమద్భాగవతాభిధః
జన్మాద్యస్య యతః, అను బ్రహ్మసూత్రము (2 వ సూత్రము) తో మొదలగుచున్న శ్లోకము. ఈ శ్లోకము చివరి పాద ఉత్తర భాగము సత్యం పరం ధీమహి. అలాగే 12 (చివరి) స్కంధమున 13 (చివరి) అధ్యాయమున 19 వ శ్లోకము చివర కూడ సత్యం పరం ధీమహి!
జన్మాది – జన్మ,స్థితి,భంగము. అని సూత్ర భాష్యంలో శంకరులు అంటారు.
ఉద్యన్-మార్తాండ-అస్తమయ రూపక వికాస చోదనమున సవితృ దేవత తత్త్వము విపులీకరించుటచే గాయత్రీ భాష్యమని పెద్దల భావన.
పరమము, దేశ కాల నిర్వికారము అయిన సత్యము కేవలానంద ఆత్మజ్యోతి అని, అదియే ధ్యేయమని చెప్పుటచే వేదార్థ పరిబృంహణమని, ధర్మమునకు గ్లాని సహజమని, తదుద్ధరణము ఫల సన్న్యాస నిష్కామ కర్మ అని భాగవతుల నడచడి చే చెప్పబడినది కనుక భాస్-రత (భారత) వినిర్ణయమని కూడ పెద్దలు భావించారు. ఇది భాగవతపు భాగవతము.”
వైదిక పరంపరతో సంబంధము లేనివారికి అంత సులభ గ్రాహ్యమయ్యేవి కావు శ్రీ పాలడుగు శ్రీచరణ్ విశదీకరించిన అంశాలు….
అందుకే ― “జన్మాద్యస్య యతః అనే భాగవత ప్రారంభ శ్లోకం లోని చివరమాటలే సత్యం పరం ధీమహి అనే మాటలని మొన్ననే మీరు చెప్పారు. శ్లోకాన్ని సంపూర్ణంగా ఇవ్వటమే కాకుండా, దాని భావాన్ని, అన్వయాన్ని సంక్షిప్తంగా నైనా, సమగ్రంగా వివరించి ఆచార్య రాణీ వారు మా దృశులకు మహోపకారం చేశారు.. ఇప్పుడు మీరుద్ధరించి చూపినవి, వ్యాస సమగ్రతకు మిక్కిలి తోడ్పడుతున్నాయి…” అంటూ నిజాయితీగా ఈ కింది మాటలు నివేదించాను :
“తలతిరుగుడు (వెర్టిగో) రోగమతిశయించుటచే నా ప్రశ్నలలో ఒకటి ఏమరుపాటున పొరబాటుగా అడగడమే కాదు, ప్రధాన ప్రశ్నను కూడా సరిగా అడగ లేకపోయాను… కనుక మరోమారు ఇక్కడ దాన్ని ప్రస్తావిస్తున్నందుకు క్షంతవ్యుడను…
భగవత్తత్త్వమును వివరించుచు, భగవదవతారములను వర్ణించి(చు)నది భాగవతము అని ఇదివరకు నా వంటి సామాన్య సాహిత్య విద్యార్థులు ఏర్పరచుకున్న అభిప్రాయము.
ఇక్కడ ఇది గాయత్రీ స్వరూపమని పేర్కొనడంలో తద్భావము సుబోధము కాక తికమక కలుగుతోంది.. భగవత్తత్త్వానికి మూలం గాయత్రినా? అప్పుడు సృష్టికి మూలము గాయత్రి అన్నట్లే కదా! అటువంటి గాయత్రి మూలతత్త్వ మెలాటిది? దానికి భాగవతం లోని వర్ణిత గాథలకు సంబంధమెలాటిది? ఇదీ నా ప్రధాన ప్రశ్న!
పైపెచ్చు ‘దాని నధఃకరించుచు… వృత్రాసుర వధయును’ వర్ణించునది భాగవతమని మత్స్యపురాణం చెబుతోంది అనడంతో, ఇంద్రవిజయాన్ని తెలిపే ఆ వైదిక గాథకు, తద్వ్యతిరిక్తమని తెలిపే భాగవతోద్యమ గాథకు పొంతన ఏమిటనే ప్రశ్న నా తికమకను రెట్టింపు చేస్తున్నది…
ఈ భాగవతోద్యమాన్ని గురించి భారతీయ మత ధర్మ వికాస చారిత్రకులు బహువిధాలుగా చర్చించారు. రామకృష్ణ మిషన్ వారు ప్రచురించిన కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా గ్రంథ సంపుటులలో 4, 6 సంపుటాల్లో దాన్ని వివరంగా చూడవచ్చు… అలాగే భవాన్ సీరీస్లో కూడా! ఈ రాసిన వాళ్ళెవరూ లెఫ్టిస్ట్ చారిత్రకులు కారు… అరబిందుల వారి సావిత్రిని, నా శక్తికి మించిన పనే అయినా, కొంత గ్రహించి, యోగ శాస్త్రానికి – భక్తి తత్త్వానికి (భక్తియోగమన్నారు కనుక) నా పరిమితిలో కొంత సమన్వయాన్ని భావించటానికి ప్రయత్నించాను కానీ శక్తి చాలింది కాదు. గాయత్రి స్వరూపం కానీ, దానికి భాగవతం ఎలా సాక్షాతృత రూపమో బోధపడింది కాదు… భారతీయ సంస్కృతి చరిత్ర విద్యార్థిగా భాగవతం లోనికి వెళ్లే కొద్దీ ఈ విషయంలో అస్పష్టత పెరుగుతూ పోయింది… పెద్దలను అడిగితే, గాయత్రీ దేవి మాహాత్మ్యాన్ని గురించి గొప్పగా చెప్పారు, లేదా మంత్రమని వివరించారు. ఒక్కో దేవతకు ఒక్కో గాయత్రీ మంత్రముందని సెలవిచ్చారు. బహుశా నేను నా సందేహం సరిగా వెలిబుచ్చలేని అశక్తత వల్ల కాబోలు, దాన్ని తీర్చలేకపోయారు.
ఈ దశలో కొన్ని దశాబ్దుల క్రితం గుంటూరులోని యాదవ సంఘం వారు, టీకా తాత్పర్యాలతో పాటు, శ్రీధర వ్యాఖ్యా సహితంగా సంస్కృత మూల భాగవతాన్ని, పోతన భాగవతం తో కలిపి 6 సంపుటాలలో ముద్రించి, మావంటి తెలుగు సాహిత్యానికే పరిమితమైన వారికి మహోపకారం చేశారు. వాటిని మన సిరికోన పూర్వ సభ్యురాలు శ్రీమతి కల్లూరి కృష్ణకుమారి గారు, నా అభ్యర్థనపై తీసి 2005 లో పంపారు. అనేక తావుల అనుమానాలు నివృత్తమయ్యాయి కానీ, అవి పాఠ్య(text) సంబంధాలే తప్ప, ఇలాటి తత్త్వ సంబంధాలు కాదు.. మొన్నెందుకో ఈ ప్రశ్న మరోసారి మెదిలింది. సందేహ నివృత్తికి మన సిరికోన కంటే మించిన తావు నాకు మరొకటి ఇటీవల తారసపడలేదు. ఎవరిని అడిగినా వారి పరంపరకు సంబంధించిన భావన మాత్రమే తెలుపుతారు కానీ, ఇక్కడి వలే ఉదార భావంతో వివరించరు. చర్చించరు.
ఇక్కడ చర్చించి వ్యాస రూపంలో సంకలిస్తే, నావంటి పెక్కుర కుపయోగ కరంగా ఉంటుందని ఆశ!
కనుక గాయత్రీ మూలతత్త్వమేమిటి? భాగవతం దానికి ఆవిష్కరణ ఎలా అవుతున్నది? దాన్ని అధఃకరించి వృత్రాసుర సంహార వర్ణన తెలపడమే కాక, అలా తెలిపినదే భాగవతమని మత్స్యపురాణం ఎందుకు చెప్పింది? వృత్రాసుర సంహరంలో గోప్య మైన భాగవతమూలాంశమేమిటి? అనే అంశాలను ఇక్కడ లేవనెత్తాను….”
వాస్తవమింతే! లేవనెత్తితే లేవనెత్తాను కానీ, ఇతరత్రా వినని ఎన్నో విశేషాలు ఇలా తెలియవచ్చాయి…
ఆ తర్వాత టెక్సాస్ వాసి డా.ఉపద్రష్ట సత్యం గారు మరో వ్యాసమే సమాధానంగా రాసి పోస్ట్ చేశారు. దాన్ని మరో సంచికలో విడిగా చూద్దాం. అంతదాకా సశేషం..
― గంగిశెట్టి లక్ష్మీనారాయణ
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
గట్టవుతల
ఒక దిలీప్ కుమార్ – 64 సినిమాలు – 42 – సంఘర్ష్
భారతీయులకు హెచ్చరిక-13
మహతి-24
రామం భజే శ్యామలం-53
భారత కోకిల
నూతన పదసంచిక-106
సజీవమైన భావనాబలం ‘లోపలి ముసురు’
ఆచార్యదేవోభవ-2
ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-37
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®