[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన గొర్రెపాటి శ్రీను గారి ‘సిరిగల చోటు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
“నమస్తే మాస్టారు”
“నమస్తే బాబు.. కూర్చో”
“మీరు అడిగినట్లుగా నా జన్మ సమయం సరిగ్గా తెలియదు. కాస్త అటూ ఇటూగా రాసుకు వచ్చాను. తేదీ, సంవత్సరం మాత్రం కరెక్ట్..” అంటూ మనోహర్ ఒక కాగితాన్ని పెద్దాయన చేతుల్లో పెట్టాడు.
కళ్ళజోడు సరిచేసుకుంటూ రాఘవాచార్యులు ఆ కాగితాన్ని చేతుల్లోకి తీసుకుని పరిశీలించి.. పంచాంగం చూశాడు.
కొద్దిసేపు మౌనంగా లెక్కలేవో వేసుకుని అతడికి తాను చెప్పాలనుకున్న మాటలు చెప్పాడు.
విన్న తర్వాత కూడా మనోహర్ మనసు కుదుట పడలేదు.
“సరేనండి.. కలుద్దాం” అంటూ బయటకు నడిచాడు.
***
“మనోహర్”
తన పేరే పిలుస్తుంటే హడావిడిగా లోనికి వెళ్ళాడు.
తన ఎదురుగా కూర్చున్న వ్యక్తి వైపు చూస్తూ సంబ్రమాశ్చర్యాలకు లోనవుతూ “నమస్తే సార్” అంటూ రాఘవాచార్యులకి నమస్కరించాడు.
బి.టెక్ చదువుకున్న మనోహర్ చదువుల్లో తెలివైన కుర్రాడు. మంచి పర్సంటేజ్‌తో బి.టెక్ పాస్ అయ్యాడు.
సివిల్ ఇంజనీరింగ్ ఇష్టపడి తీసుకున్నాడు.
తను నేడు ఇంటర్వ్యూ ఎదుర్కోబోతున్న కంపెనీ దేశవిదేశాల్లో మంచి పేరున్న సంస్థ. ఈ చోట జాబ్ సంపాదించాలని సివిల్ ఇంజనీర్స్ కలగంటారు.
తనకు వచ్చిన తొలి అవకాశమే ఇలాంటి పెద్ద సంస్థలో రావడం అతడికే కాకుండా, అతడి తల్లిదండ్రులకు సైతం సంతోషాన్ని కలిగించిన అంశం.
ఈ ఇంటర్వ్యూ తనకు తెలిసి తేలికగా ఉండబోతుంది అనుకున్నాడు మనసులో.
తన తండ్రి కృష్ణమూర్తికి స్నేహితుడు రాఘవాచార్యులు.
రాఘవాచార్యులు జ్యోతిష్యనిపుణులని తెలిసి తండ్రి సూచన మేరకు ఇంటికి వెళ్ళాడు.
అనుకోకుండా ఇక్కడ ఇంటర్వ్యూలో కూడా అతడే ప్రత్యక్షమవడం తన కల నెరవేరబోతుందన్న విశ్వాసం కలిగింది.
రాఘవాచార్యులు అనర్గళంగా అడుగుతున్న ప్రశ్నలు మనోహర్‌కి చెమటలు పుట్టిస్తున్నాయి.
యాబై యెళ్ళకి పైగా వయసున్న వ్యక్తి ఇప్పుడు సైతం సబ్జెక్ట్‌పై పట్టుతో అడుగుతున్న ప్రశ్నలు అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
తడబడుతూ సమాధానం ఇస్తున్న మనోహర్‌ని గమనిస్తున్నాడు.
చివర గా “ఇక నువ్వు వెళ్ళొచ్చు” అన్నాడు.
కాస్త నీరసంగానే బయటకు వచ్చాడు మనోహర్.
***
మనోహర్ ఇంటికి వస్తూనే తండ్రికి తను జాబ్ కోసం వెళ్లినప్పుడు కలిసింది రాఘవాచార్యులు గారినే అని చెప్పడం కృష్ణమూర్తికి ఆనందం కలిగించింది.
ఈ జాబ్ తన పుత్రుడికి వస్తుందన్న నమ్మకం కలిగించింది.
ఏదో మూల చిరు సందేహం కలిగి “ఇంటర్వ్యూ ఎలా సాగింది?” ప్రశ్నించాడు.
“కాస్త కఠినంగానే సాగింది”
“సరేలే” అన్నాడే కానీ మనసులో రాఘవకి వెంటనే ఫోన్ చేయాలనిపించింది.
స్నేహితుడే కదా మాట్లాడాలి అనుకున్నాడు.
ఆఫీస్‌లో బిజీగా ఉంటాడు కదా సాయంత్రం చేయవచ్చులే అనుకున్నాడు.
కొడుకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవలేదని తెలిసి బాధ పడ్డాడు.
తను చేస్తున్న అటెండర్ ఉద్యోగానికి అలాంటి మంచి స్థితిలో వున్న వ్యక్తి స్నేహితుడంటే గొప్పగా ఉంటుంది.
నిజమైన స్నేహానికి సరి అయిన అర్థం లేని ఈ కాలంలో సాయం ఆశించడం తప్పు.
తనకు ఒక్క కొడుకు, ఇద్దరు ఆడపిల్లలని తెలుసు.
అలాంటి తను ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ పిల్లలని చదివిస్తున్నడని రాఘవకి చాలాకాలంగా అవగాహన వుంది.
తన కొడుక్కి ఇంజనీరింగ్ పూర్తవగానే తప్పకుండా జాబ్ రావాలని ఆశించాడు.
అలాగైతే ఆర్థికంగా తన అవసరాలు తీరుతాయని ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసమని అంతో ఇంతో దాయవచ్చని కృష్ణమూర్తి, అతని భార్య శ్యామల ఎన్నో కలలుగన్నారు.
చిన్ననాటి స్నేహితుడు రాఘవాచార్యులు దగ్గరకి జాతక పరిశీలన కోసం పంపారు.
కానీ అతడే తన కొడుకుని తొలిగా ఇంటర్వ్యూ చేస్తాడని అసలు ఊహించలేదు.
తెలిశాక సంబరపడ్డాడు స్నేహితుడు సాయం చేస్తాడని, తన కొడుక్కి జాబ్ ఇప్పిస్తాడని.. నిజమైన స్నేహానికి అర్థం తానై నిలుస్తాడని.. ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
కలలన్నీ కల్లలవ్వగా నిరాశ పడ్డాడు.
అంత పెద్ద సంస్థలో జాబ్ అవకాశం రావడమే గొప్ప.
పదేపదే అనుకున్నాడు.
కానీ ‘సెలెక్ట్ అయితే బాగుండేది’.
అతడి హృదయం ఆక్రోశించింది.
***
“అమ్మా, నాన్నా ఓ సారి ఇలా రండి..” కంప్యూటర్ ముందు కూర్చున్న మనోహర్ పిలుస్తుంటే.. కొడుకు అంతలా పిలుస్తున్నాడంటే ఏదో ముఖ్యమైన విషయమే ఉంటుంది అనుకుంటూ హడావిడిగా అక్కడికి చేరుకున్నారు.
“అమ్మ! నాకు గేట్‌లో మంచి ర్యాంక్ వచ్చింది” అంటున్న పుత్రుడి బుగ్గపై ముద్దాడింది శ్యామల.
సాయంత్రం రాఘవాచార్యులుకి ఫోన్ చేశాడు కృష్ణమూర్తి.
స్నేహితుడు చెబుతున్న మాటలు విని సంతోషించాడు రాఘవాచార్యులు.
“వారం రోజుల క్రితం నీతో పరుషంగా మాట్లాడాను క్షమించు రాఘవ!” అన్నాడు.
నవ్వాడతను.
“రేయ్ కృష్ణా! మనోహర్ తెలివైన కుర్రాడు. ఇంకా చదుకోవాలని వుందని గతంలో నాతో అన్నాడు. నువ్వేమో వాడిని ఎప్పుడేప్పుడు జాబ్‌లో చేర్చాలా అని ఆతృతగా ఉన్నావు.
చూశావా మనోహర్ గేట్‌లో మంచి ర్యాంక్ సాధించాడు. పిల్లలు చదవాలని కోరుకుంటున్నప్పుడు వాళ్ళ ఇష్టప్రకారం చదించాల్సిన బాధ్యత మనది. ఇంతకాలం ఎలాగైతే కుటుంబాన్ని పోషించావో అలాగే మరికొంత కాలం ఇబ్బందు పడు. రేపన్నది తప్పకుండా ఘనంగా ఉంటుంది.
సిరిగల చోటు ఎక్కడో తెలుసా సత్ప్రవర్తన, ఉన్నత వ్యక్తిత్వాలు గల చోటు.
నీ కొడుక్కి మంచి చదువుతో పాటు మంచి సంస్కారం కూడా వుంది.
ముఖ్యంగా చదువుపై అమితమైన అభిలాష ఉన్నది. నీ పిల్లలు ముగ్గురూ బాగా చదువుతున్నారని తెలుసు.
వాళ్ళు తప్పకుండా సమాజంలో నీకు మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తారు. అర్థమవుతుందా!” స్నేహితుడు పలుకుతున్న హితవచనాలు వింటుంటే అతని నయనాల నిండా ఆనందబాష్పాలు.
రాఘవ స్నేహానికి, నిస్వార్థమైన ఆప్యాయతకి మారుపేరు.
తనకు ఆర్థిక కష్టాలు ఎదురైనా, మానసికంగా కృంగిపోయినా ధైర్యాన్ని నూరిపోసే ప్రేరణ.
చిన్నప్పుడు ఇద్దరూ కలిసే చదువుకున్నారు.
ఉన్నత చదువులు చదువుకున్నా నిగర్విగా స్నేహంగా మసలుకునే రాఘవ లాంటి స్నేహితుడు దొరకడం తన అదృష్టం అనుకొంటూ.. మనసులోనే స్నేహితుడికి కృతజ్ఞతలు అర్పించుకున్నాడు కృష్ణమూర్తి.
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.