Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శిక్షణ

[శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు రచించిన ‘శిక్షణ’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

గడాల నణచే
కాఠిన్యాన్ని ప్రదర్శించేలా,
కలతల కన్నీటిని తుడిచే
కారుణ్యంతో ప్రవర్తించేలా,
మంచిని మనసారా మన్నించే
ఔన్నత్యంతో ప్రవర్ధిల్లేలా
నా అక్షరాలకు
తర్ఫీదునిస్తున్నాను!

సమాజంతో సన్నిహితంగా భాషించేలా,
ప్రజా మనోభావాల
ప్రతిరూపాలుగా భాసించేలా
నా అక్షరాలను సంస్కరిస్తున్నాను!

అధములను ప్రశంసించే
స్వలాభ చింతనలనూ,
కట్టెదుటి ఆర్తులను కనికరించని
అలౌకిక భక్తి బలహీనతనూ,
కుల మతాల సంకుల శృంఖలాలనూ,
అవాస్తవిక రచనల పరిష్వంగాలనూ విదళించుకొని
నిస్వార్థ సంఘ సేవను నిర్వహించేలా
నా అక్షరాలను తీర్చి దిద్దుతున్నాను

జన జాగృతిని జపిస్తూ,
ఊరి ఉన్నతికై తపిస్తూ
అక్షరాలను ప్రభవించమంటున్నాను!
అంతటా ప్రసరించమంటున్నాను!

ప్రజకు ఉపకరించని అంశాలను
స్పృశించకుండా,
పాఠకులకు పరీక్ష పెట్టే
బరువైన అలంకార భాషను
సృజించకుండా,
అయుక్త సన్మానాల కోసం
ఉబలాట పడకుండా
భద్ర గజ సమూహాలై సాగుతూ
సాధుజన సంక్షేమం కోసం
దీన జన ఉద్దరణ కోసం
నా అక్షరాలను
విప్లవించమంటున్నాను!

అవినీతిపరులకు అహితాలై,
అప్రియాలై,
అడ్డగింతలనూ,
అణచివేతలనూ ఎదుర్కొన్నా
అదరక బెదరక
ప్రబలంగా పరాక్రమించమంటున్నాను!
ప్రత్యర్థి పాడు ప్రయత్నాలను
ప్రతిభావంతంగా పరాభవించమంటున్నాను!

నలుగురికీ నచ్చే సరణినీ,
పదుగురికీ పనికి వచ్చే కరణినీ
నా అక్షరాలను పోషించమంటున్నాను!
సద్గుణ సాగర మథనంలో జనించిన జాతి రత్నాలై
మానవతను భూషించమంటున్నాను!

Exit mobile version