[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
సప్తమః సర్గః
స్వకంఠస్వరభంగ్యాహం తద్‌వృత్తపరివర్తనైః।
వ్యాఖ్యామకరన యేన నిః శోకోభూత్ క్షణం నృపః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 133)
నేను మోక్షోపాయ సంహితను వినిపించే సమయంలో సందర్భాన్ని, భావాన్ని బట్టి నా కంఠస్వరాన్ని మారుస్తూ వ్యాఖ్యానించాను. అందువల్ల కొద్దిసేపయినా రాజుకు ఉపశమనం లభించి, కాస్సేపయినా శోకరహితుడయ్యాడు.
Voice modulation అన్నది నటీనటులకు, గాయనీ గాయకులకు ఎంతో ఆవశ్యకమైనది. సంభాషణలు పలికే సమయంలో కొన్ని పదాలను ఒత్తి పలుకుతూ, కొన్ని సందర్భాలలో దీర్ఘం తీస్తూ ఇలా భావాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి పదాలను పలికే రీతిని మారుస్తుండటం వల్ల, శ్రోత భావాలను ప్రబావితం చేయవచ్చు. శ్రోత ఆలోచనలను నియంత్రించవచ్చు. శ్రీవరుడు ఈ శ్లోకంలో అదే ప్రస్తావిస్తున్నాడు.
శ్రీవరుడు స్వయంగా గాయకుడు. గతంలో తన గానంతో సభికులను అలరిచినట్టు చెప్పుకున్నాడు. కాబట్టి అతిడికి తన స్వరంలో, ఉచ్చారణలో స్వల్పమైన మార్పుల ద్వారా ఎదుటి వారిని ప్రబావితం చేయటం తెలుసు. అందుకని, అశాంతితో ఉన్న రాజుకు శాంతిని కలిగించే రీతిలో మోక్షోపాయ సంహితను ఆయన పఠించాడు. రాజుకు సాంత్వన కలిగింది.
ఈ శ్లోకం ద్వారా గ్రహించాల్సిందేమిటంటే, చివరి దశలో జైనలాబిదీన్‌కు సన్నిహితులుగా, శ్రేయోభిలాషులుగా కేవలం శ్రీవరుడు తప్ప మరెవరూ మిగలలేదని. కేవలం శ్రీవరుడు ఒక్కడే రాజుకు నమ్మకస్థుడుగా, అంతరంగికుడిగా మిగిలాడని. నిజంగా అత్యంత బాధాకరమైన విషయం ఇది. యాభై ఏళ్లుగా కశ్మీరును పాలించి, కశ్మీరు ప్రజల జీవితాలను తిరుగులేని రీతిలో ప్రభావితం చేసి, విశాల భావాలకు, పరమత సహనానికి ఆధర్శంగా నిలిచిన గొప్ప సుల్తానుకు చివరికి అంతరంగికుడిగా, నమ్మకస్థుడిగా మిగిలినది శ్రీవరుడు ఒక్కడే. స్వమతస్తులలో ఒక్కడు కూడా సుల్తాన్ అంతరగికుడిగా మిగలకపోవటం రాజు పరమత సహనం పట్ల వ్యతిరేకత అని సులభంగా గ్రహించవచ్చు.
భ్రమస్య జాగ్రతస్తస్య జాతస్యాకాశచర్ణవత్।
అపునః స్మరణ సాధోర్మన్యే విస్మరణ వరమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 134)
దీర్ఘస్వప్నో పమం విద్ధి చో దీర్ఘం వా ప్రియదర్శనమ్।
దీర్ఘం వాపి మనోరాజ్య సంసారం రఘునందన॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 135)
యది జన్మ జరా మరణ న భవేద్
యది వేష్టవియోగభయం న భవేత్।
యది సర్వ నిత్యమిదం న భవే
దిహ జన్మని కస్య రతిర్న భవేత్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 136)
యతో యతో నివర్తేత తతస్తతో విముచ్యతే।
నివర్తనార్ధి సర్వతో న వేత్తి సుఖమణ్వపి॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 137)
జాగృతావస్థలోని సజ్జనుల భ్రమ ఆకాశం లాంటిది. ఈ భ్రమను స్మరించకూడదు. విస్మరించటం శ్రేష్టం.
ఓ రఘునందనా! ఈ సంసారం దీర్ఘ కాల స్వప్న సదృశం కావచ్చు. దీర్ఘకాల ప్రియ దర్శనం కావచ్చు. దీర్ఘకాల మనోరాజ్యం అనుకోవచ్చు.
ఈ ప్రపంచంలో జన్మ, జరా, మృత్యువులు లేకపోతే, ప్రియవియోగ భయం లేకపోతే, ఇది క్షణభంగురం కాకపోయి ఉంటే. ఇక్కడ జన్మించకూడదని ఎవరు భావిస్తారు? మనుషులు తాము వాంఛించే విషయాల నుంచి తమ కోరికను నియంత్రించుకుంటే అందరూ దుఃఖం నుంచి విముక్తులవుతారు. విరక్తులయి కోరికల నుంచి దూరమయితేనే మహాదానందం లభిస్తుంది. దుఃఖం నుంచి విముక్తి లభిస్తుంది.
‘ఓ రఘునందనా!’ అన్న సంభోదన శ్రీవరుడు యోగవాశిష్ఠం నుండి శ్లోకాలు వినిపిస్తున్నాడని సూచిస్తుంది. కానీ పలువురు వ్యాఖ్యాతలు ‘మోక్షోపాయ సంహిత’ కశ్మీరుకు చెందిన ప్రఖ్యాత గ్రంథం అనీ, ఇప్పుడు అది లభించటం లేదని భావిస్తారు. కానీ శ్రీవరుడి ఈ సంభోధన, యోగవాశిష్టం మరో పేరు ‘మోక్షోపాయ సంహిత’ కావటం వల్ల శ్రీవరుడు జైనలాబిదీన్‍కు వినిపించినది యోగవాశిష్ఠమే అని భావిస్తారు. శ్రీవరుడు జైనలాబిదీన్‌ను రాముడి అవతారంలా భావించి సంబోధించాడని కొందరు వ్యాఖ్యానిస్తారు. కానీ, శ్రీరాముడి అవతారంగా భావించటం వేరు. ‘శ్రీరామా!’ అని సంబోధించటం వేరు. కాబట్టి, శ్రీవరుడు వినిపిస్తున్నది యోగవాశిష్ఠమేనని భావించవచ్చు. ప్రపంచం క్షణ భంగురం అన్న నిజం గ్రహించి, కోరికలన్నీ దుఃఖకారణాలు అని అర్థం చేసుకుని వాంఛలను అదుపులో పెట్టుకుని భగవన్నామ స్మరణలో జీవితం గడపటం ఆనందమయం అన్న ఆలోచనను శ్రీవరుడు జైనలాబిదీన్‌కు మనసులో కలిగించాడు.
మద్వాఖ్యాశ్రవణాభ్యస్తాన్ స్వావస్థామ్ చకాన్ బహున్।
ఇత్యాదికాన్ స్వయం శ్లోకానపఠత్ స మహీపతిః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 138)
మోక్షోపాయే శ్రుతే మత్తస్తత్తత్పద్యార్థ భావనాత్।
అథేంకదాత్రవీద్ రాజా విబుధానన్తికస్థితాన్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 139)
మోక్షోపాయ శ్లోకాలకు నేను చెప్పిన వ్యాఖ్యానం వింటూ, తన పరిస్థితికి దగ్గరగా ఉన్న శ్లోకాలను స్వయంగా పఠించాడు. నా నుంచి మోక్షోపాయం విని, అయా శ్లోకాల అర్థాలకు అనుభూతిని చెంది, భావించి, దగ్గరలో ఉన్న విద్వాంసులతో ఇలా అన్నాడు.
శ్రీవరుడు ‘మోక్షోపాయం’ అన్నాడు కాబట్టి ‘మోక్షోపాయం’ అనే గ్రంథం ప్రత్యేకంగా ఏదో ఉండి ఉండాలని పలువురు భావిస్తున్నారు. కానీ కొందరు శ్రీవరుడు యోగవాశిష్టం ఆధారంగా బోధించిన ‘మోక్షోపాయం’ విని రాజు శ్లోకాలు చదివాడు అని భావించాడు. ఏదేమైనా జైనులాబిదీన్ దుఃఖం శ్రీవరుడు చెప్పిన వేదాంత వ్యాఖ్యానం వల్ల ఉపశమించిందన్నది సత్యం.
కిమర్థం స్వసుతస్నేహ కరోషి కో న తేహితః।
ఇత్యేవం వక్తి మే నూనం కర్ణోపాన్తాగతో జరా॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 140)
‘ఎందుకని నీ పుత్రులను ఇంతగా ప్రేమిస్తున్నావు?వారిలో ఒక్కరు కూడా నీ హితైషులు కారు. అయినా ఎందుకని ప్రేమిస్తున్నావు? అని ఏదో అజ్ఞాత స్వరం నన్ను ప్రశ్నిస్తున్నట్టు అనిపిస్తుంది’ అన్నాడు రాజు.
అస్థి దంతాదిభిర్భంక్త్వా మాంసం మాంసేన భుజ్యతే।
రక్తబీజమయే భోగే భ్రమోయం న వ్యపైతి మే॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 141)
అహో మయి మృదౌ సర్వసుఖదే ఛిద్రకారిణః।
నాశాయామీ సుతా జాతా రాంకవే క్రిమయో యథా॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 142)
యైః సమం స్వవయో నీత తేవశిష్టా న కేచన్।
ఆజీవనం చలత్యేషా తద్వియోగవిపవ్యథా॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 143)
దేహోటజమిదం జీర్ణ కేశతృణగణావృతమ్।
సచ్ఛిద్రం రోచతే నాద్య దుర్దినే మన్మనోమునేః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 144)
భుజగైరివ దష్టాని రాజ్యాంగాని సుతైర్మమ।
తత్త్యాగోపాయ ఏవైకో యుక్తో మే నాన్యథా సుఖమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 145)
ఇత్యాది చిన్తయన్ రాజా పారసీ భాషయా వ్యఘాత్।
కావ్య శీకాయతాఖ్య స సర్వగర్థచర్వణమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 146)
పళ్లతో చీల్చి ఎముకలను విరచి, మాసంతో మాసం తింటున్నాం. ఆ మాంసంతో పెరిగిన రక్త, భీజమయ భోగం భ్రమ నాకు దూరం కావటం లేదు. ఆశ్చర్యం ఏమిటంటే, మృదుభాషిని ఎవరికీ హాని చేయకుండా అందరికీ సంతోషం కలిగించాలని అనుకునేవాడిని కానీ నా సంతానం, క్రిములు వస్త్రాలను నాశనం చేసినట్టు నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు.
ఎవరితోనైతే నేను నా జీవితాన్ని గడిపానో, వారెవరూ ఇప్పుడు లేరు. వారి వియోగమనే విషం లాంటి బాధ జీవితాంతం అనుభవిస్తూనే ఉంటాను.
నా శరీరం ఒక ఇంటి లాంటిది. అది శిధిలమైపోయింది. భూమి పై ఎండిన గడ్డిలాగా నా శరీరం పై నెరసిన వెంట్రుకలున్నాయి. నా శరీరం జీర్ణమైపోయింది. ఛిద్రమయమై పోయింది. ఇది నాకు ఏ మాత్రం ఆనందాన్నివ్వటం లేదు. నా శరీరం నాకే అసహ్యంగా అనిపిస్తోంది. విషసర్పాల్లా నా పుత్రులు నా రాజ్యాన్ని కాటేస్తున్నారు. వాళ్లని త్యాగం చేయటం తప్ప సుఖసాధనకు మరో గత్యంతరం లేదు.
ఇదంతా జైనులాబిదీన్ ఆలోచన. మాసం తిని మాంసానికి ఆహారంగా మలచటం, ఆ మాంసంతో రక్తం, బీజం, ఉత్పత్తి అవటం ‘యోగవాశిష్ఠం’లో ప్రస్ఫుటంగా కనబడే ఆలోచన. శరీరం ఒక ఇల్లు లాంటింది అనటం వంటి ఆలోచనలన్నీ ‘యోగవాశిష్ఠం’ లోని ఆలోచనలే.
త్వక్సుధాలేపమసృణం యత్రసంచార చంచలమ్
మనః సదాఖునోత్ఖాతం నేష్టం దేహగృహం మమ
(యోగవాశిష్ఠం – వైరాగ్య ప్రకరణం 1-62)
ఈ శరీరమను గృహము చర్మమను సున్నము పూయబడి ఉన్నది. యంత్రంలా చలిస్తూ సంచరిస్తుంది. మనస్సను ఎలుక ఎల్లవేళల ఈ ఇంటికి కన్నము త్రవ్వుతున్నది. ఇట్టి శరీరమనే ఇల్లు నాకిష్టం లేదు.
జైనులాబిదీన్ ఆలోచనలో యోగవాశిష్టంలోని శ్లోకాల భావాల ప్రభావం స్పష్టంగా తెలుస్తోంది. మనస్సనే ఎలుక బదులు సంతానం తొలుస్తున్నారు. శరీరమనే ఇల్లు శిధిలమైపోయింది. అది నచ్చటం లేదు. శరీరం నుంచి విముక్తి కావాలి.
మాంసస్నాయ్వస్థివలితే శరీరపటహేఽ దృఢే
మార్జారవదహం తాత తిష్ఠామ్యత్ర గతధ్వనౌ.
(యోగవాశిష్ఠం – వైరాగ్య ప్రకరణం 1-61)
మహాత్మ! చినిగి, డొల్లపడి, ధ్వనింపని డోలులో ఉన్న పిల్లి లాగా – నేను మాంసము, నరాలు, ఎముకలతో నిర్మితమైన శరీరములో ఉన్నాను. దాని నుంచి బయటపడే ఉపాయాన్ని వినే వీలు చిక్కటం లేదు.
సరిగ్గా జైనులాబిదీన్ ఆక్రందన ఇదే!
ఈ ప్రపంచం మాయ అని తెలుస్తున్నా ఇది నిజమనే భ్రమను వదలించుకోలేకుండా ఉన్నాడు. వస్త్రాన్ని పురుగులు ఛిద్రం చేసినట్టు రాజ్యాన్ని నాశనం చేస్తున్నారు పుత్రులు.
శ్రీవరుడు బోధిస్తున్న ఆధ్యాత్మ జ్ఞానం జైనులాబిదీన్‌కు బాగా పట్టుబడింది. ముఖ్యంగా అతని పరిస్థితి యోగవాశిష్ఠంలో వర్ణించిన స్థితిని పోలి ఉండటం అతడికి వేదాంతం మరింతగా అవగాహన అవటంలో తోడ్పడింది.
కిం శ్రియా కిం చ రాజ్యేన కిం కాయేన కిమీహితైః
దినైః కతిపయైరేవ కాలః సర్వం నికృన్తతి
(యోగవాశిష్ఠం – వైరాగ్య ప్రకరణం 1-63)
ధనం కానీ, రాజ్యం గానీ, శరీరం వల్ల గానీ, కార్యాల వల్ల కానీ, కోరికల వల్ల గానీ ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే కాలం అన్నిటినీ త్రుంచివేస్తుంది. ఎంత గొప్ప వీరుడైతే నేమి? ఎంత గొప్ప రాజైతే నేమి? ఎన్ని యుద్ధాలు గెలిస్తే నేమి? ఎందుకు శత్రువులను చెరబట్టి తేనేల? ఎందరు స్త్రీలను అనుభవిస్తే నేమి? చివరికి అంతా నశింపవలసిందే. చివరి క్షణంలో ఐశ్వర్యం, రాజరికం, బంధమిత్ర కళత్ర స్నేహితులు ఎవ్వరూ పనికిరారు. శరీరం శిధిలమై అనారోగ్యం వదలని తోడుగా వెంట ఉంటుంటే ఏదీ లాభం లేదు.
ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతూ జైనులాబిదీన్ తన బాధనంతా పారసీ భాషలో ‘షికాయత్’ అనే గ్రంథంలో పొందుపరచాడు.
‘షికాయత్’ అంటే ఫిర్యాదు చేయటంయ to complain. ఇది అరబీ శబ్దం. ‘ఫిర్యాదు’ శబ్దం కూడా ‘ఫర్యాద్’ అనే పారసీ శబ్దం. కానీ హిందీ, ఉర్దూ, మరాఠీ, భాషలలో తెలుగులో కూడా ఉపయోగిస్తారు.
‘షికాయత్’ అన్న జైనులాబిదీన్ గ్రంథం పేరులోనే అందులో ఆయన ప్రదర్శించిన ఆలోచనలను ఉహించవచ్చు. ‘యోగవాశిష్ఠం’ ప్రభావంతో తన పరిస్థితిని నిస్సహాయ స్థితిని వివరిస్తూ, దీని నుంచి విముక్తిని అభ్యర్దిస్తూ భగవంతుడికి ‘ఫిర్యాదు’ రూపంలో చేసిన నివేదిక ‘షికాయత్’ అని ఊహించవచ్చు.
జైనులాబిదీన్ విద్వాంసులను ఆదరించటమే కాదు స్వయంగా గొప్ప విద్వాంసుడు. కశ్మీరీ, హిందీ, సంస్కృతం, పారసీ, తిబ్బత్తు భాషలు తెలిసినవాడు. సంస్కృత గీతాలను గానం చేసేవాడు.
జైనులాబిదీన్ పారసీ భాషలో రెండు గ్రంథాలు రచించినట్టు తెలుస్తోంది. ప్రేలుడు, విస్పోట పదార్ధాల గురించి గ్రంథం ఒకటి. దాని పేరు కూడా తెలియదు. రెండవది ‘షికాయత్’. ఈ రెండు గ్రంథాలు అలభ్యం. వీటిని పర్షియన్ చరిత్ర రచయితలు ప్రస్తావించారు. కానీ వాటి గురించి వివరించలేదు. బహుశా జైనులాబిదీన్ మరణం తరువాత రాజ్యం అస్తవ్యస్తమయిన సమయంలో ఈ రచనలు అదృశ్యమైపోయి ఉండవచ్చు. ఏది ఏమైనా యోగవాశిష్ఠం లోని ఆలోచనలను పారసీ భాషలో వారికి పరిచయం చేయాలని అనుకుని ఉండవచ్చు సుల్తాన్. అదీ గాక, మనుసులో వేదనను అక్షరాల రూపంలో వెల్లడించటం ద్వారా మనస్సులోని దుఃఖం ప్రక్షాళన అవుతుంది. అలా వేదనను తగ్గించుకునే ప్రయత్నం ‘షికాయత్’గా వెలువడింది.
(ఇంకా ఉంది)
