[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
శృత్వేత్యుక్తం సదుః ఖస్య నృపతేస్తేబ్రువన్ పునః।
దేవేదం చేన్మతం తత్కిం కోశోయం రక్ష్యతే మహాన్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 119)
పరలోకస్య పాథేయం కురు జీవన్ స్వయం వ్యయమ్।
తదాకర్ణ్యా బ్రవీద్రాజా యుక్తముక్తమిదం వచః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 120)
విషాదంతో రాజు అన్న మాటలు విన్న శ్రేయోభిలాషులు, పెద్దలు అన్నారు – “ఓ రాజా, ఒకవేళ అన్నీ వదలి వెళ్లిపోవాలని కనుక మీరు నిశ్చయించుకుని ఉంటే మరి కోశాగారం నిండేంత ధనం ఎందుకని సంపాదించారు? దాన్ని ఎందుకని రక్షిస్తున్నారు? దీన్ని ఖర్చు చేసి పరలోక మార్గాన్ని సుగమం చేసుకోవచ్చు కదా?” వారి మాటలు విన్న రాజు “మీరు, సరైనవిధంగానే ఆలోచిస్తున్నారు ” అన్నాడు.
కింతు శృణ్వంతు మే హేతుం యత్ కోశోయం ధృతో భృతః।
మయి ప్రమీతే మద్రాజ్యం మత్పుత్రః కోపి చెల్లభేత్।
మత్స్యం చయేన తృప్తః స ప్రజాయాః స్వం త్యజిష్యతి॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 121)
నేనీ ధనాన్ని ఎందుకని కాపాడతున్నానో కారణం వినండి. నేను మరణించిన తరువాత నా సంతానంలో ఎవరో ఒకరికి రాజ్యం దక్కుతుంది. నిండుగా ఉన్న కోశాగారంతో తృప్తి చెంది వారు ప్రజల ధనాన్ని దోచాలన్న ఆలోచనను వదిలేస్తారు.
పుత్రాధికా ప్రజేయం మే రక్షణీయా విభాతి యా।
తస్యాః పీడాం భవిష్యన్తీం హరిష్యే సచయాదతః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 122)
పూర్ణేం విలాసాన్ కురుతే ప్రజేశో
రిక్తః ప్రజాపీడన మాతనోతి।
తృప్తే మృగేంద్రో రమతే గుహాన్త
భ్రురిక్తే క్షుధార్తో వనజన్తువర్గమ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 123)
మత్సంచయోపకారేణ భావిభిః పీడనోజ్ఝితైః।
ఆయతిజ్ఞ వదద్భిర్మా కరిష్యన్తే న గర్హణాః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 124)
పూర్ణాద్రాజగృహాదన్యే పూర్ణాః స్యురుపకారకాః।
నయన్త్యన్ధేర్న చేత్తోయం భూమౌ వర్షన్తి కిం ఘనాః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 125)
ఇయ యా సామగ్రీ భవతి నృపతేః సర్వరుచిరా
ధనేనైకేనైవ ప్రభవతి చిరం సా ప్రభవతా।
ఫల పత్ర పుష్ప సముదయతి యద్యద్విటపినో
ఘరణ్యన్తర్భూతో జనయతి తదేకో రసగుణః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 126)
నా ప్రజలు నాకు నా పుత్రులకన్నా అధికంగా ప్రియం. భవిష్యత్తులో వారిపై జరిగే అణిచివేత నేను ప్రోగు చేసిన దనం వల్ల తొలగిపోతుంది. కోశాగారం నిండుగా ఉంటే రాజు సుఖంగా ఉంటాడు. విలాసాలలో బ్రతుకుతాడు. ఎప్పుడైతే కోశాగారం ఖాళీ అవుతుందో, అప్పుడు దాన్ని నింపేందుకు ధనం కోసం ప్రజలను పీడిస్తాడు. కడుపు నిండిన సింహం తృప్తిగా గుహలోనే ఆడుకుంటుంది. ఆకలి గల సింహం అడవిలో ఇతర జంతువులను పీక్కు తింటుంది. నేను సేకరించిన ధనం నిండుగా ఉండటం వల్ల, రాజు ధనం కోసం ప్రజలను పీడించడు. కాబట్టి, అణచివేత నుండి, దోపిడీ నుండి విముక్తులయిన ప్రజలు కోశాగారం నిండుగా ఉంచినందుకు నన్ను దీవిస్తారు. ఎప్పుడయితే ప్రజలు సుఖంగా ఉంటారో, అప్పుడు ప్రజలు రాజుతో స్నేహపూర్వకంగా వ్యవహారిస్తారు. సముద్రం నుంచి నీటిని తీసుకోకపోతే భూమిపై నీటిని ఎలా వర్షిస్తాయి మేఘాలు? ధనం వల్లనే రాజులు విలువైన వస్తువులను సేకరించగలుగుతారు. చెట్ల ద్వారా లభించే ఫలాలు, పత్రాలు, పుష్పాలు వంటి వన్నీ భూమిలో నుండి సారాన్ని గ్రహించగలిగే వేర్ల వల్లే సంభవమవుతాయి.
జైనులాబిదీన్కు తన సంతానం సంగతి తెలుసు. వాళ్లు సుఖలాలసలో పడి ప్రజలను పట్టించుకోరని గ్రహించాడు. వారి సుఖాలకు తగిన ధనం ఖజానాలో ఉంటే, ధనం కోసం ప్రజలను పీడించరని భ్రమించాడు. అందుకని తాను బొక్కసాన్ని ధనంతో నింపానని చెప్తున్నాడు.
జైనులాబిదీన్కు సుల్తాన్ల మనస్తత్వం, ధనం కోసం ప్రజలను పీడించటం బాగా తెలుసునని అర్థమవుతుంది. జైనులాబిదీన్ భయం నిజం అధారంగా కలిగింది. సుల్తానులు ధనంకోసం ప్రజలను పీడించటం అంటే, ఇస్లామేతరులను పీడించటమే అనీ తెలుసు.
మహమ్మద్ ఘజని ప్రధానంగా భారతదేశంపై దండయాత్రలు ధనం దొంగిలించటం కోసమే చేశాడు. గుళ్లను కొల్లగొట్టినా, నగరాలను ధ్వంసం చేసినా, మనుషులను చెరబట్టినా ఆయన ప్రధానోద్దేశం ధనమే.
అల్లా ఉద్-దీన్-ఖిల్జీ పన్నులు ద్వారా ధన సేకరణ చేశాడు. యాభై శాతం పైగా పన్నులు విధించాడు. చివరికి పండే పంటలపై పన్ను, ‘మేత’పై పన్ను విధించాడు. పన్నుల ప్రధానోద్దేశం పైకి ఖజానాని నింపటంగా కనిపించినా, అసలు ఉద్దేశం పన్నుల భారంతో హిందువులను పేదలుగా మార్చటం, తద్వారా మతం మార్చటం. ఇదంతా జైనులాబిదీన్కు తెలుసు.
సుల్తానులకు ఆదాయం కావాలంటే ప్రధానంగా వారి దృష్టి కాఫిర్లుగా పరిగణనకు గురయ్యే ఇస్లామేతరుల పైనే పడుతుందనీ తెలుసు. ‘ఖుర్ ఆన్’ ప్రకారం ఇస్లామేతరులపై ‘జిజియా’ పన్ను విధించాలి. జిజియా పన్ను అన్నది ఇస్లామేతరులు, ఇస్లాం ఆధిక్యాన్ని అంగీకరించటానికి చిహ్నం. తమ బానిసత్వానికి అంగీకారం. జిజియా పన్ను కట్టినవాడు రక్షణ పొందుతాడు. వాడు తన ధర్మం పాటించుకోవచ్చు. ఇప్పుడు ప్రచారంకి వచ్చిన ‘protection money’ లాంటిదన్న మాట, జిజియా పన్ను, ఈ పన్ను ‘ఇంత’ మాత్రమే ఉండాలన్న నియమం లేదు.
దాంతో సుల్తాను ఇష్టానుసారం, అధికారుల ఇష్టానుసారం జిజియా పన్నను విధించవచ్చు. ఇది కేవలం పన్ను ద్వారా ధనాన్ని సేకరించటం మాత్రమే కాదు, ఇస్లామేతరుల వెన్ను విరిచి, వారు ఇస్లాం స్వీకరించేట్టు చేయటానికే ఉపయోగడేది. జిజియా, ఖరజ్ (వ్యవసాయ పన్ను) లు సంపాదనకు సుల్తానుల చేతిలో ఆయిధాలు. ఈ పన్నులు ఇస్లాం స్వీకరించిన వారికి ఉండవు. స్వచ్ఛందంగా సైన్యంలో చేరిన ఇస్లామేతరులు కూడా పన్ను భారం నుంచి తప్పించుకోవచ్చు. ఇప్పుడు చరిత్రలో ఇస్లాం సైన్యంలో ఉన్న హిందువులు కనిపిస్తారు కానీ వారు ఎందుకని ఇస్లాం సైన్యంలో చేరారో కనిపించదు. ఇస్లాం ‘పరమత సహనానికి’ ఉదాహరణగా చూపే ఈ ఇస్లామేతర సైనికులు సైన్యంలో చేరటం వెనుక ‘పన్ను’ భారం కనబడదు.
ఇదంతా జైనులాబిదీన్కు తెలుసు. అందుకని ఖజానా నిండుగా ఉంచాడు. డబ్బు కోసం పన్ను భారం ప్రజలపై (ఇస్లామేతరులు) పడకూడదన్నది అతని భావన. కానీ ‘పన్నుల’ వెనుక ధనం సంపాదన మాత్రమే ధ్యేయం కాదనీ, తమ ఆధిక్యతను నిరూపించటం, ఎదుటి వాడు పరాజితుడని గుర్తు చేస్తూ, చెప్పుచేతుల్లో, భయభక్తులలో ఉంచుకోవటం ప్రధాన కారణమని తెలిసినా, తన సంతృప్తి కోసం కోశాగారాన్ని నిండుగా ఉంచాడు జైనలాబిదీన్.
సుదీర్ఘదర్శినో వాక్య శృత్వేతి పృథివీపతేః।
ఆసంస్తన్నోధ్యకర్తారస్తదగ్రే తే నిరుత్తరాః॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 127)
ఎంతో దూరం ఆలోచిస్తూ, భవిష్యత్తును దర్శిస్తున్న రాజు సమాదానం విని ప్రశ్నలు అడిగిన వారు నిరుత్తరులతయ్యారు. నోటి మాట రాక మౌనంగా ఉండిపోయారు.
రాజవేశ్మని పయోనిధౌ చ యా
వాహినీభృతి పదార్థపూర్ణతా।
జీవనాప్తజనయాచకాచితా
సైవ తస్య సుపమా సమాహితా॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 128)
సైనికులతో, యాచకులతో రాజాస్థానం నదులు కలిసే మహా సముద్రంలా అనిపించింది. ప్రజలు అక్కడికి వచ్చి తమకు కావాల్సిన వాటిని అభ్యర్ధించే వారు, పొందేవారు.
యద్యదుక్తం నరేంద్రేణ స్మృత్వా తత్తత్ ఫలేక్షణాత్।
న కః శంసతి శోకార్తస్తదీయాం దీర్ఘదర్మితామ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 129)
తరువాత రాజు చెప్పినదంతా నిజమని గ్రహించిన వారు, రాజు అనుభవానికి, దూరదృష్టికి ఆశ్చర్యపోయారు. ప్రశంసించారు.
సచివాః సేవకాః పుత్రమిత్ర సంబంధి బాంధవాః।
దుఃఖాపనోదం కుర్వాణాః కేపి నాసన్ మహీభుజే॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 130)
మంత్రులు, సేవకులు, కుమారులు, స్నేహితులు, బంధువులు, ఇతరులలో రాజు దుఃఖాన్ని తగ్గించి ధైర్యం చెప్పేవారు ఎవ్వరూ లేరు.
రాజా గర్మగృహాంతస్థః శృణ్వన్ పుత్రస్థితి మియః।
కృతకప్రేమవైరాట్యాం న బహిర్నిరయాద్భియా॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 131)
తన పుత్రుల కృత్రిమ ప్రేమ గురించి, లేని స్నేహం ప్రదర్శన గురించి తెలుసుకున్న రాజు గర్భగృహంలోనే ఉంటున్నాడు. భయం వల్ల బయటకు రావటం లేదు.
సంసారదుఃఖాంత్యర్థం మత్తో వ్యాఖ్యానవేదినః।
అమృణోద్ గణరాత్రం స శ్రీ మోక్షోపాయ సంహితామ్॥
(శ్రీవర రాజతరంగిణి, సప్తమ సర్గ, 132)
సంసార దుఃఖం నుండి శాంతి సాధించేందుకు రాజుకు నేను (శ్రీవరుడు) రోజు రాత్రిళ్లు మోక్షోపాయ సంహితను వినిపించాను.
‘యోగ వాశిష్టం’ మరో పేరు మోక్షోపాయ సంహిత. పుత్రుల నడుమ రాజ్యం కోసం కలహం, రాజు ముందు వారు కృత్రిమ స్నేహం నటించటం వంటి విషయాలు జైనులాబిదీన్ను బాధిస్తున్నాయి. తన తరువాత రాజ్యం కోసం, అధికారం కోసం జరిగే పోరు వల్ల అల్లకల్లోల మవుతుందని, ప్రజలు అనేక కష్టాలు అనుభవించాల్సి ఉంటుందన్న ఆలోచనలు జైనులాబిదీన్కు అశాంతి కలిగిస్తున్నాయి. అతని అశాంతిని తొలగించి శాంతిని కలిగించి ఆలోచనలను మోక్ష మార్గం వైపు మళ్లించేందుకు శ్రీవరుడు అతడికి యోగ వాశిష్టం వినిపించాడు. సాధువులు, సన్యాసులు కాని మామూలు మనుషులు మనశ్శాంతి సాధించి, మోక్షమార్గంలో ప్రయాణించేందుకు ఉపయోగ పడే గ్రంథం మోక్షసంహిత అనే యోగ వాశిష్టం.
భయాన్ని ఆందోళనను అదుపులోకి తెచ్చుకుని శాంతిని అనుభవించేందుకు సుల్తాన్ మోక్షసంహిత వినటం అతని పరిణతికి, ఇతరుల పవిత్ర గ్రంథాలను కూడా గౌవించే విశాల హృదయానికి చిహ్నం. ఆలోచిస్తే, సంకుచిత భావాలకు మతపరమైన హింసకు పేరు పొందిన మధ్యయుగపు అంధకారంలో ధగ ధగా వెలిగే విశాల భావాల దీపం లాంటి వాడు జైనులాబిదీన్. ఆధునిక వైజ్ఞానిక వృద్ధి యుగంలో, విద్య సర్వత్ర విరాజిల్లుతున్న విశాల భావాల యుగంలో, సంకుచితత్వం నలుమూలలా రాజ్యం ఏలుతున్నది. విశాల భావం కూడా రంగుటద్దాల దృష్టిలో వివక్షతగా ప్రచారమవుతూంది. ద్వేషం వెదజల్లటమే అభ్యుదయంగా పరిగణనకు గురవుతున్నది. చుట్టూ విజ్ఞాన వెలుగు విస్తరించి ఉన్నా హృదయాలలో చిక్కటి చీకటి గూడుకట్టి ఉంది. ఈ ఆధునిక కాలంలో జైనులాబిదీన్ వంటి వాడిని కూడా అపార్థం చేసుకుని, కాఫిర్ల గ్రంథాలు వింటున్నాడని అతనికి వ్యతిరేకంగా ఫత్వాలు జారీ చేసేవారు. ఒక వైపు, ఇదంతా నాటకం అనీ, అందరినీ మతం మార్చే ‘జిహాద్’లో ఒక భాగం అని మరో వైపు దూషించేవారు సర్వత్ర కనిపిస్తారు. భౌతిక విషయాలలో ఆశ్చర్యం కలిగించే అభివృద్ధి సాధిస్తున్నా, మానసికంగా అంధయుగ సుదీర్ఘ అంధకారంలో సమాజం విహరిస్తున్నదనిపిస్తుంది, ఆనాటి కశ్మీరును ఈనాటి ప్రపంచంతో పోలిస్తే.
(ఇంకా ఉంది)
